ఒక్కో పరిచయమంతే
అసంకల్పితంగా ఏర్పడుతుంది
అనూహ్యంగా పెనవేసుకుంటుంది
అంతరంగంలో ఆశలు రేపుతుంది
సంపెగ తావులు పరచుతుంది
ఆ సురభుల రెక్కలపై తేలిపోనిస్తుంది
ఆ వెన్నెలవాడ నీదేనని భ్రమింపచేస్తుంది
స్వంతం అనుకునే లోపలే
సుదూర తీరాలకు తరలిపోతుంది!
కనుమరుగైపోతోంది,శాశ్వతంగా!
అది దక్కదు,
ఉన్నదీ జారిపోతుంది
బ్రతుకే శేషప్రశ్నయై
ఉత్తర మాశించలేని
నిస్తబ్ధ నీరవమై మిగిలిపోతుంది!
ఎవరన్నారు నదులన్నిటికీ
సాగర సంగమమని?!
కొన్ని సరిత్తులు
అజ్ఞాత నిరాశా వాహినులే
ఆశలు మధ్యనే ఇగిరిపోయిన
శుష్కాంబుధులే
ఫలం నోచని సాధనలే
నోటి కొదగని ఫలాలే
గమ్యం చేరని పయనాలే
నిరుద్ధ ప్రస్తారాలే
అర్ధాంతరంగా ముగిసే రాగాలే!