నాకు పిచ్చెక్కినప్పుడే
భయాందోళనలు
నానుంచి దూరంగా పారిపోతాయి.
ఆ సమయంలో
యుద్ధానికి సన్నద్ధుడైన సైనికునిలా
విజయమో వీరస్వర్గమో
అర్ధంబర్ధ సదవకాశం గుర్తుకొస్తుంది.
జనం మీద విరుచుకుపడే
పిచ్చి కుక్కలా
సమాజం నన్ను వెంటాడుతుంది.
గొంతుకు తాడు బిగించి,
కాలి కింది పలక పాతాళానికి తోసి,
ఉరితీయడానికి సిద్ధమైన
తలారి ఎదురు చూపులు.
అజ్ఞాపించే నియంత ప్రచండకోపం
నాకు జ్ఞాపకమే లేవు.
ఇప్పుడిప్పుడు మాటలు నేర్చే పసివాని ముద్దు మాటల్లా
బహుసంఖ్యాకులకు అర్థం కాని
నాకు మాత్రమే తెలిసే నిత్య సత్యాలు.
నాకు అసలు జ్ఞాపకమే లేవు.
అలా పిచ్చి తలకెక్కినప్పుడు
నేను గీచే గీతలే
నా కవిత.
కడుపులో చల్ల కదలకుండా
గిరిదుర్గంలో కాలం వెళ్ళబుచ్చే
మిత్రులారా!
ఈ లోకంలో పిచ్చిమనిషి
కావడం కంటే
అందమైన సంగతి
మరొకటి ఉందంటారా?