(సరితా తివారీ ప్రసిద్ధ నేపాలీ కవయిత్రి, వకీలు, సమాజ సేవకురాలు, పాత్రికేయురాలు. ఈమె 1979 ఏప్రిలు 15వ తేదీన నేపాల్లోని పొఖారాలో జన్మించారు. నేపాలీ సాహిత్యంలో ఎమ్.ఏ. పట్టా పొందారు. ఈమె రచించిన మూడు నేపాలీ రచనలు అచ్చయ్యాయి. బుద్ధ రాలవహరు (2000) అస్తిత్వా కో ఘోషణాపత్ర (2010) ప్రశ్నహరు కో కార్ఖానె (2015). చివరి పుస్తకం ‘సవాలోం కా కార్ఖానా’ (ప్రశ్నల కర్మాగారం) అనే పేరుతో హిందీలోకి అనూదితమై ప్రశంసలను పొందింది. సరితా తివారీ ప్రఖ్యాత నేపాలీ దినపత్రిక ‘కాంతిపుర’లో ‘సమావేశ’ అనే శీర్షికను నిర్వహిస్తూ ఉంటారు. ఈమె పాఠకజగత్తు విశాలమైనది. ప్రసిద్ధ కన్నడ పాత్రికేయుడు ఆరిఫ్ రౙా రచయిత్రితో ముఖాముఖి సంభాషించారు. పాఠకాదరణ పొందిన కన్నడ మాసపత్రిక ‘మయూర’ డిసెంబరు 2024 సంచికలో అచ్చయిన ఈ ముఖాముఖి అనువాదంతోబాటు ఆవిడ వ్రాసిన ఒక కవితకు అనువాదాన్ని కూడా ఈ సంచికలో ప్రచురిస్తున్నాము.)
మీ కుటుంబ నేపథ్యం, చిన్నప్పటి జ్ఞాపకాలు, చదువుసంధ్యలు, అప్పటి కాలపరిస్థితుల గురించి కాస్త చెప్తారా?
నేను నేపాల్లోని పొఖారా అనే అందమైన పల్లెలో పుట్టాను. కాని నా బాల్యం మాత్రం అందచందాల ప్రశాంతవాతావరణంలో సాగలేదు. ఇంటి బరువుబాధ్యతల్ని ఏమాత్రం పట్టించుకోకుండా జులాయిగా తిరిగే మా నాన్న, అకాలమృత్యువు పాలయ్యారు. మా తల్లి మా ముగ్గురు పిల్లల్ని కష్టాల కడగండ్ల మధ్య పెంచింది. మా అమ్మకు పుట్టింటి వారిచ్చిన కాసింత పొలం తప్పితే మరెలాంటి జీవనాధారం లేకుండా వుండేది. దాన్ని కాస్తా అమ్మి నవాల్ పరాశీకి వచ్చి స్థిరపడింది. మా అమ్మ చాలా ధైర్యవంతురాలు. దృఢమైన ఆత్మవిశ్వాసం, దూరదృష్టి కలిగిన మనిషి. పైగా కష్టించి పనిచేసే రకం. మా ముగ్గురిని బాగా చదివించింది. జీవనసమరంలో మేం ఈ మాత్రం నెగ్గుకురాగలిగామంటే కారణం మా తల్లిగారే.
మీకు కవితారచన పట్ల ఆసక్తి ఎలా కలిగింది? మీకు స్ఫూర్తి కలిగించిన పరిస్థితులు ఏవి?
నేను పసిపాపగా వున్నప్పుడు నన్ను నిద్రపుచ్చడానికి మా అమ్మమ్మ జోలపాటలు పాడేది. ఆమె అప్పుడప్పుడు దేవుళ్ళను స్తుతించే పాటలు కూడా పాడుతూ వుండేది. వాటిని వింటూ నా పసితనం గడిచింది. జానపదగేయాల్ని ఎంతో శ్రావ్యంగా పాడేది. పెళ్ళిళ్ళ సందర్భాల్లో పెళ్ళికొడుకు ఇంట్లో నేపాలీ ముత్తైదువులు పాడే రట్ళోలీ పాటల్ని నాట్యం చేస్తూ ఎంతో మధురంగా గానం చేసేది. వరి ససి నాటేటప్పుడు, జొన్నకంకులు కోసేటప్పుడు ఆమె పాడే పాటల్లోని లయ, ప్రాస, తియ్యందనాలు ఇప్పుడు కూడా నా చెవుల్లో రింగుమంటున్నాయి. మా ఇద్దరక్కలూ తమ నోటు పుస్తకాల్లో రాసుకొన్న జానపద గేయాలను, కవితలను నాకు పదేపదే చదివి వినిపించేవాళ్ళు. ఆ పాటల్లోని, కవితల్లోని స్త్రీల జీవిత చిత్రాల్ని, వాళ్ళ జీవితాల్లో వాటిల్లిన సంఘటనల్ని రాగయుక్తంగా పాడి వినిపించేవాళ్ళు. అవి నా మనస్సుపై చెరగని ముద్రవేశాయి. అంచేతనే కాబోలు నాకు జానపద గేయాలపట్ల, కవిత్వం పట్ల ఎనలేని ఆసక్తి కలిగింది. మా నాన్న కొన్ని హిందీ సాహిత్య గ్రంథాలు, మాస, వారపత్రికలు భద్రపరిచి వుంచటం నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. ఖాట్మండూలో డిగ్రీ చదువులు సాగిస్తున్న మా అన్న పుస్తకాలని, ముఖ్యంగా కమ్యూనిస్టు గ్రంథాల్ని కొని తెచ్చి, తానూ చదివి నాకందించే వారు. ఈ నేపథ్యమే నా రచనావ్యాసంగానికి పునాది వేసింది.
మీరు ‘కాంతిపుర’ పత్రికలో సమకాలీన విషయాల గురించి నియమితంగా ‘కాలమ్’ రాస్తున్నారు. మీరు వృత్తిరీత్యా వకీలు. మీ కార్యరంగం గురించీ, కవితాప్రవృత్తి గురించీ కొంచెం వివరంగా చెప్తారా?
నేను సుమారు పదిహేనేళ్ళ పాటు ఓ కాలేజిలో పాఠాలు చెప్పాను. ఓ వైపు విద్యార్థులకు బోధిస్తూ, మరోవైపు ‘కాంతిపుర’లో, మరికొన్ని పత్రికల్లో వ్యాసాలు రాసేదాన్ని. ‘కాంతిపుర’ వార్తాపత్రికలో ‘సమావేశ’ అనే శీర్షికను నిష్ఠతో నిర్వహిస్తూ వుండే దాన్ని. ఈ కాలంలో నేను సమకాలీన రాజకీయ హక్కుల విషయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ రచనలు చేసేదాన్ని. దేశంలో మహిళలకు జరుగుతున్న అన్యాయం, వారి యెడల జరిగే హింసాకార్యాల గురించి లోతుగా పరిశీలించి, వాడియైన వేడివేడి వ్యాసాలు రాసేదాన్ని. నేపాల్ రాజ్యాంగం, న్యాయవ్యవస్థ స్త్రీల పరంగా వుందనీ, ప్రభుత్వం మహిళలపట్ల స్నేహపూర్వకంగా ప్రవరిస్తున్నదనీ ప్రచారం సాగుతోంది. నిజం చెప్పాలంటే స్త్రీలకు తండ్రి ఆస్తిలో భాగముండదు. పౌరహక్కుల్లో కూడ పురుషులతో సమానమైన స్వామ్యం వుండేది కాదు. స్త్రీలపై జరిగే అత్యాచారాల విషయాల్లో కూడా, న్యాయవ్యవస్థ వ్యవహారించే తీరులో దోషాలుండేవి. వివాహమైన తర్వాత స్త్రీ పురుషుల ఆస్తిహక్కుల్లో కూడా సమానత్వం కనపడేది కాదు. మహిళారక్షణ, హక్కులపట్ల మేం కోర్టులకెక్కి పోరాడాం. స్త్రీలపట్ల సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాల గురించి వీధి నాటకాలు ప్రదర్శించాం. పత్రికల్లో స్త్రీవాద కవితలు వెలువరించాం కూడా. ప్రతిఘటనలు చేయడం తప్ప మాకు మరోదారి కనపడలేదు. ఓ మాటలో చెప్తే కవిత్వం నా ప్రాణసఖి. కావ్యయాత్రలో అవిశ్రాంతంగా ముందుకు సాగడమే నా లక్ష్యం.
మీరు కవితారచనను గంభీరంగా తీసుకొని ముందడుగు వేస్తున్నారు. సమకాలీన నేపాలీ కవిత్వపు పోకడలు ఎలాగున్నాయి? ప్రస్తుతం నేపాలీ కవిత్వం ఎటు పోతూంది? విమర్శకులు ఈ సమకాలీన నేపాలీ కవిత్వానికి ఏమైనా పేరు పెట్టారా? దీనికైనా నిర్దిష్టమైన పేరుందంటారా?
నేపాలీ కావ్యచరిత్రలో ఆధునికత, సుమారు 1950లో ప్రవేశించిందని చెప్పొచ్చు. ఆధునిక నేపాలీ కవిత్వంపై నవీన రష్యా, ఇంగ్లీషు, ఫ్రెంచి, బెంగాలీ, హిందీ కవిత్వాల ప్రభావం కనపడుతుంది. ‘ఆధునికోత్తర సిద్ధాంత’ దృక్పథాల ప్రభావం ఆధునిక నేపాలీ కవిత్వంపై పడటంతోపాటు ప్రాంతీయత, అస్మిత రక్షణా ప్రయత్నాలు కూడా, సమకాలీన నేపాలీ కవులు చేశారు. ఆధునిక నేపాలీ కవులు, కవయిత్రులు రాజకీయ పోరాటాలు, జాతీయత చర్చ, సామాజిక స్పృహ, సమానత్వం, సౌందర్యానుభూతి మొదలైన అంశాలతో కూడిన కవిత్వసృష్టికి సంబంధించిన విషయాల చిత్రణపట్ల తమ దృష్టిని కేంద్రీకరించారు. విభిన్నదృక్పథాలు కలిగి, వివిధ సమూహాలుగా ఏర్పడిన కవులు, కవయిత్రులు ఉత్సాహంతో అక్షరరూపంలోనే కాక, ఉద్యమరూపంలో కూడా ఏర్పడి క్రియాత్మకంగా సమకాలీన నేపాలీ కవిత్వానికి నవీనతను సంతరించిపెట్టారు.
కవితల్లో పెల్లుబికే సామాజిక స్పృహ, సౌందర్యానుభూతి, శిల్పం వగైరా లక్షణాలు విశ్వసాహిత్య ప్రపంచంలోని పోకడల పరిణామంగా ఆధునిక నేపాలీ కవిత్వంలో చోటు చేసుకొన్నాయని విమర్శకులు అన్నా, నేపాల్ దేశపు సామాజిక, రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ పరివర్తనలు, లక్షణాలు రూపుదాల్చాయన్న సంగతి మాత్రం యథార్థమే. నేపాలీ అస్మిత, ప్రాంతీయతలు ఇక్కడి ఆధునిక కవిత్వ వికాసానికి దోహదం చేస్తున్నాయి. సమకాలీన నేపాలీ కవిత్వం ప్రభుత్వంలోని లోపాలను, దోషాలను ఎత్తిచూపిస్తూ, సామాజిక అసమానతల నిర్మూలనం కోసం, సామాజిక సమానతా స్థాపన కోసం పోరాటం సాగిస్తున్నదని ఢంకా బజాయించి చెప్పొచ్చు. మూగవోయిన ప్రజల గొంతుకల్ని విప్పేలా ప్రజల్లో పత్రికల ద్వారా, ప్రతిఘటనల ద్వారా చైతన్యం కలిగించడమే నేపాలీ సమకాలీన ధ్యేయం. నేపాలీ ప్రజల జీవితాలు సుఖశాంతులతో తులతూగుతాయన్న ఆశావాదంతో, ఆత్మవిశ్వాసంతో కవులు, కవయిత్రులు ముందడుగు వేస్తున్నారు.
భారతదేశంలోలాగానే నేపాల్లో కూడా బహుసంఖ్యాక జనులు హిందూ మతస్థులు. అక్కడి సంఘంలో కులవ్యవస్థ ఎలాగుంది? అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొన్న ప్యూడల్ వ్యవస్థ ఓ తట్టు, సమాజంలో అట్టడుగున వున్న ఆదివాసీ, దళిత వర్గాలు ఇంకో తట్టు వుంటూ ఎలాంటి ప్రతిక్రియల్ని, ప్రతిస్పందనల్ని వెల్లడిస్తున్నాయి?
మీ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలంటే నాకు సిగ్గేస్తున్నది. భారతదేశంలో లాగానే ఇక్కడ కూడా కులవ్యవస్థ సమాజాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నది. ఈ 21వ శతాబ్దంలో కూడా నిమ్నవర్గాల ప్రజలు హింసలకు, హత్యలకు బలవుతున్నారు. అత్యాచారాలకు గురవుతున్న స్త్రీలకు న్యాయం దొరకటం లేదు. కోవిడ్ తీవ్రంగా వ్యాపిస్తున్న కాలంలో రుకుమ్ జిల్లాకు చెందిన ఓ దళిత యువకుడు, అగ్రవర్ణానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నిస్తే అతడిని, అతని ఐదుమంది స్నేహితులను ఘోరంగా చంపి, ఆ ఆరు శవాలనూ నదిలోకి విసిరేశారు.
నేపాల్ సమాజం కులాధారితమైన చట్రంలో ఇమిడి ఉన్నది. భారతదేశ న్యాయశాస్త్రంవల్ల బాగా ప్రభావితమయింది. 1853 నేపాల్ ప్రధానమంత్రి జంగ్ బహాదూర్ రాణా కులవ్యవస్థను ముల్కిఐన్ అనే పౌర సంహితకు చేర్చటం ద్వారా ఆదివాసీ, గిరిజన జాతి ప్రజలను సాల్వబుల్, నాన్ సాల్వబుల్ అనే రెండు వర్గాల కింద విభజించారు.
ప్రభుత్వానికి కానీ, ప్రజలకుకానీ విరుద్ధంగా పోరాడి ధన, మాన, ప్రాణాలకు హాని కలిగించిన ఆదీవాసీ, గిరిజన నేరస్థులకు ఈ చట్టం క్రింద మరణదండన విధించబడుతుందని ఘోషించబడింది. చట్టాన్ని ఉల్లంఘించి నేరాలు చేసిన బ్రాహ్మణ, క్షత్రియ నేరస్థుల్ని దళితుల స్థాయికి దించే విధంగా న్యాయ సంహిత రూపొందించబడింది. 1951 వరకు ఈ క్రూరశిక్ష అమలులో వుంది. కులాధారితమైన అస్పృశ్యతను నిషేధించిన 1963, 1990 నాటి చట్టాలు అమలులో వున్నా, ఈ అస్పృశ్యతా విధానం నిర్మూలం కాలేదు. 2017 వ సంవత్సరపు చట్టం అస్పృశ్యతను పాటించిన వారికి తీవ్రమైన శిక్ష వేయబడుతుందని చాటింది.
కేవలం చట్టాల వల్ల కులవ్యవస్థలోని దోషాలు తొలగి పోతాయంటారా? ప్రజల్లో మార్పు వస్తేనే కాని ఈ అస్పృశ్యత వగైరా సమస్యలు తొలగిపోవు కదా?
నేపాల్ దేశం రెండు అతివాదాల మధ్య చిక్కి అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతూంది. ఒకవైపు రోజురోజుకీ పెచ్చుపెరిగి పోతున్న చైనా రాజకీయ పంథాల విధానం, ఇంకోవైపు పెరిగిపోతున్న హిందూ రాష్ట్ర సంప్రదాయాల స్థాపన, ఈ రెంటి మధ్యా చిక్కి నేపాల్ పాలన అల్లకల్లోలంగా, అస్తవ్యస్తంగా వుంటూంది.
కులతత్త్వం, అస్పృశ్యతాచరణ మీ దేశంలో ఎలాగుంది?
కులతత్త్వం కాని, అంటరాని వాళ్ళపట్ల ద్వేషం, హింస వగైరాలుగానీ సాధారణంగా బయటపడవు. కానీ దేవాలయాల్లోకి అగ్రవర్ణ హిందువుల పండుగలు పబ్బాలు, పూజా పునస్కారాలప్పుడు దళితులు ప్రవేశించినా, పాల్గొన్నా సమస్యలు రేకెత్తుతాయి. ఎన్నికల్లో నెగ్గి, రాష్ట్రపాలనలో భాగస్వామ్యం వహిస్తున్న ఓ ప్రజాసేవకుని ఇంట్లో జరుగుతున్న ఓ ‘ఉపనయనం’ లో భోజనానికి కూర్చున్న ఓ దళిత వ్యక్తిని చూసి అగ్రవర్ణీయులు పెద్ద గద్దలం చేశారు. తర్వాత ఆ సంఘటన జరిగిన పూజా కార్యక్రమం నిర్వహించిన ఆసామిపై కేసు విధించారు. అతను నేరస్థుడిగా నిరూపించబడి జైలు పాలయ్యాడు కూడా. నా సొంత ఊరైన చిత్కాన్ జిల్లాలోని భరత్ పుర్ గ్రామంలో దసరా సందర్భంగా గుళ్ళో దుర్గాపూజ జరుగుతూ వుంది. తాను కూడా దుర్గాదేవి పూజలో పాల్గొంటానని ఓ దళితుడు ప్రార్థిస్తే, ఇద్దరు దళితేతరులు అతన్ని దారుణంగా చంపి వేశారు. ఈ దుర్ఘటన సంగతి కూడా కోర్టు ప్రాంగణంలో ప్రవేశించిందనుకోండి. ఇలాంటి హింసాత్మక ఘటనలు సాధారణంగా సంభవించవనుకోండి.
నేపాల్ సమాజంలో పిల్లల, మహిళల స్థానమానాలు ఎలాగున్నాయి? ఒక పాత్రికేయురాలిగా, న్యాయవాదిగా మీ అభిప్రాయా లేమిటి? అనుభవాలు ఏమిటి?
నేపాల్ న్యాయవ్యవస్థ లంచగొండితనానికి పెట్టని కోట అని ఇటీవల నాకు జ్ఞానోదయమైంది. పేదవారికీ, రాజకీయ నాయకుల వత్తాసు లేని వారికీ న్యాయస్థానంలో న్యాయం లభించటం చాలా కష్టమని నేనొక న్యాయవాదిగా అర్థం చేసుకోగలిగాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నిరుపేదల, నిస్సహాయుల కేసుల్ని ఛార్జిషీట్ కూడా చేయరు. ఇక పోలీసులు పేదవాళ్ళను దరిదాపులకే రానివ్వరు. పేదల కేసుల్ని న్యాయవాదులెవరైనా కోర్టులో దాఖలు చెస్తే వారు ఎన్నో బెదిరింపులకు, హింసాత్మక చర్యలకు గురికాకతప్పదు. నేను కొన్ని కేసుల్ని తీసుకొని, తీవ్రంగా వాదించి, నిరపరాధులైన నా కక్షిదారుల్ని గెలిపించాను. కాని గెలుపొందినా, వాళ్ళకు విరోధుల వల్ల మానసిక వేదనలు, బెదిరింపులు తప్పలేదు.
నేపాల్ న్యాయవ్యవస్థలో అభ్యుదయవాదులైన, నీతిమంతులైన న్యాయమూర్తులు, న్యాయవాదులు లేకపోలేదు. కాని వారి సంఖ్య చాలా తక్కువ. పేదసాదల కష్టనష్టాల్ని కొన్ని సమాచార మాధ్యమాలు వెల్లడించటం, వాటిని ప్రభుత్వ దృష్టికి అందచేయడం జరుగుతూంది. ఇది ఆశాదాయకమైన సంగతి. కొన్ని టీవీ ఛానళ్ళు ఈ దరిద్రనారాయణుల ఈతి బాధల్ని కళ్ళకు కట్టినట్లు చూపించి, కొన్ని సందర్భాల్లో న్యాయాలయాల దృష్టి మరలించడం కూడా కద్దు.
ఇది చివరిది. మీరు ఎప్పుడైనా సహనం కోల్పోయి కోపం తెచ్చుకొంటారా? అలాంటి సంఘటనలు ఏవైనా వుంటే చెప్తారా?
కవితలు రాసే నాకు కోపం రావడం సహజమే. కాని ఆ కోపం నా హృదయాంతరాళంలో ఓ మూల నక్కివుంటుంది. అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు. నా మానసికస్థితి కవితల రూపంలో, వ్యాసాలరూపంలో, న్యాయాలయంలో ఆవేశపూరితంగా, బయటివాళ్ళకు తెలుస్తుంది. అంగబలమూ, అర్థబలమూ కొండంత సంపాదించుకొన్న పెద్దమనుషులు మధ్యతరగతి, నిమ్నతరగతి వ్యక్తుల్ని నానా కష్టాలపాలు చేసినప్పుడు పీడితుల, తాడితుల ఆర్తనాదాలు నా చెవి సోకినప్పుడు, ఆ దరిద్రనారాయణులు న్యాయం కోసం నా వద్దకు వచ్చినప్పుడు నాకోపం నసాళానికి అంటుతుంది. నేను బాధితుల కేసుల్ని వాదిస్తున్నప్పుడు, వాళ్ళ బాధల గాథల్ని ‘కాంతిపుర’ పత్రికలో నేను నిర్వహిస్తున్న ‘సమావేశ’ కాలమ్ లో వ్యక్తం చేసినప్పుడు, ఎదటి పక్షం న్యాయవాదులు, పత్రికల్లో మేధావులుగా చలామణీ అవుతున్న పెద్దమనుషుల రాతలూ కోతలూ నాకు విపరీతమైన కోపం తెప్పిస్తాయి. నేను న్యాయస్థానంలో వాదిస్తున్నప్పుడు కానీ కవితలు, వ్యాసాలు పత్రికలకు రాసేటప్పుడు కానీ, వేదికల మీద ఉపన్యసించేటప్పుడు కానీ నన్ను నేను తమాయించుకొని, సంబాళించుకొని ముందుకు సాగుతాను. వామపంథీయులు, దక్షిణపంథీయులు స్త్రీలపట్ల మాటల్లో, చేతల్లో దాదాగిరీనే చూపుతున్నారని నా అభిప్రాయం.
