ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం!

వేయేండ్లుగా వెలసి విలసిల్లుతున్న ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం సులభమేమీ కాదు. వేలకొద్దీ వెలసిన కావ్యాలలో అప్రతీతపదప్రయోగం వల్ల, అన్వయక్లేశం మూలాన, భావప్రౌఢి కారణవశాన అర్థనిర్ణయం దుష్కరమైన పద్యాలెన్నో ఉన్నాయి. ఇప్పుడా అలవాటు లేదు కాని, ఒకప్పుడైతే విద్యాగోష్ఠులలో —

కమలాకరకమలాకర
కమలాకర కమల కమల కమలాకరమై
కమలాకర కమలాకర
కమలాకరమైన కొలను గని రా సుదతుల్.

— వంటి పద్యాలనిచ్చి అర్థతాత్పర్యాలు చెప్పమనటం పరీక్షకులకూ, పరీక్ష్యులకూ ఒక కేళీవినోదంకరణగా ఉండేదట. మాడుగుల సంస్థానానికి వెళ్ళినపుడు అల్లమరాజు సుబ్రహ్మణ్యకవిగారిని ఈ పద్యానికి అర్థం చెప్పమని అడిగారట. తెనాలి రామకృష్ణకవి కందర్పకేతువిలాసములోని శబ్దచిత్రం ఇది.

ఆ సుదతుల్ – అందమైన పలువరుసతో అలరారుతున్న ఆ సుందరాంగులు; కమలా = లక్ష్మీదేవియొక్క, కరకమల = పద్మము వంటి చేయి, ఆకర = ఉనికిపట్టుగా కలిగిన, కమల = తామరపూవునకు, ఆకర = జన్మస్థానమై, కమల కమల కమలాకరమై – కమల = బెగ్గురు పక్షులకు, కమల = పరిశుద్ధజలములకు, కమల + అ = పద్మములయొక్క సమూహమునకు, ఆకరమై = నివేశనమైనది; కమలాకర – క = మన్మథునియొక్క, మ = సమ్మోహనకరమగు, లా = వశీకరణశక్తిని, కర = కూర్చునదై, కమలాకర – కమలా = పద్మినీజాతి స్త్రీలకు, క = శరీరములందు, ర = కామాగ్నిని ఉద్దీపింపజేయునదై, కమలాకరము + ఐన = సర్వసంపత్ప్రదమైన, కొలనున్ = సరోవరమును, కనిరి = నేత్రపర్వముగా వీక్షించిరి – అని అన్వయించుకోవాలి. సుబ్రహ్మణ్యకవిగారు ప్రవచించిన సంప్రదాయార్థం లభింపనందువల్ల నేను ఉన్నంతలో పద్యాన్ని మేనమామ పోలికగా అన్వయించాను.

తెనాలి రామకృష్ణ అనే చిత్రంలో కృష్ణదేవరాయల ఆస్థానానికి కొండవీటి సీమ నుంచి ఒక పండితుడు వచ్చి, ‘రాజానందనరాజరాజాత్మజులు సాటి, తలఁప నన్నయ వేమ ధరణిపతికి’పద్యానికి అర్థాన్నడగటమూ, రామకృష్ణకవి చేతిలో భంగపడటమూ రమ్యంగా చిత్రీకరింపబడిన దృశ్యం ఇటువంటి విద్వత్పరీక్షాప్రకరణం లోనిదే. పూర్వకవులు ఏకాక్షరాధారితంగానూ, ఏకసమాసనిష్ఠంగానూ చెప్పిన కఠినపద్యాలకు తరగతి గదిలో వల్లెవేసిన నిఘంటువులను బట్టి భావాన్ని గుర్తుపట్టడం ఒకప్పటి పాఠశాలలలో గురువులు విద్యార్థులకు నేర్పించేవారు.

దదదదదదదదదదదదదద దదదదదద దదద దదదదదదదదద
దదద దదదద దదద దదద దదద దదదద దదదద దదదద దదదద.

(శరణాగతులకు స్వాధీనుడవై, ఉదాసీనులైనవారియందు ఉదాసీనుడవై, పాపస్వభావులకు సంహారకర్తవై, రాక్షసాంతకుడవై, సజ్జనులను ప్రభవింపజేయువాడవై, ధర్మాధర్మానుసారకులకు ఆధారభూతుడవై, సత్స్వభావులను కాపాడి ముక్తినొసగువాడవై, సత్స్వభావులను బాధించువారికి బాధకుడవై, సజ్జనరక్షకులకు రక్షకుడవై, జగత్తుయొక్క బహిరంతరాలలో వసించు వాసుదేవుడవైన పరమపురుషా! శరణు! శరణు!)

12వ శతాబ్దంలో భగవద్రామానుజుల వారి శిష్యుడు శ్రీవత్సాంకులవారు (కూరత్తాళ్వార్) రచించిన యమకరత్నాకరం పన్నెండవ ఆశ్వాసంలోని శ్రీకృష్ణస్తుతిపరకమైన ఒక ఏకాక్షరశ్లోకం ఇది. తనను చేరదీసి, ఆదరాభిమానాలను కురిపించి, అంతులేని ఐశ్వర్యాన్ని అనుగ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మను నోరారా సన్నుతిస్తున్న బాల్యమిత్రుడు సుదాముని మనోగతం ఇది. అరవైనాలుగు లఘువుల అచలధృతి శ్లోకమంతా, ద అన్న ఒక్క అక్షరంతోనే సాగింది.

దదదదదదదదదదదదదద – దదత్ + అదదత్ + అద + దదత్ + అదదత్ + అద అని పదచ్ఛేదం. దదత్ = దాతలయందు, అదదత్ = దానస్వభావము లేనివారియందు, అద = భక్షకులైనవారియందు, దదత్ = ఆత్మసమర్పణము చేసికొను భక్తులయందు, అదదత్ = భవబంధముల పట్ల ఉదాసీనులగువారియందు, అద = ఆత్మజ్ఞానకరుడవు (లేదా) అదదత్ = లోకభక్షకులైన పాపులయందు, అద = పీడాకరుడవు అయిన లోకేశ్వరా; దదదదదద – దదత్ + అదత్ + అద అని పదచ్ఛేదం. దదత్ = ధర్మశీలురైనవారిని, అదత్ = బాధించునట్టి లోకకంటకులను, అద = సంహరించు జగద్రక్షకా; దదద – దద = త్యాగశీలురగు ధర్మమూర్తులను, ద = ప్రభవింపజేయువాడా; దదదదదదదదద – దదత్ + అదదత్ + అదత్ + అద అని పదచ్ఛేదం. దదత్ = ధార్మికులయందు, అదదత్ = కర్మాకర్మములయందు వైరాగ్యము నూనినవారియందు, అదత్ = కర్మబంధములకు లోగినవారియందు, అద = సమచిత్తము గలిగి యుగాంతవేళ సర్వమును ఉపసంహరించు పరమపురుషా; దదద – దద = ధార్మికులను, ద = చిత్తమున ధరించి యుండువాడా; దదదద – దదదత్ = ధర్మమూర్తులగు ఋషులను హింసించు రాక్షసులను, అద = నశింపజేయు శ్రీ వాసుదేవా; దదద – దదత్ = యజ్ఞములచే దేవతలకు హవ్యరూపములైన ఆహుతులను సమర్పించెడి యాజ్ఞికులకు, అద = రక్షకుడవైన పరమేశ్వరా; దదద – దదత్ = నీ భక్తులగు ఉత్తములను, అద = శోధించెడివాడా; దదద – దదత్ = లోకరక్షార్థమై కారుణికులగువారిని, అద = రక్షించు దయార్ద్రమూర్తీ; దదదద – దద = ధర్మరతులైనవారిని, ద = బాధించు దుష్టులను, ద = మట్టుపెట్టువాడా; దదదద – దదత్ = ధారకులకు, అద = ధారకులు కానివారికి, ద = కర్మఫలములను ప్రసాదించు స్వామీ; దదదద – దదత్ = లోకకంటకులకు, ద = అండగా నిలిచి కాపాడు నీచులను, ద = హరింపజేయు పరమాత్మా; దదదద – దదత్ = సర్వప్రదాతవగు, అదదత్ = కర్మఫలముల అంతమొందింపజేసి సద్భావమునొసగు, అ = శ్రీ వాసుదేవా! అని అర్థబోధం.

తెనాలి రామకృష్ణకవికి అత్యంతప్రీతిపాత్రమైన కావ్యరాజం ఈ యమకరత్నాకరం. తెలుగులోనూ ఇటువంటివనేకం ఉన్నాయి. వ్యాకరణపాండిత్యం, వ్యాఖ్యానసాహాయ్యం లేకపోతే అర్థం చేసుకోవటం సులభం కాదు. ఇదొక తీరు ప్రౌఢి. పద్యం వినగానే, తెలుగా? సంస్కృతమా? అనిపించేది మరొక తీరు. ఇది తెనాలి రామకృష్ణకవి రచించిన దశావతారస్తుతి లోని పద్యమట:

ద్యూత్తంభద్గిరికల్పితావతరణద్యోవాహినీ సంగమో
పాత్తేందూదయ నిష్పితౄణ జలధిప్రారబ్ధ పుత్త్రోత్సవో
దాత్తత్వాత్త గజాశ్వ వన్యశన కన్యా గో మణీ దాన సం
పత్తిప్రీణితదేవ ఢుల్యధిపతిబ్రహ్మన్! స్తుమ స్త్వా మనున్.

(ఓ ప్రభూ! దేవదానవులు అమృతంకోసం మందరపర్వతాన్ని కవ్వంగా చేసికొని సముద్రాన్ని చిలికినప్పుడు నీవు లోకరక్షణార్థమై తాబేలు రూపు ధరించి ఆ పర్వతానికి ఆధారమై నిలిచావు. నీవు మూపుపైని ధరించిన మందరపర్వతం వారి మథనవేగానికి గిరగిర తిరుగుతూ ఆకాశాన్ని తాకినప్పుడు ఆకాశగంగ ఆ పర్వతం ద్వారా సముద్రంలోకి దిగివచ్చింది. ఆ గంగతోడి సంగమం వల్ల సముద్రునికి చంద్రుడనే కొడుకు పుట్టాడు. పుత్త్రోదయం మూలాన తనకు పున్నామనరకం నుంచి విముక్తి లభించి, పితౄణం తీరినదని సముద్రుడు ఆ సంతోషం పట్టలేక గజదానం, అశ్వదానం, వనదానం, అన్నదానం, కన్యాదానం, గోదానం, మణిదానం చేసి దేవతలను తృప్తిపరిచాడు. దేవా! అట్టి కూర్మావతార శ్రీమహావిష్ణువును నిన్ను స్తోత్రం చేస్తున్నాము!)

ఊహ ఎంత అందంగా ఉన్నదో, పద్యం అంత ప్రౌఢంగా ఉన్నది.

వాక్యాంతంలో అనున్ అన్న ఒక్క అనుకరణవాచకంతో పద్యం మొత్తం తెలుగైపోయింది. లేకపోతే ద్యూత్తంభత్ మొదలుకొని స్తుమ స్త్వామ్ వరకు ఉన్నదంతా సంస్కృతమే. ద్యు = ఆకాశమందు, ఉత్తంభత్ = మథనసమయమునందు ఎగురుచున్న, గిరి = మందరపర్వతముచేత, కల్పిత = ఒనగూడిన, అవతరణ = అవరోహణము గలిగిన, ద్యోవాహినీ = ఆకాశగంగయొక్క, సంగమ = సంభోగముచేత, ఉపాత్త = పొందిన, ఇందు = చంద్రుడు అను పుత్త్రునియొక్క, ఉదయ = ఆవిర్భావహేతువుచేత, నిష్పితౄణ = పితృఋణము తీరిన, జలధి = క్షీరసముద్రనామక పితచేత, ప్రారబ్ధ = ఆరంభింపబడిన, పుత్త్రోత్సవ = కుమారోత్పత్తి సంబంధమయిన ఉత్సవమందలి, ఉదాత్తత్వ = సంపదకు, ఆత్త = సమానములయిన (తగిన), గజాశ్వ వన్యశన కన్యా గో మణీ దాన – గజ = ఐరావతము, అశ్వ = ఉచ్చైశ్శ్రవము, వనీ = కల్పవృక్షారామము, అశన = అమృతము, కన్యా = దాసీసమేత లక్ష్మి, గో = కామధేనువు, మణీ = చింతామణి అనెడు, దాన = దానములయొక్క, సంపత్తి = సమృద్ధిచేత, ప్రీణిత = సంతోషపెట్టబడిన, దేవ = ఇంద్రాదిదేవతలు గలిగిన, ఢుల్యధిపతిబ్రహ్మన్ – ఢులీ = కమఠీదేవికి, అధిపతి = భర్తవైన, బ్రహ్మన్ = స్వామీ, త్వాం = నిన్ను, స్తుమః = స్తోత్రము చేయుచున్నాము. సంస్కృతంలో వేంకటాధ్వరి విశ్వగుణాదర్శానికి గొప్ప వ్యాఖ్యను రచించిన కురవి రామకవి ఈ దశావతారస్తుతికి సంస్కృతంలో చక్కటి వ్యాఖ్యను వ్రాశాడు. దానిని, దానికి తమ తెలుగు అనువాదాన్ని శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రిగారు చాటుపద్యరత్నాకరములో ప్రకటించారు.

ఇటువంటివి, కేవలం ఆరభటీ వృత్తిలో ఓజోగుణం నిండిన సంస్కృతసమాసభూయిష్ఠపద్యాలే కానక్కరలేదు, అచ్చతెలుగు సమాసాలూ సాధ్యమే కాని, అవి అంతగా అంతర్గతప్రౌఢికి ఉదాహరణీయాలు కావు.

నెలఱాతీనియ సంతనంపు మగఱా నీరాళపుం గొప్పటా
కుల నిద్దంపుఁ బసిండి నున్జవికెనిగ్గుల్ దొట్టు కట్టాణి పూ
సల మేల్ బొబ్బమెకంబు చెక్కడపుఁ గీల్ జాగా జగా గద్దియన్
జెలువెచ్చం గొలువుండె నెల్లరును జేజే యంచుఁ దన్గొల్వఁగన్.

అని గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము (1-126). మొదటి మూడు పాదాలూ ఒక్క సమాసం. అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆనందనిలయావాసుడై దివ్యదీధితులతో విరాజిల్లుతున్న స్వర్ణసింహాసనాన్ని అధిరోహించి తనను చూడవచ్చిన భక్తకోటికి దర్శనాన్ని అనుగ్రహించినప్పటి దృశ్యం.

నెలఱా తీనియ= చంద్రకాంతశిలావేదికపైని, సంతనంపు = తాపబడిన, మగఱా = వజ్రములయొక్క, నీరాళపున్ = స్వచ్ఛమైన వన్నెమీరిన, గొప్ప + టాకుల – గొప్ప = పెద్దవియైన, టాకుల = వసారాలలోని, నిద్దంపు = స్నిగ్ధమగు, పసిండి = బంగరు రంగు, నున్ = మనోహరమైన, చవికె = మండపముయొక్క, నిగ్గుల్ = కాంతులను, తొట్టు = ప్రసరించు, కట్టాణి పూసల = మిక్కిలి గుండ్రని ప్రశస్త మౌక్తికవిశేషముల, మేల్ = విలువైన, బొబ్బమెకంబు చెక్కడపు = సింహపీఠికయొక్క, కీల్ = అందముగా కీలుకొలిపిన, జాగా = విశాలమైన, జగా = గొప్ప, గద్దియన్ = ఆసనముపై, చెలువు + ఎచ్చన్ = సౌందర్యము అతిశయింపగా, ఎల్లరును = సర్వజనులును, జే! జే! అంచున్ = జయజయధ్వానములు సల్పుచు, తన్ = తనను, కొల్వఁగన్ = ఆరాధించుచుండగా, కొలువు + ఉండెన్ = సభతీర్చియుండెను అని భావార్థం. ఇందులో సమాసదీర్ఘిమను మించిన దుర్ఘటార్థమేదీ లేదు.

ఇవికాక, ద్వ్యర్థికావ్యాలను, త్ర్యర్థికావ్యాలను చదివేటప్పుడు ఒక అర్థం సుగమం గానూ, ఒక అర్థం దుర్గమం గానూ ఉండటం కూడా పాఠకులకు అనుభవంలో ఉన్నదే. పింగళి సూరన్నగారి రాఘవపాండవీయములో

అక్షుద్రప్రథమానదివ్యశరసంప్రాప్తిం బ్రకాశించు నా
కుక్షిద్వంశవతంసుఁ గన్గొని, ‘మహాగోదావరీతీరస
ద్రక్షోపాయపథంబు నేఁడు దొరికెన్, రం!’ డంచు సంరక్షణా
పేక్షం ద ద్వనభూమిదేవతలు సంప్రీతిం గడున్మూఁకలై. (3-66)

అన్న పద్యాన్ని చూడవచ్చును. సుతీక్ష్ణముని ఆశ్రమంలో ఉన్న మునిగణానికి సీతారామలక్ష్మణుల రాకవల్ల రాక్షసుల బారినుండి విముక్తి లభిస్తుందన్న ఆశ మోసులెత్తింది. మహాగోదావరీతీరసద్రక్షోపాయపథంబు నేఁడు దొరికెన్, అన్నప్పుడు – మహా గోదావరీ తీర = సువిశాలమైన గోదావరీతీరంలో ఉంటున్న, సత్ = సజ్జనులయొక్క, రక్షా = సంరక్షణకు, ఉపాయపథంబు = ఉపాయమార్గం, నేఁడు = ఇన్నాళ్ళకు, దొరికెన్ = దొరికినది అని, తద్వనభూమిదేవతలు – తత్ = ఆ, వనభూమిన్ = ఆశ్రమోద్యానవనంలోని, భూమిదేవతలు = బ్రాహ్మణులు సంతోషించారని రాఘవార్థంలో అన్వయించుకోవాలి. అందులో అన్వయక్లేశమేమీ లేదు. కఠినపదాలు లేవు. పదాలు ఒకదానితో ఒకటి పొందుపడి ఉత్తరోత్తరాన్వయం సులభంగా ఉన్నది.

అయితే, పద్యాన్ని మహాభారత కథకు అన్వయించటం మాత్రం అంత సులభం కాదు. నిఘంటువుల పరిచయం కలిగి, శబ్దార్థాల అనువృత్తిక్రమం తెలిసి, బహురూపకావ్యానుభవం వలన ఒకపాటి పాండిత్యం ఉన్నవారికి సైతం సాధ్యం కాదు. అర్జునుడు కిరాతార్జునీయ ఘట్టంలో సాక్షాత్తు పరమశివుని ప్రతిఘటించి, ఆ మహాదేవుని మెప్పించి, ఆయన అనుగ్రహం వల్ల దివ్యశరాన్ని (పాశుపతాస్త్రాన్ని) సాధించి తిరిగివచ్చినప్పుడు అతనిని చూచిన ఇంద్రాదిదేవతలు, “మహాగోదావరీతీరసద్రక్షోపాయపథంబు నేఁడు దొరికెన్” అనుకొన్నారని ఉన్న “మహత్ + ఆగః + దావ + రీతీ + రసత్ + రక్షః + అపాయపథంబు” అన్న పదచ్ఛేదమూ, ఆ పదచ్ఛేదానికి “మహా = గొప్ప, ఆగః = అపరాధాలతో, దావ = దావాగ్ని, రీతీ = వలె, రసత్ = ఘోషిస్తున్న, రక్షః = రాక్షసుల, అపాయపథంబు = వధోపాయ మార్గం, నేఁడు = ఇన్నాళ్ళకు, దొరికెన్ = దొరికినది, అని తత్ = ఆ, వనభూమిన్ = వనభూమికి విచ్చేసి అక్కడున్న, దేవతలు = ఇంద్రాదిదేవతలు సంతసించారన్న పాండవీయార్థమూ ఎంతటి పండితులకైనా స్ఫురించటం కష్టమే. వ్యాఖ్యానసాపేక్ష మైనందువల్ల కొంత దుర్ఘటార్థమే. ఇది పదాల విరుపు (సభంగశ్లేష) మూలాన ఏర్పడిన అన్వయప్రౌఢి. ఇక మూడర్థాలు, నాలుగర్థాలు, ఏడర్థాలు, ముప్ఫై అర్థాలు, నూరర్థాలు ఉన్న రచనలలోని ప్రౌఢిని ఊహించుకోవాలి.

ఇక నానార్థకృతమైన ప్రౌఢి వేరొక విధంగా ఉంటుంది. ద్వ్యర్థిఘటనానికంటె కొంత క్లిష్టతరమైన కూర్పు ఇది. మహామహోపాధ్యాయులు, కళాప్రపూర్ణులు, కవిరాజ, కవిసార్వభౌమాద్యనేక బిరుదాంచితులు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రుల వారు రచించిన ప్రౌఢగంభీరమైన మహాకావ్యం నైషధీయచరితము లోని ఒక పద్యాన్ని చూద్దాము. దమయంతి స్వయంవరానికి విచ్చేసిన రాజసమాజంలోకి ఇంద్రాగ్నియమవరుణులు అచ్చమూ కథానాయకుడు నలుని వేషంలో వచ్చి కూర్చొన్నప్పటి సన్నివేశంలో కథానాయిక దమయంతికి చెలికత్తె ఆ నిషధరాజపంచకాన్ని చూపి వర్ణించిన సందర్భంలో శాస్త్రిగారు అమోఘమైన ఈ పద్యాన్ని వ్రాశారు. సంస్కృతనైషధంలో అతిదీప్తంగా ఉన్న ఈ ఘట్టాన్ని శ్రీనాథుడు ఇటువంటి అనేకార్థరచనల పట్ల అంతగా ఆసక్తి లేనందువల్ల ఈ సందర్భంలో కథాసామాన్యములైన ఉపమలతో సంక్షిప్తంగా లాగించివేశాడు. రామరాజభూషణుడు తన హరిశ్చంద్రనళోపాఖ్యానములో ఇక్కడ నలపంచకంతోపాటు హరిశ్చంద్రుని కథనుకూడా కలుపుకొని ఆరు అర్థాలతో అనిర్వచనీయమైన సత్త్వగరిమతో వ్రాసినా, ఈ మూడింటినీ దగ్గరుంచుకొని చదివినప్పుడు గుణాగుణవిమర్శకుల చేతి త్రాసులో ముల్లు శాస్త్రిగారి పద్యానికే మొగ్గుచూపుతుంది:

బుధులం బ్రోచెడువాఁడు, వాసవుఁడు, సంపూర్ణప్రతాపప్రభా
కథితుం, డధ్వరమార్గజిష్ణుఁ, డతులాఖ్యావాహినీసేవితుం,
డధికైశ్వర్యసమంచితుండు, సమవర్త్యాఖ్యాంచితప్రఖ్యుఁ డై
ప్రథితుం డై ప్రసరిల్లు నీ ఘనుఁడు సుత్రాముండు చూతే? సతీ! (నైషధీయ. 4-50)

దీనికి కృష్ణమూర్తిశాస్త్రిగారే స్వయంగా కూర్చిన లఘువ్యాఖ్య ఇది: “ఇందు నలునకును, ఇంద్రాగ్నియమవరుణులకు చెప్పఁబడినది. బుధులం బ్రోచెడువాఁడు = విద్వాంసులను సాఁకువాఁడు నలుఁడు, దేవతలను సాఁకువాఁడు ఇంద్రుఁడు లోనగువారు; వాసవుఁడు = వసూని సంతీతి వాసవః స్వర్ణరత్నాదిధనము కలవాఁడు నలుఁడు; ‘దేవభేదేఽనలే రశ్మౌ వసూ రత్నే ధనే వసు’ అమరము. వస నివాసే, ఆచ్ఛాదనే, వసు = కిరణములు కలవాఁడు వసునామము గలవాఁ డగ్ని. రత్నములు గలవాఁడు వరుణుఁడు, వస్తీతి వసుః, ఆచ్ఛాదించువాఁడు యముఁడు, వాసవనామము గలవాఁ డింద్రుఁడు; ఇట్లు వాసవశబ్దము పై నేఁగురకు సమన్వయించును; సంపూర్ణప్రతాప ప్రభా కథితుండు, ప్రతాపము = కోశబలమువలనఁ గలిగిన తేజము, శక్తి, లోనగునవి కలవా రింద్రాదులు; ప్రతపం త్యనేన శత్రూనితి ప్రతాపః, ‘తప సంతాపే’ ప్రభవం త్యనేన శాసితుం జగతి ప్రభావః, జగత్తునేలుటకు సమర్థులు ఈ యర్థము లేవురకుం జెప్పవచ్చును; అధ్వరమార్గజిష్ణుఁడు = యజ్ఞమార్గముచేత నింద్రుఁడు, అనఁగా ఇంద్రుఁడువోలె వైదికమార్గమును నడపువాఁడు, జిష్ణుఁడు = జయశీలుఁడు నలుఁడు; అధ్వరములు చేసినవాఁడు, జిష్ణునామము కలవాఁడు ఇంద్రుఁడు; ‘అధ్వానం రాతీ త్యధ్వరః’ మార్గములను గ్రహించినవారు, మృగయం త్యనే నేతి మార్గః, మృగ అన్వేషణే; దీనిచే బ్రహ్మపదార్థము నన్వేషించినవారు, జిష్ణులు = జయశీలు రని యింద్రాదులకునుం జెప్పవచ్చును, అతులాఖ్యావాహినీసేవితుండు = పోలికలేని పేరు గల సేనలచే సేవింపఁబడువాఁడు నలుఁడు; వాహిని = నది, నదులచే సేవింపఁబడువాఁడు వరుణుఁడు, వహతి, వాహయతీతి చ వాహినీ, వహ ప్రాపణే = ప్రవహించునది, ప్రయత్నము సేయునది. వహ ధాతువుం బట్టి నానార్థము నింద్రాదులకుం జెప్పవచ్చును. అధికైశ్వర్యసమంచితుండు = గొప్ప సంపదచే నొప్పువాఁడు నలుఁడు, అణిమాద్యష్టభూతులచే నొప్పువారును, “ఈశ్వరస్య భావ ఐశ్వర్యం” లోకప్రభుత్వముచే నొప్పువారు ఇంద్రాదులు, ఇది నలునకుం జెల్లును. సమవర్త్యాఖ్యాంచితప్రఖ్యుఁడు = సర్వసమత్వము గలవాఁ డను పేరుతోఁ దుల్యుఁడు (అనఁగా సమవర్తితోఁ దుల్యుఁడు, అని నలార్థము) సమవర్తి యను పేరుగలవాఁడు యముఁడు; న్యాయముగాఁ బాలించువా రింద్రాదులు; సుత్రాముండు = సుష్ఠు త్రాయత ఇతి సుత్రామఁ, బాగుగాఁ బాలించువాఁడు నలుఁడు, ఇంద్రాదులును, సుత్రాముఁడు అని యింద్రునకు నన్వర్థనామముం గలదు.”

ఇది బహ్వర్థకృతమైన ప్రౌఢి. ఒక మహాకవి తన పద్యానికి తానే స్వయంగా వ్యాఖ్యను నిర్మిస్తే ఎంత ఆనుభవిక రామణీయకతతో ఉంటుందో చూడగలరని వారి మాటలనే ఉదాహరించాను.