6.1 విరహవేదన
అపరిచితమైన ఆ సముద్రతీరంలో, ఇసుక తిన్నెల మధ్యన, అలిసిపోయిన ఇథకా పట్టణపు రాజు ఒడిస్సియస్ ఏకాంతంగా పడుకుని ఉన్నాడు. కొద్ది వారాల క్రితమే భయంకరమైన తుపానులో చిక్కుకుని, సముద్రంతో దివారాత్రాలు పోరాడి, అన్నపానాలు లేక, కృశించి, చిట్టచివరికి ఒక సముద్రదేవత సహాయంతో, ప్రాణాలతో ఈ ఒడ్డున పడ్డాడు. ఇప్పుడు అలిసిపోయిన నగ్నశరీరం మీద ఆకులు పరుచుకుని అపస్మారపు స్థితిలోకి ములుగుతూ, తేలుతూ పడుకుని ఉన్నాడు.
ట్రోయ్ యుద్ధం అయిపోయిన తరువాత ఒడిస్సియస్ గత పదేళ్ళబట్టి తన ఊరికి, తన ఇంటికి, తన భార్య చెంతకు చేరే ప్రయత్నంలోనే ఉన్నాడు. ఈ ప్రయత్నంలో ఎన్ని తుపానులను ఎదుర్కొన్నాడో, ఎంతమంది బృహత్కాయులతోటీ, వికటాకారులతోటీ పోరాడేడో! ఈ పోరాటాలలో పన్నెండు యుద్ధనౌకలను, వాటి సిబ్బందిని పోగొట్టుకున్నాడు.
ఇంత కాలం గడచినా, ఇన్ని కష్టాలు ఎదురైనా, ఒడిస్సియస్ తన భార్య పెనలోపీని కానీ, తన కొడుకు టెలెమాకస్ని కానీ, తన ఊరు ఇథకాను కానీ ఏమాత్రం మరచిపోలేదు. వారి ఆకారాలు, జ్ఞాపకాలు పదిలంగా తన గుండెల్లో ఎల్లప్పుడూ అలా కదులుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇంటికి చేరే మార్గమే కనబడటం లేదు.
ఇక్కడ ఇసక తిన్నెల మీద అర్ధాకలితో, అర్ధనగ్నంగా పడుకుని ఒడిస్సియస్ మథనపడుతూ ఉంటే అక్కడ ఇథకాలో పెనలొపీ రాజప్రాసాదంలో జిత శయ్య మీద తలగడ తడిసేవరకూ ఏడుస్తూ పడుకుని ఉంది. ఏళ్ళ తరబడి దుర్మార్గులు ప్రాసాదపు లోగిలిలో జొరబడి, తమలో ఎవరినో ఒకరిని వివాహమాడమని ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ఇన్నాళ్ళూ ఏదో ఒక నెపంతో తప్పించుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ దుర్మార్గులు తనకు బాసటగా ఉన్న కొడుకు టెలెమాకస్ని చంపడానికి కుట్ర పన్నుతున్నారు. తండ్రిని వెతకడానికి వెళ్ళిన టెలెమాకస్ రేపో మాపో తిరిగి వస్తాడు. వాడు తన కళ్ళ ముందే చచ్చిపోతే తను ఇంక ఎవరికోసం బ్రతకడం?
తండ్రిని వెతకడానికి బయలుదేరిన టెలెమాకస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అతను స్పార్టా (Sparta; SPAR-tah) రాజ్యంలోని రాజప్రాసాదంలో ఒక హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్నాడు. తన తండ్రిని వెతుక్కుంటూ టెలెమాకస్ అక్కడకి వెళ్ళినప్పుడు స్పార్టా రాజు మెనలెయస్ ఆతిథ్యం ఇచ్చి, మూడొంతులు సముద్రదేవత కలిప్సో తన ద్వీపంలో ఒడిస్సియస్ని బంధించి ఉంటుందేమో అని ఆచూకీ ఇచ్చి సహాయం చేసేడు. ఇదే నిజమైతే తన తక్షణ కర్తవ్యం ఏమిటి? తాను పడవలు, సిబ్బంది సమకూర్చుకుని కలిప్సో ద్వీపం ఎక్కడుందో వెతికి తన తండ్రిని రక్షించాలా? లేక వెనక్కి ఇథకా వెళ్ళిపోయి దుండగుల బారినుండి తన తల్లి పెనలొపీని కాపాడాలా? తిరిగి ఇథకా వెళ్ళడానికి ప్రయత్నిస్తే దుండగులు దారిలో మాటు వేసి తనను చంపేస్తే ఇహ పెనలొపీకి దిక్కెవరు?
ఈ భూలోకంలో పరిస్థితులు ఇలా పరిణమిస్తూ ఉండగా, అలవైకుంఠపురంబులో, నగరిలో, ఆమూల సౌధంబులో అన్నట్లు ఒలింపస్ పర్వతం మీద చిన్న కలకలం చెలరేగింది. పెనలొపీ, టెలెమాకస్ల పరిస్థితిని చూసి అథీనా దేవతకు జాలి వేసింది. వీరికి వెంటనే ఏదైనా సహాయం చేసి గట్టెక్కించాలని తలపెట్టింది. ఇంకేముంది? వెనువెంటనే, ఊరు తెల్లారకముందే, మబ్బులలో తేలియాడుతూన్న తన స్వర్గధామాన్ని విడచిపెట్టి, మానవుల సమస్యలను పరిష్కరించడానికి భూమి మీదికి దిగి వచ్చింది.
6.2 రాకుమారి
ఆకాశవీథిలో సంచరిస్తూన్న అథీనా దేవతకు కింద సుభిక్షంగా, సుందరంగా ఉన్న రాజా అల్సినస్ (Alcinous; al-SIN-oh-us) రాజ్యం కనిపించింది. ఆ రాజ్యంలో ఆడవాళ్ళంతా అందంగానూ, మగవాళ్ళంతా బలిష్ఠంగానూ ఉన్నారు. స్త్రీలందరూ చేనేత పనులలో నేర్పరులైతే, పురుషులందరూ నిష్ణాతులైన నావికులు. అథీనా బాటలేని అడవులు దాటి, పచ్చని పొలాలు దాటి, అందమైన ఇళ్ళను దాటి, విశాలమైన విపణి వీథులను దాటి, చివరికి రాజు, రాణి ఉండే అంతఃపురాన్ని చేరుకుంది. ఇంకా తూరుపు పూర్తిగా తెల్లవారలేదు. అథీనా దేవత గుట్టు చప్పుడు కాకుండా రాజప్రాసాదం లోపలికి ప్రవేశించింది. రాకుమార్తె ఉండే గది వెతికి, అందులోపలికి నిశ్శబ్దంగా వెళ్ళింది. అక్కడ రాకుమార్తెకు తోడుగా ఇద్దరు పరిచారికలు తలుపు దగ్గర పడుకుని ఉన్నారు. వారిని దాటుకుని రాకుమార్తె నిద్రిస్తూన్న శయ్యను సమీపించి, కొంచెం తటపటాయిస్తూ ఆ శయ్య చుట్టూ ఆలోచిస్తూ ఒక ప్రదక్షిణం చేసింది. తటాలున ఒక ఆలోచన స్ఫురించగా, ఆమె తన కామరూప విద్యను ఉపయోగించి, రాకుమార్తెకు ప్రియమైన స్నేహితురాలి రూపం ధరించి, రాకుమార్తె కలలో ప్రవేశించి మాట్లాడడం మొదలుపెట్టింది.
“నౌసికయా! (Nausicaa; now-SIK-eye-ah) నీకు బద్ధకం ఎక్కువైపోతోంది. గదిలో ఉతకవలసిన బట్టలు పోగులుగా పడి ఉన్నాయి. మిలమిలా మెరిసే దుస్తులు వేసుకుని తిరగకపోతే నిన్ను వరించే రాకుమారుడు ఎక్కడ దొరుకుతాడు? తూర్పు తెల్లారిపోతోంది. త్వరగా లేచి, నీ బట్టలన్నిటిని పోగుచేసి, బండిమీద వేసి, రేవుకు తీసుకెళ్ళి ఉతుక్కో.”
అని చెప్పి, అథీనా దేవత ఎలా వచ్చిందో అలాగే, చడీ చప్పుడూ కాకుండా, ఆ గదిలోంచి బయటికి జారుకుంది.
భళ్ళున తెల్లారింది. రాకుమారి నౌసికయా కళ్ళు నులుపుకుంటూ లేచింది. కలలో విన్న మాటలు ఇంకా చెవిలో గింగురుమంటున్నాయి వెంటనే తల్లిదండ్రుల గదికి వెళ్ళి, “నాన్నగారూ! అమ్మగారూ! నేను ఈవేళ నా బట్టలన్నిటిని పోగుచేసి, బండిమీద వేసి, రేవుకి తీసికెళ్ళి ఉతుక్కోవాలి. నా దుస్తులు చూసే కదా తగిన రాకుమారుడు నన్ను వరించేది?”
కూతురు వెలిబుచ్చిన ఈ విపరీతమైన కోరిక విని రాజు, రాణి మనస్సులోనే నవ్వుకున్నారు. “దానికేముంది. నీ కెలా కావలిస్తే అలాగే చేయవమ్మా. బండిని, గుర్రాలను సిద్ధం చెయ్యమని సేవకులకి చెబుతాను”.
రాజుగారి సేవకులు వెనువెంటనే బండిని, గుర్రాలను సిద్ధం చేసేరు. మాసిన కట్టుబట్టలను, లోదుస్తుల్ని, పై దుస్తుల్ని, దుప్పట్లను, పచ్చడాలను – సమస్తం – బండిలో వేసేరు. ఆ రోజు వనభోజనానికి కావలసిన పళ్ళు, రొట్టెలు, మాంసం, పీపాలతో మద్యం, సీసాలతో జిత తైలం కూడా బండిలోకి ఎక్కించేరు.
సరంజామాలన్నీ సరిగ్గా ఉన్నాయో, లేదో సరి చూసుకుని, నౌసికయా బండి నొగతొట్టెలోకి ఎక్కి కూర్చుని, కొరడా ఝళిపించింది. గుర్రాలు లగెత్తుకుని పరిగెడుతూ ఉంటే టకటక చప్పుడు చేసుకుంటూ బండి కదిలింది. సముద్రపుటొడ్డున ఉన్న మంచినీటి చెలమల దగ్గర బండిని ఆపి, గుర్రాలను విప్పి, సామానులని కిందకి దింపించేరు. వెంట వచ్చిన పనివారు మాసిన బట్టలను చెలమకుంటల దగ్గర ఉన్న బండల మీద ఉతికి, అక్కడ రాళ్ళ మీద ఆరవేసేరు.
బట్టలు ఎండలోనూ, గాలిలోనూ ఆరుతూ ఉంటే నౌసికయా తన చెలికత్తెలతో కలసి సముద్రంలో ఈదడానికి వెళ్ళింది. తరువాత అందరూ గట్టుమీద ఇసుకలోనూ, రాళ్ళమీదా కూర్చుని తమతో తెచ్చుకున్న రొట్టెలని, మాంసాన్నీ తింటూ, మధ్యలో ద్రాక్షసారాను తాగుతూ, ఉల్లాసభరితంగా కాలం గడిపి, బంతులతో ఆటలు మొదలుపెట్టేరు. చెలికత్తె విసరిన బంతి రాకుమార్తె చేతికి అందకుండా దూరంగా పడింది. కేరింతలు కొడుతూ రాకుమార్తె దాని వెనక పరిగెత్తింది.
అలతి దూరంలోనే, ఒక జితవృక్షపు నీడలో, కిందపడ్డ ఎండుటాకుల ఆచ్ఛాదన కింద దుర్దశతో డస్సిపోయిన ఒక వ్యక్తి నిర్లిప్తంగా కళ్ళు మూసుకుని పడుక్కుని ఉన్నాడు. బంతి వెనుక పరిగెడుతూ కేరింతలు కొడుతూన్న అమ్మాయిల గొంతు విని సంభ్రమాశ్చర్యాలతో కళ్ళు విప్పి అటు చూసేడు.
…. నేను ఎక్కడ ఉన్నాను? ఎవరీ కేరింతలు కొడుతూన్న అమ్మాయిలు? ఇది కలా? మనో విభ్రమమా? ఆ కంఠస్వరాలు వింటూవుంటే జలకన్యలలా ఉన్నారు….
ఒడిస్సియస్ నెమ్మదిగా ఆకులతో ఉన్న ఒక చెట్టు రెమ్మను విరిచి, తన నగ్న జననావయవాలకు ఆచ్ఛాదనగా పెట్టుకుని, నెమ్మదిగా ఆ జితవృక్షపు నీడనుండి ఎండలోకి వచ్చేడు.
6.3 పరదేశి
చెట్ల నీడనుండి బయటికి వచ్చిన ఒడిస్సియస్ ఆకారం చూసి పరిచారికలు ఒక్కుమ్మడిగా భయపడి వెనక్కి పరిగెట్టి దాక్కున్నారు. కానీ అథీనా వరప్రభావం వల్ల, కాలకృత్యాలు తీర్చుకోకుండా ఉన్న ఆ దిగంబర స్వామి వికృతాకారం చూసినప్పటికీ రాకుమారి నౌసికయా భయపడలేదు.
“అందాలొలికే రాకుమారీ! నువ్వు దివినుండి భువికి దిగివచ్చిన దేవకన్యవా? లేక, నశ్వరమైన మానవకన్యవా?” అంటూ పలకరించేడు ఒడిస్సియస్. “నువ్వు ఎవరివైనా సరే, కష్టాలలో ఉన్న నా మీద దయ చూపు. ఇరవై రోజులపాటు ఈ సముద్రంలో – నిద్రాహారాలు లేకుండా – ఒక దిక్కులేని దుంగలా కొట్టుకుంటూ వచ్చి ఈ ఒడ్డున పడ్డాను. ఈ నగ్నశరీరానికి ఆచ్ఛాదనగా ఏదైనా వస్త్రం ఇవ్వగలవా? ఇక్కడనుండి మీ ఊరు వెళ్ళడానికి దారి చూపగలవా?”
రాకుమారి ఒడిస్సియస్ దగ్గరగా వచ్చి, ఎగాదిగా చూసి, “పరదేశీ! భయపడకు. నువ్వు మంచివాడివే అని నా ఆత్మ చెబుతోంది. నా పేరు నౌసికయా. ఈ ఊరుకి రాజైన అల్సినస్ కుమార్తెను. నేను, నా పరిచారికలు నీకు సహాయం చేస్తాం. చింతించకు”.
దాక్కున్న పరిచారికలు భయపడవలసిన పని లేదని నౌసికయా ధైర్యం చెప్పి వెనక్కి పిలిచింది. ఎదురుగా ఉన్న అద్భుతమైన పరదేశికి శుభ్రమైన దుస్తులు, శరీరానికి రాసుకుందుకి జితతైలం పట్టుకురమ్మని ఆదేశించింది.
ఒడిస్సియస్ అక్కడ ఉన్న మంచినీటి చెలమలలో శరీరాన్ని శుభ్రంగా కడుక్కుని, సముద్రపు కెరటాల తాడింపులకి చావు దెబ్బలు తిన్న చర్మానికి జితతైలం మర్దనా చేసి, నౌసికయా అందించిన శుభ్రమైన బట్టలు కట్టుకొని, పైన కండువా వేసుకుని, తయారయి, నౌసికయా పరిచారికలు తెచ్చిన రొట్టెలు, మాంసం తిని, ద్రాక్షసారా తాగి సేద తీర్చుకున్నాడు.
ఒడిస్సియస్ క్షుద్బాధ తీరిన పిమ్మట రాకుమారి నౌసికయా తరవాత కార్యక్రమం బోధించింది. “ఊరి పొలిమేరలలో ఉన్న ప్రాకారంవరకు నిర్భయంగా మా బండి వెనకాతలే, మమ్మల్ని అనుసరిస్తూ ప్రయాణం చెయ్యండి. అప్పటినుండి మా దారి మాది, మీ దారి మీది. మా రాజ్యంలో ఉన్న ప్రజలు అద్భుతమైన నావికులు, స్నేహశీలురు. కానీ, పరదేశీయులను గభీమని నమ్మరు. మీరు మా వెంట వస్తే మేమేదో తప్పు చేసేమేమోనని మామీద అనుమానపడతారు”.
“అయితే పొలిమేర దాటిన తరువాత నన్ను ఎక్కడకి వెళ్ళమంటారు?”
“ఊరి పొలిమేరలలో అథీనా దేవతకు ఇష్టమైన బూరుగు తోటలు, జితవృక్షాలు ఉన్నాయి. నేను కోటలోని అంతఃపురం చేరుకునేవరకు నాకు వ్యవధి కావాలి. అప్పటికి సాయంసమయం అవుతుంది. అప్పుడు కోటలోని దివాణంలోకి ప్రవేశించండి. అక్కడ రాజుగారు, రాణిగారు ఉంటారు. మీరు తిన్నగా రాణిగారికి నమస్కరించి సహాయం అడగండి”.
ఇలా చెప్పి, ఆమె బండి నొగతొట్టెలోకి ఎక్కి, కొరడాతో గుర్రాలను అదలించింది.
ఒడిస్సియస్ బండి వెనక పొలాలు, పంటచేలు, ఓడరేవు దాటుకుంటూ ఊరి పొలిమేరవరకు నడచి వెళ్ళేడు. అక్కడ బండిని విడచి విపణి వీథిలో పడి బాటకు ఇరువైపులా ఉన్న చిల్లర దుకాణాలలో అల్పవస్తువులు, ఆటబొమ్మలు, నగా, నట్రా చూస్తూ కాలయాపన చేస్తున్నాడు. నలుగురి కళ్ళూ తన మీదే ఉండడం గమనించి, రాకుమారి నౌసికయా ఇచ్చిన సలహాలోని ఔచిత్యాన్ని గుర్తించి, ఒడిస్సియస్ నెమ్మదిగా విపణి వీథిని వదలిపెట్టి పక్కగా ఉన్న జితవృక్షాల మాటుకు జారుకున్నాడు.
తోటలో వేచి ఉన్న సమయంలో ఒలింపస్ పర్వతం మీద దేవతలకు నమస్కరించి ఒడిస్సియస్ విన్నవించుకున్నాడు: “దేవతలారా, మీరే నన్ను రక్షించాలి. ఏ ఇబ్బందులు లేకుండా సజావుగా రాణి దర్శనం కలిగేలా చెయ్యండి. నాకు మేలు కలిగేలా చూడండి”.
రాకుమార్తె నౌసికయా అంతఃపురం లోపలికి చేరుకుందని నమ్మకం కుదిరేవరకు కాలయాపన చేసి, అప్పుడు ఒడిస్సియస్ ధైర్యంగా తోటలోని చెట్ల నీడలనుండి భయపడుతూ బయటకు వచ్చేడు.
…. ఆశ్చర్యం తన చుట్టూ పొగమంచు కమ్ముకుంది. తన చుట్టుపట్ల ఉన్నవారికి తాను కనబడుతూన్నట్లు లేదు. అథీనా దేవత తనను ఒక అదృశ్య వ్యక్తిగా మార్చేసిందా? ….
అకస్మాత్తుగా ఒడిస్సియస్ ఎదుట ఒక చిన్న బాలిక ప్రత్యక్షమయ్యింది. మెరుస్తూన్న కళ్ళతో ఆమె ఒడిస్సియస్ వైపు చూసింది. ఈ బాలిక ఎవ్వరు? అథీనా దేవత తనకి సాయం చెయ్యడానికి ఈ బాలిక రూపంలో వచ్చిందా?
“అమ్మాయీ! రాజాస్థానానికి దారి చూపగలవా?” ఆమెను అడిగేడు.
“నా వెంట రా. ఇహ ఎవ్వరితోటీ మాట్లాడకు”.
మారు మాట్లాడకుండా ఒడిస్సియస్ ఆమెను అనుసరించేడు.
కోట ద్వారం సమీపించిన తర్వాత, “తిన్నగా లోపలికి వెళ్ళు. అల్లిక అల్లుకుంటూ రాణి కనిపిస్తుంది,” అని చెప్పి ఆ బాలిక అదృశ్యమైపోయింది.
కోట ద్వారాలు తెరుచుకుని ఒడిస్సియస్ లోపలికి ప్రవశించాడు. మార్గానికి ఇరుపక్కలా రకరకాల ఫలజాతుల వృక్షాలు బారులు తీర్చి ఉన్నాయి. అత్తి, బేరి, సీమరేగి, ద్రాక్ష మొదలైన ఫలజాతులూ, రకరకాల పుష్పవాటికలు దారి పొడుగునా అలరించి కనబడ్డాయి. రాజప్రాసాదపు ప్రాంగణంలో అడుగు పెట్టగానే మరొక దివ్యప్రపంచం ఎదురైంది. ఇంద్రభవనంలా ఉన్న ఆ ప్రాసాదంలో బారులు తీరిన సువర్ణఖచిత శిల్పాలు, ఆ శిల్పాల చేతుల్లో కర్పూరపు కాగడాలు, ఆ కాగడాలు విరజిమ్మే వెలుగులో పరిచారిక బృందాల వేళ్ళు మగ్గాల మీద ఒయ్యారాలతో నేసే నేత వస్త్రాలు. అదంతా ఒక కలలా ఉంది.
ఒడిస్సియస్ రాకను ఎవ్వరూ గమనించినట్లు లేదు. అథీనా దేవత దివ్యశక్తితో అతని చుట్టూ ఒక విధమైన పొగమంచు పరివేష్ఠించి ఉండడంవల్ల అతను ఎవ్వరికీ కనబడడం లేదు. అతని కళ్ళు మాత్రం రాణిగారికోసం వెతుకుతున్నాయి. ఇంతలో, అల్లంత దూరంలో, కుంపటి దగ్గర కూర్చుని చలికాగుతూ రాజూ, రాణీ కనిపించేరు. రాణి ఏవో ఉన్ని వస్త్రాలు అల్లుతున్నారు.
ఒడిస్సియస్ రాకుమార్తె నౌసికయా తల్లిని సమీపించేడు. ఆమె ముందు మోకరిల్లేడు. కుంపటినుండి వెలువడే వేడి వికిరణాల ప్రభావానికి కాబోలు ఒడిస్సియస్ని చుట్టివున్న పొగమంచు కరిగిపోయింది.
అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ఆగంతకుడిని చూసి పరిసరాలలో ఉన్న సిబ్బంది హాహాకారాలు చేసేరు. దుర్బలంగా, కృశించి, శవాకారంలో ఉన్న ఆ వ్యక్తి నమస్కారం చేసి ఇలా అన్నాడు: “మహారాణీ! నా మీద దయ చూపి నా మొర ఆలకించండి. మహాసముద్రపు ఆవలిగట్టునుండి ఎండిన మానులా కొట్టుకుని వచ్చి మీ రాజ్యపు పొలిమేరలలో గట్టెక్కేను. నా దేశానికి వెళ్ళి నా భార్యను, నా కొడుకును కలుసుకునేలా సహాయం చెయ్యండి.”
6.4 విందు
ఆ చావడిలో ఉన్న పిన్నలు, పెద్దలు సంభ్రమాశ్చర్యాలతో ఈ సంఘటనను తిలకిస్తున్నారు. కానీ ఎవ్వరూ ఏ విధంగానూ స్పందించలేదు. అక్కడ ఆవరించిన నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఒక పెద్దాయన ముందుకొచ్చి ఇలా అన్నాడు: “మన పురాతన సంప్రదాయం ‘అతిథి దేవో భవ’ అని చెబుతోంది కదా. మన దేవదేవుడు జూస్ ఏమన్నాడు? చేతులెత్తి శరణు కోరిన వ్యక్తిని ఆదరించమన్నాడు. ఈ నిర్భాగ్యుడు కూర్చునేందుకు ఒక ఉచితాసనం చూపించి, కనీసపు మర్యాదగా భోజనం పెట్టి, తాగడానికి ద్రాక్ష సారా ఇవ్వండి”.
రాజా అల్సినస్ లేచి, నిలబడి, ఆగంతకుడి ఉచితాసనం చూపించి కూర్చోబెట్టేడు. వెనువెంటనే పరిచారికలు ముందుకొచ్చి కాళ్ళు, చేతులు కడుక్కుందుకి అతిథికి నీళ్ళు ఇచ్చి ఉపచారాలు చేసేరు. మరికొందరు వెండిపళ్ళేల నిండా భోజనసామగ్రి అమర్చేరు.
అప్పుడు రాజు, రాణి తమ చేతులలో ఉన్న ద్రాక్షసారా పాత్రలను పైకెత్తి శుభాకాంక్షలు చెబుతూ, ఒడిస్సియస్ని ఉద్దేశించి, “అయ్యా మూడొంతులు మీరు ఒలింపస్ పర్వతంనుండి మారువేషంలో దిగివచ్చిన అమరులు అయి ఉంటారు. మా దేవరాజైన జూస్ మా భక్తిని, అతిథి సత్కారదక్షతను పరీక్షించడానికి మిమ్మల్ని పంపి ఉంటారు…”
ఒడిస్సియస్ తలను అడ్డుగా ఆడిస్తూ, “మహారాజా! క్షమించండి. నేను దేవుడిని కాను, దేవదూతనూ కాను. నేను కేవలం మానవమాత్రుడను. దౌర్భాగ్యుడను. నా వృత్తాంతం, నా దుర్దశ మీకు పూర్తిగా తెలిస్తే…”
ఒడిస్సియస్ అణకువతో చెప్పిన మాటలు విని రాజా అల్సినస్ చలించేడు. తన పరిచారకులను ఉద్దేశించి, “ఈ రాత్రి మన అతిథి శయనించడానికి అతిథిగృహాన్ని తయారు చేసి, మీరు మీమీ ఇళ్ళకు వెళ్ళిపొండి. రేపు మన అతిథికి షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేస్తున్నాం”.
అందరూ వెళ్ళిపోయిన తరువాత రాజు, రాణి, ఒడిస్సియస్ ఏకాంతంగా మిగిలేరు. అప్పుడు ఒడిస్సియస్ని ఉద్దేశించి రాణి అన్నారు: “ఆయ్యా! చూస్తూంటే మీరు ధరించిన దుస్తులు మీవి కావని తెలుస్తూనే ఉంది. అవి మా అమ్మాయి ఈ ఉదయం ఉతకడానికి బండిలో వేసి రేవుకు తీసుకెళ్ళిన బట్టలు కావా? మీరు సముద్రాలు దాటి, తుపానులో చిక్కుకుని, చిట్టచివరకు మా దేశపు ఒడ్డున చేరినట్లు చెబుతున్నారు. నిజానికి మీరు ఎవరు? మీది ఏ దేశం?”
ఒడిస్సియస్ తన అసలు కథ పూర్తిగా చెప్పే పరిస్థితిలో లేడు. అలాగని అబద్ధం చెప్పదలుచుకోలేదు. కనుక మధ్యేమార్గంగా ఇలా సమాధానం చెప్పేడు: “మహారాణీ! నేను కలిప్సో ద్వీపాన్ని వదలిపెట్టి పడవలో బయలుదేరేక, సముద్రమధ్యంలో పెద్ద తుపాను వాతన పడి పడవను పోగొట్టుకున్నాను. అప్పుడు ఒక దుంగను చేత పట్టుకుని మీ రాజ్యపు ఒడ్డున వచ్చి పడ్డాను. నా అదృష్టవశాత్తూ రాకుమారి నాకు తినడానికి రొట్టె, తాగడానికి నీళ్ళు, కట్టుకోడానికి దుస్తులు ఇచ్చి నా మానప్రాణాలు రక్షించింది.”
ఈ సమాధానంతో రాణి సంతృప్తి పడి, ఒడిస్సియస్ పడకకు ఒక గది ఏర్పాటు చెయ్యమని సేవకులను ఆదేశించింది. సేవకులు ఒడిస్సియస్ని పట్టుపరుపులు ఉన్న గదిలోకి తీసుకుని వెళ్ళి, అక్కడ తీక్షణంగా వెలుగుతూన్న కాగడాల వత్తులని తగ్గించి, బయటకి వచ్చేరో లేదో అలసిపోయిన ఒడిస్సియస్ శరీరం పరుపుమీదకి వాలిపోయి, ఉత్తరక్షణంలో నిద్రలోకి జారుకుంది.
మరునాడు ఒక పాచకశ్రేష్ఠుడి పర్యవేక్షణలో విందుకు కావలసిన వంటలు ప్రారంభం అయేయి. గొర్రెలను, బర్రెలను, అడవి పందులను చంపి రకరకాల మాంసాహారాలు తయారు చేసేరు. రొట్టెలను కాల్చేరు. పీపాలతో మాదక ద్రవ్యాలను సమకూర్చేరు. భోజనానంతరం వినోద కాలక్షేపానికి అంత్యానుప్రాసలతో తియ్యని కవిత్వం చెప్పే ఒక ప్రముఖ గాయకుడిని రప్పించడానికి కబురు పెట్టేరు. అతనొక గుడ్డివాడు. అయినప్పటికీ పురాణకథలు చెప్పడంలో అద్వితీయుడు.
విందుకు సంరంభాలు జోరుగా జరుగుతున్నాయి. అథీనా దేవత కూడా మారువేషంలో వచ్చి, పురవీథులలో తిరుగుతూ, “పురజనులందరికీ ఇదే మా ఆహ్వానం. రాజుగారికి అతిథిగా విచ్చేసిన సాహసయాత్రికుని వీరగాథలు వినండి!” అంటూ చాటింపు వేసింది.
రాజప్రాసాదపు ముంగిటిలో పురజనులు పోగవడం మొదలుపెట్టేరు. ఒడిస్సియస్ని వెంటబెట్టుకుని రాజా అల్సినస్ ప్రజల ముందుకి వచ్చేడు. ప్రజలు దిగ్భ్రాంతులై రాజసం ఉట్టిపడుతూన్న ఒడిస్సియస్ విగ్రహాన్ని కళ్ళప్పగించి చూస్తున్నారు. తన శరీరంలో అణువణువునా తొణికిసలాడుతూన్న అలసటను బైటికి కనబడకుండా అథీనా దేవత ఏదో మాయ చేసి ఉంటుందని ఒడిస్సియస్ అనుకున్నాడు.
విందు మొదలయింది. గుడ్డి గాయకుడు ఒక పెద్ద తంత్రీవాద్యాన్ని వాయిస్తూ కథ చెప్పడం మొదలు పెట్టేడు. త్వరలోనే ఊపందుకుని, ఒక గాడిలో పడి, పెద్ద యుద్ధంలో గాయపడి మరణించిన వారి వీరగాథలు మనోరంజకంగా చెప్పడం మొదలుపెట్టేడు. ఆ కథనంలో ట్రోయ్ మహా సంగ్రామంలో వీరోచితంగా పోరాడిన అకిల్లీస్, అగమేమ్నాన్ వంటి మహావీరుల పేర్లు దొర్లుతున్నాయి.
యుద్ధంలో వీరమరణం పొందిన తన స్నేహితుల పేర్లు వినగానే ఒడిస్సియస్ ఒడలు ఒక్కసారిగా పులకరించింది. గుండె ఆర్ద్రమైంది. వెనువెంటనే ఒడిస్సియస్ మనస్సులో దుఃఖం పెల్లుబికి పైకి వస్తోంది. చిప్పిల్లుతూన్న అశ్రుధారలు బయటకు కనబడకుండా తన ముఖాన్ని దోసిట్లో దాచుకున్నాడు.
కొద్ది సేపట్లో స్తిమితపడ్డాడు. “గ్రీకు వీరుల విజయానికి కీలకమైన కర్రగుర్రం గురించి కూడా పాడండి,” అని ఆ గుడ్డి గాయకుడిని అర్థించేడు, ఒడిస్సియస్. “గ్రీకు వీరులు ఎలా పోరాడారో, ట్రోయ్ నగరం పతనానికి కారకులెవరో కూడా చెప్పండి.”
అప్పుడు ఆ అంధ గాయకుడు యుద్ధంలో కర్రగుర్రం ఉపయోగించాలనే ఊహ ఒడిస్సియస్ అనే గ్రీకు వీరుడికి ఎలా వచ్చిందో, ఆ పథకం ప్రకారం ఆ కర్రగుర్రం కడుపులో ఒడిస్సియస్తోపాటు గ్రీకు సైన్యం ఎలా దాగున్నారో, ఆ గుర్రాన్ని ట్రోయ్ నగరపు సముద్రపు ఒడ్డుదాకా ఎలా తీసుకెళ్ళారో, ఆ తరువాత పరాజితులైనట్లు నటిస్తూ కొంతమంది సైన్యం పడవలు ఎక్కి ఎలా పారిపోయారో, అప్పుడు ట్రోయ్ సైనికులు ఇసుకతిన్నెలపై కనిపించిన ఆ కర్రగుర్రాన్ని పట్టణపు ప్రాకారం దాటించి లోపలికి ఎలా తీసుకెళ్ళారో, చీకటి పడ్డ తరువాత గుర్రం కడుపులో దాక్కున ఒడిస్సియస్, అతని అనుచర బృందం తటాలున బయటికి వచ్చి, ట్రోయ్ రాజ ప్రాసాదాన్ని ముట్టడించి, ట్రోయ్ సైన్యాన్ని ఛిన్నాభిన్నం చేసి, విజయలక్ష్మిని చేజిక్కించుకుని, యువరాణి హెలెన్ని విడిపించి, అగమేమ్నాన్ దగ్గరకు ఎలా చేర్చేరో అద్భుతంగా వర్ణిస్తూ చెప్పుకొచ్చేడు.
ఈ కథ శ్రవణేంద్రియాల గుండా అతని మనఃక్షేత్రంలోకి చేరేసరికి కట్టలు తెంచుకుని పెల్లుబికి ప్రవహిస్తూన్న దుఃఖాన్ని ఇక ఆపుకోలేక భళ్ళున, వెక్కి వెక్కి ఏడ్చేశాడు ఒడిస్సియస్.
ఈ సంఘటనను చూసి రాజు అల్సినస్ వెంటనే తంత్రీవాద్యాన్ని ఆపుచేయించి, “మన అతిథి ట్రోయ్లో జరిగిన యుద్ధం ప్రస్తావన వచ్చిన రెండు సార్లూ కంట తడి పెట్టుకున్నారు. మీరు పాడుతూన్న పాటకి ఈయన మనస్సులో గత స్మృతులు చెలరేగుతూన్నట్లు ఉన్నాయి” అని చెబుతూ, ఒడిస్సియస్ వైపు తిరిగి, “అయ్యా! మీరు ఇంతలా స్పందించడానికి కారణం ఏమిటి? నిజంగా మీరు ఎవరు? మీ పేరు ఏమిటి? ట్రోయ్లో జరిగిన యుద్దానికి మీకూ మధ్య సంబంధం ఏమిటి? ట్రోయ్ పతనం మీరు చూసేరా? మీ ఆప్తులు ఆ యుద్ధంలో మరణించేరా? నిజం దాచకుండా సవివరంగా మీ కథ చెప్పండి” అన్నారు.
6.5 ఇథకాకు తిరుగు ప్రయాణం
ఒడిస్సియస్ లేచి నిలబడ్డాడు. చుట్టూ ఉన్న ప్రేక్షకులను అవలోకించాడు. “ఎక్కడ మొదలుపెట్టేది?” అంటూ మొదలుపెట్టేడు. “నా కథ చాలా పెద్దది. విషాదభరితమైనది. కష్టాలతో నిండి ఉన్నది. మొదట నా పేరుతో మొదలు పెడతాను. నా పేరు ఒడిస్సియస్. నాది ఇథకా అనే రాజ్యం. అది ఎంతో అందమైన ద్వీపం. దాని నైసర్గికస్వరూపం, అక్కడి మనుష్యులు, వాళ్ళ స్వరూపస్వభావాలు, అన్నీ నిన్న మొన్న చూసినట్లు జ్ఞాపకం వస్తున్నాయి ఆ ద్వీపం చుట్టూ ఉన్న సాగరం ఉత్తుంగ తరంగాలతో భీకరమైనది. జననినీ, జన్మభూమినీ మించినది ఏదీ లేదంటారు. అదే నా స్వర్గసీమ. ఆ సీమను కానీ, అక్కడ ఉన్న నా భార్యను కానీ, నా కొడుకును కానీ చూసి ఇరవై సంవత్సరాలు అయింది. ట్రోయ్ యుద్ధంలో పాల్గొనడానికి నేను ఇల్లు వదలిన తరువాత వారిని మళ్ళా చూడలేదు…”
ఒడిస్సియస్ ఊపిరి పీల్చుకుని, సముద్రాలకి ఆవలిపక్కన ఉన్న ట్రోయ్ని వశపరచుకోడానికి గ్రీకు యోధులు పదేళ్ళపాటు ఎంత ఘోరంగా పోరాడారో, విజయం సాధించిన తరువాత గ్రీకు నౌకల బలగం ఎలా తిరుగు ప్రయాణం మొదలెట్టిందో సవివరంగా చెప్పుకొచ్చేడు. అప్పుడు సముద్రంలో తీవ్రంగా చెలరేగిన తుపానులో తన అధీనంలో ఉన్న పన్నెండు ఓడలు దారి తప్పి తామరలు తినే జీవుల ద్వీపానికి (The Land of the Lotus Eaters) వెళ్ళడం, అక్కడనుండి సైక్లాప్స్ ద్వీపంలో జరిగిన సంఘటనలు చెప్పుకొచ్చాడు.
సైక్లాప్స్ ద్వీపంలో ఉండే భయంకరమైన సైక్లోప్స్ (Cyclopes) అనే ఒంటికన్ను రాక్షసుడు తన సైనికబృందంలో ఒకరినీ, ఒకరినీ సజీవంగా ఎలా కబళించేసాడో, అక్కడనుండి బయట పడ్డానికి బ్రతికున్నవారు అక్కడ ఉన్న గొర్రెల కడుపు కింద వేళ్ళాడే ఉన్నిలో దాక్కుని ఎలా ప్రాణాలతో బయట పడ్డారో ఒడిస్సియస్ చెబుతూ ఉంటే వినేవారి ఒళ్ళు జలదరించింది.
వాయుదేవుడు ఒడిస్సియస్కి ఒక సంచీతో గాలిగొట్టాలు ఇచ్చిన వైనం, వాటిని ఎలా జాగ్రత్తపరచాలో చెప్పిన వైనం, వాటిని చెప్పిన పద్ధతిలో వాడినప్పుడు పడవలు సముద్రంలో జోరుగా వెళ్ళేయనిన్నీ, దరిదాపు ఇథకా సమీపానికి వచ్చేసిన తరువాత – ఒడిస్సియస్ నిద్రపోతూన్న సమయంలో – కొంతమంది సరంగులు కుతూహలాన్ని చంపుకోలేక వద్దన్న పని చేసేరనిన్నీ, అప్పుడు వాయుదేవుడు కోపగించి పెద్ద తుపాను సృష్టించేడనిన్నీ, ఆ తుపానులో దరిదాపు ఇంటికి వచ్చిన పడవలు దూరంగా సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోయాయనిన్నీ చెబుతూ ఉంటే విన్న వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లేయి.
తరువాత నరమాంసభక్షకులు తన పన్నెండు పడవలలో పదకొండింటిని ముంచేసి, వాటిలోని సరంగులను శూలాలతో పొడిచి ఎలా హతమార్చేరో ఒడిస్సియస్ చెప్పుకొచ్చాడు. ఆ సంఘటనతో హతాశుడైన ఒడిస్సియస్ మిగిలిన ఒక్క పడవతో మాంత్రికురాలు సర్సీ నివాసముండే దీవికి చేరుకున్న వైనం, అక్కడ సర్సీ తన సిబ్బందిలో సగంమందిని పందులుగా మార్చేసిన సంఘటన చెప్పేడు. అక్కడనుండి సతతం పొగమంచుతో కప్పబడి ఉన్న ప్రేతాత్మల లోకానికి చేసిన ప్రయాణం, అక్కడ గతంలో చనిపోయిన తన అనుచరుల, సహచరుల, బంధుమిత్రుల ప్రేతాత్మలతో చేసిన సంభాషణలు, ప్రత్యేకించి తన తల్లి ప్రేతాత్మ గురించి చెబుతూ ఉంటే భయంతోటీ, గగుర్పాటుతోటీ శ్రోతలు స్పందించేరు.
అటుపైన సైరన్లు అనే రెక్కలు ఉన్న అందమైన అమ్మాయిలు పాడే అద్భుతమైన పాటలు గురించి చెప్పేడు, ఒడిస్సియస్. ఈ సైరన్లు వారి పాటలతో దారిన పోయే నావికులను ఆకర్షించి, ఆ అమాయకులను జలసమాధి చేసే వైనం చిత్రీకరించి చెప్పేడు. సైరన్ల ప్రమాదంనుండి తప్పించుకుని వెళ్ళగానే ముందు నుయ్యి, వెనక గొయ్యిలాంటి జంట ప్రమాదాల గురించి చెప్పుకొచ్చేడు. ఖరీబ్డిస్ అనే సుడిగుండం ఒక పక్కన, సిల్లా అనే ఆరు తలల రాక్షసి ఒక పక్కన కాసుకు కూర్చుంటే వారి మధ్యనుండి ఎలా బయటపడ్డాడో చెబుతూ అందరినీ ఉత్తేజపరిచేడు.
అలా బయటపడ్డ ఒడిస్సియస్ తన సహచరుల పట్టుదల మీద సూర్యదేవుడి ద్వీపం దగ్గ ఆగవలసి వచ్చింది. ఒడిస్సియస్ పదే పదే చేసిన హెచ్చరికలని మన్నించకుండా ఆకలితో మలమలలాడుతున్న నావికులు సూర్యదేవుడి పశువుల్ని, గొర్రెలను చంపి తినేశారు. సూర్యదేవుడు కోపోద్రిక్తుడై ఆ పాపం చేసిన వారందరినీ తుపాను రేగిన సముద్రంలో ముంచి సంహరించేడు.
ఏకాకిగా, ఏ పడవా లేకుండా, మిగిలిన ఒడిస్సియస్ కలిప్సో దేవత నివసించే దీవికి ఎలా చేరుకున్నాడో, ఇతని ప్రేమలో పడిన కలిప్సో దేవత ఒడిస్సియస్ని ఏడేళ్ళపాటు తన దీవిని వదలిపెట్టి వెళ్ళకుండా ఎలా బంధించిందో చెప్పుకొచ్చాడు. తరువాత కలిప్సో అనుమతితోటే ఒక బల్లకట్టు నిర్మించుకుని ఇరవై రోజులపాటు ఏకాంతంగా అహర్నిశలూ సముద్రం మీద ప్రయాణం చేసి, చిట్టచివరికి కాళ్ళు, చేతుల మీద పాకురుకుంటూ గట్టుకు చేరి, రాకుమారి నౌసికయా కళ్ళ ఎదుట ఎలా పడ్డాడో వివరంగా చెప్పుకొచ్చేడు.
నమ్మశక్యం కాని ఈ కథ అంతా చెప్పుకొచ్చి, పెద్దగా నిట్టూర్చి, “ఇప్పుడు నాకు కావలసిందల్లా నా సంసారం. నేను ఇంటికి పోవాలి.”
ఈ కథ విన్నవారంతా నోట మాట రాక నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు రాజు అన్నారు: “ఈ పెద్దమనిషి ఇల్లు, సంసారం వదలిపెట్టి ఇరవై ఏళ్ళు దాటిపోయింది. ఇతను మనని అడిగేది ఏమిటి? ఇంటికి వెళ్ళడానికి సహాయం చేయమంటున్నాడు. మడులు, మాన్యాలు అడగటం లేదు. రేపు మన రాజ్యంలో ఉన్న ఏభయిమంది ఉత్తమోత్తమ నావికులతో ఒక పడవని సిద్ధం చేసి చీకటి పడేలోగా ఇథకాకు పంపిద్దాం”.
మరునాడు తెల్లారేసరికల్లా ఏభయిమంది నావికులతో పడవ సిద్ధం అయింది. పడవలో నూతన వస్త్రాలు, బంగారు బహుమానాలు నింపేరు. సూర్యుడు అస్తమించే వేళకి రాజా అల్సినస్ సేవకులు ఒలింపస్ పర్వతం మీద ఉన్న దేవరాజు జూస్ ప్రీత్యర్థం ఒక ఎనుబోతుని బలి ఇచ్చేరు.
“మీ ఆదరాభిమానాలకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. దేవుడు మీకు మేలు చేస్తాడు. నాకు సెలవు ఇప్పించండి,” అని ఒడిస్సియస్ రాజా అల్సినస్కి తన కృతజ్ఞతలు విన్నవించుకున్నాడు.
పడవ పైభాగం మీద, నక్షత్రాల కింద, నావికదళం ఒక మెత్తని పరుపు పరచేరు. నరనరాలా అలసిపోయిన ఒడిస్సియస్ని ఆ పరుపు మీద పడుక్కోమని ఆహ్వానించేరు. మారు మాట్లాడకుండా ఒడిస్సియస్ ఆ పరుపు మీద శయనించేడు. గతాన్ని స్మరిస్తూ కళ్ళు మూసుకున్నాడు.
ఓడంగులు ఎవరి స్థానాలలో వారు ఉన్నారు. లంగర్లు ఎత్తేరు. తెడ్లు వేసి పడవను గట్టునుండి దూరంగా నడిపి, నడిసముద్రంలోకి తీసుకువెళ్ళేరు. తెరచాపలు విప్పేరు. పడవ జోరందుకుంది.
అప్పటికే ఎప్పుడో ఒడిస్సియస్ నిద్రలోకి జారుకున్నాడు. ఇన్నాళ్ళకు, ఇన్నేళ్ళకు, ప్రకృతి తోటీ, వికృతాకారాలతోటీ యుద్ధాలు చేసిన తరువాత తన పోరాటాలకు అంతు చూడబోతున్నాడు.
పడవ కెరటాల మీద పరుగులు తీసింది. తెల్లగా తెల్లవారకముందే పడవ ఇథకా నౌకాశ్రయానికి చేరుకుంది. లంగర్లు దింపేరు. పడవను గట్టుకి మోకులతో కట్టేరు. సరంగులు గట్టు మీదకు గెంతేరు.
ఒడిస్సియస్ ఇంకా నిద్రలోంచి లేవలేదు. ఆయనను నిద్ర లేపడానికి ఎవ్వరికి మనసొప్పలేదు. ఏ మాత్రం అలజడి చెయ్యకుండా ఆయన నిద్రపోతూన్న మంచాన్ని, ఆ పళంగా లేవనెత్తి, అక్కడ ఉన్న ఒక జితవృక్షపు నీడన, ఇసుక దిబ్బలమీద అమర్చేరు. ఆయనకు రాజుగారు ఇచ్చిన బహుమానాలన్నిటినీ – బంగారు పళ్ళేలు, కంచు గిన్నెలు, పట్టు బట్టలు – ఆ మంచం పక్కనే అమర్చి, చడీ చప్పుడూ లేకుండా నిష్క్రమించారు.
ఇరవై సంవత్సరాల తరువాత, ఒడిస్సియస్ ఇథకా చేరుకున్నాడు.
6.6 గొర్రెలకాపరి
ఒడిస్సియస్ లేచేసరికి చుట్టూ పొగమంచు ఆవరించి ఉంది. పరిసరాలన్నీ మసక మసకగా ఉన్నాయి. ఏదీ పరిచితంగా కనిపించలేదు. పక్కన మాత్రం రాజా అల్సినస్ ఇచ్చిన బంగారు బహుమానాలు మెరుస్తూ కనబడ్డాయి.
అల్సినస్ తనని ఇక్కడికి ఎందుకు పంపేడు? అల్సినస్ నావికులు తనని ఈ అయోమయ స్థితిలో ఎందుకు ఏకాంతంగా వదిలేసి వెళ్ళిపోయేరు?
ఒడిస్సియస్ ఆ సముద్రపుటొడ్డున కాలు కాలిన పిల్లిలా ఇటూ, అటూ పచార్లు చేస్తున్నాడు. ఊరు పేరు లేని ఈ అయోమయ ప్రాంతానికి పంపినందుకు అల్సినస్ మీద కోపంగా ఉన్నాడు. ఇంతలో దూరంగా ఒక గొర్రెలకాపరి కనబడ్డాడు.
“ఏయ్! కాస్సేపు ఆగు. నీతో మాట్లాడాలి. నేను నీకు అపకారం చేసే వ్యక్తిని కాను. దారి తప్పేను. నేను ఎక్కడ ఉన్నాను? ఈ ఊరు పేరేమిటి?”
“చూడ్డానికి కొత్త వాడిలా ఉన్నావ్. మా దీవి అందరికీ తెలిసినదే. ఇక్కడ కొండలు, మిట్టలు ఎక్కువ కనుక ఇక్కడ వానలు బాగా పడతాయి, గడ్డి బాగా మొలుస్తుంది. అందుకని ఇక్కడ గొర్రెలను, మేకలను ఎక్కువగా పెంచుతారు. ఎగుడు దిగుళ్ళు ఎక్కువ కనుక గుర్రాలు తక్కువే. ఇక్కడ ధాన్యాలు పండుతాయి. ద్రాక్షలు గుత్తులుగుత్తులుగా కాస్తాయి. జితకాయలకి మా దీవి ప్రసిద్ధి. జితతైలానికీ ప్రసిద్ధే. మాతో వ్యాపారానికి ట్రోయ్ నగరంనుండి వర్తకులు వస్తూ ఉంటారు. ఈ ద్వీపాన్ని ఇథకా అని పిలుస్తాం.”
ఒడిస్సియస్ తన చెవులను తానే నమ్మలేకపోతున్నాడు. “…ఇదేనా నా దేశం? ఇదేనా నా ఇథకా? ఈ గొల్ల పిల్లవాడు వెటకారం చేస్తున్నాడా? మోసం చేస్తున్నాడా?” ఈ సందిగ్ధాన్ని ఇటో అటో తేల్చడానికి ఒడిస్సియస్ ఒక యుక్తి పన్ని, ఒక కథను అల్లేడు.
“ఆహా! నేనూ అదే అనుకున్నాను. ట్రోయ్ యుద్ధంలో నేను కొల్లగొట్టి తెచ్చుకుంటున్న బంగారాన్ని ఒక దొంగ తస్కరించబోతే వాడిని చంపేసేను. శిక్షనుంచి తప్పించుకుందికి పారిపోయి ఇటు వచ్చేను,” అంటూ అక్కడ ఉన్న బంగారు సామాగ్రిని చూపించేడు.
కోతలు కోస్తున్నాడు కాబోలు అని స్ఫురించేలా ఆ గొర్రెలకాపరి సన్నగా ఒక చిరునవ్వు నవ్వేడు. కనుమూసి తెరిచే లోగా ఆ గొర్రెలకాపరి పొడుగ్గా, మిరుమిట్లు గొలుపుతూ, ధూసరవర్ణపు కళ్ళతో అందాలొలుకుతూన్న ఒక అందమైన అమ్మాయిగా మారిపోయాడు.
“అథీనా!”
“ఒడిస్సియస్! కథలు చెప్పడం బాగా నేర్చేవే. నేనెవరినో నీకింకా తెలియలేదా? నేను నీ సంరక్షకురాలిని. నీ క్షేమం కోరేదానిని. నీకు సహాయం చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చేను. నువ్వు ఇక్కడ ఉన్నావని ఇప్పుడే ఎవ్వరికీ తెలియకూడదని ఈ పొగమంచు నేనే సృష్టించేను. మరేమీ భయపడకు. ఇది నీ దేశమే. ఇది నీ ఊరే”.
“దేవీ! నువ్వు నిజమే చెబుతున్నావని నేనెలా నమ్మను? నేను నిజంగా ఇథకా వచ్చేననడానికి రుజువేమిటి?”
అథీనా తన దండంతో గుండ్రంగా చేతిని తిప్పింది. “ఇప్పుడు చూడు నీ చుట్టూ నీకు పరిచయమైన జితవృక్షాలు కనబడడం లేదూ? అల్లక్కడ, ఆ గుహలో, జలకన్యలు మగ్గాల మీద వస్త్రాలు నేస్తున్నారు, చూడు. అటు చూడు. నీకు పరిచయమైన ఝరీపాతాలు కనబడడం లేదూ? ఇది ఇథకా. సందేహం లేదు”.
ఒడిస్సియస్ చుట్టూ చూసేడు. నిజమే. ఇప్పుడు అన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి. అన్నీ తనకి పరిచయమైన దృశ్యాలే. ఒక్కసారి ఒడిస్సియస్ మోకరిల్లి మాతృభూమిని ఒకసారి ముద్దు పెట్టుకున్నాడు.
“ఇలా రా! ఈ బంగారు సరంజామా, ఈ కంచు సామాను అక్కడ గుహలో దాచుదాం. అప్పుడు తదుపరి కార్యక్రమం ఏమిటో విచారిద్దాం”.
ఇద్దరూ కలసి, బంగారం, కంచు, నూతనవస్త్రాలూ జాగ్రత్తగా గుహలోకి తరలించి ఆ గుహ ముఖద్వారం మీదికి ఒక గండశిలను దొర్లించేరు.
అప్పుడు అథీనా, ఒడిస్సియస్ ఒక శిల మీద సుఖాసీనులయ్యారు. అథీనా చెప్పుకొచ్చింది. “ఒడిస్సియస్! నువ్వు లేని సందర్భాన్ని అవకాశంగా చేసుకుని ఈ పరిసరాలలో ఉన్న పెక్కురు రాకుమారులు నీ రాజ్యంలో తిష్ఠవేసి, నీ ఆస్తిపాస్తులను తినేస్తూ, నువ్వు ఇహ తిరిగి రావటం లేదని వదంతులు పుట్టించి, నీ భార్యను తమలో ఒకరిని పెళ్ళి చేసుకోమని నానా యాగీ చేస్తున్నారు.
“సమయం వచ్చినప్పుడు వారిలో ఒకరిని వివాహం చేసుకుంటానని వారిని మభ్యపరచి, కాలయాపన చేస్తూంది, నీ భార్య పెనలొపీ. కానీ ఒక పరిచారిక మోసం చేసి కాలయాపన వెనక అసలు రహస్యం రాకుమారులకు చేరవేసింది. ఇప్పుడు ఏదో ఒకటి తేల్చుకొమ్మని రాకుమారులు ఒత్తిడి చేస్తున్నారు.”
“దేవీ! చెప్పు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? నువ్వు నా అండన ఉంటే నేను ఆ రాకుమారులందరినీ హతమార్చగలను”.
“నాకు తెలుసు. నీకు ఆ సామర్థ్యం ఉంది. కానీ ముందుగా చెయ్యవలసిన పని ఒకటి ఉంది. నువ్వెవరివో అని కాని, నువ్వు తిరిగి ఇథకా వచ్చినట్లు కాని ఎవ్వరికీ తెలియకూడదు. ప్రస్తుతానికి నీలో ప్రజ్వరిల్లుతూన్న ప్రతీకారజ్వాలలను అదుపులో పెట్టుకో. సమయం పరిపక్వమైనప్పుడు దెబ్బ తీయవచ్చు”.
‘నా ప్రజలు నన్ను చూసి గుర్తుపట్టగలరే, ఎలా?”
“ఆ పని నాకు వదిలేయ్. నీకు ముసలాడిలా మారువేషం వేస్తాను. నీ తల మీద వెంట్రుకలు కొన్ని తీసేస్తాను. నీ చర్మం ముడతలు పడేలా చేస్తాను. నీ దృష్టి మందగించేలా చేస్తాను. నువ్వు ధరించడానికి జీర్ణమైన వస్త్రాలు ఇస్తాను. చూడ్డానికి ఒక ముష్టివాడిలా కనబడేటట్లు చేస్తాను”.
ఇలా అంటూనే అథీనా తన దండంతో ఒడిస్సియస్ని తాకింది. ఒక్క క్షణంలో ఒడిస్సియస్ రూపు మారిపోయింది. ఆకారం మారిపోయింది. దృష్టి బాగా ఆనని ఒక ముసలి ముష్టివాడు, చేతికర్రతో అక్కడ కూలబడ్డాడు.
“ఇహ నీ దారి నువ్వు చూసుకో. నీ పందులను కాసే కాపరి దగ్గరకు వెళ్ళు. అతను మంచివాడు. నీకు నీడని ఇస్తాడు. నేను వెళ్ళి టెలెమాకస్ని తీసుకువస్తాను. అతను నీ కోసం సముద్రంలో ఎక్కడో వెతుకుతున్నాడు”.
6.7 పందులకాపరి
ఒడిస్సియస్ చేతికర్రను ఆలంబనగా చేసుకుని, నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. అక్కడ సముద్రపుటొడ్డున ఉన్న రాళ్ళను రప్పలను దాటుకుని, తనకు పరిచితమైన తన నగరంలోకి ప్రవేశించాడు.
ఎట్టకేలకు ఊరి బయట తన పందుల మందకు సంరక్షణ చేసే తాత కనిపించేడు. ఆ తాత అక్కడ ఒక బండ మీద కూర్చుని పందులను ఒక పక్క కాపలా కాస్తూ, మరో పక్క తోలుతో చెప్పులు తయారు చేసుకుంటున్నాడు. అతని చేరువలో సింహాలలాంటి నాలుగు వేట కుక్కలు పందులకు కాపలా కాస్తున్నాయి.
ఒడిస్సియస్ వాసన పసిగట్టి ఆ కుక్కలు ఒక్కసారి లగెత్తుకొచ్చి, గుర్రుపెడుతూ, చిటపటలాడుతూ, అతనిమీద లంఘించేయి. అది పరిచయం లేనివాళ్ళపై దాడిచేసే లంఘన.
ఒడిస్సియస్ వినయం ప్రదర్శిస్తూ వంగి కూర్చున్నాడు. కుక్కలను అదుపులో పెట్టడానికి పందులకాపరి పరిగెత్తుకుని వచ్చి కుక్కలను తరిమేశాడు.
“ముసలాడా! ఈవేళ నీ సుడి బాగుంది. ఒక్క నిమిషం ఆలస్యం అయుంటే ఆ కుక్కలు నిన్ను చీల్చి చెండాడి ఉండేవి. లే! లేచి, నాతో గుడిసెకి రా. ఇంత తిండి పెడతాను. తిన్న తరువాత నువ్వెవరివో, ఎక్కడనుండి వచ్చావో చెబుదువుగాని”.
కుక్కల్ని బయట కట్టేసి, గుడిసె లోపలికి వెళ్ళి, తోలుతో చేసిన చాప వేసి, ముసలాయనను కూర్చోబెట్టేడు.
“మీ దయకు నేను ఋణపడి ఉన్నాను. ఆ దేవదేవుడు జూస్ మీ కోరికలన్నీ తీర్చి మిమ్మల్ని రక్షించుగాక!” అన్నాడు ముసలి వేషంలో ఉన్న ఒడిస్సియస్.
“నాకున్నది ఒకే ఒక కోరిక బాబూ. నా బుగతబాబు బ్రతికి బాగుంటే నాకంతే చాలు. ఇన్నాళ్ళూ ఆయన పందుల గుంపును జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేను. ఆయన తిరిగి వస్తే నాకు పెద్ద బహుమతే ఇస్తాడు. నాకు ఉండడానికో ఇల్లు, సాగు చేసుకోడానికి కాసింత భూమి ఇస్తాడు. మా రాజు దేశం వదలి ఇరవై ఏళ్ళు అయింది. ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే నాకు అంతే చాలు”.
“ఆయనకు సంసారం ఉందా?”
“ఆయనకోసం ఆయన భార్య, పిల్లడు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈలోగా ఎందరో రాకుమారులు ఆమెను పెళ్ళి చేసుకుందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. ఆయన తల్లి బెంగపెట్టుకుని ప్రాణాలొదిలేసింది. ఆయన తండ్రి విరాగిలా ఊరు బయట ఒంటరిగా ఉంటున్నాడు. ఆయనకొక కొడుకున్నాడు. తండ్రిని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు”.
“ఈ కబుర్లకేమి కానీ, నీకింత తిండి పెట్టి, తాగడానికి ఇస్తాను. అలా ఆ చాపమీద చతికిలబడు.”
కుంపటిలో బొగ్గుల మీద కాలుతూన్న మాంసం ముక్కలను, బార్లీ గింజల్ని ఒక ఆకులో పెట్టి ముందు పెట్టేడు. చిన్న కర్ర చిప్పలో కాసింత సారా పోసి తాగడానికి ఇచ్చేడు.
“ఎప్పుడు తిన్నావో, కాసింత ఎంగిలి పడు. నీతో నేను కూడా తింటాను,” అని పక్కనే చతికిలపడ్డాడు.
అలా వాళ్ళిద్దరూ తింటూ కబుర్లు చెప్పుకున్నారు. కోటలో పాగా వేసి అల్లరి చేస్తూన్న రాకుమారులు పందులను ఎలా చంపి తినేస్తున్నారో చెప్పుకొచ్చేడు. “కొట్టంలో ఉన్న మేలు జాతి పందులను ఈ రాకుమారులు తినేస్తున్నారు. అల్పప్రాణిని, నేను అడ్డుకోలేను. పీపాలకు పీపాల సారా తాగేస్తున్నారు. అన్నిటికంటే అన్యాయం ఏమిటంటే రాత్రనక, పగలనక, రాణిగారిని కాల్చుకు తింటున్నారు. తమలో ఒకరిని పెళ్ళి చేసుకోమని ఇబ్బంది పెట్టేస్తున్నారు. కానీ ఆమె ధర్మాత్మురాలు. వారందరినీ కాదని రాజుగారి రాక కోసం ఎదురు చూస్తోంది”.
“ఆ రాకుమారులు ఆమె అభిప్రాయాన్ని మన్నించి, గౌరవించడం లేదా?”
“లేదు. వాళ్ళు గుంటనక్కలు. రాబందులు. మా రాజును వెతకడానికి వెళ్ళిన యువరాజును చంపడానికి యోచనలు చేస్తున్నారుట!”
ఒడిస్సియస్ అంతా మౌనంగా వింటున్నాడు కానీ లోలోపల ప్రతీకారాగ్ని ప్రజ్వరిల్లుతోంది.
దీనికి తోడు బయట హోరుమని గాలి, భోరుమని వాన మొదలయేయి. పందులకాపరి కర్రచిప్పలో మరికొంచెం ద్రాక్ష సారా పోసేడు.
“ఆకలి దప్పికలు తీరేయనుకుంటాను. ఇప్పుడు మీరెవ్వరో, ఎక్కడనుండి వస్తున్నారో, ఎక్కడకి వెళుతున్నారో సెలవియ్యండి,” అని అడిగేడు.
ఒడిస్సియస్ చిన్న అబద్ధం ఆడేడు. “నేను పుట్టి పెరిగినది క్రీట్ అనే ద్వీపం. నాకు ఎక్కడా కాలు నిలవదు. చాలా ఊళ్ళు కాలు కాలిన పిల్లిలా తిరిగేను. ఇప్పుడు ఇథకా వచ్చేను. నా తిరుగుళ్ళలో ఒక ఆసక్తికరమైన సంగతి తెలిసింది. ఇథకా రాజు ఒడిస్సియస్ ఇంకా బ్రతికే ఉన్నాడుట. రాబోయే అమావాస్యనాడు రాత్రి, అంతా చీకటిగా ఉన్న సమయంలో, ఆయన తిరిగి ఇథకా వస్తాడట. మూడొంతులు మారువేషంలో వచ్చినా రావచ్చునట.”
“మహానుభావా! మా ఆశలు రేకెత్తించవద్దు. ఇదివరలో ఇలాంటి వార్తలు చాలా విన్నాం. ఇదిగో పులి అని ఒకరంటే, అదిగో తోకని మరొకరు. విసిగి వేసారిపోయేం. అలిసిపోయినట్లు ఉన్నారు. ఈ రాత్రికి ఇక్కడే పడుక్కోండి”.
ఆ గుడిసెలో ఒక వార, కటికనేలమీద పంది చర్మం పరుచుకుని, దానిమీద ఒడిస్సియస్ పడుకుని నిద్రలోకి జారుకున్నాడు.
6.8 కుమారుని పునరాగమనం
కలిప్సో దీవిలో ఉంటూ ఒడిస్సియస్ ఇంటికి చేరుకునే ప్రయత్నాలు చేస్తూన్న రోజులలో, అతని కుమారుడు టెలెమాకస్ వేరొక చోట — స్పార్టాలో — ఒక అందమైన రాజప్రాసాదంలో, పట్టుపరుపుల మీద పవ్వళించి, రాజభోగాలు అనుభవిస్తున్నాడు. చెయ్యవలసిన కార్యక్రమం ఏమిటా అని చాలా రోజులనుండి ఆలోచిస్తున్నాడక్కడ.
ఒక రాత్రి, ఈ ఆలోచనలతో నిద్రపట్టక పరుపు మీద దొర్లుతూ ఉంటే, అతని గదిలోకి అథీనా ప్రవేశించింది ఆమెని చూసి టెలెమాకస్ స్పందించేలోగా, అథీనా అతనికి ఒక ఆవశ్యమైన సలహా ఇచ్చింది. “ఇక్కడ కాలయాపన చేస్తూ కూర్చోవద్దు. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఇంటికి వెళ్ళు. అక్కడ నీ ఇంటిని, నీ తల్లిని రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ తొందరలో తొట్రుపాటు తగదు. ఉపసర్పకులు – రాకుమారులు – నిన్ను సంహరించే ప్రయత్నంలో కుట్రలు పన్నుతున్నారు. దారిలో వాళ్ళు నీ మీద ఆకస్మికదాడి చెయ్యవచ్చు. ప్రస్తుతం వాళ్ళు ఇథకా ద్వీపానికి, సామోస్ (Samos) ద్వీపానికీ మధ్యనున్న జలసంధి దగ్గర మాటు వేసి ఉన్నారు”.
“అయితే ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు?”
“నువ్వు ఉత్తరక్షణంలో బయలుదేరి, రెండు ద్వీపాల తీరాలకీ దూరంగా ఉండేలా, జలసంధిలో మధ్యస్థంగా, నీ పడవను నడుపు. నీకు అనుకూలంగా గాలి వీచాలని వాయుదేవుడికి చెప్పి అట్టేపెట్టేను. గమ్యం చేరుకోగానే ఏదో పని కల్పించి నావికులందరినీ పట్టణంలోకి పంపు. నువ్వొక్కడవే ఊరు బయట ఉన్న మీ పందులదొడ్డి దగ్గరకు వెళ్ళి పందులకాపరి ద్వారా నీ రాకను నీ తల్లికి తెలియజేయి”.
ఇలా చెప్పిన తరువాత, మారుప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా, అథీనా అదృశ్యం అయిపొయింది.
ఆలస్యం చెయ్యకుండా టెలెమాకస్ దుస్తులు మార్చుకొని, మహారాజు మెనలెయస్ గదికి వెళ్ళి, “మహారాజా! నేను అత్యవసరంగా ఇంటికి వెళ్ళవలసిన పరిస్థితి ఎదురైంది. మీ అనుమతితో తక్షణం బయలుదేరాలి”.
మెనలెయస్ పరిచారకులను పిలిచి ప్రయాణానికి ఏర్పాట్లు చేసేరు.
మహారాణి హెలెన్ వద్దా, మహారాజు మెనలెయస్ వద్దా ఉపచారవాక్యాలు చెప్పి టెలెమాకస్ రథం ఎక్కేడు. అదే సమయంలో ఒక డేగ ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. దాని గోళ్ళలో చిక్కుకుని ఒక గువ్వ కనిపించింది.
ఇది మంచి శకునమో, చెడ్డదో తెలియక ప్రజలు హాహాకారాలు చేసేరు.
“ఆ డేగ ఒడిస్సియస్కి సంకేతం. ఆ గువ్వ అతని ఇంటికి సంకేతం. కనుక ఒడిస్సియస్ ఇల్లు చేరుకున్నాడు అని దీని అర్థం,” అని రాణి హెలెన్ వ్యాఖ్యానించారు.
“అలాగే అగుగాక!” అంటూ టెలెమాకస్ తన చేతినున్న కళ్ళెం ఝళిపించేడు. గుర్రాలు పరుగు లంకించుకున్నాయి.
రథం పైలోస్ నగరంలో నౌకాశ్రయానికి చేరుకునేసరికి అక్కడ పడవ ప్రయాణానికి తయారుగా ఉంది. టెలెమాకస్ పడవలోకి ఎక్కి, తెరచాపలు ఎత్తమని నావికులకు చెప్పేడు. అథీనా తన వంతుగా మంచి గాలి వీచేటట్లు చేసింది.
అథీనా చెప్పిన ప్రకారం జాగ్రత్తగా జలసంధి మధ్యలోంచి పోయేటట్టు పడవను నడిపించేరు నావికులు. ఏ ఇబ్బంది లేకుండా పడవ గమ్యం చేరుకుంది.
గమ్యం చేరుకున్నాక అథీనా చెప్పినట్లు సిబ్బంది అందరినీ ఊళ్ళోకి ఏదో మిష మీద పంపించేసేడు, టెలెమాకస్.
అప్పుడు తానొక్కడూ తండ్రిని కలుసుకోడానికి ఊరు బయట ఉన్న పందులదొడ్డి వైపు కదిలేడు.
6.9 పునస్సమాగమం
పందులదొడ్డిలో ఉన్న గుడిసె లోపలికి సూర్యుడి లేత కిరణాలు చొచ్చుకుంటున్నాయి. పందులకాపరి నిద్ర లేచేడు. లేచి, చద్ది భోజనము కొరకు ప్రయత్నాలు మొదలెట్టేడు. ఆ అలికిడికి ఒడిస్సియస్ కూడా లేచేడు. గుడిసె బయట పడుకున్న కుక్కలు భౌ భౌ అని గట్టిగా కాకుండా నెమ్మదిగా మొరగడం మొదలెట్టేయి.
“ఎవరో పరిచయస్తులు వస్తూన్నట్లున్నారు,” అన్నాడు ఒడిస్సియస్. “నిన్న నన్ను చూసి గట్టిగా మొరుగుతూ మీదపడ్డాయి. ఇప్పుడు అవి చేస్తూన్న శబ్దమే వేరు. ఎవ్వరో పరిచయస్తులు వస్తూన్నట్లున్నారు”.
ఒడిస్సియస్ నోట్లో మాట నోట్లోనే ఉంది, ఎవ్వరో ఆ గుడిసె తలుపు తెరచుకుని లోపలికి వచ్చేరు.
పందులకాపరి చద్ది భోజనపు ప్రయత్నాలు మధ్యలో ఆపేసి, పరిగెత్తుకుని తలుపు దగ్గరకు వెళ్ళి, వచ్చిన ఆసామీని కౌగలించుకుని, “బాబుగారూ, తిరిగి వచ్చేరా? నాకు కనువిందు ఈ రోజు”.
ఒడిస్సియస్ ఆ ఆగంతకుని వైపు ఎగాదిగా చూసేడు. నవతేజంతో వెలుగుతూన్న ఈ యువకుడిని ఒడిస్సియస్ ఇరవై ఏళ్ళ క్రితం పొత్తిళ్ళలో బిడ్డగా చూసేడు. ఇప్పుడు? ఆ పొడుగు, ఆ విశాలమైన వక్షఃస్థలం, ఎర్రటి జుత్తు, మెరుస్తూన్న ఆ కళ్ళు! దబ్బపండులా ఉన్నాడు. ఎవరో యీ పిల్లడు?
టెలెమాకస్ ఆ పందులకాపరితో, “నిన్ను చూడడం కూడా నా కంటికి విందులాగనే ఉంది. చెప్పు, అమ్మ ఎలాగుంది? నేను వెళ్ళిన తరువాత ఆమెను రాకుమారులు ఇబ్బందులు పెట్టేరా?”
“మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఆమెకు తెలిసిన క్షణంనుండీ ఆమె అతలాకుతలం అవుతున్నారు. మీరు క్షేమంగా తిరిగి వచ్చేరని తెలిస్తే ఆమె ఆనందానికి హద్దులు ఉండవు. రాండి, లోపలి వచ్చి మాతోపాటు కాస్త ఎంగిలి పడండి”.
టెలెమాకస్ గుడిసె లోపలికి వచ్చి, చేతులు రుద్దుకుంటూ కుంపటి దగ్గర కూర్చున్నాడు.
ఒడిస్సియస్ లేచి తాను కూర్చున్న చర్మపు చాపని ఆగంతకుడి ఇచ్చేడు.
“ముసలాయనా! మీరు కూర్చున్న చాప మీరు ఉంచుకోండి. నేను మరొక చాప తెచ్చుకుంటాను”.
ఇలా ముక్తసరిగా మాట్లాడుకున్నారు కానీ ఒకరి ముఖం మరొకరు జాగ్రత్తగా చూసుకునే అవకాశం కలగలేదు. ఒడిస్సియస్ మాత్రం ఆ యువకుడిని తేరిపార చూస్తూనే ఉన్నాడు.
ఈలోగా పందులకాపరి చద్ది భోజన సామగ్రి అంతా పళ్ళేలలో అమర్చేడు. అందరూ తినడం అయిన తరువాత, టెలెమాకస్ అడిగేడు. “సామీ, నా ఎదురుగా ఉన్న నీ అతిథి ఎవరు? ఆయన ఎక్కడనుండి వచ్చేరు? ఏ పడవలో వచ్చేరు?” అంటూ కుశలప్రశ్నలు వేసేడు.
“ఈయన ఒక దేశదిమ్మరి. ప్రస్తుతం క్రీట్ ద్వీపంనుండి వస్తున్నారు. ఈయనను నీకు అప్పగిస్తున్నాను. నీ తండ్రిగారి రాజభవనంలో ఈయనకు మర్యాదలు చెయ్యి”.
“వీలుపడదు,” అనే అర్థం వచ్చేలా తల ఆడించి, టెలెమాకస్ క్షమాపణ కోరుతున్న స్వరంతో ఇలా అన్నాడు: “నీకు తెలియనిది ఏముంది? నా తండ్రిగారి రాజభవనంలో రాకుమారులు – ఉపసర్పకుల బృందం – పిలవని పేరంటంగా వచ్చి తిష్ఠ వేసి ఉన్నారు కదా. పొమ్మంటే పోకుండా ఉన్నారు. నీ అతిథికి కొత్త బట్టలు ఇస్తాను, కొత్త పాదరక్షలు ఇస్తాను, కరవాలం ఇస్తాను. బహుమానాలు ఇస్తాను. ఎక్కడికయినా వెళ్ళదలుచుకుంటే వాహనాలు ఇస్తాను. నువ్వు త్వరగా వెళ్ళి నేను తిరిగి వచ్చేనని అమ్మతో కబురు చెప్పిరా. ఈలోగా నేను ఈయనకు సాహచర్యం ఇస్తాను”.
పందులకాపరి లేచి నిలబడ్డాడు.
“మరొక్క విషయం. నేను తిరిగి వచ్చినట్లు మూడవ కంటివాడికి తెలియకూడదు, తెలిసిందా?”
“అర్థం అయింది,” అని చెప్పి పందులకాపరి బయలుదేరేడు.
పందులకాపరి బయటకు వెళ్ళిన తరువాత ఒక అందమైన, పొడుగాటి అమ్మాయి ఆ గుడిసె గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడింది. టెలెమాకస్ ఆమె రాకను గుర్తించినట్లు లేదు. బయట ఉన్న కుక్కలు పెద్దగా మొరగలేదు కానీ భయపడ్డట్టు తోక ముడిచి, చిన్నగా గుయ్యిమన్నాయి.
ఆ అమ్మాయి ఒడిస్సియస్ని బయటకు రమ్మని సైగ చేసింది. బయట, ఉషోదయపు వెలుగులో ఒడిస్సియస్ అథీనాని గుర్తు పట్టేడు. ఇద్దరూ బయట ఉన్న రాతిగోడ మాటున గుసగుసలాడుకున్నారు.
“ఒడిస్సియస్! నువ్వు ఎవరివో నీ కొడుకుకు చెప్పవలసిన సమయం ఆసన్నమయింది. మీరు ఇద్దరూ కూడబలుక్కుని రాకుమారులమీద ప్రతీకార అస్త్రం ప్రయోగించదగ్గ సమయం ఆసన్నమయింది. నేను మీ వెనకనే దన్నుగా ఉంటాను. నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను”.
ఈ మాటలు చెబుతూ అథీనా తన మంత్రదండంతో ఒడిస్సియస్ శిరస్సును తాకింది. ఒక్క పెట్టున ఒడిస్సియస్ శరీరం మీద మురికి, ముడతలు మాయం అయిపోయాయి. మురికి దుస్తులకు బదులు రాజలాంఛనాలకు అనువైన దుస్తులు వచ్చేయి. బుగ్గలు నిండుగా ఉన్నాయి. కంచు రంగు వర్చస్సుతో తళతళలాడుతున్నాడు. తనలో కలిగిన మార్పుని చూసుకుని అశ్చర్యపోతూ పక్కకి తిరిగేడు. అక్కడ ఎవ్వరూ లేరు.
ఒడిస్సియస్ తిరిగి గుడిసెలో ప్రవేశించాడు ముసలివాడిలో వచ్చిన మార్పును చూడగానే టెలెమాకస్ నోట మాట రాలేదు. నిశ్చేష్టుడైపోయాడు. కళ్ళప్పగించి చూస్తున్నాడు. ఇతనెవరు? ఒలింపస్ పర్వతంనుండి దిగి వచ్చిన దేవదూతా? వణుకుతూ నిలబడి నమస్కారం చేసేడు. “దేవదేవా! తెలిసో, తెలియకో నేను ఏవైనా తప్పులు చేస్తే క్షమించండి”.
“నేను దేవుణ్ణి కాదు, టెలెమాకస్! నువ్వు ఎవరి కోసం రాత్రి, పగలు కలవరిస్తున్నావో, ఎవరి రాకకోసం ఇరవై ఏళ్ళబట్టి ఎదురు చూస్తున్నావో ఆ వ్యక్తిని నేనే. నేను నీ తండ్రిని!”
ఈ మాటలు అంటూ ఉంటే ఒడిస్సియస్ కళ్ళనుండి అశ్రుబిందువులు జలజలా పారేయి.
“నేను నమ్మను. నువ్వు మా నాన్నవి కావు. నువ్వు ఏ భూతానివో మా నాన్న వేషంలో వచ్చేవు. నేను ఇందాకా చూసినప్పుడు నువ్వొక ముసలి మొద్దువి. ఇప్పుడు రాజఠీవితో వెలిగిపోతున్నావు. ఇక్కడేదో మోసం ఉంది”.
“నమ్ము. నేను అమరుడిని కాను. మానవుడినే! నా పేరు ఒడిస్సియస్. ఇరవై ఏళ్ళ క్రితం నువ్వు ఇంకా మీ అమ్మ ఒళ్ళో పసిబాలుడుగా ఉన్నప్పుడే యుద్ధానికి పిలుపు వచ్చింది. పదేళ్ళ యుద్ధం ముగిసిన తరువాత, పదేళ్ళపాటు సముద్రంలో నానా యాతనలు పడ్డాను. చివరికి అథీనా దేవత దయవల్ల ప్రాణాలతో ఇంటికి చేరుకున్నాను”.
ఈ మాటలు వినగానే టెలెమాకస్ ఒక్క ఉదుటున తండ్రిని కౌగలించుకుని వెక్కి, వెక్కి ఏడ్చేడు. తరువాత ఇద్దరూ గట్టిగా ఏడ్చేరు, దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చేరు.
ఇరవై ఏళ్ళ తరువాత తండ్రీ కొడుకుల పునస్సమాగమం జరిగింది.
6.10 ప్రతీకారానికి పన్నాగం
పందులకాపరి గుడిసెలో కూర్చుని తండ్రి, కొడుకు చాలాసేపు మాట్లాడుకున్నారు. గత స్మృతులు, అనుభవాలు, ఆరాటాలు, ఎన్నెన్నో.
“నాన్నా! మీరు ఏ పడవలో వచ్చేరు? మీ సిబ్బంది ఎక్కడ ఉన్నారు? ఇన్నాళ్ళూ మీరు ఎక్కడ ఉన్నారు?”
రాజా అల్సినస్ పడవని, సిబ్బందిని ఇచ్చి ఎలా సహాయం చేసేరో చెప్పుకొచ్చేడు ఒడిస్సియస్. “దారి పొడుగునా ఒంటి మీద స్పృహ లేకుండా నిద్రపోయేను. నేను నిద్ర లేచేసరికి సముద్రపుటొడ్డున ఉన్నాను. రాజా అల్సినస్ ఇచ్చిన బంగారు ఆభరణాలు, కంచుతో చేసిన ఉపకరణాలు నా చుట్టూ గుట్టలుగా పడి ఉన్నాయి. జలకన్యల సహాయంతో వాటినన్నిటిని అక్కడ ఒక గుహలో దాచి పెట్టేను. అప్పుడు అథీనా వచ్చి నిన్ను ఇక్కడ కలుసుకోమని చెప్పి ఇక్కడకు పంపింది. మనం ఇద్దరూ కలిసి అమ్మను వేధిస్తూన్న రాకుమారులను మట్టుబెట్టాలని చెప్పింది”.
(సశేషం)
