అనుకుంటాం కానీ
మనిషి లేకపోతే బతకగలమా?
బతుకుయానంలో ఒంటరితనాన్ని
గుండెమాత్రం ఎన్నాళ్ళు మోస్తుంది?
గాయపడిన కాకి చుట్టూ
జాతిప్రేమ గొంతు చించుకుంటుంది
తేనెటీగల సమష్టి ప్రేమబంధం
నెనరింకిన నాలుకలమీద తీపి సంతకం చేస్తుంది
సామూహిక ప్రభాత భేరిని మోగిస్తున్నట్టు
పిచ్చుకల సందడినుంచి కళ్లు తెరిచే ఉదయాలు
ఎంత కాంతివంతంగా ఉంటాయో!
ఊరికే చెరువొడ్డున
మనసంతా ముక్కలుగా నములుతున్న ఒంటరితనాన్ని
నీటి అలలమీద అడుగులేస్తూ జారిపోయే గులకరాళ్లలా ఎంతసేపని విసరగలం?
చెరువు నీటిని ముద్దాడటానికి
వంగినట్టుగా వేలాడుతున్న
గిజిగాని గూడులోని కీచుశబ్ధ తరంగాలు
అంతరంగ వీణను ఎంత హాయిగా మీటుతాయో!
నాన్న భుజం మీదనుంచి బుజ్జగించి దించిన
నాగలి పొలమంతా నాట్యం చేస్తుంటే
అమ్మతో పాటే పాటే తోడుగా అమ్మలక్కలు ఆ వేదికను నాట్లకర్రలతో అందంగా అలంకరిస్తారు
శ్రమ బంధంలో విరబూసిన మనిషితనం
లోలోపటి మైదానాలకు ఎంత అద్భుతంగా ఆకుపచ్చదనాన్ని అద్దుతుందో!
బతుకు తొవ్వలో నడవాలంటే
ఒంటరితనాన్ని తోడు చేసుకుంటే కుదురుతుందా?
అనుకుంటాం కానీ
మనిషి లేకపోతే అస్సలు బతకలేము