మంకుతిమ్మని మిణుకు – 2 (11-20)

పరబ్రహ్మము

11
ఈశ్వరనెనిప్పవన బెంగడెయె తాం బ్రహ్మ |
శాశ్వతం బ్రహ్మ తాత్కాలికం దేవర్ ||
విశ్వమం నిర్మిసియె నిర్వహిపనీశ్వరం |
నిష్క్రియం పరబొమ్మ -మరుళ మునియ ||

ఈశ్వరు డనెడువాని వెనకున్నదే బ్రహ్మ
శాశ్వతమె బ్రహ్మ తాత్కాలికము వేల్పు
ఈశ్వరునిచే విశ్వ నిర్మితియు నిర్వహణ
నిష్క్రియు పరబ్రహ్మ – మంకుతిమ్మ

అన్నిటికంటే గొప్పది, దానికంటే మరొకటి లేనిదేదో అదే బ్రహ్మము. అది సత్–చిత్–ఆనంద లక్షణమైన సర్వవ్యాపి. జీవులలో ‘నేను’ అన్నదానికి అనుభవముగా గలదే ఆ నిర్గుణ బ్రహ్మము. అది పోలికలేని అప్రమేయము, ఎప్పుడూ ఉండే నిత్యము, మార్పులులేని నిర్వికల్పము, అన్నిటియెడల ఉండే సర్వగతము, ఏదీ చేయని అకర్త, దేనినీ భోగించని అభోక్త.

ఏకమైన నిర్గుణ బ్రహ్మము మాయాసహితంగా అవిర్భవించినదే ఈశ్వరుడు. సృష్టి–స్థితి–లయలకు కారకుడు. బ్రహ్మము శాశ్వతమైతే, ఈశ్వరుడు, దేవుళ్లు (వేల్పులు) తాత్కాలిక పదవిని అలంకరించినవారు. ఈశ్వరుడనబడే వాని వెనుకనున్నది బ్రహ్మము; ఆ బ్రహ్మమే ఈశ్వరుని ద్వారా విశ్వ నిర్మాణం మరియు నిర్వహణ చేయించును. బ్రహ్మము తాను మాత్రం నిష్క్రియుడు. ఈశ్వరుడు కార్యబ్రహ్మ. పాప–పుణ్యాలు, కర్మఫల నియమాలు — ఇవన్నిటినీ నిర్వహించువాడు క్రియాశీలుడైన ఈశ్వరుడు.

సత్యం ఒకటే. ఈ పరమార్థ సత్యం ఆద్యంతాలు లేనిది, అగాధమైనది. దానినే బ్రహ్మమని అన్నారు. సత్–చిత్–ఆనందమే దాని స్వరూపం. ఈశ్వరుడు–జగత్తు–జీవులు అనేక రూపాలుగా మాయాధారితంగా భాసిస్తాయి. దీనినే సగుణ బ్రహ్మము అంటారు. అద్వైతంలో పరబ్రహ్మము మార్పులేని, నిర్మలమైన, నిర్గుణమైనది. అది పరిమాణం లేని నిరాకారము, జన్మ–మృత్యువులు లేని ‘అజ’ము, రెండవది లేని అద్వితీయము. ఏకమైన పరబ్రహ్మము మాయారహితము. మాయాసహితుడే ఈశ్వరుడు, జగత్తుకు కారణభూతుడు. ఈశ్వరునికి ఉపాధి ఆధారితమైన లక్షణాలున్నాయి — సత్త్వగుణాధికంగా ఉండే సర్వజ్ఞత, విశ్వాన్ని సృష్టించే సర్వశక్తిమత్వం, మరియు సర్వవ్యాపకత్వం. జగత్కర్తగా బ్రహ్మ, జగద్ధారిగా విష్ణు, లయకర్తగా శివుడై వర్తించే త్రిమూర్తి తత్త్వము ఈశ్వరుడే.

బంగారం పరబ్రహ్మమైతే, ఆభరణాలు సృష్టించబడిన దాని రూపాలు. వాస్తవంగా ఉండేది బంగారమే కాని, అది లేని ఆభరణానికి అస్తిత్వం లేదు. ఈశ్వరుడు–జీవుడు–జగత్తు ఇవన్నీ బ్రహ్మోపాధికమైన భేదాలు. ఉపనిషత్ మహావాక్యాల భావంలో, అది (బ్రహ్మము) ‘నీవే’ (తత్త్వమసి); అది తెలిసినపుడు ‘నేను బ్రహ్మస్వరూపుడను’ (అహం బ్రహ్మాస్మి).

పరబ్రహ్మము ఉపాధిరహితం. మాయోపాధి ఆధారితుడే ఈశ్వరుడు — మాయను సాధికారంగా నిర్వహించే సమర్థుడు. ఈశ్వరభావంలో అంగీకరించే సృష్టి–స్థితి–లయలు పరబ్రహ్మములో లేవు. పరబ్రహ్మము అంతిమ సత్యం; ఈశ్వరత్వం తాత్కాలికమైన ఉపాధిని ఆధారంచేసుకున్న ప్రదర్శన. మాయోపాధితో కనిపించేది ఈశ్వరుడు; అవిద్యోపాధిబద్ధుడే జీవుడు. మాయలేని ఈశ్వరుడే బ్రహ్మము; ఉపాధి లేని జీవుడూ బ్రహ్మమే. అలా జీవ–ఈశ్వర–బ్రహ్మములు అన్నీ ఒకటే. భేదాలన్నీ ఉపాధికృతం. ఉన్నది ఒకే సత్యం. శంకరులు అందులో మూడు స్థాయిలను వివరించారు —
బ్రహ్మము మాత్రమే ఉంది అనేది “పారమార్థిక సత్యం”;
దైనందిన జీవితంలో మనం అనుభవించే ప్రాపంచిక వాస్తవికత “వ్యావహారిక సత్యం”;
కలలు, కలలో చూసిన వస్తువులు, తాడును పాముగా భ్రమించడం వంటి వ్యక్తిగత అనుభూతికి పరిమితమైనది “ప్రాతిభాసిక సత్యం”.

నిరుపాధికమైనది నిర్గుణ పరబ్రహ్మము. మాయోపాధితో ఉన్న సగుణ బ్రహ్మమే ఈశ్వరుడు. అవిద్యను ఉపాధిగా కలిగిన పరిమితుడే జీవుడు. ఈశ్వరుని వలన సృష్టి కనిపిస్తుంది; కర్తృత్వం–నియంత్రణ గోచరిస్తాయి; సర్వజ్ఞత ప్రతిబింబిస్తుంది — ఇదే సగుణ బ్రహ్మత్వం. సగుణ బ్రహ్మము తాత్కాలికమైతే అది ఎందుకు అవసరం? శరీరమే నేను అనే పరిమిత అహంకారంతో, ద్వైతభావంలో ఉన్న జీవునికి నిర్గుణ బ్రహ్మ గ్రహణం అసాధ్యం. కనుక ఉపనిషత్తులు ముందుగా ఈశ్వరుని గుణాలతో, రూపాలతో, కర్తృత్వంతో జోడించి ఉపాసనలను పేర్కొంటాయి. సగుణ బ్రహ్మోపాసన జీవునిని శుద్ధి చేసి నిర్గుణ బ్రహ్మజ్ఞానానికి అర్హత కలిగిస్తుంది.

12
ఉసిరేను హసివేను అళువేను నగువేను |
బిసియేను తణివేను హొసహొళపదేను ||
అసువినెల్లనుభవంగళు బ్రహ్మ చైతన్య |
రసవిసరవల్లవే -మరుళ మునియ ||

హాసమా ఏడ్పులా ఆకలా ఊపిరియ?
వేసవియ? శైత్యమో థళథళితమేమి?
శ్వాసి యనుభవములన్నియు బ్రహ్మ చైతన్య
రాస్యవిస్తరమె గద – మంకుతిమ్మ

మన ఉపిరివెనుకనున్న ప్రాణశక్తిలో ప్రాణాపాన సమానోదాన వ్యానములను పంచప్రాణముల క్రియలున్నవి. అవన్నిటివెనుకనున్న శక్తి బ్రహ్మచైతన్యమే. మన ఏడ్పు, నవ్వు, ఆకలి, మనము అనుభవించు వేడిమి, శీతలము, స్ఫురణములు, వెలుగులు ఇవన్నీ బ్రహ్మచైతన్యవిభూతులే. మనలోని ఇలాంటి అనుభవాలు, మనచుట్టూ ఉన్న ప్రకృతిలో ప్రకటమౌతున్న అన్ని చేష్టితములు, వికారాలూ ఇవన్నీ బ్రహ్మచైతన్య రసంయొక్క విస్తారములే (రాస్యవిస్తరము). శ్రుతివాక్యాలను నెమరువెసుకొంటె, “ఈశావాస్యమిదగమ్ సర్వం” “నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః । అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః”. “నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్ , ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్ నిమిషన్నపి (గీత), ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ (గీత) మొదలైన శ్రుతివాణి ఈ భావాన్నే ప్రబోధిస్తుంది.

“యేన జీవంతి” (ప్రశ్నోపనిషత్తు) ఆ పురుషుడి నుండి వెలువడే ఈ పదహారు కళల వల్లే జీవులు జీవిస్తున్నారు. శరీరంలోని ప్రాణశక్తులు, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు – ఇవన్నీ ఆ అంతర్గత పరమాత్ముడి కళలే. మనిషి జీవితానికి ఆధారమైనదే ఈ మూలశక్తి. ప్రపంచం వెనుక, శరీరేంద్రియమనోబుద్ధుల వెనుక, మన భావోద్వేగ శక్తి చేష్టల వెనుక, అన్నిటి వెనుక దాగియున్నది ఒకటే, సాక్షిచైతన్యమైన బ్రహ్మవస్తు. ఊపిరి, నడక, ఆలోచన – ఏ క్రియ నడుస్తున్నా దాని వెనుక ఉన్న జీవశక్తి ఆత్మ చైతన్యం. కౌషీతకీ ఉపనిషత్తు “ప్రాణో హ్యేష యః సర్వభూతైః విభాతి” – పనిచేసే శ్వాసకు, ఆ ప్రాణనికి ఆధారం బ్రహ్మ చైతన్యం అంటున్నది. మన ఆహార బుద్ధి, ఆకలి అన్నీ బ్రహ్మమే (అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ – తైత్తీరీయము). అంటే ఆకలే బ్రహ్మం కాదు. ఆకలి అనుభవించబడు సందర్భంలో ఉన్న ప్రత్యభిజ్ఞ (చైతన్యం) బ్రహ్మము. అది హృదయగుహలో అద్వితీయ పరమ చైతన్యంగా దాగి ఉన్నది (యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ (ముండకోపనిషత్తు). మనస్సు ఒక పరికరం. దానికి వెలుగు ఆత్మ. ఆ చైతన్యమే ఆత్మ. అదే మనస్సుకు వెలుగుని ఇస్తున్నది (మనః ప్రజ్ఞా సమన్వితా). శరీరపు వేడి, స్పందన, జీవక్రియలు, భావాల మార్పులు, నిద్ర-స్వప్న-జాగరణ, జ్ఞాపకాలు ఇవన్ని మార్పలు. ఈ మార్పలన్నీ చైతన్యరసంయొక్క విస్తారములే.

ఉపనిషత్తులు ప్రాణాన్ని సాధారణ జీవశక్తిగా కాక, బ్రహ్మచైతన్యపు ప్రత్యక్ష వ్యక్తీకరణగా వివరిస్తాయి. “ప్రాణో బ్రహ్మ” – కౌషీతకి ఉపనిషత్ (ప్రాణమనేది బ్రహ్మమే) ; “యేన ప్రాణః ప్రణితి” — కేనోపనిషత్ (ప్రాణమే ప్రాణానికి ఆధారం కాదు – ప్రాణము ఏ చైతన్యంవల్ల నడుస్తుందో, అదే బ్రహ్మ) ; అందువల్ల మన శ్వాస వెనుక ఉన్న శక్తి జడమైన వాయువు కాదు, చైతన్యస్వరూపమైన బ్రహ్మమే. బ్రహ్మమే అన్నమయంగా వ్యక్తమవుతున్న రూపాలు. ఆకలి తీర్చే జీర్ణాగ్ని కూడా బ్రహ్మచైతన్యమే. అదే శరీరంలో అగ్నిరూపంగా పనిచేస్తున్నది. (“అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః | ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్” – భ.గీ).

ప్రకృతి కూడా స్వతంత్ర సత్తా కాదు. బ్రహ్మ ఆజ్ఞవలనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, వాయువు వీస్తున్నాడు, నీరు ప్రవహిస్తున్నది –“యస్య ఆజ్ఞయా సూర్యచంద్రౌ విధృతౌ తిష్ఠతః” — బృహదారణ్యకం. అనుభవరీత్యా చెప్పాలంటే, శరీరేంద్రియాలు జడము. ప్రాణవాయువూ జడమే. జడమైన వాటి సమ్మేళనంతో ఆకలి, దప్పి, బాధ, ఆనందం వంటి అనుభూతులు ఎలా వస్తాయి? విద్యుత్ ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ పరికరం పనిచేస్తుంది. విద్యుత్ లేకపోతే అన్నీ నిలిచిపోతాయి. అలాగే, ప్రకృతి ఒక్క పరికరం. బ్రహ్మచైతన్యం విద్యుత్తు. చైతన్యం లేకుంటే ప్రకృతిలో చలనం ఉండదు. గాఢనిద్రలో శరీరం లేదు, ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, ప్రపంచం లేదు. కాని లేచిన తర్వాత “సుఖంగా నిద్రించాను” అంటున్నాము. ఆ సుఖానుభవానికి సాక్షి ఎవరు? అదే బ్రహ్మచైతన్యం ,అవస్థాతీతమైన సాక్షి.

జడము జడాన్నే ఉత్పత్తి చేయగలదు. చైతన్యం జడంలోనుంచి పుట్టదు. అందువలన మన ఉపిరి వెనుకనున్న ప్రాణశక్తి బ్రహ్మచైతన్యమే. ఆకలి, దప్పి, శితోష్ణాలు బ్రహ్మ విభూతులే .ప్రకృతిలోని చేష్టితాలు, వికారాలు బ్రహ్మచైతన్య విస్తారాలే. అనుభూతి ఉన్నచోట తప్పనిసరిగా చైతన్యాధిష్ఠానం ఉండాలి. ఆ చైతన్యమే బ్రహ్మచైతన్యం.

13
సతత కల్లోలముఖ నోడు మేల్గడె జలధి |
వితత శాంతియ రాశియదు తెరెగళడియోళ్ ||
కృతక సంసారి దశె మేలంతు బొమ్మంగె |
స్వత అవను నిశ్చేష్ట – మరుళ మునియ ||

సతత కల్లోలముఖమును చూడు జలధిపై
వితత శాంతి సముచ్ఛయము తెరల దిగువ
కృతక సంసారి దశ పైనట్లు బ్రహ్మకున్
స్వత: నిశ్చేష్టితుడు – మంకుతిమ్మ

కొంచెం దూరం నుంచి సముద్రాన్ని చూస్తే మనకు ఏమి కనిపిస్తుంది? అలలు ఒకదానితో ఒకటి తాకుకుంటూ, ఊగుతూ, శబ్దంతో, నురుగుతో పెద్ద ఆర్భాటంగా కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ అది సముద్రపు పైభాగం మాత్రమే. అదే సముద్రంలో కొద్దిగా లోతుకు వెళ్తే, అక్కడ అలల గందరగోళం ఉండదు. శబ్దం ఉండదు. అక్కడ ఎప్పటికీ నిలిచే నిశ్చలమైన ప్రశాంతత మాత్రమే ఉంటుంది. అలలు పైపై కదలికలు; లోతుల్లో మాత్రం ప్రశాంతమైన స్థిరత్వం ఉంటుంది.

అదే విధంగా, పరబ్రహ్మలో ఎప్పుడూ ప్రకాశించే ఆనందస్వరూపమే ఈ ప్రపంచంగా, సంసారంగా కనిపిస్తోంది. లోకంలో మనుషులు చేసే పనులు, వారి ప్రేమలు, ద్వేషాలు, కలహాలు, గెలుపులు, ఓటములు—ఇవన్నీ సముద్రం మీద కనిపించే అలల వంటివే. కానీ మన దృష్టిని బయట నుంచి లోపలికి, ఆత్మ వైపు తిప్పి చూస్తే, అక్కడ ఎలాంటి కలకలం ఉండదు. ప్రేమ–ద్వేషాలు లేవు. సుఖ–దుఃఖాలు లేవు. మనుషుల పనులు, భావోద్వేగాలు అక్కడ కనిపించవు.

ఆ లోతులో ఉన్నది అపారమైన శాంతి. అది మచ్చలేని సత్తా. అది శుద్ధమైన చైతన్యానంద స్వరూపమైన బ్రహ్మ. ఆ బ్రహ్మకు చేసే పనులు లేవు. కోరికలు లేవు. కర్తృత్వం లేదు. అది కదలికలేని, చర్యలేని స్వచ్ఛమైన చైతన్యం. సృష్టి, స్థితి, లయ అనే మార్పుల అలలతో దానికి ఎలాంటి సంబంధం లేదు. అందుకే, ప్రపంచం అలల వలె పైభాగంలో కనిపిస్తే, బ్రహ్మ మాత్రం లోతుల్లో ఉన్న నిశ్చలమైన సముద్రంలా ఉంటుంది.

ఉపనిషత్తులు కూడా ఇదే చెబుతాయి. పరబ్రహ్మకు మార్పులు లేవు, అది క్రియలేనిది, కర్త కానిది అని స్పష్టంగా చెప్పాయి. కఠోపనిషత్తు “అశరీరం శరీరేషు” అని, శ్వేతాశ్వతర ఉపనిషత్తు “దానికి చేయవలసిన పని ఏదీ లేదు” అని, బృహదారణ్యక ఉపనిషత్తు కూడా బ్రహ్మకు సంకల్పం లేదని వివరిస్తాయి. మాండూక్యోపనిషత్తు తురీయ స్వరూపాన్ని “నిశ్చలమైన, శాంతమైన బ్రహ్మ”గా స్పష్టంగా చెప్పింది.

ఈ విధంగా మార్పులేని బ్రహ్మనే ఆధారంగా తీసుకుని, ఈ ప్రపంచం పుట్టడం–నశించడం వంటి మార్పులతో అలజడిగా కనిపిస్తుంది. కానీ ఈ ప్రపంచ చలనం అంతా మాయ వల్ల కనిపించే భ్రమ మాత్రమే. నదులు చివరకు సముద్రంలో కలిసిపోయినట్లే, అన్ని నామరూపాలు చివరకు బ్రహ్మలోనే లీనమవుతాయి. ఈ మార్పులు బ్రహ్మను ఏమాత్రం మార్చవు. బ్రహ్మ మాత్రం ఎప్పటికీ అచలంగా, శాశ్వతంగా నిలిచివుంటుంది.

అందువల్ల ఉపనిషత్తుల సారాంశం ఏమిటంటే—బ్రహ్మ నిత్యంగా నిశ్చలమైనది; ప్రపంచం మాత్రం దాని మీద కనిపించే అలల వంటిది. “ఇక్కడ భేదం ఏమాత్రం లేదు” అనే వాక్యం, ప్రపంచ వైవిధ్యం నిజం కాదని, ఏకమైన సత్యమే ఉన్నదని తెలియజేస్తుంది. లోకంలో కనిపించే ఆర్భాటం, చలనం అన్నీ పైపై భాసలు మాత్రమే. వాటికి ఆధారమైన పరబ్రహ్మ మాత్రం ఎప్పుడూ కదలకుండా, నిర్వికారంగా, నిశ్చలంగా ఉంటుంది. ఆ బ్రహ్మ వెలుగులోనే ఈ ప్రపంచం అంతా కనిపిస్తోంది.

14
కొంబెరెంబెగళెలెగళలుగువువు మేలుగడె |
కంబదంతచలవలె మరద బుడ ముండ ||
జృంభిపుదు జీవాళి మాయానిలదొళంతు |
కంపిసను పరబొమ్మ – మరుళ మునియ ||

కదలుచుండును కొమ్మ రెమ్మలాకులు పైన
కదలని స్తంభమ్ము కాండ మూలములు
పొదలు జీవాళి మాయానిలములోనటుల
కదలడు పరబ్రహ్మ – మంకుతిమ్మ

భూమిమీద స్థిరంగా నిలిచిన మహత్తర వృక్షమును మనం పరిశీలిస్తే, దాని పైభాగంలోని కొమ్మలు, రెమ్మలు, ఆకులు వాయుగత్యానుసారంగా ఊగుచూ, కదలాడుచూ నాట్యమాడుతున్నట్లుగా దర్శనమిస్తాయి. గాలివేగం పెరిగినకొద్దీ వాటి చలనం తీవ్రమవుతుంది; శబ్దమూ, కలకలమూ, కంపనమూ సమస్త వృక్షాన్ని ఆవరించునట్లు అనిపిస్తుంది. కాని ఆ ఆర్భాటమంతటికీ ఆధారమైన వృక్షకాండము మాత్రం నిశ్చలంగా, స్థిరంగా, స్థాణువులా నిలిచియుంటుంది. ఎంతటి గాలి వీచిననూ కదలేది రెమ్మలే, ఆకులే; కాండము కదలదు.

ఈ దృష్టాంతమే జగత్ స్వరూపాన్ని అవగాహన చేసుకునేందుకు కీలకంగా నిలుస్తుంది. కదలాడే ఈ జగత్తు ఆకులు, రెమ్మలు, కొమ్మలవంటిది. ప్రకృతి ఋతుచక్రములు మారినపుడు కొమ్మలు ఎండిపోవును, ఆకులు రాలును; అనంతరం నూతన ఋతుశ్రవణ సమయంలో మళ్ళీ పుష్పించును, పుష్టిపొందును, వెలసి విరాజిల్లును. విరుగుట, రాలుట, పుట్టుట, పెరుగుట — ఈ చతుర్విధ చలనాలే ప్రకృతిస్వభావము. ఇదే డి.వి.జి. పేర్కొన్న “మాయానిలము”. మాయయను గాలి వీచునపుడే జీవసమూహములు వర్ధిల్లుతూ వికసించి జగద్రూప తరంగాలుగా విహరిస్తాయి. జీవితం అంతటా కదలికే ప్రాణంగా కనిపిస్తుంది. కాని ఈ విశ్వరూప చలనమునకు అధిష్ఠానంగా నిలిచిన పరబ్రహ్మతత్త్వము మాత్రం నిష్క్రియము, నిశ్చేష్టము, నిర్వికారము. అది కదలదు; కదలవలసిన అవసరమూ లేదు.

వృక్షములో కొమ్మ విరిగినా, ఆకులు రాలినా, రెమ్మ ఎండినా కాండము ఏ మార్పునూ పొందక స్థిరంగా నిలిచియుంటుంది. అలాగే జగత్తులో సంభవములు–నాశములు, జనన–మరణ చక్రములు, విగ్రహములు–వినాశములు, హర్ష–శోక–ఆర్భాట–కలకలములు ఏవెన్నో జరుగుతూనే ఉన్నా, పరబ్రహ్మ స్వరూపము మాత్రం అచలంగా, అనంతంగా, నిష్కంపంగా, నిష్క్రియంగా నిలిచియుంటుంది.

శంకర భగవత్పాదులు ఈ తత్త్వాన్ని—“వికారో నామరూపం తు మాయామాత్రమ్” అని స్పష్టంగా నిర్దేశించారు. వికారములు నామరూపాభాసములే గానీ, నిజస్వరూపములు కావు. జగత్తు కదిలినా (కొమ్మలు), బ్రహ్మ–ఆత్మ (కాండము) అచలమే — “అచలోఽయం సనాతనః”, “న తస్య కార్యం కారణం చ విద్యతే” అని శాస్త్రం ప్రకటిస్తుంది; ఆ పరబ్రహ్మకు చేయవలసిన కార్యమూ లేదు, కర్తృత్వమూ లేదు. అది స్వతః నిష్క్రియము. ఉపనిషత్తులు బ్రహ్మను “ప్రపఞ్చోపశమం శాంతం శివమ్ అద్వైతమ్”, “నిష్క్రియం శాంతం బ్రహ్మ” అని వర్ణిస్తాయి. ప్రపంచ చలనం ఉపశమించిన ఆ స్థితియే బ్రహ్మ; అది శాంతము, శివము, అద్వైతము. ఈ బోధనే “కాండము కదలదు, క్రియ చేయదు” అనే భావంలో సారాంశంగా నిలుస్తుంది.

పరబ్రహ్మకు కర్తృత్వము లేదని, చేష్టితములు లేవని డి.వి.జి. ఒక సరళమైన కానీ లోతైన తరువు దృష్టాంతంతో వివరిస్తారు. చెట్టులో పైభాగంలోని కొమ్మలు, రెమ్మలు, ఆకులు విస్తారంగా విహరిస్తూ కదలాడుతుంటాయి; కాని అవన్నిటికీ ఆధారమైన చెట్టు కాండము మాత్రం ఎప్పుడూ స్తంభంలా నిలబడియుంటుంది. మాయయను గాలిలో జీవసమూహములు విజృంభించి ప్రకాశిస్తాయి. ఆకులు, కొమ్మలు, రెమ్మలే ఈ జగత్తు; వాటిని కదలించునది గాలి అనే మాయ. కొమ్మలు విరిగి, ఆకులు రాలినా మళ్ళీ కొత్తగా పుట్టి నవవసంతంలో నవనవలాడుతాయి. అదే విధంగా ఈ జగత్తు ప్రకృతి ఋతుమానాలను అనుసరించి పుట్టి, పెరిగి, గిట్టి, మరల పుట్టుచునే ఉంటుంది. వైకార్యాల కొమ్మరెమ్మలు పైభాగంలో అల్లాడుతుంటే, ఆ చెట్టు కాండము నిర్వికారంగా నిలిచినట్లే, క్రియాత్మకమై కంపించే జగత్తుకు ఆధారమై నిలిచియున్నది — నిష్కంపితమైన నిష్క్రియ పరబ్రహ్మ.

15.
చరచర్యలోకదొళ్ స్థిర పురుషతనవొందు |
పురుషత్వదొళ్ స్థిరం ప్రగతిమతియొందు ||
స్థిరలక్ష్యవాపథదొళాత్మదున్నతియొందు |
పరమస్థిరం బ్రహ్మ -మరుళ మునియ ||

చరచర్య లోకమున స్థిర పౌరుషమ్మొకటి
స్థిరము పురుషత్వమున ప్రగతి మతియొకటి
స్థిరలక్ష్య మాగతిన్ ఆత్మోన్నతియదొకటి
పరమస్థిరము బ్రహ్మ – మంకుతిమ్మ

అన్ని చలనముల వెనుక అచలముగా ఉన్నది ఒక్కటే. అది స్థిరము. ఎలాగంటే, చరమై కనిపించు అన్నిటికి స్థిరమైనదే ఆధారం. సదా పరివర్తనశీలమైనది ప్రకృతి. ఈ చరమైన చర్యల జగతిలో నరుడు తాను నిరంతరంగా సాగాలనే కాంక్ష, ప్రయత్నము స్థిరమైనది. స్థిరమైన పురుషప్రయత్నంలో సుస్థిరంగా సాగవలసినదే ప్రగతి. విజ్ఞానం, తంత్రజ్ఞానం, భాషలు, చరిత్ర, తత్త్వము, కళలు — ఇవన్నీ మనుజుని “ప్రగతిమతి” చిహ్నాలు. ప్రగతిలో సదా ఎదగడానికి కావలసినది స్థిరమైన లక్ష్యం. అన్ని ప్రగతులూ మన శాంతి-సౌఖ్యాలకోసమే.

ఐహిక భోగప్రగతి మనకు అందించే సౌఖ్యాలు వచ్చి పోతూ ఉంటాయి. అవి పరస్పర స్పర్ధలకు హేతువై, తుదకు మమ్ములను క్షోభలో పడేస్తాయి. అలాగైతే స్థిరమైన శాంతి ఎక్కడ? ఆత్మలోనే. అన్ని ప్రగతులు అందించేది ఖండసుఖమైనా, దాని పర్యవసానం అఖండమైన ఆత్మలోనే. అదే వివేకప్రగతి. మన బుద్ధి నిత్య-అనిత్యాలను గ్రహిస్తే అదే వివేకం. ఆ వివేకంతో సత్యాన్ని కనుగొనేదే ఈ చరమైన లక్ష్యాల సోపానాలకు స్థిరమైన తుది లక్ష్యం. అదే ఆత్మోన్నతి.

అందుకనే అన్ని లక్ష్యాలకంటే ఉత్కృష్టమైనది ఆత్మోన్నతి. “ఆత్మోన్నతి”యే స్థిరమైన బ్రహ్మము. చరమైన మన ప్రగతుల వెనుక స్థిరమైన బ్రహ్మస్మరణ ఉండాలి. దాని ప్రేరణతోనే మన అన్ని ప్రయత్నాలూ ప్రగతిపథాన సాగి ఫలిస్తాయి.

చరమై కనిపించే సమస్తానికి ఒక స్థిరాధారం ఉంది. అనిత్యమైన వాటిలో నిత్యమైనది, చేతనములైన జీవులలో పరమచేతనమైనది—
అదే బ్రహ్మ (నిత్యోఽనిత్యానాం చేతనశ్చేతనానామ్ — కఠోపనిషత్ 2.2.13). “అనిత్యేషు నిత్యం విచిన్వన్” (అనిత్యమైన వాటిలో నిత్యమైనదాన్ని గుర్తించేవాడు జ్ఞాని) అంటే—మారే వాటిలో మనస్సు చిక్కుకోకుండా, మారనిదైన బ్రహ్మాన్ని ఆధారంగా పెట్టుకోవాలి. మారే శరీరం, మనస్సు, సంఘటనలు అన్నీ అనిత్యాలు. వాటిని ధరిస్తున్న సాక్షిచైతన్యం మాత్రం నిత్యం. చరంలో స్థిరాన్ని మరచినది కర్మబంధము. చరంలో స్థిరాన్ని స్మరిస్తూ చేసే కర్మ మన సాధన. ఉద్యోగం, సంపాదన, పేరు, విజయాలు—ఈ ప్రగతులన్నీ చరమైనవే. ఇవన్నీ కాలంతో మారిపోతాయి.

“ఇది మారింది” అని చెప్పాలంటే, “ముందు ఎలా ఉంది” + “ఇప్పుడు ఎలా ఉంది” అనే పోలిక కావాలి. పోలిక చేయగలిగే ఒక స్థిరమైన ప్రమాణం లేకుండా మార్పు గుర్తించలేం. గడియారంలో సూది కదులుతోందని మనం చెబుతాం. కానీ గడియారం డయల్ స్థిరంగా ఉండకపోతే కదలికను గమనించలేము. చలనం గుర్తించాలంటే స్థిర నేపథ్యం తప్పనిసరి. ఇది వస్తుపరమైన తర్కము. వ్యక్తిగతంగా యోచిస్తే, చిన్నప్పుడు ఉన్న శరీరం నాకు ఇప్పుడు లేదు; నిన్నటి ఆలోచనలు ఇవాళ లేవు; వచ్చి పోతూ ఉండే ఆనందం, దుఃఖం. కాని ఒక విషయం మారలేదు—ఈ మార్పులను గమనిస్తున్న “నేను” అనే సాక్షి. మార్పును గమనించే వాడు తానే మారిపోడు. ఇదే “నిత్యం-అనిత్యం” వీటిని విడదీసే వివేకం. ఆ విధంగా స్థిరమైన బ్రహ్మతత్త్వం లేనిదే చరమైన జగత్తు అనుభవానికి రాదు. పరమస్థిరమైనదే మన స్వరూపమైన బ్రహ్మము.

16
కన్నడియెదురు నింతు మానవను తన్న లా-|
వణ్యగళ నోడి నోడుత హిగ్గువంతె ||
చిన్మయం సృష్టి చిత్రది తన్న వీర్య సం-|
పన్నతెయననుభవిప – మరుళ మునియ ||

తన్మయుం డద్దమున కెదురుగా నిలచి లా-
వణ్యముల తిలకించి మురిసిపోవునటు
చిన్మయుడు సృష్టి చిత్రమున తన వీర్య సం-
పన్నము ననుభవించు – మంకుతిమ్మ

ఆదిలో ఏదీ లేదు. ఏదీ లేని స్థితిలో ఈ జగత్తు పుట్టిందని అన్నారు కొందరు. అది అసత్కార్యవాదం. లేనిది ఎలా పుట్టగలదు?
ఉన్న’పాలే’ మార్పుచెంది ’పెరుగు’ అయినట్లుగా ఈ సృష్టి ఏర్పడిందని అన్నారు మరికొందరు. అది పరిణామవాదం.
ఏదీ లేదూ, ఎప్పుడూ లేదూ, ఇప్పుడూ లేదూ—అంతా హుళక్కి అన్నారు కొందరు. వారిది శూన్యవాదం.

ఇవన్నీ కాదు. ఉన్న వస్తువు ఒక్కటే. అది కనబడటానికి తనకు రూపములేదు; కానీ అది మరోలా విశేషంగా కనబడుతూ ఉంది. ఆకారంగా కనబడితే కంకణమో, ఉంగరమో, హారమో—ఇలా నానా ఆకార, నానా నామముల పదార్థాలే గాని, ఆకారమే లేనియెడల అది ఒక్క బంగారమే కదా. ఆ విధంగా ఈ సృష్టి బ్రహ్మమునకు అన్యముకాదు. బ్రహ్మమే ఇలా కనబడుతూ ఉన్నది. సృష్టి వాస్తవ పరిణామం కాదు ’వివర్తం’; అది అవిద్య వల్ల కనిపించే ఆభాసం. విశేషేణ వర్తతే ఇతి వివర్తః అన్నారు వివర్తవాదులు.

అద్దములో తన లావణ్యాన్నే చూసి పొంగిపోయే మనిషిలా, తన ఈ విశాల అనూహ్య సృష్టిచిత్రాన్ని మాయగా సృజించి, తన శక్తి సంపదలను తనే చూసుకొని ఆనందించే ఆ చిన్మయుడే ఆనందస్వరూపుడైన బ్రహ్మ. “సోఽకామయత – బహు స్యాం ప్రజాయేయ” – నేను అనేకముగా అవ్వాలి; సృష్టిగా విస్తరించాలి (తైత్తిరీయ ఉపనిషత్ 2.6) — ఇది లోపం వల్ల పుట్టిన కోరిక కాదు. ఇది ఆనందపు లీల. బ్రహ్మము స్వయంగా ఆనందస్వరూపమై, మాయ అనే అద్దంలో తన శక్తి వైభవాన్ని దర్శించి, తానే దృక్ , తానే దృశ్యం, తానే ఆనందమై లీలారూపంగా విస్తరించినది.

బ్రహ్మకు ఏ అవసరమూ లేదు. ఏ లోపమూ లేదు. అయినా సృష్టి జరుగుతోంది. ఇది కామ్య సృష్టి కాదు. ఇది ఒక కళాకారుడు తన చిత్రాన్ని చూసి మౌనంగా తృప్తి చెందడం; ఒక శాస్త్రవేత్త తన సిద్ధాంతం సాకారం అయినప్పుడు పొందే ఆనందం; ఒక సాధకుడు ధ్యానంలో తానే తాను దర్శించుకునే క్షణం. ఇక్కడి ఆనందం బాహ్య వస్తువుల వల్ల కాదు—తన స్వశక్తి ప్రకాశం వల్ల. అదే విధంగా బ్రహ్మ జగత్తులో తన్ను తానే చూస్తుంది. చూస్తున్నది వేరే కాదు; చూడబడేది వేరే కాదు; చూడటం కూడా వేరే కాదు. వాస్తవంగా బ్రహ్మకు ఆనందించడం అనే క్రియ లేదు. ఆ ఆనందం తన స్వరూప స్థితి. బ్రహ్మము ఆనందిస్తుంది అంటే—బ్రహ్మ ఆనందస్వరూపంగా ప్రకాశిస్తుంది అన్నది భావం (శంకరభాష్యం)

17
ఇరువుదొందో ఎరడొ ఎరడరంతెసెవొందొ |
అరెమరెయొళిప్పుదేనదు లెక్కకిల్ల ||
స్థిరదిర్కెయే ఇర్‍కె ధరణియొళ్ స్థిరమెల్లి? |
పరమాత్మనే స్థిరవు – మరుళ మునియ ||

అరయ నొకటో రెండొ రెండై పొలుచు నొకటొ
మఱుగునున్నదదేమి గణనకొదగనిది
స్థిరమె కానిమ్మదే జగతిలో స్థిరమెచట?
పరమాత్ముడే స్థిరము – మంకుతిమ్మ

జగతిలో నేను, పైన ఈశ్వరుడు. జగదీశ్వరులా? ఇద్దరా? లేక రెండుగా భాసించు ఒకటే తత్త్వమా? సొమ్ములు, బంగారము రెండా ఒకటా?
జడమైన జీవజగత్తులూ సత్యము, చైతన్యరూపమైన ఈశ్వరుడూ సత్యమే — ఉన్నది రెండు అన్నారు ద్వైతులు. కాదు, ఈశ్వరుడు స్వతంత్ర సత్యము, జగజ్జీవములు విశేష సత్యము అన్నారు విశిష్టాద్వైతులు. రెండుగా భాసిల్లేది ఒకటే సత్యము. ఆ సత్యానికి భిన్నంగా ఏదీ లేదు; ఉన్నట్టు కనిపించేది మిథ్యము అన్నారు అద్వైతులు.

జలము, తరంగాలు రెండా ఒకటా? రెండైతే, ఒకటి ఇక్కడ కనిపిస్తున్నది తరంగమా, జలమా, జలమైన తరంగమా, తరంగరూపమైన జలమా? సత్యమేమి?
మారిపోక ఒకేలా ఎప్పుడూ ఉండేదే సత్యమన్నారు కదా. స్థిరమైనదే సత్యమైతే, ఈ జగతిలో స్థిరమైనదెక్కడ? ఎల్లప్పుడూ వికారంచెందక ఉండుట అన్నది ఎవరికి చెల్లును? స్థిరమైనది అచలము. అచలమైనది సర్వవ్యాపి. సర్వవ్యాపికి రెండవది లేదు; కనుక పరతత్త్వమే స్థిరము.

ఈ జగత్తులో కనిపించే రూపాలు, స్థితులు, సంబంధాలు, దేహాలు — అన్నీ మార్పుకు లోబడి ఉన్నాయి. అవి సత్యం కావు, కానీ సత్యంపై ఆధారపడిన ప్రదర్శనలు మాత్రమే. మార్పు ఉన్న చోట మారనిది, మార్పును గమనించే సాక్షి తప్పనిసరిగా ఉండాలి. ’ఉన్నది’ అంటే స్వతంత్రంగా తనంతట తానే నిలిచే సత్యం. “రెండు” అనేది కనిపింపు/వ్యవహార భేదం. ఉంగరం, హారం “రెండు” గా కనిపిస్తాయి. కానీ వాటి స్వతంత్ర సత్యం ’ఒక్క’ బంగారమే. వ్యవహారంలో ’రెండు’ అనిపిస్తుంది (నేను–జగత్, జీవుడు–ఈశ్వరుడు, సుఖం–దుఃఖం, ఇలా). పరమార్థంలో ఉన్నదంతా ఒక్కటే (అన్నిటికీ ఆధారంగా ఉన్న చైతన్యం/బ్రహ్మం). అది స్వతఃసిద్ధం, స్వతంత్రం మరియు మార్పులేనిది. ఈ లక్షణాలు సాక్షిచైతన్యమొక్కటికే సరిపోతాయి.

సాక్షికి లోబడినవి కనిపిస్తాయి, మారతాయి, గమనించబడతాయి. ఏది కనిపిస్తుందో అది నేను కాదు. కనిపించే శరీరం, స్ఫురించే ఆలోచనలూ — ఇవన్నిటిని నేను తెలుసుకుంటున్నాను అనే భావం కూడా గమనించబడుతోంది. అది కూడా నేను కాదు. ఉన్నది ఒకటే అయినప్పుడు అది రెండుగా ఎందుకు కనిపిస్తుంది? సాక్షిచైతన్యం ఒక్కటే; అందులోనే శరీర–మనోరూపాలు, ప్రపంచానుభవం, ‘ఇది నేను’ అనే బుద్ధి ఉద్భవిస్తాయి. “నేహి నానాస్తి కించన” — బృహదారణ్యక ఉపనిషత్తు చెబుతుంది: నిజంగా అనేకం లేదు. మరియు కనిపించేది నశించేదే (యద్ దృశ్యం తన్నశ్యం). శుద్ధాద్వైతంలో ‘నేను’ అన్న భావమూ వస్తువే. ‘నేను తెలుసుకుంటున్నాను’, ‘నేను సాధకుణ్ణి అనేవి మనస్సులో వచ్చే భావాలే గనుక, అవి సాక్షికి కనిపించే దృశ్యాలే. సాక్షి అనేది అహంకారమూ కాదు, వ్యక్తిత్వమూ కాదు.

18
కడలింగె ధుమ్మిక్కి కణ్మూగుగళ బిగిదు |
ముళుగి తడకాడి మేల్బందు దడ సేర్వ ||
కడలాడివోల్బొమ్మ చైతన్యవాడువుదు |
పొడవియా మడువినలి – మరుళ మునియ ||

కడలిలో దుముకి కనుముక్కుల బిగించుకొని
తడువుకొని మునిగి పైలేచి దరిజేరే
’కడలియాటరి’వలెన్ బ్రహ్మచైతన్య నృతి
పుడమియను మడువులో- మంకుతిమ్మ

ప్రకృతియంతా బ్రహ్మచైతన్య నృత్యమే. సృష్టి–స్థితి–లయాలు దానికొక్క ఆట. ఆట వినోదానికేగాని వాస్తవము కాదు. జీవాకృతిని, జగదాకృతిని దాల్చిన బ్రహ్మ నానా జీవవస్తువులలో, చేతన–అచేతనములలో దిగి, ఆయా శరీరాలతో ఆడుతూనే ఉంది. ఈదడానికై కడలిలో దిగి, కనుముక్కులను మూసుకొని, లోపల కొద్దిసేపు విహరించి, మళ్లీ తడవుకొని పైకి లేచే సముద్ర క్రీడాకారునివలె బ్రహ్మచైతన్య నృత్యము సాగుచున్నది. ఆ వైశ్విక నృత్యాంశాన్నే ఈ భూమియనే సరస్సులో దిగి ఆడుతున్న లీలలుగా చూస్తున్నాము. ఇలా తడవుకొని అన్వేషిస్తూ సాగేదే జగజ్జీవనము. వర్ణనా సందర్భం వేరైనా ఇదే ఉపమానాన్ని భగవాన్ రమణమహర్షి రచించిన సద్దర్శనము అనే గ్రంథంలో చూడగలము : “కూపే యథా గాఢజలే తథాంతః నిమజ్జ్య బుద్ధ్యా శితయా నితాంతమ్” (బావి నీటిలో మునిగినవాడు బుద్ధిని సూక్ష్మంగా చేసుకొని లోతుల్లోకి దిగినట్టు, సాధకుడు అంతర్ముఖుడై ఆత్మాన్వేషణ చేయాలి) .

అనంతమైన బ్రహ్మచైతన్యం, పరిమితంగా కనిపించే జగత్తులో ప్రకాశిస్తూ లీలగా వ్యక్తమవుతోంది. కడలి లోతులకు దిగడం అనేది అవిద్య, అహంకార, కర్మబంధాలు. పైకి రావడం విద్య, ఆత్మజ్ఞానం. ఆత్మనే ఆత్మ చేత ఉద్ధరించుకోవాలి (ఉద్ధరేదాత్మనాత్మానం – భగవద్గీత 6.5). కడలిలో మునిగి కష్టపడే ఈ బంధం నిజమా? సత్యస్థాయిలో బంధమూ లేదు, మోక్షమూ లేదు, సాధకుడూ లేదు (న బద్ధో న ముక్తో న సాధకః – మాండూక్య కారిక). అయితే ఎందుకీ బంధానుభవం? అది అవిద్యవల్ల కలిగిన మిథ్యానుభవం. నిజానికి బ్రహ్మకు బంధం లేదు. బంధము చైతన్యానికి కాదు; ఉపాధికి.

ఆకాశం మేఘాలలో చిక్కుకున్నట్టు కనిపించినా, కుండలో చిక్కుకున్నట్టు అనిపించినా నిజానికి ఆకాశం ఎప్పుడూ స్వతంత్రమే (ఆకాశం ఘటసంబంధాత్ బద్ధమివావభాసతే). ఆ విధంగా దేహేంద్రియాదులతో “నేను జీవుడను” అనే బద్ధత చైతన్యానికి లేదు. “నేను బాధపడుతున్నాను, భయపడుతున్నాను” అనే భావాలను గమనిస్తున్నది ఎవరు? సాక్షి. ప్రకృతి నృత్యం చేస్తోంది. జీవుడు ఆడుతున్నాడు. కానీ సాక్షి కేవలం చూస్తున్నది. ఆ సాక్షిలో నిలవడమే అద్వైత దర్శనం.

19
లీనం పరబ్రహ్మదొళగిర్దనాత్మ తాం |
క్షోణీవిలాసదొళు తాను బేరెనిపా ||
మానుష్యవను తళెదు నానాకృతియ తాళి |
హీనతెయ పడుతిహనొ – మరుళ మునియ ||

లీనుడైనన్ పరబ్రహ్మలోపలియాత్మ
క్షోణీవిలాసమున తానుగా వేరై
మానుష్యమును దాల్చి నానాకృతిని బూని
హీనత బడయుచుండు- మంకుతిమ్మ

సర్వవ్యాపకమై, ఆద్యంతాలు లేనిదే పరబ్రహ్మ. “సర్వం ఖల్విదం బ్రహ్మ” అంటుంది శ్రుతి. జరిగినట్టు కనిపించే సృష్టి సమస్తమూ బ్రహ్మచైతన్యాంశమే. నేనొక వ్యక్తియని భావిస్తున్న జీవుడు ఆత్మకు భిన్నుడు కాదు. సదా పరబ్రహ్మలో లీనమైయుండిననూ, వేరుగా అగుపించే ఈ జీవాత్మ పేరు ప్రత్యగాత్మ. మనిషిగా అనేక రూపాలను దాల్చి విశ్వవిలాసమందు కష్టసుఖాల పాట్లు పడుచున్నదంతా బ్రహ్మలీల. ఎంతవరకు తన స్వరూపాన్ని మరచి, తానొక దేహము, నేను జీవుడను, ప్రత్యగాత్మనని భిన్నంగా భావించునో అప్పటివరకు పరిమితత్వంతో, ప్రకృతిభాగమై, హీనతలో దీనుడై నానా అవస్థలు పడుచుండును.

మనిషి అనే జీవి బ్రహ్మమునకు భిన్నమైనవాడు కాదు. బ్రహ్మమే జీవరూపంగా కనిపిస్తున్నది. స్వరూపంలో ఏకత్వమున్నా అనుభవంలో విభేదమే జీవుని అగచాట్లకు కారణం. అనేక రూపాలను దాల్చడమనేది ‘వివర్తవాదం’. కంకణం, హారం, అంగుళీయకం రూపాలు వేరు — బంగారం ఒక్కటే. అట్లే మనిషి, దేవత, పశువు మొదలైన జీవుల రూపాలు వేరు; చైతన్యం ఒక్కటే. ఘటంలో ఉన్న ఆకాశం, బయట ఉన్న ఆకాశమని రెండు ఆకాశాలు ఉండవు. అది ఎప్పుడూ మహాకాశమే. “నేను బ్రహ్మము” అనే స్మృతి లేనందున జీవుడు, నేను శరీరం, నేను కర్త, నేనే భోక్తనుకొంటున్నాడు. ఈ అహంకారమే బంధం. కర్మలను ప్రకృతి చేస్తుంది; కాని జీవుడు “నేను చేస్తున్నాను” అని భ్రమపడుతున్నాడు. (ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః | అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే — భగవద్గీత). ఒకే దైవం అన్ని జీవులలో అంతర్యామిగా ఉంటున్నది (ఏకో దేవః సర్వభూతేషు గూఢః, సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా — శ్వేతాశ్వతరోపనిషత్తు).

మార్పులేని (సత్యం), పరిమితిలేని (అనంతం), చైతన్యమే (జ్ఞానం) మనిషిలో “నేను ఉన్నాను” అనే అనుభూతిగా ప్రకాశిస్తోంది. అదే ఆత్మ. అది బయట వెదకవలసినది కాదు; నాలో సాక్షిగా ఉన్నదే. కాని మనిషి తన స్వరూపాన్ని మరచి, నేను శరీరము, నేను కర్తను, భోక్తనని అనుకోవడానికి కారణం అధ్యాస. అంటే అనాత్మను (శరీరం–మనస్సు) ఆత్మగా భావించడం. శరీరం, మనస్సు, ఆలోచనలు ఇవన్నీ మారుతున్నా, “నేను” అనే చైతన్యం మారనిది. ‘నువ్వు తెలుసుకున్నదంతా వస్తువులే గాని, తెలుసుకుంటున్న చైతన్యం వస్తువు కాదు — అది సాక్షి’ (యస్యామతం తస్య మతం | మతం యస్య న వేద సః — కేనోపనిషత్తు).

20
సాగరం బ్రహ్మవదరిందె తాత్కాలదుప- |
యోగకాగిహ కాల్వెయెల్ల దేవర్‍కళ్ ||
వాగీశ లక్ష్మీశ గౌరీశముఖరెల్ల |
రాగ భోగక్కల్తె – మరుళ మునియ ||

సాగరుడు బ్రహ్మ తనచేత తత్కాలోప-
యోగమునకైన కాలువలు దేవతలు
వాగీశ లక్షీశ గౌరీశముఖులెల్ల
రాగ భోగములకే – మంకుతిమ్మ

సృష్టియనేది కార్యమైతే దానికి కారణం ఈశ్వరుడు. ఈశ్వరుడనగా మాయాసహిత పరబ్రహ్మము. ఒకే ఈశ్వరుని త్రికార్యనిర్వహణకు త్రిమూర్తులనే మూడు పేర్లున్నవి. మిగిలిన దిక్పాలకాది దేవతలు, ఋతు–ధర్మ–కాలపురుషులు వీరందరూ ప్రకృతి నాటకమనే తోలుబొమ్మలాటను ఆడించు కనబడని దివ్యశక్తులు. వాయువు, వరుణుడు, అగ్ని అనేవి దైవత్వనామములు. సర్వదేశములలో, సర్వజనులలో ప్రకృతిశక్తులకు దైవత్వమారోపించి నానావిధములుగా వాటిని పేర్కొంటారు. పరబ్రహ్మవస్తువు కోటిరూపాలలో వెదజల్లబడటానికి ఒక వ్యవస్థ ఉండాలి కదా! దాని అభివ్యక్తియే ప్రేమ, రాగము, సుఖము. ఆ ఆనంద ప్రకటనకే ఈ లోకవ్యవస్థ.

సృష్టి–స్థితి–లయలకు కారణమైన తత్త్వం ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడు మాయాసహిత పరబ్రహ్మమే. మాయ ప్రకృతి; దానిని నియంత్రించువాడే ఈశ్వరుడు – “మాయాం తు ప్రకృతిం విద్యాన్ మాయినం తు మహేశ్వరమ్” — శ్వేతాశ్వతర ఉపనిషత్ (4.10). అందుకే పరబ్రహ్మము నిర్గుణమై ఉన్నా, మాయ సంబంధం చేత సగుణమై ఈశ్వరుడని అనిపించుకుంది. త్రికార్యాలు ఒకే ఈశ్వరుని త్రివిధ అభివ్యక్తి. ఒకే ఈశ్వరుడు, కార్యభేదముచేత మూడు పేర్లతో పిలువబడతాడు. ఇది కార్యవ్యవహారభేదమే తప్ప బహుత్వం కాదు. ఒక్కడే దేవుడు; అంతటా వ్యాపించి, అన్ని రూపాలలో పని చేస్తున్నాడు – “ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా” — శ్వేతాశ్వతర ఉపనిషత్ (6.11).

సృష్టి యాదృచ్ఛికమైనది కాదు. అది బుద్ధిప్రధానమైన కార్యం. “నేను అనేకముగా కావాలి” అన్న సంకల్పమే సృష్టికి ప్రారంభం. “స ఐక్షత – బహుస్యాం ప్రజాయేయ” — ఐతరేయ ఉపనిషత్. అందుకే ఈశ్వరుడు సృష్టికార్యములో బ్రహ్మగా అభివ్యక్తి చెందాడు. బుద్ధికి అధిదేవత సరస్వతి. కాబట్టి వాక్స్వరూపుడై, విజ్ఞానప్రధానుడై ఈశ్వరుడే వాగీశుడుగా నిలుస్తాడు. వాక్కే బ్రహ్మ – “వాగ్వై బ్రహ్మ” — ఐతరేయ ఉపనిషత్. అందుకే సృష్టి జ్ఞానప్రకాశంతోనే మొదలవుతుంది.

సృష్టించిన జగత్తును నిలబెట్టడం — ఇది కరుణ, ధర్మము, ఐశ్వర్యసంపన్నమైన కార్యం. ఎవరి వల్ల జీవులు జీవిస్తున్నాయో ఆయనే స్థితికార్యాధిపతి. “యేన భూతాని జీవంతి, యేన జాతాని జీవంతి” — తైత్తిరీయ ఉపనిషత్. విష్ణుత్వం అంటే వ్యాపకం, పోషణ, సంరక్షణ కాబట్టి, స్థితి విష్ణుకార్యం. దానికి లక్ష్మీ- ఐశ్వర్యం ఆధారము. అందుకే ఈశ్వరుడు విష్ణువు. సంరక్షణకు ఐశ్వర్యం ఆధారం కాబట్టి ఆయన లక్ష్మీశుడు.

ఇక, లయమనేది నాశనం కాదు. అది రూపాల విఘటన. మూలకారణంలో విలీనము. అక్కడ అన్నీ ఆత్మగానే విలీనమవుతాయి. “యత్ర త్వస్య సర్వమాత్మైవాభూత్” — బృహదారణ్యక ఉపనిషత్. ఈ లయకార్యంలో ఈశ్వరుడు శివుడుగా అభివ్యక్తి చెందుతాడు. శివత్వం అంటే శాంతి, శుద్ధి, లయానందం. లయకార్యానికి శక్తి అవసరం. అందుకే శివుడు శక్తితో కూడినవాడు. “శక్త్యా యుక్తః శివః శక్తిః” — తాంత్రిక సూక్తిసారము.

బ్రహ్మవస్తువు ఒక సముద్రమైతే, త్రిమూర్తులు — ముగురమ్మలు — ఆ సముద్రపు కాలువలు. ఉపనిషత్తులు ఇదే భావాన్ని ఇలా చెబుతాయి:
“యథోర్ణనాభిః సృజతే గృహ్ణతే చ” — ముండక ఉపనిషత్ (1.1.7). సాలీడు తన నుంచే జాలాన్ని విస్తరించి, తిరిగి తనలోనే లయముచేస్తుంది. అదేవిధంగా దేవతావ్యవస్థ అంతా పరబ్రహ్మనుండే వెలువడుతుంది. కనుక దేవతలు అంటే స్వతంత్ర సత్యములు కావు. కర్మేంద్రియ–జ్ఞానేంద్రియ అధిష్ఠాన దేవతలూ, దిక్పాలకులు, ఋతుధర్మకాలపురుషులూ అందరూ అభిన్నమైన మహాశక్తి యొక్క వ్యవహార రూపాలే. సూర్యుడు, చంద్రుడు, అగ్ని — అందరూ ఆయన ప్రకాశంతోనే ప్రకాశిస్తారు. “న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం…” — కఠ ఉపనిషత్. ఈశ్వరుని ఆధారంగా వాయువు, వరుణుడు, అగ్ని ఈ శక్తులకు దైవత్వారోపణ మాత్రమే.

ఈ విశ్వనాటకం ఆ బ్రహ్మవస్తువుయొక్క ఆనందాభివ్యక్తికే. మన రాగభోగాలకు అదే ఆధారం. దాని అభివ్యక్తియే ప్రేమ, రాగము, సుఖము. బ్రహ్మ స్వరూపమే ఆనందం. “ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్” — తైత్తిరీయ ఉపనిషత్. ఈశ్వరుడు ఒక్కడే. త్రిమూర్తులు ఈశ్వరుని కార్యవ్యవహారాలు. దేవతలన్నీ ఈశ్వరుని శక్తిప్రవాహాలే. సృష్టి ఒక నాటకం. ఆ నాటకానికి కారణం — ఆనంద ప్రకటన. ఆ ఆనంద స్వరూపమే — పరబ్రహ్మము.