ఓ ప్రేమ కథ

మేడ మీద గదిలో కుర్చీలో కూర్చుని, ఏదో పుస్తకం చదువుకుంటోన్న శారద మీద, కిటీకీ లోంచి ఏదో వచ్చి పడింది. ఉలిక్కిపడి చూసింది శారద. అది, చిన్న కాయితంలో చుట్టిన చిన్న రాయి బెడ్డ!

ఆ కాయితం ముక్క చేతిలో పెట్టుకుని, కిటీకీ లోంచి బయటకి చూసింది. ఇంటికి కొంచెం దూరంగా నవ్వుతూ నించున్న సుధీర్, శారదను చూడగానే చెయ్యి వూపాడు, అదే నవ్వుతో.

ఆ కాయితం ముక్కలో రాసినదాన్ని చదివిన శారద మొహంలో చిన్న నవ్వు మొలిచింది. అదే చిన్న రాయి బెడ్డను ఇంకో కాయితంలో చుట్టి, కిటికీ లోంచి వెనక్కి విసిరింది. సుధీర్ దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించాడు గానీ, క్రికెట్ ఆటలో లాగా, కుదరక, నేల మీద పడ్డ దాన్ని తీసుకుని, కాయితం ముక్కను జేబులో పెట్టుకుని, రాయి బెడ్డను రోడ్డవతల పడేసి, మళ్ళీ చెయ్యి వూపేసి, వెళ్ళి పోయాడు. వెళ్ళిపోతున్న అతన్ని అలాగే చూస్తూ నించుంది శారద నవ్వు మొహంతో.

సుధీర్‌ జేబులో పెట్టుకున్న ఆ కాయితం, ఒక వంద రూపాయల నోటు!


“ఏమంటున్నాడు నీ సుధీర్ నేస్తం?” అంటూ యథాలాపంగా అడిగింది సునంద తన స్నేహితురాలైన శారదని.

“ఏమంటున్నాడా? ఇవాళ ఒక ఉత్తరం కూడా రాశాడు” అంది నవ్వు మొహంతో శారద.

“హేవిటీ? అప్పుడే ప్రేమలేఖ రాసేశాడా?” అంటూ ఆశ్చర్యపోయింది సునంద.

“నీ మొహం! ప్రేమలేఖా, పాడా? అలాంటి పిచ్చి మాటలు అనకు” అంటూ కాస్త చనువుగా విసుక్కుంది శారద.

“సరేనమ్మా! సరే! ఇంతకీ ఏం రాశాడు అందులో?” అని కుతూహలంగా అడిగింది సునంద.

“నువ్వే చదువు!” అంటూ, తన బల్ల సొరుగు లోంచి ఒక కాయితం ముక్క తీసి సునంద చేతిలో పెట్టింది శారద.

శారద ఆ ఉత్తరాన్ని చదవమందంటే, అందులో సంస్కారవంతమైన విషయాలే వుంటాయని సునందకు తెలుసు.

సునంద ఆ చిన్న ఉత్తరాన్ని చదవడం మొదలు పెట్టింది.

“ఇవాళ జోసెఫ్, సులేమాన్‌లతో సినిమాకి వెళదామనుకుంటున్నాను. డబ్బులు కావాలి. ఇయ్యి.”

అంతే! ఆ మాటలే ఉన్నాయి ఆ చిన్న కాయితం ముక్క మీద!

“ఏమిటీ? డబ్బు అడగడం కూడా మొదలెట్టాడా? నీ కెలా దొరికాడే ఈ ధీరుడు?” అని గట్టిగా అడిగేసింది.

“స్నేహితులతో సినిమాకి వెళ్ళడానికి, డబ్బు లేక అడిగాడు. తప్పెలా అవుతుంది? అయినా, ఇదేమీ మొదటి సారి కాదులే!” వినయంగా జవాబిచ్చింది శారద.

తెలిసున్న విషయమే అయినా, మళ్ళీ, “నీ కెలా దొరికాడే ఈ సుధీర చక్రవర్తి?” అనడిగింది కాస్త కోపంగా సునంద.

శారద కాస్త గతం లోకి తొంగి చూసింది.


ఆ సాయంత్రం బస్‌స్టాపులో శారద, బస్సు కోసం ఎదురు చూస్తోంది. బస్‌స్టాపులో బస్సు కోసం కాక, విమానం కోసం ఎదురు చూస్తారా ఎవరైనా? – అని అడుగుతారా? విమానం కోసం కాదు గానీ, వేరే వాటి కోసం ఎదురు చూస్తారు కొందరు. సరుకులు కొనుక్కునే వారి కోసం బండ్ల సామానుల వాళ్ళు ఎదురు చూస్తారు. బస్‌స్టాపు దగ్గిర్లో ఆటోలు దొరుకుతాయని వాటి కోసం ఎదురు చూస్తారు కొందరు. బస్సు కోసం చూసి చూసీ, అలిసిపోయి, తమ ఆటో ఎక్కే జనాల కోసం ఆటోవారు ఎదురు చూస్తారు. మోటారు సైకిళ్ళ మీద ఏ స్నేహితులో అటువేపు వెళుతూ, తమను ఎక్కించు కుంటారని ఎదురు చూస్తారు మరి కొందరు. కొంత మంది మాత్రం ‘నిఝం’గా బస్సు కోసమే ఎదురు చూస్తారు. అలా బస్సు ‌ కోసం ఎదురు చూస్తూ వున్న శారద, అక్కడే తన లాగే బస్సు కోసం ఎదురు చూస్తూ వున్న సుధీర్‌ను చూసింది. చేతిలో పుస్తకాలు అతనింకా ఒక విద్యార్ధి అని చెబుతున్నాయి. కుడి మోచేతి ముందు వేపు బేండైడ్‌, దాని మీద ఎర్రటి గుండె ఆకారంలో స్టిక్కర్‌, అతను ఆ రోజే రక్త దానం చేశాడని చెబుతున్నాయి అనుభవం వున్న వాళ్ళకి. ఆ స్టిక్కర్ వల్లే అతను కొంచెం ప్రత్యేకంగా కనపడ్డాడు శారదకి. అలాగే మరి కొన్ని సార్లు అతన్ని ఆ బస్‌స్టాపు లోనే చూసింది శారద. అతను కూడా తనని చూశాడనే అనుకుంది.

ఒక రోజు, ఈసురోమంటూ ఇల్లు చేరిన శారదకి, ఇల్లు చేరాక గానీ గుర్తు రాలేదు, ఆ రోజు తాను కొన్న పుస్తకాల సంచీ పొరపాటున బస్‌స్టాపు లోనే వదిలేశానని. నాలుగు షాపులు తిరిగి, వెదికి, తనకి ఇష్టమైన పుస్తకాలు కొనుక్కుంది. ఊరుకో బుద్ధి కాలేదు. ఖర్చు ఎక్కువ అయితే అయిందని, ఆటోలో వెళ్ళింది ఆ బస్‌స్టాపుకు, తన పుస్తకాల సంచీ దొరుకుతుందనే ఆశతో!

అక్కడ, సుధీర్‌ చేతిలో పుస్తకాల సంచీతో ఆమె కోసం ఎదురు చూస్తూ కనపడ్డాడు. ఆమెకి సంచీని అందించాడు సుధీర్‌. అతనికి నమస్కారం చేసింది శారద. అతనూ ప్రతి నమస్కారం చేశాడు.

అంతే! వచ్చిన ఆటో లోనే తిరిగి వెళ్ళి పోయింది శారద. వాళ్ళిద్దరూ ఒక్క ముక్క మాట్లాడుకోలేదు ఆ రోజు!

మనసు లోని భావాలను కళ్ళే చెప్పేశాయి!

ఆ తర్వాత నుంచీ కనపడ్డప్పుడల్లా, ఇద్దరి మొహాల్లోనూ పరిచయపు నవ్వు కనిపించేది.

మరి కొన్నాళ్ళకి, ఒక రోజు సుధీర్, “ఆ ఎదురుగా వున్న టీ కెఫేలో కూర్చుని టీ తాగుదామా?” అనడిగాడు నెమ్మదిగా.

వెంటనే ఒప్పేసుకుంది శారద.

మనుషులనే వారు మాట్లాడుకోకుండా ఒకరి కొకరు ఎలా అర్ధం అవుతారు?

ఇద్దరూ ఆ కెఫేలో టీ తాగుతూ మాట్లాడు కున్నారు.

సుధీర్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడనీ, ఆ తర్వాత పెద్ద జీతం వచ్చే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడనీ, స్కాలర్‌షిప్పు తోనూ, చెప్పే ఒకటీ రెండు ట్యూషన్ల డబ్బు తోనూ, ఇంట్లో వాళ్ళు పంపించే అతి తక్కువ డబ్బు తోనూ, జీవితం గడుపుతున్నాడనీ, అప్పుడప్పుడు స్నేహితులతో సినిమాలకీ, పార్కులకీ వెళతాడనీ, అప్పుడప్పుడు కథలూ, నవలలూ చదువుతాడనీ, ప్రతీ రెణ్ణెల్లకీ స్వచ్ఛందంగా రక్తదానం చేస్తాడనీ, శారదకి తెలిసింది.

శారద, డిగ్రీ చేసి ఉద్యోగం చేసుకుంటోందనీ, స్వతంత్రంగా బతకడం ఇష్టమనీ, తమ్ముడితో తల్లిదండ్రులు తన ఊళ్ళోనే వున్నారనీ, ఒకరిద్దరు స్నేహితులున్నారనీ, సినిమాలు చూడదనీ, పుస్తకాలే ఎక్కువగా చదువుతుందనీ, సుధీర్‌కి తెలిసింది.

అంతే! ఇద్దరూ అప్పుడప్పుడూ అలా టీ తాగడాలూ, ఎప్పుడయినా పార్కుకి వెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, ఆ జన సందోహాన్ని చూస్తూ గడపడమూ జరుగుతూ వుండేది.

అయితే, ప్రతీ సారీ శారదే టీ తాగడానికి డబ్బులు ఇచ్చేది. పార్కులో కొనుక్కున్న బఠానీలకూ, వేరు శనగలకూ కూడా శారదే డబ్బులు ఇచ్చేది. సుధీర్‌ ఏనాడూ డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించ లేదు. అతని దగ్గిర ఎక్కువ డబ్బు వుండదని శారదకి అర్ధం అయింది. అదొక పెద్ద విషయంగా కూడా ఆమెకి అనిపించ లేదు.

సుధీర్ కూడా, పార్కులో బఠానీల పేకెట్‌ తీసుకోగానే, శారద వేపు చూసేవాడు, “డబ్బులు ఇయ్యీ!” అన్నట్టు. కెఫేలో వెయిటర్‌, బిల్లు తన చేతికి ఇవ్వబోతే, సుధీర్, “ఆవిడికి ఇయ్యి బిల్లు” అనేవాడు.

వారి స్నేహం అలాగే సాగుతూ వుంది కొన్ని నెలల నించీ!


“ఎప్పుడయినా నిన్ను ప్రేమిస్తున్నాడని అన్నాడా? ఒక్కసారయినా ‘ఐ లవ్ యు!’ అని చెప్పాడా?” అనడిగింది సునంద.

“అలాంటి సినిమా మాటలు మాట్లాడకే! రోతగా వుంటాయి వినడానికి. లేదు. ఆ మాటలు ఎప్పుడూ మా మధ్య రాలేదు. తన విషయాలు అతను చెబుతూ వుంటే, నా విషయాలు నేను చెప్పడం. అప్పుడప్పుడు చదివిన పుస్తకాల లోని మాటలు వచ్చేవి మా మధ్యలో. అంతే!” అంది శారద.

“సరే! పోనీ నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా?” ఆరాగా అడిగింది సునంద.

“అబ్బ! ఏం భాషే! అదొక ‘పని’ అయినట్టు, ఆ ‘పని’ చేస్తున్నావా అని నువ్వడగడం! అతనంటే నాకు గౌరవం. అతనితో మాట్లాడ్డం నా కిష్టం. మంచిగా, సంస్కారంవంతంగా మాట్లాడతాడు. అంతే!” అంది శారద.

“ఏమోనే! ప్రపంచం ఏమీ సరిగా లేదు. మొగవాళ్ళు ఇలాగే మోసాలు చేసేస్తారు ఆడ పిల్లలని” అంటూ వాపోయింది సునంద, ‘ప్రపంచం లోని మొగవాళ్ళందరూ చెడ్డవాళ్ళే’ అని తీర్మానించేస్తూ.

“అందరి ఆడ పిల్లల లాంటి దాన్ని కానేమోలే నేను!” అంటూ నవ్వుతూ ఆ విషయాన్ని వొదిలేసింది శారద.


ఆ రోజు, శారదా, సునందల మధ్య హోరా హోరీ దెబ్బలాట జరిగింది.

“నువ్వెన్ని చెప్పు శారదా! నువ్వు సుధీర్‌కి అంత డబ్బు ఇవ్వడం సరైన విషయం కాదు” అంది ఘాటుగా.

అసలేం జరిగిందంటే, అంతకు ముందు రోజు సుధీర్‌, పార్కులో శారదని కలిశాడు.

కొన్ని మాటలు జరిగాక, గవర్నమెంటు వారి లోపం వల్ల, తన స్కాలర్‌షిప్పు డబ్బు రావడానికి చాలా ఆలస్యం అయ్యేటట్టుందనీ, అవసరాలకి డబ్బు కావాలనీ, చెప్పాడు సుధీర్.

“అంత డబ్బు నా దగ్గిర లేదు!” అంది శారద.

“ఎక్కణ్ణించైనా అప్పు తీసుకో! నెల నెలా వాయిదాలు కట్టెయ్యి వడ్డీతో సహా!” అన్నాడు సుధీర్, తన చేతి లోని బఠానీల్లో పుచ్చు వాటిని ఏరి పారేస్తూ.

శారద, అతని మొహం లోకి సునిశితంగా చూసింది. కళ్ళ లోకి సూటిగా చూసింది.

ఆమెకి ఏం కనబడిందో, ఏం అర్ధమైందో ఆమెకే తెలియాలి, ఆమె చదివిన పుస్తకాలకే తెలియాలి.

ప్రతీ ఒక్క మనిషీ తనకి ప్రతీ ఒక్క విషయమూ సరిగానే అర్ధం అయిపోతోంది అని అనుకుంటాడు. అది కరెక్టా, కాదా అనే విషయం రాబోయే కాలం మాత్రమే చెబుతుంది. అనుకున్న సమయంలో మాత్రం ఎటువంటి రుజువులూ దొరకవు. కానీ, ఆ మనిషి అర్ధం చేసుకునేది ఎప్పుడూ, ఆ మనిషి చైతన్య స్థాయి మీదే ఆధారపడి వుంటుంది.

ఈ మాటలన్నీ శారద, సునందకి చెప్పింది. సునంద బాగా వ్యతిరేకించింది.

“మొగవాళ్ళు ఆడపిల్లలని ఇలాగే మోసం చేస్తారు. ప్రేమ కబుర్లు చెపుతూ డబ్బు వసూలు చేస్తారు. తర్వాత పెళ్ళి మాట వచ్చేసరికి మాయం అయిపోతారు” అంది కసిగా సునంద.

నిజం చెప్పాలంటే, సునందకీ ఆ విషయాలు అనుభవంలో తెలీవు. అయితే, పేపర్ల లోనూ, టీవీల లోనూ వున్న వార్తల లోంచి సేకరించిన నిజమైన విషయాలే అవి!

“అలా అనకే! ‘ప్రేమ’ అనే మాట అతను ఒక్క సారి కూడా అనలేదే ఇప్పటి వరకూ! పెళ్ళి అనే పదమే అతనికి తెలిసినట్టు లేదు. ఎంతసేపూ చదువు విషయాలూ, ఉద్యోగం విషయాలూ, వాళ్ళ వాళ్ళ విషయాలూ, తన స్నేహితుల విషయాలూ, ఇవే మాట్లాడతాడు. అలా అభాండాలు వెయ్యకే!” అంది శారద, సుధీర్‌ని వెనకేసుకొస్తూ.

“నువ్వు కూడా అచ్చం, ప్రేమలో వున్న మామూలు ఆడపిల్ల లాగే మాట్లాడుతున్నావు. నీకు తెలియక పోయినా, ప్రేమనేది నీ కళ్ళు మూసేసి నిన్ను అంధురాల్ని చేసేసింది” అంటూ తిట్టింది సునంద.

“అంతేనంటావా? నేనూ ఒక మామూలు ఆడపిల్లనే అంటావా? నా చదువూ, నా జ్ఞానం, నా చైతన్యం ఎందుకూ పనికి రావంటావా?” కొంచెం బేలగా అడిగింది శారద.

అడగడమైతే కాస్త బేలగా అడిగింది గానీ, మొహంలో చిన్న నవ్వును దాచలేక పోయింది శారద పూర్తిగా. దాన్ని చూసేసింది సునంద.

“సిగ్గు లేదూ నవ్వడానికి? అసలు మీరిద్దరూ భవిష్యత్తు గురించి ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా? అది కాదు శారదా! కొంచెం తెలివిగా ఆలోచించు!” అంది సునంద అనునయంగా.

“భవిష్యత్తు అంటే? అతనికి ఎలాంటి ఉద్యోగం కావాలో చెప్పాడు. పిల్లల్ని ఎలా పెంచుకోవాలో మాట్లాడుకున్నాం. ఒక చక్కటి ఇల్లు ఎలా వుండాలో మాట్లాడుకున్నాం? ‘మన పిల్లలు’, ‘మన ఇల్లు’ అని మాత్రం మాట్లాడుకోలేదు. అతనికి నేనంటే గౌరవమనీ, ఇష్టం అనీ అతని మాటల్లోనూ, అతని ప్రవర్తన లోనూ తెలుస్తోంది నాకు. ఇంకేం ఆలోచించాలి?” అంది శారద కూడా మెత్తగా.

“ఇంతకీ ఏం నిశ్చయించుకున్నావు అతనికి డబ్బు ఇచ్చే విషయంలో?” అడిగింది సునంద.

“తప్పకుండా ఇస్తాను! ఆ డబ్బు తీసుకుని, నా స్నేహం వదిలేసి పారిపోతాడా? పొమ్మను. అదే మంచిది నాకు. మామూలు ఆడ పిల్లల లాగా కృంగిపోను!” అంది శారద ఘాటుగా.

ఏం చెప్పాలో సునందకి అర్ధం కాలేదు. శారద అప్పు చేసి ఆ డబ్బును సుధీర్‌కి ఇచ్చింది. అతను చాలా మామూలుగా తీసుకున్నాడు. బయట నుంచి చూసేవాళ్లకి, అంటే సునంద లాంటి వాళ్ళకి మాత్రమే, అతను, శారద నుంచి తనకు రావలసిన డబ్బును వసూలు చేస్తున్నట్టు అనిపిస్తుంది.

అయినా కోపంగా, “నా మాట వినడం లేదు నువ్వు. నువ్వు ఈ సారి తప్పకుండా మోసపోతావు. చూస్తూ వుండు. అలా జరగక పోతే, నేనో రెండ్రోజులు నీకు బానిసగా వుంటాను!” అంది సునంద ఆవేశంగా.

బాగా నవ్వింది శారద. “అలాగే వుందువు గాని గానీ, నేను మోసపోయినా సరే, ఎవరికీ ఎప్పుడూ బానిసగా మాత్రం వుండను!” అంది ఇంకా నవ్వుతూనే.


రెండ్రోజులుగా సుధీర్‌ నించి ఏ ముచ్చటా లేదు శారదకి. అయినా, ఆమె, ఏమీ దిగులు పడలేదు. ఏదో ఉద్యోగం ఇంటర్వ్యూ వుందని చెప్పినట్టు గుర్తు కూడా.

ఆ రోజు సాయంత్రం, శారద పని చేసే ఆఫీసు దగ్గిరికే వచ్చేశాడు సుధీర్‌.

ఇద్దరూ కలిసి ఎప్పుడూ వెళ్ళే పార్కుకే వెళ్ళి కూర్చున్నారు. బఠానీల అబ్బాయికి శారదే డబ్బులు ఇచ్చేసింది ఎప్పట్లాగా.

“నిన్న ఫలానా కంపెనీ వాళ్ళ ఇంటర్వ్యూ జరిగింది. వాళ్ళకి నేను బాగా నచ్చాను. ఇవాళే ఉద్యోగంలో చేరిపోయాను. జాయినింగ్ బోనస్ కూడా ఇచ్చారు. ఇదిగో చెక్కు!” అంటూ ఒక చెక్కును శారద చేతిలో పెట్టాడు సుధీర్‌.

ఆ చెక్కు మీద వున్న సంఖ్యని చూసి విస్తుబోయింది శారద. చాలా పెద్ద మొత్తమే! చెక్కు వెనకాల, ‘పే టు శారద’ అని రాసి, సుధీర్ సంతకం కూడా వుంది ఎండార్శ్ చేస్తూ.

“ఎందుకు చెక్కు వెనకాల సంతకం పెట్టావు?” అర్ధం అయీ అవనట్టు అడిగింది శారద.

“నాకు బేంకు అకౌంటు లేదు. నీ బేంకు అకౌంటులో వేసెయ్యి ఆ డబ్బు. నాకు ఖర్చులకి కావలసిన డబ్బు నువ్వే ఇస్తూ వుండు. కొంచెం ఎక్కువ ఇస్తూ వుండు. తర్వాత మనం జాయింట్ అకౌంట్ తెరుద్దాం. నా జీతం ఎప్పుడూ బేంకు లోనే వేస్తారట!” అన్నాడు సుధీర్, తన చేతి లోని బఠానీల్లో పుచ్చు వాటిని ఏరి పారేస్తూ.

“ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చేసిందిగా! వచ్చే నెల్లో మనిద్దరం రిజిస్టర్డ్ పెళ్ళి చేసుకుందామా? ఇంట్లో వాళ్ళకి కూడా చెబుదాం. వాళ్ళు మాత్రమే మన పెళ్ళికి వస్తారు” అంది శారద నెమ్మదిగా.

‘అలాగే’నన్నట్టు తలూపాడు సుధీర్, బఠానీలు తింటూ.

(అయిపోయింది)