1. బుడగలో బాలుడు!
మన చర్మం వ్యోమగాములు ధరించే దుస్తులు వంటిది! ఈ “రోదసీ దుస్తులు” (space suits) బయటి వాతావరణంలో ఉన్న కర్కశమైన వాయువుల నుండి, అంతరిక్షపు లోతులనుండి వచ్చే కాస్మిక్ కిరణాల ధాటి నుండి, సూర్యుడి నుండి నిరంతరం వెలువడే వికిరణాల ప్రభావం నుండీ, సాధారణంగా మట్టిలో ఉండే కల్మషాల నుండీ నిరంతరం మనని కాపాడుతూనే ఉంటాయి. ఈ వాక్యం రాస్తూ ఉంటే ఎప్పుడో 1971 లో విన్న “బుడగలో బాలుడు!” గుర్తుకి వస్తున్నాడు. ఆ సంవత్సరం అమెరికా ప్రసార మాధ్యమాలలో పతాక శీర్షిక అధిరోహించిన వార్తలలో “బుడగలో బాలుడు!” ఒకటి. ఆ పిల్లాడు పుట్టుకతోటే “రోగ రక్షక వ్యవస్థ లోపంతో” (severe combined immune deficiency (SCID)) పుట్టేడు. మనందరం పుట్టుకతోటే, రోగాల బారి పడకుండా, ఒక రోగ రక్షక వ్యవస్థతో పుడతాము. ఆ వ్యవస్థ లేకపోతే పుట్టీ పుట్టడంతో ఏ సూక్ష్మజీవో, విషాణువో కబళించేస్తుంది! “బుడగలో బాలుడు!” ఇటువంటి ఆపదకి గురి కాకుండా బయట పడాలంటే ఆ పిల్లవాడి శరీర వ్యవస్థకి అతికినట్లు నప్పే వేరొక దాత ఇచ్చిన ఎముక-మజ్జతో నాట్లు వెయ్యాలి (bone marrow transplant చెయ్యాలి). ఈ రకం అనువైన మజ్జ రక్త సంబంధం ఉన్న దగ్గర కుటుంబంలోనే ఎక్కడా దొరకలేదు; బయట దొరికే ఆస్కారం పూజ్యం కదా. కనుక ఆ పిల్లవాడిని పర్యావరణపు ప్రమాదాల నుండి రక్షించడం ఎలా అనే సమశ్య ఎదురయింది. తాత్కాలిక పరిష్కారమార్గంగా, అంతరిక్ష పరిశోధకులయిన నాసా (NASA) వారి పర్యవేక్షణలో తయారయిన ఒక ఫ్లేస్టిక్ బుడగలో ఆ బాలుడిని 12 ఏళ్ళ వయస్సు వచ్చేవరకూ పెంచేరు. మనందరమూ కూడా, ఆజన్మాంతం, అటువంటి ఒక బుడగలోనే బ్రతుకుతున్నాం అంటే నమ్మగలరా? మన బుడగని NASA వారు తయారు చెయ్యలేదు; అది మనకి పుట్టుకతో సంక్రమించిన వరం! అదే మన చర్మం.
ఫ్లేస్టిక్ బుడగలా కాకుండా మన చర్మం సజీవమైనది, మన చర్మానికి ఉచ్వాసనిస్వాసాలు ఉన్నాయి. మలినాలని విసర్జించగల స్థోమత ఉంది. సూక్ష్మజీవులూ, విషాణువులూ చేసే దాడి నుండి, శీతోష్ణాల నుండి రక్షణ ఇవ్వగలదు. కీలకమైన పోషకం అయిన విటమిన్ డి ని తయారు చేసిపెట్టే సమర్ధత ఉంది. దెబ్బ తగిలితే తనకుతానుగా మరమ్మత్తు చేసికోగలదు. పిసపిసలాడే మాంసపు ముద్దలని, చీము, నెత్తురులని కనబడకుండా కప్పెట్టి మన కొక బాహ్య సౌందర్యాన్ని కల్పించి, మనకి ఒక ఆకర్షణని, వ్యక్తిత్వాన్ని ఇస్తుంది చర్మం. మన స్పర్శ జ్ఞానానికి మూలాధారం చర్మం.
2. చర్మం నిర్మాణ శిల్పం
స్థూలంగా మన చర్మానికి రెండు పొరలు ఉంటాయయని అనుకోవచ్చు. లెక్కపెట్టే ఓపిక, సునిశితమైన దృష్టి ఉంటే – పూతరేకులలో పొరల మాదిరి – ఏడు పొరల వరకూ లెక్క పెట్టవచ్చు! మనం రెండు పొరలతో సరిపెట్టుకుందాం. సుమారు 1.5 మిల్లీమీటర్లు మందం ఉన్న లోపలి పొరని అంతశ్చర్మం (dermis) అంటారు. ఇది ప్రముఖంగా సంధాన కణజాలం (connective tissue). కాలజెన్ (collagen) అనే ప్రాణ్యముతో (protein) తయారయిన ఈ పొరలోనే స్వేద గ్రంధులు, రోమ కూపాలు, స్పర్శ జ్ఞానాన్నీ ఇచ్చే నాడీ తంతువుల అగ్రభాగాలు ఉంటాయి. సుమారు 1.0 మిల్లీమీటరు మందం ఉన్న పై పొరని బహిశ్చర్మం (epidermis) అంటారు. ఈ చర్మం, పొలుసులవంటి లక్షణాలతో కాసింత బిరుసుగా ఉంటుంది. చర్మంలోని జీవ కణాలు అంతశ్చర్మపు సంధి స్థానంలో పుట్టినప్పుడు గుండ్రంగా, బలుపుగా ఉండి, క్రమేపీ బహిశ్చర్మం వైపు తోసుకు వచ్చి – ఆ ప్రస్థానంలో పలచబడి, ప్రాణం, పరువు, ప్రతిష్ఠ పోగొట్టుకొని – పొట్టులా మారి, అనామకంగా రాలిపోతాయి. ఈ ప్రయాణానికి 3-4 వారాలు పడుతుంది. అనగా, పాము కుబుసం విడిచినట్లు, నెల నెలా సరికొత్త దుస్తులు ధరిస్తూ బయట పడుతున్నాం అన్నమాట!!
బైట ప్రపంచానికీ మనకీ మధ్యన ఉన్నది మన చర్మం మాత్రమే! “నేను” కానిదానిని స్పర్శించగలిగేది నా చర్మం మాత్రమే! మరొకలా చెప్పాలంటే, “నేను” నా చర్మం సృష్టించిన బందిఖానాలో బంధితుడిని. ఇలా బంధించిన చర్మం మనకి రూపురేఖలని ప్రసాదిస్తున్నాది, వేసవిలో చల్లబరుస్తున్నాది, చలికాలంలో దుప్పటిలా కప్పి వెచ్చదనాన్ని ఇస్తున్నాది. నాసా (NASA) వారు ఇప్పటివరకు చెయ్యలేని పనిని చేసి, అనగా, తనకుతాను మరమ్మత్తు చేసుకుని ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా తయారయి లైంగిక ఆకర్షణకి వెసులుబాటు కల్పిస్తున్నాది. చర్మాన్ని నీళ్లతో తడపచ్చు, కడగచ్చు కానీ ఆ నీరు లోపలికి ఇంకదు. శాస్త్రీయంగా చూసినప్పుడు గోళ్లు, డెక్కలు, ఈకలు, పొలుసులు, జుట్టు, వగైరాలన్నీ చర్మం వర్గం లోకే వస్తాయి. చాలా సమాజాలలో చర్మం పచ్చబొట్టు వంటి చిత్రాలతోటీ, ఇంపైన నగలతోటీ సింగారించుకోడానికి అనువైన వస్త్రం!
మన బరువులో 16 శాతం చర్మం బరువే ఉంటుంది. మన శరీరం అంతా పరుచుకుని ఉన్న చర్మం 2 చదరపు మీటర్లు వైశాల్యం ఉంటుంది. చర్మం తనంత తానుగా మరమ్మత్తు చేసుకొని ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ఉండగలదు కానీ చర్మం బాగా లోతుగా కాలిపోతే మాత్రం వైద్యుల సహాయం అవసరమవుతుంది. చర్మం నూటికి నూరు శాతం కాలిపోకుండా ఉంటే బాగున్న చర్మపు పొరలని తీసి కాలిన చోట “తాపడం” చేస్తారు. అప్పుడప్పుడు తాత్కాలిక మరమ్మత్తు కొరకు పంది చర్మాన్ని కానీ, మృతదేహాలనుండి సేకరించిన మానవ చర్మాన్ని కానీ వాడడం కూడా కద్దు. ఆ మధ్య, 1983 లో, ఇద్దరు ఐదేళ్ల బాలురు ఒంటిమీద అంటుకున్న రంగుపూత (paint) ని తీస్తూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తూ, అంటుకుని, మంటలు లేచి, వాళ్ళ శరీరాలు 98 శాతం కాలిపోయాయి. ప్రాణాలతో బయటపడ్డ పిల్లలని హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో పని చేస్తూన్న వైద్యుల దగ్గరకి తీసుకువచ్చేరు. వారు కాలిపోయిన మేరని మృతదేహాల నుండి సేకరించిన చర్మంతోటీ, పంది చర్మంతోటీ కప్పి ప్రథమ చికిత్స చేసిన తరువాత, పిల్లల చంకలలో కాలకుండా మిగిలిన ప్రాంతం నుండి కాసింత చర్మపు ముక్కని తొలగించి, దానిని ప్రయోగశాలలో, కృత్రిమ వాతావరణంలో, పెద్ద తువ్వాలంత మేర వరకు పెంచి, అప్పుడు ఆ చర్మాన్ని తిరిగి ఆ బాలుర శరీరానికి తాపడం చేసి వారిని స్వస్థులని చేసేరు!
3. స్పర్శ జ్ఞానం
చర్మం అనే మాటకి పర్యాయపదాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో కొన్ని: అజినము, త్వక్కు, తొక్క, తోలు, తాట, పట్ట, రోమభూమి, మొదలగునవి. కృష్ణాజినము అంటే లేడి చర్మం. తొక్క, తోలు, తాట, పట్ట మన వాడుకలో ఉన్న మాటలే. త్వక్కు అనేది త్వక్ అనే సంస్కృత మూలం నుండి వచ్చి ఉంటుంది. ఈ మాటలు ఏవీ కూడా స్పర్శ అనే భావాన్ని ఇవ్వవు. అయినా సరే స్పర్శ జ్ఞానాన్ని ఇచ్చే ఇంద్రియాన్ని త్వగింద్రియం అంటారు.
స్పర్శ జ్ఞానం చాలా ప్రత్యేకమైనది. కళ్ళు మూసుకుంటే అంధత్వం ఎలా ఉంటుందో అనుభవించి చూడవచ్చు, చెవులు మూసుకుని బధిరత్వాన్ని ఊహించుకోవచ్చు, కానీ స్పర్శ జ్ఞానం లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోడానికి చర్మాన్ని “ఆఫ్” చేసి చూడలేము; ఇది ఎల్లప్పుడూ “ఆన్” అయే ఉంటుంది. మనకి మొట్టమొదట సంక్రమించేది కూడా స్పర్శ జ్ఞానమే; తల్లి కడుపులో ఎనిమిది వారాల పిండానికి స్పర్శ జ్ఞానం ఉంటుందిట. పద్మవ్యూహపు రహస్యాన్ని గర్భస్థ శిశువు అభిమన్యుడు విన్నప్పుడు ఆ గర్భస్థ శిశువు వయస్సెంతో నాకు తెలియదు! మూడొంతులు జీవితాంతం వరకు ఉండేది కూడా స్పర్శ జ్ఞానమే కావచ్చు!
ఏదైనా వస్తువు మన శరీరానికి అకస్మాత్తుగా మొదటిసారి తగిలినప్పుడు కానీ, శరీరానికి తగలడంలో మార్పు జరిగినప్పుడు కానీ (ఉదా. చలి వేస్తూన్నప్పుడు కప్పుకున్న దుప్పటిని దగ్గరగా లాక్కోవడం) ఆ ప్రేరణకి వెనువెంటనే మెదడు చైతన్యవంతం అయి స్పందిస్తుంది. బయటనుండి వచ్చే ప్రేరణలో మార్పు లేకుండా నిలకడగా ఉంటే ఆ స్పందన నేపథ్యంలోకి వెళ్ళిపోతుంది. అదే విధంగా మనం దేన్నయినా ముట్టుకున్నప్పుడు (బుజ్జి పాపాయి బుగ్గని కానీ, కొత్త కారుని కానీ, మంచుముక్కని కానీ) మన వేళ్ళ కొనలలో ఉన్న స్పర్శ గ్రాహకాలు (touch receptors) ఒక్కసారి స్పందించి, మెదడుకి ఒక వార్తా ప్రవాహాన్ని పంపుతాయి. అప్పుడు ముట్టుకున్న వస్తువు మెత్తగా కానీ, నున్నగా కానీ, చల్లగా కానీ తగిలినట్లు మనకి అనుభూతి కలుగుతుంది.
(చర్మంలోఉండే ముఖ్యమైన స్పర్శ గ్రాహకాలు ఈ బొమ్మలో చూడవచ్చు. వీటిల్లో Meissner’s corpuscles స్పర్శకే కాకుండా తక్కువ తరచుదనం ఉన్న కంపనాలకి కూడా స్పందిస్తాయి.)
మన చర్మంలో ముఖ్యంగా నాలుగు రకాల స్పర్శ గ్రాహకాలు ఉన్నాయి: వేడి, చల్లదనం, ఒత్తిడి, నొప్పిని గ్రహించే గ్రాహకాలు. ఇవే రకరకాల పాళ్లల్లో సమ్మిశ్రమం అయినప్పుడు మనకి రకరకాల అనుభూతులు కలుగుతాయి. ఉదాహరణకి నొప్పిని తీసుకుందాం: గీరుకుపోవడం, గుచ్చుకోవడం, గుద్దుకోవడం, నలిగిపోవడం. ఇవన్నీ ఒకే రకమైన “నొప్పిని” కలుగజేయవు!
మన శరీరాన్ని లాలనతో నిమిరినప్పుడు స్వరసమ్మేళనం జరిగినట్లు ఎన్నో స్పర్శ గ్రాహకాలు స్పందిస్తాయి. బహిశ్చర్మానికీ అంతశ్చర్మానికీ మధ్యలో కోలగా ఉండే Meissner’s corpuscles అనే కట్టడాలు ఉంటాయి. ఇవి రోమములు లేని ప్రాంతాలలో (ఉదా. అరికాళ్ళల్లో, అరిచేతులలో, వేళ్ళ కొనలలో, నాలుక చివర, చనుమొనలలో, పురుషాంగము చివరలో, కొక్కోక మండలాలలో (erogenous zones లో) చదరపు సెంటీమీటరు మేరలో 1,500 వరకు ఉంటాయి. ఇవి ఎక్కువ సున్నితంగానూ సూక్ష్మగ్రాహకంగానూ ఉంటాయి. ఇటువంటి శరీరభాగాలని ముట్టుకున్నప్పుడు కొందరు తక్షణం త్వరగా స్పందిస్తారు.
రోమకూపాలలో ఎక్కువ ఇంద్రియ గ్రాహకాలు (sense receptors) ఉంటాయి కనుక సాధారణంగా రోమాలున్న ప్రదేశాలు ఎక్కువ సూక్ష్మగ్రాహకంగా ఉండి స్వల్పమైన ఒత్తిడికి త్వరగా స్పందిస్తాయి. జంతు ప్రపంచంలో – చిట్టెలుకల నుండి సింహాల వరకు – మీసాలు అత్యంత సూక్ష్మగ్రాహకాలు. ఎక్కువ రోమాలున్న ప్రదేశాలలో చర్మం ఎక్కువ పలచగా ఉండడం కారణంగా ఆయా ప్రదేశాలు ముట్టుకుంటే చాలు వెంటనే స్పందిస్తాయి. బహిశ్చర్మానికి స్పర్శ జ్ఞానం ఉండదు, అంతశ్చర్మంలోని నాడీతంతువుల కొనలలోనే స్పర్శ జ్ఞానం ఉంటుంది. అందుకనే చేతి వేళ్ళ కొనలలో స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. చిత్రిక పట్టిన కర్ర నున్నగా, చదునుగా వచ్చిందో లేదో చూడడానికి వడ్రంగి వేలితో కర్ర పొడుగునా వేలితో రాసి (తడిమి) చూస్తాడు. పాకం సరిగా వచ్చిందో లేదో చూడ్డానికి పాచకుడు బొటనవేలు, చూపుడు వేళ్ళ మొనల మధ్య ఒక చుక్క పాకాన్ని వేసి సాగదీసి చూస్తాడు.
శరీరం మీద మొలిచే “జుత్తు”లో రకాలు ఉన్నాయి. జుత్తు అనేది తల మీద మొలిచే కేశ సంపద. తల మీద, ముఖం మీద మినహాయించి మిగిలిన శరీరం మీద మొలిచేవి రోమములు. అనగా, చిన్నతనం నుండీ – ఆడ, మగ భేదం లేకుండా – శరీరం అంతా మెత్తని నూగులా కనిపించేవి రోమాలు. దీనిని vellus hair అంటారు. ఇది కాకుండా తరుణ వయస్సులో చిక్కటి, నల్లటి వెంట్రుకలు (androgenic hair) కొన్ని శరీర భాగాలలో కనిపిస్తాయి. ఇవి అన్ని దేశాలలోని ప్రజలలోనూ ఒకేలా ఉండవు. చైనా, జపాన్, కొరియా వంటి దేశవాసుల శరీరం మీద వెంట్రుకలు చాలా తక్కువ ఉంటాయి. మధ్యధరా ప్రాంతాల ప్రజల శరీరాల మీద ఉన్న రోమాలు చూస్తే ఎలుగుబంట్లు గుర్తుకి వస్తాయి. మాయాబజార్ సినిమాలో “ఆహనా పెళ్ళియంటా…” అనే పాట పాడుతూన్నప్పుడు ఘటోత్కచుడి పాదాల మీద ఇలాంటి వెంట్రుకలు కనిపిస్తాయి! ఇలా వెంట్రుకలు మొలవడానికి కారణం యుక్తవయస్సులో testosterone అనే రసాయనం తయారవడం. ఈ testosterone బంధువు dihydrotestosterone (DHT) అనేది మరొకటి ఉంది. ఇది రోమకూపాలలో చేరిన వారికి బట్టతల వచ్చే సావకాశాలు ఎక్కువ. అలాగని బట్టతల ఉన్నవారికి ఎక్కువ పురుషత్వం ఉంటుందని తీర్మానించడానికి వీలు లేదు.
చాలామందికి తలమీద దరిదాపు లక్ష కుదుళ్ళు (రోమకూపాలు, పుటికలు, hair follicles) ఉంటాయి. కేశ సంరక్షణ కార్యక్రమాలలో ప్రతి రోజూ 50 నుండి 100 దాకా తల వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. ప్రతి వెంట్రుక ఏడాదికి ఐదారంగుళాల చొప్పున నాలుగైదు ఏళ్ళపాటు ఎదుగుతుంది. తరువాత ఆ కుదురు కొన్ని నెలలపాటు విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు ఆ కుదురులో వెంట్రుక రాలిపోతుంది. కొన్నాళ్ళు పోయిన తరువాత ఆ కుదురు శక్తిని పుంజుకుని సరికొత్త వెంట్రుకని ఉత్పత్తి చేస్తుంది. ఒక అందమైన అమ్మాయి పిరుదులదాకా జెర్రిగొడ్డులా వేళ్ళాడే వాల్జడ చూసినప్పుడు మనం వివిధ దశలలో పుట్టి, పెరుగుతూన్న వెంట్రుకల సమాహారాన్ని చూస్తున్నామన్నమాట!
కొందరి జుత్తు మెత్తగా పట్టులా ఉంటుంది. కొందరిది బిరుసుగా – మా అమ్మ మాటల్లో – ఏదుపంది కొయ్యలలా – ఉంటుంది. ఈ వ్యత్యాసానికి రెండు కారణాలు చెబుతారు. ఒకటి, ప్రతి వెంట్రుకలోనూ రెండు పొరలు ఉంటాయి. (జొన్న కంకెని ఊహించుకోండి.) బయటి పొర పలచగా బిరుసుగా ఉంటుంది, లోపలి కాండం మెత్తగా ఉంటుంది. కుదుళ్ళు పెద్దగా ఉండి, పైపొర పలచగా ఉన్న వారి జుత్తు బిరుసుగా ఉంటుంది. కుదుళ్ళు చిన్నగా ఉండి, రెండు పొరలు దరిదాపు సమాన స్థాయిలో ఉన్న వారి జుత్తు మెత్తగా ఉంటుంది. కుదుళ్ళు ఒక క్రమ పద్ధతిలోబారులు తీరి ఉంటే జుత్తు సాఫుగా, తిన్నగా ఉంటుంది. కుదుళ్ళ అమరికలో ఒక వరసా, వావీ లేకుండా అడ్డదిడ్డంగా ఉన్నవారికి ఉంగరాల జుత్తు వస్తుంది. బిరుసుగా, ఉంగరాల జుత్తు ఉన్నవారి జుత్తుకి పేలు పట్టవు. అందుకనే అమెరికాలో తెల్లపిల్లలకి ఉన్న పేల బాధ నల్లపిల్లలకి ఉండదంటారు.
4. ఇంద్రియాల అంతర్యుద్ధం
చారిత్రకంగా చూస్తే పరిశోధకులని చక్షురింద్రియము, శ్రవణేంద్రియము ఆకర్షించినంతగా స్పర్శేంద్రియము (త్వగింద్రియము) ఆకర్షించలేదేమో అనిపిస్తుంది. కంటిని, చెవిని అధ్యయనం చెయ్యాలంటే మనకి అవసరమైన సరంజామా అంతా కనుగుడ్లలోనూ, చెవిలోనూ ఉంటాయి. స్పర్శని ఈ విధంగా అధ్యయనం చెయ్యలేము. పైపెచ్చు కళ్ళు, చెవులు ఒకే జాతి సంవేదక సమాచారంని (sensory information) ప్రక్రియాపన (process) చేస్తాయి; కళ్ళు విద్యుదయస్కాంత తరంగాలని, చెవులు శబ్ద తరంగాలని. అంతే కాదు. కంటి నుండి, చెవి నుండి మెదడుకి వెళ్ళే నాడీ-విద్యుత్ తరంగాలు ప్రయాణించవలసిన దూరం తక్కువ.
ఈ కోణంలోచూస్తే స్పర్శతో వ్యవహారం ఎన్నో రెట్లు సంక్లిష్టమైనది. స్పర్శ జ్ఞానం కలిగించే నాడీ కణాలు శరీరం అంతటా వ్యాపించి ఉన్నాయి: అంతశ్చర్మంలోనూ, అంతర్గతంగా ఉన్న శరీరాంగాలలోనూ. స్పర్శతో ప్రేరేపించబడ్డ నాడీ-విద్యుత్ తరంగాలు మెదడుని చేరుకోడానికి చాలా దూరం ప్రయాణం చెయ్యాలి. దానికి తోడు ఈ స్పర్శ తరంగాలు బహు-మితీయాలు (multi-dimensional). అనగా, వీటి ప్రేరణకి అనేక కారణాలు ఉండొచ్చు: వేడి, ఒత్తిడి, కంపనం, నొప్పి, దురద, స్పర్శ, కితకితలు, రసాయనాలు, వగైరా.
కళ్ళు కనిపించకపోయినా, చెవులు వినిపించకపోయినా బ్రతకవచ్చు. కానీ స్పర్శ లేకపోతే బ్రతకలేము. ఈ స్పర్శ జ్ఞానం లేకపోతే ప్రపంచంతో ప్రతిస్పందన కుదరదు. అప్పుడప్పుడు కొందరికి నొప్పికి స్పందిచలేని తత్త్వం (congenital insensitivity to pain) పుట్టుకతోటే సంక్రమిస్తుంది. ఇది ఒక జన్యు లోపం. వీరికి నొప్పి తెలియదు. ఇలాంటివారికి ఒళ్ళు కాలినా, మరే ఇతర కారణాల వల్ల నొప్పి పుట్టినా తెలియదు. అది ఎంత ప్రమాదమో చదువరుల ఊహకి వదలిపెడతాను!
5. పిల్లల వికాసంలో స్పర్శ పాత్ర
పిల్లలు పుట్టిన దగ్గరనుండి వారు ఎదిగే దశలలో – వారి మానసిక వికాసంలో, భౌతికమైన ఎదుగుదలలో, సామాజిక స్పృహ పెంచుకోవడంలో – స్పర్శ కీలకమైన పాత్ర పోషిస్తుంది. వాత్సల్యముతో కూడిన స్పర్శ పిల్లల పెరుగుదలని పెంపొందించే ఉత్తేజితాల ఉత్పత్తిని ప్రోత్సాహపరచడమే కాకుండా వారి రోగనిరోధక వ్యవస్థని బలపరుస్తుంది. పిల్లలపై మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా స్పర్శ కీలకమే. పెంచుతూన్న పెద్దలకి, పెరుగుతూన్న పిల్లలకి మధ్య అనుబంధం పటిష్ఠం కావాలంటే పెద్దలు పిల్లలని చేరదీసి కౌగలించుకోవడం, గుండెలకి హత్తుకోవడం వంటి పనులు చేస్తూ ఉండాలని వైద్యులు చెబుతూ ఉంటారు.
ఒళ్ళు మర్డనా చేసిన చంటిపిల్లలు – మానసికంగానూ, శారీరకంగానూ – బాగా ఎదుగుతారనడానికి శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయి. నా చిన్నతనంలో, మా ఇంట్లో, పసిపాపలకి ఒంటినిండా నూనె రాసి, మర్దనా చేసి, నీళ్లు పోసేవారు. పిల్లలకీ పాలు పట్టి, తొట్టెలో పడేసి, వాళ్ళ మానాన వాళ్ళని – అనాధ శరణాలయాలలో పిల్లల మాదిరి – వదిలెయ్యకూడదు. తరచుగా వారిని పలకరించడం, చేతితో నిమరడం, ఒడిలో పడుక్కోబెట్టుకుని పాలు పట్టడం, వారితో ఆటలు ఆడడం వంటి పనులతో వారిని భౌతికంగానూ, మానసికంగానూ స్పర్శిస్తూ ఉండాలి. పదేళ్ల క్రితం అమెరికాలో కార్ల వెనక ఉండే “బంపర్ల” మీద “Did you hug your child today?” అనే ప్రశ్న తరచు కనిపించేది.
కామోద్దీపకమైన స్పర్శ మానవుల లైంగిక జీవితాలలో చాలా ముఖ్యమని నేను వేరే చెప్పక్కరలేదు. ఈ అంశాన్ని ఎన్నో సమాజాలలో ఎందరో సృజించేరు. దేవాలయాల గోడలమీద శిల్పాలు చెక్కి చూపించేరు. స్త్రీ పురుషుల శరీర భాగాలలో ఏయేభాగాలు అతి సున్నితము, ఇంద్రియగ్రాహ్యము, శీఘ్రగ్రాహ్యముగా ఉంటాయో వాత్సాయనుడు నుండి నేటి వరకు అనేకులు పుస్తకాలు రాసేరు. ఇటీవల, అనగా 1976 లో, అమెరికాలో, Wayne Dyer అనే ఆసామీ Your Erogenous Zones అనే పుస్తకం రాసి బాగా డబ్బు చేసుకున్నాడు. (Erogenous zones are body areas highly sensitive to touch and stimulation, often leading to sexual arousal and pleasure. These zones can vary in sensitivity between individuals and can include the genitals, breasts, neck, lips, and other areas.)
6. చర్మానికి కలిగే అస్వస్థతలు బహు-మితీయాలు
చర్మం మనని బయటి ప్రపంచపు ధాటి నుండి ఎంత రక్షించినా కానీ తనని తాను సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, విషాణువులు (viruses), పరాన్నజీవుల (parasites) ప్రభావం వల్ల కలిగే తిష్ఠకి (infection) రక్షించుకోలేకపోవచ్చు.
6.1 బేక్టీరియా తిష్ఠలు (Bacterial infections)
స్టెఫిలోకాకస్ (Staphylococcus) అనే బేక్టీరియా చర్మం మీదా, ముక్కులోనూ సర్వసాధారణంగా ఉంటాయి కానీ హాని చెయ్యవు. కానీ చర్మం తెగి ఇవి లోపలికి ప్రవేశిస్తే అక్కడ తిష్ఠ వేస్తాయి. అప్పుడు చర్మం ఎర్రబడడం, వాపు, నొప్పితో పాటు చీము పట్టిన పొక్కులులా తేలి పుండ్లు అవుతాయి.
స్ట్రెప్టోకోకస్ (Group A Streptococcus , GAS) బేక్టీరియా చర్మం మీదా, శ్వాసమార్గం లోనూ తిష్ఠ వేయవచ్చు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బయటపడే తుంపర్ల ద్వారా కానీ, బేక్టీరియా ద్వారా కలుషితమైన ప్రదేశాలని ముట్టుకోవడం వల్ల కానీ ఇది వ్యాపిస్తుంది. ఈ తిష్ఠ పిల్లలకి సోకినప్పుడు అశ్రద్ధ చేస్తే ఇంపెటిగో (impetigo), సెల్యులైటిస్ (cellulitis) అనే వ్యాధులకు దారి తీయవచ్చు. ఈ సెల్యులైటిస్ ని అశ్రద్ధ చేస్తే ప్రాణానికే ప్రమాదం!
6.2. శిలీంధ్రాల తిష్ఠలు (Fungal skin infections)
వివిధ రకాల శిలీంధ్రాలు తిష్ఠకు కారణమవుతాయి. ఫలితంగా “క్రీడాకారుల పాదం” (athelate’s foot), తామర (ringworm), మధుశిలీంద్రపు తిష్ఠ (yeast infection) వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. వీటి లక్షణాలు: దురద, చర్మం ఎర్రబడడం, దద్దుర్లు.
6.3. విషాణు తిష్ఠలు (Viral infections)
హెర్పీస్ సింప్లెక్స్-1 జాతి విషాణువులు జలుబు పుండ్లు (cold sores) కి కారణం అవుతాయి. ఇవి అమాయకంగా, పెదవి మీద చిన్న పొక్కులా లేస్తాయి. ఒక రోజు పోయిన తరువాత కాసింత వాచి, ఎర్రబడతాయి. మూతి మీద పుండు అనేసరికి నలుగురిలోకి వెళ్ళడానికి తటపటాయిస్తాము. నాలుగైదు రోజులలో ఎలా వచ్చిందో అలానే పోతాయి. వాటి గురించి పట్టించుకోము. కానీ, ఇటీవల పరిశోధకులు ఏమంటున్నారంటే ఈ “పడిశం పుండ్లు” తరువాత వృద్ధాప్యంలో రాబోయే “అల్జీమర్స్” వ్యాధికి సంకేతం అంటున్నారు. ఇదెంతవరకు నిజమో చెప్పలేము.
పులిపిర్లు (warts, caused by human papillomavirus), మోలస్కం కంటేజియోసమ్ (molluscum contagiosum) అనే అంటువ్యాధులు తరచుగా చర్మంపై చిన్న బొబ్బలుగా కనిపిస్తాయి.
6.4. పరాన్నజీవుల తిష్ఠ (Parasite infections)
నల్లులు (bedbugs), పేలు (lice), ఈళ్లు (mites) వంటి పరాన్నజీవులు తిష్ఠకు కారణం కావచ్చు. ఈళ్ళు చర్మం కిందకి దొలుచుకుని వెళ్లి అక్కడ తిష్ఠ వేస్తాయి. ఆ తిష్ఠనే గజ్జి (scabies) అంటారు. తామర (eczema), గజ్జి మధ్య తేడా తెలుసుకోవాలంటే వైద్యుడిని సంప్రదించాలి.
6.5. నివారణ మార్గాలు
చేతులని, చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మొదటి మెట్టు. తువ్వాళ్ళు, రేజర్లు, తదితర వ్యక్తిగత వస్తువులని ఇతరులతో పంచుకోవడం వల్ల బేక్టీరియా వ్యాప్తి చెందుతుంది గాయాలకు సరైన చికిత్స చేయాలి. బేక్టీరియా ప్రవేశాన్ని నిరోధించడానికి తెగిన చర్మాన్ని, గీరుకుపోయిన చర్మాన్ని శుభ్రం చేసి, కట్టు వేయాలి. ఎండిన చర్మం పగుళ్లకు గురవుతుంది; ఇవి బ్యాక్టీరియాకు ప్రవేశ మార్గాన్ని కల్పిస్తాయి. కనుక చర్మం ఎండిపోకుండా ఉంచుకోవాలి.
శిలీంధ్రాలు వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందుతాయి, కాబట్టి చర్మాన్ని పొడిగా ఉంచాలి. ఒదులుగా ఉండే దుస్తులను ధరించండి. ముఖ్యంగా చెమట పట్టే ప్రాంతాలలో గాలి ప్రసరణకి వీలయిన దుస్తులు ధరించాలి. వేడి దేశాలలో మేజోళ్ళు తరచు ఉతికి ఆరేస్తూ ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లోకి చెప్పులు లేకుండా వెళ్లకూడదు. శిలీంధ్రాల దాడి ప్రభావాన్ని తగ్గించడానికి నలుగురూ వాడే మరుగుదొడ్లు, స్నానపు గదులు వాడేటప్పుడు పాదరక్షలు ధరించాలి.
సన్నిహిత భౌతిక స్పర్శ వల్ల తిష్ఠ వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువ కనుక తిష్ఠ వ్యాధి సోకిన వ్యక్తితో తువ్వాళ్లు, పాత్రలు, తదితర వ్యక్తిగత వస్తువులను పంచుకోకూడదు. కొన్ని తిష్ఠలు లైంగికంగా సంక్రమించవచ్చు కాబట్టి, రక్షణను ఉపయోగించడం వల్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
కాళ్లకు పట్టే గజ్జిని పోగొట్టే వైద్య సూత్రం ఒకటి మన జానపద సాహిత్యంలో కనిపిస్తుంది:
“కాళా గజ్జి కంకాళమ్మా – వేగుల చుక్కా వెలగా మొగ్గా – మొగ్గా
కాదూ మోదుగు నీరూ – నీరూ కాదూ నిమ్మల బావీ – బావీ
కాదూ బచ్చలకూర, కూరా కాదూ కుంకుం మెట్టు – మెట్టూ
కాదూ మేదర ఇల్లూ, ఇల్లూ కాదూ ఈగల తొట్టె – తొట్టె
కాదూ తీసి కడగబెట్టు!”
కంకాళాకు, వెలగ మొగ్గ, మోదుగు నీరు, నిమ్మరసం, బచ్చలాకు, కుంకుమ పువ్వుతో నూరి గజ్జి పట్టిన కాళ్ళకి రాస్తే తగ్గుతుందని సూచన!!
6.6. ఎలర్జీ
కొన్ని మొక్కల ఆకులు చర్మానికి తగిలితే దురద పుడుతుంది. దీనిని ఇంగ్లీషులో “కాంటాక్ట్ డెర్మటైటిస్” అంటారు. కొన్ని పడని చర్మ సంరక్షణ ఉత్పత్తులు, సౌందర్య సాధనాలవల్ల కూడా చర్మం ప్రకోపించవచ్చు. కొన్ని పడని పదార్థాలు తిన్నప్పుడు కూడా ఎలర్జీ కలుగవచ్చు. ఎలర్జీ అంటే పడకపోవడం! ఎలర్జీ నివారణకి ప్రతిచర్యలకు కారణమైన పదార్థాల వాడకం నివారించాలి.
ప్రతి రకం చర్మ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స అవసరం. మీరు మీ చర్మంలో ఏవైనా అసాధారణమైన లేదా స్థిరమైన మార్పులను గమనించినట్లయితే (కొత్తగా పుట్టుమచ్చలు పుట్టుకు రావడం, వగైరా) తక్షణమే చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి అది కేన్సరు కాదని నిర్ధారించుకోవాలి.
పైన ఉదహరించిన సమస్యలు ఎవ్వరైనా ఎదుర్కోవలసినవి. కానీ మధుమేహం (diabetes) ఉన్న వారికి ఈ సమస్యలలో ఏది ఎదురైనా అది విషమించే అవకాశాలు ఎక్కువ. అంతే కాకుండా డయబెటీస్ ఉన్నవారికి చర్మానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక సమస్యలు ఎదురవుతాయి. వీరు వైద్యుడి పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో గ్లూకోజు మట్టం అధికంగా ఉన్నవారి చర్మంలో తేమ నశించి ఎండినట్లు ఉండడం వల్ల తేలికగా పైన చెప్పిన జాబితాలో ఉన్న తిష్ఠలకి గురి అవుతారు.
7. చర్మం రంగు – బొల్లి
మన చర్మం పైపొరకి రంగు లేదు. పారదర్శకంగా ఉండే ఈ పైపొరకి కిందవైపున ఉండే మెలనిన్ (melanin) అనే రంగు పదార్థమే మన శరీరపు ఛాయకి ముఖ్యకారణం. మెలనిన్ మోతాదు తక్కువగా ఉన్నవాళ్ళు తెల్లగా కనిపిస్తారు. మోతాదు ఎంత ఎక్కువగా ఉంటే అంత నల్లగా కనిపిస్తారు; ఓ మోస్తరుగా ఉంటే చామనఛాయలో కనిపిస్తారు.
భూమధ్యరేఖకి దగ్గరగా నివసించే ప్రజలు ఉత్తర అక్షాంశాలలో ఉండే ప్రజల కంటే నల్లగా ఉంటారు. ఎందుకని? భూమధ్యరేఖకి దగ్గరగా జరుగుతూన్న కొద్దీ సూర్యరశ్మిలోని అత్యూద కిరణాల పాలు పెరుగుతుంది. ఇవి శక్తివంతమైన కిరణాలు కాబట్టి చర్మం లోపలికి చొచ్చుకుని హాని చెయ్యకలవు. నల్లని చర్మం కింద ఉండే ఎక్కువ మెలనిన్ హాని కలిగించే అత్యూద కిరణాలు లోపలి చొరబడకుండా అడ్డుకుంటుంది. కనుక ఉష్ణప్రాంతాలలో నివసించే వారికి నలుపు రంగు ఒక రక్షక కవచం లాంటిది. కానీ ఈ బొమ్మకి ఒక బొరుసు కూడా ఉంది. తెల్లటి చర్మం వారి శరీరంలోకి సూర్యరశ్మి తేలికగా చొరబడడం వల్ల వారి శరీరాలు విటమిన్ డి ని తేలికగా, సమృద్ధిగా చేయగలవు. ఈ కారణాల వల్ల నల్లటి శరీర ఛాయ ఉన్నవారిలో తరచుగా విటమిన్ డి లోపం కనబడుతుంది.
మనిషి అందంగా కనిపించడానికి శరీరపు ఛాయకి మధ్య ఏమీ సంబంధం లేదు. కను-ముక్కు తీరు బాగుండి, ఒడ్డు-పొడుగు సమతూకంలో ఉండి, ముఖం పొడుగు-వెడల్పులు సువర్ణ నిష్పత్తిలో (Golden Ratio) ఉంటే ఆ వ్యక్తి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాడు (కనిపిస్తుంది). నలుపు ఛాయలో ఉండే కృష్ణుడు, ద్రౌపది అందమైనవాళ్ళ కిందే లెక్కలోకి వస్తారు. తెల్లగా ఉన్నా, తెస్సోడుతూ ఉంటే అది అందం అనిపించుకోదు.
మనకి పుట్టుకతో వచ్చే ఛాయని ‘తత్త్వపు ఛాయ’ అంటారు. బయట వాతావరణపు ప్రభావం వల్ల ఎట్టకేలకు వచ్చే ఛాయని ‘సంక్రమణ చాయ’ అంటారు. మన శరీరపు ఛాయ శరీరం అంతా ఒకేలా ఉండదు. ఎండ తగిలే చోట్ల (ముఖము, ముంజేతులు) నలుపు డౌలు కొంచెం ఎక్కువగానూ, లోపలి భాగాలలో (ఛాతీ, తొడలు) కొంచెం తెలుపు ఎక్కువగానూ ఉంటుంది. ఛాయలో ఈ మార్పు క్రమేణా జరగకపోతే మనం చారల గుర్రాలలా కనిపిస్తాం! (తెల్లవాళ్ళల్లో పనిగట్టుకుని ఎండలో పడుకొని ఒళ్ళు నల్లబరచుకొనే ఆచారం ఒకటి ఉంది. సముద్రపుటొడ్డు నుండి రాగానే ఆడవాళ్ళని చూస్తే నిజంగానే చారల గుర్రాలలా కనిపిస్తారు!)
చర్మపు రంగులో మార్పు కొద్దిగా జరిగినా, క్రమేణా జరిగినా ఎబ్బెట్టుగా కనిపించదు; కొట్టొచ్చినట్లు తెల్లటి మచ్చలు కనిపించినప్పుడే ఇబ్బంది. అందుకనే తెల్లగా ఉంటే బాగుండునని మనకి మనస్సులో ఎంతలా ఉన్నా, శరీరం మీద తెల్లటి మచ్చలు కనిపించేసరికి భయపడి వైద్యుడి దగ్గరకి పరిగెడతాం.
బొల్లి జాతి రోగాలన్నిటిని గుత్తగుచ్చి ఇంగ్లీషులో లూకోడెర్మా (Leucoderma) అంటారు. లూకో అంటే తెలుపు, డెర్మిస్ అంటే చర్మం. కనుక లూకోడెర్మా అంటే తెల్లటి చర్మం అని అర్థం. బొల్లిని వైద్య పరిభాషలో విటిలీగో (vitiligo) అంటారు. చరక సంహిత లోనూ, తదితర సంస్కృత గ్రంథాలలోనూ దీనిని ‘శ్వేత కుష్టు’ అనే పేరుతో పిలిచారు. కానీ ఈ పేరు సరి అయినది కాదు. కుష్టు (leprosy) రోగానికి, బొల్లికి ఏ విధమైన సంబంధమూ లేదు. నిజానికి బొల్లి ఒక రోగం కాదు.
మహాభారత కథలో పాండురాజుకి వచ్చిన ‘పాండు రోగం’ మూడొంతులు బొల్లి అయి ఉంటుందని నా ఊహ. దీన్ని చూసి కుంతీదేవి అదేదో భయంకరమైన రోగం అని భయపడిన్నీ, పిలల్ని కనకపోతే పున్నామ నరకాలు వస్తాయని భయపడిన్నీ, దేవతల సహాయంతో పిల్లలని కని ఉంటుందనిన్నీ ఒక వాదం లేవదీయవచ్చు. బొల్లిని చూసి కుంతీదేవి భయపడకపోతే భారత కథ మరొక విధంగా మలుపు తిరిగి ఉండేదేమో.
బొల్లి మచ్చలు ఉన్నా ప్రపంచంలో పేరు ప్రతిష్ఠలు గణించిన పెద్దల పేర్లు కొన్ని: మైకల్ జాక్సన్, చంద్రబాబు నాయుడు, అమితాబ్ బచ్చన్.
8. చర్మ లేపనాలు, చర్మ సంరక్షణ
నా చిన్నతనంలో సౌందర్య పరిపోషణకి, పరిరక్షణకి ఆడవాళ్లు వాడే సాధనాలలో ముఖ్యమైనవి కళ్ళకి కాటుక, ముఖానికి పసుపు. తరువాత పాశ్చాత్య ప్రభావం వల్ల స్నో, పౌడరు! మరీ బరితెగించిపోతే పెదాలకి లిప్స్టిక్! కాలక్రమేణా ముఖం మీద ముడతలని తొలగించడానికి రకరకాల లేపనాలు, కషాయాలు, ద్రావకాలు, చూర్ణాలు, విపణివీధిలోకి వస్తున్నాయి. ఇటీవల “పురుషులకు ప్రత్యేకించి చేయబడ్డవి” అని ఊదరగొట్టి ఈ వేలం వెర్రిలో పురుషులని కూడా లాగుతున్నారు వర్తకులు! చర్మ రక్షణ శాఖలో L’Oréal కంపెనీ వారు 20 రకాల లేపనాలు తోటీ, Estée Lauder కంపెనీ వారు 14 రకాల లేపనాలు తోటీ పోటీ పడుతున్నారు! వీటిల్లో వార్ధక్యాన్ని కప్పిపెట్టే (anti-aging) పద్ధతుల మీద ఎక్కువ గిరాకీ కనిపిస్తోంది.
ఇరవై ఏళ్ల వయస్సులో అందంగా, మృదువుగా ఉన్న చర్మం కాలగమనంలో ఎండల వల్ల, పర్యావరణం ప్రభావం వల్ల ఢక్కామొక్కీలు తింటూ, hyaluronic acid, collagen, elastin మొదలైన పనికొచ్చే కారణాంశాల ఉత్పత్తిని కోల్పోయి, క్రమేపీ మృదుత్వం, వికాసం తగ్గి, ముడతలు పడి, అందవిహీనంగా తయారవుతుంది. దీనికి తోడు గడ్డిలో కలుపు మొక్కలు బయలుదేరి పచ్చిక బైలుని నాశనం చేసినట్లు senescent cells (also known as zombies) పుట్టుకొచ్చి, ఆరోగ్యమైన జీవకణాలు మనుగడకి ముప్పు తెస్తాయి. తత్ఫలితంగా ముఖం మీద చర్మం ముడతలు పడడం కళ్ళ కింద సంచులు రావడం, చర్మం వివర్ణం అవడం, వర్చస్సు తగ్గడం వంటి సంఘటనలు జరుగుతాయి.
ఆయుర్వేదం చర్మ సంరక్షణని తీవ్రంగానే అధ్యయనం చేసింది. వాత తత్త్వం ఉన్న వారి వయస్సు చర్మం మీద తేలికగా కనిపిస్తుంది. అనగా, చర్మం పొడిగా ఎండిపోయినట్లు ఉండడం వల్ల, పగుళ్లు, ముడతలు సులభంగా కనిపిస్తాయి. కనుక వీరికి తైలంతో మర్ధనాలు, తేమని కలిగించే లేపనాలు బాగా ఉపకరిస్తాయి. వీరి వయస్సు కనబడకుండా చేయడానికి ఎన్నో ఉపాయాలు ఉన్నాయి.
పిత్త తత్త్వం ఉన్న వారి చర్మం సున్నితం. వీరి శరీరం మీద మచ్చలు (acne and freckles) ఎక్కువగా ఉండే సావకాశం ఉంది కనుక వీరి వయస్సు కూడా త్వరగా చర్మం మీద కనిపిస్తుంది. వీరు ఎండలో పడుక్కోవడం (sun bathing or tanning), బహిశ్చర్మపు పొరల్ని బలవంతంగా ఊడబెరకడం (exfoliating) వంటి కార్యక్రమాలకి దూరంగా ఉండాలి అని ఆయుర్వేదం హెచ్చరిస్తుంది.
కఫ తత్త్వం ఉన్న శరీరాలు స్నిగ్ధతతో (అనగా, మెత్తగా, నునుపుగా, జిడ్డుగా) దృఢంగా ఉండడం వల్ల మీద పడుతూన్న వయస్సు సులభంగా కనబడదు. వీరి ధ్యేయం ఉన్నదానిని రక్షించుకోవడమే. వీరు వారానికోసారి నూనె రాసుకుని, నలుగు పెట్టుకుని, అభ్యంగన స్నానం చేస్తూ ఉంటే చాలు.
అన్ని తత్త్వాలకీ అనుకూలమైన తైలాలు, చూర్ణాలు, లేపనాలు ఆయుర్వేద దుకాణాలలో దొరుకుతాయి.
9. నొప్పి
శంకరాభరణం సినిమాలో కథానాయకుడు శంకరశాస్త్రి అరిచేతిలో హారతి కర్పూరం వెలిగించి “శంకరా! నాదశరీరా!…” అని పాట పాడతాడు. “చెయ్యి కాలి, మంట పుట్టదా?” అనే అనుమానం వచ్చింది. లారెన్స్ అఫ్ అరేబియా సినిమాలో కథానాయకుడు లారెన్స్ ఒక కొవ్వొత్తి మంట మీద చేతిని పెట్టి చర్మం కాలి కుతకుతలాడే వరకూ ఆగుతాడు. అదే పనిని అతని అనునాయుడు చేయబోయి, చెయ్యి చుర్రు మనగానే చర్రున వెనక్కి లాగి, “లారెన్స్! నీకు చెయ్యి నొప్పెట్టలేదా?” అని అడుగుతాడు. “నొప్పెట్టింది!”
“మరైతే ఇక్కడ ట్రిక్ ఏమిటి?” అని అడుగుతాడు. “నొప్పిని పట్టించుకోక పోవడమే ట్రిక్” అంటాడు.
జీవశాస్త్రంలో ఎదురయే ఒక జటిలమైన ప్రహేళిక ఏమిటంటే నొప్పి అనేది ఆత్మగతం! ఎంతనొప్పిని భరించగలం అనేది వ్యక్తినిబట్టి, పరిస్థితిని, సమాజపు నమ్మకాలని బట్టి, మారుతూ ఉంటుంది. యుద్ధంలో దెబ్బలు తిన్న సైనికులు అనూహ్యమైన నొప్పిని – మార్ఫిన్ లాంటి మందులు అడగకుండా – భరిస్తారు. అదే వ్యక్తి మామూలు సందర్భాలలో నొప్పిని భరించలేక మార్ఫిన్ కావాలని కోరుతాడు. మన దేశంలో పీర్ల పండుగ వేళల్లో నిప్పుల మీద నడిచేవాళ్ళని నేను చూసేను. వాళ్ళ చర్మం కాలిన వాసన నా ముక్కుకి తగిలినా వారు నొప్పితో బాధ పడ్డట్లు నా కళ్ళకి కనబడలేదు! అంత వరకు ఎందుకు? కాఫీ కుంపట్లో నివురు కప్పిన బొగ్గు కణికలని చేత్తో తీసి మరొక కుంపట్లో మా అమ్మ వెయ్యడం నేను ఎన్నోసార్లు చూసేను.
9.1 నొప్పి నేపథ్యం
జరామరణాలలాగే నొప్పి కూడా ఒక తప్పించుకోలేని అనుభవం. ప్రతి జీవీ నొప్పి అనుభవించే ఉంటుంది. నిజానికి నొప్పి అనేది ఒక “రక్షక సంవిధానం” (defensive mechanism). ఈ రక్షక వ్యవస్థ ఎప్పుడు రంగంలోకి దిగుతుంది? దెబ్బ తగలడం వల్ల కానీ, చర్మం గీరుకుపోవడం వల్ల కానీ, శృతి మించిన పరిశ్రమ వల్ల కానీ, మన శరీరంలోని కండరాల లోని కణజాలంపై అత్యధికంగా ఒత్తిడి కలిగినప్పుడు, ఆ కణజాలం దెబ్బ తిన్నప్పుడు, మన శరీరంలోని రక్షక వ్యవస్థ రంగంలోకి దిగడం వల్ల నొప్పి పుడుతుంది. ఈ రకం నొప్పిని, అనగా “ప్రయోజనాత్మక వ్యాకులత” (functional distress) వల్ల కలిగిన నొప్పిని, “అవయవజనితం” లేదా ఆంగికం (organic) అంటారు. ఈ రకం నొప్పి గురించే ఇక్కడ మాట్లాడుకుందాం. మరో రకం నొప్పి ఉంది. అది మానసిక కారణాల వల్ల పుట్టే నొప్పి. దానిగురించి ఇక్కడ మాట్లాడడం లేదు!
తెలుగులో నొప్పి అనే మాటకి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి: తీపు, సలుపు, పోటు, శూల, బాధ, నులి, మొదలైనవి. ఇంగ్లీషులో pain, ache, twinge, pang, dull pain, cramps, throbbing pain మొదలైన మాటలు ఉన్నాయి. ఏ ఇంగ్లీషు మాటకి సమానార్థకమైన ఏ తెలుగు మాట వాడాలో, ఏ రకం నొప్పికి ఏ సందర్భంలో ఏ మాట వాడాలో అన్న విషయంలో స్పష్టత లేదు. Ache అంటే protracted pain అనిన్నీ, twinge అంటే “సలుపు” అనిన్నీ వ్యాఖ్యానాలు ఉన్నాయి కానీ, వాటి ఉపయోగంలో నిర్దిష్టత లేదు.
వైద్యపరంగా నొప్పిలో రెండు రకాలు ఉన్నాయి: శారీరకం (somatic), అంతరాంగికం (visceral). (“అంతరంగికం” కాదు!) శారీరకమైన నొప్పి కండర వ్యవస్థ (muscular system)లో కాని, కంకాళ వ్యవస్థ (skeletal system)లో కాని పుట్టి, శరీరకజ్ఞానవాహక నాడీతంతువుల (Somatosensory neurons) ద్వారా మెదడుని చేరుకున్నప్పుడు అది ఒత్తిడా?, వేడా?, కంపనమా?, నొప్పా? అన్న విషయం మెదడు నిర్ణయించిన తరువాత ఆ అనుభూతి చర్మం ఉపరితలం మీద ద్యోతకమవుతుంది. అంతరాంగికమైన నొప్పి శరీరపు అంతర్భాగంలో ఉన్న అవయవాలులో (అనగా, కంఠనాళం, కడుపు, పేగులు, మొదలైనవి) పుట్టి అంతరాంగికజ్ఞానవాహక నాడీతంతువుల (Viscerosensory neurons) ద్వారా మెదడుని చేరుకుంటుంది. నొప్పి శారీరకమైనది అయితే ఎక్కడ నొప్పి పెడుతోందో మన మెదడు గ్రహించగలదు. కనుక “ఇక్కడ” అని మనం వైద్యుడికి చూపించగలం. నొప్పి యొక్క జనక స్థానం అంతరాంగికం అయితే మన మెదడు నొప్పి ఎక్కడ పుడుతోందో ఎల్లప్పుడూ గుర్తించలేదు. అప్పుడు నొప్పి జనక స్థానానికి దగ్గరగా ఉన్న చర్మపు ఉపరితలం మీద నొప్పి పుడుతూన్నట్లు మన మెదడు వ్యాఖ్యానించుకుంటుంది. అందుకనే ఉపతాపి (patient) “నొప్పి ఇక్కడ” అని చూపించినప్పుడు వైద్యులు దాని జనక స్థానం ఎక్కడో గ్రహించి వైద్యం చేస్తారు. On Being Ill అనే వ్యాసంలో రచయిత్రి Virginia Woolf అంటారు: “…. let a sufferer try to describe a pain in his head to a doctor and language at once runs dry.”
నొప్పులలో ఎన్ని రకాలు ఉన్నాయో నొప్పి నివారణకు అన్ని రకాల మందులు ఉన్నాయి. నోవోకెయిన్ వంటి మత్తు మందులు నొప్పి వాకేతాలు (signals) మెదడుని చేరకుండా అడ్డుకుంటాయి. శరీరంలో సహజసిద్ధంగా తయారయే endorphin జాతి రసాయనాలు నొప్పి గ్రాహక స్థలాలని తీరిక లేకుండా మరొక పనిలో ముంచెత్తి నొప్పి వాకేతాలని అందుకుని స్పందించకుండా అడ్డుకుంటాయి. కొకైన్ ఈ విధంగానే పని చేస్తుంది. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్ వంటి ప్రమాదకరమైన మందులు శరీరం మీద ఈ విధంగానే పని చేస్తాయి.
అమృతాంజనం వంటి లేపనాలు ప్రతికూల క్షోభ (counter irritation) కలిగించి మెదడుని మోసం చేస్తాయి. ఈ లేపనాలు చర్మం మీద రాసుకోవడం వల్ల ఆ ప్రదేశంలో చర్మం వేడెక్కడం కాని, చల్లబడడం కాని జరిగి మరొక రకమైన వాపు, నొప్పి కలిగించి మెదడు దృష్టిని అసలు నొప్పి నుండి మళ్ళిస్తాయి. ఇలా ప్రతికూల క్షోభని కలిగించే పదార్థాలలో పుదీనా (mint), కర్పూరం (camphor), నీలగిరి తైలం (Eucalyptus oil), గంధపుర తైలం (Wintergreen oil) ముఖ్యమైనవి.
నొప్పిని తగ్గించడానికి డాక్టరు చీటీ లేకుండా కొనుక్కోడానికి వీలయిన మందులు స్థూలంగా రెండు జాతులు: (1) Acetaminophen లేదా Paracetamol (2) nonsteroidal anti-inflammatory drugs (or NSAIDs). NSAID లు శరీరంలో ఎక్కడ వాపు ఉందో అక్కడకి వెళ్లి వాపుకి, తద్రూపేణా నొప్పికి, కారణమైన prostaglandins అనే రసాయనాలు పుట్టకుండా ఆపుచేస్తాయి. కాని prostaglandins కి ఉపకారం చేసే గుణాలు కూడా ఉన్నాయి. కనుక నొప్పిని అదుపులో ఉంచడం అనేది అసిధారావ్రతం లాంటిది. Acetaminophen నేరుగా మెదడులోకి వెళ్లి అక్కడ నొప్పి వార్తని మెదడుకి అందకుండా అడ్డుకుంటుంది. ఈ పని ఎలా జరుగుతుందో ఇంకా వివరంగా అర్థం కాలేదు. పరిశోధకులకవిద్యార్థులకి ఇది ఒక అవకాశం!
ఈ రోజుల్లో ధనవంతులకు కూడా అందుబాటులో లేని వైద్యం పూర్వకాలపు జానపదుల ఆటపాటలలో ఉండేది:
వంకర టింకర ‘’శొ ‘ / వాని తమ్ముడు ‘అ’ / నల్లగుడ్ల ‘మి’ /నాకేమిస్తావు ‘తే’
ఈ పొడుపు కథని విప్పితే నొప్పికి వైద్యం తెలుస్తుంది! కడుపునొప్పితో వంకర్లు తిరిగిపోతూన్న వాడికి ‘శొంఠి, ‘ఆ’ల్లం, ‘మి’రియం, ‘తే’నెలో కలిపి ‘నాకి’స్తే నొప్పి తగ్గుతుందని సారాంశం!
10. పచ్చబొట్లు
ఒక సగటు మనిషి చర్మం ఒలిచి బల్లపరుపుగా పరిస్తే 2 చదరపు మీటర్లు (3000 చదరపు అంగుళాలు) వైశాల్యం ఉంటుంది. ఇంత వైశాల్యం ఉన్న బట్ట (canvas) దొరికితే దాని మీద ఎన్ని బొమ్మలు చిత్రించవచ్చో ఆలోచించుకొండి. ఈ రకం ఆలోచన ప్రపంచ వ్యాప్తంగా అన్ని సమాజాలలోనూ వచ్చింది. సజీవమైన చర్మం మీద చెరిగిపోకుండా గీసే చిత్రాలే పచ్చబొట్లు అంటే! ఒక రకం చిత్రలేఖన కళగా పచ్చబొట్లు సా. శ. పూ. 3370 నుండీ మానవ సమాజంలో ఉన్నట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. అనగా కలియుగం ప్రారంభం అయిన కొత్త రోజులలోనే ఈ ఆచారం ప్రజలలో ఉందన్నమాట! అయినప్పటికీ, మహాభారత కథలో కానీ, హిందూ పురాణాలలో కానీ పచ్చబొట్ల ప్రస్తావన కనిపించదు.
ఆమాటకొస్తే, కదిరీపతి నాయకుడు రచించిన శుకసప్తతిలో ‘ముంజేతులను ముఖాంబుజముననొకవింతపొలుపుదెల్పెడు పచ్చబొట్టులెసఁగ (శుక.1.13)’ అన్న ప్రస్తావన, బాహుబలి సినిమాలో వినిపించిన ‘పచ్చబొట్టేసిన పిల్లగాడా/ నీతో పచ్చిప్రాయాలనే పంచుకుంటానురా’ అన్న పాట, అంతకు మునుపు ఆరుద్ర రాసిన ‘పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా / పడుచుజంట చెదరిపోదులే!” అన్న పాటలను మినహాయిస్తే పచ్చబొట్ల ప్రస్తావన తెలుగు సాహిత్యంలో ఎక్కడా నా కంట పడలేదు.
పచ్చబొట్ల కోసం వాడే రంగు సిరాల తయారీలో ఒక శాస్త్రీయత, నిబద్ధత ఉన్నట్లు లేదు. తమిళనాడులో వాడే సిరాలు చనుబాలల్లో కాటుక, ఆకు పసరులు, అవసరమైతే రంగులు కలిపి చేస్తారని “హిందూ” పత్రికలో చదివేను. పచ్చబొట్ల కోసం వాడే రంగు సిరాలలో విషపదార్థాలు ఉండొచ్చు. హాని చెయ్యవచ్చు. చేతుల మీద దట్టంగా పచ్చబొట్లు, నడుం చుట్టూ గళ్ళ లుంగీ, చెవిలో బీడీ ఉన్నవాళ్ళని చూస్తే నా కంటికి రౌడీలలా కనిపిస్తారు.
పచ్చబొట్లని వైద్యపరమైన అవసరాలకి కూడా వాడేవారని పైన చెప్పిన హిందూ వ్యాసంలో ఉంది. ఎడతెగని తలనొప్పితో బాధపడేవారికి ఇరువైపులా కణతల మీద పచ్చబొట్లు పొడిచేవారట! అదే విధంగా మోకాలిచిప్పలో కానీ, మాణికట్టులో కానీ, చీలమండలో కానీ నొప్పి ఉంటే పచ్చబొట్లతో వైద్యం చేసేవారట. ఈ పద్ధతికి ఆక్కుపంక్చర్ (accupuncture) కీ మధ్య పోలికలు కనిపిస్తున్నాయి!
ఒంటినిండా అందమైన పచ్చబొట్లు ఉన్న ఆసామీలు మరణించిన తరువాత వారి చర్మాలని ఒలిచి, చట్రాలలో బిగించి, వస్తుప్రదర్శన శాలలో ప్రదర్శించిన సందర్భాలు లేకపోలేదు. (The Museum of Tattooed Skin, The Medical Pathology Museum—Tokyo University).
వైజ్ఞానికంగా ఆలోచించినా, గణాంకాల దృష్ట్యా చూసినా, పచ్చబొట్లు ఆయుక్షీణానికి దోహదం చేస్తాయని పెద్దల అనుమానం. శరీరం అంతా పచ్చబొట్లు పొడిపించుకుంటే చర్మం ద్వారా ఉచ్చ్వాస నిస్వాసాలు సక్రమంగా జరగవుట.
ఉపయుక్తమైన మూలాలు
- Diane Ackerman, A Natural History of the Senses, Vintage Books, Random House, NY, 1990.
- వేమూరి వేంకటేశ్వరరావు, బొల్లి, ఈమాట, జనవరి 2024
- Catherine Caruso, Exploring Our Sense of Touch from Every Angle, June 11, 2024, Medical Express.
- What to know about Ayurvedic skin care
- The disappearing art of ‘pachai kuthu’
