అండమాన్లు ముత్యాల్లా మెరిసే దీవులు — నిజమైన స్వర్గధామం. దట్టమైన అరణ్యాలు, ఆకాశాన్ని తాకే చెట్లు, వెచ్చని పసిడి ఇసుక తీరాలు, భూమి చివరివరకు వ్యాపించిన నీలిరంగు సముద్రం. ఈ అందాల వెనుక ఈ దీవులగుండెల్లో ప్రతిరోజూ సముద్రంతో పోరాడే మత్స్యకారుల బతుకుకథలు దాగి ఉన్నాయి. సముద్రం వారికి జీవనాధారం. అంతే కాదు, అది కోపగించుకుంటే, నిర్దయగా ప్రాణాలను బలిగొంటుంది. “సముద్రమే మా దేవుడు, మా బ్రతుకు, మా శాపం,” అంటారు ఇక్కడి మత్స్యకారులు.
అండమాన్ దీవుల్లోని ఓ పల్లె — ప్రకృతి ఒడిలో, సముద్రపుగాలి, అలలతో మమేకమై బతికే ప్రజల్లో కందసామి కూడా ఒక సాధారణ మత్స్యకారుడు. తన భార్య పొన్నమ్మతో కలిసి, ఇద్దరు పిల్లలు వేటయన్, మంగలతో తీరంలోని ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు. అతని తండ్రి పరంబరం, తాత చిదంబరం, ఆసారి తాత కడలప్పన్ — తరతరాలుగా వీరి కుటుంబం సముద్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ తీరంలోనే జీవిస్తోంది. సముద్రాన్ని ఎలా చదవాలో, అలలను ఎలా అర్థం చేసుకోవాలో వీళ్లకి ఎవరూ చెప్పకుండానే తెలుసు.
పొన్నమ్మ ప్రతిరోజూ భయం భయంగానే భర్తను సముద్రానికి పంపేది. “వేగిరం వచ్చేయండీ!” అనే ఆమె ప్రేమపూరిత ఆదేశం, “సరెలేవే” అనే అతని జవాబు – అనేకానేక రోజుల్లో కందసామి అలవాటుపడిపోయిన సాధారణ సంభాషణగా మారిపోయింది. పిల్లలు, వారు నివసించే బస్తీకి దగ్గర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు.
వేటయన్ పసితనంలోనే సముద్రాన్ని ఆనవాలు పట్టడం ప్రారంభించాడు. అది వాణ్ని ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటుంది. వాడు దాన్ని భయంతో కాక, మమతతో చూస్తాడు. దాని వైశాల్యం వాణ్ని అబ్బురపరిచేది.
వేటయన్ మొదటి ‘పట్టు’ — ఓ గుప్పెడు మెత్తడ చేపలు. తండ్రి పెద్దపెద్ద చేపల్ని తీస్తుంటే, వాడు వలలోంచి నెమ్మదిగా, అపురూపంగా బయటకి తీశాడు వాటిని. వెండిలా మెరుస్తున్న వాటిశరీరాలు ఉదయపు రవికిరణాల్లో నక్షత్రాల్లా మెరిసిపోయాయి. తల్లి పొన్నమ్మకు పొలుసు కడిగి ఇచ్చాడు. ఆమె ఆరోజుకి వాడికి అవే ప్రత్యేకంగా వండిపెట్టింది. అక్కకి కూడా పెట్టకుండా వాడొక్కడే లొట్టలు వేసుకుని తిన్నాడు.
తెల్లవారుజామున పరంబరం పడవను తీరంనుంచి తీసుకెళ్లే ప్రతిసారీ, వేటయన్ ఆ దృశ్యాన్ని ఆసక్తిగా గమనించేవాడు. “తాతా, నేను నీతోపాటు వస్తా?” అని అడిగినప్పుడల్లా, అతని తాత “నువ్వు పెద్దోడివయ్యాక వద్దువుగానివిలే” అని నవ్వేవాడు.
“నాయనో, నేనెపుడు పెద్దోడవుతానయ్య తాతా?” అని మామిడిటెంక చీకుతూ అడిగేవాడు పసి వేటయన్.
“నీవు సముద్రాన్ని అర్థం చేసుకున్న దినాన్న పెద్దోడైనట్టే!” అనేవాడు పరంబరం. ఆ మాటకర్థం తెలియని వేటయన్ కళ్ళు పెద్దవి చేసి తాత, తండ్రి, ఆర్ముగంమామ, సుందరమన్న అందరూ కలిసి ‘అహోయ్’ అంటూ నాటుపడవని సముద్రంలోకి నెట్టడాన్ని ఎంతో శ్రద్ధగా గమనిస్తుండేవాడు.
ఏడేళ్లకే వేటయన్ తండ్రిని వెంబడిస్తూ, తడి ఇసుకపై తాను వేసే పాదముద్రలను వెనక్కి తిరిగి చూసుకుంటూ తండ్రిని అందుకోవడానికి వడివడిగా పరుగులు పెట్టేవాడు. పెద్దవాళ్లు పడవను ఏట్లోకి తోయడానికి ఇసుకలో పల్లం తవ్వుతుంటే వాడు కుక్కలతో ఆడుకుంటూ దానిచుట్టూ తిరిగేవాడు.
ఇల్లు చేరుకున్న తర్వాత, తల్లికి చేతిసాయంగా ఉండేవాడు. చేపలు తరిగేటప్పుడు మంగ ఎప్పుడూ చేయి కోసుకునేది. పెన్సిల్ కూడా సరిగా పట్టుకోవడం రాని వాడి ఈడు పిల్లలు కత్తితో నైసుగా చేపల్ని సర్రున చీల్చే వేటయన్ని చూసి తెగ ఈర్ష్య పడేవారు. వాడికది సహజంగా అబ్బిన విద్య.
పొన్నమ్మ ‘మూడు రోజులైంది ఇంకా రాలేదని’ వేటకోసమని వెళ్లిన కందసామి కోసం ఆరాటపడుతుంటే, “అమ్మా, నాన్న వచ్చేస్తున్నాడమ్మా!” అని చెప్పేవాడు. ‘నీకెలా తెలుసురా’ అంటే పడవ చప్పుడు విన్నాననేవాడు. వేటయన్ తల్లి తెలుగుది కావడంతో ఆమెతో తెలుగులోనూ, తాతతండ్రులతో తమిళంలోనూ, మంగ, ఇతర స్నేహితులతో హిందీలోనూ ధారాళంగా మాట్లాడేవాడు. వాడిప్పుడు కళ్ళు మూసుకుని తాడుని రకరకాలుగా ముడి వేయడంలో దిట్ట.
తాతకు చూపు ఆనటం తగ్గిపోయింది. ఇప్పుడు కందసామి మాత్రం తన ఈడు కుర్రాళ్లతో వేటకు వెళ్తున్నాడు. “నాన్నా, నీతో నేనూ వస్తానో!” అని తొమ్మిదేళ్ల వేటయన్ పదేపదే అడుగుతుంటాడు. వాడు మంగక్కతో కలిసి గుల్లలు, పీతలు ఏరడంలో పట్టు సాధించాడు.
“వద్దుగానివిలేరా, మొదట బడికి పోయి చదువుకో! బురుమావాళ్ళతో గట్టిగా వాదించాలంటే, మనకు చదువున్నోడు కావాల!”
“ఎందుకు నాన్నా, వాళ్లతో వాదించాల?”
“మనం అండమాన్‌లో వేట సేసినా, వల వాళ్లవైపు విసిరేశాం అంటారో.”
“అలగైతే నేను బాగా పోట్లాట్టం నేర్చుకుంటానో.”
“బెంగాలీ, ఇంగ్లీషు నేర్చుకోరా, వాళ్లకి తమిళము, హిందీ రావని కోస్తారో.”
“అదంతా నాటకంలేవో” అన్నాడు పరంబరం, పొగాకు నలుపుతూ.
“వీళ్ల నాటకాలకెన్నా తక్కువ లేదు. ఆలు మనకాడికొచ్చి వేటసేస్తా మనల్ని ఎనిక్కి పొమ్మంటారో. ఛాయ్ ఛాయ్, బర్రిపోతా! నిక్కు, విడు” అంటూ చేపలకూరబాండీలోకి మూతి పెడుతున్న కుక్కని తరుముతూ అంది పొన్నమ్మ.
నవారు మంచంమీద పడుకున్న కందసామి నవ్వి, తనమీద కాలేసి పడుకున్న వేటయన్ భుజాన్ని తట్టాడు. “సముద్రం మనకన్నం పెడుతుంద, కానీ గౌరవం లేకుండా ఉంటే మనల్ని మింగి పెడుతుంద. అలలు నీతో ఆటలాడతాయ్, కానీ వాటి ప్రతాపం గుర్తుంచుకోవాల.”
“నాన్నా, సముద్రం అంత భయంకరమా? కానీ నీకు ఏం భయం ఉండదు కదా?” వేటయన్ కుతూహలంగా అడిగాడు.
“సముద్రం ఎప్పుడూ ఒకేలా ఉండదో వెట్టా. కొన్నిరోజులు తల్లిలాగా మృదువుగా ఉంటుంద, కొన్నిరోజులు గరమయ్యి గర్జిస్తుంద. నేను దాంతోటి మాట్లాడతానో, దాన్ని అర్థం చేసుకున్నానో, అందుకే నాకు భయం ఉండద.”
సముద్రాన్ని అర్థం చేసుకున్న తండ్రి పెద్దవాడైపోయాడని గుర్తించిన వేటయన్కి కందసామిమీద గౌరవం అమాంతం పెరిగిపోయింది. అతడిమీద వేసిన కాలు తీసేశాడు. “అయితే నాకూ నేర్పో నానా, నేనూ పెద్దోడవుతానో!” గోముగా అడిగాడు.
కందసామి ఆలోచించి, “సరే, ముందయితే, గాలి మారితే నీళ్లమీద నీడలెట్లా పడ్తాయో సూడో!” అని వాడికి ఓ చిన్నపాఠం నేర్పే ప్రయత్నం చేశాడు.
వేటయన్ తొలిసారి సముద్రం వంక కొత్తరకంగా చూశాడు. తొలిసారి సముద్రం తనతో ఏదో చెప్పాలనుకుంటోందని గమనించాడు. “అలల తీరు మారటం, గాలి తీరుగా వీయటం… ఇవన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవో…” తండ్రి చెప్పసాగాడు.
వేటయన్ మనసులో కొత్త కోరిక పుట్టింది— సముద్రాన్ని అర్థం చేసుకోవాలి, దానిభాష నేర్చుకోవాలి! కానీ సముద్రం వాడికి ఎంతటి పరీక్షలు పెట్టబోతోందో వాడికే తెలియదు…
వేటయన్ ఉదయం బడికి వెళ్లి, సాయంత్రం తీరానికి వచ్చి ఏటిని గమనించడం అలవాటు చేసుకున్నాడు. వాడికి సముద్రమంటే స్వల్పమైన అవగాహన, కొద్దిపాటి భయం, అంతులేని ఆసక్తి కలిసి కలుగుతున్నాయి. బడికి వెళ్తూ ఉన్నా, వాడి నిజమైన చదువు నీటిదగ్గరే జరుగుతోంది. సముద్రం తరగతిగదిలా మారింది, అలలు ఉపాధ్యాయులుగా మారాయి.
అక్క మంగ వేటయన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. తల్లికి ఇంటి పనుల్లో సహాయపడుతూ, ఆ పిల్ల వయసుకి మించి తనవంతు బాధ్యత తీసుకుంది.
“వేటయా, నీవు సముద్రాన్ని ప్రేమించాల! కానీ దానితో పోటీ పడతాననుకోకూడదోయ్!” అని వాణ్ణి పదేపదే హెచ్చరిస్తూ ఉండేది.
“సర్లెక్కో, మై కుచ్ నై కర్తా!” అనేవాడు గంభీరంగా.
“నాన్నా, నేనూ నీతో సాపలేట కొస్తానో,” అని వాడు ఇప్పుడు రోజూ అడుగుతున్నాడు.
కందసామి చిరునవ్వుతో, “సముద్రం సిన్నపిల్లలతో ఆటలు ఆడదొ బాబు. అది మసిలితే, మనల్ని కొట్టేస్తుంద,” అంటాడు.
“కానీ నాన్నా, నువ్వన్నావుగా! సముద్రం మనతో మాట్లాడుతందని. నేనొక్కసారైనా వినాల నాన్నా!” అని బ్రతిమిలాడేడు.
కందసామి కొన్ని నిమిషాలు సముద్రాన్ని చూశాడు. “సరే, మరుసటి వారం పున్నమరోజు నీకోసమై ప్రయాణం” అని చెప్పగానే వెట్ట పట్టరాని ఆనందంతో ఉల్లాసంగా ఎగిరి గంతేశాడు.
చిదంబరం తండ్రి కడలప్పన్ తమిళనాడులోని కడలూరులో పుట్టాడు. ఆయన కలలు ఎప్పుడూ పెద్ద సముద్రం వైపే పరుగెత్తాయి. “కడలే నా జీవితం,” అని చుట్టాలు పక్కాలకి చెప్పి కడలప్పన్, 1900ల్లో తన కుటుంబాన్ని తీసుకుని అండమాన్ దీవులకు వలస వచ్చాడు.
వచ్చేముందు “అంగే సముద్రం ఇక్కడకంటే ఉగ్రమా ఉండుం. కానీ చేపలు నరయ దొరుకుం. నమ్మకు బతక్కు కొత్తమార్గం కిడైక్కలాం” అని తన ఊరివాళ్లకు చెప్పాడు. జాలరి పెద్దయ్య అని ఆయనని ఆప్యాయంగా పిలుచుకునే ఊర్లోని కొందరు ఈ మాట వినగానే ఆయన్ని హీనంగా చూసి “తమిళుక్కు ఆ దీవీల్ల యారు ఇల్లై. అంగే వలస పోనా, నమ్మ భాష, నమ్మ సంప్రదాయం కడైసిలా పోయిడుం. నీ శ్రీలంక పోప్పా” అని ఉచిత సలహా ఇచ్చారు.
కాని కడలప్పన్ వెనక్కి తగ్గలేదు. తన భార్య, పిల్లలతో కలిసి, సెటిల్మెంటు బోటులో పోర్ట్ బ్లెయిర్ చేరుకున్నాడు. ఇక్కడ… భిన్నభాషలు, దట్టమైన అడవులు, కొత్తమనుషులు, విచిత్రమైన సముద్రపు అలలు, మలేరియా ఎదురయ్యాయి.
అండమాన్ దీవులు రెండు మహత్తర సముద్రప్రాంతాల నడుమ ఒక సహజప్రహరీగా నిలుస్తాయి. దీవుల తూర్పువైపున అండమాన్ సముద్రం, పశ్చిమాన బంగాళాఖాతం విస్తరించి ఉంటాయి.
కడలప్పన్ నలుగురు మనుషులు చేతులు చాపితే ఎంత వెడల్పు ఉంటుందో, అంతంత వెడల్పు ఉండే మానులని నరికి, అంతపాటి నేలను చదును చేసుకొని ఆ బస్తీలోనే తొలిగా గుడిసె వేసుకున్న వీరుడు. ఆయనభార్య త్వరగానే ఇంటికి ఒక మంచి నివసించే కళ తీసుకువచ్చింది. కొబ్బరిచెట్లు అప్పుడప్పుడే విస్తరిస్తున్న సమయంలో తనతో తెచ్చిన తన ఊరి కొబ్బరిమొలకలను, కాయగూరల విత్తనాలను గుడిసెకు ముందువైపున వరుసగా నాటింది.
ఉప్పటివాసన నిండిన గాలిలో తీరంపక్కన పడవలు త్రోసి ఉంచారు. కడలప్పన్, మోహన్, ధీరన్, రాజు – నలుగురూ సాంబ్రాణి, నల్ల దమ్మర, పున్నాగ చెట్లనీడలో విశ్రమిస్తున్నారు. పిల్లాడు చిదంబరం రుద్రాక్ష చెట్టుకింద పడ్డ కాయల్ని ఏరుకుని గోళీకాయలు ఆడుకుంటున్నాడు. ఏరు లయబద్ధంగా కదులుతూ, తీరానికి కొత్త కథలు అందిస్తోంది.
మోహన్ సముద్రాన్ని చూస్తూ, “కడలన్నా! మన మున్నాడీ నీలం సుడుల తిరిగే సముద్రం అండమాన్ సముద్రం. కానీ ఇంత దూరం వచ్చిన గాలి, అల్లంత దూరం బెంగాల్ ఉపసాగరం లెందు వందుదా?” అన్నాడు.
కడలప్పన్ నవ్వి, “హా! నీ సరియాగా గమనించావు మోహనా. అండమాన్ సముద్రం చిన్నదానే, కానీ నరయ లోతా ఉండుం. నీటిరంగు నరయ నీలమా ఉండుం, ఏనా? ఇంగనే లోతైన సముద్రపు కుండ్రు, అగ్నిపర్వతం ధ్వంసమైన భాగందా ఉండుం!” అని జవాబిచ్చాడు.
‘అవునా’ అని ఆశ్చర్యపోతూ అందరూ శ్రద్ధగా వినసాగారు. “బంగాళాఖాతం సగటా కుఱైవాక (తక్కువ) లోతు ఉట్టుం, ముఖ్కియమా కడర్ కరైక్కు (తీరందగ్గర్లో). అండమాన్ సముద్రం అధికం పసిఫిక్ / హిందూ మహాసముద్రం ప్రభావానికి లోనవుతుం, అదునాల్దాన్ శుభ్రమైన తన్నీరోడ ప్రసిద్ధమా పవళం పారైగళ్ (ప్రవాళ భిత్తికలు- coral reefs), వివిధ మత్స్యజీవిగళ్ కనపడుతుం. బంగాళాఖాతం అనేక నదీముఖద్వారాలు, మడ అడవులు కలిగి ఉండి, అదిగ ఉప్పు-ఇనిప్పు తన్నీరు (తీపినీటి) మిశ్రమ జీవిగళ్ కలగుతుం.”
ధీరన్ తల ఊపుతూ, “అది సత్యం ఆణె! నీ ఈ విషయం నన్నాయ్ అరియం!” అని కడలప్పన్ని మెచ్చుకుని అన్నాడు – “బెంగాల్ ఉపసాగరం చూడటానికి మరీ వ్యాపకమాయి అనిపికుం. ఎందుకండా?” అడిగాడు.
కడలప్పన్ సముద్రపు అలలను గమనిస్తూ, “బెంగాల్ ఉపసాగరానికి నరయ నదుల నీరు కలయిండు వస్తుం, ముక్కియమా గంగ, బ్రహ్మపుత్ర, మేకాంగ్ మధరి పెరియ నదిగళ్. అందుకే అక్కడ నీటి కలరొ కొంచం గోధుమా కనిపిస్తుం. అల్లు నరయ పొడవా ఉంటుం, గాలి ధాటిక్కు బలమా ముందుక్కు సాగుం!”
రాజు గాలిని లోతుగా పీల్చుకుంటూ, “అంటే, మనం ప్రయాణించే సముద్రం చాల లోతుగా, బలంగా ఉంటుందనమాట!” అని భయపడ్డాడు. రాజు పొన్నమ్మకు ముత్తాత. ఉప్పెనొచ్చి వరిపొలంలో ఉప్పు మేటలేసుకుపోయిన కారణంగా నిజాంపట్నంనుంచి కొత్తగా వలస వచ్చాడు.
కడలప్పన్ ముసురుపడుతూ ఉన్న ఆకాశాన్ని చూసి, “అప్పడీరా! మనం వేటకు పోరప్పుడు ఈ రెండూ సముద్రాల తేడా తెరిఞ్చిక్కుండు ఉండణం. అండమాన్ సముద్రంలో ప్రవాహాలు ఓఝుంగ మారీపోయుం. కానీ బెంగాల్ ఉపసాగరంలో గాలి ఎప్డీ ఉండుంపో, అల్లు అంగే ఉంటుం. వేటకు ఇది రంబ ముక్కియమా విసయం!”
ధీరన్ నవ్వి, “అతినాల్ నముక్కు కడల్ భాష పఠికణం!” అన్నాడు. సముద్రపు భాష నేర్చుకోవాలని అతను చెప్పిన మాటలకి మిత్రులంతా నవ్వారు.
కడలప్పన్ ఈత కొట్టడానికి దూకి నీరు చెవుల్లోకి వచ్చేలా చేతులు చాచి మునుగుతూ తేలుతూ, “సముద్రం నమ్మ గురువు, జీవనాధారం. అద్ని అర్థం చేసిక్కణమే మన బతుకుదా!” అని అన్నాడు. ఆ మాటల్ని సముద్రం తన కెరటాలతోనే పలికించినట్టు అనిపించింది మిత్రులకి.
అండమాన్ నికోబార్ దీవుల తీరం బెంగాలీలు, ఒడియాలు, మలయాళీలు, తెలుగువాళ్లు, తమిళులు, పంజాబీలు, రాజస్థానీయులు, గుజరాతీలు, ఝార్ఖండ్ తెగలవారు వంటి ‘సెటిలర్స్’తో బాటు నికోబారి గిరిజనులు, ఒంగే, జరవ వంటి అండమాన్ స్థానిక తెగలవారు, మైన్మార్ వలసదారులు – ఇలా అనేక జాతులవారు కలిసిమెలిసి నివసించే ప్రదేశం. అక్కడి ప్రజలు ఒకరికొకరు వస్తువులనే కాక భాషాసంస్కృతులను, వధూవరులను కూడా ఇచ్చిపుచ్చుకొని ఒక సరికొత్త ఐకమత్యపు సంస్కృతికి తెరలేపారు. మత్స్యకారులు చిన్నచిన్న దుకాణాలు, నిలయాలు ఏర్పాటు చేసుకొని తమ జీవనోపాధి సాగించేవారు.
పరంబరం, కందసామి, ఇప్పుడు వేటయన్ – అందరూ ఇక్కడే పుట్టారు. చిదంబరం గాలివాటుకి తెప్ప తేలిపోకుండా పనసచెట్టు దూలం కట్టిన మొదటివాడు. పడవల నిపుణుడు. నావ పొలకుండా మనం చెప్పినట్టు పోవాలంటే అది చిదంబరమే కట్టాలని అందరూ అనుకునేవారు.
తండ్రి చిదంబరం సముద్రాన్ని గౌరవించమన్నాడు కదాని, తన కొడుకు కందసామి చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు పరంబరం అతణ్ని తీసుకొని ఒకసారి బోట్లో రెండురోజులు ప్రయాణం చేసి నికోబారి ద్వీపమైన కమోర్టాకు వెళ్లాడు. అప్పుడు అక్కడ కిన్లేవ పండుగ జరుగుతున్నది. అక్కడి మనుషుల రూపస్వభావాలు చూసిన పరంబరం పరదేశం వచ్చినట్టు మంత్రముగ్ధుడైపోయాడు. ఒక తమకంలో పడిపోయాడు.
హింగో అనే నికోబారి మిత్రుడు ఆంగ్లంలో పరంబరానికి తమ సంస్కృతి గురించి వివరించాడు – “మాకు సముద్రంతో విడదీయరాని అనుబంధం ఉంది. మేము సముద్రాన్ని దేవుడిగా ప్రత్యేకంగా పూజించము, కానీ జీవనాధారంగా, పరిరక్షకుడిగా గౌరవిస్తాము. ‘సముద్రం మనకు అన్నం పెడుతుంది, కానీ అదే కోపిస్తే, మన జీవితాలను తుడిచిపెట్టేస్తుంది’ అనే నమ్మకంతో, మేము సహజ వేటవిధానాలను పాటిస్తాము. సముద్రపు ఆవాసాలకు హానిచేయకూడదనే ఉద్దేశ్యంతో సంవత్సరంలోని కొన్ని రోజులలో వేటకు అసలు వెళ్లము. సముద్రంలో తుఫానులు వస్తే, అది ప్రకృతిలోని ఆత్మలు అసంతృప్తిగా ఉన్న సంకేతం. అందుకే, సముద్రంలోని మార్పులను గమనిస్తూ, ప్రకృతి సంకేతాలను అర్థం చేసుకోవడం మాకు ఎంతో ముఖ్యం. సముద్రం మన తల్లిలాంటిదే, కానీ మన తప్పులు సహించదు,” అని అతను చెప్పాడు.
ఆ మాటలు వినేసరికి పరంబరానికి సముద్రం అంటే కొత్త భయం కలిగింది. అదే సమయంలో, దానిపట్ల వారి ప్రేమను కూడా అర్థం చేసుకున్నాడు. పండుగరోజుల్లో ప్రకృతి ఆరాధన, పౌర్ణమి దగ్గరపడేకొద్దీ ఎగిరే చేపలను బల్లేలతో వేటాడడం, ఊరంతా ఒక దగ్గర చేరి సముద్రుడివరంగా చేపలవిందు ఆరగించడం – ఇవన్నీ గమనించిన పిల్లాడు కందసామి సముద్రపు భాష ఒకటుంటుందని తెలుసుకున్నాడు.
మెరిసే నున్నటి చర్మంతో మృదువుగా ఉండే మెత్తటి డాల్ఫిన్లను మొట్టమొదటిసారి అబ్బురంగా చూశాడు. పదిమంది బలవంతులు కూడా మొయ్యలేని అతి బరువైన సొరచేపలను చూశాడు, తిన్నాడు. తోలుసంచీలాంటి డిప్పలున్న భీకరమైన పరిమాణాలున్న తాబేళ్లను ముట్టుకుందామని దగ్గరకు వెళితే తోక జాడించాయి. ఎగ్గిరి పదడుగుల దూరాన పడ్డాడు. భయంతో గుండె జారి గల్లంతైన ఆ క్షణం తనకిప్పటికీ తాజాగా గుర్తుంది. ఆ అనుభవాలన్నిటినీ తన తరువాతి తరానికి అందించాలని ఆశపడ్డాడు కందసామి. ప్రభుత్వం నికోబారి దీవులకి రాకపోకలు బాగా నిషేధించేసింది, దాంతో ఇప్పుడు వేటయన్ని అక్కడికి తీసుకువెళ్లే పరిస్థితి లేదు. ఏది చేసినా, ఎంత నేర్చుకున్నా, అండమాన్లలోనే!
ఒక వారం వేగంగా గడిచిపోయింది. ఆ వారమంతా వేటయన్ పెరుమాళ్ తాతని పౌర్ణమి ఎప్పుడని అడుగుతూనే ఉన్నాడు. వాళ్ల బస్తీలో ఎవరైనా మనువాడాలన్నా, పూజలు చేయించుకోవాలన్నా పెరుమాళ్ తాతనే ముహూర్తం అడుగుతారు మరి!
“ఒరేయ్ ఒరేయ్! నీ ఆత్రం గూలా! పౌర్ణమికింకా నాలుగురోజులుందిరా” అని రోజూ అదేమాట చెప్పేవాడు పెరుమాళ్.
ఆ మాట వినగానే కనుబొమ పైకి ఎగరేసిన ఆర్ముగంమామని చూసి “అట్టయితేనే గదా, ఈ పిలకాయలకి ఆకాశం చదివేది వచ్చేది” అనేవాడు. మామకూతురు కర్పగం కిసుక్కున నవ్వేది. దాంతో మరింత రోషపడి, ‘ఇంకా నేనెంత చదువుకోవాలో!’ అని వేళ్ల మీద లెక్కేసుకుంటూ దిగులుగా వచ్చిన తమ్ముని చూసి మంగ “ఏంటిరా, గణితంలో ఇంటిపని ఎక్కువ ఇచ్చారా? నేను ఎల్పు చేయనా?” అని అడిగేది. మంగ చదువులో మెరిక.
మొత్తానికి వేటయన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పౌర్ణమిరాత్రి రానే వచ్చింది. ఆ పొద్దు పొడిచింది మొదలు, తన స్నేహితులందరికీ సుందరమన్నకీ తాను సముద్రంలోకి వెళుతున్నానని ఒక వెయ్యిసార్లైనా చెప్పుంటాడు. ఇంటికొచ్చి పావుగంటలో అన్ని సబ్జెక్టుల ఇంటిపని చేసేశాడు. తల్లి పొన్నమ్మ ముద్దలు కలిపి పెట్టిన సాంబారన్నం అసలు సహించలేదు. మనసు నిండా ఉలికిపాటు. భయం. కుతూహలం. గర్వం కూడా. మంగక్క వాడికి జేబులో పెట్టుకోమని ఒక నిమ్మకాయ ఇచ్చింది. తల తిరిగితే దాన్ని వాసన చూడమంది. పరంబరంతాతకాళ్లకి మొక్కితే “పోయిరారా” అన్నాడు. అంతే, ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది.
వలతోటి పట్టీని కాలికి తొడిగి తండ్రిచేయి పట్టుకుని ఇంటిబయటకు రాగానే, పొన్నమ్మ తలచుట్టూ ఊపిరాడకుండా చీర బిగించుకొని మట్టితో కలిపిన గంగమ్మను ఒడ్డున పెట్టింది. చుట్టూ అడవిపూలు పేర్చింది మంగ. కొబ్బరి, నువ్వుల మిఠాయి, తులసి ఆకులు, రెండు పచ్చి అరటిపళ్ళు, పసుపు-కుంకుమలతో నిండిన వెదురుచాట పెట్టింది. పొన్నమ్మ వేటయన్ చేయి పట్టుకుని నూనెదీపం వెలిగించింది. ఆమె దృష్టి గంగమ్మపైన లేదు. వాడి లేత ముఖంలో ఆదితరాల క్రమాన్ని చూస్తూ ఉంది. వెట్ట నమస్కారం చేస్తుండగా మంత్రంలాగా పలికింది:
“అమ్మా గంగమ్మా! సముద్రతల్లీ,
మా కుడిపాదం నీ జల్లులో పెరిగింది,
మా లోపల నీ రక్తం పారుతుంది,
ఈ చిన్నవాడిని నీకప్పగిస్తున్నాం, తిరిగి పంపించు తల్లీ.
పుణ్యముండాలని దీపం వెలిగించాము,
నీ దయలో వేటసంపద దాగి ఉండుగాక.
నీ అలల దీవెన మావేపునుండుగాక.”
హారతిచ్చి వాడికి బొట్టు పెట్టింది. వేటయన్ నుదుట చెమట పట్టింది. ఒకరకమైన నమ్రతతో ఇంకా ముడుకులమీద కూర్చునే ఉన్నాడు. మంగక్క నెమ్మదిగా వాడివీపుని తట్టి పైకి లేపింది.
అంతకుముందు ఎన్నోసార్లు ఆ పడవలో తీరంలో ఎక్కి ఆడుకున్నా, ఈ రోజు అది ఎక్కాలంటే వేటయన్ బొమ్మలాటి కాళ్లు దాని అంచుల దగ్గర ఆగిపోయాయి. పిక్కలు తడిసే లోతులోకి పొన్నమ్మ వచ్చి, చేతులు జోడించి సముద్రపు నీటిని మృదువుగా దోసిలిపట్టి, మూడుసార్లు వాడితలపై చల్లింది. కడలప్పన్ వాడికి నీటిబొట్టు పెట్టాడు. ఆమె పెదవులు కదిలాయి — చప్పుడు చేయని ఆ ప్రార్థనను ఈసారి గంగమ్మతల్లే వినగలిగింది.
వేటయన్ తన చేతిని పడవ ముందుభాగానికి తాకించాడు. కళ్ళు మూసుకున్నాడు. ఆ పాత కలప తన్ను పిలుస్తున్నట్టుగా దాని గుండె లబ్ డబ్ మని కొట్టుకుంటూ వృద్ధమై, విశ్వాసంతో, ఎన్నో కథల్ని మోస్తూ ఉన్నట్టుగా అనిపించింది.
వేటయన్ తన కుడిపాదాన్ని పడవపైన పెట్టాడు. తడిగా, ఉప్పుకరడు కట్టిన కఠినమైన కలపగీతలు పాదంకింద జారుతున్నాయి. తడబడుతూ మరో కాలు కూడా మెల్లగా మోపాడు.
వేటయన్ పడవలో నిలదొక్కుకొని ఉప్పటి తేమగాలితో తన శ్వాసను నింపుకున్నాడు. సముద్రమే తన ఊపిరి అని ఆ క్షణంలో గ్రహించాడు. ఇప్పుడు వాడు ఒంటరి కాదు — పడవతో ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. సముద్రం వాడికి ఒక ఆత్మబంధువు, వేట ఒక ఆశ్రయం. బహుశా అదే క్షణంలో, వాడు బాలుడినుండి వేటగాడిగా మారిపోయాడు.
చందమామ నక్షత్రాలతో కలిసి ఆకాశంలో వెన్నెలలు విరజిమ్ముతున్నాడు. చుట్టూ పల్చగా వరదగుడేసింది. నెమ్మదిగా ఎగిసే అలలపై చంద్రికలు కురవడంతో అవి రజత తరంగాలయ్యాయి. ఇక, బెరుకుపోయి, వెట్ట పట్టరాని ఉత్సాహంతో తండ్రితో కలిసి ముందుకు సాగాడు. బోటుపేరు ‘కడలమ్మ’— పరంబరం తన సొంతూరి ఆనవాలుగా పెట్టుకున్నపేరు. నియమాన్ని అనుసరించి పడవంచున బిగించిన జాతీయ జెండాను చూడగానే గౌరవం కలిగి స్కూల్లో చేయించినట్టు వెట్ట సెల్యూట్ చేశాడు. కందసామి ఎంతో ముచ్చటగా వీడి చేష్టలను చూస్తున్నాడు. కడలి పైకి శాంతంగా కనిపిస్తున్నా, లోపల నిత్యం ఉబికివచ్చే ఉత్సాహపు వరద తలపిస్తున్నట్టుగా ఉంది, అచ్చం వాడి మనసులాగే.
వేటయన్ సముద్రాన్ని ఇంత దగ్గరగా చూడటం ఇదే తొలిసారి. అలతో బాటు పైకి లేస్తున్న ‘కడలమ్మ’లో ఒక అడ్డచెక్కని గట్టిగా పట్టుకొని ఒదిగి కూర్చున్నాడు. తండ్రి కందసామి ఏ మాత్రం భయపడకుండా ఎంతో విలాసంగా కాళ్లు వెడల్పుగా చేసి నుంచున్న తీరుని వాడు ఆరాధనగా చూశాడు. అలలు దిగి కాస్త లోపలికి వెళ్లాక, ‘కడలమ్మ’ తేలికగా ఊగుతూ ముందుకు సాగుతోంది. నీళ్లలోకి దించుతున్న వెదురుబొంగు ఎంతమేరకు తడిసిందో గమనించమని కందసామి చేతితో చూపించాడు.
“నాన్నా, ఈ నీల్లు బొట్ట లోతున్నయా” ఊతాన్ని గట్టిగా పట్టుకొనే పక్కకు వంగొని నీళ్లలోకి చూశాడు.
కందసామి చిరునవ్వుతో “సముద్రానికీ అడుగు తెలీదొరా బాబూ… మనసుకీ లోతు తెలీదొ. అది తెలుసుకొవాలంటే, పైనుండి గమనించటం నేర్చుకోవాల, లోపలనుండి అనుభవించటం నేర్చుకోవాల” అన్నాడు.
వేటయన్ ఆలోచనలో పడ్డాడు. ఈసారి ఇంకొంచెం వంగి చూసి “కాని నాన్నా! నాకూ.. సముద్రం కనిపించట్లేదో, నీళ్లలో నేనే కనిపిస్తున్నా!” అని విడ్డూరంగా చెప్పాడు.
“నీవు సముద్రంలో నీ ప్రతిబింబాన్ని చూస్తున్నావో. నీలోన సముద్రాన్ని చూడడం నేర్చుకో.”
“నాలోనక్కే సముద్రం ఉందా!” వెట్ట చాల ఆశ్చర్యపడిపోయాడు.
వేటకు వచ్చినవాళ్లు తమతమ పడవల్లో కొద్దికొద్దిగా దూరం జరిగి వలలు సర్దసాగారు. కందసామి కూడా వలని భుజంమీద వేసుకున్నాడు. వేటయన్ కొన్ని ములుకులు ఎత్తి అందించాడు. ఎంత బరువుగా ఉన్నాయో. ఎర బిగించి సిద్ధంచేసే సమయానికి మిగతా మత్స్యకారులు తమ వలలను నీటిలోకి వదిలారు. కందసామి కూడా గుండ్రంగా తిరుగుతూ వలని రివ్వున నీళ్లలోకి విసిరాడు.
“నాన్నా, సేపలు ఈ వలక్కి ఎట్లా పడతాయ?”
“సేపలకాయితే సొతంత్రమేరా. కానీ ఆహారం ఆశతో వలక్కే పడిపోతాయ్. మడుసులూ అంతే రా… కొన్ని ఆశలే మనల్ని బంధిస్తయ్!” కందసామి చెప్పాడు.
వేటయన్కి ఇవాళంతా కొత్తకొత్తగా ఉంది. వాడు కూడా తన చిన్న ములుకుని నీటిలో పడేశాడు. రోజూ ఈపాటికి వెచ్చటి బొంత కప్పుకొని హాయిగా అక్క, వాడు నిద్రపోయేవారు. చల్లటి పిల్లగాలి. సహజమైన ఉయ్యాల. ఎంత హాయిగా ఉంది సముద్రం! అప్పకూడా నేను రోజూ వేటకి వస్తాను. సముద్రం నాకెంతో ఇష్టం అనుకుంటూ మగతలోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి, కాలు గుంజినట్టు అనిపిస్తే కళ్ళు నలుపుకుంటూ తిమ్మిరెక్కిన కుడిచేతినుంచి గేలం ఎడమచేతికి మార్చి పైకి లాగాడు. ఓ చేప చిక్కింది. ఎంతో సంతోషంతో “నాన్నా! నేంగూడ ఒకటి పట్టుకున్నానో!” అని అరిచాడు.
“వెరీ గుడ్ వెట్టా! ఏదీ సూయించు?” అని దగ్గరికి వచ్చి, ఆ చేపను పరిశీలించి “కాని ఇది చిన్నదురా. దాన్నిప్పుడు మళ్లీ సముద్రంలో వదలాల్ల” అని చెప్పాడు.
“ఎందుకు నాన్నా?” అడుగున్నర పొడవున్న సుర అది. నాన్న చిన్నది అంటాడేంటి?
“నీవు ఇంక చిన్నోడివి. పెద్దోడవ్వాలి కదా! అంతేగా ఈ పిల్లచేపకూడా… చేపలకూ పెరిగే అవకాసం ఇవ్వాలరా. పెద్దవాటినే వేటాడాల.”
వేటయన్ చేతిలో గిలగిలలాడుతున్న చేపపిల్లను మళ్లీ నీటిలోకి జారవిడిచాడు. ఆ చేప స్వేచ్ఛగా సాగిపోతుంటే, వాడు చూపు మరల్చకుండా దాన్నే చూస్తున్నాడు. తండ్రి హృదయపూర్వకంగా తన కొడుకుని చూశాడు. ఏవో ప్రశ్నలడుగుతూనే ఉన్నాడు వెట్ట. కందసామి ఓపిగ్గా సమాధానం ఇవ్వసాగాడు.
వలను పడవలోనికి లాగారు. అందులో ఎన్నో రకాల చేపలు పడ్డాయి. పిల్లలని, తాబేళ్లని, వాటితోబాటు వలలో పడిన చెత్తాచెదారాన్ని మళ్లీ నీళ్లలోకి వేసేశాడు తండ్రి. రెండు ప్లాస్టిక్ కవర్లు, ఒక గాజుసీసా కూడా దొరికాయి, వాటిని పడవలోనే ఉంచాడు. తీరానికి వెళ్లాక వాటిని ‘కచరా డబ్బా’లో మాత్రమే పడేయాలని కొడుక్కి చెప్పాడు.
నిశ్చలసముద్రం ఆ రాత్రి వారికి మరిన్ని రహస్యాలు చెప్పింది. అర్ధరాత్రి దాటిన తర్వాత గాలి వేగం తిరిగింది. చల్లదనం పెరిగింది. చీకటి కమ్ముకుంటోంది. కందసామి ఆకాశాన్ని చూశాడు. “వేటయన్, గాలి మారుతోందరా. మనం ఎనక్కి మళ్లాల” అన్నాడు.
వేటయన్ సముద్రంవైపు చూసి, “ఇప్పటికి వాన పడుతుందా నాన్నా?” అని అడిగాడు.
కందసామి తల ఊపుతూ “ఒరు నల్ల మీనవర్ సముద్రం చూడగానే వానొస్తుందా, తుఫాను ఒస్తుందా అర్థం చేస్కోవాలరా. మనం ఇప్పటికి తట్టడికె తొందరగా వెల్లడం మంచిది,” అన్నాడు. వెట్ట బెదురుతూ తన స్థానంలో కుదురుగా కూర్చున్నాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. చిన్నపాటి అలలు పైపైకి లేస్తున్నాయి. ‘కడలమ్మ’ ఊగిపోతున్నది. జెండా రెపరెపలాడుతున్నది.
“చూడు వెట్టా, నీకు తెలుసుందిరా! సముద్రం ఎప్పుడూ ఎలేనో ఊడుగుంటది. కొన్నీ అల్లు తండ్రిలా కాపాడతాయ్, మరికొన్నీ మాయగాళ్లలా ముంచుతాయ్!””
ఆ వాక్యం మొదటిసారి వింటున్నా, ఎందుకో వాడికి చిన్నప్పటినుంచి తెలిసినట్టే అనిపించింది. కళ్లు పెద్దవిగా చేసి, “అలలా? తండ్రిలా ఎట్లా ఉంటాయ నానా?” అని ప్రశ్నించాడు.
“ఎదిరొచ్చే అల్లను ఒట్టు చూడు వెట్టా, నీకర్థమవుతద. నీ గుండెతో వినిపుచ్చు. సముద్రం మనతో ఎప్పుడూ మాటల్లాడుతూనే ఉంటద!”
వేటయన్ గాలిలో గలగలమనే ఒక వింతశబ్దాన్ని విన్నాడు. నీలిరంగు నీటిలో సమస్త ప్రకృతి శ్వాసిస్తున్నట్టుగా అనిపించింది.
కాని ఇంతలో… ఆకాశం పూర్తిగా చీకటిగా మారిపోయింది. అలలు పెరుగుతున్నాయి. ఆకాశం, నీరు కలిసే చోట నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. గాలి ఒక్కసారిగా ఉద్ధృతంగా వీయసాగింది. వేటయన్ భయంతో తన తండ్రికేసి చూశాడు. అలలు పడవ అంచులను మించి తండ్రీకొడుకులను తాకుతున్నాయి.
“అప్పా… ?”
కందసామి గట్టిగా పట్టుచేసుకుని, “సముద్రం గుస్సా ఆయిందిరా, మనం వెనక్కి తిరిగిపోవాలి,” అని త్వరత్వరగా తెడ్డు వేస్తున్నాడు.
కాని అది పిల్లకాలువ కాదు, సముద్రం! సముద్రమంటే వెనక్కి వెళ్ళనిచ్చేది కాదు, లోపలికి లాక్కునేది! ఒక్కసారిగా గాలి మరింత పెరిగింది. బోటు లయ లేకుండా ఊగసాగింది. వేటయన్ తన తండ్రిని గట్టిగా పట్టుకున్నాడు.
“బాబూ, ఊచక్క కూర్చోరా!” అని కందసామి గదమాయించాడు. ఇంతలోనే ఒక పెద్ద అల బోటును ఢీకొట్టింది. కందసామి పట్టుజారి పడవలోనే పడ్డాడు. వేటయన్ ఏడుస్తూ “నాన్నా నాన్నా!” అని అతనివైపు రాబోయాడు. కానీ కందసామి వాణ్ని వారించి, తడిచేతులతో పట్టుచిక్కక పైకి లేవడానికి ప్రయత్నిస్తూ, “నీవు భయపడకో వెట్ట! నన్ను నమ్మురా! ఈ పడవను మనం జాగర్తగా తట్టడికె తీస్కెల్తాం” అని నచ్చజెప్పాడు.
చివరకు, బోటును అల్లకల్లోలం మధ్యన తటికి చేర్చారు. ఆ సూర్యోదయం వెట్ట మనసులో అనుమానాన్ని నాటింది. అందరికంటే చివరిగా తీరానికి చేరిన ‘కడలమ్మ’ను చూసి మంగ, పొన్నమ్మ గబుక్కున పరిగెత్తుకు వచ్చారు. కందసామిని, వేటయని గట్టిగా హత్తుకొని నిట్టూర్చారు. బెదిరిపోయిన వేటయన్ను చూసి కర్పగం కిసుక్కున నవ్వింది. ఆ నవ్వులో మైత్రి ఉందేమో అని వాడికి అనుమానం కలిగింది.
వేటయన్కు పదిహేనేళ్ళు వచ్చాయి. అడపాదడపా తండ్రితో సముద్రంలోకి వెళుతున్నాడు. వాడికిప్పుడు వల విసరడంలో వాటం బాగా కుదిరింది. సముద్రమంటే గౌరవంతో పాటు దాని ఎరిక, దానిపట్ల జాగరూకత కలిగాయి. సొంతంగా తనకే ఒక పడవ కొనివ్వమని తండ్రిని పదేపదే అడగసాగాడు.
ఒకనాడు మధ్యాహ్నంపూట బుడతమాగలు బాగున్నాయని కందసామి వేటయన్ని, సుందరాన్ని ఏట్లోకి బయలుదేరదీశాడు. ‘కడలమ్మ’ ఉయ్యాలలూగుతూ సాగిపోతోంది. దూరాన వెళుతున్న విదేశీ ఓడను చూసి వేటయన్ పలకరింపుగా చేతులూపాడు. తండ్రి, అన్న తెడ్లు వేస్తుంటే వాడు సముద్రంతో మాట్లాడుతూ వాడిలో వాడే పాటలు పాడుకుంటూ గాలికి చెమటను ఆరబెట్టుకుంటూ నడుముకి చేతులు చేర్చి నిలబడి ఉన్నాడు. స్కూల్లో ఫిజిక్స్ టీచర్ చెప్పిన పాఠంలాగా శరీరాన్ని బాలన్సు చేసుకోవడానికి తంటాలు పడుతున్నాడు.
మధ్యమధ్యలో బోటులో నిశ్శబ్దంగా కూర్చొని తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నాడు. “సముద్రం మనల్ని ప్రేమిస్తే తల్లి, కోపిస్తే రాక్షసి.”
సుందరం తన వలను కూర్చికూర్చి సర్దుకుంటున్నాడు. రేడియో మాటలను ఆపేసి గిజ్ మని గోలచేస్తున్నది. గాలి అంతకంతకు వేగంగా వీచసాగింది. ఉన్నట్టుండి ఓ పెద్ద అల బోటును గుద్దింది.
“నాన్నా!” వేటయన్ భయంతో ఒక్క అంగలో తండ్రిని చేరుకున్నాడు.
కందసామి వలలోని మాగల్ని, మత్తగుళ్ళని వేరు చేసి బక్కెట్లో వేస్తున్నవాడల్లా వెంటనే అప్రమత్తమయ్యాడు. సముద్రం ఈవేళ ఎందుకో మామూలుగా లేదు.
“ఇది తుఫాను చేరిన జాడిరా! మనం వెంటనే తట్టడికె వెల్లాల!”
వార్తల్లో అలాంటిదేమీ చెప్పలేదు కదా అని తెడ్డు వేయాలా వద్దా అని సుందరం తటపటాయిస్తున్నాడు. ఇంత మంచిపంటని వదిలేసి ఎలా వెళ్లడమా అని కందసామి ఆలోచిస్తున్నాడు. ఇంకోసారి విసిర్తే, దాదాపు యాభై కిలోలు పడినట్టే. దాంతో ఈసారి పొంగల్ పండుగ ఘనంగా చేసుకోవచ్చు. వెళ్లాలా ఉండాలా అనే సందిగ్ధంలో ఇద్దరూ ఊగులాడుతుంటే ‘కడలమ్మ’ అంతూపంతూ లేని అలల్లో ఊగులాడుతున్నది.
సూర్యుడో చంద్రుడో – తెల్లటి గోళమొకటి మేఘాల్లో దాక్కుంటూ సముద్రంపై అర్ధచంద్రాకారంగా వెలుగులీనుతున్నది. ఆవిరి పొగమంచులా చుట్టుముట్టింది. గాలి దంచికొడుతోంది. అగ్నిరాసిలా మెరుపులు కటకటలాడుతున్నాయి. బోటు భీకరంగా ఊగిపోతోంది. పిల్లవాడు వేటయన్ భయంతో అరవడం కూడా ఆపేశాడు. వాడికి ఎక్కిళ్లు వచ్చేశాయి.
కొడుకు పరిస్థితిని చూసిన కందసామి ముందూవెనకా ఆలోచించకుండా ఉన్మాదిలా పడవను నడపసాగాడు. కాని సముద్రం అతని నిర్ణయాన్ని అంగీకరించలేదు. వేటయన్ తన జీవితంలో మొదటిసారి సముద్రాన్ని గజగజలాడుతూ చూస్తున్నాడు. అది ఎవరినీ విడిచిపెట్టదనే విషయాన్ని వాడు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాడు.
“నాన్నా! మనం తిరిగి వెళ్తామా?” వెక్కుతూనే అడిగాడు.
“తప్పకుండా బాబూ! కానీ నీవు నా మాట వినాల. భయపడొద్దొ.”
కందసామి తన శక్తినంతా కూడదీసుకొని నడిపినప్పటికీ, గాలి, అలలు అతనికి గట్టి పోటీని ఇస్తున్నాయి. సుందరం ఇంకా బోటులోని బరువు తగ్గించడానికి పట్టిన చేపలనన్నింటినీ బయటకు విసిరేస్తూనే ఉన్నాడు. పడవలోకి పడుతున్న నీటిని ఎత్తిపోస్తున్నాడు. ఇంతలో ఓ చురుకైన అల ‘కడలమ్మ’ను ఎగరేసింది. వేటయన్ ఆ పళాన గాల్లోకి ఎగిరిపోయాడు.
“వెట్టా!”
తండ్రి అరుపు ఉరుముల్లో కలిసిపోయింది. సముద్రం వాడిని సాంతం మింగేసింది.
వేటయన్ నీటి అడుగుకు దిగుతూ ఉన్నాడు. గాలికోసం ఆరాటపడుతూ చేతులు ఆదరబాదరగా ఊపాడు. తనలో సముద్రం లేదు, తనే సముద్రంలో ఉన్నాడు. బయట అంత చలిగా అనిపించింది, ఇప్పుడేమిటి ఇంత వెచ్చదనం, తల్లిఒళ్ళో పడుకున్నట్టు!
నీటిలోతుల్లో ఏదో మాయలోకంలోకి వచ్చిపడ్డాడు. ఎన్నెన్ని రంగురంగుల చేపలు. చీకట్లో వాటి రంగులు తనకు ఎలా తెలుస్తున్నాయి. నీరు వాడిని ఒత్తిడితో ఒడిసిపట్టినా, జలలోకపు జీవులు మాత్రం స్వేచ్ఛగా, నిర్భయంగా తేలియాడుతున్నాయి.పెద్దపెద్ద చేపలు అల్లకల్లోలంగా ఈదుతూ వెళ్తుంటే గాలిబుడగలు వడివడిగా వరుసలు కడుతున్నాయి. చిన్నచేపల గుంపులు సురక్షితమైన ప్రవాహంలో అలవోకగా కలిసిపోతున్నాయి. వాడిచుట్టూ తిరుగుతున్న తిమిరిచేప మొప్పలు గాలికి ఎగిరే కర్పగం ఓణీని గుర్తుకు తెచ్చాయి. తన పాతకవచాన్ని అప్పుడే వదిలిన ఒక పీత వాడి అలికిడిని గమనించి ఛుక్ మని నాచురాళ్లమధ్య ఎటు పోయిందో ఇక. పగడాల గుట్టల మీద పడుకున్న కన్నుక్కుల చేప వాడు దగ్గరికి రాగానే చటుక్కున తన ఎనిమిది కాళ్లనూ బంతిలా చుట్టేసుకుని రంగు మారిపోయింది. రొయ్యలమీసాల కొనల్లో ముత్యాలున్నట్టు వెలుతురు పరావర్తనం చెందుతోంది. పలకలా తేలుతూనే ఆకృతులు మార్చుకుంటూ పారదర్శకంగా ఉన్న ఒక వింతజీవి నీటిప్రవాహాన్ని నిశ్చలంగా తట్టుకుంటోంది. పసుపుచారలున్న ఓ పాము దోబూచులాడుతూ ప్రవాహానికి ఎదురీదుతూ తన నైపుణ్యాన్ని పరీక్షించుకుంటోంది. ప్రసరణకి కొట్టుకొచ్చిన కొబ్బరిచిప్పను గుడ్లుపెట్టడానికి నెట్టుకొస్తున్న ఒక చిట్టిచేపల కుటుంబం వాడిని దొంగచూపు చూసి త్రుటిలో మాయమైంది. గొడుగు ఆకారంలో ఉన్న జల్లిచేపల కదలికలు నాట్యం చేస్తున్న కాంతిబిందువుల్లా చమక్కుమంటున్నాయి. కత్తిలాంటి ముట్టెలున్న చేపలు, పొలుసులు లేని చేపలు, పాముచేపలు, చారలచేపలు, తళతళలు విరజిమ్మే పుట్టగొడుగులు, నీటిలో నానినాని ఉబ్బిన పుష్పమణిజాతులు, అలలపోటుకి నెమ్మదిగా వాలే సముద్రపు గడ్డి, తమ జీవరసాయన ప్రక్రియతో వెలుగులు నింపే తనెన్నడూ చూడని ఏవేవో ఏవేవో జీవులు – ఈ లోకానికి ఓ భాష ఉంటే, అది చప్పుడు లేని నీటిప్రవాహం; ఓ గానముంటే, అది చేపల ఈత; ఓ మాయాజాలం ఉంటే, అది జలచరాల ఉనికి! ఆరడుగులు కూడా లేని వాడు తన చేతులను బార్లా చాచి అనంతమైన సముద్రాన్ని ఆలింగనం చేసుకోవాలనే తాపత్రయంలో తలమునకలవుతున్నాడు.
అదిగో ఆ మూలన, వందల ఏళ్లుగా నిద్రపోతున్న ఓ మునిగిన ఓడను దాపుగా చేసుకోవాలని అటుగా వెళ్లాడు. దానిచుట్టూ పేరుకున్న నాచు, పెద్దచేపల సంచారం, నడుమ పెరిగిన అరుదైన ఊదా పగడాలు. సముద్రంలోపల ఒక వింత నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దంలోపల జీవన కదలికల మధురసంగీతం ఉంది. వాడికి చెవులు దిబ్బళ్ళేసి పోయాయి. ఇక్కడ అడుగుల్లేవు, సరిహద్దుల్లేవు – కాలం కూడా నిశ్శబ్దంగా ప్రవహించే మరో ప్రపంచం ఇది. సముద్రం మనకు తెలియని ఎన్నో రహస్యాలను దాచుకుని, ఎవరికీ తన అసలు స్వరూపాన్ని పూర్తిగా చూపించని ఒక అంతరాళ మాయాలోకం. అక్కడ భయం లేదు, నిర్విణ్ణత ఉంది. ఇక ఊపిరి అందని ఒక్క క్షణం — చివరి క్షణం…
ఒక బలమైన చేయి వాణ్ణి పట్టుకుంది!
కందసామి వేటయన్ని ఒడిసి పుచ్చుకొని పైతట్టుకి లాక్కొచ్చాడు. బోటును కూడా ఒడ్డుకు సురక్షితంగానే చేర్చారు. ఆ అనుభవం వేటయన్కి ఓ పెద్ద పాఠం నేర్పించింది.
సముద్రం ఎప్పుడూ శత్రువుగా ఉండదు. దాన్ని స్నేహితుడిలా గౌరవించాలి.
వేటయన్ ఒడ్డుపై కూర్చొని గట్టిగా తండ్రిని పట్టుకున్నాడు. “నాన్నా… మళ్లా బోటులోకి ఎక్కనో.. వేటకి రానో” వాడు తలాడిస్తుంటే తడిసిన జుత్తులోంచి నీళ్లు కందసామి ముఖంమీద ఉప్పెనలా పడ్డాయి. ఉప్పునీటిలో తెరచి ఉంచడం వల్ల వాడి కళ్ళు ఎర్రగా మారాయి. రెప్పలు ఆర్పినపుడల్లా మంటలు పుడుతున్నాయి.
వాడి గొంతులో భయంతో కూడిన తడబాటు దట్టంగా పేరుకుంది. చేతులు వణుకుతున్నాయి. చల్లటి గాలి కొడుతున్నా, ఒంటిపై చెమటచుక్కలు మెరుస్తున్నాయి. కళ్లలో నీరు నిలిచింది.
“వేట్టా! సముద్రం నీకు ఏమీ హాని చెయ్యదొ. అది మనకు తండ్రిమాదిరి.”
“కాదు నాన్నా! అది నన్ను తీసుకుపోవాలనుకుంద! మళ్లీ లోనకొస్తే నన్ను లాగేసుకుంటుంద!”
వేటలో జరిగినదంతా ఇప్పుడే మళ్లీ వాడి స్మృతిలోకి వస్తోంది. అలల అల్లకల్లోలం, ఆకాశపు గంభీరనాదాలు, నీటిలోతుల్లో కనిపించిన మాయలోకం—అన్నీ కలసి వాడిని కుదిపేసాయి.
కందసామి మబ్బులను చూశాడు. సముద్రపుగాలి మారిన తీరు గమనించాడు. కొంత సమయం మౌనంగా ఉన్నాడు. ఆపై వాడి భుజాలపై చేతులు వేసి మృదువుగా అన్నాడు—
“మత్స్యకారుడు సముద్రానికీ భయపడితే, సముద్రం కూడా అతనిని మర్చిపోతుంద. అదీ మిత్రుడౌవాల, శత్రువుగ నిలకూడదొ. నీ భయాన్ని అలల చేతపెట్టెయ్, వెట్ట!” అని చిన్నగా నవ్వాడు. “ఇంకోమారు ప్రయత్నించొ. సముద్రం మళ్ళీ నీతో మాటాడుతుంద.”
వేటయన్ ఆ క్షణంలో తండ్రి మాటలు నమ్మాడు. వాడు సముద్రపు ప్రశాంతత, ప్రేమ, భయం, దయ, క్షమ, కోపం, ఆకర్షణ, ఆదరం అన్నింటినీ ఒకటొకటిగా తెలుసుకుంటున్నాడు. కానీ అది ఇంకా వాడికి తన అసలైన రూపాన్ని చూపలేదు… ఏమిటి ఆ అసలు రూపం? అది ఊహించుకోవాలంటేనే వాడికి ఒళ్ళు గగుర్పొడుస్తోంది.
ఇన్నాళ్లూ వాడికి సముద్రం తన పనేదో తాను చేసుకునే వినయం గల విద్యార్థిలా కనిపించేది. కానీ ఈ రోజు, అది ఆగ్రహంతో ఉప్పొంగిపోయింది. ఆకాశం నల్ల కప్పేసుకుపోయింది. గాలి తెమ్మెర హఠాత్తుగా ఉగ్రరూపం దాల్చింది. అలలు నిదానంగా తీరం తాకుతూ ఉండేవి, కానీ ఇప్పుడవి ఉరకలెత్తుతూ ఉధృతంగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇదంతా పైపైన్నే. కానీ లోన… ఈ ప్రభావమేమీ లేని ఒక ప్రశాంత స్థిరజగత్తు ఉంది!
వేటయన్ ఇంటిముంగిట్లో నిలబడి తల్లి పొన్నమ్మ తన తల తుడుస్తుండగా తువ్వాలు కొనల్లోంచి సముద్రాన్ని చూశాడు. తనకు తెలుసు ఇది సముద్రం కాదు – ఆగ్రహంతో అగ్ని కమ్మిన తుపాను.
‘హమ్ సోచా తుమ్ కబీబి మృదువుగానే ఉంటావని. పర్ అందర్సే నీ వేరా లెవెలు ! బాహర్సే నీ వేరా మాతిరి ఇరుక్కిఱాయ్, ఇల్లెయా?’ వేటయన్ సముద్రాన్ని హిందీ కలిసిపోయిన, తెలుగు కరిగిపోయిన తమిళంలో అడిగాడు.
జవాబుగా అన్నట్టు ఓ బరువైన అల పైకి లేచింది, నీటిశబ్దం గర్జనలా మారింది. సముద్రం తండ్రిలా సంరక్షించడమే కాదు, శిక్షించే గురువులా కూడా మారగలదని వేటయన్ అర్థం చేసుకున్నాడు.
వాడికి ముత్తుస్వామితాత చెప్పిన మాట గుర్తొచ్చింది. “సముద్రం మన గెలుపును పరిగణించదు, మన భయాన్ని గమనించదు. అది తన సహజ స్వరూపంలోనే ఉంటుంది. గౌరవిస్తే – నీకు మార్గం చూపుతుంది. ఎదిరిస్తే – శిక్షిస్తుంది.” ఈ రోజు సముద్రం తన పరిధిని ఎవరైనా దాటితే తట్టుకోదని గట్టిగా హెచ్చరిస్తోంది. వేటయన్కి బాగా అవగతమైంది – సముద్రాన్ని ప్రేమించవచ్చు, కానీ అమ్మో, దాని కోపాన్ని పరీక్షించకూడదు.
కిసుక్కున మోగిన కర్పగం నవ్వులో వాడికి ఈ హెచ్చరిక వినబడింది. తల తిప్పి చూసేలోపు ఆ పిల్ల పారిపోయింది.
“వేటయా! నిన్న గాలిలో పడవ కట్టేసి తియ్యని నిద్రపోయావా?” అన్నాడు ముత్తుకుమారన్, చిరునవ్వుతో.
వేటయన్ నవ్వుతూ, “ఆహా! గాలి వీచినా, కెరటాలు ఉప్పొంగినా, మీనవర్ (చేపల వేటగాడు)ని నిద్ర లేపగలవా?” అని సవాలు విసిరాడు. కూడా ఉన్న నూనూగు మీసాల కుర్రాళ్లందరూ పగలబడి నవ్వారు.
జోగారావు అన్నాడు “మన పాతకాలపు వేట విధానాలే వాడి నిన్నంతా దెబ్బతిన్నావేమో! అవున్లే, అదృష్టం కొద్దీ మన వేట సాగిపోతోంది గానీ, పద్ధతులు మాత్రం మారలేదుగా?”
ముత్తుకుమారన్ తన తలకు చుట్టుకున్న తుండుగుడ్డని సరిచేసుకుంటూ, “మన పాట్టియమ్మల పాటలు ఇంకా చెవులకి ఇంపుగానే ఉన్నాయబ్బా! చానా లోనకి పోయే వేటగాళ్ల పద్ధతులు ఇప్పటికీ అద్భుతంగా పని చేస్తున్నాయే, ఎన్నా ప్రాబ్లము?” అన్నాడు.
అండమాన్ సముద్రపు నీరు గాఢంగా నీలంగా ఉంటుంది. ప్రవాహాలు విరుచుకుపడతాయి. తుఫానులు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. అందుకే చిదంబరం తన కొడుక్కి, పరంబరం తన కొడుక్కీ చిన్నప్పటినుండి ఓ పద్ధతిగా ‘తీరంవేట’ మెళకువలని నేర్పించారు. ఇప్పుడవి నెమ్మదిగా వేటయన్కి ఒంటబడుతున్నాయి.
వాడు చిరునవ్వు చిందిస్తూ, “అవునురా! మన తాతలు చేపలతీరనీ, అలలనడకనీ బాగా అర్థం చేసుకునేటోళ్లు. నీళ్లకింద గుట్టలకీ, చేపలసంచారానికీ తామే అలవాటు పడిపోయేటోళ్లు” అన్నాడు.
శివ చేతికి దొరికిన ఒక చిన్న శంకుని పరీక్షిస్తూ అన్నాడు “ఏరా, మన కత్తివలే సూడు, ఎంత బాగుంటది.”
వేటయన్ గట్టిగా నవ్వి, కొబ్బరి ఆకులతో గాలి విసురుకుంటూ “కత్తివల అంటే అందరికీ తెలిసినదే! పెద్దచేపలకి ఆకర్షించేలా చిన్నచేపల్ని వలగా వాడతాం. ఎక్కడ పడేశామో మచ్చీలు (చేపలు) అక్కడే చిక్కిపోతాయి!” అన్నాడు, ఒకింత గర్వంగా, ఆ పద్ధతేదో తానే కనిపెట్టినట్టు.
జోగారావు తలూపుతూ, “కానీరా ఒరే, లోతుల్లో తిరిగే మచ్చీలకైతే డ్రిఫ్ట్ నెట్టు బాగా పనికొస్తుంది. నీటి అడుగున నెమ్మదిగా సాగుతూ, ఎదురొచ్చిన చేపలన్నిటినీ బంధిస్తుంది!” అన్నాడు.
ముత్తు ఆనందంగా జత కలిశాడు. “అదువుం ఇల్లరా! కొన్ని చేపలు వెలుగుకే అగుపడుతాయి. మేఘాలు కమ్మిన అర్ధరాత్రులలో, లేత చంద్రుడి ఒళికోసం పైకొస్తాయి, మన వలకి బడతాయి.”
నైతల్ అన్నాడు – “ఒరేయ్! నాకు మాత్రం దొర్లవల బాగా నచ్చుతుంది. ఒకేసారి విసిరి, వల బరువుతోనే చేపలు చిక్కిపోవడం చూడానికి మహా మజాగా ఉంటుంది!”
“తుమ్ కిత్నా బీ బోలో, ఎనక్కు నిటారుగా పడే వలలంటే భయంకర ఇష్టమాణు” రమేష్ చెప్పాడు.
“నిన్నెవరు అడిగార్రా” అని వాడి వెనకపడ్డారు ముగ్గురు. వాళ్లచేతికి చిక్కకుండా రమేష్ ఇసుకలో బరువుగా అడుగులేస్తూ పరిగెత్తాడు. అది చూసి కాపలాకుక్కలు కూడా మొరుగుతూ హుషారుగా వారివెంటే పరుగులు తీశాయి. యువకులు తడి ఇసుకలో పడి దొర్లుతూ, నవ్వుతూ, తుళ్లుతూ, కేరింతలు కొట్టసాగారు. వారినక్కడ వదిలి కుక్కలు చేపలకోసం ఎగురుతున్న కొంగలను తరమసాగాయి.
ముత్తుకుమారన్ వేటయన్ చేతులను కిందికి దించి తనకు కూడా గాలి తగిలేలా విసనకర్రని చెవివెనక్కి ఒడిసిపట్టుకుంటూ ఉండగా దాన్ని అతనికిచ్చేసి వెట్ట అన్నాడు – “నిలువు వల మనకి మంచిదే. కానీ సముద్రపు భాషని అర్థం చేసుకోవాల. ఏ చేప ఎక్కడ ఉంటుంద? ఎప్పుడు ఎటువైపు తిరుగుతుంద? ఇవన్నీ తెలియాల.”
శివ చేతిలోని గుల్లను పైకి విసిరి పట్టుకుంటూ, “మనక్‌కు సముద్రం వదిలిపెట్టే అలవాటు ఉండదురా! గాలి మారినా, కెరటాలు కోప్పడ్డినా, హమ్ ఫిర్ జాకే మచ్చీసే హి లౌట్ ఆతే !”
వేటయన్ అలలఘోష వింటూ, “అది నిజమేరా! సముద్రం మనకి అన్నీ నేర్పింద. బతకడం, ఎదుర్కోడం, గెలడం!” అన్నాడు. వాడి మాటల్లో సముద్రంపట్ల ఆరాధనాభావం ధ్వనించింది.
ఇలా మాట్లాడుకుంటూనే ఆరాము పూర్తి చేసుకుని తెప్పవేట కోసం కొబ్బరిబోదెలు, చిన్నచిన్న తృణధాతువులతో తెప్పను తయారు చేయడం కొనసాగించారు. కర్పగం చిరునవ్వుతో వాడి బలమైన భుజాలని, తెలివిగా ముళ్ళు వేస్తున్న వాడి వేళ్లని నేరేడుచెట్టు చాటునుంచి చూస్తూ ఉంది.
2004 డిసెంబర్ 26 – ఆ ఉదయం సామాన్యంగా లేదు. అర్ధరాత్రి నుంచే సముద్రం అసహనంగా ఊగుతోంది. ఏదో చెప్పాలనుకుంటోంది. తీరానికి చేరుకుని నిలబడిన మత్స్యకారులందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కుక్కలు పిచ్చిపిచ్చిగా అరుస్తున్నాయి. కాకులు ఒక్కటి కూడా కనబడలేదు. నీరు మట్టం తగ్గుతూ నన్ను పట్టుకోండి చూద్దాం అని కవ్విస్తూ వెనుకకు పరుగులు తీసింది. సాధారణంగా లేతనీలంరంగులో మెరుస్తూ ప్రశాంతంగా కనిపించే సముద్రం, ఆ రోజు మట్టిరంగులోకి మారి గుబులుపడింది. ఎప్పటిలాగే విరిగిపోయిన ఆల్చిప్పలు, పగిలిపోయిన చేపలగుడ్లు, తెగిన దారాలు, పాతచెప్పులు, సీసాలు, తాడుముక్కలు – ఇవే కాక ఏటిగుట్టు బయటపడసాగింది — అప్పటివరకు ఎవరూ చూడని లోతైన కందులు, గుల్లలు, పాతపడవల శిథిలాలు కనిపించసాగాయి.
“సముద్దిరంలో నీరు రంబ వేగంగా వెనక్కి మళ్లుదే! ఇది యెప్పవుం సాదారణం కేడా!” ముత్తుస్వామి తాత అలలని చూస్తూ అన్నాడు, “ఇంక మీన్ను పట్టడానికి ఈ మాయదారి ఏట్లోకి పోరాదురా!” అని హెచ్చరించాడు.
కానీ అప్పటికే ‘ఈ రోజు చేపలు బాగా దొరకొచ్చు’ అనే ఆశతో చాలమంది మత్స్యకారులు తమ పడవలతో సముద్రంలోకి వెళ్లిపోయారు. వారు ఇంకా లోతుల్లోనే ఉన్నారు.
“నాన్నా, నీరు వెనక్కి ఎందుకు పోతుంద?” వేటయన్, తండ్రిచేతిని పట్టుకుని నిలబడ్డాడు.
కందసామి కళ్లలో అప్రమత్తత మెరిసింది. “ఇది అపాయసంకేతం, వెట్ట! తన్నీరు తిరిచిపోతుంటే, అది మరి బలంగ తిరిగి వచ్చేందుకే!”
వేటయన్ ఆశ్చర్యంగా ‘ఇప్పుడు సముద్రం యుద్ధమెందుకు చేస్తోంద’ అనుకున్నాడు. దాని ఆయుధమేంటని వాడు ఆలోచిస్తుండగానే; గ్రామస్థులు చోద్యంగా నీళ్లులేని తీరరేఖని పరీక్షగా చూసేలోపే; ప్రకృతి తన మహాకాయ భూతాన్ని పంపింది. దూరంలో ఒక మహా ఘోరమైన నీటిగోడ పుట్టుకొస్తున్నట్లు వారందరికీ కనిపించింది.
కందసామి, మరికొందరు మత్స్యకారులు సముద్రాన్ని గమనించారు. అర్థం చేసుకునేలోపే… ప్రమాదం ముంచుకొస్తోంది! ఒక రాక్షసి అల కొండంత రూపంలో సముద్రంనుండి ఆకాశాన్ని తాకేలా లేచింది! అది మానవమాత్రులెవరూ ఊహించని వేగంతో తీరంవైపు దూసుకొస్తూ ఉంది.
“ఎల్లారుమ్ పరుగెత్తండి! ఎత్తయిన చోటికి పోంగా!” పెరుమాళ్ తాత కేకలుపెట్టాడు. కందసామి కూడా గట్టిగా అరిచాడు. “సబ్ లోగ్ జల్దీజల్దీ బాగో బాగో. ఎత్తయిన ప్రదేశాలకు పరుగెత్తండి, ప్రాణం కాపాడుకోండి!”
అంతలోనే… ఆ మహా తరంగం ఊరంతా మింగేందుకు వచ్చేసింది! బస్తీవాసులంతా ఉన్నవన్నీ ఎక్కడివక్కడ వదిలేసి చేతులలో భయం, గుండెల్లో దడ నింపుకొని పరుగులు తీశారు. మంగని, వేటయన్ని పట్టుకుని పొన్నమ్మ వేగంగా దగ్గర్లోని ఓ గుట్టమీదికి పరుగెత్తింది.
నలభై అడుగుల ఎత్తైన అల తీరానికి చేరుకునే లోపే, పెనుగాలి దాడి చేసింది. మిన్ను విరిగిపడింది. చెట్లు గోంగులువేసి నేలరాలిపోయాయి. ఇళ్లు ఆయాసంతో ఊపిరి పీల్చుకుంటున్నట్లు ఊగిపోయాయి. సముద్రం అలకలు పోసుకుంటూ భయంకరమైన ఆవేశంతో దశదిశలా మారుమ్రోగింది.
అందరూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని చెల్లాచెదురుగా పరుగులు తీస్తున్నారు. కానీ కందసామి ఆగి వెనక్కి తిరిగి చూశాడు — పడవలమీద ఉన్నవాళ్లకోసం. సుందరమన్న కూడా ఆ పొద్దు రేడియో తీసుకొని పడవని మోసుకెళ్లాడు. ‘వాళ్లను విడిచిపెట్టలేనో!’ అనుకున్నాడు కందసామి.
“నాన్నా! పోరాదే!” వేటయన్ తల్లినుంచి విడివడి తండ్రిని పట్టుకోబోయాడు. కానీ తండ్రి వాడిచేతిని విడిపించుకుని ‘కడలమ్మ’ కోసం ఉరికాడు. రాకాసి అల ఉగ్రరూపం దాల్చింది. మహా ప్రళయంలా ఉప్పొంగి, తీరంమొత్తాన్ని మింగివేయడానికి గభాల్న దూకింది. కందసామి పడవలోకి చేరేలోపే, నీటిగోడ అతనిపై ఒక్క పెట్టున విరుచుకుపడింది.
కందసామి ఎదురీత కొడుతూ కొట్టుకుపోతూ, తన కుమారుడివైపుగా ఒక చివరిచూపు చూశాడు. ఆ చూపులో భయం లేదు. తన కొడుకు బతికి ఉండాలని ఆశిస్తూ, అలలమధ్య మునిగిపోయాడు.
అదే చివరిసారి వేటయన్ తన తండ్రిని చూసింది. ఒకే ఒక క్షణంలో అతనిశరీరం నీటిలో అదృశ్యమైపోయింది.
“అప్పా!”
బీభత్సమైన గర్జనల మధ్య వేటయన్ గుండె చీలిపోయేలా కేక వేశాడు. కన్నీళ్లతో కురుస్తున్న ఆకాశం… ఆవేశంతో విరుచుకుపడుతున్న సముద్రం… అక్కడే ఉండిపోయిన తండ్రిరూపం… వెట్ట స్థాణువైపోయాడు.
“ఓడుంగా! మేళ ప్రదేశాలకు చేరుకోండి! ఊపర్ జావో, జాన్ బచావో! ” అంటూ కొందరు అరవసాగారు. కానీ అప్పటికే ఆలస్యం అయింది. రాకాసి అల ఊహించనంత బలంగా వచ్చి, ఇళ్లు, పడవలు, చెట్లు, రహదారులన్నిటినీ తిమింగలంలా మింగేస్తూ ముందుకు సాగింది. కొన్ని క్షణాల్ల వ్యవధిలోనే తీరగ్రామాలు నీటిలో నిశానీ లేకుండా కొట్టుకుపోయాయి.
అలలు విరుచుకుపడే శబ్దం, చెట్లు ఒకదానినొకటి నెట్టుకుంటూ నేలకొరిగిన చప్పుళ్లు, అలుపులేని నిస్సహాయపు అరుపులు — అన్నీ కలసి ఒక భయానక గీతంలా మారాయి. ప్రళయఘంటికలు మోగి వినాశరాగం ఆరంభమైంది. సుడిగాలిలో నీటికోడి ఈకల్లా ఎగిరిపోతున్న దుంగలు, తెగిపోయిన పడవల ముక్కలు, కొట్టుకుపోతున్న ఇళ్ల సత్తురేకుల పైకప్పులు — వాటిని అణచడానికి పట్టుకునే వాళ్ళకైనా అది తాత్కాలిక నమ్మకమే. పరుగులు తీస్తూ ప్రజలు అస్తవ్యస్త భయాందోళనల్లో మునిగిపోయారు.
ఇంతలోనే, తేరుకునే గడువు లేకుండానే, ముప్పయ్ అడుగుల ఎత్తు గల ఇంకో రాకాసి అల ఊడిపడి, కదులుతున్న నీటిగోడలా తీరంవైపుకు అనూహ్యమైన వేగంతో దూసుకొచ్చింది. తప్పించుకున్నామనుకుని నిట్టూర్చిన జనాన్ని మోసగించి మళ్లీ లోతైన సముద్రంలోకి లాక్కొనిపోయింది. తీరగ్రామాల్లోని వందలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతానికి చేరుకునే లోపే, ఊళ్లకి ఊళ్లు గడ్డిపోచల్లా నీటిలో కొట్టుకుపోయాయి. బురదతో కలిసిన ఉప్పునీరు ఇళ్ళను వాకిళ్ళను రెప్పపాటులో తుడిచిపెట్టింది. అనేక చోట్ల భారీరాళ్లు, ఇసుకపుంతలు పూర్తిగా స్థానం కదిలిపోయాయి.
“అమ్మా!!”
“అయ్యా, నన్ను రక్షించండి!”
ఆసరాకోసం చెట్లపైకి ఎక్కినవాళ్ళు ఆ చెట్లతోటే నేలకొరిగారు. రక్షణకోసం రాళ్ళవెనుక చేరినవాళ్లు వాటితోటే దొర్లుకుంటూ అణిగిపోయారు. నేలమీదే ఉన్న కొంతమంది వేరే మార్గం లేక, ఉప్పునీరు ఊపిరితిత్తుల్లోకి చేరుకుని ప్రాణాలు కోల్పోయారు. పసిపిల్లలు, వృద్ధులు, తల్లిదండ్రులు, ఈత వచ్చినవారు, రానివారు — ఏ ఒక్కరికీ తేడా లేకుండా, సముద్రం తన కోపాన్ని అందరిపై సమానంగా చూపించింది.
మత్స్యకారుల పడవలు తుక్కుతుక్కుగా మారి, ఏటి గర్భంలో కలిసిపోయాయి. కొట్టుకుపోయిన వాళ్ళకోసం విలపిస్తూ తీరాన నిలబడి ఎదురుచూస్తున్న కుటుంబాలు వైరాగ్యంలో మునిగిపోయాయి. ఎంత గట్టిగా కేకలుపెట్టినా సముద్రం వాళ్ళని తిరిగి ఇవ్వలేదు.
నీరు మళ్లీ వెనక్కి వెళ్లిపోయినప్పుడు, ఊరు మిగలలేదు. మనుషులకు ఇళ్ళు లేవు, పక్షులకు గూళ్ళు లేవు. నా అన్నవారు లేకుండా ఒంటరులైనవాళ్ళు, తప్పిపోయినవాళ్ళు సముద్రంవైపు చూసి ఏడుస్తూనే దానికి శాపనార్థాలు పెడుతున్నారు. నిన్నటివరకు ఉల్లాసంగా సాగిన జీవితం, కొన్ని క్షణాల్లోనే దిక్కుమాలిపోయింది.
ఒక శూన్యప్రపంచం వేటయన్ ముందుంది. పగిలిన పడవలు, విరిగిన చెట్లు, ధ్వంసమైన ఇళ్లు, మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఊరి వీధులు గుర్తుపట్టలేని విధంగా మురికినీటి గుండాల్లా మారిపోయాయి.
“అక్కా..! నాన్నా..! అమ్మా.. !” వేటయన్ గట్టిగా అరుస్తూ, ఎవరో ఒకరు బ్రతికే ఉంటారనే ఆశతో దిక్కులు చూస్తూ నడిచాడు. ఒక మూలలో ఓ ఆడపిల్ల ఏడుపు వినిపించింది — ఇక్కడ చావు మాత్రమే ఉందనుకున్న వాడికి, ఆ ఏడుపు జీవం మిగిలిఉన్న సంకేతంలా అనిపించింది. ఎవరోనని అటుగా అడుగు వేశాడు.
ఒక్కసారిగా… ఒక పొడవైన చీకటి ఆకారం నీళ్లలో కదిలింది.
వేటయన్ అది వరదకి కొట్టుకొచ్చిన పడాక్ చెట్టని అనుకున్నాడు. కానీ అది కన్ను తెరిచింది. మొసలి! ఒకటి కాదు. మరిన్ని. సునామీ వల్ల ఊళ్లోకి వచ్చిపడ్డ మృత్యుదూతలు అవి. ఉప్పునీటికయ్యల నుంచి, మడఅడవుల మడుగుల నుంచి ఇవి మానవుల ఆవాసాలకి చేరాయి. ఇప్పుడు వరదనీటి ఉపరితలం కింద మౌనంగా వేటగాళ్లలా కాచుకుని ఉన్నాయి.
వేటయన్ ఒక్క రవ్వ కదిలినా… మరణమే.
అప్పుడే, వాడికి కూలిపోయిన ఓ గుడిసెకింద నీటిలో సగంమునిగిన ఒక ముసలివ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకుంటూ, గురగురా చప్పుడు చేస్తున్నాడు. మొసలి అతని వైపే కదులుతోంది. అతనికి పొంచిఉన్న ప్రమాదం తెలియదు.
వేటయన్ వద్ద ఆయుధం లేదు. వ్యూహం లేదు. కేవలం సముద్రం వాడికి నేర్పిన పాఠాలు మాత్రమే ఉన్నాయి.
మెరుపులాంటి వేగంతో బలాన్నంతా కూడదీసుకుని దొరికిన ఓ వెదురుబొంగుతో నీటిని గట్టిగా కొట్టాడు. చప్పుళ్లతో గందరగోళం సృష్టించాడు.
మొసలి క్షణం ఆగింది. ఆ ఒక్క క్షణం చాలు! వేటయన్ ముందుకు దూకి, ఆ వ్యక్తిని పట్టుకొని, బురదలోంచి తేలియాడుతున్న ఒక చెక్కముక్క మీదకి కష్టంతో లాగాడు. నీళ్లు తొణికిపోయాయి. ఆ మృగం నీటిలోతుల్లో మాయమైంది.
వేటయన్ అది తిరిగి ఎక్కడ కనిపిస్తుందో చూడటానికి ఆగలేదు. ఉన్నంత శక్తితో ముందుకు అడుగువేశాడు. వాడు సునామీ దెబ్బనుంచే బ్రతికినవాడు. సముద్రపుమొసళ్ల వలలో చిక్కడు.
ఇందాక ఏడుపు వినిపించినవైపున ఇప్పుడు కిసుక్కున నవ్వు వినబడింది. “మొసలికి బలే టోకరా ఇచ్చావు మాపిళ్లై” అంది కర్పగం. అప్పుడు గుర్తించాడు – రోజూ కళ్ళాపు జల్లి అలికి ముగ్గులు పెట్టే వాకిలి ఒక్కటే ఉంది. చుట్టూ ఇసకే. ఆర్ముగంమామ ఇల్లు లేనే లేదు. కన్నీటిసంద్రాన్ని అదిమిపెట్టి నవ్వడానికి ప్రయత్నిస్తున్న కర్పగాన్ని వాడు మనసారా హత్తుకున్నాడు.
జలధి జలదరింపుకి ఆ రోజు అండమాన్ నికోబార్ తీరం వణికిపోయింది. ఆకాశం నల్లటి కందెనలా మారింది. వెయ్యిన్నర కిలోమీటర్ల తీరం పొడవునా నిర్మాణాలు సర్వం కొట్టుకుపోయాయి. జీవితం ఒక్క క్షణంలో తలకిందులయింది.
“తంబీ! అమ్మా! అప్పా!” అని పిలుస్తూ ఎన్నో మైళ్లు చెదురుమదురుగా నడిచిన మంగకి వేటయ, కర్పగం ఎదురయ్యారు. ముగ్గురూ గుండెలు చిక్కబట్టుకొని ఇతరులకోసం వెతకసాగారు. అంతలోనే పొన్నమ్మ గుండెలు బాదుకుంటూ “నా మొగుడా …! నా పిల్లల్ని కన్నవాడా! కందా…!” అంటూ తీరానికి పరుగెత్తింది. ఆమెవెనకే వారు కూడా పరుగెత్తారు. ఏడ్చిఏడ్చి సోయతప్పి పడిపోయిన తల్లిని అక్కాతమ్ముళ్ళిద్దరూ పొదివి పట్టుకొని ఓదార్చారు.
వేటయన్ ఆ రోజంతా సముద్రంవైపే చూస్తూ ఉన్నాడు. “అప్పా! నీ వరువాయిలే?” అని అడుగుతూనే ఉన్నాడు. సమాధానం రాలేదు. సముద్రం తండ్రిని తిరిగి పంపలేదు. దారుణంగా పగబట్టిన ఉదయం గడిచి వాతావరణం శాంతంగా మారింది. మిగిలిందంతా… కేవలం ‘కడలమ్మ’ శకలాలు.
ఆ తరువాత అనేక రాత్రులు ఎవరూ నిద్రపోలేకపోయారు. ఆకలి వేస్తే కొబ్బరిబొండాలను పీక్కుతిన్నారు. దొరికిన అరటిగెలల్లో మిగిలిపోయిన కసరుకాయలు తిన్నారు. ఏమీ దొరకనప్పుడు బురద తిన్నారు. సముద్రం వెళ్లగక్కిన ఏ దేశపు శవాలనో వెతికే ప్రయత్నం జరిగింది. అండమాన్ మత్స్యకారుల పడవలు, అవశేషాలు నికోబార్‌లో తేలాయి. నికోబార్‌లో జరిగిన విధ్వంసం జావాలో తేలింది. చాల ప్రదేశాల్లో నేల పదడుగుల మేర నీటిలో శాశ్వతంగా మునిగిపోయింది. తల్లుల రోదనలు, తండ్రుల శోకగీతాలు, అనాథపిల్లల మూలుగులు మాత్రమే ఆ ప్రళయభూమిలో వినిపించాయి. ఆకలితో, దాహంతో చాలమంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ చూసినా దోమలు, దుర్గంధం. సహాయక చర్యలు ఆలస్యంగా వచ్చాయి.
సునామి ‘సముద్రం జీవనాధారమా, మరణద్వారమా?’ అనే ప్రశ్నను వేటయన్కి మిగిల్చింది. వాడిప్పుడు ఒంటరిగా నిశ్శబ్దంగా అభావంగా సముద్రాన్ని ‘నీలోని మార్పులను ముందుగా తెలుసుకునే మార్గం ఏదైనా ఉందా?’ అని పదేపదే అడుగుతున్నాడు.
“ఇది మామూలు సముద్రం కాదురెయ్. కొళ్ళై కడల్! సునామీని పుట్టించిందో. మనలను మింగిన రాక్షసి. దీన్ని అర్థం చేసికొండా, నమ్మ బతుక మనం గెలిచినట్టే.” పెరుమాళ్ తాత చెప్పిన ఈ మాటలు వేటయన్ మనసులో పదిలంగా నిలిచిపోయాయి. అప్పుడెప్పుడో తుఫాను వచ్చిన రోజున, తాను సముద్రంలో మునిగిపోయిన దృశ్యాలు మదిలో మెదులుతూనే ఉన్నాయి. తన జీవితానికి గోడలాంటి తన తండ్రి సునామి అనబడే నీటిగోడలో కొట్టుకుపోవడం వాడి మనసుని బాగా గాయం చేసింది.
‘సముద్రం మిత్రుడే… కాని అది ఎప్పుడైనా శత్రువుగా మారవచ్చు’ – తండ్రి మాటలు వేటయన్ గుండెలో ప్రతిధ్వనించాయి. కానీ, వేటయన్ మాత్రం సముద్రాన్ని ప్రేమించకుండా ఉండలేకపోతున్నాడు. అది వాడి నాడి. ఎవరెన్ని చెప్పినా, తన బతుకును మరిచిపోలేడు.
వాడు ఆకాశాన్ని చూస్తూ ఏడ్చాడు. సముద్రం తన తండ్రిని వెనక్కి ఇవ్వలేదని గ్రహించాడు. కానీ, తన హృదయంలో, తన తండ్రి తనను ఎప్పటికీ వదిలిపెట్టలేదని తెలుసుకున్నాడు. ఒక మహాసముద్రపు వీరుడు, మరొక మహాసముద్రపు వారసుణ్ణి వదిలేసి వెళ్లిపోయాడు.
కందసామి హఠాన్మరణం కుటుంబాన్ని తుఫానిలా తాకింది. పొన్నమ్మ కన్నీటిమడుగులో మునిగిపోయింది. వేటయన్కి మనసు భారమైంది. ఆ సముద్రం నిన్న తనను ఎంత తేలికగా బతికించింది. కానీ నేడు తన తండ్రిని అంతే తేలికగా బలి తీసుకుంది. అలలు వచ్చి వెళ్తున్నాయి. కాని తండ్రి మాత్రం తిరిగి రాలేదు. పెరుమాళ్ తాత నిజమే చెప్పాడు. అది తాను స్నేహితుడిలా నమ్ముకున్న సముద్రం కాదు. మానవులని మింగే క్రూరమైన రాక్షసి.
వేటయన్ ఇంకా తడి ఆరని ఇసుకను గట్టిగా పిడికిట్లో పట్టుకున్నాడు. ఒక తాజా నిర్ణయం తీసుకున్నాడు. “నాన్నా… నేను నీ బాటలోనే నడవాల. కానీ నీ మాదిరిగా ప్రేమగా దెగ్గిరకి తీసుకునే ఏటిని కాకుండా, కోపంతో ఉరుములు వినిపించే దీని భయంకర స్వభావాన్ని అర్థం చేసుకుంటానో.”
ఎలాగో తంటాలు పడి ఒక గుడిసె వేసుకున్నారు. పొన్నమ్మకి ఇకపై కన్నీరు పెట్టుకునే సమయం లేదు. తన పిల్లలకు, అన్నకూతురికి అన్నం పెట్టాల్సిన బాధ్యత ఆమె భుజాలపై పడింది. కందసామి లేని జీవితం ఇబ్బందికరంగా మారింది. ఆమె మత్స్యకారుల సంఘంలో చేరి దొరికిన చేపలను శుభ్రం చేసి ఎండబెట్టి అమ్మడం మొదలుపెట్టింది. వెట్ట, మంగ కూడా తల్లికి సహాయపడుతూ, చేదోడువాదోడుగా ఉంటున్నారు. కర్పగం ముందే మంచి పనిమంతురాలు.
ఒకరోజు, పొన్నమ్మను చేపల మార్కెట్టులో చూసిన ఒక పెద్దమనిషి “నీ మగడు లేడు. నీకు మార్కెట్లో చోటేంటి?” అని దబాయించాడు.
పొన్నమ్మ తన పిడికిళ్ళు బిగించి గట్టిగా “ఇక్కడ పని చేసేది నా చేతులే, ఎన్ పురుషన్ నీడల్లె” అని ధైర్యంగా చెప్పింది.
సునామి తరువాత కూడా ఆడ-మగ తేడా చూపుతున్న ఆ పెద్దమనిషిని మార్కెట్టు సంఘం మందలించింది.
ఒకరోజు, ఇక భూకంపం, సునామి రావని ప్రభుత్వం బాగా ప్రోత్సహించిన తర్వాత ఊరిలోని కొంతమంది మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ధైర్యంగా సిద్ధమయ్యారు.
“అంకుల్, నన్ను కూడా తీసుకెళ్లండి,” అని వేటయన్ వారిని అడిగాడు.
ఒకడు నవ్వుతూ, “పాగల్ హై క్యా! తేరా పప్పా హిమ్మత్వాలా థా. సముద్రాన్ని చూసి ఏమాత్రం భయపడలేదు. నీకు మాత్రం అదంటే విపరీతమైన వణుకు కదా!” అని వేళాకోళమాడాడు.
మరొకడు వెట్టని శాంతంగా పరిశీలించి, “ఇరవై ఏళ్లు వచ్చాయారా నీకు? ఇప్పటికే ఎంతో ఓర్పు కనబర్చావు. చిన్న ప్రయాణం చేయించొచ్చనుకుంటా,” అన్నాడు.
ఆ రకంగా వేటయన్ మళ్ళీ బోటులోకి ఎక్కాడు. భయం, సంతోషం, కసి, ఆనందం, గౌరవం, పట్టుదల – వాడిగుండెలో మిళితభావనలు కలిగాయి. ఓ మూడుమైళ్ళు వెళ్లేసరికి, ఏటిగాలి చల్లబడింది. అలలు మృదువుగా లేస్తున్నాయి. వేటయన్ తన చేతులు నీటిలో వేసి తండ్రి స్పర్శను వెతికాడు.
అలా వంగినపుడు ఒకవైపు నీటిరంగు కొద్దిగా గాఢంగా ఉండటం గమనించాడు. “ఈ వైపుగా వల వేయండి!” అని వాడు అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది ‘మాకే సలహాలిచ్చే మొనగాడివా’ అన్నారుగాని, ‘వాడు చెప్పిన వైపున ఓ పట్టు పడదాం’ అని కొంతమంది అటు తిరిగారు. అక్కడ వల విసిరేసరికి, కాసేపట్లోనే అది బరువుగా మారిపోయింది. ఎన్నో చేపలు చిక్కాయి.
దాంతో, “శభాష్ వేటాయి! నీ తండ్రి ఉండుంటే మీసం మెలేసేవాడు” అని మెచ్చుకున్నారు.
చేపలు ఎక్కువగా ఉండే ప్రదేశాలను పక్షుల హడావుడితోనే కాక నీటిరంగులో మార్పులు, అలల ప్రవాహం, ఉపరితలంపై కనిపించే ఇంకొన్ని ప్రత్యేకమైన లక్షణాలద్వారా గుర్తించవచ్చు. వేటయన్ చిన్నగా నవ్వుకున్నాడు. తండ్రిమార్గంలో కొడుకుగా మొదటి అడుగు వేశాడు.
మార్కెట్లో సరుకుని దించాక బరువెక్కిన జేబులతో ఉన్న స్నేహితులు వేటయన్ను బిరియాని తిని మందు తాగటానికి రమ్మన్నారు. కరెన్ జాతి మత్స్యకారులతో సన్నిహితంగా ఉండే తండ్రి వారినుంచి నేర్చుకున్న ఉత్తమమైన విషయం మీనవర్లు మందు తాగకూడదని. అదే వెట్టకు చెప్పి ఒట్టు కూడ వేయించుకున్నాడు. దాంతో స్నేహబృందంనుంచి వాడు విడివడ్డాడు.
వేటయన్ పెరిగే కొద్దీ, తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ, సముద్రపుమార్పులను గమనించడానికి కొత్త పద్ధతులు కనిపెట్టాలని సంకల్పించాడు. వాడిప్పుడు పాండిచ్చేరి యూనివర్సిటీ పోర్టు బ్లెయిర్‌లో స్థాపించిన మహాసముద్ర అధ్యయనాలు మరియు సముద్ర జీవశాస్త్ర విభాగంలో చదువుతున్నాడు. వాడి విజ్ఞానానికి వంశపారంపర్యంగా వస్తున్న అనుభవసారం తోడైంది. వేటయన్ పాతతరం మత్స్యకారులను తరచుగా కలుస్తుండేవాడు.
“తాతా, సముద్రం ముందుగా సంకేతాలు పంపుతుందన్నావొ కదా?”
పెరుమాళ్ తాత తల ఊపాడు. “అవునో. ప్రకృతిలో జరిగే చిన్నపాటి మార్పులను గమనిస్తేనే కదా, తుఫానులు, పెద్ద ప్రమాదాలు మనం ముందుగా పసిగట్టేది.”
రాజధాని పట్టణానికి వస్తూపోతూ ఉండే నికోబారి గిరిజనుల దగ్గరికి వెళ్లి, స్నేహం సంపాదించి, వాళ్ల వేట విధానాలను అధ్యయనం చేశాడు. తుఫాను రానున్నపుడు కొన్ని చేపలు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. గాలి వెనుకకు లాగేలా వీచడం అనేది వింత తుఫాను ముంచుకొస్తున్న సూచన. కొన్ని ప్రత్యేక సముద్రపు రంగులు వాతావరణ మార్పులను సూచిస్తాయి. వాడు ఇలాంటి విషయాలను ముత్తుకుమారన్, జోగారావు లాంటి మత్స్యకారులకు నేర్పాడు.
ప్రతిరోజు తీరానికి వెళ్లి సముద్రాన్ని చూస్తుండేవాడు. “నాన్నా, నీకు ఇది ప్రాణమైనట్టే, నాకు కూడా అదే కావాల” అని అనుకునేవాడు. వాడిదృష్టి ఇప్పుడు మరింత ముందుకు వెళ్లింది. సముద్రం మారుతున్న తీరును గమనించడం, ఊరికి ముందుగా అపాయసంకేతాలను అందించడం వాడి లక్ష్యమైంది. సముద్రశాస్త్రంలో మరింత లోతైన పరిశోధన చేస్తున్నాడు. తుఫాను హెచ్చరికలను ముందుగా గమనించగలిగే పద్ధతులను నేర్చుకుంటున్నాడు.
ఒకరోజు, కాలేజీ తర్వాత వేటయన్ తీరాన నిలబడి తీరిగ్గా సముద్రాన్ని గమనిస్తున్నాడు. ‘గాలి గతంలో కంటే వేగంగా మారిపోతోంది… నీటిరంగు కొద్దిగా చిక్కనవుతోంది… చేపలు వాటి స్థావరాల నుంచి అటుఇటు భ్రమిస్తున్నాయి…’
పాత మత్స్యకారులు ‘ఇప్పుడిదంతా సహజమే’ అనుకుని తమ పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ వేటయన్కి కారణం తెలియని సందేహం కలిగింది. తండ్రి మరణానికి ముందు కూడా గాలులు ఇలాగే మారిపోయాయి కదా…?
వెంటనే ఊరిపెద్దల దగ్గరకు వెళ్లాడు. “ఈరోజు వేటకు వెళ్లకండి. సముద్రం పైకి శాంతంగా ఉన్నా, లోపల ఏదో జరుగుతోంది!”
వాణ్ని చూసి నవ్వారు.
“ఇప్పటికీ ఎండ ఉంది, గాలి స్తబ్దంగా ఉంది. తుఫానా?”
“బాబూ, ఇదంతా సహజమే! సముద్రమన్నాక అలజడి వస్తుంది, పోతుంది. షరా మామూలే!”
“అంతేనా? సునామి వచ్చేముందు కూడా మీరు ఇలాగే అనుకున్నారు!” అని వాడు గట్టిగా అన్నాడు.
సునామి అనే మాట చెవిన పడగానే కొంతమంది అనుమానంతో ఆగిపోగా, ఇంకొందరు పట్టించుకోకుండా సముద్రంలోకి వెళ్ళారు. పొన్నమ్మ తన కొడుకుని గర్వంగా చూసి, “వెట్ట చిన్నవాడైనా సముద్రాన్ని అర్థం చేసుకున్నాడు. ఒక్కసారి మనం వాడిమాట వింటే తప్పేముంది?” అని అన్నది.
వెట్టమాటలు ఉట్టివి కాదని ఋజువయింది. రాత్రికి రాత్రే సముద్రం రణరంగంగా మారిపోయింది. గాలి భీకరంగా వీచింది. నీరు నిలువెల్లా ఉప్పొంగిపోయింది. ఆకాశం చిమ్మచీకటిగా మారింది. వేటయన్ ఊహించిన విధంగా సముద్రం తన నిజరూపాన్ని చూపిస్తున్నదని గ్రహించాడు. అలలు పడగెత్తి, ఒడ్డుకు ఉరికి పడుతూ, ప్రతీదానికంటే మరొకటి మరింత గర్జనతో ముందుకొచ్చాయి. వేటకు వెళ్లిన బోట్లలో ఒక్కటీ తిరిగి రాలేదు…
అది చూసిన ఊరి ప్రజలు కృతజ్ఞతాపూర్వకంగా వేటయన్ మాటలను గుర్తుచేసుకున్నారు. ‘మనం గమనించని దాన్ని మన బిడ్డ గమనించాడు…’ అని పోయినవారికోసం కళ్లు ఒత్తుకున్నారు.
తదుపరి రోజున, గ్రామపెద్దలు వేటయన్ని పిలిచి, “నీ తండ్రి సముద్రానికి ధైర్యవంతుడు. మా అందరి కుటుంబాలకోసం ప్రాణాలకు తెగించి ఉప్పెనలోకి ఈదుకెళ్లిన వీరుడు. కొంతమందిని కాపాడగలిగాడు. నువ్వు ఈ రోజు కొంతమందిని కాపాడగలిగావు. నువ్వు ఆ తండ్రికి తగ్గ బిడ్డవు. సముద్రాన్ని అర్థం చేసుకున్నావు. తెలివైనవాడివి. ఇకనుంచి, మత్స్యకారులు ప్రయాణానికి ముందుగా నీ మాట వినాలి! నువ్వు ఈనాటి నుంచి మీనాదురై, కడల్దురై ” అని తీర్మానించారు.
కర్పగం కిసుక్కున నవ్వింది. అందులో వాడికి ప్రశంస ధ్వనించింది.
సముద్రం జీవనాధారం… సముద్రం మాతృమూర్తి… సముద్రం మానవుడికి ఆత్మబంధువు. సముద్రం నిష్ఠురశక్తి. అది ఒక మనిషిని తీసుకుపోయింది. కానీ అదే సముద్రం, ఆ మనిషి కొడుకుని నాయకుడిగా తీర్చిదిద్దింది.
వాడు సముద్రాన్ని గెలిచాడు.
‘నాన్నా, నువ్వు నాలోనే ఉన్నావో. ఇప్పుడు నేనే నా ఊరిని కాపాడతానో,’ అన్నాడు వాడు దాంతో. ఆ రోజు సముద్రం నిశ్శబ్దంగా, స్నేహపూర్వకంగా అలలు తాకింది. వాడిప్పుడు పెద్దవాడయ్యాడు.
***