“మన సాకేతులవారి వంశం అలాంటిదిలాంటిదా? శుద్ధశ్రోత్రియ వంశం కాదూ? నిప్పులు కడుగుతాం మనం! అలాంటిదీరోజు …”
“నిప్పులు కడగటం ఏమిటి బామ్మా?”
ఎనిమిదేళ్ళ బుజ్జి సంధించిన ప్రశ్న బామ్మగారి ప్రవాహానికి చెలియలికట్ట వేసింది. ఆవిడ ఆవేశం కాస్త తగ్గుముఖం పట్టింది. మరీ నాటకీయంగా మాట్లాడానేమో అనుకుంది.
చిన్న మనమరాలి కేసి మురిపెంగా చూస్తూ, “అదా తల్లీ? అంటే మనది పరిశుభ్రత అంటే చాలా పట్టింపు గల వంశం అన్నమాట. అన్నిటినీ శుద్ధి చేసే ఆ అగ్నిదేవుడే కానీ, మనింటోకి రావాలంటే చన్నీళ్ళు స్నానం చేస్తేగానీ రావడానికి వీల్లేదని అర్థం, అడ్డమైనవీ తింటాడుకదా” అని వివరించిందావిడ.
అంతట్లో ఉపన్యాసవిషయం మళ్ళీ స్మరణకి తెచ్చుకుని, “అందుకే మరి, మనింట్లోకి, ఇదిగో, … అది వచ్చిందంటే …” అంటూ నసిగింది. ఆచారం మంటగలిసిపోతోందనే ఆగ్రహమూ, మనమరాలి మీదున్న వ్యామోహమూ, పరస్పరం కుస్తీ పట్టుకుంటూ ఆవిడ్ని ఊ ఇబ్బంది పెట్టేస్తున్నాయి.
ఆ “అది” అనేది తన ప్రస్తావన వచ్చినందుకు గుర్తింపుగా పడుకునుండే సుతారంగా తోకాడించింది. దానికి ఆర్నెల్లు ఉంటాయేమో. కళ్ళల్లో ఉట్టిపడుతున్న్నజీవకళ తప్పిస్తే పెద్దగా ఎలాంటి ప్రత్యేకతా లేదు దానికి. లోకులు మర్యాదకి “గ్రామసింహం” అని వ్యవహరించే ఊరకుక్కపిల్ల అది.
“రావడం ఏమిటి బామ్మా, నేనే పట్టుకొచ్చానుగా?” బుజ్జి సరిదిద్దింది. కాకపోతే బామ్మగారన్నది కూడా పూర్తిగా తప్పు అనడానికి లేదు. ఆ రోజు సాయంకాలం బుజ్జి ఇంటిబయట ఆడుకుంటూంటే ఎక్కడినుంచి వచ్చిందో ఆ కుక్కపిల్ల దాంతో జతకట్టి ఆటల్లో కలిసిపోయింది. ఆటలయ్యాక, “మా ఇంటికొచ్చి నాతో ఉంటావా?” అని బుజ్జి అడగడం తరవాయి, కూడా బయల్దేరి వచ్చేసిందా శునకకిశోరం.
బామ్మగారి ఇరకాటం వర్ణనాతీతం. ఎలాగరా భగవంతుడా ఈ పిల్లకి నచ్చజెప్పడం?
“చూడమ్మా, పట్టుకొచ్చావు బాగానే ఉందిగానీ, అది మనలాగా నీళ్ళు పోసుకోదు, అడ్డమైనవన్నీ తింటుంది. ఇందాక చెప్పానే, మన పరిశుభ్రత అని, అదంతా పోతుంది. దాని పద్ధతి వేరు, మన పద్ధతి వేరు, ఎవరుండాల్సిన చోట వాళ్ళుండాలి.”
“దానికి నీళ్ళు నేను పోస్తానుగా? అన్నం కూడా పద్దతిగానే పెడతాను. అయినా నేనూ అదీ ఇప్పుడు స్నేహితులం, అదున్నచోట నేనూ, నేనున్నచోట అదీను.” బుజ్జి మాటయితే తొణకలేదు గానీ, కింది పెదివి మొండిగా బిగుసుకోడం గమనించింది బామ్మగారు. ఎరిగినవాళ్ళు అది బామ్మ పోలికే అంటారు. రాకరాక ఇందులోనే దీనికి నా పోలిక రావాలా అని లోపల్లోపలే చింతించింది బామ్మగారు.
తటస్థ ప్రేక్షకుల్లా గుడ్లప్పగించి వినోదం చూస్తున్న కొడుకూ కోడళ్ళని చూస్తే చిర్రెత్తుకొచ్చింది ఆవిడకి.
“ఏమర్రా, రోజంతా ఉపవాసం మీదుండి, రొష్టంతా నేనే పడాలా? మీ కూతురికి నచ్చజెప్పుకోడం ఏమన్నా ఉందా?” అని కసురుకుంది.
కోడలికి ముందు కుక్క అసహ్యమూ, భారమూ అనిపించినా, మాటలు నడుస్తున్న కొద్దీ పర్వాలేదేమోననిపిస్తోంది. బొత్తిగా ఊరకుక్క కాకుండా ఏదన్నా సీమ జాతి కుక్కయితే బావుణేమో అనాలోచిస్తోంది. కిట్టీ పార్టీలకి వచ్చే ఆ మిసెస్ సింగుకి ఎంతలేసి టెక్కో, పోమెనేరియన్ కుక్క యజమానురాల్నని. “మా ప్రిన్సెస్ నిన్న ఏం చేసిందనుకున్నారు?” అంటూ ఒకటే బడాయి.
కొడుకు వీలైనంతవరకూ “నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ” అన్న సిద్ధాంతాన్ని బాగా వంటబట్టించుకున్న బాపతు. అసలు విషయం తప్పించి, “అసలా కటికనీళ్ళ ఉపవాసాలు చెయ్యకపోతే ఏం కొంప ములిగిపోయిందిట? అందరిలాగా ఇడ్లీలు, అరటిపళ్ళతో అయిందనిపించచ్చుకదా?” అంటూ తల్లిని అభిమానంగా మందలించబోయాడు.
బామ్మగారిదగ్గిర ఆ పప్పు ఉడకలేదు.
“ఏడిశావులేవోయ్ బడుద్ధాయి పంతులూ. నీకేం తెలుస్తుంది, ఉపవాస మహిమ? కూతురికి చెప్పుకోలేక నామీద సంధిస్తావూ? అవునూ, అన్నట్టు ఆ జీవికెవరైనా ఇంత అన్నమూ నీళ్ళూ పెట్టారా? కొంప ఎలాగూ మైల పడి తగలడింది, దాని కడుపు మాడ్చిన పాపమైనా రాకుండా చూసుకోండి.”
“ఆ, అవునవును, బుజ్జి, దానికి అన్నం, నీళ్ళూ పెట్టు మరి!”
“ఇందాకే పెట్టేసాను నాన్నా, నా కంటే ముందేను.”
ఒకవైపు కుక్కా గిక్కా అనవసరమైన తలకాయనొప్పి, పైగా తల్లితో లేనిపోని గొడవ అనుకుంటూనే, మరో వైపు ఎనిమిదేళ్ళ తన బిడ్డ కనబరచిన పెద్దరికానికీ, బాధ్యతకి ఆ తండ్రి హృదయం ఒక్క పిసరు మురిసింది.
అదేమీ పైకి తెలియనియ్యకుండా, బింకంగా, “ఆ, అయితే సరే, పడుకునే వేళయింది, దాన్ని వసారాలో పెట్టి నువ్వు పడుకో మరి” అన్నాడు ఉత్తరువు జారీ చేస్తున్న ధోరణిలో. కాస్తయినా తన పెద్దరికం నిలబడకపోతుందా అన్న పేరాశతో.
పేరాశకి ఎలాంటి గతి పట్టాలో అలాంటి గతే పట్టింది.
“అది వసారాలో అయితే నేనూ అక్కడే” అని చాపా దిండూ పుచ్చుకుని సిద్ధమైపోయింది బుజ్జి. అంతటితో ఆగక, “దానికి పేరు పెట్టాలి కదా, బామ్మా నువ్వే పెట్టు” అని కూడా అంది.
సాకేతులవారి ఇంటి యజమాని గుండెలో రాయి పడింది. పేరు కూడా పెట్టేస్తే ఈ జంతువు ఇంట్లో జీవితాంతం తిష్ఠ వేసెయ్యడం ఖాయం. దానికితోడు ఈ ఆకతాయి సన్నాసి పేరు బామ్మనే పెట్టమని, ఆవిడతో కోరి సంధీ విగ్రహమో ఏదో ఓటి పెట్టుకునేలా ఉంది.
ధర్మయుద్ధపు నియమాలు జ్ఞాపకం చేసుకుంటూ, “చూడూ, తెల్లారాక చూద్దాం, రాత్రి వూట కొత్తగా ఏదీ మొదలెట్టకూడదు. అయినా, పాపం బామ్మ ఉపవాసం చేసి అలిసిపోయుంటుంది కదా,” అన్నాడు లౌక్యంగా.
అంతవరకూ మిసెస్ సింగుకి శృంగభంగం చేసే ఉపాయాలు తిరగెయ్యడంలో మునిగున్న భార్యకూడా ఈ లోకంలోకి వచ్చి, “అవునే బుజ్జీ, మీ నాన్న చెప్పినట్టు వినెయ్యి, బంగారు తల్లివికాదూ. మీరూ విశ్రాంతిగా పడుకోండత్తయ్యా.” అని వంతపాడి, సహధర్మచారిణిగా తన కర్తవ్యం పూర్తయిందనిపించింది.
నిజానికి బామ్మగారికి కాస్త నీరసంగానే ఉంది. ఓవైపు ఉపవాసం వల్ల జ్ఞానేంద్రియాలు పదునెక్కినట్టు తోచినా, శరీరం విశ్రాంతి కోరింది. లేచెళ్ళి తన గదిలో మంచం మీద సాగోరి, పక్క బల్లమీదున్న రామాయణం అంది పుచ్చుకుని, అందులో రాముడు వనవాసానికి బయలుదేరుతున్న ఘట్టం చదువుతూ నిద్రలోకి జారుకుందావిడ.
ఉపవాసం చేస్తే కలలు కూడా స్పష్టంగా కనబడతాయేమో?
యుద్ధం ముమ్మురంగా సాగుతోంది. పేరుకి దేవాసుర సంగ్రామమేగానీ, పెద్దపాలు దేవతల పక్షం వహించి పోరాడుతున్న మానవులదే. దేవమానవులసేనలకి అధినాయకుడు మనుష్యవంశాల్లో అతిప్రధానమైన రఘువంశంవాడు అయోధ్యాధీశుడు దశరథుడు. సేనానాయకుల్లోముఖ్యుడు కేకయరాజు.
ఇద్దరూ శాయశక్తులా పోరాడి యుద్ధం నడిపిస్తున్నా, యుద్ధగతి అసురులవైపే మొగ్గుతోంది. దేవతలంటే అమృతం తాగి అమరులవడంచేత చావడంలేదుగానీ, అసురుల ధాటికి ఒకటీ అరా కళ్ళు లొట్టలు పోకుండా మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. మనుషులు సరే కోకొల్లుగా ప్రాణాలు కోల్పోతున్నారు. అసురుల మాయాయుద్ధ విద్యలు మరో స్థాయిలో ఉన్నాయి.
దేవతల గురువు బృహస్పతీ, మనుషుల గురువు వశిష్టుడూ ఏకాంతంగా కలుసుకుని యుద్ధపరిస్థితి గురించి చర్చించుకున్నారు. చివరికో నిర్ణయానికొచ్చారు.
కేకయరాజుగారి కూతురు కైకేయి. 18 ఏళ్లుంటాయి. యుద్ధవిద్యల్లో ఆరితేరింది. ప్రస్తుత యుద్ధంలో ముసలి తండ్రి పక్కనే ఉండి పోరాడుతోంది. ఆమె చెలికత్తె, అంగరక్షకురాలు మంధర, మాంచి ఒడ్డూ పొడుగూ, నిటారైన విగ్రహం ఆమెది. స్వయానా గట్టి యోధురాలు.
పగలంతా యుద్ధం చేసి తన గుడారంలో భోంచేసి విశ్రమించడానికి సిద్ధపడుతోంది కైకేయి. అంతలో వశిష్ఠులవారి ముద్రికతో ఉన్న పత్రం ఒకటి పట్టుకొచ్చి అందించింది మంధర.
అది చదువుకున్న కైకేయి కనుబొమ్మలు పైకి లేచాయి. “నాతో రా,” అని మంధరని ఆదేశించింది. కత్తి పుచ్చుకుని మంధర వెంటనే బయలుదేరింది.
కైకేయి దారితీస్తుండగా, వెనకాలే నలువైపులా పరకాయిస్తూ మంధరా కేకయ శిబిరానికి కాస్త అవతలగా ఉన్న చిన్న కొండగుహని చేరుకున్నారు. మంధర ముందెళ్ళి, గుహచుట్టూ, గుహలోపలా శత్రువుల ఉనికి లేదని నిర్ధారించుకుని కైకేయివైపు తల పంకించింది. కైకేయి గుహలోకి ప్రవేశించింది.
ఎదురుగా తన చిన్ననాటి స్నేహితురాలు సరమ. చాలా ఠీవిగా నిశ్చలంగా కూర్చుని ఉంది. కైకేయిని చూసి, “భౌ” అంటూ పలకరించింది.
ఒక రెప్పపాటు చకితురాలైన కైకేయి తేరుకుని, తనూ అదే భాషలో, “భౌ, భౌ” అని బదులు పలకరించి, అలవాటు ప్రకారం సరమ పక్కకి చేరబోయింది.
“అలా కాదు, నా ఎదురుగుండా ఆ పీఠం మీద కూర్చో. ఇప్పుడు మనది దౌత్యకార్యం మరి. మానవుల ప్రతినిధివి నువ్వు, మా శునకజాతి ప్రతినిధిని నేను. నువ్వు తెలుగు మాట్లాడాలి, నేను మొరుగు మాట్లాడతాను. మనకా అవసరం లేకపోయినా, దౌత్యకార్యం గనక మంధర అనువాదకురాలిగా వ్యవహరిస్తుంది. ఇక్కడ మన మధ్యజరిగే ఒప్పందానికి సాక్షి కూడా మంధరే.”
ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్న అనుభూతితో కైకేయి సరమ నిర్దేశించిన ఆసనం మీద ఆసీనురాలైంది. ఇద్దరికీ మధ్యస్తంగా ఒకపక్కకి మంధర కూచుంది.
“వశిష్ఠులవారు ఇక్కడికి ఉన్నపాళంగా రమ్మని లేఖ పంపితే వచ్చాను, అంతకు మించి నాకేమీ తెలియదు.” అని మొదలెట్టింది కైకేయి.
“ఆయన ఇంతకు ముందే నాతో విషయం మాట్లాడారు. చెబుతా విను,” అంది సరమ.
“యుద్ధంలో మానవులు అసురుల మాయాయుద్ధం వల్ల విపరీతంగా నష్టపోతున్నారన్న విషయం తెలిసిందే. మాయా యుద్ధం అంటే, మనుషులు గుర్తుపట్టలేనట్టుగా జంతువుల రూపంలోనో, ఆఖరికి మనుషులరూపంలోనో రాత్రివేళ శిబిరాల్లో దూరి సైనికులని ఎక్కడివాళ్ళనక్కడ హతమార్చెయ్యడం అన్నమాట. మా వాళ్ళకకేమో ఎల్లాంటి వేషాలేసినా అసురుల వాసన పసికట్టేసే శక్తి ఉంది. మనకి ఒప్పందం కుదిరితే, మేం మీతో చేరి శిబిరాలకి రాత్రి కాపలా కాస్తాము. మా ఘ్రాణ శక్తినుంచి ఎలాంటి అసురుడూ తప్పించుకోలేడు. మొరిగి మీ సైనికులని మేలుకొలుపుతాం, ఆ మీదట మీ వాళ్ళ ఆయుధాలకి మా వాళ్ళ కోరలు తోడిస్తాయి.”
తృటిలో కొత్త అనేది తీరిపోయింది కైకేయికి. ఉగ్గుపాలతో దౌత్యమంతనాలు నేర్చినదానిలా చర్చకి దిగింది.
“మీ వాళ్ళు మాకందించగల సాయం బాగానే ఉంది. ఊరికే చెయ్యరుగా, మరి మీరు మానుంచి ఏం కోరుతున్నారో?”
“ఆ, పెద్దగా ఏంలేదు, మాతో మనుషులు కలకాలం స్నేహం నెరపాలి, అంతే.” అంది సరమ.
“అంతోటి స్నేహం అసురులు మాత్రం చెయ్యకూడదా? మమ్మల్ని నట్టేట ముంచి మీరు వాళ్ళ పక్షం చేరిపోతే?” కైకేయి సందేహం వెలిబుచ్చింది.
ఇంతలో ఎంత ఎదిగిపోయందో ఈ పిల్ల, అనుకుంటూ లోలోన మురుస్తూనే సరమ, “బాగానే అడిగావు. అయితే, నీకు అసురులకీ, మానవులకీ ఉన్న తేడా మాకు తెలిసినట్టుగా తెలియదనుకుంటాను.
అసురులకి మేమంటే వల్లమాలిన అసహ్యం. కనబడితే, దొరికితే, చావగొట్టి ప్రాణాలు తీసి ఊరుకుంటారు. అలాంటి క్యూరబుద్ధి మనషుల్లోనూ లేకపోలేదు. తేడా ఎక్కడిచ్చిందంటే, మీలో మా పట్ల స్నేహానికీ, మమకారానికీ కూడా అస్కారం ఉంది, నీకూ నాకూ మధ్య ఉన్నట్టుగానే. అసురుల్లో అది పూర్తిగా మృగ్యం. వాళ్ళే గనక గెలిస్తే, మనుషులకి బానిసత్వంతోపాటు, మా శునకలాకి చిత్రవధా, సర్వసంహారం తప్పవు. అందుకే మీ పక్షాన చేరడం.”
“అంతేనా? అయితే కుదిరనట్టే ఉంది మరి. ఈ మాత్రానికి నేనెందుకో?” అంది కైకేయి సరమకేసి నర్మగర్భంగా చూస్తూ. ఇదేమంత తేలిక కాదు, ఇంకా పెద్ద తిరకాసేదో రాబోతోందని గ్రహించిందామె.
సరమ గొంతు సవరించుకుంది. తాను పెట్టబోయే షరతు కైకేయిమీద దారుణమైన ప్రభావం చూపిస్తుంది. “చెల్లాయ్, ఈ యుద్ధంలో మనం సాధించబోయే విజయం నిలబడాలంటే, నీ వల్ల కావాల్సిన ఘనకార్యం ఒకటుందమ్మా.”
మృదువుగా మారిన సరమ ధోరణితో కైకేయికి గగుర్పొడిచింది. “నేనా? ఎందుకూ?” ఆమె స్వరంలో స్వల్పంగా కంపన.
సరమ సందేహిస్తే చెప్పలేకపోతానేమో అన్నట్టు ఏకధాటీన అందుకుంది.
“అవును నువ్వే, ఎందుకో చెబుతాను. మరో ఇరవై ఏళ్ళలో అసురులు దక్షిణాపథం అడవుల్లో మళ్ళీ చెలరేగుతారు. వాళ్ళని అణచడానికి దశరథుడు పనికిరాడు. ఆయన పెద్దభార్యకి పుట్టిన కొడుకు శ్రీరామచంద్రుడు అడవుల్లోకి వెళ్ళి వాళ్ళపై యుద్ధాన్ని నడిపించాలి. అప్పటికి చేవచచ్చిన దశరథుడు కొడుకు పట్టాభిషేకం చేసుకుని తన కళ్ళ ఎదుటే ఉండాలని మారాం చేస్తాడు. ఆయన్ని అదుపులోకి తీసుకుని నువ్వు రాముణ్ణి అడవుల్లోకి పంపడమే నువ్వు చెయ్యాల్సిన ఘనకార్యం.”
“మధ్యలో నేనెవరిని? ఆయనకేం అవసరం, నా మాట వినడం?”
“నువ్వాయన్ని పెళ్ళి చేసుకుని నీ వేలిచుట్టూ తిప్పుకుంటే వినకేం చేస్తాడు?”
“పెళ్ళా? దేవతలతో తిరిగి తనూ దేవతనే అనుకుని అయిందానికీ కానిదానికీ వరాలు ప్రసాదించే ఆ గెడ్డం రాజుగారితోనా? ఆయనకప్పుడే ఒకరు కాదు, ఇద్దరు పెళ్ళాలు కూడాను!”
“అదే మరి. ఆయనకి నువ్వు ముద్దుల మూడోభార్యవవుతావు, వయసయిపోయిన మీ నాన్నగారు నాయకత్వం నుంచి తప్పుకుని ఆ పగ్గాలు నీకందిస్తారు, నువ్వు రణం గెలిచిపెట్టడం, ఆయన వరాలు కోరుకొమ్మనడం, తథ్యం.
నువ్వేమో తరుణం వచ్చినప్పుడు కోరతానని దాటేస్తావు. రాముడి పట్టాభిషేకానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఇదిగో ఈ సాక్షి మంధర గుర్తు చేస్తుంది, నువ్వేమోఆ పళంగా రాముడికి పధ్నాలుగేళ్ళు వనవాసమూ, నీ కడుపున పుట్టిన భరతుడికి పట్టాభిషేకమూ అని చటుక్కున కోరేస్తావు.”
“నేను కోరితే కోరతానుగానీ, ఆ రాముడు వింటాడని ఎక్కడుందీ?”
“ఈ రాముడున్నాడే, కారణజన్ముడు, ఆడినమాట తప్పనివాడు, తన తండ్రినీ తప్పనియ్యనివాడు. నువ్వతన్ని నీ స్వంతబిడ్డకన్నా అభిమానంగా పెంచుతావు, నిన్నూ తల్లితో సమంగా చూసుకుంటాడు, అంచేత తల్లి మాటగా నువ్వు చెప్పినట్టు చేస్తాడు, ఎవరేమన్నా.”
“సరే ఆ రాబోయే పిల్లాడో అవతారపురుషుడు,, ధర్మస్వరూపుడని జనమంతా మెచ్చుకుంటారు. మరి నా మాటో? బంగారం లాంటి రాకుమారుణ్ణి అడవులకి పంపానని నన్ను తిట్టుకోరూ?”
“తిట్టడమా, మరోటా? భూమ్మీద మనుషులున్నంతకాలం నిన్ను ఆడిపోసుకుంటూనే ఉంటారు. నీతోబాటు పాపం ఆ మంధరనీను.”
క్రమశిక్షణకి ప్రతిరూపురాలైన మంధర ఆ మాట విని సైనికవందనం చేసింది. తన కర్తవ్యవిధేయతని సూచిస్తూ.
కైకేయికి మరి తప్పలేదు.
“సర్లే, మంచి బేరమే. కనీసం అంతటితో అసురుల పీడ విరగడేనా?”
“మరే, ఆశ కాదూ? విరగడంటే ఆ తడవకి, అంతే. కాలగమనంలో అలా అసురులు తలెత్తునే ఉంటారు, మనం వాళ్ళని చెరుగుతూనే ఉంటాము. నీకొరిగేదల్లా ఒక్కటే, రాముడికి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ఎప్పటికీ చెదరవు.”
కైకేయి ఒక్కటంటే ఒక్క క్షణం ఆలోచించి, తానూ ఠకీమని సైనికవందనం చేసింది, అంగీకారసూచకంగా, సరమ భౌమని మొరుగుతూ తోకాడించి ఒప్పందం సంతకం చేసింది.
“బామ్మా, బామ్మా, మన కుక్కపిల్లకి నీళ్ళు పోసేసా!” బుజ్జి ఆరుపులకి బామ్మగారికి మెలుకవొచ్చింది. తను మామూలుగా లేచే సమయానికి ముందుగానే లేచిపోయిన బుజ్జి, తను నీళ్ళు పోసేసుకుని కుక్కపిల్లక్కూడా స్నానం చేయించేసింది. అదేమో తన జాతివాళ్ళ పద్ధతిలో స్నానం తెచ్చిపెట్టిన ఉత్సాహంతో దిడ్డంతా పరుగులుతీసి, బుజ్జిని కవ్విస్తూ చెంగుచెంగున గంతులేస్తోంది.
హడావిడిగా స్నానం, పూజా ముగించేసి, నైవేద్యం పెట్టిన ప్రసాదం బుజ్జికీ, కుక్కపిల్లకీ పెట్టింది బామ్మగారు. అప్పుడే నిద్రలేచొచ్చిన కొడుకూ కోడలూ మాకో అన్నట్టు చేతులు జాపారు.
“హన్నా! నీళ్ళైనా పోసుకోకుండా ప్రసాదమేమిటి? ఆ మాత్రం తెలీదూ?” కసురుకుంది బామ్మగారు.
“కుక్క కంటే తీసిపోయామా?” తిరుగుబాటు బావుటా ఎగరెయ్యబోయాడు కుమారుడు.
“ఆహా, నిస్సందేహంగా తీసిపోయారు. మాట్టాడకుండా స్నానాలు చేసి రండి!”
విప్లవం అంతటితో చల్లారిపోయింది.
“బామ్మా మరి కుక్కపిల్ల పేరో?”
“అదా, దాని గురించి ఓ కల, అహ, అదే, కథ ఉందే. మీ అమ్మా నాన్నలు స్నానాలు చేసి రానియ్యి, నేనా కథ చెప్తాగా, ఆ పైన దానికేం పేరు పెట్టాలో నీకే తెలుస్తుంది.”
అప్పటికే నిప్పులు చెరగుతున్నాడు సూర్యుడు. సాకేతుల దంపతులిద్దరూ తమ శోత్రియ ఘనతకి అనందిస్తూ చన్నీళ్ళస్నానానికని కథాముఖంగా బయల్దేరారు.