మాతృకాంక్ష

అడిగింది ఒక తల్లి
ఒక తల్లి అడిగింది
ఇహం పొలిమేరలో
పరం తొలిదారిలో

నిలిచి కొడుకుని తలచి
కలచు గుండెలలో
అలల మాదిరి పొంగి
పొరలు ప్రశ్నలతో

ఒక తల్లి
ఒక తల్లి అడిగింది.

కబురు అందనిచోట
కలలు విరిగిన చోట
అడిగింది ఒక తల్లి
అడిగింది తొల్లి

“మోహనదాసు కులాసాగా ఉన్నాడా?
అయ్యో అమ్మ పోయిందని అన్నాడా?
సీమనుంచి తిరిగొచ్చాడా?
పెద్ద పరీక్ష ఇచ్చొచ్చాడా?
అందరిలాంటివాడు కాడు అబ్బాయి
అలాగని అసలేకాడు ఆగతాయి
మబ్బు వెనకాతల సూర్యకిరణం మల్లే
గుబురు ఆకులమధ్య మల్లెపూవు మల్లే
అందరికీ అందనివాడు వాడు
వాడిలాంటి వాడు ఇంకోడు లేడు.
దివాన్‌గిరీ చేశాడా? దివాలా తీశాడా?
కుటుంబం పరువు నిలబెట్టాడా?
పెళ్ళాన్ని ఏలుకొంటున్నాడా?
సజావుగా సంసారం చేస్తున్నాడా?”
అడిగింది ఒక తల్లి
ఒక తల్లి అడిగింది

మేఘాల భూమిలో
కోరికల కోటలో
నోము పండిన వారు
పూచి మురిసే తోట

తనువు వీడినవారు
వేచి ఉండే చోట
మృత్యు సీమను నిలచి
కన్న కొడుకుని తలచి

అడిగింది ఒక తల్లి
ఒక తల్లి అడిగింది.

“అబ్బాయి ఆడి తప్పనివాడే గాని
సారాయి తాగనని, మాంసం ముట్టుకోనని
సానిళ్ళకు వెళ్ళనని, చేతిలో చెయ్యివేసి
ప్రమాణం చేశాడు, నిలబెట్టుకొన్నాడా?
మోహనదాసు కెంతమంది సంతానం?
మా కోడలు నింపాదిగా ఉందా?”
అని
తనకు తానే ప్రశ్న
అడిగింది ఒక తల్లి
తనకు తానే వ్యధను
బదులు చెప్పెను ఒకడు
బరువు మాటలతో
భక్తితో, బాధతో
బదులు చెప్పెను ఒకడు

అతడు సామాన్యుడా?
అతడు మాన్యుడు సుమా
అతడు పుట్టిన కడుపు
అవని తీర్చని ఋణము
అతడు మెట్టిన భూమి
అత్యంత పావనము

అడుగడుగునా విఘ్నాలు, ఆశలకు అవాంతరాలు
ఆశయాలకు ఆనకట్టలు, ఆవేశాలకు చన్నీళ్ళు
అభిప్రాయాలకు సంకెళ్ళు ఆలోచనకు బేడీలు
ఆదర్శాలకు ఉరిత్రాడు, ఉత్సాహానికి కంట్రోలు
ఉద్రేకాలకి రేషను, ఇహంలో నో వేకెన్సీ
పరంలో నో ఎడ్మిషన్, కళ్ళకు కటకటాలు
కనికరానికి కారాగారం, కడుపులోకి కంకర
మా గీతలు వంకర, మా చుట్టూ బానిసత్వం

ఇటువంటి ఇరులలో ఇటువంటి వ్యథలలో
అడుగు పెట్టెను అతడు
అవని పండెను అపుడు

భయంకర స్వార్ధాచ్ఛాదితమై
లయంకర స్పర్ధాస్ఫాలితమై
సర్వదేశ ప్రజ సంక్షోభిస్తే
సత్యాహింసలు బోధన చేసిన
అతడు సామాన్యుడా?
అతడు మాన్యుడు గాని.

బ్రహ్మదేవుని నాల్గువేదాలు
ధర్మదేవత నాల్గు పాదాలు
సకల మతములలోని సత్యాలు
అతని బోధనచేత నిత్యాలు

భక్తితో, శ్రద్ధతో
బదులు చెప్పెను ఒకడు
బదులు చెప్పెను అతడు
బరువుకన్నులతో

అంతంత మాటలు తనకు
అర్థంకాలేదు కనుక
అడిగింది ఒక తల్లి
అబ్బాయిని గురించి
అడిగింది ఆ తల్లి
అశ్రులు ధరించి

మోహనదాసు బాగున్నాడా అంటే
ఏమేమో చెప్తారీయన
మీరేనా చెప్పండీ స్వామీ
మావాడు ఎలాగున్నదీ
మా వాడు రాజ్యాలేలక్కర్లేదు
కులాసాగా ఉంటే చాలు
మంచివాడనిపించుకొంటే
అదే నాకు పదివేలు
అని
అడిగింది ఆ తల్లి
గుండె కొట్లాడ
అడిగింది అడిగింది.
ఆత్రం తోడ

మొరటు గుండెలు వాడు
మూర్ఖ చిత్తము వాడు
పలుకు విషము లొలుక
బదులు చెప్పెను ఒకడు

మీవాడా? ఛండాలుడు
మీవాడా? దుర్మార్గుడు
మాలవాళ్ళని మాతోపాటు కూర్చోమన్నాడు
భోంచెయ్యమన్నాడు, ఇంకా ఏంచెయ్యలేమనలేదు

పవిత్రమైన దేవాలయాల్లో
అంటరాని వాళ్ళను అంటగట్టేడు
తురకాళ్ళతో భుజం భుజం కలిపి
తుంటరులను వెనసుకేసుకొని
తూలి పడ్డాడు

చెయ్యరానివెన్నో చేశాడు
అందుకే అన్నిసార్లు జెయిల్లో పెట్టారు
అందుకే ఆఖరిసారి మనవాడే మీవాణ్ణి
గుండేసి కాల్చి చంపేశాడు
మీవాడు దుర్మార్గుడు
మీవాడు పాపాత్ముడు

“ఓరి పాపాత్ముడా అతడు పాపాత్ముడా?
మహాత్ముడు పుణ్యరాశి”
అని సకల జీవరాశి
ఎలుగెత్తి పలికింది.
కుమిలిపోయెడి ఆ తల్లి
నూరట పరిచింది.

అడిగింది తల్లి
అపుడు వేదన తోడ
ఈ భూమి మరణించు వారల సీమ
అయినచో అబ్బాయి కానరాడేల

అనుచు దుఃఖముతోడ
అడిగింది ఆ తల్లి
అడిగింది అడిగింది
అబ్బాయి జాడ

తన జాతి గుండెలో
తన జాతి ఇండ్లలో
నిరతమూ నిలిచేటి
నిండి వెలిగేటి అతడు

అమరుడు కదా అతడు
నిత్యుడు సుమా
నిలయము ఎప్పుడూ అక్కడే
అతని మనుగడ ఎప్పుడూ
ఇప్పుడే
అని చరిత్ర సమాధానం ఇచ్చింది

[ఈ కవిత తొలిసారి ‘మహాసంకల్పం’ వచనకవితాసంకలనం: 1940-1975లో ప్రచురితమైంది. చైతన్యభారతి, విజయవాడవారు 1976లో ప్రచురించిన ఈ సంకలనానికి నండూరి రామమోహనరావు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సంపాదకులు. గాంధీజీ జయంతి సందర్భంగా ఈ కవితను మాకు అందించిన అన్వర్‌గారికి కృతజ్ఞతలు – సం.]