కాలనాళిక

“నిన్ను మా నాన్నమ్మకు చూపెట్టి ఆమె ఆశీర్వాదం తీసుకోవడమే నేనిండియాలో చేయాల్సిన ముఖ్యమైన పనని నీకు తెలుసు. అదెంత త్వరగా జరిగితే అంత మంచిది” అని అమృత మళ్ళా యింకొకసారి నన్ను ఫోన్లోనే అటకాయించింది.

ఆమె చెప్పినంత బిన్నాగా నేను ఢిల్లీకి రాలేదని, తీరా వచ్చినాక గూడా ఆమె అంపించిన లొకేషనుకు బిన్నాగా పోలేదనీ ఆమెకు నాపైన గొంతుదాకా కోపమొచ్చినట్టుండాది. అయితే నన్ను వాళ్ళ అవ్వకు చూపించేదానికంటే ముఖ్యమైన పని వేరే వొకటుండాదని నాకు తెలుసు. సమత్సరానికి పైగా షికాగోలో లివింగ్ టుగెదర్‌లో వుండే మా యిద్దరికీ యిప్పుడు పెండ్లి అనే యీ క్రతువు జరిపించుకుంటే కొత్తగా వొరిగేదేమీ లేదు. అమృతకిప్పుడు యిండియాలో యింతకంటే ముఖ్యమైన పనొకటి తయారయినందుకు, దాన్నామె యీమాదిరిగా వుడుంపట్టు పట్టుకునిందానికీ నేనే కారణమేమో అనుకోని బేజారయిపోతావుంటాను. అయితే యీ వెతుకులాట ఆమె చిన్నప్పుటినించీ వుందనీ నామాటలు దానికి కేవలం వుత్ప్రేరకమై వుంటాదనీ అనుకోని వూరట పడతావుంటాను.

కొందురు స్నేహితులతో కలిసి నేనూ అమృతా ప్రొటెక్టివ్ ఇండియన్ టెరిటరీ హౌసు పైకి నాలుగుదినాల ట్రెక్కింగుకు పొయినప్పుడు చిన్న ఆటగా మొదులైన పని, యిప్పుడింత పెద్ద తతంగంగా మారింది.

పగలంతా నడిచి అలిసిపోయిన తర్వాత, డిన్నరు తినేసినాక, టెంట్లమధ్య కాంప్‌ఫైర్ చుట్టూ కూర్చున్నాక, మా స్కాట్లాండు ఫ్రెండొకడు “మిమ్మల్నంతా ఎంటర్‌టెయిన్ చేసేందుకు మా కుటుంబం గురించి చెప్తాను. మా కుటుంబం గురించి చెప్పటమంటే మా దేశాన్ని గురించి చెప్పటమే!” అని మొదలు పెట్టినాడు. “మా ఫామిలీ పేరు కిర్క్ కాల్డీ. ఇంగ్లండ్‌నూ, స్కాట్‌లండ్‌నూ రోమన్ కాథలిజమ్ నుంచి, ప్రెస్బిటేరియనిజమ్ అనే ప్రొటెస్టెంటిజానికి మార్చేందుకు పోరాటం చేసి, దానికోసం ప్రాణాల్నిచ్చిన జాన్ నాక్స్ అనే థియొలాజియన్ పేరు విన్నారా మీరు? ఆయనకు కుడిభుజంగా వుండిన విలియమ్ కిర్క్ కాల్డీ మా మూలపురుషుడు. ఆయన స్మృతి చిహ్నంగా ఎడిన్‌బరో కోటలో పెద్ద శిలాఫలకముందిప్పటికీ. ఆయన కొడుకులు, మనవళ్ళు, మునిమనవళ్ళూ చాలామంది ప్రొటెస్టెంటు ప్రీస్టులుగా స్కాట్‌లండ్ చర్చిలనంతా పాలించారు. ఈస్టిండియా కంపెనీ తరపున ఇండియా కెళ్ళిన జోసెఫ్ కిర్క్ కాల్డీ మా ముత్తాతే. ఇంకో ముత్తాత థామస్ ఫస్ట్‌, సెకండ్ వరల్డ్ వార్‌లలో కెప్టెన్. మా ఎడిన్‌బరో సిమెట్రీలో ఆయన సమాధిపైన ఆయన నిలువెత్తు విగ్రహముంది. ఆయన లాంగ్‌కోట్‌ పైన వున్న మెడల్సును లెక్కబెట్టలేం. ఇవన్నీ మా ఫామిలీ ట్రీలో రికార్డయివున్నాయి” అంటా ఆ మనిషి వాళ్ళ తాతలు తాగిన నేతుల వాసనలను మాపైకి చిమ్మేదానికి చూసినాడు.

తర్వాతింకో జర్మన్ స్నేహితుడు బిస్మార్క్‌కు కజిన్ అయిన తన ముత్తాత గురించి, ఆయిన కొడుకైన పెద్ద ఫిజిక్సు సైంటిస్ట్ గురించి, తన యింకో తాతయిన పెద్ద పెయింటరు గురించీ పెద్ద వుపన్యాసం దంచాడు. ఆతర్వాతింకో ఫ్రెంచివాడు, టునీసియావాడు, కొలంబియావాడు, జపాన్‌వాడు, యిట్లా అక్కడికొచ్చిన పన్నెండుమందీ తమ వంశాల్ని గురించి, వాళ్ళ తాతముత్తాతల గురించీ చెప్పి, మిగిలిన వాళ్ళనంతా ఆశ్చర్యంలో ముంచి పారేసందుకు తమ శాయశక్తులా ప్రయత్నాలు జేసినారు.

నా వంతు వస్తానే నేనుగూడా నా సొంత డబ్బాను గెట్టిగానే వాయించినాను. “మా తొండపేట రెడ్లు జమిందార్లుగా మా దేశమంతా పేరెత్తి పొయినారు. తొండపేట కొండలకు కైవారంగా కట్టిన పాత కోట యిప్పుడైతే పాడుబడిపోయిందిగానీ, మా తొండపేట రెడ్ల డాబూ దర్పం యేమాత్రం తగ్గలేదు. సిపాయిల తిరుగుబాటప్పుడు తొలీగా యింగిలీసోళ్ళతో యుద్ధం జేసింది మా తొండపేట జమిందారే అని యూనివర్సిటీలో రిసెర్చి చేసినాయన నూరు పేజీల మోనోగ్రాఫు రాసినాడు. మా ముత్తాత ఫ్రీడమ్ మూమెంటప్పుడు పద్నాలుగు నెలలు జైల్లో వుండొచ్చినాడు. వినోబా బావే మావూరికొచ్చినప్పుడు ఆయినే యాభై ఎకరాలకు పైగా భూదానం జేసినాడు. ఫ్రీడంవొచ్చినాక జరిగిన తొలి యెలక్షన్‌లో మా తాత క్రిష్ణారెడ్డి సొతంత్ర పార్టీ తరపున పోటీ జేసినాడు. పాలిటిక్సులోకి దిగి మావోళ్ళు సొంత ఆస్తులనంతా దారబోసేసినారు. మా తాత కాలమైపోయినాక పాలిటిక్స్ బ్రష్టు బట్టిపోయినాయని మానాయిన అదంతా వదిలిపెట్టి గుట్టుగా వ్యవసాయం జేసుకుంటా వుండాడు. అయితే యిప్పుటికీ జిల్లాలో వుండే పాలిటీషియన్లందురూ ఆయిన దెగ్గిరికొచ్చి సజిషన్లూ బ్లెస్సింగ్లూ తీసుకొని పోతారు.”

తన వంతు వచ్చినప్పుడు అమృతకు కూడా నోరిప్పక తప్పలేదు. “మాది డాక్టర్ల కుటుంబం. మా నాన్నమ్మా, తాతయ్యా ఇద్దరూ డాక్టర్లే. మా నాన్న డాక్టర్. మా అమ్మ మాత్రం నర్సు. మా అత్తా, మా మామా ఇద్దరూ డాక్టర్లే. మా నాన్నమ్మ వాళ్ళమ్మకూడా నర్సేనట. మా నాన్నమ్మ చెన్నైలో పుట్టింది. ఆమెకు తమిళం వచ్చుగానీ మాకెవరికీ రాదు. మా యింట్లో తెలుగే మాట్లాడాలని మా తాత రూల్ పెట్టేసిపోయాడు. ఇంతకూ మా ఊరేమో పూనే. పూనే బ్రాహ్మిన్ వెల్‌ఫేర్ సొసైటీలో ఆయన ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉండేవాడు!”

కబుర్లు అయినాక మా టెంట్లోకి పొయినప్పుడు, “మాకూ మా బంధువులకూ మా నాన్నమ్మ తరంలోనే లింకు తెగిపోయిందెందుకో. ఆమెకిప్పుడు తొంబై అయిదేళ్ళుంటాయి. ఆమె నడిగితేగానీ ఆ పాత సంగతులు తెలియవు” అనింది అమృత దిగులుగా.

“మన యిండియన్లదంతా మెమొరీ పైన నిలబడిన హిస్టరీనే అమృతా! దేన్నీ రికార్డు చేసేది మనవాళ్ళకు తెలియదు. మావూర్లో సంక్రాంతి పండగనాడు ప్రతి యింటోళ్ళూ బ్రాహ్మణుడ్ని పిలిచి పెద్దలకు తర్పణమొదల్తారు. అప్పుడా బ్రాహ్మణుడు వాళ్ళను కనీసం వాళ్ళ మూడు తరాలవాళ్ళ పేర్లయినా చెప్పమని మొత్తుకుంటాడు. వాళ్ళకు వాళ్ళ తాత పేరయినా సక్రమంగా జ్ఞాపకముండదు. అందరిండ్లల్లో జమిందార్లు, వీరులు, శూరులూ వుంటారా చెప్పు గుర్తు పెట్టుకునేదానికి?” అని నేనామెను సముదాయించబొయినాను.

అయితే నామాటలు ఆమెను వూరడించేదానికి బదులుగా రెచ్చగొట్టినాయని నాకా తర్వాతే తెలిసింది. “రికార్డుల్లేకపోయినంత మాత్రాన మావాళ్ళు సాదాసీదా వాళ్ళంటే నేనొప్పుకోను సిద్దూ!” అని ఆమె వాదనబెట్టుకునింది. “ఆ రోజుల్లోనే మా తాత, మా నాన్నమ్మా డాక్టర్లయినారంటే వాళ్ళ పేరెంట్స్ మామూలు వాళ్ళయి వుండరు. మా తాత తమ్ముడొకాయన స్వతంత్రం రాకముందు సినిమాల్లోకెళ్ళిపోయినాడని మా నాన్నమ్మ చెప్పింది. మా తాతకు తాతగారొకాయన ఆంధ్రదేశం నుంచి మహారాష్ట్రకు వలసవెళ్ళాడని తెలిసింది. మా నాన్నమ్మ మెడ్రాస్ మెడికల్ కాలేజీలో చదివింది. అక్కడే ఆమెకు మా తాతతో పరిచయమయ్యింది. వాళ్ళది లవ్ మారేజీ. బ్రిటిష్ ఇండియాలో బొంబాయీ మద్రాస్ ప్రెసిడెన్సీలు పక్కపక్కనే వుండేవి. ఆ రోజుల్లో తెలుగువాళ్ళు తిరుపతికంటే పండరీపురానికే యెక్కువగా వెళ్ళేవాళ్ళని గూగుల్ చెప్తోంది.”

అదంతా వినినాక “నువ్వీ రిసెర్చిలోపడి లైబ్రరీలోనే టైమంతా గడిపేస్తావుండావు. సంగీతం పాఠాలకు సరిగ్గా అటెండ్ గావటం లేదు” అని కసిరినాను.

ఆమె నాపక్కకు కండ్లార్పకుండా చూసి పెద్దగా నిట్టూర్చింది. వొకప్పుడు ఆమెకు సంగీతంపైన అక్కర పుట్టేదానికీ యిప్పుడీమాదిరిగా ముందుతరాలను గురించిన రిసెర్చిలోకి దిగేదానికీ నేనే కారణమని ఆమె చూపులతోనే గుర్తు చేసినట్లయి తడబడిపొయినాను. అసలామె అంతబాగా పాడితిందని నాకు ముందుగా తెలియదు. ఆమె అంత బాగా పాడకపోయుంటే మా స్నేహమింత దూరం వచ్చేవుండదు.

మూడేండ్ల ముందు షికాగోలో తెలుగువాళ్ళ మీటింగ్‌లో అమృతను తొలిసారిగా చూసినాను. అక్కడికి ఆమెతోబాటూ వచ్చిన ఫ్రెండ్సు ఆమెను పాడమని పట్టుబట్టినారు. “నావంతా టీవీలో విని పాడే పాటలు. నాకు సంగీతం రాదు” అని ఆమె గింజుకున్నా వాళ్ళు వినలేదు. యింకో విధిలేక ఆమె చివరికొక పాట పాడింది. నేనప్పుడామె దెగ్గిరికి పోయి, “మీ గొంతు భలే తియ్యగావుంది. శ్రుతి కూడా బాగుంది. మీరు సంగీతం కోర్సులో చేరితే పైకొస్తారు” అని మెచ్చుకున్నాను.

“అట్లాంటి కోర్సులు మనకిక్కడెక్కడ దొరుకుతాయిలెండి?” అని ఆమె దాటేయబోయింది.

“మీరసలు నాట్యమే నేర్చుకోవచ్చు. మీ ఫిజిక్ సరిగ్గా సరిపోతింది” అనేసినాను. “పోనీ సంగీతంతోనే మొదులుపెట్టండి. ఆన్‌లైన్ కోర్సులు యింటర్నెట్లో చానావుండాయి. చెన్నైలో రేడియో స్టేషన్లో పనిచేసే ఫ్రెండొకడుండాడు నాకు. మంచి ఆన్‌లైన్ కోర్సును చెప్పమని అడగతాను” అనినాను.

వారంలోపల ఆ కోర్సును కనిపెట్టి ఆమెకా వివరాలు చెప్పినాను. ఆమె ఆ కోర్సులో చేరినాక ఫోన్లో తరచుగా పలకరించుకుంటా వున్నాము. అప్పుడప్పుడూ పార్టీల్లో, హోటళ్ళలో కలిసేవాళ్ళం. కలిసినప్పుడంతా ఆమెను పాడమని విని మెచ్చుకునేవాణ్ణి. నేను యెంకరేజ్ చేసేకొద్దీ ఆమెకు సంగీతంపైన శ్రద్ద పెరిగింది. అయితే సంగీతం కంటే పెద్దగా మా స్నేహితమే పెరిగి అది లివింగ్ టుగెదర్ అనే సహజీవనం దాకా వచ్చి చేరింది. ఆమె సంగతేమోగానీ యిప్పుడు నేను అమృత లేకుండా వొకరోజైనా వుండలేనని తెలుసుకున్నాను. నేనామాటంటే మగవాళ్ళకంటే ఆడవాళ్ళకే కమిట్మెంట్ జాస్తీ అంటాది అమృత. ఆమెను సంతోషపెట్టేదానికి అప్పుడు సంగీతం నేర్చుకోమని చెప్పినట్టే, యిప్పుడు మహారాష్ట్రలోకి వలసపోయిన తెలుగు బ్రాహ్మణుల్ని గురించి రిసెర్చి చెయ్యమని చెప్పేది ఆరంభం జేసినాను.

అట్లా రెండునెలలు జరిగినాక, వొకనాడు తెల్లారుతూనే “మనం కోరిందీ దేవుడు వరమిచ్చిందీ ఒకటే అయ్యాయి సిద్దూ! వీలయినంత త్వరగా ఇండియాకొచ్చి వెళ్ళమని మా మేనత్త కొడుకు నిన్న ఫోన్ చేశాడు” అనింది అమృత ముక్కినట్టుగా నవ్వి, “బైదివే, మా మేనత్తకూ మా అమ్మకూ మధ్యలో మంచి సంబంధాలు లేవు సిద్దూ” అంటా మరికొంచం సమాచారం చెప్పింది.

“మా నాన్న నేను సెకెండ్ క్లాసులో ఉన్నప్పుడు పోయాడు. అప్పుడాయన వయస్సు నలభై కూడా లేదు. హార్ట్ అటాక్. డాక్టరైవుండీ ప్రికాషనరీగా ఎందుకు లేడో తెలియదు. మా నాన్నకు డాక్టర్నే పెళ్ళాంగా తేవాలని మా నాన్నమ్మ పట్టుబట్టిందట. ఆమె మాట వినకుండా నర్సయిన మా అమ్మను లవ్ మారేజ్ చేసుకున్నాడని ఆమె కోపం పెట్టుకుంది. అంత చిన్నవయసులో మా నాన్న పోవడానికి మా అమ్మే కారణమని మా నాన్నమ్మా మా అత్తా నమ్మేశారు. ఇద్దరూ డాక్టర్లే! నర్సుగా ఉండీ మొగుడి ఆరోగ్యాన్ని పట్టించుకోలేదని వాళ్ళ కంప్లెయింట్. మా నాన్న పోతూనే మా నాన్నమ్మ పూనే వొదిలిపెట్టి పాండిచ్చేరీలో వుండే కూతురి దగ్గరికెళ్ళిపోయింది. మా మామ అక్కడ మునిసిపల్ కార్పొరేషన్లో డాక్టరు. మా అత్తది ప్రయివేట్ ప్రాక్టీస్. మా నాన్నమ్మ ఓపికున్నన్ని రోజులు కూతురితో కలిసి ప్రాక్టీస్ చేసింది. మా నాన్న పోయాక మా అమ్మ కష్టపడి గవర్న్‌మెంట్ హాస్పిటల్లో నర్సు వుద్యోగం తెచ్చుకుంది. మా నాన్నమ్మ, అత్తయ్యా చుట్టపుచూపుగా సంవత్సరానికో రెండేళ్ళకో ఒకసారొచ్చి పలకరించి వెళ్ళేవాళ్ళు. అప్పుడైనా మాటలన్నీ నాతోనే! మా అమ్మతో పెద్దగా మాట్లాడేవాళ్ళు కారు. సరిగ్గా నేను ఇంజనీరింగు ఫైనల్ యియర్లో ఉన్నప్పుడు సడెన్‌గా మా అమ్మ పోయింది. ఆమెదీ హార్ట్ అటాకే! పైకి ఆరోగ్యంగానే కనబడేది కానీ, లోపలంత పెద్ద ప్రాబ్లమ్ వుండేదని పోయాకగానీ తెలియలేదు. మా నాన్న స్నేహితుడొకాయన హెల్ప్ చేస్తే, మా ఇంటిని మార్ట్‌గేజ్‌కి పెట్టి, ఆ డబ్బుతో అమెరికాకొచ్చి ఎమ్మెస్ చేశాను.”

కొంచెంసేపు మౌనంగా వుండిపొయినాక, “పూనేలో ఉండే ఇల్లు మా నాన్న పేరుతో వుంది. కానీ చెన్నైలో ఉండే ఇల్లు మా నాన్నమ్మ పేరుపైన వుంది. ఆమె ఉన్నప్పుడే దాన్ని అమ్మేయడం మేలని మా బావ అంటున్నాడు. దాన్లో మా నాన్నకూ భాగం ఉంది. నేను వెళ్ళి సైన్ చేస్తేనే దాన్ని అమ్మడానికి కుదురుతుంది” అనింది.

మళ్ళా కొంచేపు మాట్లాడకుండా వుండిపోయింది. తర్వాత బొంగురు పోయిన గొంతుతో “మా అత్తకు ఒకడే కొడుకు. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఇంజనీరింగు చదివాడు. ఉద్యోగం వస్తూనే పెళ్ళి చేసేసుకున్నాడు. ఆమె బెంగాలీ అని మాత్రం తెలిసింది నాకు. వాళ్ళిద్దరికీ ఢిల్లీలో ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళ పెళ్ళయిన సంవత్సరానికి మా మామ, మూడేళ్ళకు మా అత్తా పోయారు. మా బావ మా నాన్నమ్మను ఢిల్లీకి తీసుకెళ్ళిపోయాడు” అనింది.

“నేను అమెరికా కొచ్చి పదేళ్ళు దాటిపోయింది సిద్దూ! ఈ పదేళ్ళలో ఎంతో జరిగిపోయింది. మా అత్త పోయిందని తెలిశాకే మా నాన్నమ్మను నెలకొకసారైనా ఫోన్లో పలకరించడం మొదలుపెట్టాను. కేవలం బాధ్యతగా కాదు. ఇప్పుడీ లోకంలో నాకంటూ మిగిలినదామె వొక్కతే గదా!” అంటా అమృత పొంగుకొచ్చే యేడుపును ఆపుకునేదానికి సతమతమైపోయింది.

కొంచెం తమాయించుకున్నాక, “ఫోనులో పలకరించినప్పుడంతా మా నాన్నమ్మ కొడుకునూ కూతురునూ తలుచుకుని భోరుమనేది. మా బావ అనే ఆ మనిషితో నేను ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఈమధ్యే సంవత్సరంకిందే మొదటిసారిగా ఫోన్లో హలో అని పలకరించాడు. నిన్న ఆయన మాట్లాడింది మూడోసారో, నాలుగోసారో! చెన్నైలో వుండే ఆయింటిని చాలా సంవత్సరాలుగా రెంటుకి యిచ్చారు. ఇప్పుడు దాన్ని త్వరగా అమ్మేయకపోతే ప్రమాదమంటున్నాడాయన. ఎంతో కష్టపడితేగానీ టెనెంట్లు ఇల్లు ఖాళీ చేయలేదట. ఇప్పుడు దాన్ని కొట్టేయాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకే రమ్మని తొందర పెడుతున్నాడు. ఆయింటి సంగతేమోగాని, మా నాన్నమ్మను వెంటనే వెళ్ళి చూడాలనివుంది నాకు. యింకెన్నాళ్ళు బతుకుతుంది చెప్పు?” అనింది అమృత దిగులుగా.

అమృత వాళ్ళ నాన్నమ్మ యిల్లు చెన్నైలో మైలాపూరులో ఉందని తెలిసినాక, దాని విలువిప్పుడెంతో పెరిగిపోయివుంటాదని, వెంటనే అమ్ముకోకపోతే నష్టమొస్తుందనీ నాకర్థమైపోయింది.

“పైగా మనమిద్దరమూ వెళ్ళి ఆమె ఆశీర్వాదం తీసుకోవాలి. ఇద్దరికీ టికెట్లు బుక్ చేస్తాను” అని చివరకు తేల్చేసిందామె.

అయితే యిప్పుడున్నపాలంగా యిండియాకు బయల్దేరాలంటే నాకు యిబ్బందని అమృతకు తెలియదు. మా తాత ముత్తాతలు జమిందారులని నేను చెప్పిందాంట్లో అబద్దం లేదుగానీ యిప్పుడు మానాయనా మా అన్నా అంత జరుగుబాటులో లేరు. వూరిమణేగారనే చెమ్కీ కిరీటమొకటి మా నాయనకు మిగిలుండాదిగానీ వొకప్పుడున్న ఆస్తులన్నీ కరిగిపోయినాయి. యిండిపెండేన్స్ వస్తానే రాజకీయాల్లోకి దిగిన మా తాత చానా ఆస్తిని తగలబెట్టి పారేసినాడు. యిప్పుడు మిగిలుండే పదెకరాల మామిడితోపు, నాలుగెకరాల మడి, ఆరెకరాల చేనూ యింటి ఖర్చులకు సరిపొయ్యేటంత వొరుంబడినియ్యటం లేదు. వూరికి నడీమధ్యలో వుండే మా రెండంతస్తుల సున్నం మహిడీ పాతబడిపోయింది. కప్పు పడిపోకుండా, రెండు మూడు రూముల్లో త్రావుల్ని తన్నించి పెట్టినారు. పేరుకైతే మా నాయినా, మా అన్నా కాంట్రాక్టులు చేస్తామని డబ్బాగొట్టుకుంటారుగానీ, వాళ్ళు రాజకీయాల్ని పట్టుకోని, గానిగెద్దుల మాదిరిగా తిరిగిన తావులోనే తిరగతావుంటారు. నేను పట్టుబడితే, యింకో దోవలేక, యెవురికీ తెలియకుండా మా తోపును బాంకులో ఆడమానం బెట్టి, నన్నెట్నో అమెరికాకు పంపించినారు. నాకిక్కడ వుద్యోగం వచ్చిననాటినించీ వొకరికితెలియకుండా వొకరు ఫోనుజేసి లక్షలకు టెండర్లు పెడతావుండారు. నేనిక్కడ కోట్లు సంపాదించి అంతా దాచిపెట్టుకోనుండానని వాళ్ళ నమ్మకం. యిప్పుడు నేనింటికిపోతే యేదేదో పేర్లు బెట్టి దుడ్డు గక్కమని పోరుబెట్టేస్తారు.

నేనీమాదిరిగా నసుగుసులు పడతావుండంగానే అమృత నాలుగు వారాల లీవు సంపాదించుకోని, టికెట్లు బుక్ చేస్తానని లాప్‌టాప్ తెరుచుకొని కూర్చునింది. యింక తప్పదని గెట్టిగా ప్రయత్నం జేస్తే మా ఆఫీసోళ్ళు నాకు యేడస్తా మూడు వారాల లీవు యిచ్చినారు. దాంతో అమృత నాకంటే వారం ముందుగా వొంటిగా ఢిల్లీ విమానమెక్కింది.

వారం లేటుగా నేను ఢిల్లీకొచ్చి, కరోల్‌బాగ్‌లో హోటల్లో దిగినాను. వెంటనే ఫోన్ చేస్తే “ఇప్పుడొద్దు. రేపు మధ్యానం పన్నెండుకు రా! లొకేషన్ షేర్ చేస్తాను” అనింది అమృత. యింక చేసేదేమీ లేక వూరంతా వొంటిగా అరుట్లుగొడతా తిరిగి అలిసిపోయినాను. మర్నాడు పదకొండునించీ ”ఇంకా యెంతసేపు? ఎందుకింత లేటు?” అని ఆమె యిప్పటికి పదిసార్లు ఫోన్లోనే అదిలించిపారేసింది.

2

మెట్రోలో ద్వారకా ఫేజ్ పన్నెండులో దిగి బాటరీ ఆటోలో లొకేషన్‌కు చేరేటప్పుటికి గంట వొంటిగంటయ్యింది. అయిదంతస్తుల ప్లాట్లుండే అపార్టుమెంట్లలో సి-బ్లాక్‌లో మూడో అంతస్తులో వుందా ఫ్లాట్.

బెల్లేస్తానే మున్నూట రెండు నెంబరు ప్లాటు తలుపు తెరుచుకునింది. అమృత నీరసంగా పెదవులు సాగదీసి లోపలికి రమ్మని పిలిచినట్టుగా పక్కకు తప్పుకునింది.

అడుగు ముందుకేస్తానే ఆమె వెనకాల నడివయస్సుండే వొక ఆడామె కండ్లార్పకుండా చూస్తా కనబడింది.

“మేరా దోస్త్ హై దీదీ! అమెరికాసే ఆయా” అని నన్నామెకు పరిచయం చేసినాక “మా నాన్నమ్మను చూసుకోవడానికి, ఇంటి పనులకూ ఈమెను హెల్పర్‌గా పెట్టుకున్నారు సిద్దూ! పేరు నిమ్మీ” అనింది అమృత.

విశాలంగా వుండే హాల్లో వొకపక్క పెద్ద సోఫాలు, యింకోపక్క డైనింగు టేబులు, వాటికి మధ్యలో నగిషీల ఫ్రేముండే వుయ్యాల సోఫా, గోడలపైన అర్థంగాని మాడ్రన్ పెయింటింగులూ… నేను సోఫాలో కూర్చోగానే “తోడా చాయ్ బన్వాదో దీదీ” అని అమృత పనామెకు చెప్పింది. నిమ్మీ నన్ను అదోమాదిరిగా చూస్తా లోపలికి పోయింది.

అమృత సోఫాలోకొచ్చి కూర్చుని “నాన్నమ్మ రూమ్‌లో నిద్రపోతోంది. మా బావా, ఆయన భార్యా ఆఫీసులకుపోయారు. పిల్లలిద్దరూ స్కూళ్ళకెళ్ళారు. ఈ సర్వెంట్ మెయిడ్‌ను నాపైన నిఘాకు పెట్టేసి వెళ్ళారనిపిస్తోంది నాకు. కొంచెం కేర్‌ఫుల్‌గా మాట్లాడు నువ్వు. ఆమెవి పాము చెవులు” అనింది చిన్న గొంతుతో. “నేనొచ్చాక మోహన్ రెండు రోజులు లీవు పెట్టి యింట్లోనే వున్నాడు. తర్వాత మోహన్ భార్య రెండు రోజులు లీవు పెట్టింది. ఇద్దరికీ లీవుల్లేవని బాధపడుతూ ఇద్దరూ ఆఫీసులకెళ్ళారు. రోజూ మధ్యాహ్నం మూడు నాలుగు గంటలసేపు వాళ్ళింటికెళ్ళివచ్చే నిమ్మీ రెండురోజులుగా ఎక్కడికీ వెళ్ళకుండా ఇక్కడేవుంది.”

టీ కప్పులతో నిమ్మీ హాల్లోకొచ్చింది. మేము టీ తాగుతూంటే నిమ్మీ అవతలికి తిరిగి ఫ్రిజ్‌లో యేదో సర్దుతూ నిలబడింది. లంచ్ అయిందా అని చేతి సైగతోనే అడిగింది అమృత. తిన్నానన్నట్టుగా తలవూపినాను. పక్కగదిలోనుంచి దగ్గు, వస్తువేదో పడి దొర్లిన శబ్దమూ వినబడినాయి.

“నాన్నమ్మ లేచినట్టుంది. చూసొస్తాను” అని చెప్పి అమృత పైకిలేచింది. ఆమెకంటే ముందుగా నిమ్మీ లోపలికి పోయింది.

రూములోనుంచీ నిమ్మీ కీచు గొంతు, అమృత మాటలూ వినబడినాయి. కొంచేపయినాక అమృత హాల్లోకొచ్చి, “నాన్నమ్మను వీల్‌చెయిర్లో కూచోబెట్టేసరికి దేవతలు దిగొచ్చారు” అనింది రొప్పతా. ఆమె ముఖమంతా చెమటతో తడిసిపోయుండాది.

యింకొన్ని నిమిషాలయినాక ముసలామె కూర్చోనుండే వీల్‌చెయిర్‌ను తోసుకుంటా నిమ్మీ హాల్లోకొచ్చింది.

అమృత వాళ్ళ నాన్నమ్మ బాగా మాగిపోయిన మామిడిపండు మాదిరుండాది. ఆమె ముఖాన్ని సగానికిపైగా కప్పేసిన తెల్ల వెంట్రుకలు, వెనకాల జడగా పొడుగ్గా వేలాడతావుండాయి. కోలముఖంలో పెట్టుకున్న నామంబొట్టు చెమటతో తడిసి కిందికి పాకింది. కూసిగా, పొడుగ్గా వుండే ముక్కుపైన మూడు రాళ్ళుండే ముక్కుపుల్ల అతుక్కోనుంది. సగానికిపైగా పండ్లు రాలిపోయినాయేమో, నోరు వంకర్లు తిరిగుండాది. చీరకట్టడం కష్టమయిందేమో, గౌనుమాదిరుండే నైటీని తొడిగుండారు. వొకప్పుడామె డాక్టరనిచెప్పే సాక్ష్యాలేవీ మిగిలిలేవు.

గుబురు కనురెప్పలకిందినుంచీ ఆమె గాజుకండ్ల చూపులు నా చుట్టూ తిరిగినట్టు అనిపించగానే, ఆమె ముందుకు పోయి, వొంగి ఆమె పాదాలు తాకి, “నమస్తే అవ్వా!” అన్నాను పెద్ద గొంతుతో.

ఆమె చేతులు పైకెత్తబోయింది. కానీ ఆ చేతులు వణకతా గాల్లో వేలాడినాయి. ఆమె పెదవుల్లోనుంచీ అర్ధంగాని శబ్దం మాత్రమే బయటికొచ్చింది. వీల్‌చెయిర్ వెనక్కొచ్చి ఆమెను రెండు చేతుల్తో గెట్టిగా పట్టుకొని, “లక్కీగా నన్ను త్వరగానే గుర్తుపట్టింది. ఏదో చెప్పబోతుందిగానీ మాటలు పలకడం లేదు. ఒక్కటంటే ఒక్క ఇడ్లీ కష్టంగా మింగుతుంది. జ్యూసో, మజ్జిగో అయితే అరగ్లాసు తాగుతుంది. డాక్టర్ రెగ్యులర్‌గా వచ్చి చూసిపోతున్నాడు. టాబ్లెట్లు మింగలేక, టానిక్కులు తాగలేక అంతా వామిట్ చేసేస్తోంది. అవంతా సెడేటివ్స్. ఎప్పుడూ ఇలా డ్రౌజీ గానే…” అని చెప్పింది అమృత విచారంగా.

నేను చూపుల్ని తిప్పుకొని మౌనంగా వుండిపొయినాను. హాల్లో యేసీ శబ్దం తప్ప యింకేమీ వినబడలేదు. యింతలో మరిచిపోయిన విషయం జ్ఞాపకమొచ్చినట్టుగా, “వొక కీర్తన పాడు అమృతా! మీ నాన్నమ్మకు సంతోషమవతాది” అనినాను.

అమృత బిక్కచూపులు చూసి, ముసిలామె భుజాలూ పట్టుకొని కుదిపి ”నేను సంగీతం నేర్చుకుంటూ వున్నాను నాన్నమ్మా! పాడతాను, వింటావా?” అని అడిగింది. ఆమె అదే ప్రశ్నను యింకో రెండు మూడు సార్లు అడిగినాక, ఆ అవ్వ కండ్లు తెరిచి, పెద్దగా పెదిమలు చప్పరించింది. ఆమెకసలు మనవరాలి మాటలు అర్థమయినాయో లేదో తెలియలేదు. అయితే అమృత ఆమె చూపుల్ని బట్టి అంగీకారం తెలిసినట్టుగా, “సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా…” అని ఆమె చెవుల్లోకి వొంగి మంద్ర స్థాయిలో పాట పాడేది మొదులుబెట్టింది.

కొంచేపు తూగుతానే వుండిపోయిన ముసిలామె వున్నట్టుండి కండ్లు పెద్దగా తెరిచి, అమృత చేతుల్లోనుంచీ తన చేతుల్ని లాక్కోని, విసురుగా మెడ తిప్పతా పెద్దగా అరిచింది. జుట్టు లాక్కుంటా, పెదిమలు కొరుక్కుంటా గోల గోల చేసింది.

అమృత పాడేది ఆపేసి “ఏమయింది నాన్నమ్మా?” అని ఆమెను కుర్చీలోనుంచీ పడిపోకుండా పట్టుకునేదానికి సతమతమయ్యింది. నిమ్మీ పరిగెత్తివచ్చి ఆమెను పట్టుకుని “క్యాహువా మాజీ? పానీ పీతే?” అని ముఖం చిట్లించుకుని అడిగింది.

సరిగ్గా అప్పుడే హాలు తలుపులు తెరుచుకున్నాయి. “ఏమయ్యింది అమ్మమ్మా?” అని మగగొంతు, “క్యా కియా తుమ్ మాజీకో?” అని గద్దిస్తూ ఆడగొంతూ వినబడినాయి. ద్వారం దగ్గిర పొడుగ్గా పాంటు తొడుక్కున్న మునక్కాయ మాదిరుండే యువకుడు, బొద్దుగా యెర్రగా చీరగట్టుకున్న గులాబ్ జామ్ మాదిరుండే యువతీ మా యిద్దరినీ చూపులతోనే కాల్చేసేటట్టుగా కోపంగా చూస్తావుండారు.

ముసిలామె అరుపులు తగ్గినాయిగానీ, వణికే చేతుల్ని మాత్రం వూగిస్తానేవుంది.

అమృత నన్నూ వాళ్ళనూ బిక్కరిస్తా చూసింది. అంతలోనే తేరుకొని “హీ ఈజ్ సిద్దార్థ. అమెరికాలో నా ఫ్రెండ్. ఢిల్లీకొచ్చానని ఫోన్ చేస్తే ఇంటికి రమ్మని నేనే పిలిచాను” అని అదే బొంగురుపోయిన గొంతుతో “ఈయనే మోహన్. మా అత్తకొడుకు. ఆమె ఆయన వైఫ్” అని వాళ్ళను నాకు పరిచయం చేసింది.

పాపిట్లో యెర్ర సింధూరం మెరస్తావుండే ఆ బెంగాలీ యువతి విసురుగా వచ్చి ముసిలామె కూర్చోనుండే వీల్ చెయిర్‌ను లాక్కుని లోపలి తోసుకెళ్ళిపోయింది. నా నమస్కారాన్ని పట్టించుకోకుండా సోఫాలోకొచ్చి కూర్చున్న మోహన్, “అమ్మమ్మ అట్లా ఎప్పుడోగానీ ఎజిటేట్ కాదు” అనినాడు కోపంగా.

“కోయీ గడబిడ్ నహీ కియా సాబ్జీ! వో మేడం గానా గాయీ, బస్” అని చెప్పింది నిమ్మీ.

“నువ్వు పాట పాడావా అమృతా? పాటలంటే అమ్మమ్మకు పడదని నీకు తెలియదా?” అనినాడు అతను విసుగ్గా.

“అయ్యయ్యో! నాకా సంగతి తెలియదు బావా!” అని యెదురు దెబ్బ తగిలినట్టుగా అమృత బెదిరిపోయింది.

“డాలీ ఫస్టు క్లాసులో ఉండేటప్పుడు దాన్ని మ్యూజిక్ క్లాసులో జాయిన్ చేయించి వచ్చాం. అప్పుడు అమ్మ కూడా బతికేవుంది. అమ్మా అమ్మమ్మా ఇద్దరూ మమ్మల్నిద్దర్నీ కొట్టందొకటే తక్కువ. చదువూ సామూ రానివాళ్ళు, జులాయిగా తిరిగే తిరుగుబోతులూ మాత్రమే సంగీతం పిచ్చిలో పడతారని వాళ్ళిద్దరూ ఒకే గొంతుతో చీవాట్లు పెట్టారు. అమ్మమ్మెప్పుడో చిన్నప్పుడు వాళ్ళ స్కూల్లో యేదో ఆనివర్సరీలో పాట పాడేసివచ్చిందని తెలిసి, వాళ్ళమ్మ ఆమె చేతిపైన వాత పెట్టిందట. అమ్మమ్మ కుడి చేతి మణికట్టు దగ్గర ఆ మచ్చ యింకా క్లియర్‌గా ఉంది చూడు. పిచ్చి డైవర్షన్స్ లేకుండా ఫోకస్డ్‌గా చదివితే దేన్నయినా అచీవ్ చెయ్యొచ్చని అనేవాళ్ళు వాళ్ళిద్దరూ. వాళ్ళ లైఫే దానికి సాక్ష్యం అని మేమూ అనుకున్నాం ఆతర్వాత. అమ్మమ్మ నిద్రపోయిందని తెలిశాకే టీవీలో పాటల్ని సౌండ్ తగ్గించి పెట్టుకుంటాం మేమైనా” అనినాడతను ముఖాన్ని యింకా ముటముటలాడిస్తా.

అమృత బెదురూ చూపులు చూస్తా “నాకా సంగతి తెలియదు… తెలిసుంటే…” అని గొణిగింది.

“అమెరికాలో అయితే మీరింత కమిటెడ్‌గా వుండాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాకట్లా కుదరదు” అంటా అతను నాపక్కకదోమాదిరి చూసినాడు.

అంతవరకూ యేమిచెయ్యాలో తెలియక తటపటాయిస్తా వుండిపోయిన నేను గబామని పైకి లేచి, “నేను వెళ్తాను” అనినాను నా గొంతు నాకే విచిత్రంగా వినబడతావుండంగా.

“మెట్రో దాకా నేనొచ్చి వదిలిపెట్టొస్తానుండు సిద్దూ” అని అమృత రూంలోకెళ్ళి తన తెల్ల వానిటీ బాగ్ తగిలించుకుని వచ్చింది.

మేమిద్దరమూ యింటి బయటికొస్తావుంటే ఆ దంపతులిద్దురూ మౌనంగా చూస్తావుండిపోయినారు.

లిఫ్టులో దిగి, రోడ్డుపైకొచ్చినాక, “సారీ సిద్దూ! నిన్ను ఇబ్బంది పెట్టాను” అని వాపోయింది అమృత.

“పరవాలేదులే అమృతా! దూరంనుంచీ యెవరికైనా యేమి తెలిస్తుంది? యిక్కడికొచ్చినాకే నీకైనా యిదంతా తెలిసుంటాది” అని నవ్వేటందుకు ప్రయత్నించినాను.

“మా నాన్నమ్మ దగ్గరింకా కొన్నాళ్ళుందామని ఉంది కానీ దాని కోసం యీ ఫస్టు క్లాసు జైలును భరించలేను. పూనాకెళ్ళి మా ఇంట్లో వుండే టెనెంట్స్‌నూ, మా అమ్మానాన్నల ఫ్రెండ్సునూ పలకరించి రావాలి. చెన్నైలోవుండే ఆ యింటిని అమ్మిపారేస్తే వీళ్ళతో వుండే ఆ చివరి లింకూ తెగిచస్తుంది” అనిందామె నిట్టూరుస్తా.

మెట్రో స్టేషన్లో కాఫ్టీరియాలో కూర్చున్నాక “మా నాన్నమ్మ రూమ్‌లో పడుకుంటానంటే మొదట్లో వాళ్ళొప్పుకోలేదు. మొన్నరాత్రి తెల్లారుజాములో ఆమెను బాత్రూముకు తీసుకుపోవాల్సివచ్చింది. వెళ్ళొచ్చాక ఆమె పక్కనుండే బీరువాను చూపించి ఏదో చెప్పబోయింది. తలగడ కిందినుంచి దాని తాళం తీసిచ్చింది. జాగ్రత్తగా శబ్దం రాకుండా దాన్ని తెరిచాను. ఆమె అతికష్టం పైన బీరువాలో ఉన్న ఒక పాత పట్టుచీరను లాగి నా ముందు పడేసింది. పడుకున్నాక కూడా ఆమె కళ్ళలోంచి నీళ్ళు కారుతూనే వున్నాయి. నిన్న వాళ్ళిద్దరూ ఆఫీసుకెళ్ళాక, నిమ్మీ లేనప్పుడు ఆ చీరను తీసి చూశాను. అది మా నాన్నమ్మ పెళ్ళి పట్టుచీరై ఉండచ్చుననిపించింది. ఆ చీర మడతల్లోనించి ఈ పెద్ద తాళంచెవి కింద పడింది” అని అమృత తన వానిటీ బాగ్‌లోనుంచీ పాతకాలపు పెద్ద బీగంచెవిని పైకి తీసింది.

దాన్ని తిప్పి చూసినాక “పాత బీరువాదో, యినప్పెట్టెదో అయుంటాదిది” అని చెప్పినాను.

“పూనేలో నాకు తెలియని బీరువా ఏదీ లేదు. చెన్నైలో వుండే ఆ ఇంటిని నేనింతవరకూ చూడనేలేదు. మా నాన్న పోతూనే దానితో తనకేమీ సంబంధం లేదనుకునేసింది మా అమ్మ. నేను సంతకం చేయకపోతే దాన్ని అమ్మడం కుదరదు. మా బావ చెడ్డవాడేమీ గాడు. న్యాయంగా నాకు రావలసిన భాగం ఇచ్చే తీరాలంటున్నాడు” అనిందామె.

కాఫీలు తాగాక, “వచ్చే బుధవారానికంతా చెన్నై చేరాలంటున్నాడు మా బావ. ఆ యిల్లు కొనేవాళ్ళెవరో రెడీగా ఉన్నారట. గురువారమే రిజిస్ట్రేషన్. మంగళవారం ఫ్లయిట్‌కు చెన్నైకి బుక్ చేశాడు. నువ్వెట్లాగైనా బుధవారానికి చెన్నై చేరాలి. ఈ రిజిస్ట్రేషన్లు, అమ్మకాలు, ఈ గొడవంతా నాకేమీ తెలియదు. నువ్వురాకపోతే నేనొంటరిదాన్నయిపోతాను” అని ఆమె అంగలార్చింది.

మా వూరికి పోయి, అక్కడుండే పనులు సర్దుకున్నాక అటే చెన్నైకి చేరతానని ఆమెకు చెప్పి వొప్పించి మెట్రో రైలేక్కినాను.

3

చెన్నై మైలాపూర్ కచేరీ వీధిలోవుండే యీ పాత సున్నపు మిద్దెను కట్టి నూరేండ్లకు పైన్నే అయుంటాది. అయితే యిప్పుటిదాకా యే రిపేరూ లేకుండా యెట్లుండేదట్లే వుండేదే ఆశ్చర్యం. ఆ వీధిలో రెండుపక్కలా రకరకాల షాపులు, హోటళ్ళూ కిక్కిరిసిపోయుండాయి. ఆ వీధెంత పాతదో చెప్పేదానికన్నట్టు అమృత వాళ్ళ నాన్నమ్మా వాళ్ళిల్లు లాంటివి నాలుగైదు మాత్రం దిష్టిబొమ్మల మాదిరిగా మిగిలుండాయి.

ఆ రెండంతస్తుల యిల్లు రోడ్డుపైన్నే వుంది. ముఖద్వారం ముందరుండే రెండుమెట్లు రోడ్డు పైకొచ్చేసినాయి. వరండాకుండే చెక్క జెల్లీల్లోనుంచీ లోపలుండే పాత నగిషీల ముఖద్వారము, దానికి కొంచెం దూరంలో మిద్దెపైకి పొయ్యే మేడమెట్లూ వున్నాయి. మిద్దెపైన మూడడుగుల పిట్టగోడ, దానికవతల లోపలికివెళ్ళే తలుపూ పైన త్రిభుజం ఆకారంలో పెంకుల పైకప్పూ వున్నాయి.

ఆ పాత యింటి తలుపు బీగాన్ని తీస్తా “నిన్న సాయంత్రం నేనూ మా బావా వచ్చి చూసి వెళ్ళాము. ఆయన ఇంటిని కొనబోయేవాళ్ళతో కలిసి వస్తానన్నాడు. ఇంకాసేపట్లో వచ్చేస్తాడు” అని చెప్పింది అమృత. “మనం తాళం తీసిన చప్పుడు పక్కింటాయన వినేవుంటాడు. పరిగెత్తుకుని వచ్చేస్తాడు చూస్తూండు. ఆయన పేరు డాక్టర్ వాసన్. ఆయన ఇల్లు దీనికంటే పాతది. రెండూ కలిపి అమ్మితే కొనాలనే రియాల్టర్ బిజినెస్ వాడెవడో ఆయన వెనక పడుతున్నాడట! వాడు మనభాగంగా అయిదు అపార్ట్‌మెంట్లు ఇస్తానంటున్నాడట! అలా వొద్దంటే కాషే ఇస్తాడట! మా బావేమో ఇంకో పార్టీకి కమిటైపోయివున్నాడు. ఎంత చెప్పినా వినకుండా డాక్టర్ వాసన్ వాళ్ళ రియాల్టర్‌ను పిలిపిస్తానంటున్నాడు.”

వస్తువులేవీ లేకుండా బోసిగోడలతో దుమ్ముగొట్టుకుపోయివున్న హాలు ముసిలామె ముఖం మాదిరిగా వెలవెలబోతావుంది. అని చోట్లా మురికి, బూజూ…

“మా బావ ఆరేడునెలల ముందు టెనెంట్లను ఖాళీ చేయించి ఇల్లు అమ్మకానికి పెట్టాడు. పెద్ద ఇల్లిది. మూడు బెడ్‌రూములు, హాలు, కిచెన్, పూజగదీ. పైన కూడా ఇదేలా ఇంకో పోర్షను. ముఖ్యమైన విషయమేమిటంటే, నాన్నమ్మ ఇచ్చిన కీ గుర్తుందా? అది పట్టే ఇనప్పెట్టె ఇక్కడ కనిపించింది.”

హాలు మూలలోవుండే గదిలోకి నన్ను తీసుకుపోయింది అమృత. కిటికీలు లేని ఆ గది మూలలో చీకట్లో కలిసిపోయినట్టుందా యినప్పెట్టె. అమృత లైట్ ఆన్ జేసింది. మూడడుగుల పొడుగుండే ఆ భోషాణం నేలలోపలెంత పూడుకునిందో తెలియదు. మట్టిగొట్టుకుపోయినా దాని ఆకుపచ్చరంగు మాత్రం చెదరలేదు. చేతి ఆకారంలో వుండే హాండిల్ కింద బీగం రంధ్రం పైన ఆకు మాదిరుండే బంగారు రంగు మూత దిట్టంగావుంది.

“మా నాన్నమ్మకేం చేస్తోందో తెలుస్తున్నట్టు లేదు సిద్దూ! నిన్న నేనూ మా బావా దీన్ని తెరిచినాము. లోపలేమీ లేదు. అంతా ఖాళీ!” అని చెప్తూనే దాని బీగం తీసి తలుపు తెరిచిందామె. చిదంబర రహస్యమని పూజారులు చూపించే ఆకాశం మాదిరిగా లోపలంతా శూన్యమే!

“ఇట్లాంటి ఇనప్పెట్టెలు పాతకాలంలో శేట్లూ వ్యాపారుల యిళ్ళల్లో వుండేవి. మేమీయింటి మిద్దె పైన బాడుగకుండేటప్పుడు దీన్లో పెద్దమ్మేదో దాచిపెట్టే ఉంటుందనుకునేవాళ్ళం.” యింగ్లీష్ మాటలు వినబడినప్పుడు తిరిగి చూశాము. బట్టతల ముసలాయనొకడు పెద్ద నోటిని యింకా పెద్దది చేసుకుని నవ్వతా కనిపించినాడు.

“ఈయనే పక్కింటి వాసన్‌గారు. మా నాన్నమ్మ వాళ్ళమ్మను ఆయన పెద్దమ్మని పిలిచేవాడట” అనింది అమృత.

“ఇపుడు నా వయస్సు ఎనభై రెండు. నేను పుట్టినప్పటినుంచీ ఈ ఇల్లు తెలుసు నాకు. పక్కిల్లు కొనుక్కొని మారిపోకముందు ఈ మిద్దెపైనే పదేళ్ళకు పైగా బాడుగకున్నాము. ఈ ఇంట్లో ఉన్నప్పుడే మా అక్క పెళ్ళి జరిగింది. మేము పక్కింటికెళ్ళాక, నేను ఎంబీబీఎస్‌లో చేరిన సంవత్సరం లోనే మీ జేజమ్మ పోయిందని గుర్తుంది నాకు. అప్పుడు ఈ ఇల్లు కొంటామని చాలామంది ప్రయత్నం చేశారు. మీ నాన్నమ్మ ఒప్పుకోలేదు. అది వైజ్ డెషిషన్. అప్పుడైతే లక్షో, రెండు లక్షలో వచ్చేది. ఇప్పుడు దీని వాల్యూ కోట్లలోకొచ్చింది” అన్నాడాయన.

ఇనప్పెట్టెకు బీగం వేసేసినాక “బయటికెళదాం పద సిద్దూ! ఇక్కడంతా డస్ట్. మా బావ వచ్చేవరకూ వెయిట్ చేయక తప్పదు” అనింది అమృత.

ఆమాట కోసరమే యెదురుచూసినట్టుగా ”మా ఇంటికొచ్చి కాఫీ తాగి వెళ్ళండమ్మా! మీ జేజమ్మకు నేనంటే చాలా ఇష్టం” అనినాడు డాక్టర్ వాసన్.

“నా కొడుకు ట్రిప్లికేన్‌లో, కూతురు గిండీలో ఫ్లాట్లు కొనుక్కని వెళ్ళిపోయారు. ఈ ఇంటికి వాచ్‌మెన్ల మాదిరిగా నేనూ, నా భార్యా మిగిలిపోయినాము. పొద్దుపోకకు ప్రాక్టీస్ లాగిస్తున్నాను” అని చెప్తూ డాక్టర్ వాసన్ ఇంటిముందున్న డిస్పెన్సరీకి గాకుండా, హాల్లోకి తీసుకుపోయినాడు.

హాలు మధ్యలో పెద్ద వూయల బల్లుంది. వొక పక్కగా రోజ్‌వుడ్ సోఫా, హాలుమూలల్లో చెక్క బీరువాలూ. మేము సోఫాలో కూర్చున్నాక “ నా వైఫుకు చెవుడు. అతిథులొచ్చారని చెప్పొస్తాను” అని ఆయన లోపలికెళ్ళినాడు.

ఆయన తిరిగొచ్చేటప్పటికీ మేమిద్దరమూ గోడలపైన తగిలించిన రకరకాల సైజుల ఫొటోలవైపు చిత్రంగా చూస్తావున్నాము.

“మీకొకటి చూపిస్తానుండండి” అని ఆయన ఆ ఫోటోల మధ్యలోనుంచీ లాప్^టాప్ సైజులో వుండే ఫోటో నొకదాన్ని తీసుకొచ్చాడు. “ఇది మా అక్క పెళ్ళప్పటి ఫోటో. వెయ్యిన్నీ తొమ్మన్నూట యాభై నాలుగు అని కింద డేట్ రాసుంది చూడండి. నేనప్పుడు ఎయిత్ క్లాసు. ఇదిగో, మీ జేజమ్మ ఇక్కడుంది చూడండి” అని ఆయన వొక పెద్దామెను చూపించాడు.

పూలమాలలేసుకున్న కొత్తజంట పక్కనున్న ఆడవాళ్ళను కళ్ళార్పకుండా చూసినాక, “అవును మా జేజమ్మే! మా నాన్నమ్మ దగ్గర వాళ్ళమ్మ ఫోటోను చూశాను” అనింది అమృత సంబరంగా.

“మొబైల్ కెమెరాతో కాపీ తీసుకుందాం” అని నేను మొబైల్‌ను నొక్కినాను.

“ఇప్పటికి తీసుకోండి. తర్వాత స్టూడియోలో మంచి కాపీ తీయించి పంపిస్తాను” అన్నాడాయన వుదారంగా. “మేము మీ ఇంట్లో బాడుగకు చేరేటప్పటికే మీ నాన్నమ్మ పెళ్ళి చేసుకుని పూనే వెళ్ళిపోయింది. మీ జేజమ్మ ఒంటరిగానే ఉండేది. భలే మనిషామె. పైసా కూడా వృధాగా ఖర్చుబెట్టేదికాదు కానీ ఆస్పత్రిలోవుండే బీద పేషంట్లకంతా ఎంతవుంటే అంతా యిచ్చేసేది. మా అమ్మ, మీ జేజమ్మా భలే స్నేహితులు. బజారుకైనా, ఎక్కడికైనా కలిసే వెళ్ళేవాళ్ళు. మార్గళి నెలలో మాత్రం ఇద్దరూ ఎడముఖం పెడముఖంగా వుండేవాళ్ళు. ఆనెలంతా మైలాపూర్లో సంగీత కచేరీలు జరగతాయి గదా! మా అమ్మ ఒక్కటి కూడా ఒదిలేది కాదు. మీ జేజమ్మ దారి తప్పయినా అటుకేసి వెళ్ళేది కాదు. కచేరీలవాళ్ళు చందాలకొస్తే వాళ్ళని కసిరి తరిమేసేది. తీరిక దొరికితే కపాలీశ్వర కోవెలకెళ్ళి ధ్యానంలో కూర్చునేది. ఆమె భర్త సంవత్సరీకం మాత్రం పెద్దగా చేసేది. దొరికినంత మంది బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి సంతర్పణలు చేసేది. రోజూ ఉదయాన అరగంట పూజ చేసేది. ఆమెలా శుద్ధి, మడీ ఆచారం ఇంకెవరిలో చూళ్ళేదు నేను. ఒకదినం కాలేజీనుంచీ వస్తూనే ఆమె కాలమైపోయిందన్నారు. జబ్బూ గిబ్బు లేదు. నిద్రలోనే పోయింది. అనాయాసమరణం. పుణ్యాత్ములకు మాత్రమే అలాంటి చావొస్తుంది” ఆయన కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకున్నాడు.

కంచు గ్లాసుల్లో పొగలుగక్కే వేడి కాఫీ తీసుకొచ్చిన వాసన్‌గారి భార్య “వనక్కమ్” అని తమిళంలోనే పలకరించింది.

“మీ జేజమ్మకు కాఫీ అంటే ప్రాణం. గింజలు తెచ్చి పొడి కొట్టి ఫిల్టరేసుకునేది. మా అమ్మ చేత్తో వండిన కూరలు, వేపుళ్ళు మాత్రం తినేది. ఇంకెవరింట్లోనూ చేయి కడగడం నాకు తెలియదు” వాసన్‌గారు చెపుతావుంటే అమృత వొళ్ళంతా చెవులు చేసుకుని వినసాగింది.

ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. పేషేంట్ ఎవడో బయటినుంచీ డాక్టరుగార్ని పిలిచాడు. “మళ్ళీ వస్తామంకుల్. మా జేజమ్మ గురించి మీకు తెలిసిందంతా చెప్పాలి మీరు” అంటా అమృత పైకిలేచింది.

“అరగంటలో పేషేంట్‌ను పంపించేస్తాను. మీరు వెంటనే వచ్చేయండి” అన్నాక ఆయన డిస్పెన్సరీలోకెళ్ళాడు.

వీధిలో పదడుగులు వేసినాక ”వొకసారి మీ యిల్లు బీగం తియ్యి అమృతా! నాకో డవుటొస్తావుంది” అన్నాను. ఆమె యెందుకన్నట్టుగా చూసింది. “చెప్తాను కదా! తెరువు ముందు” అన్నాను.

యిల్లు తెరిచినాక, మూలగదిలోకెళ్ళి యినప్పెట్టెముందు గొంతుక్కూచోని ”తాళం యియ్యి” అని అడిగినాను. దాని తలుపు తెరిచినాక, లోపలికి భుజాన్ని దూర్చినట్టుగా వంగి, తలుపెనక పైన మూలలోకి అరచేయి పెట్టి గెట్టిగా తడిమినాను. నా అనుమానం నిజమే! అక్కడ గోరంత చిన్న రేకు లోపలికి పోయింది. తాళాన్ని దానిలోకి దూర్చి తిప్పినాను. లోపల కుడిపక్కనుండే రేకు కిందికి జారింది. దాని లోపలినుంచీ అడుగు పొడుగూ అడుగు వెడల్పూ వుండే రేకుపెట్టె పక్కకు పడింది. దాన్ని తీసి అమృతకిచ్చి నవ్వినాను.

ఆమె ఆశ్చర్యపడిపోతూ రేకుపెట్టె తెరిచి చూసింది. లోపల పాతకాలం బంగారు అడ్డిగలు రెండున్నాయి. వాటి కింద అట్ఠమాదిరిదొకటుంది. దాన్ని తీసి చూసి, “ఫోటో సిద్దూ! పాతబడిపోయింది. సరిగ్గా కనబడడం లేదు” అనిందామె. మొబైల్ టార్చిని వెలిగించినాను.

“మా జేజమ్మే! పక్కన మా ముత్తాతే అయుంటాడు. ఇది నాకు దొరికిన జేజమ్మ మూడో ఫోటో” అనిందామె ఆనందంగా.

కిందికి దిగిన రేకును పైకెత్తి బీగమేసి యినప్పెట్టెను మూసేసినాక “దీన్ని చూసినప్పటినుంచీ డవుట్‌గానే వునింది నాకు. సరిగా యిట్లాంటిదే మాయింట్లో కూడా వుంది. అక్కడ ఆ సీక్రెట్ డ్రా వుందనే విషయం చాలా కాన్ఫిడెన్షియల్‌గా కొందరికి మాత్రమే చెప్తారింట్లో” అని చెప్పినాను.

బయటికొచ్చి వెలుతురులో ఆ ఫోటోను చూసినాక “ముఖాలు మాత్రం క్లియర్‌గా ఉన్నాయి కానీ కిందంతా ఫేడయి పోయింది. మా ముత్తాతను చూడు సిద్దూ, మా నాన్నను చూసినట్టుగా లేదూ?” అని అడిగింది అమృత ఆనందమూ, యేడుపూ కలగలిసిన గొంతుతో.

“స్టూడియోలో యిచ్చి ఫిగర్లను వీలయినంతగా రిపేర్ చేయిస్తానివ్వు” అని దాన్ని తీసుకున్నాక “ఆ అడ్డిగలు చూడు. పాత బంగారం. కెంపులూ పచ్చలూ యింకా మెరస్తానేవున్నాయి. వొకొకటీ అరకేజీ అయినా వుంటాది” అన్నాను.

వాటిపక్కకు తలైనా తిప్పకుండా “ఒకటి మా బావకూ. ఇంకొకటి నాకూ” అనేసింది అమృత.

4

చెన్నై నుంచీ బస్సులో మూడుగంటలు ప్రయాణం చేసి వేలూరులో దిగి, చిత్తూరు జిల్లా బార్డరుకు మైలుదూరంలో తమిళనాడులోవుండే తొండపేటనే మా తెలుగు పల్లెకు చేరి, మాయింటికి పోతూనే మా హాల్లో గోడపైనుండే మీటరు పొడుగు ఫోటోను చూసి, నా అనుమానం సరైనదేనని తెలుసుకున్నాను. యెందుకయినా మంచిదని, చెన్నైలో దొరికిన ఫోటోను దాని పక్కనేపెట్టి చూసినాను. తలపైన పెద్ద ముడి, అంగీపైన పెద్ద బుష్ కోటు, అడ్డపంచె, ఆ రెండు ఫొటోల్లో వుండే ఆ మగమనిషి వొకడే!

మాయింట్లో వుండే ఫోటోకింద తొండపేట రంగారెడ్డి, జననం 1885, మరణం 1930 అని రాసివుంది. దాని పక్కనుండే ఫోటో మా ముత్తాతది. ఆయన పేరు తొండపేట కృష్ణారెడ్డి. ఆయన 1913లో పుట్టి 1973లో పోయినాడు. దానిపక్కనుండే ఫోటో మా తాత తొండపేట శంకరరెడ్డిది. ఆయన 1937లో పుట్టి 1991లో పోయినాడు. మా అవ్వ, అంటే శంకరరెడ్డి భార్య రెడ్డెమ్మకిప్పుడు యెనభై దాటుంటాది. షుగరూ బీపీ రెండూ పుష్కలంగా వుండాయిగానీ మనిషి మాత్రం రాతికూసం మాదిరిగా బలంగానే వుంది. మోకాళ్ళనొప్పులొచ్చి తిరిగేది తగ్గించిందిగానీ రాళ్ళను తిని రాళ్ళను అరాయించుకుంటాది. యిప్పుడు నాకు దొరికిన చిక్కుముడి విప్పాలంటే ఆమె తప్ప దిక్కెవరూ లేరు నాకు.

చెప్పిందానికంటే నేను ముందుగా యింటికి రావడంతో, మా నాయన, మా అన్నా యింట్లోలేరు. బిడువులేని రాజకీయాల పనులతో వొకరు విజయవాడకూ యింకొకరు హైద్రాబాదుకూ పోయినారని తెలిసింది. నాకోసరమని ప్రత్యేకమైన వంటలు చేయిస్తా మా అమ్మ వంటింట్లో తలమునకలైపోతావుంది. మా వదినగారు తన రూములో టీవీ ముందు అతుక్కుపోయివుంది. మా అన్న కొడుకూ కూతురూ కాన్వెంటు బస్సెక్కి వేలూరుకెళ్ళిపోయారు. మా అవ్వ నాకు వంటింటి కుందేలు మాదిరిగా దొరికిపోయింది. కొంచెంగా ఆమెను మాటలతో కదిలించినాక, ఆమె నాకు దొరికిందో, నేనామెకు దొరికినానో, నాకే తెలియలేదు.

“మీ మామగారి తండ్రికి యింకో భార్యగూడా వుండేదని తెలిసింది నాకు. నిజమేనా అవ్వా?” అని ఆమెను సూటిగానే అడిగినాను.

మంచం పైన పడుకోనుండే ఆమె గబామని పైకిలేచి కూర్చోని “నీకెట్లా తెలిసిందిరా అయిలూ?” అని అడిగింది. పెద్దగా కంగారు పడతావున్నట్టు లేదామె. యెవరో పక్కింటాయను గురించి మాట్లాడినట్టుగా కుశాలగానే మాట్లాడింది.

“మూలింటిలో దొరికిన పాత ఖాతా పుస్తకంలో, రంగారెడ్డి రెండోభార్యకు పంపిన రొక్కం అని రాసింది చూసినాను” అని నేను చిన్న ఆపద్ధం చెప్పినాను.

“అది మా మామ వాళ్ళ నాయన రామలింగారెడ్డి రాసిందైవుంటాది. జమాఖర్చుల రాసేదాంట్లో ఆయన యెత్తినచెయ్యని మానాయన చెప్పేటోడు. మా అత్తకు అత్త, అంటే ఆ రంగారెడ్డి భార్య, నేను కాపురానికొచ్చినాకగూడా చాన్నాయేండ్లు బతికేవునింది. చానామంది ఆమె యెనకాల్నే ఆమాట చెవులుగొరుక్కునేటోళ్ళు. ఆమె మామ, ఆమె మొగుడు, యిద్దురూ యాభై తిరక్కుండానే చిన్న వయసులోనే కాలమైపోయినారు. రామలింగారెడ్డి మా నాయనకంటే, ఆమాటకొస్తే ఆయన కొడుకు రంగారెడ్డికంటే చిన్నోడు. అయితే రామలింగారెడ్డికీ మానాయనకూ భలే స్నేహితం కుదిరింది. ఆ పెద్దాయిన బతికినంత కాలం మామా మామా అని పిలస్తా మా నాయన ఆయన చెయ్యిడిసిపెట్టకుండా తిరిగినాడు. ఆ స్నేహితంతోనే నన్నీ యింటికి కోడలుగా తోసేసిపోయినాడు.”

మా అవ్వ యెవర్ని పొగడతావుందో, యెవర్ని తిడతావుందో తెలియలేదు.

ఆమెకు చిన్నప్పటినుంచీ మావూర్లో చెప్పే పద్దెనిమిది దినాల భారతం హరికథ, రాత్రంతా కథలోళ్ళొచ్చి చెప్పే ముగ్గురు మరాఠీలు, బాలనాగమ్మ, కావమ్మా కథలూ భలే యిష్టమని తెలుసు నాకు. యెర్రంచు వుండే డిటెక్టివ్ నవలలనూ పత్రికల్లో వచ్చే సీరియళ్ళనూ వొకటొదలకుండా చదివేది.

వాళ్ళ నాయనే నాముందొచ్చి కూర్చోని నాకు చెప్పినట్టుగా, నన్ను ఆమె అనుకోని, ఆమె వాళ్ళ నాయనైనట్టుగా, జరిగిన సంగతినంతా ఆమె భలే రంజుగా చెప్పుకుపోయింది.


అప్పుడు నేనూ రామలింగారెడ్డీ కలిసి చానా కమీషన్ల వ్యాపారాలు చేస్తావుంటిమి పాపా! వేలూర్లో, మద్రాసులో బెల్లం, మామిడి కాయల మండీలు పెట్టుకొని లక్షల్లో టర్నోవర్ జేస్తావుంటిమి. ఆయన కొడుకు రంగారెడ్డికీ ఆయనకూ పడేది గాదు. ఆయన వుప్పయితే ఆ కొడుకు నిప్పు. రంగారెడ్డి నాకంటే నాలుగైదేండ్లు పెద్దోడైవుంటాడు. అప్పటికే ఆయనకు పెండ్లయ్యి యిద్దురు బిడ్డలుగూడా వుండారు. అయినా తండ్రి చేసే వ్యాపారాల్ని పట్టించుకోకుండా నాటకాల పిచ్చిలోపడి తిరిగేటోడు. కోయంబత్తూరుకు పోయి మూకీ సినిమాలు తియ్యాలని నెలలకు నెలలు ఆ వూర్లోనే వుండిపోయేటోడు. కొడుకు దోవదప్పోయినాడని చెప్పి రామలింగారెడ్డి సహాయంగా వుండేదానికని నన్ను చేరదీసినాడు. మా నాయన నా చిన్నప్పుడే పోయినాడు. దాంతో నాకు రామలింగారెడ్డే గురువూ, తండ్రీ రెండూ అయినాడు. ఆయనకు నాపైనుండేటంత నమ్మకం యింకెవరిపైనా వుండేదిగాదు. యెంత పెద్ద వ్యవహారమైనా, బేరమైనా, నేను పక్కనుంటే లెక్కలేకుండా వగతెంచేసేటోడు.

మొగుడు సరిగ్గా యింటికి రావట్లేదని అలిగి, రంగారెడ్డి భార్య బిడ్డల్ని తొడుక్కొని పుట్టిల్లు చేరిపోయింది. దాంతో కొడుకుకు బుద్ధిజెప్పి యింటికి తొడుక్కొని రావాల్సిన బాధ్యత రామలింగారెడ్డి పైన బడింది. నన్ను కూడా పిలుచుకొని,ఆయన కోయంబత్తూరుకు బయల్దేరినాడు. అక్కడ ఆ రంగారెడ్డి స్నేహితుల్ని విచారించినాకగానీ చేతులు కాలిపోయినాయనే సంగతి మాకు తెలియలేదు. అప్పుటికి సమత్సరం రెండేండ్లుగా రంగారెడ్డి అక్కడనే యెవురో వొకపిల్లతో సంసారమే బెట్టేసుండాడు.

ఆ పిల్లెవురో, ఆ సంసారమేయింట్లో జరగతావుందో అంతా విసిదంగా విచారించి తెలుసుకున్నాము. ఆ ఆడపిల్ల భోగం పిల్లనీ వాళ్ళనావూర్లో దేవదాసీలంటారనీ తెలిసింది. తానే నేరుగా పోయి దండిస్తే ఆ కొడుకింకా బిగుసుకుంటాడని రామలింగారెడ్డి బయపడినాడు. ఆ కొడుకును యెనక్కు మల్లించేదానికంటే ఆ పిల్లను బెదిరించి తరిమేసేదే సులభమనుకున్నాడు.

రంగారెడ్డికప్పుడు తగులుకున్న పిల్ల సంగీతంలో, నాట్యంలో పేరెత్తిందని తెలిసింది. రంగారెడ్డితో కాపురం పెట్టకముందు కోయంబత్తూరు గుడుల్లో, మత్తేబుల యిండ్లలో ఆడతా పాడతా వునిందంట! పెళ్ళిగాకుండా సంసారాలు జేసేది వాళ్ళకు అలవాటేనంట! వాళ్ళు దుడ్డు కోసరమని పోషకుల్ని ముక్కుచీదినంత సులభంగా మార్చేస్తారంట! అయితే రామలింగారెడ్డి మాత్రం ఆమెను గుళ్ళో సాంగోపాగ్యంగా పెండ్లి జేసుకున్నాడని, అప్పటినుంచీ ఆమె బయట ఆడేదీ పాడేదీ చాలించేసిందని తెలుసుకున్నాము.

ముందుగా రామలింగారెడ్డి ఆవూర్లో ఆయనకుండే పెద్ద వ్యాపారుల సహాయంతో దండోపాయాన్నే యెంచుకున్నాడు. కండలు తిరిగిన రౌడీల్ని ఆ యింటిపైకి తోలి రంగారెడ్డి ముందర్నే ఆ పిల్లను కిల్లరకపోయేటట్టుగా హడలుగొట్టించినాడు. అయితే ఆ కొడుకు ఆ తండ్రికి తీసిపోయినోడు కాదు. యింకా పెద్ద గూండాల్ని కాపలాకు పెట్టుకున్నాడు. పైకొచ్చినోళ్ళ కీళ్ళిరిచేయించినాడు.

ఆపిల్ల తల్లి కూడా ఆవూర్లోనే వుందని తెలిసింది. ఆమె యీ కూతురిమాదిరిగానే యెవురో కోయంబత్తూరు శెట్టిని పట్టుకొని మదురైనుంచీ అక్కడికొచ్చిందంట! ముందుగా రామలింగారెడ్డి నన్నే ఆమె దగ్గిరికి అంపించినాడు. పట్టు గుడ్డలు గట్టుకోని, మెడలో బంగారు గొలుసులు దిగేసుకొని, వేలేలికీ వజ్రాలుంగరాలేసుకొని, జబర్దస్తీగా తయారై ఆమె యింటికి పోయినాను. ఆమె కూతురి డాన్స్ వొకసారి చూసినానని, పోషకుడిగా వుండాలని వచ్చినానని, యెంత దుడ్డుకైనా యెనకాడననీ ఆశపెట్టినాను. ఆమె కూతురితో చెప్పి వొప్పిస్తానని చెప్పింది.

అయితే యెన్నిదినాలైనా ఆమె నుంచీ నాకు జవాబు రాలేదు. దాంతో యిట్లాకాదని రామలింగారెడ్డే బయల్దేరినాడు. నా మాదిరే పట్టుగుడ్డలు గట్టుకొని, బంగారు గొలుసులు యేసుకోని, వజ్రాలుంగరాలు తొడుక్కొని ఆమె యింటికి పోయినాడు. మద్రాసులో పెద్ద వ్యాపారముండాదని, ఆటా పాటా వొచ్చిన వయసు అమ్మాయిల్ని నాటకాల్లోపెట్టి పైకితెచ్చేదే తన పని అనీ, వొప్పుకోని వస్తే లక్షలకు లక్షలు యిస్తాననీ కోసినాడు. కూతురిప్పుడు ఆమె మాట కాతరు జెయ్యటం లేదని, అయినా యెవురో నమ్మకమైన మనిషితో రాయబారం పంపించి ప్రయత్నిస్తానని ఆమె చెప్పింది. ఆ రాయబారం పొయ్యే మనిషిని పట్టుకొని రామలింగారెడ్డి వానికి దోసిలినిండా రూపాయలనోట్లు పోసి పని పండుజేసుకోనొస్తే యింకా యింతకింత యిస్తానని ఆశబెట్టినాడు. ఆపోయినమనిషి ముఖం మాడ్చుకొని గోడకుగొట్టిన చెండు మాదిరిగా తిరుక్కోనొచ్చినాడు. ఆ తల్లనే మనిషితో తానెప్పుడో సంబంధాలు తెంచుకునేసినానని, గుట్టుగా సంసారం చేసుకునే తనను యిబ్బందిపెడితే తన మొగుడూరుకోడనీ ఆమె తేల్చి చెప్పేసిందంట.

రంగారెడ్డి స్నేహితుల్ని కొందర్ని మళ్ళా విచారించి చూసినాము. వాళ్ళు ఆమె చెప్పిందే నిజమనేసినారు. పెండ్లయినాక ఆమె మాదిరి నిష్టగా సంసారం చేసుకునేవాళ్ళు యెందురో వుండరని, మొగుడూ బిడ్డా సంసారం తప్ప ఆమెకిప్పుడేవీ కాబట్టవనీ చెప్పినారు. దాంతో యింకేమీ చెయ్యలేక రామలింగారెడ్డి చేతులు ముడుచుకొని తిరిగింటికొచ్చేసినాడు.

అయితే ఆయన వియ్యంకుడు గొమ్మునుండలేదు. మద్దిస్తానికి రమ్మని మనుషులపైన మనుషుల్ని తోలినాడు. యింటిముందుకొచ్చి రచ్చబెట్టుకున్నాడు. అప్పటికి రంగారెడ్డి యింకెవురో ఆడదానితో వుండాడని మాత్రమే అందరికీ తెలుసు. మొగోడు తిరుగుబోతయినాడంటే వూరోళ్ళూ బంధువులూ మొగోడుగదా అని అదేదో గొప్పయినట్టుగా లోలోపల మెచ్చుకుంటారు. కానీ అదే మొగోడు పెండ్లాన్ని పట్టించుకోకుండా, యింకో దాన్ని పెండ్లి చేసుకుంటే అదంతా మొదటిదాని తప్పేనని తేల్చేస్తారు. జరిగిన సంగతి తెలిస్తే వూర్లో మానంబోతుందని రామలింగారెడ్డి దిగులుబెట్టేసుకున్నాడు. యిల్లొదలకుండా అందరికీ ముఖం చాటేసుకున్నాడు.

అయితే ఆయన దాంకుంటే లోకం గొమ్మునుంటాదా? వియ్యంకుడినుంచీ పోరు, పెండ్లాం నుంచీ ఆగడాలు, వూర్లోవాళ్ళ యెత్తిపొడుపులూ, ఆవంతా యెన్నాళ్ళని వోర్చే దానికయితింది? వొకదినం ఆయన్ను కాట్పాడి స్టేషన్లో కలుసుకోమని నాకు కబురొచ్చింది. పోయినాను. “యీ సారి తాడో, పేడో తేల్చుకున్నాకే యింటికొచ్చేది,” అన్నాడాయన. యిద్దురమూ కలిసి కోయంబత్తూరు రైలేక్కినాము. రెండుదినాలు మాటేసినాక, రంగారెడ్డి యింట్లో లేడని, సినిమాల పనిపైన కలకత్తాకు పోయినాడనీ తెలుసుకున్నాము. నేరుగా పోయి ఆమెనే నిలదీస్తానని రామలింగారెడ్డి బయల్దేరినాడు.

చుట్టూ ప్రహరీగోడ. లోపల చెట్లూ మొక్కల మధ్యలో చిన్న రెండంతస్తుల యిల్లు. పై అంతస్తు పెంకులిల్లు.

తలుపుగొడతానే తెరిచింది ఆమే అని తెలిసిపొయింది. నున్నగా తల దువ్వుకోని, నూలు చీర కట్టుకోనుండాది. జడ పొడుగ్గావుండాది. ముఖాన కుంకుం బొట్టు. సన్నగా, పొడుగ్గా, నాణ్యంగా వుండాది.

“నేను రంగారెడ్డి తండ్రి. నా పేరు రామలింగారెడ్డి” అని చక్కా యింటిలోపలికి దూరేసినాడాయన. ఆయన యెమ్మటనే కుక్కపిల్ల మాదిరిగా నేనూ లోపలికడుగేసినాను.

ఆమె దిక్కులు తెలవనట్టుగా బిత్తరచూపులు చూసింది. కొంచెం తేరుకున్నాక కుర్చీని చూపించి ”కూకోండి” అనింది.

“కూర్చునేదానికి రాలేదు నేను” అంటానే రామలింగారెడ్డి కూర్చున్నాడు. “బిన్నాగా తిరుక్కోనిపొయ్యేదానికే వచ్చుండాను. యిక్కడ నువ్వు సంతోషంగా వుండావు. అయితే అది వేరేవాళ్ళనుంచీ కాజేసిన సంతోషమని నీకు చెప్పేదానికే నేనొచ్చినాను. నువ్విక్కడిట్లా సంతోషంగా వుండేంతకాలం అక్కడ యింట్లోనుంచే పీనిగలేసినట్టుగా యేడ్చి కుళ్ళి కూరాకయిపోతావుంటారని నువ్వు తెలుసుకోవాలిప్పుడు” అన్నాడాయన.

ఆమె భయంభయంగా చూసింది.

“వీనికి పదేండ్లకు ముందే పెండ్లయిందని నీకు తెలుసునో తెలియదో? అక్కడ వీనికి యెనిమిదేండ్ల కొడుకూ ఆరేండ్ల కూతురూ వుండారు. వీడిక్కడ తిస్టేసుకొని కూర్చున్నాడని నా కోడలు వాళ్ళ అమ్మగారిల్లుజేరి రెండేండ్లయింది. నా వియ్యంకుడు కోర్టులూ పోలీసులూ అని నన్ను గుంటికీమిట్టకూ లాగతావుండాడు. యీ దిగులు బెట్టుకోని నా భార్య మంచమెక్కేసింది. యెవురు యెవుర్ని వోదార్చాలో తెలియకుండా కుమిలిపోతావుండాము. యింతమంది వుసురు బోసుకొని నువ్వు మాత్రం కడంత కాలం సుఖంగా వుంటాననుకోవద్దు.”

ఆమె నిలువుకండ్లేసుకుని నిలబడిపోయింది. కండ్లల్లోనించీ బొట్లు బొట్లుగా నీళ్ళు కారతావుండాయి.

“వొకరి వుసురుబోసుకోని సుఖపడినోళ్ళెవురూలేరీ లోకంలో. రెండోదానిగా అన్యాయంగా వచ్చిందానివి నువ్వు. యిది నీది గాదు. న్యాయంగా నువ్వే తప్పుకో.” ఆయనెందుకో పెద్దగా గస బోసినాడు. “అయినా నేను నీకన్యాయం జెయ్యను. నాకిద్దురు కొడుకులనుకుంటాను. నా ఆస్తిలో సగం యిప్పటికిప్పుడు నీకు రాసిచ్చేస్తాను. వాడ్ని వొదిలిపెట్టు.“

తన్నకొస్తావుండే యేడుపును ఆపుకోలేక ఆ ఆడకూతురు వూగిపోయింది.

“యీ వూర్లో నీకూ మీ అమ్మకూ వుండే పరువెంతో నీకే బాగా తెలుసు. రెండురూకలు జాస్తీగా పారేస్తే నీదగ్గిర తైతక్కలాడించేదానికి మీ అమ్మ సందేహించదు. నీకు ఆటా పాటా బాగా వస్తాయని యీవూరోళ్ళకంతా తెలుసు. అవిట్ని నువ్వొదిలినా అవి నిన్నొదలవు. వీళ్ళు నాకొడుకు ముందరే నిన్నెట్లా మాట్లాడతారో నువ్వే రుచి జూసినావు. నీతో వుంటే నాకొడుక్కూ మర్యాద మిగలదు. నేనిచ్చేది తీసుకొని, నువ్వెవురో తెలియని దేశానికి పొయ్యి, గౌరవంగా బతుక్కో. నువ్వూ, మేమూ అంతా బతికి బట్టగడతాము.”

సరిగ్గా అప్పుడే యింటిలోపలినుంచీ చిన్నబిడ్డ యేడుపు వినబడింది. ఆమె యేడ్చుకుంటానే లోపలికిపోయి బిడ్డను చంకనేసుకొని వచ్చింది.

అప్పుడు రామలింగారెడ్డి నేను కలలోగూడా అనుకోని పనొకటి చేసినాడు. గభామని పైకి లేచి, భుజానుండే పైసవకాన్నితీసి తలకు తలగుడ్డ బిగించినాడు. “నీకోసరం గాకపోయినా, నీ బిడ్డ కోసరమయినా, నీ బిడ్డలబిడ్డల కోసరమైనా నా మాటిను. నువ్వేడుండావో మావానికి తెలియనంత దూరం యెల్లిపో. నీకుపట్టుండే యీ గతి నీ సంతానానికి రాకుండా కాపాడుకో.”

ఆమెకు యెక్కుళ్ళు తన్నుకొచ్చినాయి. ఆమె సంకలోవుండే బిడ్డె గూడా గోళీలమాదిరుండే కండ్లనార్పకుండా చూస్తావుంది.

“నేను మావూరికి మణేగారు. మణేగారంటే రాజుమాదిరి. నామాటకు మా వూర్లో తిరుగులేదు. డాబూ దర్పంగా పరువూ ప్రతిష్టతో యింకొకరికి తలొంచకుండా యిన్నాళ్ళూ బతికినాను. యింకపైన నేనూ నాకుటుంబమూ తలెత్తుకొని బతకాలంటే నీకిపుడు నేను తలొంచేకావాల. పుట్టి భూమ్మీద పడినాక తొలీసారిగా నేనిప్పుడు తలొంచతావుండాను” అని అంటా రామలింగారెడ్డి తలగుడ్డను కిరీటం మాదిరిగా పైకి తీసి, నేలపైన ఆమె పాదాల ముందరపెట్టి, అట్నే రెండు చేతులూ పైకెత్తి నమస్కారం పెట్టేసినాడు.

“యిది తలగుడ్డగాదు. నా బతుకు. నా యింటి పరువు. దీనికంటే నేనేమీ చెప్పలేను. మమ్మల్ని అగ్గిలోకితోసినా, నీళ్ళల్లోముంచినా అంతా నీదే భారం తల్లీ! అంతా నీదయ” వచ్చే యేడుపునాపుకుంటా ఆయన పైకి లేచి గిర్రున తిరుక్కోని సరసరా యింటిబయిటి కొచ్చేసినాడు.

తలదిమ్మెక్కి బండరాయి మాదిరుండి పోయినాన్నేను. ఆమె బిడ్డ కేరుమనింది. ఆమె మాత్రం శిల్పం మాదిరిగా స్థాణువై వుండిపోయింది. ఆమె కండ్లనుంచీ కారే నీళ్ళతో ఆమె రయికగూడా తడిసిపోతావుంది.

యెవురో యెనకనుంచీ తరిమినట్టుగా నేను ముఖం తిప్పుకోని యింటి గడపపైన్నుంచీ బయటికి దూకినాను.

ఆపైన జరిగిందేందో చానావరకూ నాకూ తెలియదు తల్లీ! అయితే కోయంబత్తూరు నుంచీ ఆ మహాతల్లి మాయమైపోయింది. ఆమెకోసరం యెతికీ యెతికీ రంగారెడ్డి అలిసిపోయినాడు. ఆయన పెండ్లామయితే అత్తగారింటికి తిరుక్కోనొచ్చిందిగానీ, రంగారెడ్డి మళ్ళా మామూలు మనిషి కానే లేదు. యిదంతా యెన్నాళ్ళులేరా, యింకో నెలకో రెండు నెలలకో వాడు మనుషుల్లో పడకుండా పోతాడా, అని రామలింగారెడ్డి అనేటోడు. అయితే అది జరిగిన నాలుగేండ్ల లోపల్నే రంగారెడ్డి గుండెపోటుతో కాలమైపోయినాడు. కొడుక్కాగతి పట్టిందానికి తానే కారణమని నాతో చెప్పి రామలింగారెడ్డి కంటికి కడివెడు గార్చేటోడు.

“ఆమెక్కడికి పోయిందో నీకు తెలుసునని నాకు తెలుసులే మామా!” అనినానొకసారి.

ఆయన కన్నీళ్ళు గారస్తానే, “పాపంజేసిన జన్మరా నాది. తెలిసీ కొన్ని చెప్పలేను. అయితే వొకమాటమాత్రం నిజం. ఆబిడ్డ భూమ్మీద పుట్టాల్సింది గాదు. నాకిచ్చినమాటను నిలబెట్టుకునింది. నేనూ ఆమె కిచ్చినమాటను దాటలేదు” అనినాడు.

కొడుకుపోయిన దుఃఖంలో ఆయన చాన్నాళ్ళు బతకలేదు. రెండేండ్లు తిరక్కుండానే ఆయనా మన్నయిపోయినాడు. యింతమందిని కడుపులోబెట్టుకున్నాక ఆయిల్లు మాత్రం యేమి పైకొస్తాది? ఆస్తులూ వ్యాపారాలూ అన్నీ కూలిపొయినాయి. ఆ పాపంలో నాక్కూడా భాగం వుండాదేమో! నేనూ నష్టాల్లో మునిగిపొయినాను. లేకపోతే తెలిసి తెలిసీ ఆ రంగారెడ్డి కొడుక్కే నిన్నిచ్చి పెండ్లిచేసి, నిన్నీ కొంపలోకే తోసుంటానా చెప్పు?


“ఆమాట చెప్తా మా నాయనకూడా యేడ్చేసినాడ్రా సిద్దూ!” అని చెప్పినాక మా అవ్వ పెద్దగా నిట్టూర్చింది.

చూస్తావుండగానే నా మూడువారాల లీవు మూడు నిముషాల మాదిరిగా అయిపోయింది. మా అన్ననూ మానాయన్నూ తప్పించుకొని తిరగలేక నా తలప్రాణం తోకకొచ్చింది. చెన్నయిలో యిల్లు అమ్మేపని వొకవారం లేటుగా జరిగింది. ఆయనమాటినివుంటే యింకా చానా లాభం వచ్చి వుండేదని డాక్టర్ వాసన్ అంగలార్చినాడు. కానీ రిజిష్ట్రేషనయినాక, అమృత రెండు చేతులూ పట్టుకొని “ఇక్కడ మీ జేజమ్మ వుందనే అనుకోమ్మా! ఇండియాకెప్పుడొచ్చినా మా యింటికొచ్చిపో” అని కండ్లల్లో నీళ్ళు బెట్టుకున్నాడు.

రిజిస్ట్రేషనయినాక, అమృత ఢిల్లీకెళ్ళి వాళ్ళ నాన్నమ్మతో యింకో రెండురోజులు గడిపి, ఎయిర్‌పోర్టులో నన్ను కలుసుకునింది.

సెక్యూరిటీ చెక్ అయినాక, లాంజ్‌లో కూర్చున్నప్పుడు, “ఆ ఫోటోను క్లీన్ చేయించావా సిద్దూ?” అని అమృత అడిగింది అదోరకంగా మూల్గతా.

“అయ్యయ్యో సారీ అమృతా! చిత్తూరులో స్టూడియోవాడు శుభ్రం చేసేదానికేదో ఆసిడ్ పోసినాడు. దాంతో ఫొటోలో మిగిలుండే ఆకారాలుగూడా కరిగిపోయినాయి. అసలు వాడ్ని నమ్మిందే నా తప్పు” అన్నాను తడబడతా.

ఆమె కోపంతో గుడ్లురిమి చూసింది. నమిలిమింగేసేటట్టుగా పళ్ళు కొరికింది. చివరకు బోరున యేడవబోయింది. “నా ఫామిలీ ట్రీ పట్టుకునేటందుకు మిగిలిన వొకే వొక ఫ్రూఫ్ అది. మా జేజమ్మ ఫోటో అయితే వుందిగానీ మా ముత్తాత ఫోటో ఇంకొకటైనా లేదు. ఎంత వాల్యుబుల్ ఫోటో అది?” అని మొరిసిచూసింది.

నేను తలతిప్పుకుని ముఖం ముడుచుకున్నాను. నేనాఫోటోను తగలబెట్టేయాలనే అనుకున్నాను. అయితే యెందుకో ధైర్యం చాల్లేదు. దానికోసరమని వొక లాకర్ వోపెన్ చేసి, దాంట్లో దాచేసినాను. దాన్ని నూరేండ్లు దాటినా యెవరూ తీసి చూడలేరు.

కొన్ని రహస్యాల్నీ సమాచారాలనూ రేకులపైన రాసి, లోహపుగొట్టాల్లో పెట్టి, వాటిని లోతైన బావుల్లో గానీ సముద్రాల్లో గానీ దాచిపెడతారని విన్నాను. వాటిని కాలనాళికలంటారట! రాబోయేతరాల్లో యెవురో యెప్పుడో వాటిని చూసి చరిత్రను తెలుసుకోవాలని ఆ పని చేస్తారట!

లాకర్లో దాచేసి వచ్చిన తర్వాత, దాన్ని కాల్చేసి వుంటేనే మంచిదని నేను చాలాసార్లు పశ్చాత్తాప పడినాను. అయితే వొక పెద్దావిడ చేసిన పని తప్పని చెప్పడానికి నేనెవరిననే ప్రశ్న యెదురయ్యింది. కానీ అలా దాన్ని దాచేయడం ద్వారా చాలామందికి మేలు జరిగిందని నన్ను నేను సముదాయించుకున్నాను.

అలాంటి రహస్యాల్ని గుండెల్లో పెట్టుకుని బీగాలేసుకున్న మనుషుల్ని కూడా కాలనాళికలనే అనుకోవాలిగదా అనిపించింది. నాలాగా కాలనాళికలైపోయిన మనుషులు యింకా యీలోకంలో యెక్కడెక్కడ దాక్కుని వున్నారో, యెందరు కాలమైపోయినారో యెవరికి తెలుసు?

బోర్డింగ్ ఆరంభమైపోయినట్టుంది. అమృత లేచి నిలబడింది.