నిశిరాతిరి

ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదు. ఆశించినది పూర్తిగా నెరవేరలేదు. చుట్టూ వున్నవారు తప్పు పట్టకపోయినా అది వారి మంచితనం అనిపిస్తుంది. తాను శాసించి ప్రతిపాదించిన నిర్ణయాలు జీవితాలను చెల్లాచెదరు చేసేశాయి. దూరమైనవారు ఎలాగూ దూరమైనారు. అందుబాటులో వుండికూడా కన్నకొడుకు దూరంగా మసులుతున్నాడు. కంటినిండా చూసుకునే అవకాశం లేకుండా చేశాడు. రాజ్యపాలన బాధ్యతలయితే నిర్వహిస్తున్నాడు – కానీ, ఆమె కోరుకున్నట్లు రాజు కాడు. పొలిమేరలు దాటి నగరంలోకి అడుగుపెట్టనని తీర్మానించుకున్నాడు. చేసిన తప్పు లోలోన దహించివేస్తోంది. కంటిపైకి కునుకు రాదు.

ఇక అన్నదమ్ములు నలుగురిలో ఇంటిపట్టున వున్నవాడు ఒక్కడే! వైద్యులను సంప్రదించి చిన్నతల్లి కోసం ఔషధం తీసుకుని వచ్చేనాటికి తొలిజామైంది. చిన్నవదిన అతడి చేతినుండి ఔషధం అందుకుంది. “అన్ని పనులకి ఒక్కడివే అయిపోయావు. చెల్లి ఎదురుచూస్తుంటుంది. వెళ్ళి విశ్రాంతి తీసుకో.”

ఇంటనున్న చిన్నా పెద్దా అందరి అవసరాలు చూస్తూ ఆమె తనని మించిన బాధ్యతలు ఒంటిగా నిర్వహించుకొస్తోందని అతడికి తెలుసు. ఆమాటే అందామని ఊరుకున్నాడు. వారి మధ్య అలాంటి సంభాషణ ఇంతకుముందు జరిగిందే.


నిద్ర మధ్యలో మెలుకువ ఒచ్చింది ఆమెకి. కుడివైపుకి తిరిగి చూసింది. పక్కన పడుకునివున్న అతడి కళ్ళు తెరచి వున్న గవాక్షంగుండా కనిపించని దూరాలలోకి చూస్తున్నాయి. దగ్గరగా జరిగింది. “ఏమిటా ఆలోచనలు నిద్రవేళ?” అంటూ అతడి చెక్కిలిపైన చేతిని వేసి తన వైపుకి తిప్పుకుంది. ఆ రాత్రివేళ ఒకానొక అడవిలో ఓ పర్ణశాలకి పహారా కాస్తూన్న తన కవల సోదరుడు ఆలోచనలనిండా నిండివున్నాడని అతడు చెప్పలేదు. ఆమెకేసి ఒత్తిగిల్లుతూ ఏమీలేదన్నట్లు నవ్వాడు.


మలిజాము చీకటి. చంద్రుడు లేని ఆకాశం. తనయుడు లేని రాజ్యం. మిద్దెపైకి చేరిందే కానీ ఆమెది సారించలేని చూపు. అయినా చూపు అందుకోని దూరాలు ఊహలకు అడ్డురావు కదా! రాజసౌధం నుండి పర్ణశాలకి ఆ నిశిరాతిరి ఊహల వంతెనేదో వేసి అక్కడివారిని ఆమెకు దగ్గరచేస్తోంది. కన్నకొడుకు విషయం తెలిసిందే. విలువలతో అల్లుకున్న వ్యక్తిత్వం. ఆపైన నిర్ణయాలకు కట్టుబడ్డ వ్యక్తి. గురుకులంలోను, రాజర్షితో కలిసి వెళ్ళినప్పుడూ కష్టం నష్టం ఎదురుకున్నవాడే. కోడలి పైనే ఆమెకి మరింత బెంగ. అపురూపంగా పెరిగిన రాజకుమారి. ఆ అడవిలో కనీస సౌకర్యాలు కూడా లేక గడపవలసిన స్థితి.

“అక్కా రండి! నిద్రించే వేళలో మేలుకుని వున్నారు. ఆరోగ్యం పాడవుతుంది కదా!” అంటూ హెచ్చరిక చేస్తూ వచ్చింది ఆమె రెండో తోటికోడలు.

వారిద్దరూ వెనుకకి తిరిగి వస్తుండగా కనిపించింది ఉత్తర దిక్కు మిద్దెపైన ఒంటరిగా ఆమె. ఇద్దరి చూపులు ఆమె చూస్తున్న దిశకేసి తిరిగాయి. నగరానికి ఆవల నందిగ్రామం. దూరాన వున్న ఆ కుటీరంలో దీపాలు ఇంకా వెలుగుతున్నాయి. అక్కడ అతడు రాచరికపు పనులు ముగించి దీపాలు ఆర్పితే కానీ ఇక్కడ ఈమె వెళ్ళి నిద్రించదు. అది భవనంలో అందరికీ తెలిసిన విషయమే!


వయసు పైబడినవారు, అనారోగ్యంతో తీసుకునేవారు, చంటిపిల్లల తల్లితండ్రులు, ఒంటరి జీవులు – ఇష్టంగానో కష్టంగానో నిద్రకి దూరమయిన వారితో ప్రమేయం లేకుండా మలిజాముదాటి కాలం కరుగుతోంది.

భాగ్యాలన్నిటిలోకి ఉత్తమమయిన భాగ్యం – గాఢనిద్ర! రాజా, రైతా, పట్టు పరుపులా, కటిక నేలా అన్న తేడాలు లేవు కనికరించే ఆ దేవికి. సకల చరాచర జగత్తు చీకటిని తోడు తెచ్చుకొని నిద్రించాల్సిన సమయమది.

ఎత్తయిన గోడలు, ఒత్తుగా పెరిగిన చెట్లు పడమటి వైపున వున్న ఆ రాజభవనంలోని విశాలమైన పడకగదిని మరింత అంధకారంలో వుంచాయి. గదికి అవతల తలుపులకు దగ్గరగా చెలులిద్దరు గాఢనిద్రలో మునిగివున్నారు. గదిలో మెత్తని పరుపుల పట్టెమంచం మీద, పైనుండి దిగిన పలుచని తెరల నడుమ ఆమె నిద్రిస్తోంది. ఓరగా ఎడమపక్కకు తిరిగి – ముఖంపైనుండి కుడిచేతిని చాచి కళ్ళని కప్పివేస్తూ శిల్పంవలె నిశ్చలంగావుంది. ఆమె ఆజ్ఞ ప్రకారం పగలు రాత్రి బేధం లేకుండా చెలులు గదిని చీకటి చేసి వుంచుతారు.

చుట్టూ ఎవరూ లేనప్పుడు చెలులు తమలో తాము హాస్యమాడుతుంటారు. పెనిమిటి నిద్రంతా అరువు తెచ్చుకుని మరీ పగలు రాత్రి నిద్రిస్తుందని.

తన ప్రమేయం లేకుండా జరిగిన జరుగుతున్న నాటకం లాంటి జీవితాన్ని విస్మరించే ప్రయత్నంలో ఆమె కేవలం నిద్రని నటిస్తోందా? లేక అందరూ అనుకుంటున్నట్లు పతి త్యజించిన నిద్ర ఆమెకు వరమై నిజంగా నిద్రిస్తోందా?!