జీవితాంతం

ఎవరి అధీనమో తెలియని శ్వాస
మన అధీనమనుకునే మనస్సు

చెట్లకు ఆకుల్లా
వచ్చీపోయే సంపాదన

చీకటిలో వేర్లు
రంధ్రాలలో వెలుగులా
చొచ్చుకు పోతున్న
రోజులు

ధారాళంగా వెలుగు వర్షిస్తున్నా
విస్తరిస్తున్న చీకట్లలో
ఎందరికో వెలగని దీపం
మూగపోతున్న మురళి

విప్పేవరకూ
తెలియని కవరులాగ
బయటపడని గాయం
తెలిశాక పీడించే బాధ

వస్తూ పోతున్న
అన్ని అలల్లానే
ఏ అలైనా
అంతం లేదనుకున్నట్టు
జీవితాంతం


వై. ముకుంద రామారావు

రచయిత వై. ముకుంద రామారావు గురించి:

9 స్వీయ కవిత్వ సంకలనాలు, 14 అనువాద గ్రంథాలు, ఆంగ్లం కన్నడంలో నా కవిత్వ అనువాద పుస్తకాలు, మరో 5 ఇతరాలు వచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం-సాహితీ పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం, అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం మొదలైన అవార్డులు వచ్చాయి. ఆంగ్లం, పోలిష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ, కన్నడం, తమిళం, మలయాళం, ఒడియా, సంతాలీ, మరాఠీల్లోకి ఎన్నో కవితల అనువాదాలు వచ్చాయి.

 ...