అప్రతిహతం

మిణుగురు పాదాలు చిట్లి,
నెత్తుటి దారి ఏర్పడిన చోటు నుంచి
ప్రారంభమైంది నడక!

మొలకంత ప్రాణి
సమస్త భూమండలాన్ని
కాంతిమయం చేస్తుందని
నమ్మిక!

ఇంత శోభను వెదజల్లడానికి,
ఎంత చీకటిని పీల్చుకోవాలో
ఎన్ని విషవాయువుల
ప్రభావాన్ని తట్టుకోవాలో
మిణుగురులు!

మిణుగుర్లతో మిణుగుర్లు,
వెలుతురు అనుభవాలను పంచుకుంటూ,
మొలకలుగా నాటుకుంటూ,
పోతాయి!

వెలుగు తీగలతో
కొత్త బంధాలను అల్లుకుంటూ
చీకటి తెరలను కాల్చి బూడిద చేస్తాయి!

మనకైన గాయాల మీద ఉషస్సును
మలాములా పూసి,
గాయం మానిందని చెప్పేలోగా
అరణ్యంపై పరుచుకున్న
సాయంకాలం లాంటి నవ్వుని ఒదిలి వెళ్ళిపోతాయి!

మార్పు మార్గం సులువైందెపుడనీ?
ఆగనిపోరులో నడక
గాయమయమై తీరుతుందనే ఎరుకతో
కొనసాగుతాయి!
కొన్నెత్తుటి కలలను రాల్చుకుంటూ పోతాయి!

మరో ప్రపంచం
నిర్మించే‌పని సుదీర్ఘమైనదని
మిణుగుర్లకు తెలియదా ఏమి?
అవి రగల్చబోయేది
శూన్యదీపాలని తెలియదా ఏమి?

చైతన్య దీప్తి
వాటి వ్యక్తిత్వంలో సమాగమం!
అవి నిర్మించబోయేది
యశోరాజ్యం!

వాటి కదలిక
మరణవసంతం
దేహాన్నావరించే దాకా
అప్రతిహతం!