దర్శనాల వేళ

పదానికి అర్థాన్ని
అందిద్దామని అనుకుంటావు
పదమే అపరిచితం
అర్థం పరిణామక్రమంలో
ఆఖరిది

గుదిగుచ్చి దండలా వాక్యం
పదార్థం ఇప్పుడు వాచ్యమయ్యింది

శబ్దం ఆకాశం

ఉచ్ఛ్వాస నిశ్వాసల
చక్ర భ్రమణంలో
నిశ్శబ్దం అవతల గట్టు

అబద్ధానికి
బూజులా వేలాడుతూ
నిజం

భూజాల భుజంమీద
వాలిన పక్షుల
కాళ్ళ సందుల్లోంచి
జారిన విత్తనాలే
జ్ఞానం

ఎక్కడి నుంచి
ఎవరు వచ్చేరు?
ఎవరు ఎక్కడ
సేద దీరేరు?

రహస్తీరాలు తరించే ముందు
సరస్తీరాలు దాటి రావాలి

అంకెల లెక్క కాదు
అస్తి నాస్తి విచికిత్స

ప్రమాణాలు తెలుసుకున్నాక
ప్రణామం చెయ్యి
ప్రాణాయామం ఎప్పుడైనా
చెయ్యచ్చు

ముందే అంటుకున్న
కపిల వర్ణంలో
సోక్రటీసు
ప్రశ్నల పరంపరే

తత్వ ప్రదక్షిణలో
సాంఖ్యం మొదటి మలుపు
చార్వాకుల దారి
మరో మలుపు

మలుపులు తిరుగుతూ
జ్ఞాన చక్షువుల్ని
విచ్చుకోవడమే
ఫలశ్రుతి