డెబ్భై ఎనభై దశకాలలో పెరిగిన తెలుగువారందరికీ మెకాలే విద్యావిధానం నశించాలి అన్న ఉద్యమ నినాదం, గోడ మీది రాతల్లో ఒకటిగా గుర్తుండే ఉంటుంది. ఆ విధానం నశించిందో లేదో కాని, ఆ తర్వాత ప్రభుత్వాలు విద్యావిధానాలను అంతకంతకూ నిర్వీర్యం చేస్తూ వచ్చాయి. అలా ఏర్పరచుకున్న ఈనాటి విద్యావిధానం లోని మంచి ఏమిటో చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరిప్పుడు. గత మూడు దశాబ్దాలుగా హ్యుమానిటీస్ లేదా లిబరల్ ఆర్ట్స్ అని పిలవబడే భాషలు, కళలు, సాహిత్యం, సంస్కృతి వంటివి పాఠ్యాంశాలుగా క్రమేణా కనుమరుగవవుతూ వచ్చాయి. వీటిని ప్రోత్సహించడం అటుంచి ఇవి ఎందుకు ముఖ్యమో, ఎందుకు చదవాలో చెప్పేవారు కూడా ఇప్పుడు ఎవరూ లేరు. ఏదో ఒక రకంగా కనీసార్హతగా డిగ్రీ ఉంటే చాలు అన్న అప్పటి ఆలోచన నుండి రానురానూ విద్య అన్నది కేవలం ఏదో ఒక రకంగా ఉద్యోగం సంపాదించడానికే అన్న ఇప్పటి ధోరణి దాకా తెలుగురాష్ట్రాలలో విద్య ఒక దుస్థితిలోకి నెట్టబడటానికి ప్రజలూ ప్రభుత్వాలూ ఎవరి పాత్ర వాళ్ళు శక్తిమేరకు నిర్వహించారు. చివరికి విశ్వవిద్యాలయాలలో కూడా కళలు, సాహిత్యం వంటి విభాగాలలో బోధన, పరిశోధనల నాణ్యత ప్రశ్నార్థకంగానే ఉంది. విద్య, విద్యార్థుల లక్ష్యం, విస్తీర్ణం ఎంతో సంకుచితమైపోయి ఉన్నాయి. పాఠశాల విద్యార్థులు తెలుగుని మార్కుల భాషగానే తప్ప జీవభాషగా, తమ ఆలోచనలను వ్యక్తపరుచుకునే భాషగా, తమ ఆలోచనలను, అనుభవాలను బలపరుచుకునే, సరిచూసుకునే భాషగా చూస్తున్నారా అన్నది కొన్ని దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోని సమస్య. జీవితం మొత్తాన్నీ ఆర్జనతో ముడివేసుకుని తిరిగే తరానికి స్వేచ్చగా ఆలోచించడానికి కూడా పరాయి భాష అవసరం తప్పదు. తెలుగే ఉపాధిగా ఉన్న కొద్ది రంగాలు తప్ప, మిగతా సమాజమంతా మెల్లమెల్లగా తెలుగుకి దూరం జరిగిపోయిందనడం నిర్వివాదాంశం. ఉపాధి చూపించలేనివన్నీ అనవసరమైనవే అన్న వికృత భావనలను మనం వ్యవస్థలో చొప్పించి చాలా కాలమైంది కాబట్టి, యువతలో తెలుగు పట్ల ఆసక్తి లేదేమిటని ఇప్పుడు వాపోవడంలో అర్థం లేదు. ఎందుకు చదవాలి అన్న దానికి జవాబు చూపించకుండా తెలుగు చదవాలని పిల్లలే ముందుకు రావాలనుకోవడంలో ఉద్వేగమే తప్ప తార్కికత లేదు. అందువల్ల, ఇది నిజంగా ఒక సమస్య అని అర్థమైతే, నమ్మితే, సాహిత్యకారులు ప్రజలతో మమేకమై ప్రభుత్వ విద్యాశాఖలపై ఒత్తిడి తేవాలి. హ్యుమానిటీస్ ప్రాముఖ్యతను వారికి తెలియజేయాలి. వాటిని ప్రాథమిక పాఠశాలల స్థాయినుండి కాకున్నా కనీసం ఉన్నత పాఠశాలల పాఠ్యాంశాలలో భాగం చేయడానికి ప్రయత్నించాలి. ఇటీవల, ప్రస్తుత విద్యావ్యవస్థ తొమ్మిదో తరగతిలో దాదాపు పద్నాలుగు మంది కవుల కవితలని, అలాగే పద్నాలుగు మంది రచయితల కథలని తెలుగు పాఠ్యాంశాలుగా చేర్చారని, ఉపాధ్యాయులు వాటిని పిల్లలతో చదివించి అర్థవంతంగా వివరించవలసి ఉంటుందని తెలియవచ్చింది. ఎవరి ప్రయత్న ఫలితమైనా ఇది నిస్సంకోచంగా స్వాగతించవలసిన గొప్ప అడుగు. కనీసం ఉపవాచకాలైనా సమకాలీన కథలతో కవితలతో రావడమంటే, పిల్లలని మళ్ళీ సాహిత్య ప్రపంచంలోకి ఆహ్వానించినట్టు. భాషని బతికించుకునే పద్ధతి ఇదే. మెల్లమెల్లగా దారులు విశాలమయ్యే వీలు ఇదే. ఉద్యమాలు, పుస్తక మహోత్సవాలు, పోటీలు, చర్చలు, వీటన్నిటి కన్నా బలంగా తేలిగ్గా పిల్లలను చేరగలిగింది పాఠ్య పుస్తకాలే. ఈ తొలి అడుగు ఈ తరాన్ని చాలా దూరం తీసుకెళ్తుంది. ఎందుకంటే సాహిత్యం ఒక అలవాటుగానో అభిరుచిగానో కాదు, సంస్కారంగా అందుకోగల వయసులో వాళ్ళని చేరగలుగుతున్నాం కనుక. పెద్దయి వారు పుస్తకాభిమానులు అయినా కాకున్నా సాహిత్యంతో పరిచయమయినా ఏర్పడుతుంది, కొంతయినా చదవడం విశ్లేషించడం అలవాటు అవుతుంది కనుక. ఆపైన మిగిలింది ఇటువంటి ‘పనికిమాలిన’ చదువులు చెప్తారా అని దండెత్తే తల్లిదండ్రులనుండి పిల్లలను, పాఠశాలలను, ఈ రకమైన ప్రయత్నాలనూ కాపాడుకోవడం. ఎందుకంటే ఇలా సాంకేతికత, కళాత్మకత రెండూ కలగలసిన సమగ్రవిద్యావిధానం భావితరాలకు కేవలం ఒక పనిముట్టు వాడడం నేర్పించి ఆగిపోదు. విచక్షణ నేర్పి జీవితాన్ని ఎన్నో రకాలుగా తీర్చుదిద్దుకోటానికి వారికి దారి చూపిస్తుంది. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరత్వానికి తర్ఫీదునిస్తుంది. సాహిత్యం ఒక్కటే కాదు, మన సమాజం మెరుగుపడాలన్నా ఈ సమగ్రవిద్యావిధానం ఒక్కటే మార్గం.