ప్రపంచమే ఒక కథనరంగం

అన్నీ ఇంతకు ముందు చదివినవే అయినా ఒక్కసారిగా కళ్ళముందు కనపడితే ఆగలేకపోయాను. 

కథ తర్వాత కథ – సాగిపోతున్నాయి. జలదరింపులు. అక్షరాలు కూర్చిన భాస్కర్‌కు ఫోన్ చేద్దామని ప్రతిసారీ అనిపించడం… కథలన్నీ చదివాక చేద్దాం అని ఆగడం… పుస్తకం మధ్యలో అహవి ‘నాలాగానా?’ అని అడిగింది. ‘నీలాగే’ అని చెప్పింది అఖిల. 

ఇక ఆపుకోలేకపోయాను. ఫోను కలిపాను. నాలుగు నిమిషాలు. 


ఆహవి అఖిల కూతురు. ఆహవిని కడుపున మోస్తూ నాలుగు నెలల చూలాలిగా అఖిల కెనడాకు శరణుకోరి వచ్చింది.
 


ప్రతులకు: అమెజాన్.ఇన్

ఆహవి ఇప్పుడు బాగా ఊహ తెలిసిన పిల్ల. తనకు అమ్మే ప్రపంచం. అయినా స్కూల్‌లో పిల్లలు ‘మీ నాన్నేడీ?’ అని ఏడిపించినప్పుడల్లా ఇంటికొచ్చి అమ్మ మీద విరుచుకుపడుతూ ఉంటుంది. తల్లి ఒకమాట అంటే తాను నాలుగు మాటలు అంటించగల నేర్పు ఆహవిది. 

సిల్వియా అఖిలకు దగ్గరి స్నేహితురాలు. కొలంబోలో జర్నలిస్టు. 

అతణ్ణి వెతికిపెట్టమంటుంది అఖిల. రెణ్ణెల్లలో ఆచూకీ కనిపెట్టి ‘వెంటనే రా. మళ్ళీ ఈ అవకాశం రాదు’ అని అఖిలను తొందరపెడుతుంది సిల్వియా. ఆహవితో కలిసి కొలంబోలో విమానం దిగుతుంది అఖిల. సిఱిబాలను వెదుక్కుంటూ ఆటోలో గంట ప్రయాణం. అతను ఇంట్లో లేడు. భార్య, కూతురు అసుందా కనిపించారు. ఆహవి అసుందా ఒకరినొకరు ‘ఎంత వింతా’ అన్నట్టుగా చూసుకున్నారు.

సిఱిబాల వచ్చాడు. నిశ్చేష్టుడై చూశాడు. 

కూడబలుక్కుని సింహళభాషలో ముందే అనుకున్న పొడిపొడి మాటలు చెప్పింది అఖిల: 1997. యుద్ధం రోజులు. నువ్వూ నీ జతగాడూ మిలటరీ వాహనంలో వచ్చి మా ఇంటి తలుపులు విరగ్గొట్టారు. తుపాకీతో మా అమ్మ తల పగలకొట్టారు… ఇది నీ కూతురు. తనకు తండ్రిని చూపించాలని తీసుకువచ్చాను. 

‘ఎవరదీ?’ అడిగింది తిరిగివెళ్ళేప్పుడు ఆహవి. 

‘మీ నాన్న. ఆ మొహం గుర్తు పెట్టుకో. మళ్ళీ చూడబోవు.’

‘మరి అసుందా? వాళ్ళ అమ్మానాన్నా ఎవరూ?’

‘ఈరోజు నుంచీ అసుందా ఒంటరితల్లి కూతురు.’

‘నాలాగానా?’

‘నీలాగే.’


శ్రీలంక మూలాల ఎనభైనాలుగేళ్ళ అప్పాదురై ముత్తులింగం గత యాభై యేళ్ళుగా తమిళంలో కథలు రాస్తున్నారు. 1972లో శ్రీలంక వొదిలిపెట్టి ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఎన్నోచోట్ల పనిచేశారు. వరల్డ్ బ్యాంక్‌లోను, ఐక్యరాజ్యసమితి లోనూ పని చేశారు. ప్రస్తుత నివాసం కెనడాలో. శ్రీలంక తన కథలకు ముఖ్యభూమిక అయినా ఆయన కథలకు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, గ్రీస్ – ప్రపంచమే ఆయన కథనరంగం. 

తమిళ మాధ్యమంలో చదువుకున్న నలభైరెండేళ్ళ తెలుగు మూలాల అవినేని భాస్కర్ తన ఇరవైరెండో యేట తెలుగు భాషకు చేరువయ్యారు. 2013నుంచి తెలుగు అనువాదాలు చేస్తున్నారు. గత నాలుగేళ్ళుగా ఆయన అనువదించిన ముత్తులింగంగారి పదిహేను కథల సంపుటి ఐదుకాళ్ళ మనిషి.


 
ఇంతకీ ఎవరీ ఐదుకాళ్ళ మనిషీ?!

గ్రీస్ మూలాల కెనడావాసి హెలెన్ వాళ్ళ నాన్న. 

‘నీ చేతను నా చేతను…’ అంటూ కర్ణుడి మరణానికి ఆరుగురు కారకులు అని చెప్పే తిక్కన పద్యం ఒకటి ఉంది. ఈ హెలెన్ విషయంలోనూ జీవితమంతా నిరాశలు, దగానే. ఆశాభంగాలే. ప్రాచీన గ్రీక్ సాహిత్యమంటేనూ, చదువు అంటేనూ ఇష్టపడే పదమూడేళ్ళ హెలెన్‌ను వాళ్ళ కెనడా పిన్ని ‘చదువు చెప్పిస్తా, రా!’ అని నమ్మకంగా తీసుకెళ్ళి అచ్చమైన పనిమనిషిగా మారుస్తుంది. తన మీద తనకు జాలి కలిగే పరిస్థితులకు ఎదురుతిరిగి, బయటపడి, స్వంతంగా జీవించడం ఆరంభించిన హెలెన్‌కు పెళ్ళి అవుతుంది. కొడుకు పుట్టాక భర్త మాయమయిపోతాడు. కొడుకును పెద్ద చేశాక ఏదో కుంటిసాకుతో ఆ కొడుకూ పెళ్ళి చేసుకొని ఆమెకు అందనంత దూరం వెళ్ళిపోతాడు. ‘చీపురుకర్రతో నిలుచున్నప్పుడు కూడా నేను అందంగా ఉంటాను’ అన్న ఎరుక ఉన్న హెలెన్, ఎప్పుడైనా ఊడిపోయే జానిటర్ పని జీవితాంతం చేస్తూనే ఉంటుంది. తిరిగొచ్చిన భర్త ఐదేళ్ళుగా మంచం పట్టి ఉండటం, ఈమే సాకవలసి రావడం – ఆమెకు జరుగుతున్న మరో దగా…

కర్ణుడికీ హెలెన్‌కూ ఒక్కటే తేడా. ఆ ఆరుగురి పుణ్యమా అని ఆయన మరణిస్తే, ఎన్ని దగాలు జరిగినా హెలెన్ జీవితాన్ని జయించగలుగుతుంది. అందమైన నవ్వుని చెక్కు చెదరనివ్వదు. దగాలు మోసాలను క్షమించడం ద్వారా అధిగమిస్తుంది. ఆమె జీవితంలో ఒకే ఒక స్ఫూర్తి: ఒక్క కాలే ఉన్నా నిద్ర పోతున్నప్పుడు తప్ప మిగిలిన సమయమంతా గుర్రం మీదే ఉండి ఐదుకాళ్ళ మనిషి అని ఊరివాళ్ళ హేళనాపూర్వకమైన బిరుదు పొందిన, నిర్విరామంగా కాయకష్టం చేసే హెలెన్‌వాళ్ళ నాన్న. 

‘ఈమె దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి’ అంటూ కథ ముగుస్తుంది. మనకూ అనిపిస్తుంది. 

ఒక్కమాట: గ్రీస్ దేశపు దరిదాపులకు కూడా ఏనాడూ వెళ్ళని నాకు ఇప్పటిదాకా గ్రీస్ అంటే ప్రపంచ విజేత అలెగ్జాండరే. ఈ కథ చదివాక, ఇక ముందుముందు, గ్రీస్ అంటే జీవితాన్ని గెలిచిన యోధ హెలెన్, మరణానంతరం కూడా ఆమెకు స్ఫూర్తిగా నిలిచిన ఆ ఐదుకాళ్ళ మనిషి గుర్తొచ్చి తీరతారు. 


తొంభైనాలుగు పేజీల నిడివిలో పదిహేను కథలు. సగటున ఒకో కథ ఆరుపేజీలు.

అలవోక కథనం. బరువు లేనట్టనిపించే భాష. తళుకుబెళుకుల ప్రస్తక్తే లేదు. అసలు చెపుతున్నది కథే కాదు అన్నట్టుగా సాగుతాయి కథలు. మళ్ళా అందులోనే హాస్యం, వ్యంగ్యం, చురకలు, వేదన, గాంభీర్యం, విషాదం – హఠాత్తుగా మనసును మెలిపెట్టే బతుకు వాస్తవాలు – మనమీద వేసే బలమైన ముద్ర.

‘ఖాళీ గోనెసంచీ నిటారుగా నిల్చోలేదు’ అంటుంది పదిరోజులు అనే కథ. ‘ఆత్మాభిమానానికి ఆస్కారం లేనపుడు నడుము ఎప్పుడూ వంగే కనపడుతుంది’ అనీ అంటుంది. ఏడాదిలో మూడొందల అరవైఐదు రోజులూ ఇరవై ఏళ్ళపాటు ఇస్లామాబాద్‌లో గొప్పోళ్ళ ఇళ్ళ మధ్యన బడ్డీకొట్టు పెట్టుకొని రోజుకు పధ్నాలుగు గంటలు పనిచేసే మనిషి నవాజ్‌. ఆ వీధిలోని శ్రీమంతుని ఇంట పెళ్ళి వేడుకల పుణ్యమా అని అతని కాలెండర్‌లో పదిరోజులు చిరిగిపోయి కనిపిస్తాయి. బడ్డీకొట్టు విరిగిపోయి కనిపిస్తుంది. అయినా గోనెసంచీకి, వంగిన నడుముకీ చీమైనా కుట్టదు. కాలెండరు చింపిన, బడ్డీ విరక్కొట్టిన మృగంకేసి ఎముకల్లేని జంతువులా పాకి వెళతాడు నవాజ్. 

బడుగు జీవుల నిత్యజీవిత విషాదాన్ని ఎంతో బలంగా ఆవిష్కరించిన కథ పదిరోజులు. 


నవాజ్‌ది ఒక బాణీ విషాదమయితే పూలగుత్తి ఇచ్చిన అమ్మాయి సైరాది నిర్వచనానికి అందని జీవనసమరం.
 
సంప్రదాయ సంస్కృతిలో కనిపించని సంకెళ్ళుంటాయి. ఆడమనిషికయితే ఇక చెప్పక్కర్లేదు. ‘ఎప్పుడూ నవ్వు చెదరని, ఉక్కిరిబిక్కిరి చేసే అందం ఉన్న’ సైరా లాంటి యువతి అయితే?! హిజాబ్ ధరించని, బుర్ఖా వేసుకోని, సంకోచం లేకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడే, ఆత్మవిశ్వాసం కోల్పోని, రెండుసార్లు పెళ్ళి చేసుకొని విడిపోయిన మహిళ అయితే?! ఎన్ని అర్హతలున్నా, ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా, ఎన్ని ఇంటర్‌వ్యూలు సమర్థవంతంగా చేసినా కనీసం డ్రైవరు ఉద్యోగం కూడా రాదు. ఆ ఇంటర్‌వ్యూ బోర్డుల్లో ఉన్న, ఈ కథ చెప్పే సహృదయుడు కూడా ఈ విషయంలో నిస్సహాయుడే.

కానీ అతను బదిలీ అయి వెళ్ళినప్పుడు ఆమె పూలగుత్తి పంపుతుంది. తనకు ఉద్యోగం ఇప్పించలేకపోయినా తన విషయంలో ఆయన మానవీయంగా వ్యవహరించాడన్న ఎరుక ఆమెకు ఉంది. అంచేత ‘మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోను’ అనే వర్ణసంకేతంతో లేత ఎరుపు రంగు కార్నేషన్ పూలు పంపుతుంది సైరా.

ఎందుకో ఈ కథ చదివినప్పుడు నాకు ‘మనిషిని ఓడించగలం కాని ధ్వంసం చేయలేం’ అన్న మాట గుర్తొచ్చింది. 


ముందే చెప్పుకున్నట్టు ఈ కథల్లో మనిషి, అతని జీవనపోరాటం, విధ్వంసాల మధ్యనయినా బతకాలన్న ఆరాటం, ఆ ఆరాటపోరాటాల మధ్యనే స్నేహాలు, ఆత్మీయతలు, ఎల్లలు ఎరుగని ప్రేమలు, మానవీయ స్పందనలు – అవును ఎల్లలు ఎరగని కథలు ఇవి. శ్రీలంక నుంచి కెనడా దాకా, ఆఫ్రికా నుంచి అమెరికా దాకా, గ్రీస్ నుంచి భారతదేశం దాకా – ఈ కథల రంగస్థలాల్లో ప్రపంచమంత వైవిధ్యం. వేదనల్లో అనాది మానవజాతికి చెందిన సారూప్యం. 

అన్నట్టు, దేశాలూ రాజ్యాల ఎల్లలు దాటి రాసిన కథ కూడా ఈ సంపుటిలో ఒకటుంది. 

జుట్టుపన్ను, పెళ్ళిపన్ను లాంటివి ప్రపంచానికి పరిచయమై శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ నీటిపన్ను, డ్రైనేజి పన్ను అంటే మనమేంటో అమాయకంగా ఉలికిపడుతూ ఉంటాం. కానీ ‘రాజ్యం’ తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటుంది. కోశాగారంలో ధనముంటేనే కదా బండి నడిచేది! అందుకోసం నిత్యనూతన మార్గాలు వెతకడంలో తప్పేముందీ?!

అయినా రచయితకు ఆ రాజ్యపు సృజనాత్మకత చూస్తే ఎందుకో వెటకారం. మనిషి మనుగడకు గురుత్వాకర్షణ పట్టుకొమ్మ. దానికి పన్ను చెల్లించాలి కదా; బరువెక్కువున్న వాళ్ళు ఎక్కువ చెల్లించాలి కదా – చికాకు పడతాడెందుకో రచయిత! చిరాకుపడినా పన్ను కడతాడు. ఆ పన్నూ అయినాక ఏడాదికి తొమ్మిదికోట్ల పైచిలుకు మైళ్ళు తిప్పి తీసుకువచ్చే భూపరిభ్రమణానికీ ఖర్చు కట్టమంటే ఆ తర్కాన్ని అంగీకరిస్తాడు. అంగీకరించాక ఈయనకీ సృజనాత్మకత నిండిన ఆలోచనలు వస్తాయి. చంద్రుని వెన్నెలకు, తారల మిణుకులకూ పన్ను వేస్తే బాగుంటుందని ‘రాజ్యానికి’ సూచిస్తాడు. తక్షణమే అమలు చేస్తుంది రాజ్యం. 

అప్పట్లో ఆర్.కె. నారాయణ్ ఉండేవాడు. ఆయనను మించినవాడు అప్పాదురై ముత్తులింగం. 


ఇంకా ఈ పుస్తకంలో ఎవరెవరున్నారు? ఏమేమున్నాయీ? 

దశాబ్దాల తరబడి అలజడి నిండిన దేశంలో, బాంబుల దాడికి కొడుకులను కోల్పోయిన విషాదంలో ఉండికూడా ఒక సామాన్యమానవుడు అమాయకత్వాన్నీ మంచితనాన్నీ ఒదులుకోకుండా రేపు కోసం ఆశాభావంతో చూడటం టోరాబోరా వంటమనిషి కథలో కనిపిస్తుంది.


ప్రతులకు: అమెజాన్.ఇన్

చక్కగా చెక్కినంత మాత్రాన అది సింహాసనం అవదు. అందులో రాజు కూర్చుంటేనే అది ‘సింహాసనం’ అవుతుంది – అని నమ్మే అటవీ పరిజ్ఞాని సోమబాలా కనిపిస్తాడు.

యుద్ధశిబిరాలలో సూపు కోసం, అందులో ఈరోజు కాకున్నా రేపు అయినా మాంసంముక్క దొరుకుతుందని ఆశపడే చిన్నవయసు అన్నదమ్ములు కనిపిస్తారు. అన్న తనను వదిలేస్తాడేమోనని బెంగపడే తమ్ముడు కనిపిస్తాడు.

రెండు పసిమనసుల మధ్య ఏర్పడిన అనూహ్యమైన స్నేహబంధం, దశాబ్దాలు గడిచినా ఆ కుర్రాడిని వీడని ఆ స్నేహపరిమళం మహారాజుగారి రయిలుబండిలో కనిపిస్తుంది. ‘నా గురించి కథ రాయవూ’ అని అరవై డెబ్భై ఏళ్ళ క్రితం పదేపదే అడిగిన కుముదాన్ని గుర్తు చేస్తుంది.

ఇద్దరు శరణార్థులు పదేపదే రైలులో తటస్థపడడం, శ్రీలంక నుంచి రోమ్ మీదుగా కెనడా చేరిన అందులో ఒక శరణార్థి తన పౌరసత్వం కేసు ఒక కొలిక్కి వచ్చి పౌరుడిగా ప్రమాణం చేస్తోన్న శుభసమయాన అదే పనికోసం వచ్చిన రైలు అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఎప్పట్నించో తనలో గుప్తంగా ఉండిపోయిన ప్రేమను ప్రకటించడం కనిపిస్తుంది. 


ముందే చెప్పుకున్నట్టు ఇవి సరళమైన భాషలో అలవోకగా చెప్పినట్టు అనిపించే కథలు. చివరికొచ్చేసరికి దాదాపు ప్రతి కథా మనసును మెలిపెట్టే మాట నిజమే అయినా మెలోడ్రామా ఏమాత్రం లేని కథలు. కానీ కథల్లోని ప్రతీ మాట, ప్రతీ సందర్భం కథను ఎంతో సమర్థవంతంగా ముందుకు నడుపుతాయి. జాగ్రత్తగా గమనిస్తే కథానిర్మాణం, దానిలో వదిలిన ‘సూచనలు’ విభ్రాంతి కలిగిస్తాయి. 

ఆహవి కథలో అఖిల ఎంతెంతో దూరం వెళ్ళి సిఱిబాలను కలిసి చెప్పవలసిన మాటలు క్లుప్తంగా చెప్తుంది. ఎందుకు వెళ్ళిందీ అంతదూరం? స్థూలదృష్టికి తనమీద పదేళ్ళుగా ఉన్న బరువు, తనలోని కసీ దింపుకోడానికి అనిపిస్తుంది. మరి కూతుర్ని ఎందుకు తీసుకువెళ్ళిందీ? ‘నాన్నేడీ’ అని పదేపదే అడుగుతూ ఉంటుంది కదా, అందుకు – అన్న సమాధానం స్ఫురిస్తుంది. ఈ ప్రశ్నలూ ఆలోచనల నేపథ్యంలో, కొలంబో నుంచి ఆటో ప్రయాణంలో అఖిల ఆహవిల మధ్యన జరిగే గొంగళిపురుగు – సీతాకోకచిలుక సంభాషణ గుర్తొస్తుంది. దానికీ వాళ్ళిద్దరి శ్రీలంక ప్రయాణానికీ లంకె ఉందా అని వెతుకుతాం. ఉన్నట్టనిపిస్తుంది. ఇంకా వెనక్కు వెళ్ళి చూస్తే ఎంతో తెలివిగల ఆహవి పదేపదే పెన్సిళ్ళు పారేసుకోవడం, అది అర్థం కాని అఖిల సైకియాట్రిస్టును సంప్రదించడం, ఆహవి లోపల వెలితి ఉంది. అది పూరించాలి – అని ఆయన చెప్పడం, ఆ వెలితి నాన్న లేని లోటే అని అఖిలకు స్ఫురించడం, అప్పుడు జర్నలిస్టు స్నేహితురాలి సాయంతో సిఱిబాల ఆచూకీ కనిపెట్టడం – ఈ శ్రీలంక ప్రయాణం యావత్తూ ఆహవి కోసమే అని చివరికి మనకు బోధపడుతుంది. ఇంతటి గోప్యతను ఆరేడు పేజీలలో నింపి అనంతవిషాదగాథలను పాఠకుల ముందు పరచడానికి ఎంత పరిశీలన కావాలి! ఎంత అవగాహన కావాలి! అక్షరం మీద, ఆలోచనల మీద ఎంత అధికారం ఉండాలి! అవన్నీ మనకు ఈ కథల్లో కనిపిస్తాయి. 


ఎక్కడో శ్రీలంకలోని విషాదాలు, గ్రీసులోని జీవన కాంక్ష, ఆఫ్ఘనిస్తానులోని అమాయకత్వం, పాకిస్తానులోని ఖాళీ గోనెసంచులు – వాటి గురించి మనది కాని భాషలో కథలు.
 
ఆ కథలను పసిగట్టడం, మూలభాష లోని వడీ బిగువూ తగ్గకుండా, పరిమళం చెక్కుచెదరకుండా అనువదించడం – వీటికి కావలసింది సాహిత్యమూ జీవితమూ అంటే ప్రేమ, గురి. మూలభాష మీద అవసరమైనంత మేర పరిచయం. లక్ష్యభాష విషయంలో అక్షరాలతో ఆడుకునే నేర్పు. 

పరిచయమూ నేర్పే కాకుండా ఆ రెండు భాషలూ తన మాతృభాషలే అయిన అరుదైన సౌలభ్యం అవినేని భాస్కర్‌ది. ఆ సౌలభ్యం, అతని నిబద్ధతల ఫలితం – అతి సమర్థవంతమైన అనువాదాలు. కొన్ని కొన్ని పదాలు, పదబంధాలు, వ్యక్తీకరణలూ పాఠకులని ముగ్ధులని చేస్తాయి. ఇంకా ఇంకా కావాలి ఇలాంటి అనుభవాలు అనిపించేలా చేస్తాయి. 

అరుదైన కథలు. అతి చిక్కని అనువాదాలు.

(ఈ వ్యాసం రాయడానికి ఈ కథల గురించి మా ‘సాహితీ వేదిక ఢిల్లీ’ లో జరుపుకున్న చర్చ బాగా ఉపయోగపడింది. సభ్యులకు ధన్యవాదాలు.)