రైలు అమ్మాయి

కెనడాలో వాడికున్న అతిపెద్ద సమస్య చలికాలం, కుప్పలుగా పడే మంచూ! వేసుకున్న కోటు, లోదుస్తులు, షూలూ చవకరకంవి. సబ్‌వే మెట్రో రైల్లో కూడా చలిని ఆపలేకపోతున్నాయవి. ఒంట్లోంచి ఒకటే వణుకు. కానీ లాయర్ దగ్గరకు వెళ్ళక తప్పదు. ఇది మూడోసారి. ఆ లాయర్ వీడి శరణార్థి పౌరసత్వం కేసును వాదిస్తున్నాడు. నిజానికి వాడు తన కథను జరిగింది జరిగినట్టే రాసిచ్చాడు. కానీ లాయర్‌ అది నమ్మశక్యంగా లేదన్నాడు. వాడిచ్చినది చించిపడేసి లాయరే ఒక కొత్త కథ రాశాడు. కేసు గెలవాలంటే ఆధారాలు కావాలి. వాడిచ్చిన కథకి ఆధారాలు సృష్టించడం అసాధ్యం. అందుకని లాయరే తనదగ్గరున్న ఆధారాలకు తగ్గట్టు ఒక కథని తయారుచేశాడు. కోర్ట్ ఇప్పుడు ఆ కథనే కొట్టిపడేసింది. లాయరు అప్పీలు చేద్దామన్నాడు.

వాడు దిగాల్సిన్ స్టేషన్‌ ఇంకా ఇరవై నిముషాలుందనగా ఓ అమ్మాయి ఎక్కింది. ఆమెను చూడగానే వాడి కాళ్ళు కూడా వణకడం మొదలెట్టాయి. గుండె చప్పుడు రైలు శబ్దాన్ని మించింది. కాళ్ళు చలికి వణుకుతున్నాయేమో అనుకున్నాడు ముందు. ఆమెదీ తన ఒంటి రంగే. లెదర్ జాకెట్టు, మంచి వింటరు బూట్లు వేసుకునుంది. ఓసారలా వాడిమీద తన చూపు విసిరి ఎగాదిగా చూసి బ్యాగులోనున్న పుస్తకం తీసుకుని చదువుకోవడంలో మునిగిపోయింది. అదేదో బడి పుస్తకంలా ఉంది. తరువాతి స్టేషన్‌లో రైలు ఆగగానే ఆమె దిగేసింది. వాడి గుండె ఇంకా ఎక్కువ వేగంతో కొట్టుకుందిప్పుడు. వాడు అప్పుడే ఒక నిర్ణయానికొచ్చాడు. కెనడాలో ఆత్మహత్య అంటూ చేసుకోవలసి వస్తే ఆమె ప్రయాణించే అండర్‌గ్రౌండ్ రైలు కిందనే పడాలి.


ఆత్మహత్య గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా వాడికి సోమాలీ గుర్తొస్తాడు. ఇటలీలో మిలానో స్టేషన్‌‌లో వాడిని ఆకలితో చనిపోనివ్వకుండా కాపాడినది సోమాలీనే. సోమాలీ అన్ని దేశాలూ తిరిగినవాడు కాబట్టి ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ఆత్మహత్య శ్రేష్టమైనదన్నట్టుగా కొంత పరిశోధన చేసిపెట్టుకున్నాడు. బెల్జియంలో డ్రగ్స్; ఇటలీలో తుపాకీతో కాల్చుకోవడం; ప్యారిస్ అంటే ఇంకేముంటుందీ? ఈఫిల్ టవర్ ఎక్కి దూకడమే! వెనిస్‌లో ఎలా చచ్చిపోవచ్చని అడిగితే, ‘మనం ప్రయత్నించక్కర్లేదు. ఆ ఊరే నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటుంది!’ అనన్నాడు. సోమాలీకేమైందో ఇప్పుడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోయాడు.

వాడు కొలంబోలో విమానం ఎక్కి ఒంటరిగా రోమ్ వచ్చినప్పుడు ఏ క్షణానైనా మంచు కురవడం మొదలవ్వచ్చన్నట్టు ఉండింది పరిస్థితి. ఆ యేడు వాడెన్నటికీ మరిచిపోలేడు. అది అధ్యక్షుడు ప్రేమదాస హత్య చేయబడిన సంవత్సరం. వీడి పేరుని ప్రతిసారీ మరిచిపోతూండే ఒక మావయ్య అష్టకష్టాలు పడి కొంత డబ్బులు పోగుచేసి వీడిని ఇక్కడికి పంపించాడు. అసలుకైతే ఏజెంట్ చెప్పినట్టు నేరుగా గ్రీస్‌కెళ్ళి అక్కడ షిప్పులో ఉద్యోగంలో చేరిపోవడమే ప్లాను. వినడానికి చాలా సులువుగానే అనిపించింది. వీడి దగ్గర గ్రీస్‌కి దొంగ వీసా ఉండటంవల్ల ఏ సమస్యా లేకుండా షిప్పులో చేరిపోవచ్చనుకున్నాడు. అయితే యూరోప్‌ నుండి బయటపడటానికే మూడేళ్ళు పడుతుందని అప్పుడు వాడికి తెలియలేదు.

గ్రీస్ పొలిమేరల్లోనే వాడిని పట్టుకున్న ఇమిగ్రేషన్ అధికారి తెల్లటి యూనిఫార్మ్‌లో కర్రలా పొడుగ్గా ఉన్నాడు. పాస్‌పోర్ట్ చూడగానే అతని ముఖ కవళికలు మారిపోయాయి. అడవినుండి పట్టుకొచ్చిన జంతువుని చూసినట్టు చూశాడు. అతని దేహానికీ గొంతుకీ సంబంధమే లేదు. ఊహించినదానికంటే పదిరెట్లు పెద్ద గొంతుతో అరిచాడు. ఆ అరుపుకు అతని పెట్టుడు పన్నుకూడా ఊగింది. ‘అంతా గ్రీక్‌లా ఉంది’ అనొక జాతీయం ఉంది. నిజానికి అతని అరుపు అదే. ఏం తిట్టాడో అర్థంకాలేదు. వెనిస్ వెళ్ళే రైలెక్కించారు. సగం ప్రయాణంలో టికెట్ తనిఖీ చేస్తూ కండక్టర్ వచ్చాడు. ఒక్కొక్క తమిళ పదాన్నీ ఇంగ్లీషులోకి మార్చుకుని మొరపెట్టుకున్నాడు, బ్రతిమాలుకున్నాడు. ఆ మనిషి కనికరించలేదు. యాభై డాలర్లు – ఆ రోజుల్లో, ఆ పరిస్థితుల్లో ఊహించలేనంత పెద్ద రొక్కం – ఫైన్ కట్టించుకున్నాడు. అప్పుడనుకున్నాడు- ఎదుటివారికి అర్థమయితేనే భాషతో ప్రయోజనం; అర్థంకానప్పుడు భాష తెలిసుండటమూ తెలియకపోవటమూ ఒకటేనని!

వెనిస్‌ స్టేషన్‌లో దిగినప్పుడు అన్ని బాధల్లో కూడా ఎక్కడో ఒక మూల మనసులో ఆనందం కలగడాన్ని తలచుకుంటే ఆశ్చర్యంగా ఉండేది. ఎప్పుడో తమిళంలో చదివిన షేక్స్‌పియర్ నాటకం మర్చంట్ ఆఫ్ వెనిస్ గుర్తొచ్చి, ఆ నగరాన్ని అబ్బురంగా చూశాడు. 3000 బంగారు నాణాలకు పూచీకత్తు ఇచ్చిన ప్రాణ స్నేహితుడు ఆంటోనియో, బస్సానియో, వాడి ప్రియురాలు పోర్తియా, అందరూ ఓ మారు కళ్ళముందు కనిపించారు. షైలాక్‌ని తలచుకోగానే, వీధుల్లో ఉండే కొట్లు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనిపించి, ఒక షాపు తలుపు తీశాడు. ఢామ్మనే శబ్దంతో తెరుచుకుందది. ఒకామె బయటకి వచ్చి ‘వెళ్ళు వెళ్ళు’ అని చేతులూపుతూ బైటికి తరిమేసింది. వాడు తలుపు హేండిల్ వదిలేసి ఇవతలికి రాగానే మళ్ళీ ఢామ్మన్న శబ్దంతో మూసుకుంది ఆ తలుపు. షైలాక్ ఆ వీధుల్లో ఎన్ని తిట్లూ శాపనార్థాలూ విని ఉంటాడో! వాడికి బాగా నచ్చినవి షైలాక్ మాటలే – ‘నేనొక యూదుణ్ణి. నన్ను పొడిస్తే నాకు రక్తం కారదా? నాకు విషం తినిపిస్తే నాకు మరణం సంభవించదా? నన్ను నవ్విస్తే నాకు నవ్వు రాదా?’. ఇంత అందమైన వెనిస్ ప్రజలకు బయటివాళ్ళంటే ఎందుకంత ద్వేషమో?! ఆ ఊర్లోవారంతా ఇప్పటికీ షేక్స్‌పియర్ వర్ణించినట్టే ఉన్నారు. ఏం మారలేదనిపించింది. మళ్ళీ శాంతాలూచియా స్టేషన్‌కు వెళ్ళి ఒక బెంచి మీద కూర్చున్నాడు. అప్పుడే ఎండుటాకుల గుంపు ఎగిరి వచ్చినట్టు నడిచొచ్చి, పక్కన కూర్చుని, ‘రెఫ్యూజీవా? నీ పేరేంటి?’ అని అడిగాడు సోమాలీ. వాడు ‘మహేశ్’ అన్నాడు. అదీ మొదటి పరిచయం.


మహేశ్‌ది కట్టెల అడితిలో చెక్కలు కోసే పని. ప్రతి రోజూ చేయాల్సిన పనుల జాబితాను పొద్దున్నే ఇచ్చేస్తారు. ఎన్ని పలకలు, ఎంత వెడల్పు, ఎంత పొడవు, ఎంత మందం, ఇలా అన్ని వివరాలూ ఉంటాయి. ముక్కుకు మాస్క్, చేతులకు గ్లౌస్ తొడుక్కుని తెల్లవారిందగ్గర్నుండి సాయంత్రందాకా దుంగలు కొయ్యడమే పని. రోజంతా ఆమె గురించే ఆలోచించుకుంటూ పని చేస్తాడు. ఒకే ఒక్కసారి రైల్లో చూసిన ఆ అమ్మాయి గురించి అలా ఆలోచిస్తూ, తలచుకుంటూ ఉండటంలో ఏమొస్తుంది? ఆమెను గుర్తుచేసుకోవాలని వాడికి అనిపిస్తుంది. అదంతే! పాటలు వింటూ పని చేసేలాంటిదే ఇదీనూ. ఆమె గురించి ఆలోచిస్తూ పని చేస్తుంటే వాడికి అలుపు తెలిసేది కాదు.

తర్వాత కొన్ని రోజులపాటు ప్రతీరోజూ అదే రైల్లో అదే టైముకు ఉద్యోగానికి వెళ్ళాడు. అలా ఒక వారం రోజులు చూశాడు, ఆమె వస్తుందేమోనని. రాలేదు. ఉన్నట్టుండి మళ్ళీ ఒకరోజు ఆమెను చూశాడు. ఎప్పుడు, ఎక్కడ ఎక్కిందో తెలియలేదు. ఆ రోజు ఆమెకు కూర్చోడానికి చోటు దొరకలేదు. కడ్డీని పట్టుకుని నిల్చుని ఉంది. ఏదో అడగరానిది అడిగినట్టు చూశాయి ఆమె కళ్ళు. ఇండియా, శ్రీలంక, గయానా… ఆమెది ఏ దేశమైనా కావచ్చు. కొంచం ముందుకు ఉబ్బిన పెదవులు అమెను మరింత అందంగా చేశాయి. ఆమె తను దిగాల్సిన స్టేషన్ రాగానే గబాల్న పక్కకు తిరిగి ముందుకు నడిచింది. ఆ వేగానికి ఆమె స్కర్ట్ అలా రయ్యిమని చక్కర్లు కొట్టినట్టుగా తిరిగింది. వెళ్ళిపోతూ ఆమె వాడిని ఒకసారి వెనక్కి తిరిగి చూడటం వాడికి చాలా ఊరటనిచ్చింది.


కెనడా వచ్చాక వాడికి ఆత్మహత్య ఆలోచన వచ్చింది రెండు సార్లే. అండర్‌గ్రౌండ్ రైలు కింద పడాలని ఎప్పుడో తీర్మానించుకున్నా, ఏ రైలు, ఏ స్టేషన్ అన్నవి మాత్రం ఆరోజు ఆమెను చూశాకే నిర్ణయించుకున్నాడు. శరణార్థి పౌరసత్వం కోరుతూ వేసిన కేసుని జడ్జ్ కొట్టివేసిన రోజు ఆత్మహత్య చేసుకోవాలనే అనుకున్నాడు. అయితే లాయర్ అప్పీల్లో గెలిచేయొచ్చు అని ఆశపెట్టాడు. ఏడో ఇంటర్‌వ్యూలో ఉద్యోగం రానప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ ఇంటర్‌వ్యూ ఒక విచిత్రమైన అనుభవం. ఇంటర్‌వ్యూ చేసిన వ్యక్తి ఎత్తయిన కుర్చీలో కూర్చుని ప్రశ్నలు అడిగాడు.

“ఈ అప్లికేషన్ ఫార్మ్ మీరే పూర్తి చేశారా?”

“అవును. నేనే చేశాను.”

“మీరు వేసుకునున్న దుస్తులు మీవేనా?”
(అరే, ఎలానో కనిపెట్టేశాడు! అవును, అవి అరువుకు తెచ్చుకున్న దుస్తులే!)

“ఈ దుస్తులు నావే.”

“ఈ అప్లికేషన్‌లో ఉన్న ఫోటో మీదేనా?”

“అవును. అది నేనే!”

కాసేపు అతను ఏమీ అడగలేదు. తరవాతి ప్రశ్నని తన బుర్రలో తయారు చేస్కుంటున్నాడు. ఈ సమయాన్ని వృథా చేయడం ఇష్టంలేక వీడు, “ఈ రోజు షేవింగ్ కూడా నేనే చేసుకున్నాను. తల దువ్వుకున్నది కూడా నేనే!” అన్నాడు.

ఏమయిందో ఏమో ఆ ఉద్యోగం మాత్రం రాలేదు. ఏడు సార్లు అలా అయినాక ఎనిమిదో ప్రయత్నంలో దొరికింది ఈ కలప మిల్లులో ఉద్యోగం.

మిల్లులో పనిచేస్తున్నప్పుడు తప్ప మిగతా టైమంతా వాడు ఆ రైలు అమ్మాయి కోసం వెతికేవాడు. ఆమెను చివరిగా చూసిన రోజును గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు రైల్లో ఎక్కువమంది జనం లేరు. వాడు ఎక్కినప్పుడు ఆమె ఆ పెట్టెలో కూర్చుని ఉంది. ఎప్పట్లాగే క్లాసుపుస్తకం చదువుకుంటూ చెవుల్లో ఇయర్‌ఫోన్‌‌లు పెట్టుకుని పాటలు వింటోంది. కన్నులూ చెవులూ వేరేవేరే పనుల్లో ఉంటే చేతులు అప్పుడప్పుడూ కాగితాలు తిప్పుతున్నాయి. ఇంకో నాలుగు స్టేషన్‌లు దాటాక దిగి వెళ్ళిపోతుంది. ఏ నిముషమైనా అనుకోని ఓ సంఘటన జరగవచ్చు.

తరువాతి స్టేషన్‌లో రైలు ఆగగానే కళ్ళులేని ఒక వ్యక్తి కుక్కని పట్టుకుని రైలెక్కాడు. కుక్క అతనిని తీసుకుని సీటు కోసం చూసింది. ఆ అమ్మాయి వాళ్ళకి చోటిచ్చి మరో సీటుకు వెళ్ళింది. అప్పుడు ఆమె ఫోను కిందపడిపోయింది, వాడికి దగ్గరగా. వాడు దాన్ని తీసి ఆమెకందించాడు. ముందుకు ఉబ్బిన పెదవులను కొద్దిగా తెరచి పెగలని గొంతుతో ‘థ్యాంక్స్!’ అంది. శబ్దం గాలిలోనే కలిసిపోయినా ఆ పెదవుల కదలికతో శబ్దం చెవిలోకి చేరినట్టు ఊహించుకున్నాడు. ఆ ఒక్క క్షణం ఆమె కళ్ళు పెద్దగా చేసి అతనికేసి దగ్గరగా చూసింది. ఆ చూపులో ఓ స్నేహం కనిపించింది. దాన్నే పదేపదే తలచుకుంటూ వాడు ఓ వారం రోజులు గడిపేశాడు.

ఈ రైలు అమ్మాయి మర్మం అంతుపట్టలేదు. ఏ రైల్లో ఎప్పుడొస్తుందో తెలియటం లేదు. ప్రతి రోజూ రైలెక్కే ముందు వాడు మనసులో ఒక శపథం చేసుకుంటాడు. ఒక పలకరింపు వాక్యం రిహార్సల్ చేసుకుంటాడు. అయితే అది ఆమెతో చెప్పే సందర్భమే దొరకదు. అనుకోకుండా ఎప్పుడైనా అది జరిగి వాడి జీవితమే మారిపోవచ్చు. మిలానో స్టేషన్‌లో అలానే జరిగింది.


సోమాలీ, వాడూ ఒక బెంచి మీద ఏం చేయాలో దిక్కుతోచక దిగులుగా కూర్చునున్న ఒకరోజు దేవుడు పంపిన దూతలా ఒకతను వచ్చాడు. చక్కగా బట్టలు కట్టుకునున్నాడు. భుజానికి ఒక లెదరు బ్యాగు. వాళ్ళ మనసుల్లో మాటని చదివినవాడిలా, ‘మీకు షిప్పులో ఉద్యోగం చెయ్యాలనుందా?’ అనడిగాడు. ‘సార్! దానికోసమే మేము దేశాంతరం వచ్చి ఇలా తిరుగుతున్నాం” అని చెప్పారు. ఆ మనిషి సంచిలోనుండి కొన్ని ఫారాలు తీసి వాళ్ళ భాషలో వివరాలు పూర్తి చేసి వీళ్ళ దగ్గర సంతకాలు తీసుకున్నాడు. చెరి ఐదువందల డాలర్లు కట్టమన్నాడు. వాళ్ళిద్దరి దగ్గర అంతలేవు. మిగిలిన డబ్బు ఒక నెలలో ఇస్తామని రాయించి సంతకాలు తీసుకున్నాడు. ‘ఇక్కడే ఉండండి. షిప్పు ఏజెంట్‌ని తీసుకొస్తాను…’ అని వెళ్ళినవాడు తిరిగి రానేలేదు. వాడు అప్పుడు తెలుసుకున్న పాఠం ఏంటంటే, తెల్లగా ఉన్నవాళ్ళు కూడా మోసం చేస్తారని!

‘ఇటలీలో అతి పెద్ద స్టేషన్ మిలానో. అక్కడికి వెళ్దాం, ఏదైనా దారి దొరకుతుంది‌,’ అన్నాడు సోమాలీ. టికెట్‌ లేకుండా రైలెక్కి మిలానో వచ్చి చేరారు. అంత బ్రహ్మాండమైన స్టేషన్‌ని వాడు అప్పుడే చూశాడు. ఒకటే హడావిడి, ప్రయాణీకుల మాటల హోరు ఒక జడివానలా. అక్కడనుండి యూరపులో ఏ దేశానికైనా ప్రయాణం చెయ్యొచ్చు. బార్సిలోనా, జూరిక్, ఫ్రాంక్‌ఫర్ట్ అంటూ రైళ్ళ రాకపోకలతో అంతా తిరునాళ్ళలా ఉండింది. ఒక బెంచి మీద కూర్చుని ఇద్దరూ మళ్ళీ భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నారు. చేతిలో డబ్బుల్లేవు. భాష రాదు. మహేశ్ పైకి చూశాడు. పైన గోడమీద 12 రాశుల శిల్పాలు రాతిలో చెక్కబడి కనిపించాయి. ఎంత గొప్పగా ఉన్నాయో! ఎవరో ఒక శిల్పి, ఎప్పుడో ఎవరికోసమో చెక్కిన శిల్పాలు. వాడిది తుల రాశి. త్రాసు సమానంగా ఉంది. అది తన భవిష్యత్తు గురించి ఏం చెప్తుందా అని అటే చూస్తుంటే, ఈ బక్క పిశాచం సోమాలీగాడు, పొట్ట పట్టుకుని ‘నేను చచ్చిపోబోతున్నానూ…’ అని అరిచాడు.

మొదటిసారి కలిసినప్పుడు సోమాలీ చిన్న చిన్న వాక్యాలతో ఇంగ్లీష్ మాట్లాడాడు. గ్రీస్ దేశపు ఇమిగ్రేషన్ అధికారిలా చాలా ప్రశ్నలు అడిగాడు. ఇప్పుడు మూడు రోజులుగా ఇద్దరూ పస్తు. చేతిలో డబ్బుల్లేవు. నీళ్ళు మాత్రం తాగి ప్రాణాలు నిలుపుకుంటున్నారు. మాట్లాడుతూనే అప్పుడప్పుడూ సోమాలీ పొట్టని అదుముకుంటూ ముడుచుకుపోయి ఏడుస్తుండేవాడు. కాని, కనిపించినవాళ్ళందర్నీ తన ప్రశ్నలతో తొలిచేసేవాడు. అలా ఒకరోజు ఎంతో అపురూపమైన సమాచారం సేకరించుకొచ్చాడు. ‘ఆరు మైళ్ళ దూరంలో మేరీమాత చర్చ్ ఒకటి ఉంది. అక్కడ రోజుకొక రకమైన తిండి పెడతారు.’

రోజూ రెండు గంటలు నడిచి వెళ్ళేవాళ్ళు. అక్కడ ఫాదర్ ఒక చిన్న కిటికీ ద్వారా తిండి పొట్లాం అందిస్తాడు. ముందు తెల్ల రెఫ్యూజీలు, ఆ తర్వాతే నల్ల రెఫ్యూజీలు. అడుక్కుతినేప్పుడు కూడా తెల్లవాళ్ళదే అగ్రస్థానం అన్న మరొక సత్యం కనుగొన్నాడు ఆరోజు వాడు. మళ్ళీ రెండు గంటలు నడిచి స్టేషన్‌కి వచ్చేలోపే సోమాలీ, పొట్ట పట్టుకుని ‘ఆకలి, ఆకలి‌’ అని అల్లాడేవాడు. ‘రేపటిదాకా ఉండను. చచ్చిపోతాను’ అని సోమాలీ చెప్పిన ప్రతిసారీ మహేశ్‌కు భయం పట్టుకునేది. అంతనొప్పిలోనూ ఉన్నట్టుండి లేచి వెళ్ళి ఒక ప్రయాణికుణ్ణి పట్టుకుని, ‘ఈ రైలు ఎక్కడికెళ్తుంది? అక్కడికి చేరుకోడానికి ఎన్నిగంటలు పడుతుంది?’ అని ప్రశ్నలతో విసిగించేవాడు. వాడి దగ్గర చాలా ప్రశ్నలుండేవి. ఇల్లు కాలిపోతున్నప్పుడు కూడా పైన హెలికాప్టర్‌ నుండి ఎవరైనా ఓ తాడు కిందకి విసిరితే, ఓ నాలుగు ప్రశ్నలైనా అడగకుండా ఆ తాడుని పట్టుకోడేమో!

చర్చ్‌లో తింటున్నప్పుడు మాత్రం వాడి కళ్ళు చెమ్మగిల్లేవి. ‘నేను చదువుకోలేదు. మా ఇంట్లో ఉన్న పుస్తకాల సంఖ్యకంటే పిల్లల సంఖ్యే ఎక్కువ!’ అనేవాడు. వాడు చివరిగా మాట్లాడిన వాక్యం, ‘నువ్వు మీవూరికెళ్ళిపో. లేదంటే చచ్చిపోతావు…’ ఆ మరుసటి రోజున వాడిక కనిపించలేదు. చెప్పాపెట్టకుండా మాయమైపోయాడు. వాడు ఆత్మహత్య చేసుకున్నాడా, మరో దేశానికి వెళ్ళిపోయాడా అనేది తెలియదు. ఎముకలు తేలిన దేహంతో మెల్లగా కదులుతూ సోమాలీ ప్రయాణికుల వెంటబడే దృశ్యమే మనసులో చెక్కుచెదరకుండా నిలిచిపోయింది. ఆరునెలలు గడిచాక ఒక విషయం అర్థమయింది- ఈ ప్రపంచంలో పస్తులుంటూ ఎవరూ చచ్చిపోలేరు. ఏదో ఒక రూపంలో చివరి క్షణంలో ఎక్కడనుండో ఒక సాయం అందుతుంది. ఒకరోజు అనుకోకుండా అద్దంలో ఒక ఆకారం చూసి బిత్తరపోయాడు వాడు. అది వాడిదే! బక్కచిక్కిపోయిన శరీరానికి కర్రకు వేలాడినట్టుగా బట్టలు వేలాడుతున్నాయి. ఇరవైనాలుగు ప్లాట్‌ఫారాలలో రోజుకి ఐదొందల రైళ్ళు, నాలుగు లక్షల ప్రయాణికులూ రాకపోకలు సాగించే మిలానో స్టేషన్‌లో వాడు ఒకరోజు బెంచ్ మీద కునుకు తీస్తుంటే మొట్టమొదటిసారి ఒక తమిళ మాట వినిపించింది. కళ్ళు తెరిచిచూస్తే పచ్చని స్కార్ఫ్ తలకు చుట్టుకున్న ఒక తమిళ యువతి నిల్చుని ఉంది.

స్టేషన్‌లో వాడి ముందు నిల్చునున్నది ఒక శ్రీలంక అమ్మాయి. ‘అన్నా, ఈ టికెట్ చూడండి. నేను ప్యారిస్‌కు వెళ్ళాలి. అక్కడ మా అక్కవాళ్ళు ఉన్నారు. నన్ను ప్యారిస్ వెళ్ళే రైల్లో ఎక్కించగలరా?’ అని అడిగింది. ఆమె పాస్‌పోర్ట్, వీసా, టికెట్ అన్నీ సరిగ్గానే ఉన్నాయి. మంచి తిండి తినటం వలన ఆరోగ్యంగా మెరిసిపోతోన్న ముఖం! వాడిలా పస్తులుండి ఎముకలు తేలిన ముఖం కాదు. ‘చెల్లెమ్మా, ఒక రొట్టె కొనిస్తావా!” అనడిగాడు. వాడికి ఒకటి కొనిచ్చి తానూ ఒకటి కొనుక్కుని తిన్నది. ‘మీరెవరు?’ అనడిగాడు. ఆమె చెప్పిన జవాబుకు అదిరిపడ్డాడు. వాడి జీవితంలో ఇలాంటొక జవాబు ఎన్నడూ వినలేదు. ‘మా ఊరిని మిలిటరీ ఆక్రమించుకుంది. నేను కావడానికి తమిళమ్మాయినే. నా లోపల మాత్రం ఒక సింహళీబిడ్డ పెరుగుతూవుంది!’ అంది. తర్వాత ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. ఆమెను ప్యారిస్ రైలు ఎక్కించాడు. ఆమె ప్యారిస్ చేరుకుందో లేదో మరి.

ఉత్తర దిక్కుకు వెళ్ళిన పక్షులన్నీ దక్షిణ దిక్కుకు ఎగిరిపోయాయి. శీతాకాలం మొదలైంది. ఒకటే మంచు. బట్ట కప్పిన చోటు, కప్పని చోటన్న తేడా లేకుండా రెంటినీ సరిసమానంగా చలి కొరికేస్తోంది. ఆ రోజు వాడికి మధ్యాహ్నం భోజనం దొరకలేదు. తెల్లవారుతూనేతో మొదలైన మంచు సాయంత్రం దాకా పడుతూనే ఉంది. తెల్లవారితే బుధవారం, తెల్లవారకపోయినా బుధవారమే. పైన మేషంనుండి మీనందాక అన్ని రాశులూ వాడిని చూశాయి. తులరాశి వాడికి ఏదో మంచి సమాచారం చెప్తున్నట్టు తోచింది. ఇంతలో ఒక యువతిని ఓ పెద్దావిడ వీల్ చెయిర్‌లో కూర్చోబెట్టుకుని తోసుకెళ్తోంది. ఆ యువతి సినిమా స్టారేమో అన్నంత అందంగా ఉంది. ఆమె కాళ్ళకు ఖరీదైన మెత్తటి ఎరుపురంగు తోలు చెప్పులు! నడవలేని అమ్మాయికి ఇంత ఖరీదైన చెప్పులా అనుకున్నాడు మనసులో. అతని మనసుని చదివినట్టు ఆ వీల్ చెయిర్‌ అతని దగ్గరకు తిరిగొచ్చింది. ఆ యువతి తన పర్స్ తెరచి 1000లీరా నోటొకటి తీసి ఇచ్చింది. అది ఒక డాలరుకు సమానం. రెండు టీలు తాగొచ్చు. వాడు నిస్సంకోచంగా తీసుకున్నాడు. ఆరు నెలలుగా అవసరమున్నపుడల్లా చేయి చాచడం అలవాటైపోయింది మరి. ఆ అమ్మాయి వాడిని భిక్షగాడు అనుకుంది. ఆ రోజు రాత్రంతా తన స్థితిని తలచుకుని ఏడ్చాడు. తెల్లారగానే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు.

సోమాలీ మోకాళ్ళమీద తలవాల్చుకుని కూర్చుని ఉండటం గుర్తొచ్చింది. వాడు ఎప్పుడూ ఒక ప్రశ్న అడిగేవాడు, “నిన్నొచ్చిందే అది… ఆకలి! అది ఈ రోజూ వస్తుందా?” అని. సోమాలీ ఎప్పుడూ ఆకలి మంటల్లో ఉండేవాడు. వాడిప్పుడు ఉండుంటే ఏదో ఒక ఉపాయం చెప్పుండేవాడు.

కుక్క చనిపోడానికి ఒక మంచి చోటును వెతుక్కునట్టే వాడూ వెతుక్కుంటూ ఒక సర్కస్ గుడారం దాటి వెళ్తుండగా, లోపల్నుండి ఒకడు పరుగెట్టుకుంటూ వచ్చి, ‘పని ఉంది, చేస్తావా?’ అని అడిగాడు. వాడు జవాబు చెప్పకుండా, ‘అన్నం పెడతావా?’ అని అడిగాడు. అలా రెండేళ్ళు అక్కడ పని చేశాడు. ఆ డబ్బుతో ఒక దొంగ పాస్‌పోర్ట్ తెచ్చుకున్నాడు. ‘ఎక్కడికెళ్ళొచ్చు?’ అని పాస్‌పోర్ట్ అమ్మిన వాడిదగ్గరే సలహా అడిగాడు. కెనడా వెళ్ళమన్నాడు. అలా ఆత్మహత్యకు బయలుదేరిన వాడు చివరికి కెనడా వచ్చిపడ్డాడు.


వాడికి చదువు చెప్పిన మాస్టారు ఎప్పుడూ ఒక మాట అనేవాడు, ‘నువ్వు ఓడిపోలేదు; నీ విజయాన్ని వాయిదా వేశావంతే!’ అని. ఆ రోజు వాడు రెండు విజయాలను అందుకున్నాడు. కెనడా పౌరుడిగా సత్యప్రమాణం చెయ్యడానికి స్కేబరో సిటిజన్‌షిప్ హాల్‌లో రెండువందల మందిలో ఒకడిగా కాచుకుని ఉన్నాడు. తెల్లని చొక్కా, కొలతలు ఇచ్చి కుట్టించుకున్న బూడిద రంగు కోటు, మెరుస్తున్న తోలు బూట్లు వేసుకునున్నాడు. సిటిజన్‌షిప్ జడ్జ్ వాళ్ళకు ఆహ్వానం పలుకుతూ, ‘మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకంటూ ఓ దేశం లేదు. మీరు ఇక్కడనుండి ఏ దేశానికి వెళ్ళినా మీకంటూ ఒక దేశం ఉంది. అది కెనడా! అభినందనలు. వంగిన మేకులు పనికిరావు. తలెత్తుకుని నిలబడి, కుడి చేయి పైకెత్తి సత్యప్రమాణం చెయ్యండి!’ అన్నాడు.

‘కనకసభాపతి మహేశ్వరన్ అయిన నేను కెనడా రాణియైన గౌరవనీయులు రెండవ ఎలిజబెత్, ఆమె వారసులు, ఆమె తర్వాత వచ్చేవారికి, చట్టానికి, లోబడి విశ్వాసబద్ధుడనై, దేశభక్తిగలవాడిగా ప్రవర్తిస్తానని ప్రమాణం చేస్తున్నాను‌!’

‘ఓ కెనడా!’ జాతీయ గీతం వాయించబడుతున్నప్పుడు ఆమెను చూశాడు. రైలు అమ్మాయి! పెదవులు విప్పి స్వేచ్ఛగా, సంతోషంగా గొంతెత్తి పాడుతోంది. అద్దంలాంటి పలుచని చీర చుట్టుకునుంది. పక్కన కన్నవాళ్ళు. తమ్ముడులాంటి ఒక చిన్న పిల్లాడు కెనడా జెండా చేతిలో పట్టుకుని పక్కన నిల్చున్నాడు. ఆమెను చూశాడు. అమె కూడా చూసింది. ముందుకు ఉబ్బిన ఆకర్షణీయమైన పెదవుల్లో చిరునవ్వు. వాడి కాళ్ళిప్పుడు వణకలేదు. వాడి పెదవుల్లోనూ ఇప్పుడు ఒక కెనడా నవ్వు విరిసింది. ఆమె కూడా జవాబుగా నవ్వింది. ప్రపంచంలో అన్ని దేశాలలోను, అందరి మనుషుల మధ్య, అన్ని భాషల్లోను, అన్ని పడక గదుల్లోను కనీసం ఒక్కసారైనా చెప్పబడిన ఒక వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని పెదవుల్లో పెట్టుకున్నాడు.

ఆమెకేసి నడిచాడు.

* * *

(మూలం: “రయిల్ పెణ్”. 2012 ఆనంద వికటన్ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమైనది.)


రచయిత గురించి: శ్రీలంక, యాళ్పాణంలో జనవరి 19, 1937న జన్మించిన అప్పాదురై ముత్తులింగం విజ్ఞానశాస్త్ర పట్టభద్రుడు. శ్రీలంకలో చార్టర్డ్ అకౌంటంట్ గానూ, ఇంగ్లండ్‌లో మేనేజ్‌మెంట్ అకౌంటంట్ గానూ పట్టా అందుకున్నారు. ఉద్యోగనిమిత్తం పలు దేశాలలో నివసించి, ఇరవై ఏళ్ళు ఐక్యరాజ్యసమితిలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన తరువాత తన అనుభవాల ఆధారంగా తమిళ భాషలో కథలు, నవలలూ రాస్తున్నారు. ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తమిళ భాషకి పర్మనెంట్ ఛెయిర్ కొరకు ఒక వలంటీర్ గ్రూప్ అధ్యక్షుడుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో పుస్తకాలు రాశారు. 1964లో ప్రచురించబడిన వీరి కథల సంపుటి ‘అక్క’ ఎన్నో బహుమతులు గెల్చుకుంది.