బహుదూరం

డిల్లిబాబు లోపలికి రాగానే వాడి అడుగుల చప్పుడు విని ‘ఒరేయ్’ అని పిలిచాడు వాడి నాన్న.

“డిల్లీ… రేయ్ డిల్లీ! నువ్వేనా రా?”

“అవును నాయనా.”

“మాంసం తెచ్చినావా?”

“లేదు.”

“ఏందిరా? మాంసం తేకుండా ఈడికొచ్చి ఏం బొచ్చు పెరకదాం అనుకున్నావు?” నాన్నకు దగ్గు కమ్ముకుని వచ్చింది. నాన్న ‘కసకూ కసకూ’ అని దగ్గుతుంటే ఆ శబ్దం డబ్బారేకుని వాయించుతున్నట్టు ఉంది.

“దుడ్డు కావద్దా? ఎవడ్దగ్గరుండాది దుడ్డు? నేన్గూడా నాష్టా తిన్లా ఇంకా…”

“నువ్వు యాడన్నా సావు… పో. అక్కడ పడుండాయే ఆఁటికేంజెప్తావు? రేయ్, అవి మనల్ని నమ్ముకోనుండే జీవాల్రా…”

“దానికి నన్ను మాత్రం ఏంజెయ్యమంటావు?”

“ఏం జెయ్యాల్నా? నన్ను సంపేయ్… నన్ను సంపి నా మాంసం తునకలు కోసి ఆఁటికి ఎయ్‌రా!”

డిల్లిబాబు చొక్కా తీసి చీలకు తగిలించి నిట్టూర్చుతూ తిన్నె మీద కూర్చున్నాడు. నాన్న దగ్గుతూనే ఉన్నాడు. డిల్లిబాబు ఒక బీడీ ముక్క ముట్టించుకున్నాడు.

“రేయ్, నిజింగానే అదే చెయ్యాల అని అనుకుంటా ఉండాన్రా. నన్ను కోసి ఆఁట్లికేసినావంటే నేను సంతోషంగా సచ్చిపోతాన్రా. ఇంక సేసేదానికి అదొకిటేరా మిగిలుండేది.”

నాన్న మళ్ళీ ఒక దగ్గు చుట్ట చుట్టుకొని అలసిపోయాడు. వెల్లకిలా పడుకుని మూలుగుల మధ్య ఊపిరి పీలుస్తున్నాడు. డిల్లి గుడిసె లోపలికి వెళ్ళి చూశాడు. అడ్డదూలంలా ఉన్న వెదురు దుంగమీద రెండు రాబందులూ వాటి తలలకు తొడిగిన తోలుటోపీలతో చీకట్లో కూర్చుని ఉన్నాయి. వాటికి ఇప్పుడు రాత్రి.

వాడి అడుగుల చప్పుడూ వాడి వాసనా వాటికి బాగా తెలుసు. ఆల్ఫా కాలు తీసి కాలు మార్చిపెట్టి రెక్కలు విప్పి మళ్ళీ ముడుచుకుంది. బీటా తలను ఒంటిలోపలికి పొదువుకుని మురికి బట్టల మూటలా కూర్చుని ఉంది. అవి ఎక్కువగా చప్పుడు చేయవు. కారుమనవు. రాబందులు సహనము, ఓర్పూ ఉన్న పక్షులు.

వాడు నేలమీద కూర్చుని కిరసనాయిలు స్టవ్వు తీసి పంప్ కొట్టాడు. అలూమినియం గిన్నె దాని మీద పెట్టి రెండు గ్లాసులు నీళ్ళు పోశాడు. టీపొడి కొంచమే ఉంది. చక్కెర లేదు.

నాన్న మూలుగుతూనే ఉన్నాడు. ప్రతి ఊపిరికీ నాన్న ఒళ్ళు పైకి ఉబికి కిందకు వెళ్తోంది. రాయపేట పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ దాపరికం లేకుండా చెప్పేశాడు. “ఇంక ఈయన లేవగలడు అని నమ్మకం పెట్టుకోవద్దు. ఇక్కడ బెడ్లు లేవు. ఈ అరుగుల మీద బిచ్చగాళ్ళ మధ్య పండబెట్టడంకంటే ఇంట్లో ఉంచుకోవచ్చు!”

వాడు నాన్నని ఇంటికి తీసుకొచ్చేశాడు. వాళ్ళకున్నది ఇల్లు అంటే ఇల్లేమీ కాదు. కూవం మురికి కాలువ ఒడ్డున ఉన్న గుడిసె! నాలుగు పక్కలా వినైల్ తడికలు, వాటి మీద ఒక పాత లారీ టార్పాలిన్ పైకప్పు. పడుకోడానికి ఒక ప్లైవుడ్ పలకను మంచంలా అమర్చాడు అంతే.

టీపొడిని మరుగుతున్న నీళ్ళల్లో వేసి వడబోసి ఒక గ్లాసు టీ నీళ్ళను మాత్రం చక్కెర డబ్బాలోకి పోసి మూత వేసి బాగా చిలక్కొట్టి గ్లాసులోకి ఒంపుకున్నాడు. నాన్నని మెల్లగా లేపి వాలుగా కూర్చోబెట్టి ఆయనకు తాగిపించాడు. ఆయనకు అప్పటికే గొంతదీ బాగా ఎండిపోయినట్టుంది. నాలుక, పెదవులు పిడచకట్టుకుపోయున్నాయి. టీ నీళ్ళు లోపలికి దిగగానే కాస్త పుంజుకుని నిట్టూర్చాడు. ఒంటిలో అదివరకున్న వణుకు కాస్త తగ్గింది.

“ఏరా, నిజింగానే మన ఒంట్లోనించి మాంసం కోసి ఆఁట్లకు ఎయ్యలేమా?”

“నాయనా, నీకేమన్న పిచ్చి పట్టుండాదా? ఊరికే ఉండు… మనుషుల మాంసం తింటాయా అవి?”

“పార్సీలు అట్ట యేస్తారంటారు మరి…” అన్నాడు. “దానికోసరమే బావి మాదిరిగా ఒకటి పెట్టుకోని ఉంటారు. దానికి శాంతిబావి అని పేరు.”

“అవును, అదంతా వేరేలే…”

“నేన సచ్చిపోతే నన్ను కోసి తునకలు సేసి ఆఁటికి ఏసేయ్‌రా…”

వాడు నేలమీద కూర్చుని తన టీ తీసుకున్నాడు.

“నిజింగానే సెప్తావుండాన్రా… నేన సచ్చిపోతే నన్ను కోసి ఏసేయ్.”

“గమ్మునుండు నాయనా. అదంతా చానా పాపం.”

“పాపమేమీ లేదు! నేను సచ్చిపొయ్నాక నా పీనుగుని ఇక్కడే వొదిలేసి రెండు దినాలు దూరంగా ఉండు… నువ్వు తిరుక్కుని వొచ్చేలోపల అవి నా మాంసం అంతా తినేసుంటాయి. మిగిలిన ఎముకులు పెట్టుకోని సెయ్యాల్సిన సాంగ్యాలు సెయ్.”

“గమ్మునుండమన్నానా? మళ్ళా మళ్ళా అదే వాగతా ఉండావు!”

“నేను సేసిన పాపంరా… గుడ్లనుంచి తీసి పెంచి రెక్కలు కత్తిరించితి. గోర్లు కోసి, తిండిబెట్టి పాడుసేసి, ఆఁటి తిండిని ఆఁటంతట అవి ఎతుక్కునేదానికి సేతకాకుండా సేసేసినా… పక్షంటే అది ఆకాశానికి సొంతం. దాన్ని ఈ మురిక్కాలవ పక్కన గుడిసెలో బిగించేసినా… అరిష్టాలు మాదిరిగా ఇప్పుడు ఇట్ట కూర్చోనుండాయి.

ఆయన వెనక్కి తిరిగి తన తలదగ్గర కూర్చుని ఉన్న రాబందులను చూశాడు. ముఖాన చిరునవ్వు చిగుర్చింది.

“కౌబాయి సినిమాల్లో సచ్చిపొయ్యేవాడి పక్కన కూర్చోనుంటాయి… నా తలకాడ అరవై డెబ్బై ఏండ్లుగా రాబందు కూర్చోనుంది. ఎప్పుడు సస్తాడాని మూడు తరాలుగా కాసుకోనుండాయి… ఆఁటిల్ని నేను మోసం చెయ్యకూడదొరే.”

“నాయనా నువ్వు కొంచేపు నిద్రపో.”

“ఒక గుక్క రమ్ము దొరుకుతాదిరా?” అడిగాడు. “రమ్ము లేకుంటే ఏదో ఒకటి. ఎవురన్నా దొంగసారాయి అమ్మతావుంటే, అదన్నా పరవాలేదు…”

“ఇప్పుడు నేను దుడ్డుకు యాడికిబొయ్యేది? ఈఁటికి మాంసవేసే ఈపొద్దుటికి ఎనిమిది దినాలయింది.”

“ఇంకోసారి మళ్ళీ బయటికి తోలి చూడు.”

“దినం తెల్లారగట్టే ఇప్పి బయటికి తరమతానే ఉండాను. పొయ్యి బయట తిరిగేసి గంటసేప్టికే మళ్ళా ఎనిక్కి వచ్చేస్తా ఉండాయి. ఈఁటికి ఏరియా తెల్లేదు. ఎగిరేదానికి తెంపూ లేదు. ఏంజేసేది?” నిట్టూర్చాడు డిల్లిబాబు. “అట్టా బయటికి వొదిల్నప్పడంతా అనుకుంటా ఇయ్యి మల్లరాకుండా ఎక్కడైనా ఉండిపోయ్యే అని! ఎక్కడైనా అలిసిపోయి రోడ్డు మింద పడి బండ్ల చక్రాల్లో నలిగి సచ్చిపోయినా మనుసు దుడం సేసుకోవచ్చు.”

“ఊరుకోరా, మాటవర్సుక్కూడా అట్టనద్దు” అన్నాడు నాన్న. “అవి పసిపిల్లల్రా… చిలకపిల్లలు మాదిరిగా నా సేతులోనే కూర్చోనుండేవి.”

“అందుకే ఆఁటికేం తెలుస్తలేదు…”

“నువ్వ సబరి సార్ను పొయ్యి సూడు. ఆయనకి ఆఁటిమీద ఆకాలంనుంచే చానా ఇష్టం. ఆయన జేసిన అన్ని సినిమాల్లోనూ ఒక సీన్లో అయినా ఉండేవి ఇవి.”

“ఆయన ఇప్పుడెక్కడ సినిమాలు జేస్తా ఉండాడు?”

“అది అంతేలే. ఒక్కొక్కరికి ఒక్కొక్క సీజనే. పది పదైదేండ్లు, అంతే! తర్వాత ఇంకోరు. అయితే అప్పుడంతా బాగా సంపారించినాడు. ఆయన జేసిన అన్ని సినిమాలూ కౌబాయిల సినిమాలు సూసి కాపీ గొట్టిందే!”

డిల్లి ఇదివరకే ఆయన్ని రెండుసార్లు కలిసొచ్చాడు. ఆ తర్వాత ఆయన ఇల్లు ఖాళీ చేసుకుని కొడుకుల దగ్గరకు వెళ్ళిపోయాడట. ఎనిమిదినెలల క్రితం వెళ్ళి ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఆ బంగ్లాను కూలకొట్టి అక్కడ అపార్టుమెంటు కట్టడానికి గుంటలు తవ్వుతున్నారు.

ఉన్నట్టుండి ‘అక్కడ కట్టేవాళ్ళకి ఆయన అడ్రస్ తెలిసి ఉండచ్చు’ అనిపించింది. ఆ ఆలోచన రాగానే మనసుకి హుషారు, ఒంటికి శక్తి వచ్చాయి.

“నాయనా, నేను బయటకి పొయ్యొస్త” అన్నాడు.

“తెర తెరిచి పెట్టి పో. బయట ఎగిరొస్తయేమో…” అన్నాడు నాన్న.

“బయిటకి పొయినా ఎంటనే తిరిగొచ్చేస్తా ఉండాయి… తెర లేకుంటే నిదరబోవు.”

“అవును, ఇప్పుడు ఆఁకిలితో నకనకలాడతా ఉండాయి… ఇయి బయటికి పోతే ఏదన్నా ఎలికో, కప్పో పటుకుని తింటాయి… లేదంటే మాంసం సాయిబు అంగిటికాడ పారేసే వేస్టు కోసం పొయినా పోతాయి… ఆ పెంటిది పాపం ఈపొద్దో రేపో సచ్చిపోయే మాదిరుండాది” నీరసంగా అన్నాడు నాన్న.

“ఎందుకు నాయనా అట్టంటావు?”

“అయి బాగా తిన్నేయంటే కాళ్ళమీద కొంచం ఏరుక్కుంటాయి… ఒంటి ఉడుకును సల్లార్చుకునేదానికి. ఆ గబ్బు వస్తా ఉంటది… ఇప్పుడు సూడు అసలు గబ్బే లేదు… ఆటి పొట్టలో ఆకిలి అగ్గిమాదిరి మండతా ఉండాది. అందుకే సచ్చింది, కుళ్ళింది తిన్నాగూడా ఆటికి ఏవీ కావడంలే. అయ్యేసే పేడ కూడా బూడిద వాసన వస్తా ఉంటుంది కదా! ఇప్పుడు అగ్గే పేగుల్ని కాల్చేస్తా ఉంటది.”

డిల్లి రెండు రాబందులనీ చూశాడు. వాటికి తలలే లేవన్నట్టు తలలను ఒంటిలోకి లాక్కుని ఉన్నాయి. ఎన్నోసార్లు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే రాబందులను చూశాడు. ఆ దృశ్యాలు గుర్తు చేసుకున్నాడు. అవి రెక్కలు ఆరుస్తాయి. వాటిని ఆకాశం తన ఒడిలోకి తీసుకున్నట్టు ఉంటుంది. ఆకాశం ఒక అద్దంలా, ఇవి దాని మీద జారుతున్నట్టూ అనిపిస్తుంది. వాడు గ్లౌజు వేసుకుని రాబందుల దగ్గరకు వెళ్ళి ఆల్ఫాను బయటకు తీశాడు. అది వాడి మోచేతి మీద కూర్చుంది. బయటకు తెచ్చి తలమీదున్న టోపీ తీసి చేయి పైకెత్తి ఎగరనిచ్చాడు. రెక్కలు కొట్టుకుంటూ వెళ్ళి నేల మీద వాలింది. మెడను చాచి ‘క్రేయ్క్’ అని కూసింది. లోపలికి వెళ్ళి బీటాను బయటకు తీసుకొచ్చాడు. టోపీ తీసి దాన్నీ ఎగరనిచ్చాడు. అదీ రెక్కలు అల్లార్చుతూ వెళ్ళి నేలమీద వాలింది.

కూవం నదిలా నల్లగా నురగలు కక్కుతూ ప్రవహిస్తోంది. నెల రోజల క్రితం చచ్చిపోయిన ఒక గొడ్డు కాలువలో కొట్టుకుని వచ్చింది. దానికి కొక్కెం వేసి లాగి ఒడ్డున వేశాడు డిల్లిబాబు. రాబందులను తెచ్చి ఆ చచ్చిన గొడ్డు మీదకు వదిలాడు. హుషారుగా శవానికి ప్రదక్షిణలు చేశాయి కానీ చీల్చడానికో, పొడిచి లాక్కుని తినడానికో వాటికి చేతకాలేదు. ఎప్పుడూ చిన్న చిన్న ముక్కలుగా చేయబడిన గొడ్డు మాంసానికే అలవాటుపడ్డాయి. వాటికి ఆహారం అంటే అదే. ఎలుకలను కూడా తిని ఎరగవు.

తరుముతున్నట్టు చేతులు ఊపి “ఇద్దో పో… పో… ఇద్దో” అని తోలాడు. అవి మూరా రెండు మూరలు పైకి లేచి మళ్ళీ నేల మీద వాలాయి. చీపురు తీసి వాటి మీదకి విసిరి ఎగరగొట్టాడు. ఆల్ఫా ఎగిరింది. బీటా ‘క్రేయ్క్’ అని కూస్తూ వెంబడించింది. అవి వాడి చూపును తప్పించుకుని పోయేంతసేపు చూస్తూ ఉండిపోయాడు.

చూరు చీలకు తగిలించి ఉన్న చొక్కా తీసి వేసుకున్నాడు డిల్లిబాబు. చెప్పులు అరిగిపోయున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఎవరికంటా పడని చోట వదలాల్సి ఉంటుంది ఈ చెప్పుల్ని. చొక్కాకు కూడా అక్కడక్కడా కుట్లు ఊడిపోయి మురిగ్గా ఉంది. రాబందుల రెక్కలు మురికిగా ఉంటాయి. చల్లగా ఉండాలని అవి తాము ఉచ్చ పోసిన మట్టిని కెలికి కెలికి బురదగా చేసి రాసుకుంటాయి. డిల్లి వాళ్ళ నాన్న వేసుకునే కాకీ చొక్కా ఎప్పుడూ బురదతో నిండిపోయి ఉంటుంది.

డిల్లిబాబు రోడ్డుమీదకు వచ్చేసరికి బారెడు పొద్దెక్కి ఎండ చురుగ్గా తాకింది. ఆకలితో ఒళ్ళు సోలిపోయి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. ఎలక్ట్రిక్ ట్రెయిన్‌ స్టేషన్ వరకు నడిచే వెళ్ళాలి. ట్రెయిన్‌లో అయితేనే టిక్కెట్ ‌తీసుకోకుండా వెళ్ళొచ్చు. చెమట పట్టడంతో ఒంటినుండి ఆవిరి మొదలైంది. ఎండకు చొక్కాని కాస్త తలపైకి లాక్కుని మెడ, భుజం వంచినట్టు కొంచం గూనిగా నడిచాడు. వాడి నీడ రాబందు నీడలా ఉంది. ఈ విషయాన్ని సినిమావాళ్ళు చెప్తు ఉంటారు. వాడూ వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్నకు నాన్నా కూడా రాబందు లాగా ఉంటారు అని.

డిల్లిబాబుని ‘వల్చర్’ బాబు అనే అందరు పిలుస్తుంటారు. వాడి నాన్న వల్చర్ రాముడు. నాన్నకు నాన్న వల్చర్ రాజు. ఆ వల్చర్ రాజే సినిమాకి రాబందును పరిచయం చేసింది. అంతకు ముందు బొమ్మ రాబందుని వాడేవాళ్ళు. వల్చర్ రాజు దగ్గర పదిహేను రాబందులు ఉండేవి. వందకు పైగా రాబందు బొమ్మలుండేవి. బొమ్మలకు స్ప్రింగ్ పెట్టి, నల్ల వైర్‌ కట్టి రెక్కలాడించి ఎగరవెయ్యడం, నేలమీదకి వాల్చడమూ చెయ్యగలడు. రాబందుల్ని, రాబందు బొమ్మల్ని ఒక ఫ్రేమంతా నింపేయడం ఎలా అన్నది రాజుకు బాగా తెలుసు. గొడ్డుపేగుల ముక్కలు నింపి గుడ్డతో చేయబడిన డమ్మీ శవాలను అవి పొడుచుకు తింటుంటే నిజమైన యుద్ధభూమి కళ్ళ ముందు చూసినట్టే ఉంటుంది.

1943లో వచ్చిన గరుడ గర్వభంగం అన్న సినిమాలో ఆయన నిజమైన రాబందులను తొలిసారిగా సినిమాలకు పరిచయం చేశాడు. ఆ సినిమా డైరెక్టర్ ఘంటసాల బలరామయ్య, రాజు గురించి అందరితో గొప్పగా చెప్పడంతో ఉన్నపళంగా ప్రసిద్ధికెక్కాడు రాజు. మరో ఇరవై రాబందులు పెంచాడు. మదరాసులో అడయార్ ఒడ్డున బంగ్లా కట్టుకున్నాడు. ఏడుగురు సహకార నటీమణులను పెళ్ళి చేసుకున్నాడు. ఒకప్పుడు ఆయన దగ్గర పదమూడుమంది పనిచేసేవాళ్ళు.

నాన్న కూడా పందొమ్మిది వందలా ఎనబైలదాకా చాలా దర్జాగా, వైభవంతో బతికాడు. ఆ తర్వాత పౌరాణిక చిత్రాలు, యుద్ధగాథలూ తగ్గిపోయాయి. అడపాదడపా పాటల్లో ఒకటీ అరా షాట్‌లలో నేపథ్యంలో రాబందుల్ని చూపించేవాళ్ళు. జీతం చెప్పేప్పుడు ఒకటి, ఇచ్చేప్పుడు మరోటిగానూ ఉండేది. చూస్తూ ఉండగానే నాన్న వైభవం అంతా గడగడా కూలిపోయింది. కూలిపోతుంది అని కూడా పసిగట్టలేకపోయాడు. అంతా వదిలేసి వేరే పని చెయ్యడమూ చేతకాలేదు. ఇప్పుడు రాబందులను పెంచడం నేరం. ఇంట్లో రాబందులున్నాయని తెలిసినా అటవీశాఖవారు అరెస్ట్ చేస్తారు. ఇదివరకే డిల్లిబాబుకు మూడుసార్లు ఫైను వేసి కట్టమన్నారు. నాన్న ఒకసారి జెయిలుకెళ్ళొచ్చాడు కూడా.

డిల్లిబాబు ఎలక్ట్రిక్ ట్రెయిన్‌లో ఓ మూలగా కింద కూర్చున్నాడు. ఇంట్లో ఎక్కడయినా బీడీ ఉండే ఉంటుంది, వెతికి ఒకటి తెచ్చుకుని ఉండాల్సింది అనుకున్నాడు. వాడి నోరు బీడీకోసం తపించింది. ఒళ్ళంతా అలజడిగా ఉంది. ఆపకుండా ఆవలిస్తూనే ఉన్నాడు. చివరికి ఎగ్మోర్ స్టేషన్‌లో దిగాడు. చేత్తుపట్టు వైపుకు నడిచాడు. ఎండ మరింత చురుకెక్కింది. వాడి నీడ వాడి కాళ్ళమీద చిన్న మరకలా పడింది. ఏకబిగిన నడవలేక మధ్యలో ఒకటిరెండుసార్లు ఆగాడు. దాహమేసింది. ఎక్కడైనా నీళ్ళు దొరుకుతాయా అని వెతికాడు. ఒక టీ అంగట్లో స్టీలు డ్రమ్‌లో నీళ్ళు ఉన్నాయి. గొలుసుకు గ్లాసు వేలాడుతోంది. నీళ్ళు క్లోరిన్ వాసన. రెండు గ్లాసులు తాగాక కొంచం శక్తొచ్చింది.

శబరీశన్ ఇల్లు ఉన్న చోటుకు చేరుకున్నాడు. ఇల్లు ఉన్న చోట కొత్తగా అపార్ట్‌మెంటు ముప్పావు వంతు లేచి ఉంది. ఆ రోజు పనులేమీ జరుగుతున్నట్టు లేదు. బక్కబారిన శరీరానికి యూనీఫామేసుకుని ఒక వృద్ధ వాచ్‌మన్ ఒళ్ళో కర్రను వాల్చుకుని స్టూల్‌మీద కూర్చుని ఉన్నాడు. అతని దగ్గరకెళ్ళి సలామ్ కొట్టాడు. అతను కళ్ళు రిక్కించి చూశాడు. ముసలాయన ఎక్కడో గ్రామంనుండి వచ్చి ఉండవచ్చు అనిపించింది. ఆయన కళ్ళలో ఆప్యాయత కనిపించింది. వాడు చిన్నగా చిరునవ్వు చిందించాడు.

ముసలాయన “తిన్నావా ఏమైనా?” అని అడిగాడు.

“లేదు.”

“అంగ పారు…” అని ఒక టీకొట్టుకేసి చూపిస్తూ “ఆ టీ కొట్టుకు పోయి టీ, బన్ను తిను పో… నన్ను చూపించు అతనికి.”

వాడు టీ కొట్టుకు వెళ్ళి టీ బన్ను అడిగాడు ‘ఆయన ఖాతాలో’ అని వాచ్‌మేన్‌ని చూపించాడు. టీ అంగటాయన ఇటు చూడగానే వాచ్‌మన్‌ చేయూపాడు. డిల్లిబాబు రెండు బన్నులు తీసుకుని రెంటినీ రెండు ముక్కలుగా చీల్చి నాలుగు ముద్దల్లో నమిలి మింగేశాడు. వేడిగా టీ తాగాడు. బన్ను తిని టీ తాగాక ప్రాణానికి హుషారొచ్చింది. వాచ్‌మన్ దగ్గరికి వచ్చాడు. వాచ్‌మన్ ఒక బీడీ ఇచ్చాడు. తానూ వెలిగించుకున్నాడు.

“నా పేరు డిల్లిబాబు… సినిమాల్లో పని. ఇప్పుడు సినిమాలు లేవు. కష్టకాలం. ఇక్కడ మా డైరెక్టర్ ఒకాయనది ఇల్లు ఉండేది.” చెప్పాడు డిల్లిబాబు.

“ఇక్కడా?”

“అవును.”

“లేదే, ఇక్కడ ఒక డాక్టరు ఉండేవారు ఇదివరకు” అన్నాడు వాచ్‌మన్.

“డాక్టరా?”

“అవును. కంటి డాక్టరు. ఇప్పుడు ఆయన కోట్టూర్‌పురంలో ఉన్నారు… సాయిబాబా గుడి పక్కన.”

“డాక్టర్‌కు ఎంత వయసు ఉంటుంది?”

“నలభై ఉంటుంది.”

“అయితే ఆయన డైరెక్టర్‌గారి కొడుకు. నేను చెప్తున్నది వాళ్ళ నాన్న గురించి… పాత డైరెక్టర్.”

“ఆ విషయాలేమీ నాకు తెలీదు బాబూ.”

“ఆయనే అయుండాలి… నేను వెళ్ళి చూస్తాను. మీది ఏ ఊరు” అడిగాడు డిల్లిబాబు.

“మదురై పక్కన. మెడ్రాస్‌కు వచ్చి ఏడెనిమిదేళ్ళయింది. మళ్ళీ తిరిగి వెళ్ళనేలేదు.”

“ఎందుకని?”

“అక్కడేముందని వెళ్ళేది? కరువు, కష్టాలు తప్ప! మా నాన్న, తాతలు, ముత్తాతలు బతికిన ఊరు. చెప్పుకోడానికే! కూటికి పనికొస్తుందా?” నిట్టూర్చాడు వాచ్‌మన్.

“పిల్లలు?”

“వాళ్ళూ ఇక్కడే ఉన్నారు, మెడ్రాస్‌లోనే. మేము వెళ్ళం వాళ్ళ దగ్గరకి. ఇక్కడే రాత్రింబవళ్ళు… ప్రాణమున్నంత కాలం ఇక్కడే పడుండి కాటికి పోవాల్సిందే.” శూన్యంలోకి చూశాడు వాచ్‌మన్.

“మేము గొల్లవార్, రాజమండ్రి వైపునుండి మూడు తరాలకు ముందు వచ్చేశాం! ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకుని స్థిరపడిపోయాడు మా తాత” అన్నాడు డిల్లిబాబు.

“మేము మోతుబరి వ్యవసాయం చేసుకునే మఱవర్లం. నా పేరు ఒచ్చన్!” బీడీ దమ్ము లాగుతూ “కూటికి సమస్యలేదు. అయితే మేము బతికిన బతుక్కి ఇప్పుడు ఒకళ్ళకింద ఇలా చిటికేసి పిలిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది… సరేలే, అంతా రాత…”

“అవును… మన చేతుల్లో ఉందా!”

నెమ్మదిగా బీడీలు పీల్చుకున్నారు. డిల్లిబాబు బుగ్గలు లోపలికి వెళ్ళేలా పీల్చుకుని వదిలాడు. వాచ్‌మన్ సగం కళ్ళు మూసుకుంటూ రోడ్డుకేసి చూస్తూ పొగ వదిలాడు.

“వస్తాను.” డిల్లిబాబు బయలుదేరాడు.

“టీకి డబ్బుల్లేదంటున్నావు… కోట్టూర్‌పురం ఎలా వెళ్తావు?”

డిల్లిబాబు నవ్వాడు.

“ఇదిగో ఇరవై రూపాయిలు. ఉంచుకో. ఇంతే ఉంది.”

వాడు దండం పెట్టుకుంటూ తీసుకుని “థేంక్స్” అన్నాడు.

“నీ దగ్గరేదో బాగా వాసన వస్తోంది… పందులేమైనా పెంచుతావా?”

“లేదు. రాబందులు…”

“ఏంటి?” నోరూ కళ్ళూ పెద్దగా తెరిచి బీడీ పొగలుకక్కుతూ ఆశ్చర్యంగా అడిగాడు.

“రాబందు… సినిమాకు రాబందుల్ని అద్దెకిచ్చేవాళ్ళం. ఇప్పుడు అవకాశాల్లేవు.”

“అవి నీ మాటలు వింటాయా?”

“అవును. వింటాయి. చిన్నప్పట్నుండి ట్రెయినింగ్ ఇస్తాం.”

“రెక్కలు కత్తిరించి సాకుతారా?”

“అవును. ఇదివరకు రెక్కలు కత్తిరించి, గోళ్ళు కోసి ఉంచేవాళ్ళం. ఇప్పుడు అన్నీ ఉన్నాయి.”

“వాటిల్ని విడిచి పెట్టేయొచ్చు కదా? వాటికి తిండి పెట్టటం కష్టం కదా?”

“అయితే అవి వెళ్ళాలి కదా? తరుముతూనే ఉంటాను. అవి వెళ్ళవు ఎక్కడికీ…”

“నువ్వే వాటిని వదిలేసి వెళ్ళిపోవాల్సింది.”

“నాన్న ఉన్నాడు. వదిలి వెళ్ళలేను. అంతే కాదు అవి పక్షులు కదా. మనం ఎక్కడికెళ్ళినా వచ్చేస్తాయి.”

“హ్మ్… కష్టమే” అన్నాడు వాచ్‌మన్ సానుభూతిగా.

అప్పుడే ఎవరో ఒకతను బైక్‌లో వచ్చి ఆగి “ఏం ఒచ్చా, ఏంటి కబుర్లు? ఎవురు ఈయన?” అని అడిగాడు.

“డాక్టరువాళ్ళ నాన్నని వెతుక్కుంటూ వచ్చాడు.”

“ఎవరు?”

“సినిమా డైరెక్టర్” అన్నాడు డిల్లిబాబు.

“శబరీశనా ఆయన పేరు?”

“అవును” అన్నాడు.

“ఆయన పోయి రెణ్ణెల్లయింది.”

“ఎక్కడికి?”

అతను నవ్వుతూ “ఎవరికి తెలుసు? హార్ట్ ‌ఎటాక్. వయసు కూడా ఎనభై ఐదు దాటింది కదా…”

డిల్లిబాబు నిట్టూర్చాడు. ఒచ్చన్ “ఏం చేద్దాం? మనం ఒకటి అనుకుంటే, దేవుడొకటి అనుకుంటాడు!” అన్నాడు.

“వస్తానయ్యా” అని సెలవు తీసుకున్నాడు డిల్లిబాబు.

వెనక్కి వస్తుంటే కోట్టూర్‌పురం వెళ్ళవలసిన అవసరం లేదన్న విషయం కొంచం ఉపశమనం అనిపించింది. ఎండ కాగిపోతోంది. ఎప్పట్లాగే స్టూడియోలకు వెళ్ళి చూడొచ్చు. అక్కడ తెలిసినవాళ్ళు ఎవళ్ళో ఒకళ్ళు ఉంటారు. వాడి పక్కన ఒక వేన్ వచ్చి ఆగిన చప్పుడు వినిపించుకోలేదు. మెడమీద గట్టిగా ఒక దెబ్బ పడింది. “రేయ్. ఎక్కరా బండి” అని పోలీసోడు గద్దించాడు.

“సార్, సార్” అని చేతులు జోడించి బ్రతిమలాడాడు. “సినిమాలో పనిచేస్తాను సార్… సార్… నాన్నకు ఒంట్లో బాలేక చావుబతుకుల్లో పడున్నాడు సార్.”

“ఎక్కరా… ముందు బండెక్కు. రోడ్డు మీద డ్రామాలు వెయ్యొద్దు… ఎక్కు.”

వాడిని మెడపట్టి తోసి వేన్‌లో ఎక్కించే ప్రయత్నం చేశాడు. వాడు “సార్, ఏంటి సార్ ఇది?” అని కొంచం కోపంగా అడిగాడు. “నేను కష్టం చేసుకుని బతికేవాడిని సార్.”

రెండుసార్లు చెంపమీద వాయించాడు పోలీసు. చెంపలమీద దెబ్బలు తగలకుండా చేతులు అడ్డుపెట్టుకున్నాడు డిల్లి.

“నా కొడకా, నోరు ముయ్… పళ్ళు రాలగొడతా నీ…” అన్నాడు పోలీసోడు.

“నేను పనిమీద వెళ్తున్నాను సార్… నాన్న చావుబతుకుల్లో ఉన్నాడు.”

“నా కొడకా, మూసుకుని ఎక్కరా నీ…” అని మళ్ళీ చెంప చెళ్ళుమనిపించి లోపలకు తోసి తలువు వేసి వేనెక్కాడు పోలీసోడు. డిల్లి ఏడుపు మొదలుపెట్టాడు. పక్కనున్న ఒక గడ్డమోడు డిల్లిబాబు భుజం మీద చెయ్యి వేశాడు. తలెత్తి చూశాడు. ‘ఏడవకు’ అన్నట్టు సైగ చేశాడు గడ్డమోడు. ఆ వేన్‌లో అప్పటికే ఎనిమిదిమంది ఉన్నారు. దెబ్బలు కొట్టిన చోట్ల నొప్పిగా ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చున్నాడు.

“ఏంట్రా అక్కడ గోల?” అని అరిచాడు పోలీసోడు. డిల్లిబాబు కళ్ళు మూసుకున్నాడు. ఒళ్ళు కుదించుకుని తలవంచుకుని కూర్చున్నాడు. వేన్ ఆగిన చోటు పోలీస్‌ స్టేషన్‌లా అనిపించింది. అయితే అది కోర్ట్ అని దిగాక తెలిసింది. వాళ్ళను కిందకు లాగి ఒక పెద్ద ఎర్ర బిల్డింగ్ అరుగు పక్కన నిల్చోబెట్టారు. అదివరకే మరో ఐదుగురు నిల్చునున్నారు అక్కడ. చుట్టూతా పోలీసోళ్ళు ఐదారుగురున్నారు. ఒకతను తెల్ల షర్టు, ఖాకీ పేంటు వేసుకుని ఆ అరుగు మీద కూర్చుని ఇటికరాయి స్తంభానికి ఆనుకుని ఒడిలో పేడ్ పెట్టుకుని ఏదో రాస్తున్నాడు.

ఎస్.ఐ. వేను దిగి సిగరెట్ ముట్టించుకున్నాడు. ఒక పోలీసు వచ్చి “ఒరేయ్, ఏడుపులు, డ్రామాలు ఆపేసి మూసుకుని చెప్పింది చెయ్యండి… లేదంటే అంతే” అన్నాడు కోపంగా.

డిల్లిబాబు చేతులు జోడించి ఏడుస్తూ “సార్, కొంచం నా మీద జాలి చూపించండి సార్. నేను సినిమాల్లో పనిచేసేవాడ్ని సార్!” అన్నాడు.

“వీడెక్కా, వీడికి నోటి దూల ఎక్కవైంది చూడండ్రా!” అన్నాడు ఎస్.ఐ.

ఒక పోలీసు వచ్చి “మూసుకోరా నాకొడకా” అని అరుస్తూ లాఠీతో మోకాళ్ళమీద కొట్టాడు. వాడు తలమీద చేతులు జోడిస్తూ కింద కూర్చుండిపోయాడు. ఇప్పుడు లాఠీ దెబ్బలు భుజాలమీద పడ్డాయి. బూట్ కాలితో ఒక్క తన్ను తన్నాడు పోలీసోడు.

“సార్… సార్… సార్” డిల్లిబాబు ఏడ్చాడు.

“నీయమ్మ, నోరిప్పావంటే ఇక్కడే చంపి పాతేస్తా” అన్నాడు పోలీసోడు.

వాడు నేలమీద ముడుచుకుపోయి కూర్చున్నాడు.

“లేచి సరిగ్గా కూర్చోరా” అన్నాడు ఎస్.ఐ.

వాడు లేచి గొంతుక్కూర్చున్నాడు. అరుగుమీద కూర్చుని రాస్తున్న అతను ఒకడ్ని పిలిచి “రేయ్ ఇందులో వేలిముద్ర వెయ్” అన్నాడు. లుంగీ కట్టుకుని ఉన్న చింపిరి జుట్టోడు సిరాలో వేలు అద్ది ఆ కాగితంలో వేలి ముద్ర వేశాడు. ఇదివరకు తనని భుజంమీద తాకి ఒదార్చిన గడ్డపోడు లేచి నిల్చుని కిందకు చూసి మెల్లగా వంగి చేయి అందిస్తూ “లేచి నిల్చో… మాట్లాడకు” అన్నాడు.

డిల్లిబాబు వాడి చెయ్యి పట్టుకోకుండానే లేచి నిల్చున్నాడు. “కొడతారు… ఎంత మొరపెట్టినా వినిపించుకోరు” అంటూ “న్యూసెన్స్ కేసులే పెడతారు… వెయ్యి రూపాయలు ఫైను, లేదంటే జెయిలు… మూడురోజులు జెయిలు. అయినప్పటికీ ఒకే రోజులో కూడా వదిలిపెట్టేస్తారు… రేపటికి వెళ్ళిపోవచ్చు… ఊరికే ఏడ్చి దెబ్బలు తినకు” అన్నాడు.

“మా నాయన…”

“ఒక రోజే కదా? జెయిల్లో బతిమలాడితే డేట్ రాసుకుని పంపించేస్తారు” అన్నాడు.

పెచ్చులూడిన స్తంభానికి ఆనుకుని డిల్లిబాబు నిశబ్దంగా ఏడుస్తూ కన్నీళ్ళు కార్చాడు. డిల్లిబాబు మూడు రోజులు జెయిల్లో ఉండాల్సి వచ్చింది. జడ్జీతో ఒకమాటైనా చెప్పేందుకు అవకాశం లేకపోయింది. భుజాలు పట్టి లాక్కుని తీసుకెళ్ళారు. ఎక్కడెక్కడో నిల్చోబెట్టి, ఎన్నెన్నో కాగితాల్లో బలవంతంగా వేలిముద్రలు తీసుకుని, వేన్‌లో ఎక్కించుకుని తీసుకెళ్ళి, హోటల్లో బిర్యానీ పొట్లాలు తీసిచ్చి, సాయంత్రానికి జెయిలుకు తీసుకెళ్ళారు. వేన్‌లో వచ్చిన అందర్నీ తీసుకెళ్ళి ఒకే గదిలో బంధించారు. ఒకరినొకరు ఒరుసుకుంటూ కూర్చోడానికి, పడుకోడానికీ మాత్రమే సరిపోయేంత చిన్న గది.

డిల్లిబాబుతో వచ్చినవాళ్ళలో ఒక్కడు తప్ప మిగిలిన అందరూ దీనికి అలవాటుపడినవాళ్ళే. గదిలో వచ్చి కూర్చోగానే ఏమీ జరగనట్టు నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. డిల్లిబాబుకు ఇందాక సలహా చెప్పిన గడ్డపోడి పేరు కరుప్పుసామి. దాచిపెట్టుకున్న బీడీలు తీసుకుని దమ్ములాగుతూ వాళ్ళతో కబుర్లలోపడ్డాడు కరుప్పుసామి. డిల్లిబాబు చేసేది తోచక కుంచించుపోయినట్టు కూర్చున్నాడు. ఒళ్ళు వణుకుతూనే ఉంది. కరుప్పుసామి బీడీ కావాలా అని అడిగాడు. వద్దన్నాడు. కన్నీళ్ళు కారి కారి ఎండిపోయాయి. ఏమీ తోచట్లేదు, స్తబ్ధుగా ఉంది. తెలియకుండానే ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు. మెలకువ వచ్చినప్పుడు తెల్లారుతోన్నట్టు మసకగా ఉంది వెలుతురు. గదంతా మనుషుల ఆవిరితో వేడిగా ఉంది. అందరి ఒంటిమీదా దోములు సందు లేకుండా కప్పేసుకుని ఉన్నాయి. కాస్త కదిలినా జుయ్యిమంటూ లేచి ఎగిరి మళ్ళీ వాల్తున్నాయి. వాడుంటున్న గుడిసెలో కూడా దోమలుంటాయి. అయితే ఇక్కడున్నన్ని దోమలుండవు.

ఒంటేలుకొచ్చింది. మెల్లగా జరిగి జరిగి తలుపు దగ్గరకు చేరుకున్నాడు. బాగా తెల్లారాకే తలుపు తీశారు. ఒంటికి పోసుకుని పళ్ళు తోముకుని వచ్చాడు. తెల్లారాక వదిలేస్తారు అనుకున్నాడు. అయితే టిఫిన్‌కు తీసుకెళ్ళారు. ఆ పెద్ద షెడ్డంతా ఒకటే గోల – ప్లేట్లు, గ్లాసులు రాసుకుంటున్న మోతతో అదిరిపోతోంది. ఇడ్లీ, వడ ఇస్తున్నారు.

డిల్లిబాబు అక్కడున్న ఒక కోరమీసాల వార్డన్ దగ్గరకెళ్ళి “అయ్యా, మా నాన్న ఇంట్లో ఒక్కడే ఉన్నాడయ్యా… నన్ను వదిలేయమనండయ్యా” అని బతిమలాడాడు.

“మూసుకుని పోరా… పొద్దున్నే నా చేతిలో దెబ్బలు తినకు” అంటూ లాఠీ పైకెత్తాడు.

వాడు చేతులు జోడించి కన్నీళ్ళతో వెనుతిరిగాడు. గోడ పక్కన ఏడుస్తూ నిల్చున్నాడు. కరుప్పుసామి వాడికి అల్యూమినియం ప్లేట్లో ఇడ్లీ సాంబారు తీసుకొచ్చి ఇచ్చాడు.

“తిను… సాయంత్రానికి విడిచిపెట్టేస్తారు.”

ప్లేట్ తీసుకున్నాడు. ఇడ్లీ వాసనకి పొట్టలో ఆకలి కట్టలు తెంచుకుంది. ఆత్రంగా ఆ ఇడ్లీలు తిన్నాడు.

“బాగా తిను… ఊరికే బాధపడకు. వీళ్ళు మనల్ని ఏం చేయగలరు? తిండి మాత్రం తింటూ ఉండు. మనకు అది చాలా అవసరం.” అన్నాడు కరుప్పుసామి.

ఆ రోజు సాయంత్రం కూడా విడిచిపెట్టలేదు. పగలంతా వాళ్ళు పిలుస్తారేమో అని చూస్తూ ఉన్నాడు. సాయంత్రం ఇంకో వార్డన్ దగ్గరకెళ్ళి “అయ్యా నాన్న పస్తుతో చచ్చిపోతాడేమో… నోరులేని రెండు ప్రాణాలు కూడా ఉన్నాయయ్యా” అని ఏడ్చాడు.

వాళ్ళకు అలాంటి ఏడుపులు, బతిమాలుళ్ళు ఏ మాత్రం ఎక్కలేదు. వాడు చేతులు జోడించి బతిమాలుతూనే ఉన్నాడు. వార్డన్ వాడి ముఖమైనా చూడకుండా వెళ్ళిపోయాడు.

“ఈ రోజు వాళ్ళుకు లోడు ఎక్కువ ఉందేమో… తీరిక దొరికుండదు. రేపు పొద్దున వదిలేస్తారు… వదిలేయక తప్పదు. ఈ జెయిల్లో ఖాళీల్లేవు. రాత్రికి గమ్మున తిని పడుకో… ఏం ఆలోచించకు” అన్నాడు కరుప్పుసామి.

మరుసటి రోజు పొద్దున కూడా విడిచిపెట్టకపోయేసరికి డిల్లిబాబుకు నమ్మకం పోయింది. సహనం కోల్పోయాడు. వార్డన్ దగ్గరకు వెళ్ళి “అయ్యా నన్ను విడిపించమనేశారా? అయ్యా” అని అడిగాడు.

“రేయ్, పోరా” అని లాఠీ పైకెత్తాడు.

డిల్లిబాబు ఉన్నపళాన కేకలు పెట్టాడు “ఒరేయ్, ఏం చేస్తున్నార్రా! నేను గొంతు కోసుకుని చచ్చిపోతాను… ఇక్కడే నన్ను నేను చంపేసుకుంటాను” అని గట్టిగా ఏడ్చాడు. చేతిలో ఉన్న అల్యూమినియం ప్లేట్‌ని రెండుగా మడిచి దాన్ని మెడమీద పెట్టుకుంటూ ఆక్రోశంగా “నేను చచ్చిపోతాన్రా రేయ్…” అంటూ పెద్దగా అరిచాడు.

రెండు వైపులనుండీ వార్డన్‌లు ఏకకాలంలో వచ్చి వాడిని తన్ని నేలమీద పడేశారు. వాడు లేవబోతుంటే “చావరా, చావు” అంటూ మళ్ళీ తన్నారు. వాడిని అలా తంతుంటే ఇతర ఖైదీలు చూస్తూ గమ్మున నిల్చున్నారు. డిల్లిబాబు కదల్లేక అలా చుట్టుకుపోయి ఉండిపోయాడు. వార్డన్‌లు వాడిని లాక్కెళ్ళి ఒక చిన్న గదిలో పడేశారు. కాళ్ళు చాచి పడుకోడానికి కూడా వీలులేనంత చిన్న గది. పై అంతస్తుకెళ్ళే మెట్లకింద ఉన్న చిన్న చోటు అది. త్రిభుజాకారంలో ఉంది. లేచి నిల్చోడం కూడా వీలుకాదు.

ఒళ్ళంతా దెబ్బల నొప్పితో ఆ పగలంతా ఆ గదిలో పడున్నాడు. పచ్చి ఒళ్ళు చురచురమని మండుతుంటే భరించలేక వణుకు పుడుతూ ఉంది. ఒక్కసారిగా ఒళ్ళంతా రాబందులు పొడిచి తింటున్నట్టు అనిపించింది. కొంచంగా తలుపు తీసి అన్నం ఇచ్చారు. వారుల్లాంటి చపాతీలు, పప్పు. వాటిని తిని పడుకున్నాడు. దోమలు వచ్చి చుట్టుకున్నాయి. దోమలొచ్చాయి కాబట్టి రాత్రయినట్టుంది అనుకున్నాడు. నోట్లోకి వెళ్ళిపోతున్న దోమల్ని ఉమ్ముతూనే ఉన్నాడు. ఒళ్ళు పచ్చిపుండయి దెబ్బల నొప్పి హింసపెడుతోంది. బాగా ఏడ్చి అలసిపోయాడు. నిద్ర ఆవరించేసింది. తెల్లవారుజామున ఒక కల వచ్చి మేలుకున్నాడు- ఆ చిన్న గదిలో చచ్చిపోయి సగం కుళ్ళిన దేహంతో పడి ఉన్నాడు. వాడి చుట్టూ రాబందులు కూర్చుని ఉన్నాయి. తెల్లవారుజామొచ్చిన ఈ కలతో మనసు వికలమై చాలాసేపు ఏడ్చి మళ్ళీ నిద్రపోయాడు.

మరుసటి రోజు వాడు ఆ గదినుండి బయటకు వచ్చినప్పుడు కళ్ళు మసకబారిపోయినట్టు అనిపించింది. నోరు ఎండిపోయింది. ఎండ కళ్ళను తెరవనివ్వడంలేదు. చేయి అడ్డుపెట్టుకున్నాడు. ఏం మాట్లాడకుండా నేలకేసి చూస్తూ కూర్చున్నాడు. ఒక వార్డన్ తెచ్చి ఇచ్చిన భోజనాన్ని మాత్రం ఆత్రంగా తిన్నాడు. ఆ రోజు డిల్లిబాబును అందరితోపాటుగా మామూలు గదిలోనే ఉంచారు. ఒళ్ళంతా పచ్చిపుండు. ఎవరూ వాడితో మాట్లాడలేదు. కరుప్పుసామి మాత్రం “రక్తం కారుతున్న పుళ్ళకు చేత్తో ఉచ్చపట్టి పోసుకో… ఆరిపోతాయి” అన్నాడు. వాడు అలా చెయ్యలేదు. వాళ్ళంతా చేతి వేళ్ళను నిలపెట్టి ఏదో ఆట ఆడుతున్నారు. డిల్లిబాబు ఒక మూల గోడకు అనుకుని కూర్చునే నిద్రపోయాడు.

ఆ మరుసటి రోజు అందర్నీ విడుదల చేసేశారు. తెల్లవారి టిఫిన్ తిన్నాక వాడు వరాండాలో పడుతున్న ఎండకేసి చూస్తూ కూర్చున్నాడు. వాడి పేరు పిలిచింది కూడా వినిపించుకోలేదు. కరుప్పుసామి వాడిని కదిపి, పిలుస్తున్నారు అని చెప్పాడు. “ధైర్యంగా పో. వదిలేస్తారు. జేబులో డబ్బులేమైనా ఉండి ఉంటే అడిగి తీసుకో” అన్నాడు.

వాడు వేలిముద్ర వేసి వాళ్ళు తీసిపెట్టుకున్న ఇరవై రూపాయలు తీసుకుని బయటకు వచ్చినప్పుడు ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. కళ్ళు మండుతున్నాయి. కళ్ళనుండి నీళ్ళు కారుతున్నాయి. కాళ్ళు తడబడ్డాయి. ఆకాశంలో ఎగిరే పక్షుల నీడలు నేలమీద పడుతున్నాయి.

ఎలక్ట్రిక్ ట్రెయిన్‌ ఎక్కి తన స్టేషన్‌కు వచ్చి దిగేసరికి బాగా అలసటగా అనిపించింది. ఉదయం జెయిల్లో తిన్నాడు. సంగటిముద్దల్లాంటి నాలుగు ఇడ్లీలు, ఒక వడ. చెడిపోయిన పాలతో కాచి ఇచ్చిన టీ. జెయిల్లో ఉన్నప్పుడు ఆకలేసినట్టు ఎప్పుడూ ఆకలెయ్యలేదు వాడికి. ట్రెయిన్ దిగేవరకు తన జేబులో డబ్బున్న సంగతి గుర్తురాలేదు. అనుకోకుండా జేబు తడుముకున్నప్పుడు రూపాయలు ఉండటం గుర్తొచ్చింది. రెండు బన్నులు, నూరు గ్రాములు చక్కెర, బీడీలు కొనుక్కున్నాడు. నాన్నకి బీడీలు ఇష్టం. అయితే ఆయన స్వయంగా పట్టుకుని బీడీలు తాగలేడు. వణికే వేళ్ళమధ్య బీడీ నిలవదు.

డిల్లిబాబు ఎండలో కాళ్ళీడ్చుకుంటూ మెల్లగా నడిచాడు. పాదాలు వాచిపోయాయి. పాదాల పగుళ్ళు, వాపు కలిసి దురదగా కూడా ఉంది. దార్లో ఒక బస్‌స్టాప్‌లో ఆగి కాస్త అలసట తీర్చుకున్నాడు. గుడిసెను విడిచి బయల్దేరినప్పుడు వేసుకున్న అదే చొక్కా. ఆ తర్వాత స్నానం లేదు. చొక్కాను తీయనేలేదు. మట్టిలో దుమ్ములో ఎక్కడెక్కడో పడి పొర్లాడి నిద్రపోయి మాసిపోయింది. రక్తం మరకలు ఎండిపోయి నల్లగా మారిపోయింది. రోడ్డునుండి తన గుడిసె ఉన్న సందువైపుకు తిరిగాక హఠాత్తుగా ఒక విషంయం స్ఫురణకు వచ్చింది. నాన్న ప్రాణాలతో ఉండే అవకాశం లేదు అని! దుఃఖం నిలువెల్లా ఆవరించింది.

నిజానికి అదేం సందు కాదు. మురికి కాలువ. కాలువలో వేసి ఉన్న కాంక్రీట్ రాళ్ళమీద జాగ్రత్తగా గెంతుతూ వెళ్ళాలి. బాధతో వణుకుతూ అతి కష్టంమీద గుడిసె దగ్గరకు చేరుకున్నాడు. రాబందుల మూలుగు వినబడుతోంది. వాడి ఒంట్లో అలజడి పెరిగింది. చేతులు వణికాయి. ఆగాడు, తనను తానే ఓదార్చుకుంటూ అలజడిని కాస్త తగ్గించుకుని నడిచాడు. వాడు వస్తున్నాడన్న వాసన రాబందులకు తెలిసిపోయినట్టుంది. వాకిటికి చేరుకోగానే అనుకోకుండా చల్లటి గాలి ముఖాన్ని చుట్టుకున్నట్టు శాంతంగా అనిపించింది. చేతులు, భుజాలు జారిపోయి అలా నిలిచిపోయాడు. అలజడులు నెమ్మదిగా అణగారాయి. నిదానం వచ్చింది. అప్పటిదాకా తన ముఖంలోని కండరాలు బిగుసుకుపోయున్నాయి అన్న విషయమే స్పురణకు రాలేదు. అవి సడలి నెమ్మదిగా యథాస్థితికి వచ్చాయి అనిపించింది.

గుడిసె లోపలనుండి ఆల్ఫా ఎగురుకుంటూ బయటికొచ్చింది. వాడి తల పైన ఎగురుతూ ‘క్రేయ్క్’ అని కూత వేస్తూ గుండ్రంగా తిరిగి మళ్ళీ దాటుకుని నెమ్మదిగా నేలమీదకు వాలింది. బీటా లోపలనుండి నడిచి వచ్చి రెక్కలు విప్పి గాల్లోకి ఎగిరి ఒకమారు గాల్లో రౌండ్ వేసి నేల మీదకు వాలింది. రెండు రాబందులూ వాడి తలమీద అలా చక్కర్లు కొట్టినప్పుడు అవి రెక్కలల్లార్చిన గాలి వాడి ముఖానికి తాకింది.

వాడు “నాయనా” అని పిలిచాడు. అప్పటికే కుళ్ళిన శవం వాసన వాడి నాసికాపుటాలను చేరుకుంది. తల వంచి గుడిసె లోపలికి వెళ్ళాడు. నాన్న మంచం మీద కదలకుండా పడున్నాడు. దగ్గరకు వెళ్ళి “నాయనా” అని పిలిచాడు. రాబందులు లోపలికి వచ్చి రెక్కలు చూరుకు రాసుకోవడంవల్ల ఎగరలేక నేలమీదనే నడిచి వచ్చాయి. ఆల్ఫా నాన్న తల దగ్గర కూర్చుంది. బీటా గుండెపై జాగ్రత్తగా కూర్చుని తన కాళ్ళను తన ముక్కుతో మెల్లగా గీరుకుంది. బక్కచిక్కిన నాన్న శరీరం ఇప్పుడు బాగా ఉబ్బిపోయి లావుగా ఉంది. ముడతలు పడిన బుగ్గలు వాచిపోయి కళ్ళను లోపలకు నెట్టేశాయి. తెరిచిన రెప్పల మధ్య కళ్ళలో చీమలో మరేవో సన్నటి పురుగులో తిరుగుతున్నాయి. నోరు నల్లగా మారి తెరుచుకుని లోపలున్న నాలుక వాచిపోయి ఉంది. పొట్ట ఉబ్బిపోయి బస్తాలా ఉంది. గదిలో నీలి రంగులో పెద్ద పెద్ద ఈగలు ‘ఝుమ్మ్‌మ్మ్‌మ్మ్’ అంటూ రొద చేస్తూ ఎగురుతున్నాయి. బీటా కూర్చున్నప్పుడు ఆవి పెద్ద శబ్దంతో లేచి మళ్ళీ సద్దుమణిగాయి.

వాడు బయలుదేరిన కాసేపటికే నాన్న చచ్చిపోయుండాలి. ఆల్ఫా, బీటాలు అక్కడ లేకపోయుంటే ఈ పాటికి పందికొక్కులు నాన్న శవాన్ని కొరికి పడేసుండేవి. ఈ పాటికి వేరే పక్షులు కూడా వచ్చుండేవి. రెండు రాబందుల్నీ చూస్తూ ఉన్నాడు. బీటా అసలు ఎగరలేకపోతోంది. కొంచం దూరం ఎగరగానే అలసిపోతోంది. రెక్కలల్లార్చడం ఆపి తలవాల్చి కూర్చుండిపోతోంది. రెక్కల్ని విసనకర్రలా విప్పి నేలదాకా వాల్చి మెడను లోపలికి లాక్కుంటోంది. దాని కింది ముక్కు ‘టకటక’మని కొట్టుకుంటోంది. దాహం వేస్తున్నట్టు పద్దాకా నోరు తెరిచి మూలుగుతోంది. అదికూడా ఇంకో ఒకటి రెండు రోజుల్లో చచ్చిపోవచ్చు. ఆల్ఫా మరికొన్ని రోజులు బతకొచ్చు.

డిల్లిబాబు బయటకు నడిచాడు. సందులాంటి ఆ కాలువలోనే నడుచుకుంటూ వెళ్ళి చివర్న ఉన్న చాకలి గురవయ్య గుడిసె ముందు నిల్చుని “గురవన్నా, గురవన్నా” అని పిలిచాడు.

గురవయ్య లోపలనుండి వచ్చి “ఏం రా డిల్లీ, ఎక్కడికి బొయ్నావు! రెండుమూడు దినాలుగా లేవా ఏంది! ఆ పెద్ద కాకులు రెండూ పైకి కిందకీ ఎగర్తా వాల్తా ఉన్నాయే?” అని అన్నాడు.

“నాయన సచ్చిపొయినాడ్నా!” అన్నాడు.

“ఎప్పుడు?”

“రెండు రోజులైయుంటది!”

“అదేనా గబ్బుకొడతా ఉంది? నేను కూవంలో ఏదో సచ్చుంటుంది అనుకన్నేను… నీ పెద్ద కాకులు ఈయాళకే పీనుగుని పొడ్చి తినేసుంటాయే?” అని అడిగాడు.

“లేదు నా. బాడి అట్నే ఉంది… అవే కాపలా ఉన్నాయి నా. కార్పేసన్‌కు(మునిసిపాలిటి) సెప్పాల.”

“దుడ్డు ఉందా?”

“లేదు నా.”

“లేకుంటే వాడు వస్తాడా! దుడ్డు అడగతాడు కదా?”

డిల్లిబాబు ఏం మాట్లాడకుండ నిల్చున్నాడు.

“అయితే ఒకపన్జెయ్రేయ్… నువ్వెక్కడికయినా ఎల్లిపూడువు… కార్పేసనోడికి నేన్జెప్తాను… అనాద పీనుగని. వాళ్ళొచ్చి ఎత్తుకోనిపోతారు.”

“సరేనా” అన్నాడు డిల్లిబాబు.

డిల్లిబాబు ఒకసారి తిరిగి చూశాడు. గుడిసెలో తీసుకోడానికి ఏమైనా ఉందా అన్నట్టు.

గురవయ్య “ఒరేయ్, ఆటిల్ని తోడుకోనిపోరా… ఆటిల్ని సూస్తే ఆళ్ళు రారు కదరా” అన్నాడు.

“ఆఁటిల్ని తోడుకుని పోలేన్నా… అదీ పగిటిపూట!” అన్నాడు డిల్లిబాబు.

“ఏందిరా ఇది గాచ్చారంగా ఉండాది…”

డిల్లిబాబు ఆ సందు చివర కాసేపు నిల్చున్నాడు. వెనక్కి తిరిగి గుడిసెలోకి వచ్చి ఆ బన్నుల్నీ బీడీల్నీ చక్కెరనీ విప్పి నాన్న పక్కన పెట్టాడు. నాన్న పాదాలు తాకి దణ్ణం పెట్టుకుని బయటకి వచ్చాడు.

ఎండకు తారు రోడ్డు నీటికాలువలా తళతళ మెరుస్తూ ఉంది. కొంచం దూరం నడిచాక కుడివైపు బడి మైదానం కనిపించింది. అక్కడ ఎవరూ లేరు. చిన్న పిట్టగోడ, దాన్ని ఎక్కి లోపలికి దూకాడు. మట్టి నేల. నిర్మానుష్యంగా ఉంది. కానుగ చెట్టు కింద నీడలో వెల్లకిలా పడుకున్నాడు. ఒక బీడీ తెచ్చుకుని ఉండచ్చేమో అనుకున్నాడు. నిట్టూర్చుతూ కాలిమీద కాలు వేసుకుని ఆకాశానికేసి చూశాడు. చాలా ఎత్తులో నాలుగు నల్లటి పక్షులు చక్కర్లు కొడుతున్నాయి. అవి ఆకాశాన్ని అంటిపెట్టుకుని కదులుతున్నట్టు అనిపిస్తోంది. వాడు వాటినే చూస్తూ ఉండిపోయాడు.

(మూలం: నెడుందూరం)


జయమోహన్

రచయిత జయమోహన్ గురించి: జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు. ...