ఆగిపోని గానం

కవిత్వం నాకొక దేవాలయం
నా శోధనలూ వేదనలన్నీ
నాకు తెలియకుండానే అక్కడ
గానమై విచ్చుకుంటాయి

నాకంటే ముందు నుండే ఎందరో అక్కడ
అసంఖ్యాక జీవిత స్వరాల్ని
అనంతంగా అద్భుతంగా పాడుతునే ఉన్నారు
అయినా ఎవరికీ తెలియకుండా
పాడాల్సినవి అగణ్యంగా
పెరిగిపోతూనే ఉన్నాయి

ఎన్నెన్ని బరువులో అందరివీ
అన్నీ ఒకే సంచిలో
మోసుకు తిరుగుతున్నారు
ఎవరి కన్నీళ్ళు వారివే అయినా
కన్నీళ్ళలో తేడాలేనట్టే
అందరినీ తాకుతున్న ఒకే బాధ

ప్రవాహంలో కొట్టుకుపోతున్నా
ఆకాశం అనంతాన్ని
సముద్రం వైశాల్యాన్ని
పాటల్లో ఇమడ్చాలని చూస్తున్నారు
జీవనస్పృహ కన్నీళ్ళు వారి ప్రతీకలు

వింటున్నారా చూస్తున్నారా ఎవరైనా
అర్ధమవుతోందా ఎవరికైనా
తెలుసుకునేలోగా
మరో కవిత్వ కెరటమేదో
దాన్ని తుడిచిపెట్టుకుపోతుంది

ఆ దేవాలయం
ఖాళీగా ఎప్పుడూ ఉండదు
కొత్త వారు వస్తూనే ఉంటారు
సరికొత్త బాధల భావనాస్వరాలతో–
వారిని వారే కాదు
అంతకు ముందున్న వారినీ
అందులో లీనం చేస్తూనే ఉంటారు