“నేను చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ మాత్రం వయొలెన్స్ జరక్కూడదు. ఎట్టి పరిస్థితుల్లోను మూడు నిముషాల కన్న ఎక్కువ పట్టకూడదు. మూడు నిమిషాల మీద ఒక్క సెకండ్ ఐనా సరే నేనిక్కడ వుండను” ఆఖరుసారిగా మరొక్క మారు హెచ్చరించాడు మిత్రా. మిగిలిన నలుగురు తలలూపారు.
వాళ్ళ వేన్ ఓ పెద్ద భవనం పక్కన ఆగింది. ఒకసారి జాగ్రత్తగా చుట్టూ పరికించి చూసి మిత్రా తప్ప మిగిలిన నలుగురు చటుక్కున దిగి లోపలికి దూసుకుపోయారు. మిత్రా వేన్‌ని వెనక్కు తిప్పి ఇంజన్ ఆపకుండా వుంచి ఏదో పరికరాన్ని ఆన్ చేశాడు. చాలా నిశితంగా అన్ని వైపులా చూస్తూ అంతా గమనిస్తూ కూర్చున్నాడు.
ఇండియన్ కల్చరల్ సెంటర్ భవనం పదెకరాల స్థలంలో మధ్యగా వుంది. చుట్టూ పార్కింగ్ స్పేస్. ఎ్తౖతెన రకరకాల చెట్లు ఒక ప్రశాంత వాతావరణాన్ని సమకూరుస్తున్నాయి. ఐదేళ్ళ కృషి తర్వాత ఈ మధ్యనే కన్‌స్ట్రక్షన్ పని అంతా ప్తూౖరె తొలిసారిగా ఇండియా ఇండిపెండెన్స్ డే ఉత్సవాలతో తలుపులు తెరిచి అందరినీ ఆహ్వానిస్తున్నది. ఈ శుభసందర్భంలో ఇండియా నుండి వచ్చిన కళాకారులు కొందరు సంగీత నృత్య కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఊళ్ళో ఉన్న భారతీయుల్లో చాలా ఎక్కువ శాతం ఈ ఉత్సవానికి హాజరౌతారని అంచనా. దాదాపుగా రెండు వేల మంది పట్టే హాలు పూర్తిగా నిండిపోతుందని అనుకుంటున్నారు.
ఆరింటికి అనుకున్న కార్యక్రమం మామూలుగానే ఏడుకి మొదలైంది. ముందుగా సెంటర్ కన్‌స్ట్రక్షన్ కమిటీ అధ్యక్షుడు వచ్చి అందరికీ స్వాగతం చెప్పి ఈ భవనం ఇలా ఆకృతి దాల్చడానికి ఎవరెవరు ఏ విధంగా సహకరించారో వివరిస్తూ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాడు. తర్వాత తొలి సాంస్కృతిక కార్యక్రమం ప్రారంభమయింది. స్థానిక బాలికలు పదిమంది కలిసి చేసిన భారతమాత నృత్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దాని వెంటనే ఇండియా నుండి వచ్చిన ఒక కళాకారిణి నాట్యప్రదర్శన రెండు నిముషాల్లో ప్రారంభం ఔతుందని ప్రకటించారు.
డాక్టర్ వెంకట్రావు చాలా కోపంగా వున్నాడు. రాను మొర్రో అని తలబాదుకున్నా వినిపించుకోకుండా, “మన అమ్మాయి డాన్స్ చేస్తున్నా కూడ రాకుండా ఇంట్లో కూర్చుని గుడ్లు పెడతారా ఏమిటి? ఫంక్షన్‌కి వెళ్ళితీరాల్సిందే!” అని ఆర్డర్ వేసి నోరు మూయించి తీసుకొచ్చింది వాళ్ళావిడ సుశీల. వచ్చాడన్నమాటే గాని అతని మనసు ఇక్కడ లేదు. ముళ్ళమీద కూర్చున్నట్టు కూర్చున్నాడు కాస్సేపు. హాల్లో ఓ మూలకి వెళ్ళి తన సెల్ ఫోన్ తీసి హాస్పిటల్‌కి ఫోన్ చేసి నర్స్‌తో పేషంట్ల విషయాలు మాట్లాడడం మొదలెట్టాడు.
రెండు నిమిషాలు గడిచేసరికి తన లాంటి వాళ్ళు ఇంకో నలుగురైదుగురు కనిపించారు. ఇంకా ధైర్యంగా సెల్‌లో మాట్లాడుతూ నర్స్ జోకులు చెప్తుంటే నవ్వుతూ ఆనందిస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా కనెక్షన్ పోయింది. విసుక్కుంటూ మళ్ళీ టాక్ బటన్ నొక్కాడు. గరగర మని శబ్దం తప్ప కనెక్షన్ రాలేదు. కొంచెం పక్కకి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి మళ్ళీ ప్రయత్నించి చూశాడు. ఏమీ ఉపయోగం కనిపించలేదు. అప్పుడు గమనించాడు తనొక్కడే కాదు, చుట్టు పక్కల తారట్లాడుతున్న మిగిలిన సెల్ ఫోన్ల వాళ్ళు కూడా అదే పరిస్థితిలో వున్నారు!
ఒక్కసారిగా తలుపులు తెరుచుకున్నాయి.
ఓ ఇద్దరు ఆగంతకులు చేతిలో పెద్ద తుపాకుల్తో లోపలికొచ్చారు ( అవి ఏకే47లు అనుకున్నాడు వెంకట్రావు తనకి గన్‌ల గురించి
ఏమీ తెలియక పోయినా).
మరో ఇద్దరు అలాటివాళ్ళే స్టేజి మీద కూడ ప్రత్యక్షమయ్యారు.
అందరి మొహాలకు ముసుగులున్నాయి.
తెల్లవాళ్ళలా అనిపిస్తున్నారు కాని చెప్పడం కష్టం పైనుంచి కిందివరకు నల్లటి డ్రెస్సుల్లో వున్నారు.
స్టేజి మీద వున్న వాళ్ళలో ఒకతను మైక్రోఫోన్ దగ్గరకెళ్ళాడు. “మీ అందరికీ ఓ విన్నపం. ఇది కేవలం దొంగతనం. మీ దగ్గరున్న డబ్బు నగలు తీసి మాకు ఇచ్చెయ్యండి. అలా చేస్తే మేం ఎవరికీ ఏమీ హాని చెయ్యం. మాకు అడ్డు తగలడానికి గాని మీ వస్తువులు ఇవ్వకుండా దాచుకోవడానికి గాని ప్రయత్నిస్తే మా ఆయుధాల్ని వాడడానికి వెనుకాడం. పరిస్థితిని గ్రహించి మీరు మీకు గాని మరెవరికి గాని హాని కలక్కుండా ఈ చిన్న అంతరాయాన్ని ముగిస్తారని ఆశిస్తాం. మీలో బహుశా అందరూ మంచి ఇన్సురెన్స్ వున్న వాళ్ళే అయుంటారు కనుక మీసొమ్ము పోతుందని దిగులు పడొద్దు. ఇక మొదలుపెట్టండి. మీ దగ్గరున్న డబ్బూ నగలు తీసి మా వాళ్ళకు ఇవ్వండి.” సూక్ష్మంగా, సూటిగా, విశ్వాసం కలిగించేలా చెప్పాడతను.
ఈ హఠాత్‌సంఘటనకి చాలా మంది బిత్తరపోయారు. కాళ్ళూ చేతులూ ఆడక అలా వుండిపోయారు.
ఆగంతకులు చాలా శిక్షణ వున్న వాళ్ళ లాగా ఒక్కొకరు ఒక వరసలో వెళ్తూ ఆ వరసలో వున్న వాళ్ళ దగ్గర పర్సులు, వాలెట్లు, నగలు చకచక కలెక్ట్ చేస్తున్నారు. స్టేజి మీద ఉన్నతను తన వాచికేసి చూస్తూ ఒక నిముషం కావడంతోనే ఆ విషయం ఎనౌన్స్ చేశాడు తన వాళ్ళ కోసం.
రమణ, సాగర్ రెస్ట్ రూమ్‌లో వున్నారు. బయటకు వచ్చే సరికి విచిత్రంగా అనిపించింది ఎక్కడా ఏమీ శబ్దం వినిపించడం లేదు.
“ప్రోగ్రామ్ మొదలైందిలా వుందే పైనుంచి అసలేమీ వినపడడం లేదు” అన్నాడు రమణ.
“కొత్త బిల్డింగ్ కదా, సౌండ్ ప్రూఫ్ ఎఫెక్ట్ వస్తున్నట్టుంది. లేకపోతే మన ప్రోగ్రామ్‌లు నిశ్శబ్దంగా ఎట్లా వుంటాయి?” అన్నాడు సాగర్ ఆవులిస్తూ.
“సరే మనమూ వెళ్దాం పద. ఏం జరుగుతుందో చూద్దాం”
“వెళ్దాంలే తొందరేవిటి? అలా వెళ్ళి కాస్త దమ్ము కొట్టొద్దాం పద” అంటూ బయటకు దారి తీశాడు సాగర్.
అతన్ని అనుసరించాడు రమణ.
కొంతమంది చాటుగా తమ సెల్ ఫోన్ల నుండి 911 డయల్ ్ చేద్దామని ప్రయత్నించారు గాని కనెక్షన్లు దొరకలేదు.
ఒకరిద్దరు తమ నగలు ఇవ్వమని పెనుగులాడారు గాని ఆగంతకులు ఏ మాత్రం మొహమాటం లేకుండా లాగేసుకున్నారు. కొందరు అంత గందరగోళం లోను తెలివిగా ఆలోచించి నగల్ని కిందపడేసి వాటిమీద చీరకుచ్చెళ్ళు పడేసి కూర్చున్నారు. అలా చేసిన ఒకావిడ ఆ దొంగల్లో ఒకడు తన కాలి మీద వాడి బూటు వేసి పచ్చడయ్యేట్టు తొక్కినా కిక్కురుమనకుండా కూర్చుంది. ఆమె కళ్ళల్లో నీళ్ళు చూసి నగలు పోతున్నందుకు ఏడుస్తుందేమోనని సరిపెట్టుకున్నాడు కాని ఆమె దగ్గర నగలేమీ లేకపోవడంతో వాడికి అనుమానం వచ్చి ఆమెని లేచి నిలబడమన్నాడు. నిలబడి నగల్ని దాచడానికి ప్రయత్నిస్తుంటే వాడు అది గ్రహించి కింద చూసి ఆ నగల్ని తీసేసుకున్నాడు. దాంతో ఆమె పెద్ద పెట్టున ఏడ్చేసింది. దొంగ ఏమాత్రం జాలిలేకుండా ఆమె నోటిని డక్ టేపుతో మూసేశాడు.
ఇక అక్కణ్ణుంచి ఆ దొంగలు నగలూ డబ్బూ ఊడ్చుకోవడమే కాకుండా నేల మీద కూడ ఏమైనా పడేశారేమోనని వెదికి మరీ తీసుకున్నారు.
రాబర్ట్ లేజీబాయ్ కుర్చీలో కూర్చుని బైనాక్యులర్స్ ్‌తో ఎదురుగా వున్న కొత్త బిల్డింగ్ వైపుకి దృష్టి సారించాడు. అది అక్కడ రాకుండా వుండడానికి అతను ఎంతో పోరాడినా ఫలితం దక్కలేదు. “వీళ్ళిలా కల్చరల్ సెంటర్ అని ప్రారంభించి ఆ తర్వాత మెల్లగా ఓ టెంపుల్ కట్టి అక్కణ్ణుంచి వాళ్ళ మతాన్ని ప్రచారం చెయ్యడానికి పూనుకుని చుట్టుపక్కల ఇళ్ళలో వుండే పిల్లల్ని చెడగొడతారు. ఇక ఈ ప్రాంతమంతా నాశనమై పోవడం ఖాయం” అనుకున్నాడతను పళ్ళు పటపట కొరుకుతూ. “ఎలాగైనా వీళ్ళేం చేస్తున్నారో జాగ్రత్తగా గమనించి ఏ మాత్రం ఇల్లీగల్ వ్యవహారాలు కనిపించినా పోలీసుల్ని పిలుస్తూ వీళ్ళ బతుకు దుర్భరం చెయ్యాలి” మనసులో సంకల్పించుకున్నాడు రాబర్ట్.
లోపల హాల్‌లో ఏదో జరుగుతోంది. చాలా మంది జనం వున్నారు. ఎవరో ముసుగులు వేసుకుని హడావుడిగా అటూ యిటూ తిరుగుతున్నారు. “ఓరి వీళ్ళ అఘాయిత్యం పాడుగాను! ఇవేం కల్చరల్ ప్రోగ్రామ్‌లో!!” ఆశ్చర్యపడ్డాడతను.
అక్కడున్న వాళ్ళకి ఎంతోసేపు గడిచినట్టు అనిపించినా సరిగ్గా రెండున్నర నిముషాలు కావడం తోనే వాళ్ళు గబగబ అక్కడినుండి పరుగెత్తి వెళ్ళిపోయారు. వాళ్ళ చేతుల్లో రెండు ట్రేష్ బేగ్స్ నిండా నగలూ డబ్బూ పర్సులూ వాలెట్లూ వున్నాయి!
సరిగ్గా పది సెకండ్లలో పరిగెత్తి వెళ్ళి వేన్ లో ఎక్కారు. ఎక్కడం తోనే కదిలి యాభై మైళ్ళ వేగంతో అక్కణ్ణుంచి కదిలివెళ్ళింది వేన్.
జనం గగ్గోలుగా అరవడం మొదలెట్టారు. సెల్ ఫోన్లు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించారు గాని ఎవరికీ కనెక్షన్లు రాలేదు. పేఫోన్లు పనిచేస్తున్నాయేమో నని ప్రయత్నించిచూశారు. అవీ పనిచెయ్యడం లేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రిపోర్ట్ చెయ్యాలని నిర్ణయించుకుని ఓ ఇద్దరు ధైర్యవంతులు బయల్దేరారు. ఐతే ఆ అడ్రస్ ఏ పోలీస్ జ్యూరిస్‌డిక్షన్‌లోకి వస్తుందో తెలియక కొంతసేపూ, ఫోన్ బుక్ లో అది వెదికి పట్టుకోవడానికి ఇంకొంత సేపు పట్టి మొత్తం మీద ఆ సమాచారం కనుక్కుని బయల్దేరబోతుంటే ఎవరో అరిచారు “సెల్ ఫోన్ ఇప్పుడు పని చేస్తున్నదీ” అని.
అంతే! అందరూ కంగారుగా 911 నొక్కారు. మొత్తం మీద ఎలాగైతేనేం అక్కడ జరిగిన దొంగతనం గురించి వాళ్ళకు చెప్పారు. వాళ్ళడిగిన మొదటి ప్రశ్న ఆ దొంగలు ఇంకా అక్కడే వున్నారా అనేది. లేరని ఠక్కుమని సమాధానం రావడంతో, ” అక్కడ ఉన్నవారిని ఎవరినీ ఎక్కడికీ వెళ్ళొద్దని చెప్పండి, ఐదు నిముషాల్లో ఎవరో ఒకరు అక్కడుంటారు” అని చెప్పారు. పోలీసులొస్తున్నారని తెలిసి వీసాలు ఎక్స్‌పయిర్ అయినవాళ్ళు హడావుడిగా అక్కడ్నుంచి పారిపోయారు.
చెప్పినట్లే ఐదు నిముషాల్లో ఓ పోలీస్ కార్ అక్కడికి వచ్చింది.
మిత్రా తన బృందం వాళ్ళందర్నీ కంగ్రాచ్యులేట్ చేశాడు. ఎలాటి అనుకోని సంఘటనలు జరక్కుండా విజయవంతంగా దొంగతనం చెయ్యగలిగినందుకు అందరూ ఆనందించారు. ప్రతివాళ్ళూ ప్రొఫెషనల్‌గా ప్రవర్తించినందుకు ఒకర్నొకరు మెచ్చుకున్నారు. వెంటనే అక్కడికి దగ్గర్లోనే ముందుగానే అద్దెకు తీసుకుని వుంచిన ఓ కార్ గరాజ్‌లోకి వేన్‌ని తీసుకెళ్ళి తలుపులు మూసేశారు.
ఓ దుప్పటిని కింద పరిచి దొంగతనం చేసి తీసుకొచ్చిన వస్తువులన్నీ దాని మీద జాగ్రత్తగా పరిచారు. డబ్బంతా ఒకచోట చేర్చి లెక్కపెట్టారు. యాభై వేల డాలర్లు లెక్కతేలాయి. వాటిని సమానంగా పంచుకున్నారు. తలా పది వేలు!
నగల్ని మిత్రా స్వాధీనం చేసుకున్నాడు. వాటిని కరిగించి ఆ బంగారాన్ని అమ్మి వచ్చిన డబ్బుని పంచుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నారు.
పోలీసులకు జరిగిందేమిటో స్పష్టంగా అర్థమైంది. సెల్ ఫోన్లు పనిచెయ్యలేదంటే ఆ దొంగలు రేడియో జామర్‌ని ఉపయోగించి వుంటారని తేలిపోయింది. పక్క ఇళ్ళ వాళ్ళు ఏమైనా చూసివుంటారేమోనని వాళ్ళని కూడ ఇంటర్వ్యూ చేశారు. అలా రాబర్ట్ చూసిన విషయాలు కూడ బయటికొచ్చాయి. అతను ఓ పెద్ద వేన్‌ని చూసీ చూడకుండా చూశానని చెప్పాడు. దాని రంగు నీలంలాగా ఉన్నట్టు అనిపించిందన్నాడు. అతనికి కార్ల గురించి వున్న మంచి పాండిత్యం వల్ల ఆ వేన్‌ని సరిగా చూడకపోయినా బహుశా ఏ బ్రాండ్‌ది ఐవుంటుందో చెప్పగలిగాడు.
సార్జెంట్ విల్సన్ ముందుగా అక్కడికి వచ్చాడు కనుక ఈ కేసు అతనికి వచ్చింది. ఇండియన్స్ అంటే అతనికి ఎలాటి సానుభూతీ లేకపోయినా మరీ ఇంత బరితెగించి దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకోవాలనే పట్టుదల కలిగిందతనికి.
ముందుగా అలాటి వేన్ కోసం చూడమని పోలీసులందరికీ కబురు వెళ్ళింది. లోకల్ పోలీసులూ, కౌంటీ వారు, స్టేట్ హైవే పట్రోల్ వారూ అలాటి వేన్ కోసం చూడసాగారు.
ఆ తర్వాత ఆ వూరి అడ్రసులతో వున్న పెద్ద వేన్‌ల లిస్ట్ ప్రింట్ చేశాడు. మొత్తం నూట యాభై తేలాయి. వాటిలో నీలం రంగువి ముప్ఫై మూడు. అవి ఎవరెవరి పేర్లతో రిజిస్టర్ అయి వున్నాయో, వాళ్ళలో ఎవరైనా పోలీసు రికార్డుల్లో వున్నారేమో చూశాడు. పదిహేను మందికి క్రితం రెండేళ్ళలో మూవింగ్ వయొలేషన్స్ వున్నాయి. ఓ ఇద్దరు అదివరకు జైలుకెళ్ళారు. వాళ్ళలో ఒకరు ఎసాల్ట్ రాబరీ ఛార్జ్ మీద కన్విక్ట్ అయి జైలుకి వెళ్ళారు. తన ఇంటర్వ్యూలు అక్కడినుంచి ప్రారంభించ దల్చుకున్నాడు సార్జెంట్ విల్సన్.
ఇదంతా జరగడానికి ముప్పావు గంట పట్టింది. ఈ లోపల ఐదు చోట్ల అలాటి వేన్‌లని ఆపి వాటిలో వున్నవాళ్ళని ప్రశ్నించి చూశారు. అనుమానాస్పదమైన వాళ్ళెవరూ కనిపించలేదు. ఆ వేన్‌ల వివరాలు వెంటనే విల్సన్‌ని చేరాయి. వాటిలో తను వెళ్ళి కలుద్దామనుకున్న వ్యక్తి కూడ వున్నాడు. కనుక ఆ ఆధారం అక్కడితో తెగిపోయింది.
నగలన్నీ ఓ బ్రీఫ్ కేస్ లో పెట్టుకుని ఆ దగ్గర్లో వీధిలో పార్క్ చేసివున్న తన కారు దగ్గరకు వెళ్ళాడు మిత్రా. పార్కింగ్ టికెట్ పెట్టివుంది. బూతులు తిట్టుకుంటూ దాన్ని తీసుకున్నాడు. చించి అవతల పారేద్దామా అన్నంత కోపం వచ్చింది కాని ఒక్క క్షణంలో తమాయించుకున్నాడు. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఈ పార్కింగ్ టికెట్టే ముందు ముందు అనర్థాలకి దారితియ్యొచ్చు. అందుకని ఏ మాత్రం అనుమానం కలక్కుండా త్వరలోనే కట్టెయ్యాలని నిర్ణయించుకుని తీసి లోపల పడేశాడు. ఇంటికి బయల్దేరాడు.
వాళ్ళ జట్టులో ఒకడైన జాన్ జాన్సన్ కూడ ఇంటికి బయల్దేరాడు. జేబులో పది వేలు బరువుగా తగుల్తుంటే మనసు దూదిపింజలా ఎగిరిపోతుంది. అంత డబ్బు ఎక్కడ దాచాలా అని ఆలోచించసాగాడు. తన ఎపార్ట్‌మెంట్‌లో పెట్టడం మంచిది కాదు తన గర్ల్ ఫ్రెండ్ వీనస్ చెప్పాపెట్టకుండా వచ్చి అన్నీ సర్దేస్తూ వుంటుంది. ఈ డబ్బు దాని కంట పడితే ఇక ప్రపంచంలో అందరికీ తెలిసిపోతుంది!
ఆలోచిస్తూ ఎదురుగా వున్న రెడ్ లైట్ చూసుకోకుండా వెళ్ళిపోయాడు జాన్. వెనక పోలీస్ సైరన్ వినిపించాక కాని అతనికి అర్థం కాలేదు తనేదో తప్పు చేశానని. ముందు ఈ దొంగతనం విషయం అప్పుడే బయటపడి పోయిందా అని అనుమానం వేసి కంగారు పడ్డాడు. కాని అంతలోనే సర్దుకున్నాడు. ధైర్యంగా కారుని పక్కకు తీసి ఆపి పోలీసు కోసం ఎదురుచూడ సాగాడు.
జాన్ ఆగడంతోనే ఆ పోలీసు ముందుగా అతని కారు నంబరు కంప్యూటర్‌లో ఎంటర్ చేసి అతని వివరాలు చూసింది. అనుమానించ వలసినది ఏమీ కనిపించలేదు. దిగి అతని దగ్గరకు వెళ్ళి పలకరించింది ఒకవంక కారు లోపలి భాగాన్ని నిశితంగా పరిశీలిస్తూ.
హఠాత్తుగా జాన్ కి గుర్తొచ్చింది తనో పెద్ద పొరపాటు చేశానని. తన గన్‌ని ట్రంక్‌లో పడేద్దామనుకుని హడావుడిలో ఆ విషయం మరిచిపోయి వెనక సీట్లో పడేశాడు. దాని మీద తన జాకెట్ కూడ పడేశాడో లేదో గుర్తు లేదు. అది తెలుసుకోవడం చాలా అవసరం! ఎలా?
పోలీసుతో మాట్లాడుతూనే యదాలాపంగా అన్నట్టు తన రియర్ వ్యూ మిర్రర్‌లో చూశాడు వెనక సీటు కనిపిస్తుందేమోనని. కొంతభాగం కనిపించింది గాని పూర్తిగా కనిపించలేదు. జుట్టు చూసుకోవడానికన్నట్టు ఆ మిర్రర్‌ని కిందికి దించి మళ్ళీ చూశాడు.
ఇన్సూరెన్స్ పేపర్ కోసం పోలీసు అడుగుతున్నది. వంగి గ్లవ్ కంపార్ట్‌మెంట్ తెరుస్తూ ఒక్కసారి వెనక సీటు వైపుకు చూశాడు. గన్ మీద జాకెట్ ్ పడివుంది గాని ఒకచోట కాస్త ఎత్తుగా కనిపిస్తున్నది. పోలీసు చూడలేదు కదా?
టికెట్ రాసి ఇచ్చి వెళ్ళమన్నది పోలీసు. హమ్మయ్య అనుకుని దీర్ఘంగా నిట్టూర్చి కదిలాడు జాన్.
తన కార్లో వెళ్ళి కూర్చున్నది సార్జెంట్ కార్లా ఎబర్స్. కాని ఏదో సరిగా లేనట్టు అనిపించింది. ఆలోచించే కొద్ది ఆ కార్లోని వ్యక్తి వెనక సీట్లో ఏదో తనకి కనపడుతుందేమోనని కంగారు పడ్డట్టు అనుమానం కలిగింది. వెంటనే కంట్రోల్ సెంటర్‌కి తన అనుమానం చెప్పి ఆ కారు మీద నిఘా వెయ్యమని అడిగింది. తను కూడ ఆ కారు వెనకనే బయల్దేరింది.
కొంచెం దూరం వెళ్ళిన జాన్ ఓ పోలీస్ కారు తన వెనక వస్తున్నట్టు గ్రహించాడు. అనుకున్న దారిన వెళ్ళకుండా దగ్గర్లో కనిపించిన చిన్న వీధి లోకి తిరిగాడు. అక్కడ్నుంచి ఇంకో చిన్న వీధిలోకి తిరిగాడు. ఐదు నిముషాల తర్వాత తిరిగి పెద్ద రోడ్డులోకి వచ్చాడు.
అతను చిన్న వీధిలోకి తిరగడం చూసిన కార్లాకి తన అనుమానం దృఢమయ్యింది. వెంటనే దగ్గర్లో ఇంకెవరున్నారో కనుక్కుని వాళ్ళలో ఒకర్ని వెళ్ళి అతన్ని ఇంకోసారి చెక్ చెయ్యమంది. సార్జెంట్ పెట్రిచెల్లి తను వెళ్తున్నానన్నాడు.
జాన్ పెద్ద వీధిలోకి రావడం చూశాడు పెట్రిచెల్లి. అతని వైపుకి బయల్దేరాడు.
జాన్‌కి తను ఉచ్చులో బిగుసుకుంటున్నానని అనుమానం వచ్చింది. ఇంకా ఆలోచిస్తూ వుంటే ప్రమాదం ముంచుకొస్తుందని గ్రహించాడు. చటుక్కున మరో మలుపు లోకి తిరిగి వేగంగా హైవే వైపుకు వెళ్ళసాగాడు.
పెట్రిచెల్లి ఇది గమనించాడు. వెంటనే రేడియోలో అందరికీ చెప్పాడు. రెండు నిముషాల్లో నాలుగు పోలీసు కార్లు జాన్‌ని వెంటాడసాగాయి.
జాన్ కి పరిస్థితి విషమిస్తున్నట్టు అర్థమైంది. పోలీసులకి దొరికిపోయే అవకాశాలు పెరుగుతున్నాయి. అలా జరిగితే తన గన్ బయటపడడం, లైసెన్స్ లేకుండా గన్ దగ్గరుంచుకున్నందుకు జైలుకు వెళ్ళడం ఖాయం.
ముందుగా గన్‌ని వదిలించుకో దల్చుకున్నాడు. ఓ బ్రిడ్జ్ పక్కగా వెళ్తున్నప్పుడు దాన్ని తీసి బయటికి విసిరేశాడు. ఐతే అది ఎక్కువ దూరం వెళ్ళకుండా బ్రిడ్జి గోడకు తగిలి మళ్ళీ రోడ్డు మీదే వచ్చిపడింది. ఇదంతా దూరం నుంచి చూసిన ఓ పోలీసు వెంటనే అక్కడ ఆగి చేతి వేళ్ళు తగలకుండా జాగ్రత్తగా దాన్ని తీసి ఓ ప్లాస్టిక్ సంచిలో వేసుకుని భద్రం చేశాడు. రేడియోలో అందరికీ వెంటనే చెప్పాడు. దాంతో వేట ఇంకా తీవ్రం అయింది. మరో నలుగురు వచ్చి జాయిన్ అయ్యారు.
ఇదంతా చూస్తున్న జాన్‌కి చెమటలు ధారాపాతంగా పట్టసాగాయి. ఏం చెయ్యాలో ఏమీ పాలుబోవడం లేదు. ఇప్పుడు ఆగితే ఓ గొడవ, ఆగకపోతే అంతకన్నా గొడవ! కాని, ఎలాగూ దొరకక తప్పదు. మరి తన దగ్గరున్న డబ్బుని ఏం చెయ్యాలి?
పారెయ్య బుద్ధి కాలేదు. పారేసినా దానివల్ల తనకేమీ ఉపయోగం కనపడడం లేదు. జైలుకు వెళ్ళడం ఖాయం.
ఇక ఒక్కటే మార్గం తన తోడుదొంగల గురించి చిలవలు పలవలు కలిపి పాడేస్తే తనకు పడే శిక్ష తగ్గే అవకాశం వుంది!
అలా, దొంగతనం జరిగిన గంటన్నరకి తోడుదొంగలందరూ పట్టుబడ్డారు!