వండిన కూరలు, పప్పూ గిన్నెల్లో సర్ది టేబుల్ మీద పెట్టింది. బియ్యం కడిగిపెట్టి కుకర్ ఆన్ చేసింది. అతనొచ్చేలోగా స్నానం చేద్దామనుకుని ఒంటిపై కుర్తీ తీసేయబోతూ ఆగిపోయింది. ఎవరో తననే చూస్తూన్న భావన, దానితో కలిగే ఇబ్బంది, అసౌకర్యమూ. రోడ్డు మీద నడుస్తున్నప్పుడూ, అప్పుడప్పుడూ ఆఫీసులోనూ అలవాటయినదే. కానీ ఇది ఇల్లు. ఎవరి జోలీ లేకుండా నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండడానికి అలవాటుపడిన భద్ర ప్రదేశం.
ఎందుకలా అనిపించిందో, అనిపిస్తూ ఉందో తేల్చుకోలేకపోయింది. గది తలుపుకు ఎదురుగా హాల్లో ఉన్న కిటికీ కర్టెన్ సరిచేసింది. బాల్కనీ వైపున్న తలుపు గడియ సరిగ్గా ఉందో లేదో చూసుకుంది. మళ్ళీ బాత్రూమ్కి వచ్చింది కానీ ఆ ఇబ్బంది అలాగే ఉంది. చుట్టూ చూస్తే చేతికందనంత ఎత్తులో ఉండడం మూలాన ఎప్పుడూ పట్టించుకోని కిటికీ కనిపించింది. అనుమానంగా అందులోంచి అటువైపూ ఇటువైపూ చూసింది. చుట్టూ ఇంకా ఎత్తులో ఉన్న అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఎవరయినా బైనాక్యులర్స్‌తో చూస్తున్నారా అన్న అనుమానం వచ్చింది. ఒక స్టూల్ తెచ్చి, ఆ కిటికీని కప్పుతూ పాత టవల్ దోపింది. అయినా ఆ అభద్రభావన వదలకుండా ఉంది. కెమెరాలేమయినా పెట్టారా అనిపించగానే ఒక్కసారిగా వణుకు వచ్చింది. గబగబా బాత్రూమ్ అంతా వెతికింది. అన్ని సొరుగులూ తీస్తూ, గోడలూ కనపడని చోట్లూ తడిమి చూస్తూ, ఈ మధ్య ఇంటికి పనులు చేయడానికి ఎవరెవరొచ్చారో గుర్తు చేసుకుంది. ఒక టైల్ ఊడిపోతే పెట్టడానికి వచ్చిన ఇద్దరు కుర్రాళ్ళు, అంతకుముందు వచ్చిన కరెంట్ రిపేర్ అతనూ గుర్తొచ్చారు. వాళ్ళ మొహాలు టీవీలో వార్తల్లో కనపడే నేరస్తుల మొహాలతో పోల్చి చూసుకుంది. అలాంటి వెధవల్లానూ కెమెరాలు దొంగతనంగా బిగించగల తెలివి ఉన్నవాళ్ళలానూ అనిపించలేదు కానీ సినిమాలు చూసి అలా చేయొచ్చని, యూట్యూబ్ చేసి ఎలా చేయొచ్చునో నేర్చుకోవడానికెంతసేపో పట్టదని అనుకోగానే గుండె వేగం ఇంకా పెరిగింది.
అతనికి ఫోన్ చేసింది. అయిదు నిమిషాల దూరంలో దారిలో ఉన్నాడతను. మంచినీళ్ళు గటగటా తాగేసి ఫాన్ వేసుకుని సోఫాలో కూర్చుండిపోయింది.
“ఏమిటి, ఏమయింది?” కదలకుండా సోఫాలో కూచున్న ఆమెని చూసి అడిగాడు రావడంతోటే.
“ఎవరో నన్ను చూస్తూన్నట్టనిపిస్తూంది. భయంగా ఉంది.”
“ఎప్పుడూ లేనిది ఇదేం భయం?” పక్కనే కూచుని భుజం మీదుగా చేయి వేస్తూ అన్నాడు “బయటికి వెళ్ళినప్పుడు ఉండే భయమే వెంటపడి లోపలికొచ్చినట్టుంది.”
“నీకంతా తేలికగా కనిపిస్తుంది. ఎప్పుడూ లేనిది ఇవాళే ఎందుకనిపిస్తుంది?”
“ఇప్పుడూ అలాగే ఉందా?”
“ఉంది. నీకేమీ అనిపించడం లేదా?”
“లేదు. నీ భయం వల్ల అట్లా అనిపిస్తుంది నీకు, అంతే!”
“అది భయం కూడా కాదు. సిక్స్త్ సెన్స్! ఆడవాళ్ళకు ఎక్కువ ఉంటుందేమో! అట్లా నాకనిపించిన ప్రతిసారీ అది నిజమవుతూనే వచ్చింది!”
“అది కన్ఫర్మేషన్ బయాస్! అయినా అసలు ఎలా చూస్తారు చెప్పు! కిటికీలూ, తలుపులూ అన్నీ మూసేశావు కదా!”
“ఏమో! కెమెరాలు పెట్టి ఉండొచ్చు కదా!”
“అర్థం లేకుండా మాట్లాడుతున్నావు! మన ఇంట్లో కెమెరాలు ఎవరు పెడతారు?”
“ఏమో! పనివాళ్ళెవరో వస్తారు, పోతారు. ఆ చిన్న చిన్న కెమెరాలు పెట్టడం ఎంత తేలికయిపోయింది ఈ రోజుల్లో!”
“ఇక్కడ దాచిపెట్టేంత చోట్లేమున్నాయి చెప్పు!” లేచి టీవీ చుట్టుపక్కలా, అలమరల్లోనూ చూసి వచ్చి కూచున్నాడు. “పోనీ చూసేరే అనుకో, ఏముందిక్కడ అంత భయపడడానికి?”
చివ్వున అతని వంక చూసి అంది “అదేం మాట! ఇది నా ప్రైవేట్ స్థలం, నా ప్రైవేట్ సమయం! ఎవరయినా దాన్ని ఎట్లా అతిక్రమిస్తారు?”
“నీ ప్రైవేట్ మూమెంట్స్ పబ్లిక్‌గా పోస్ట్ చేయడం లేదా ఫేస్బుక్లో? అందరూ చూడడం లేదా!”
“అది నేను చూపించదలుచుకున్నంతవరకే, చూపించాలనుకున్నట్టుగానే. అయినా అది నీకిష్టం లేకపోతే డైరెక్ట్‌గా చెప్పి ఉండొచ్చు! ఇలాంటి సమయం కోసం ఎదురుచూడక్కర్లేదు!”
“నాకిష్టం లేదని కాదు. సరే, వదిలెయ్. నువు మాత్రం బాల్కనీలో నుంచుని దారిలో వచ్చీ పోయేవాళ్ళను అదేపనిగా చూస్తూ కూచోవా టీ తాగుతూ? మరి వాళ్ళేమనుకోవాలి?”
“చూడడం వేరు, అదేపనిగా చూస్తూ ఉండడం వేరు. చూపుల్లో తేడాలు తెలీనట్టు మాట్లాడకు!”
“ఇక్కడ ఆ తేడాలు కనపడే చూపులేవీ లేవుగా!”
“ఎవరూ చూడడం లేదనిపించినప్పుడు నేను నేనుగా ఉండగలను, ఉంటాను. చూస్తున్నారనిపించినప్పుడు బట్టలు విప్పి స్నానం చేయలేను గదా!” అని ఆగి… అంది.
“అసలు ఈ సోదంతా ఆపి ఏదో ఒకటి చేయి!”
నవ్వుతూ చెప్పాడు. “అదే చేస్తున్నా! ఇక్కడేం జరగడంలేదని తెలిస్తే విసుగుపుట్టి వాళ్ళే మానుకుంటారు.”
“బోడి తెలివి చూపించకు!” అని ఇంకా ఏదో అనబోతూ అతని వంక చూసి ఆగిపోయింది. ఏదో అప్పుడే గ్రహించినట్టు అతని వేళ్ళ కొసలు నుదుటికి చేరాయి.
“ఏమిటి చెప్పూ?” అడిగింది. అతను వంగి ఆమె చెవిలో మెల్లగా ఏదో చెప్పాడు. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి కాగా “అవునా!” అంది. తేరుకునేలోగా కనుబొమలు ముడిపడి కళ్ళు చిన్నవయ్యాయి.
తల తిప్పి “పొండి పొండి! ఇక్కడేం లేదు, అవతలి కథలోకి పొండి!” గొంతెత్తి అరిచిందామె చటుక్కున కథ ముగిస్తూ.