బ్రౌన్‌ని సమగ్రంగా ఎవరూ చూడలేదు: పరుచూరి శ్రీనివాస్‌తో ఆకాశవాణి ముఖాముఖీ

[పరుచూరి శ్రీనివాస్‌ మద్రాసులో చదివి పశ్చిమ జర్మనీలో ఆ భాషలోనే ప్లాస్టిక్స్ ఇంజనీరింగు డిగ్రీ పుచ్చుకొని కార్ల పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ తెలుగు భాష, చరిత్ర, పద్యనాటకం, తెలుగు పాటలపై లోతైన పరిశోధనా దృష్టిని పెంచుకొన్నారు. బ్రౌన్‌ జీవితం నుండి తెలుగు ప్రచురణల చరిత్ర వరకు అనేక విషయాలు ముచ్చటించారు. జనవరి 16, 2013న ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం చేయబడ్డ ఈ కార్యక్రమం నుంచి కొన్ని భాగాలు.]


మనం మన చరిత్రను పరిశోధించే పద్ధతులకు విదేశాలలో చరిత్రను అధ్యయనం చేసే పద్ధతులకు ఏమైనా తేడాలున్నాయా?

తేడా మన దేశానికి, విదేశాలకి అని కాదు. తేడా ఆధునిక కాలానికి, అంతకు ముందు కాలానికి. అంటే కొత్త పద్ధతులకి పాత పద్ధతులకీ మధ్య తేడాలున్నాయి. మరీ ముఖ్యంగా గత 20 సంవత్సరాల్లో చరిత్ర పరిశోధనలో వైధానికంగా పెద్ద మార్పులే సంభవించాయి. నాకు తెలిసినంతలో ముఖ్యంగా తెలుగుదేశంలో ఈ రకమైన కొత్త పద్ధతులు ఎవరూ అనుసరిస్తున్నట్లుగా కనిపించలేదు. ఇక్కడ ఇప్పటికీ ఏదో లిపిని చూడటం, శాసనాలు చదవటం లేకపోతే రాత ప్రతుల వంటి ‘ఆధారాలను’ మాత్రమే పరిగణన లోకి తీసుకుంటున్నారు. వీటినే నమ్మకమైన, ‘గట్టి’ ఆధారాలు అని అనుకుంటున్నారు — ప్రాచీన వస్తువులు, శాసనాలు, కావ్యాలు, పుస్తకాలు చరిత్ర అధ్యయనానికి పనికి వస్తాయి, అన్నట్లుగా. వీటినే ఆధారాలుగా చూసే పద్ధతి ఆధునిక చరిత్రకారుల్లో ఇప్పుడు అమల్లో లేదు. ఆధునిక చరిత్రకారులు వేరుగా చూస్తున్నారు. ఇప్పటి చరిత్ర రచనలో సాహిత్యం, సామాజిక శాస్త్రం, మానవ పరిణామ శాస్త్రం, సాహిత్యం – ఇలా వేరు వేరు రంగాల నుండి కూడా సమాచారాన్ని సేకరించి, వాటిని అన్వయించే పద్ధతిలో చాలా మార్పులు వచ్చాయి.

సంఘటిత చరిత్ర (కంబైండ్‌ హిస్టరీ), కనెక్టెడ్ హిస్టరీ, ఇంటిగ్రేటెడ్‌ ‌హిస్టరీ — ఈ మూడూ తరచుగా వినపడే పదాలు. వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షూల్మన్, సంజయ్ సుబ్రహ్మణ్యం రాసిన టెక్స్‌చర్స్ ఆఫ్ టైమ్ ఈ ఆధునిక చరిత్ర రచనా పద్ధతులకి ఒక మంచి ఉదాహరణ. అలాగే చరిత్రాధ్యయనంలో కూడా మైక్రో, మాక్రో హిస్టరీ అని రెండు విభాగాలున్నాయి. తెలుగులో మైక్రో హిస్టరీ మీద ఎవరూ పనిచేస్తున్నట్లు లేదు. ఒడ్డెగిత్తని మొకద్దమా (2006) అనే పేరుతో లంక వెంకటరమణగారు రాసిన మంచి పుస్తకాన్ని గురించి ఎవరూ చర్చించలేదు.

మాటవరసకి మన కొండవీటి రాజుల చరిత్ర రాయాలనుకోండి, ఇపుడు ఎటువంటి పద్ధతులు అనుసరించాలంటారు?

రాజకీయంగా ఇప్పుడు దేశాలుగా యేర్పడిన ప్రాంతాలను మాత్రమే పరిగణించకుండా పాత శతాబ్దాలలో ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి దగ్గరితనం వల్ల ఏర్పడిన చరిత్ర రాయడం ఇప్పటి పద్ధతి. ఈ ఊహలు చరిత్ర రచనలో కొత్త మార్గాలకి దారి తీశాయి. ఇప్పుడు ఒక దేశంలో ఉన్న ప్రజలు కొన్ని వేల సంవత్సరాలుగా ఇప్పటిలాగే కలిసి ఉన్నారని ఇప్పటి రాజకీయ కారణాలే వాళ్ళని వెనకటి కాలంలో కూడా ప్రేరేపించాయని నమ్మే అలవాటు మనకింకా పోలేదు. ఉదాహరణకు కృష్ణదేవరాయలు ఇప్పుడు తెలుగువాళ్ళకి అవసరం కాబట్టి ఆయన పరిపాలించిన ప్రాంతమంతా తెలుగు రాజ్యంగా, హిందూ రాజ్యంగా గొప్పగా వర్ణించడం మనం ఇప్పటికీ మానుకోలేదు. అలాగే ఇంగ్లీషువాళ్ళు వచ్చి చరిత్రలేని మన దేశానికి చరిత్ర రచనా పద్ధతులు నేర్పారని అనే నమ్మకంతో ఆ పాత పద్ధతుల్లోనే చరిత్ర రాయడం మనం ఇప్పటికీ మానలేదు. మనం ఆ అలవాట్లు పోగొట్టుకోవాలి.

కానీ, ఇప్పటికీ ప్రామాణికంగా చెప్పుకోదగ్గ పుస్తకం మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు రాసిన హిస్టరీ ఆఫ్‌ రెడ్డి కింగ్‌డమ్స్‌. అదే తెలుగులో కూడా ఈ మధ్యకాలంలో అనువాదమయింది. ఈ పుస్తకాన్ని ఆయన కూడా ఇందాక చెప్పినటువంటి గట్టి ఆధారాలతో రాశారు. తేదీలు, కర్తృత్వాలు, రాజుల పరిపాలనా కాలాలు గట్టి ఆధారాలతో నిర్ణయిస్తే తప్ప మనకి చరిత్ర లేదని పైగా అదే చరిత్రని మనం ఎప్పుడైతే ఒక నిర్ణయానికి వచ్చామో ఆ దెబ్బతో ఒక్కసారిగా తెలుగు సాహిత్యవేత్తలంతా చరిత్రకారులయిపోయారు. పేర్లు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజానికి తెలుగుదేశంలో ఇదొక వింతయిన పరిస్థితి. నాకు తెలిసినంతలో రెడ్డి రాజుల మీద ఇంతకు ముందు మనం అనుకున్న కొత్త పద్ధతుల్లో పనిచేసిన వాళ్ళు ఎవరూ లేరు.

ఉదాహరణకు హెర్మాన్ కుల్కె (Hermann Kulke) చిన్న రాజ్యాల (Little kingdoms) మీద ఆసక్తికరమైన మార్గంలో చరిత్ర రాశాడు. ఇంకొక సంగతేమిటంటే ఈమధ్యనే వెల్చేరు నారాయణరావు, డేవిడ్‌ షూల్‌మన్‌ కలిసి శ్రీనాథ – ద పొయెట్ హు మేడ్ గాడ్స్ అండ్ కింగ్స్ (2012) అని శ్రీనాథుడి మీద ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో రెడ్డి రాజుల చరిత్రని వేరే పద్ధతిలో చూడటానికి ప్రయత్నం చేశారు.

నిజానికి మనం మన వలసవాద ప్రభావంతో చరిత్రని చూడటం మానలేదంటారా?

మానలేదనే నేననుకుంటున్నాను. ఉదాహరణకి 20, 30 ఏళ్ళ క్రితం రణజిత్‌ గుహ, అతని శిష్యులు చరిత్రంటే రాజ్యాల చరిత్రే కాదు. చరిత్రంటే కింది స్థాయిలో వుండే మామూలు మనుష్యుల చరిత్ర అనే కొత్త ఆలోచనతో సబ్ఆల్టర్న్ హిస్టరీ రాయడం మొదలుపెట్టారు. ఇప్పుడు బలహీనపడినా ఆ ధోరణి బాగా సంచలనాన్ని సృష్టించింది. అయినా దాని ప్రభావం కూడా తెలుగుదేశంలో చరిత్రకారుల మీద కనిపించడం లేదు.

ఎంతో మంది తెలుగుకి బ్రౌన్‌ చేసిన సేవ గురించి చెప్తూ ఉంటారు. దానిమీద మీ అభిప్రాయం ఏమిటి?

బ్రౌన్‌తో చాలా సమస్యలు ఉన్నాయండీ. మనకి పొగడ్తలు, వ్యక్తి గౌరవాలే ప్రధానమయి సవిమర్శకంగా ఎవరి పనినీ అంచనా వేసే అలవాటు ఇప్పటికీ ఏర్పడలేదు. క్లుప్తంగా చెప్పాలంటే, అతన్ని ఇప్పటికి సవిమర్శకంగా ఎవరూ చూడలేదు. అతనికి తెలుగు గొప్పగా వచ్చని, అతను ఇంద్రుడని చంద్రుడని పొగుడుతాం. ఆరుద్ర ఐతే ఆయన అంత్యప్రాసల సరదాతో ‘బ్రౌన్ సాహిత్య క్రౌన్‌’ అన్నారు.

అతని జీవిత చరిత్రని, అతను చేసిన పనినీ విడివిడి భాగాలుగా చూడాల్సి ఉంది. అతను భారతదేశం వచ్చిన కొత్తలో ప్రాంతీయ భాషలకి తెల్లవాళ్ళ పరిపాలనలో ప్రాముఖ్యం ఉండేది. అందువల్ల తెల్లవాళ్ళకు తెలుగు నేర్పడానికి ఉపయోగపడే వ్యాకరణాలు, నిఘంటువులు, రీడర్లు తయారయ్యాయి. అవి రాసినవాళ్ళకి ఈస్టిండియా కంపెనీ వారు బాగా డబ్బు కూడా ఇచ్చేవారు. అందుకని చాలా మంది తెల్లవాళ్ళు ఒకరితో ఒకరు పోటీపడి ఇలాంటి పుస్తకాలు రాశారు. ఎ.డి.కాంప్‌బెల్‌, విలియమ్‌ బ్రౌన్‌, జె.సి. మోరిస్‌, వాళ్ళతో పాటుగా బ్రౌన్. వీళ్ళందరు వ్యాకరణాలు, నిఘంటువులు రాసి, సంకలించి తెల్ల వాళ్ళ స్కూళ్ళలో అవే పాఠ్య గ్రంథాలుగా నిర్ణయింప చేసుకోవటానికి ప్రయత్నం చేశారు. ఈ కాలంలో బ్రౌన్ తెలుగు మీద చేసిన కృషి ఇందులో భాగంగా చూడాలి.

బ్రౌన్‌ జీవితంలో రెండో దశ, అంటే అతను కొంత కాలం ఉద్యోగం పోయి 3 సంవత్సరాల పాటు ఇంగ్లండ్‌ వెళ్ళి తిరిగి వచ్చిన తరువాత. అప్పటికి తెల్లవాళ్ళకి తెలుగు మీద ఆసక్తి పోయింది. మెకాలే మినిట్ అమలులోకి వచ్చేసింది. అప్పటికి సంస్కృతంలో పని చేసి తెల్లవాళ్ళలో పేరు తెచ్చుకున్న వారు విలియమ్‌ జోన్స్‌, హెచ్‌.టి. కాల్‌రిడ్జ్‌, లాంటి వాళ్ళు. ఈ కాలంలో బ్రౌన్‌కి తెలుగు పండితుడిగా గుర్తింపు పొందాలనే కోరిక బలపడింది. ఈ దృష్టిలో అతని పనిని పరిశోధించాలి. ఈ సందర్భంలో అతనికీ దేశంలో ఉన్న తెలుగు పండితులకీ వున్న సంబంధం ఎటువంటిది, వాళ్ళని ఆయన ఎలా చూశాడు, వాళ్ళు ఆయనని ఎలా చూశారు అన్న సంగతిని మనం పరిశీలించాలి. ఇంకా వివరంగా చెప్పాలంటే అతను తన దగ్గిర పని చేసే పండితుల చేత అనుసరింపచేసిన పాశ్చాత్య గ్రంథ పరిష్కరణ విధానాలు తెలుగు పుస్తక సంప్రదాయానికి ఎంత వరకు మేలు కలిగించాయి, ఎంత వరకు నష్టం కలిగించాయి అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. ముఖ్యంగా చెప్పదలచుకున్నదేమంటే బ్రౌన్‌ని పొగడటం తగ్గించి ఆయన పనిని సవిమర్శకంగా చూడటం అలవాటు చేసుకోవాలి.

నాకు తెలియక అడుగుతాను. బ్రౌన్ అనుసరించిన పరిష్కరణ విధానాల వల్ల మనకి వచ్చిన నష్టం ఏమిటి? అలాంటి సాంప్రదాయాన్ని అనుసరించటం వల్ల ఎవరు నష్టపోయారు? మన విధానాలు ఏమైనా నష్టపోయాయా?

ఈ ప్రశ్నకి క్లుప్తంగా సమాధానం చెప్పలేను. కాని ఒక్క మాట సూచిస్తాను. ఆయన పద్ధతి వలన ఇంతకు ముందు లేనటువంటి ఒక రకమైన కృత్రిమమైన తెలుగు గ్రంథం ఒకటి పుట్టుకొచ్చింది. ఇంతకు ముందు విద్యంతా గురుముఖతః నేర్చుకున్నదే. రాత ఎప్పుడూ ఉంది. రాత పుస్తకం ఒకటి ఉంటుంది. కాని రాత పుస్తకం ముందు పెట్టుకుని అందులో ప్రతి పద్యం నెమ్మదిగా చదువుతూ మన పూర్వీకులు ఎవరూ గ్రంథం నేర్చుకోలేదు. మీరు రామాయణం, భారతం లేకపోతే తర్కం, మీమాంస ఏది చదివినా సరే – కావ్యం కావచ్చు, శాస్త్ర గ్రంథం కావచ్చు – అన్నిటినీ గురుముఖతః నేర్చుకున్నారు. పుస్తకం అనేది ఒకటి ఉంటుంది. అంత వరకే, కానీ ఆ పూర్తి పుస్తకంతో మీకు ఎప్పుడూ పని ఉండదు. మన దేశీయ గ్రంథ సంప్రదాయం వేరు. ఇక్కడ చదివే విధానాలు వేరు. ప్రతి పుస్తకానికి ఒక అధ్యయన సమాజం ఉంటుంది. కొన్ని పుస్తకాలు కొన్ని సమాజాల్లోనే చదవబడతాయి. ఇలాంటి ఈ సాంఘిక పరమైన సమాచారమంతా అతనికి తెలిసి ఉంటే అతను పుస్తక పరిష్కరణ వేరేగా చేసి ఉండేవాడు. అతను తయారు చేసిన క్రిటికల్‌ ఎడిషన్‌ అనేది మనకి నప్పని పద్ధతి. అన్ని పుస్తకాల ప్రతుల్ని కలిపేసి ఒక కలగాపులగపు ప్రతిని శుద్ధప్రతి అనడం వల్ల ఆ పుస్తకానికి అన్ని ప్రతులు ఎలా వచ్చాయి, ఎందుకొచ్చాయి, వాటి పుట్టు పూర్వోత్తరాలేమిటి అనే సంగతి ఆలోచనకు రాకుండా పోయింది.

బ్రౌన్‌ బొమ్మ గురించి అనేకమంది అనేకరకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అసలు ఎక్కడైనా వెదికారా? దొరికిందా? దొరకలేదా? దొరకదా?

అసలు ముందుగా, ఒక వ్యక్తి ఆరాధన మనలో ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి చూస్తే కొంచెం దిగులు కూడా వేస్తుంది. బ్రౌన్‌ బొమ్మ నాకు తెలిసినంతలో ఎక్కడా లేదు. అంటే అతని ఫొటో. బంగోరే బ్రతికున్న రోజుల్లో చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఆరుద్ర 1980, 81 ప్రాంతంలో లండన్‌ వెళ్ళినప్పుడు వెతికారు. వాళ్ళ నమ్మకం ఏమిటంటే బ్రౌన్‌ చనిపోయే కాలం నాటికి, 1883-84, నాటికే ఫొటోగ్రఫీ వచ్చింది కాబట్టి ఎక్కడో ఒక ఫొటో ఉండి ఉండవచ్చు అని.

సరే, ఒక మనిషి ఫొటో ముఖ్యమా అన్నది ప్రక్కన పెడితే ఈ రోజున మనం చూస్తున్నది ఊహా చిత్రం. బ్రౌన్‌ తండ్రి బొమ్మ తైలవర్ణ చిత్రం కలకత్తా సీరాంపూర్‌ మిషనరీలో ఉంది. అది 1979లో భారతిలో ప్రచురితమయ్యింది. ఆ బొమ్మని ముందు పెట్టుకుని మైనేని వెంకటరత్నం అలాంటి పోలికలతో ఇంకొక బొమ్మ గీశారు. అది మిసిమి పత్రికలో 1997 చివరలో అనుకుంటాను ముఖచిత్రంగా ముద్రితమయ్యింది. దాన్ని ఈ రోజు బ్రౌన్‌ బొమ్మగా అందరూ తల మీద పెట్టుకొని తిరుగుతున్నారు.