బూడపెస్ట్‌లో, గ్రిషామ్ పేలస్ ఒక చూడ చక్కని ఆర్ట్ నోవో వసతి. రంగు రంగుల నగిషీల గాజు పలకల గోడలు, కప్పు ఉన్న ఏట్రియంలో, సోఫాలలో కూర్చొని ఎందరో మనుషులు. గూగుల్ 360 డిగ్రీల వ్యూలో, ఆ భవంతి బైటా, లోపలా, ఆర్కిటెక్చరల్ విశేషాలు అన్నీ తనివితీరా గమనించిన చదువరీ! మీకు చూడాలని ఉంటేనే సుమా, జూమ్ చేసి, ఆ పెద్ద టైగర్ లిల్లీల పూల ఎరేంజ్‌మెంట్ పక్కనే, ఆకుపచ్చ రంగు బ్రొకేడ్ సోఫాలో ముచ్చట్లాడుకుంటున్న ఆ ఇద్దరినీ చూడండి.
ఆమె నిసి షామల్. అతడు విక్టర్ బెర్నెట్టీ.
నిసి ఈ మధ్య తన యూరప్ ట్రిప్ లలో, విక్టర్‌కు ఈ-మెయిల్ చెయ్యటం, ఒకవేళ అతను ఆ దగ్గర ప్రాంతాలలో ఉంటే ఆమెని కలవడం, వారిద్దరూ కొంత సమయమైనా కలిసి గడపటం జరుగుతున్నది. వారిద్దరూ అప్పుడే ఫ్రాంజ్ లిజ్స్ట్ మ్యూజియం చూసి తిరిగి వచ్చారు.
“ఎంత అందమైన అపార్ట్‌మెంట్ అతనిది! ఆ నిలువెత్తు వర్ణ చిత్రాలలో అబ్బా! ఎంత అందంగా ఉన్నాడతను!” అంది విక్టర్ తో నిసి. నిసి తన్మయత్వం చూసిన విక్టర్,
“పక్కనే ఇంత అందమైన పియానిస్ట్ నేను ఉండగానే? ఎంత అన్యాయం! లిజ్స్ట్ అప్పుడూ, ఇప్పుడూ కూడా అదృష్టవంతుడే లెండి. అతని కాన్సర్ట్స్ తరవాత, అతని బట్టల్లోంచి చిన్న ముక్కలు తుంపుకోటానికి ఆ 1900 శతాబ్ది ఆడవాళ్ళు ప్రయత్నించే వారట. అతని మీది క్రేజ్ ఎల్విస్ ప్రెస్లీ, బీటిల్స్ మీద క్రేజ్ లాంటిది.”
“మీకూ ఉండే ఉంటారు ఎందరో ఆరాధకులు. లేరూ?” అంది నవ్వుతూ నిసి.
“ఏం లాభం? ఆ జాబితాలో మీరు చేరందే? నిజం చెప్పండి. విక్టర్ బెర్నెట్టీ అసలు మీకు ఎవరు? మీకెలా తెలుసు నేను?” విక్టర్.
(వారి సంభాషణ అంతా ఇంగ్లిష్‌లో జరుగుతూ ఉంది.)
“తమాషా చేస్తున్నారా. మీరు పేరు ప్రఖ్యాతులున్న సంగీతకారులు. ఈ మధ్య ఒకసారి, అడగ్గానే మీతో పాటు ఒక సంగీత సభలో పియానో, ఒక చిన్న బిట్ వాయించనిచ్చిన సహృదయులు.”
“నిసీ! మీరు నన్ను అసలు సరిగా ఇప్పటికైనా గుర్తు పట్టారా అని?” – అడిగాడు విక్టర్.
“లండన్ హీత్రో ఎయిర్‌పోర్ట్‌లో మీ పక్కన వచ్చి కూర్చొన్నప్పుడు నేనెవరో మీకు గుర్తు తెలియలా. తర్వాత రోమ్‌లో మీతో ఒక రాత్రంతా ఉన్నా. ఐనా మీకు బొత్తిగా…”
విక్టర్ మాటలు మధ్యలో ఆపేస్తూ, నిసి – “రోమ్‌లో కీట్స్ హౌస్ చూశాక నిజంగా నా మూడ్ చాలా డౌన్ అయింది. ఆ రాత్రి మీరు నాతో ఉండిపోయి చాలా మేలు చేశారు. మీ అంచనాల్లో తప్పేం లేదు. నా మానసిక స్థితి అప్పట్లో చాలా అస్తవ్యస్తంగా ఉంది. నా మెదడు గుర్తింపు మోడ్ కన్నా, మరుపు మోడ్‌లో లో ఉంది. బహుశా, అలా నేనే నా మెదడును ట్రెయిన్ చేస్తూ ఉండి ఉంటాను. బ్రెయిన్ ప్రోగ్రామబుల్ ఆర్గనే కదా.
మీరు వెళ్ళి పోయాక, ఆ మరుసటి రోజు సరిగా గతంలో మన పరిచయం ఎక్కడా, అన్నది గుర్తుకు వచ్చింది. ఒకసారి, న్యూయార్క్ కార్నిగీ హాల్ బైట చూసిన, మీ సంతకం పెట్టి ఉన్న మీ పోస్టర్- అదీ నాకు ముందుగా ఫ్లాష్ ఐన మెమొరీ. ఎందుకో తెలియదు.
ఆ తర్వాత, మిమ్మల్ని నా క్లినిక్‌లో కొన్నేళ్ళ క్రితం చూసిన సందర్భాలు గుర్తొచ్చాయి. మీ అక్కతో పాటు, ఆమె చెకప్ లకు మీరు కొన్నిసార్లు తోడు వచ్చేవారు. ఆమె పిల్లలతో గేమ్స్ ఆడుతూ వెయిటింగ్ రూంలో కూర్చొని ఉండేవారు. మీ అక్క నా పేషెంట్ గా ఉన్నప్పుడు, మీ గురించి చాలా సార్లు చెప్పేవారు. ఆమె వయొలినిస్ట్. మీరు పిyAనిస్ట్. ఇద్దరూ పాడగలరు. ఇతర వాయిద్యాలూ వచ్చు. సంగీతంలో మీరిద్దరూ మొజార్ట్, అతని అక్క లాంటి వారు. విక్టర్! మీరు యూరోపియన్. యూరప్, అమెరికాల్లో కాన్సర్ట్ లిస్తుంటారు. మీ అక్కయ్య, ఆమె పెళ్ళి చేసుకుని, అమెరికా సిటిజనై, జూలియార్డ్ మ్యూజిక్ స్కూల్లో పని చేశారు. చాలా. ఇంకా చెప్పమంటారా?”
విక్టర్, తన సంగ్రియా గ్లాసు, ఆమె గ్లాసుకు తాకించాడు.
“ఛీర్స్! టు యువర్ Remembrances Of The Past. నౌ ఐ నో I am not a stranger in the night to you!”
ప్రూస్ట్. అండ్? ఓహ్, సినాట్రా. ఛీర్స్!” అంది నిసి వెంట వెంటనే. ఆమె కన్నులలో సన్నని మెరుపు.
విక్టర్ అప్రయత్నంగా ఆమె కేసి వంగి, ఆమె చెంప మీద ఒక తేలిక ముద్దు ముద్రించాడు.
“నిజంగా నిసీ! మా అక్కను గురించి, ఆమె కెరీర్ కొంత కాలమైనా కొనసాగటానికి ఆమె డాక్టర్ గా మీరెంతో శ్రద్ద తీసుకున్నారు. ఆమె వయొలిన్ ఇక వాయించలేనని ధృవపడినాక ఎంత తపించి పోయింది. మా నాన్న ఎంత మనోవ్యధ చెందారు. “మేరీని మా నాన్న చిన్నప్పుడు “నన్నెల్” అనే పిలిచేవాడు. ఆమె విసుక్కుంటూనే, మురుసుకునేది. మేరీ నా కన్నా ఎంతో మంచి ఆర్టిస్ట్.” అతని కంఠస్వరం ఆర్ద్రమయింది.
“మీరు చెపితే, అదే నిజం కదా. సంగీతంలో శిక్షణలిచ్చి, పరీక్షలు పెట్టే ప్రొఫెసర్ మీరు,” అంది ఆమె మెల్లగా.
“మేరీకి, మీకు మధ్య జరిగిన చాలా సంభాషణలు, ఆమె వైద్యంలో మీరిద్దరూ ఫేస్ చేసిన ఇబ్బందులు గురించి నాకు చాలానే తెలుసు. ఆ రోజుల్లో మీరు ఆమెకి చెప్పిన ఒక తెలుగు కవిత కాదూ ఇది! నేను పైకి చదవొచ్చా? అంటూ విక్టర్ ఇలా చదివాడు.
జోరు వానలో పత్రి నై
జోరు మీటులో తంత్రి నై
కంపించనీ నన్నీ రాత్రి;
ఆకు రెపరెపల తడి తపనలు నావై
తీగ తహతహల పతనములవి నావై
ఝల్లుమననీ నన్నొక
శృంగార సంగీత విరాళిలో ఈ రాత్రి;
నే సురభిళ సుందర గాత్రినై, రాజిల్లి, శోభిల్లి
ఇంత రమించనీ నన్నీ రాత్రి;
ఆకు తటాలున రాలుననీ
తీగ పఠిల్లున తెగుననీ
ఎరుగనిదెవ్వరు?
బ్రతుకు భళ్ళున తెల్లవారునని
ఎరుగనిదెవ్వరు?
ఐనను తరళముగ రవళించి
రాగరాసిపై పవళించి
కొంత సుఖించి పోనీ నన్నీ రాత్రి, ఈ ధాత్రి.
ఎంతోమంది పేషెంట్లలో మీకు మా అక్క గుర్తుండటం కష్టం. కానీ మేరీకి, నాకు, మీరు చాలా ముఖ్యులు. అందుకేనండీ డాక్టర్! రోమ్ లో మీ వెంటబడి మీ హోటల్‌కి వచ్చిందీ.”
“తెలిసిందండీ, పియానిస్టూ! నా అందం చూసి మీరు వెంట పడలేదని.”
“ఇంతకీ మీ ఊళ్ళో, మీ సంగీతం పాఠాలు బాగా సాగుతున్నాయా?” గమ్మత్తుగా నవ్వాడు అతడు.
“ఏం నవ్వక్కర్లా. నా మీద మీకు ఎప్పటికప్పుడు రిపోర్టులు వస్తాయని నాకు తెలియదనా? నవ్వుకోండీ, నాకేం లెక్క లేదు. ఇంటికి తిరిగి వెళ్ళగానే, రెండు రోజుల్లో పాఠం ఉందండీ.”
“లిజ్స్ట్ మ్యూజియం చూసి వచ్చాను అన్నాక మిమ్మల్నెవరు కోప్పడగలరు? లెటజ్ గో ఔట్. ఈ సాయంత్రం డేన్యూబ్ నది పక్కనే ఎంతో మంది నడుస్తారు, మనమూ వారితోపాటే. ఛైన్ బ్రిడ్జి మీద దీపాలు వెలిగే దాకా అక్కడే. మనం హంగేరియన్ మ్యూజిక్‌తో ఒకటో రెండో డాన్స్ లైనా చెయ్యొద్దూ. లేకుంటే మీ అందగాడు లిజ్స్ట్ బాధపడడూ,” అతను మళ్ళీ నవ్వాడు.
“లెట్ మీ గో టు మై రూమ్, పుట్ మై డాన్సింగ్ షూస్ ఆన్,” అని అక్కణ్ణుంచి పరుగుల మీద వెళ్ళిపోయింది ఆమె.
ఓ వారం తర్వాత:
తన సంగీతం టీచర్ స్టూడియో బైట బెంచ్ మీద వేచి ఉంది నిసి షామల్. లోపలి నుండి పియానో మధుర ధ్వనులు. పక్క గది లోంచి సోనియా తన విద్యార్ధికి చెపుతున్న గాత్ర సంగీతం. వేరే గదుల్లోంచి, అప్పుడప్పుడూ వినిపిస్తున్న క్లారినెట్లు, ట్రంపెట్లు.
మూసి ఉన్న ఆ తలుపుల కేసి చూస్తూ, నిసి ఒకలాటి విచిత్రమైన ఆలోచనలకు లోనయ్యింది. చచ్చి స్వర్గంలో వేశ్యా వాటికలోకి వచ్చి పడ్డట్టున్నా. లేకుంటే పాకీజా కోఠీ లోనైనా ఉండి ఉంటా. లేకపోతే నేనేంటి, ఈ బిల్డింగ్‌లో ఈ పడిగాపులేంటీ, అనుకుంది, తన పాఠం పుస్తకం తిరగేస్తూ.
ఆమెకు అకస్మాత్తుగా, మనో కేబుల్ టి.వి.లో, ఆపరేటింగ్ రూమ్ బైట చేతులు బరాబరా రుద్దుకునే ఒకడూ; ఆపరేటింగ్ రూమ్ లోపల, ఆపరేటింగ్ బల్ల మీద తెరిచి ఉన్న పొట్టలోంచి రక్తం తోడుతూ, తన ఆకుపచ్చ గౌన్ కేసి చేతులు రుద్దుకునే వాడొకడూ; మోర్గ్‌లో బల్ల మీద మృత శరీరం కపాలం ఛేదిస్తున్న వాడొకడూ; మనిషి కన్ను పరీక్షిస్తూ ఒకతె; చిన్నపిల్ల నోరు తెరిచి నాలిక చూపిస్తే కేండీ ఇస్తానంటూ ఆశ పెడుతున్న ఒకతె; పిచ్చి ప్రలాపాలాడుతున్న ఒక పేషెంట్కు షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వటానికి రెడీ అవుతున్న ఒకడు; అందరూ తన ఫేమిలీ మెంబర్లే; వారి ఆకారాలే – దశావతారాలు, విశ్వరూప సందర్శనం లాగా; ఛానల్, ఛానెల్ లోనూ కనిపించాయి. ఆమెకు వళ్ళు భయంతో జలదరించింది. కళ్ళ ముందు ఏవో వింత రంగులు. స్పృహ తప్పుతుందేమో అనిపించింది. ఒక్కసారి కళ్ళు మూసి తెరిచింది.
ఎదురుగా చిటికెలు వేస్తూ తన మ్యూజిక్ టీచర్.
నిసి దిగ్గున లేచి తన టీచర్‌ని కౌగిలించుకుంది. “థేంక్ గాడ్! యూ ఆర్ రియల్. యూ ఆర్ రియల్, ఆరన్ట్ యూ? అంటూ, తన టీచర్ ముఖం లోకి చూస్తూ, నిలువునా కుదిపేస్తూ.