ఆకుపై నిలిచిన వానచినుకులు

కాలగర్భంలో
ఒక దశాబ్దం కరిగిపోయాక
చిరునవ్వు వెదజల్లే నీ ముఖారవిందం
చూసి వెళ్ళేందుకు వస్తున్నాను
అప్పటి లానే మెరుస్తుంటుందా
పూవై పూసిన నగుమోము?

నీ ఊరు దగ్గరయ్యేకొద్దీ
ఎదగూటిలో ప్రాణం కాగుతూ వుంది
నిలుచున్న చెట్లు నడుస్తున్నట్టూ
నడిచే వాహనం ఆగున్నట్టూ
అబద్ధం చెప్తుంది రహదారి!
పురివిప్పి ఆడుతున్నాయి
నెరవేరని కలలు!

పట్టుపావడా గాలికి రెపరెపలాడుతూ,
ఒద్దికలోనే ఒకింత గర్వం కలిసిన చూపులతో
విరిసీవిరియని పువ్వులతో
కయ్యమాడే జడను వెనక్కి తోసుకుంటూ
సిరిమువ్వలు తొడిగిన లేడికూనలా
నేలకు జారిన నీలమేఘంలా
దాచుకున్న సిగ్గునంతా
ఉండజుట్టి నా పైకి విసిరి
నీవు నన్ను దాటి వెళ్ళినంత కాలం –
దారంతా కార్తీకమే; మనసంతా మార్గశిరమే!

ఏడో ఎనిమిదో ఉంటాయా?
పరిచయం సాగిన ఏళ్ళు,
పంచుకున్న మాటలూ?

ఈ పూటయినా మాట్లాడతావా చెలీ!

“రండి.”

ఏళ్ళు త్రవ్వి తీసిన స్వరం ఖచ్చితంగా అదే
అయితే నువ్వు మాత్రం నువ్వు కాదు.

దారిపొడవునా రంగులు
పరచిన ఆమెక్కడ
వర్షంలో తడిసి వెలిసిన
వర్ణచిత్రం నీవెక్కడ
పువ్వులపై కాలపు కొరడా
నిర్దయగా ఎలా ఆడిందో.

మళ్ళీ
మాటలు మర్చిపోయిన భాషతో
నువ్వూ నేనూ.


ఫోటోకి వేసిన పూలదండ
మీ అమ్మ మరణాన్ని,
దండలో ఎండిపోయిన పూలు
నీ సంపదని నాకు తెలియచెప్పాయి

ఫోటోలో కూడా నవ్వడం తెలియక
అమాయకంగా నీ ఇద్దరు పిల్లలు

తేనీరు తెచ్చి ఇచ్చావు
తగలకూడదన్న నీ భయం
తాకకూడదన్న నా వణుకు
మనచేతుల్లో కప్పు కాస్త చలించింది

మౌనం పోగుచేసి, పాతకథలు మాట్లాడి
పెచ్చులూడుతున్న గోడమీది బల్లికేసి చూసి
ఓరచూపులతో ప్రాణాలను పరామర్శించి
ఇంకా ఇక్కడే ఉంటే
కన్నీటితోబాటు నిజమూ
బయటకొస్తుందని భయపడి
ఒక నమస్కారంతో బయటపడి

చివరిసారి సెలవు తీసుకోవాలని
కిటికీ కమ్మీల వెనుక నీ కళ్ళని వెతికినప్పుడు
సాగనంపడానికి కారు దాకా వచ్చిన నీ భర్త అన్నాడు
“మీరే ఆమెను పెళ్ళి చేసుకోవలసింది.”

నీలాంటి ఆడవారెందరో
ఈ లోకంలో!
ప్రేమించిన సంగతి
ప్రియుడికి కాక
భర్తలకు చెప్పుకున్నవారు!


ఈ కవిత తమిళ మూలం (తెలుగు లిపిలో, ఆడియోతో.)