ఉ. పొన్నలు పూచెఁ బొన్నలొగిఁబూవక ముందఱఁబూచె గోఁగులా
పొన్నలుఁ దొండ గోఁగులును బూవక ముందఱ బూచె బూరువుల్
పొన్నలుఁ గొండ గోఁగులును బూరువులున్నొగిఁ బూవకుండగా
మున్న వనంబునం గలయ మోదుగులొప్పుగఁ బూచె నామనిన్
శివుని భార్య అయిన సతీదేవి తన తండ్రి చేసే యాగానికి పోతుంది. దక్షప్రజాపతి చేసే యజ్ఞం కాబట్టి అఖిల దేవతలు, దిక్పాలకులు, అందరూ వస్తారు. కానీ తన భర్త అయిన శివునకు ఆహ్వానం లేదు. ఆహ్వానించక పోవడమే కాదు, అతన్ని తూలనాడతాడు దక్షుడు. దేవతలెవరూ నోరెత్తరు. తన భర్తకు జరుగుతున్న అవమానాన్ని భరించలేక అగ్నిని సృజించుకొని అందులో దగ్ధమౌతుంది సతీదేవి. విషయం తెలిసి తన గణం చేత యజ్ఞాన్ని ధ్వంసం చేయించి, ఆ యజ్ఞానికి వచ్చిన వారినందరినీ దండింపిస్తాడు శివుడు. ఆ తర్వాత సతీవియోగంతో మనశ్శాంతి లేక హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుంటుంటాడు. ఈలోగా సతీదేవి మేనకా హిమవంతులకు పుత్రికగా జన్మించి పెరిగి పెద్దదౌతుంది. ఆమెను తపస్సు చేసుకుంటున్న శివునికి సపర్యలకు గాను నియోగిస్తాడు హిమవంతుడు.
ఇదిలా ఉండగా, తారకాసురుడనే రాక్షసుడు దేవతలనూ మునులనూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వాడిని శివకుమారుడు తప్ప వేరెవరూ సంహరించలేరు. శివునికేమో కొడుకులు లేరాయె. అసలు భార్యే లేదాయె. అందుకని శివునికి ఎలాగైనా పార్వతి మీద మోహం కలిగేలా చేసి, వారికి పుత్రోదయం జరిగేట్టుగా చూద్దామని అనుకున్నారు దేవతలు. విరాగిగా ఉన్న శివుని మనసులో రాగం పుట్టించగలిగిన వాడు మన్మధుడు ఒక్కడేనని, అతన్ని పొగిడి, ఆ పని మీద పంపుతారు. భార్య అయిన రతీదేవి ఎంత వద్దని వేడుకున్నా వినక — తన పరివారమైన వసంతుడినీ, చిలకల దండునూ, పువ్వుటమ్ములనూ, చెరకు వింటినీ, తుమ్మెదలనూ తీసుకుని బయలు దేరతాడు మన్మధుడు. మన్మధుడు పూల బాణాలు వేసి స్త్రీ పురుషులలో మోహాన్ని కలిగిస్తాడనేది మన కవుల తిరుగులేని కవిసమయం.
మోహావేశం రావాలంటే పరిసరాలూ ఆహ్లాదకరంగా ఉండాలి కదా. పర్యావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేది వసంతం కాక మరేమిటి? అందుకనే వసంతుణ్ణి వెంటపెట్టుకుని వచ్చాడు మన్మధుడు. ఇంకేముంది, ఆ వసంతుడు వచ్చీ రాగానే చెట్లు పులకించి చిగురులు తొడగడమూ, పూలు పూసి వికసించడమూ, సౌరభాలు వెదజల్లడమూ అయింది. వెన్నెల రాత్రుల్లో ఆ పూలూ, పరిమళాలూ లోకాన్ని సౌందర్యంతో ముంచెత్తుతుండగా తను పూల బాణాలు సంధిస్తే — శివుడయ్యేది కాని, మరెవరయ్యేది కాని — ఇక తిరుగేముంది అనుకున్నాడు మన్మధుడు. అదుగో, అలాంటి వసంత సందర్భంలో ఆ కొండమీది చెట్లన్నీ కుసుమించాయని వివరిస్తున్నది పై పద్యం.
అన్నిటికన్నా ముందుగా మోదుగలు పూచాయి. ఆఖరున పొన్నలు పూచాయి. కానీ కవి తన పద్యంలో చమత్కారంగా పొన్నలు పూచాయి అని మొదలు పెట్టాడు. పొన్నలు పూచాయి. వాటికంటే ముందు కొండ గోగులు పూచాయి. కొండ గోగుల కంటే ముందు బూరుగలు పూచాయి. పొన్నలూ, గోగులూ, బూరుగలూ పూచేదానికన్నా ముందుగా మోదుగలు పూచాయి అని ఒక చమత్కారంతో పద్యంలో మంచి సౌందర్యాన్ని సాధించాడు కవి. కొండవనాల మీద మిక్కుటంగా ఉండే చెట్ల్లు మోదుగలు. వాటి పూలు రక్తంలా ఎర్రగా ఉంటాయి. పూస్తే చెట్టంతా సందు లేకుండా పూసి ఎర్రగా నెత్తురు చెట్టులాగా ఉంటుంది. యుద్ధంలో ప్రత్యంగమూ గాయాలై రక్తమోడుతున్న శరీరంతో ఉండే యోధుణ్ణి పూచిన మోదుగగా వర్ణిస్తాయి చాలా కావ్యాలు. ఇక కొండ గోగులు తెల్లటి పెద్ద పెద్ద పూలు. చెట్లు చిన్నవే కాని, కొమ్మ కొమ్మ సందునా విరివిగా తెల్లటి పూలు పూస్తాయి. గోగుపూలు శివపూజకు ఎక్కువగా వాడతారు. మోదుగలు, బూరుగులు, గోగులు పూయగానే పొన్నలూ పూచాయి. ఈ విధంగా రకరకాలైన చెట్లు ఒకదాని తర్వాత ఒకటిగా పూసి ఆ వసంతకాలంలో వనమంతా రంగురంగుల పూలతో మనోహరంగా తయారయింది. ఇదీ పై పద్యం.
భావంలో పెద్ద విశేషమేమీ లేదు. ఆమనిలో ఆవనిలో ఆ చెట్లు పూశాయి ఈ చెట్లు పూశాయి అని చెప్పటమే. కానీ చెప్పటం ఎంత రమ్యంగా, ఎంత చమత్కారంతో చెప్పాడో గమనించారు కదా. అలా తిరగేసి చెప్పడంలో ఎంతో సుందరంగా తయారయిందీ పద్యం. ఏ కవి అయినా భావం బాగా అర్థమయేట్టు చెప్పడానికే ప్రయత్నిస్తాడు. కానీ అదే భావాన్ని మనోజ్ఞంగా, చిత్రంగా, ప్రత్యేకంగా, క్రొత్తగా చెప్పడానికి — కొత్తదనాన్ని ప్రేమించే ఒక సమర్ధుడైన కవి ప్రయత్నిస్తాడు. భావవ్యక్తీకరణంలో ఒక సౌందర్యాన్ని సాధిస్తాడు.
ఈ పద్యంలో ఆ అందాన్ని సాధించిన కవి పేరు నన్నెచోడుడు. ఆయన కుమారసంభవ కావ్యం లోనిది ఈ పద్యం. ఈయనను గురించి మనం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం. నన్నయకూ, తిక్కనకూ మధ్య కాలం వాడని చాలా వాదవివాదాలు, చర్చల తరువాత పెద్దలు నిర్ధారించారు. నిజానికి అష్టదిగ్గజాల కాలమే ప్రబంధ యుగమనీ, మనుచరిత్రమే మొదటి సంపూర్ణ ప్రబంధ లక్షణాలు కలిగిన కావ్యమనీ అంటారు గాని — నన్నెచోడుని కుమారసంభవం అన్ని లక్షణాలనూ పుణికి పుచ్చుకొన్న సర్వాంగ సుందర ప్రబంధం. నృసింహపురాణం వ్రాసిన ఎఱ్ఱనను ప్రబంధ పరమేశ్వరుడు అన్నారు కాబట్టి నన్నెచోడ మహాకవిని ‘ప్రబంధ పరమేష్ఠి’ అనైనా అనడం సముచితం.
చదువుతుంటేనే హాయిగా, ఆహ్లాదంగా సాగిపోయే ఈ పద్యం కుమారసంభవంలో నాకు నచ్చిన చాలా పద్యాలలో ఒకటి.