[డేవిడ్ షూల్మన్ (David Shulman) జెరూసలేం హీబ్రూ యూనివర్సిటీలో తులనాత్మక మతధర్మశాస్త్ర విభాగంలో ఆచార్యుడిగా, దక్షిణ భారతదేశపు భాషలు, సాహిత్యం తదితర అంశాలపై పరిశోధిస్తున్నారు. 1976లో లండన్ యూనివర్సిటీ నుండి పిహెచ్.డీ. 1987 మెక్ఆర్థర్ ఫెలోషిప్ గ్రహీత. ఇజ్రాయెల్ అకాడెమీ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ గౌరవసభ్యుడు. ఇజ్రాయెలీ, పాలస్తీనీయుల ఉమ్మడి శాంతి దళం సభ్యుడిగా ఇరు దేశాల మధ్య శాంతి, సామరస్యాల కోసం కృషి చేస్తుంటారు.]
[మూల వ్యాసం in English]
తెలుగు పాండిత్యానికి ఒక విశిష్టత ఉంది. గత మూడు తరాలుగా అది స్వతంత్ర భావాలు, సాంప్రదాయ విరుద్ధమైన ఆలోచనలతో సాహిత్య విచారణను కొత్త దారులు పట్టించే విప్లవాత్మక సాహితీవేత్తలను, అదే విరుద్ధ పద్ధతిలో పుట్టించుకుంది. అంటే, సాహిత్య సృజన, పరిశీలనల కోసం ఏర్పడ్డ సంస్థలు, విశ్వవిద్యాలయాలలో విభాగాలు, ప్రత్యేక మండలుల వంటివి, ఏవైతే ఉన్నాయో, వాటికి వెలుపలగానే ఈ విశిష్ట మేధావులను అది ప్రోత్సహించి ఆదరించింది. చారిత్రక పరిశోధకుడు రాళ్ళబండి సుబ్బారావు, భాషోత్పత్తి శాస్త్రవేత్త మానవల్లి రామకృష్ణ కవి, చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ — ఇలా ఎన్నో ఉదాహరణలు. అయితే, ఇవి 20వ శతాబ్దంలో ఆయా విద్యాలయాల వైఫల్యంగా కాకుండా, ఆంధ్ర సాహిత్య సంస్కృతికి ఇది ఒక ప్రత్యేకమైన లక్షణంగా నేను అనుకుంటాను. ఇలాంటి ఉదాహరణలు కొన్ని మనకు తమిళ, మళయాళ భాషలలో కూడా దొరుకుతాయి. ఏటికి ఏదురీదే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎప్పుడూ సంస్థాగత సమాజపు అంచులలోనే ఉండడం ఇందుకు కారణమేమో.
గత శతాబ్దంలో, వెల్చేరు నారాయణ రావు నిస్సందేహంగా, సాంప్రదాయక ధోరణులను కూలదోసిన ఒక విప్లవాత్మక సాహిత్యవేత్త. చాలా నిర్దిష్టమైన స్వతంత్ర భావాలు వున్నవాడే అయినా జడుడు కాడు. తన అభిప్రాయాలు తప్పని అనుకున్నప్పుడు వాటిని మార్చుకోవడానికి ఏమాత్రమూ సందేహించలేదు. సాహిత్యాన్ని గురించి ఏ పండితుడి ప్రవచననీ అతను కేవలం నమ్మకంతో ఎప్పుడూ నెత్తి కెత్తుకోలేదు. ఆ సాహిత్యాన్ని తనంతట తాను క్షుణ్ణంగా చదివి, మమేకం చేసుకుని తన విశ్లేషణ ద్వారా మాత్రమే ఆ సాహిత్యం గురించి అభిప్రాయాలు ఏర్పరుచుకునేవాడు. అతను చదివే, ఆలోచించే పద్ధతిలో ఆరోగ్యకరమైన ఒక సంశయాత్మకత ఎప్పుడూ గాఢంగా ఉంటుంది. కేవలం నమ్మకం మీద ఆధారపడిన విజ్ఞానాన్ని అతనెప్పుడూ ఒప్పుకోలేదు, అవి సంస్కృత అలంకార శాస్త్రాలు అయినా సరే, ఆధునిక సాహిత్య, భాషాశాస్త్ర వేత్తల ప్రతిపాదనలు అయినా సరే. సాహిత్యంతో మమేకమయిన ఒక సహజదృష్టి, ఒక ఇంట్యూటివ్ అండర్స్టాండింగ్, మనసు లోలోతుల్లో వేసిన బలమైన ముద్ర అతని ప్రతిపాదనలలో వినిపిస్తుంది. అది మనలో ముందు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ, కాసేపట్లోనే ఆ ప్రతిపాదన ఒక ప్రణాళికతో,లోతుగా చేస్తున్న విశ్లేషణలో భాగమని, మనకు తేటతెల్లమై, మనల్ని మరింత లోతుగా ఆలోచించేటట్లు చేస్తుంది. ఇలా మెరుపుల్లాగా మెరిసి మనల్ని ఆశ్చర్యంలో ముంచేసే ఊహలు నారాయణ రావుకి, ఎలా వస్తాయో, ఎప్పుడొస్తాయో, నాకు అంతు చిక్కదు.
నారాయణ రావు సాహిత్యాన్ని ఆకళింపు చేసుకునే తీరులో కొన్ని ప్రత్యేకమైన ధోరణులున్నాయి. అవి విపరీతంగా కనిపించవచ్చు కానీ, కావు. అవి తెలుగు సాంస్కృత సాహిత్య సంప్రదాయాలను పూర్తిగా అర్థం చేసుకోవడం వల్ల వచ్చినవి. ప్రాచీన సాహిత్యంలో కొన్ని కావ్యాలు ఫలానా రచయిత సృష్టి అని చెప్పలేం. అవి ఆ రచయిత కంటే ముందు నుంచే వుండి వుండవచ్చును. రచయిత పేరు జతచేయబడడం ఆ కావ్యానికి ఒక హోదాను ఇవ్వడానికే తప్ప, మనం ప్రస్తుతం అనుకునే విధంగా రచయితే ఆ రచన చేసి వుండడు. ఆ రచన నిజానికి ఆ సమాజం వ్రాసుకుని వుంటుంది. ఏదేమైనా ఆ సాహిత్యానికి కర్తృత్వం వ్యావహారికమే కానీ నిర్ధారించబడే నిజం కాదు. అందువల్ల ప్రతీసారి వేసుకోవలసిన ప్రశ్నలుంటాయి: ఈ సాహిత్యాన్ని ఎవరు, ఎందుకు ఆదరిస్తున్నారు? ఏ సామాజిక వర్గం ఈ సాహిత్యానికి ఆద్యురాలు? ఆ సాహిత్యం నిర్దేశిస్తున్న ఏ ఆదర్శాలని ఆ వర్గం వారు ఆచరిస్తున్నారు? ఈ ప్రశ్నలు, మౌన పఠనానికి అనువైన కావ్య సాహిత్యానికి, ప్రకాశపఠనానికి అనువుగా వ్రాయబడిన పౌరాణిక సాహిత్యానికి కూడా అవసరమైనవి.
అందువల్లనే గ్రంథకర్తృత్వం సమాజానిది అని నారాయణ రావు అంటున్నది. ఆ రకమైన సాహిత్య సృష్టిని అర్థం చేసుకోవాలంటే మనం అది ఏర్పడిన సాహిత్యావరణాన్ని ముందుగా తెలుసుకోవాలి. ఆ పర్యావరణం నిరంతరం మార్పు చెందేదనీ, చారిత్రక పరిణామాన్ని నిక్షిప్తం చేసుకునేదనీ మనం గ్రహించాలి. దానిని అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న సాహిత్య సూత్రాలు, ప్రత్యేకించి కాశ్మీరీ రస-ధ్వని సిద్ధాంతాల వంటి వాటి ఆధారంగా బేరీజు వేయలేం. దక్షిణ భారతీయ సాహిత్యంలో అటువంటి సిద్ధాంతాల అన్వయానికి అంతగా చోటు లేదు. ఈ సాహిత్యం శబ్ద ప్రధానమై సామాజిక నేపథ్యం, సమాజపు భాషావ్యాకరణాల పరిధి, వీటికి లోబడి వుంటుంది. అది చదివే తీరు, వినే తీరు ఆ సాహిత్యానికి మూలం. అందువల్ల ఈ సాహిత్యానికి పఠిత, శ్రోత ఇద్దరూ అవసరమౌతారు. ఆరకంగానే ఈ మౌఖిక సాహిత్యపు చారిత్రక దశల గురించి మనం ఆలోచించగలం. ప్రథమ స్థాయిలో (పల్నాటి వీరుల కథ లాగా) జానపద వీరగాథల రూపంలో వుండే మౌఖిక సాహిత్యం, ద్వితీయ స్థాయికి వచ్చేసరికి శ్రీనాథుడి వంటి గొప్ప కవి చేతులో పాడుకోగలిగిన రచనగా మార్పు చెందుతుంది. ఈ రెండు స్థాయిలలోనూ సాహిత్యం ప్రజలను సంగీతం ఆధారంగా రంజింపచేస్తుంది. కానీ తృతీయ స్థాయిలో, గొప్ప కవుల రచనలను ఆక్షేపించడం, లేదా వ్యాఖ్యానించడం ద్వారా రూపాంతర సాహిత్యంగా మార్పు చెందుతుంది. చాటు సంప్రదాయం ఇందుకు ఒక చక్కటి ఉదాహరణ.
నారాయణ రావు అభిప్రాయాలు స్థిరమైన అస్థిరత్వంతో వుంటాయి. ఈ విషయంలో అతను నాకు కన్నడ వచన మార్మికులను గుర్తుకు తెస్తాడు. వారికి మల్లే ఇతని ఆలోచలనలలో ఒక గూఢత వుంటుంది. ఆ గూఢత వారి సహజ జ్ఞానం, వారి అంతర్దృష్టి నుండి వస్తుంది. ఆ దృష్టి వారి ఆలోచనలకు ఆపాదించిన తార్కికత వల్ల వారు తమ మౌలిక విశ్వాసాల పట్ల స్థిరంగా వుంటారు.కానీ ఏ విశ్వాసానికీ ఒక శాశ్వతమైన రూపం ఇవ్వరు. అది అస్థిరంగానే వుంటుంది. నారాయణ రావు ప్రతీ ఆలోచనలోనూ నాకు ఇదే విధంగా స్థిరమైన అస్థిరత కనిపిస్తుంది. “నిజానికి రూపాలు ఎన్నో వుంటాయి. కానీ కల్పనకు రూపం ఒకటే.” అని నారాయణ రావు మనకు చెప్తాడు. ఈ వాక్యాన్నే పాలా రిచ్మన్ (Paula Richman) తన పుస్తకం క్వశ్చనింగ్ రామాయణాస్కు ఆదర్శ సూత్రంగా తీసుకుంది.
నిజమైన సాహిత్యం ఎన్నో పాఠాంతరాలలో కనిపిస్తుంది. అవన్నీ కూడా నిజమైన రూపాలే. ఒక ఫలానా కావ్యానికి, ఫలానా కవి కృతికర్త అని నిర్ధారించబూనే ప్రయత్నం అవివేకంతో కూడుకున్నది. మహాకవి కాళిదాస విరచిత కావ్యానికే ఈ నిర్ధారణ లేనప్పుడు మహాభారతం వంటి ఇతిహాసాలకు రచయితను నిర్ధారించడం మరింత మూర్ఖమైన పని. సాహిత్య వివేచనలో మెడిటరేనియన్ పద్ధతులు భారతదేశానికి నప్పవు. ప్రతి రచననూ పరిశీలించేటప్పుడు, ప్రచురిత పాఠానికి (Recorded Text), అంటే పుస్తకంలో ప్రచురించబడిన పాఠానికి, పరిగ్రహ పాఠానికి (Received Text), అంటే మౌఖికంగా పారంపర్యంగా వస్తూ ప్రజల నాలుకలపై ఆడుతున్న పాఠానికీ గల తేడాలను ఎప్పుడూ మర్చిపోకూడదు. “పుస్తకంలో వుండే సాహిత్యం చప్పగా, చదునుగా వుంటుంది. అది ఎప్పుడైతే సమాజంలో వాడుకోబడుతుందో అప్పుడే అది వైవిధ్యాన్ని సంతరించుకొని సమాజాన్ని ప్రతిఫలిస్తుంది. ఒక సాహిత్యం జనామోదం పొందడానికి ఆ సాహిత్యపు మౌఖిక రూపం సహకరిస్తుంది. ఆ పని కేవలం లిఖిత ప్రతి చెయ్యలేదు.” అని ఎ పోయమ్ ఎట్ ది రైట్ మూమెంట్ పుస్తకం ముందుమాటలో నారాయణ రావు అంటాడు. ఒక తెలుగు పద్యాన్ని ఎలా చదవాలో, ఆ పద్య సాంప్రదాయం మనకు చెబుతుంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను: మనం పోగొట్టుకున్న పఠన సాంప్రదాయ సిద్ధాంతాలను మనం మళ్ళీ సాధించుకోవాలి.
నారాయణరావుకి పఠన సాంప్రదాయాలపై వున్న అవగాహన ఎంత అసాధారణమైనదీ అంటే, ఈ సాంప్రదాయాలు పుడుతున్న ఆ కాలంలో ఇతను ప్రత్యక్షంగా అక్కడే వుండి వాటిని దగ్గరగా గమనించాడేమో అన్నంత. అప్పటినుంచీ, మిగతా సమాజం మరచిపోయినా, నారాయణ రావుకు సంబంధించినంత వరకూ ఆ సాంప్రదాయం ఎక్కడా తెగిపోకుండా అతనితో పాటే వుందని గత మూడు దశాబ్దాలుగా నారాయణ రావుతో కలిసి పని చేసిన అనుభవంతో నాకు బోధపడిన విషయం. ఈ మాట అనడంలో నా ఉద్దేశ్యం, నారాయణ రావుకి సాంప్రదాయం పట్ల వున్న అవగాహన పూర్తిగా చారిత్రకమైనది, కాలానుక్రమానికి లొంగని దృక్పథం ఇది — అని వేరే రకంగా చెప్పడం. ఆంధ్ర దేశంలో (నిజానికి దక్షిణ భారత దేశమంతటా), 16వ శతాబ్దంలో వచ్చిన సామాజిక చైతన్యంతో ఎంతో గాఢానుబంధం పెంచుకొన్న నారాయణ రావు, ఈ చైతన్యాన్ని ‘ఆధునికత’గా పిలుస్తాడు. 19వ దశాబ్దంలో పుట్టుకొచ్చినది ‘వలసవాద ఆధునికత’. నారాయణ రావు దృష్టిలో అది ఆలస్యంగా పుట్టిన ఒక అపోహ, ఒక అపార్థం, సారహీనమైన ఒక ఉత్పాతం. అన్నమయ్య, పింగళి సూరన, కరణం చరిత్రకారులలో 17వ శతాబ్దానికి మునుపే పుట్టిన భావ చైతన్యమే ఎంతో లోతైనది, నిజమైనది. కుల, వర్ణ విబేధాలకు అతీతంగా, లౌకిక రసాస్వాదనాదర్శాల ఆధారంగా రూఢి అయిన ఆధునికత ఇది. ఈ ఆధునికత తెచ్చిన విప్లవాత్మకమైన మార్పుల ముందు, 19వ శతాబ్దపు వలసవాద ఆధునికత తెచ్చిన మార్పులుగా చెప్పబడేవి ఎందుకూ కొరగానివి.