శీనుగాడంటే నాకు ఇప్పటికీ పరమ చికాకు. మొదట్నుంచీ కూడా వాడి అతి వినయం, తెచ్చిపెట్టుకున్న నెమ్మదితనం చూస్తే పరమ రోతగా వుండేది. అందరిముందూ గొప్ప కోసం అలా ఉంటాడని నాకు గట్టి నమ్మిక. నాకే కాదు, నా స్నేహితులదీ అదే అభిప్రాయం. కానీ అమ్మా, నాన్నా, ఇంకా తెలుసున్నవాళ్ళూ వాణ్ణి ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు. అది మాత్రం నేనస్సలు భరించలేక పోయేవాణ్ణి. ఎప్పుడైనా అమ్మా, నాన్నలకి ఎదురు చెప్పినా లేదా క్లాసులెగ్గొట్టి మార్నింగ్ షో సినిమాలకి వెళ్ళినట్లు తెలిసినా అమ్మ పెట్టే చివాట్ల కష్టోత్తరం ముందు శీనుగాడి స్తుతితోనే మొదలయ్యేది. “ఆ శీనుగాణ్ణి చూసి నేర్చుకో? ఎంత నెమ్మదిగా ఉంటాడో? ఏం చూసుకొని ఆ పొగరు?” నాన్న తిట్టే తిట్లకన్నా శీనుగాడి పేరున్న అక్షింతలు పడుతూండడం నాకు తల నొప్పిగా తయారయ్యేది. నేను ఎంత వద్దనుకుంటే అంతగా వాడి పేరు మా ఇంట్లో మారు మ్రోగేది.
పదో తరగతి వరకూ నాకు తిరుగు లేదు. మా చుట్టుపక్కల పిల్లలందరిలోకీ నేనే బాగా చదివే వాణ్ణి. ఫస్టు మార్కులన్నీ నాకే. తీరా ఇంటర్మీడియట్ కాలేజీలో చేరాక నా ప్రభ పూర్తిగా పడిపోయింది. దానిక్కారణం శీనుగాడు మా కాలేజీలో జేరడమే! ఫస్టియర్ అన్ని సబ్జెక్టుల్లోనూ నాకంటే వాడికే ఎక్కువ మార్కులు. లెక్చరర్లందరికీ వాడే ఫేవరెట్ స్టూడెంట్. నాన్నకి మా కాలేజీలో అందరూ తెలియడం వల్ల లెక్చర్లందరూ శీనుగాడి గురించి మోసేసేవారు. దానికి తగ్గట్టు నాకూ మార్కులు కాస్త తగ్గడంతో మా ఇంట్లో చివాట్ల మోత రోజు రోజుకీ పెరిగి పోయేది.
వాడికీ నాకూ ఏవిటి తేడా? ఏవీ లేదు. వాడు నల్లగా బక్కగా ఉండేవాడు. నేను పసిమిచాయ. వాడు పొట్టి. నేను మరీ పొడుగు కాకపోయినా పరవాలేదు. వాడికంటే చూడ్డానికి బావుంటాను. నా ఫ్రెండ్సందరూ శోభన్ బాబులా ఉంటావని అనేవారు. శీనుగాడికి నేను పెట్టిన పేరు రరేత. అంటే రవణారెడ్డి తమ్ముడని. శీనుగాడికంటే నేనేమీ తక్కువ తీసిపోలేదు. వాడు చదువులో మాత్రమే ఫస్టు. నాకూ వాడితో సమంగా కాకపోయినా ఇంచుమించుగా ఫస్టు మార్కులొస్తాయి. అయినా సరే అందరి దృష్టిలోనూ నేనొక అల్లరివాణ్ణి. పొగరబోతుని. క్లాసులెగ్గొట్టి సినిమా హాళ్ళ చుట్టూ తిరిగేవాణ్ణి. వాడు మాత్రం నాగేశ్వర్రావు సినిమా టైటిల్స్ లాగా బుద్ధిమంతుడు, మంచివాడు, బంగారు బాబు. నేను మాత్రం జులాయిని.
ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా చదువులో బాగానే మార్కులు రావడంతో నాన్న ఎప్పుడైనా తిడితే నేనూ మొండిగా తిరగబడేవాణ్ణి. అమ్మకి నేనంటే కొంచెం గారాబం. ఎందుకు చిన్న పిల్లాణ్ణి తిడతారని నాన్నని అన్నా, నేను చేసిన పనులు నచ్చక పోయినప్పుడల్లా శీనుగాడితో పోల్చి మరీ కసురుకునేది.
శీనుగాడు వాళ్ళది సమనస. అమలాపురానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండేదా వూరు. శీనుగాడు వాళ్ళ నాన్న మా నాన్న దగ్గర గుమాస్తాగా మూడేళ్ళ క్రితం పనికి కుదిరినప్పటి నుండీ శీనుగాడి గురించి వింటూనే వున్నాను. కామేశ్వర్రావు మాస్టారు నాన్న స్నేహితుడు. ఆయనే శీనుగాడి నాన్న నాగుల్ని నాన్న దగ్గర పనికి కుదిర్చాడు. మొదట్లో మాస్టారే శీనుగాడి గురించి నాకు చెప్పారు. అప్పటికి నేను తొమ్మిదో క్లాసులో ఉన్నాను. అడపాదడపా వాడి పేరు వినడమే తప్ప వాణ్ణి చూసిన పాపాన పోలేదు. పదో తరగతయ్యాక ఇంటర్మీడియట్లో జాయినయినప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చాడు. చెప్పద్దూ, మొదట్లో నాకు అంత ఏవగింపు కలగలేదు. కానీ రాను రానూ వాడు నాకు తలనొప్పిలా తయారయ్యాడు. క్లాసులో వాడికే ఫస్టు మార్కులు రావడంతో, వాడినే అందరూ మెచ్చుకోవడంతో నాకు వాడంటే పడేది కాదు. వాడి పేరు చెబితేనే కోపం నషాళానికి అంటేది. దానికి తోడు వాడి అతి వినయం చూస్తే ఒళ్ళు మండిపోయేది.
రోజూ సమనస నుండి పది కిలోమీటర్లూ సైకిలు మీద వచ్చేవాడు. చొక్కా కాలరుకి చిన్న రుమాలు పెట్టుకొని సినిమా పాటలు పాడుకుంటూ ఆ డొక్కు సైకిల్ మీద హీరోలా పోజిచ్చేవాడు. నేనూ, నా ఫ్రెండ్సూ వాణ్ణి అవకాశం వచ్చినప్పుడల్లా తెగ ఏడిపించే వాళ్ళం.
“ఏరా! అక్కినేని నాగేశ్శర్రావులాగా కాలర్ మీద ఆ రుమాలేంటిరా? కారున్న క్లీనరూ – కాలరున్న శీనడూ!” అంటూ ఆట పట్టించే వాళ్ళం.
వాడు క్లాసుకెళుతూంటే వెనకాలనుండి వచ్చి కాలర్ కున్న రుమాలు లాగేసేవాళ్ళం. లేదంటే కావాలని వెళ్ళి భుజంతో గుద్దేవాళ్ళం. వాడెప్పుడూ ఏవీ అనకుండా ఉండడంతో మరింత రెచ్చిపోయేవాళ్ళం. ఒకసారి మా అన్నయ్య స్నేహితుడి పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళకి చిన్న ప్యాకెట్ ఇచ్చారు. అందులో రుమాలు కూడా ఉంది. నేనూ నా స్నేహితులూ మరో రెండు పోగు చేసి మర్నాడు పదిమంది ముందూ శీనుగాడికిచ్చి వాణ్ణి ఆట ఏడిపించాం.
“ఒరేయ్! శీనుగాడి పెళ్ళికి కట్నం ఏవిట్రా?” అని ఒకడంటే, “లారీడు రుమాళ్ళు!” అని మరొకరు.
కొంతకాలం అయ్యేసరికి శీనుగాడు నాతో మాట్లాడ్డం మానేశాడు. దాంతో నాకు వాడంటే మరింత కోపం పెరిగిపోయింది.
మాకు సిలబస్ కాలేదని లెక్చరర్లు అప్పుడప్పుడు ఎక్స్‌ట్రా క్లాసులు పెట్టేవారు. దాతో శీనుగాడు వాళ్ళ నాన్నని కలవాలన్న వంకతో మా నాన్న వద్దకి వచ్చేవాడు. మా నాన్న వాణ్ణి మా ఇంట్లో భోజనం చెయ్యమని పంపించేవాడు. అమ్మ మా ఇద్దరికీ పక్క పక్కనే పీటలేసి భోజనం పెట్టేది. వాడి పక్కన కూర్చుని తినాలంటే కంపరంగా ఉండేది.
“నాకిప్పుడు ఆకలిగా లేదు. తరువాత తింటాను,” అని చెప్పి వాడిదయ్యాక తినేవాణ్ణి. ఒక్కోసారి నాది అయ్యాక వాడికి పెట్టమని అమ్మని విసుక్కునేవాణ్ణి. అమ్మ ఏవీ అనలేక నన్ను తర్వాత తిట్టేది. శీనుగాడు మాత్రం ఎంతో వినయంగా – “పరవాలేదండీ, ముందు వాడికి పెట్టండి. నాకేం తొందర్లేదు,” అనేసరికి నాకు కోపం ఇంకా పెరిగిపోయేది. వాడి నక్క వినయాలు చుస్తే ఒళ్ళు కంపరం పుట్టేది. శీనుగాడి మీద ఎప్పుడూ నాదే పై చేయి ఉండాలనే కోరిక నాది. వాడు బాధపడడం నాకు ఎంతో ఆనందంగా ఉండేది. వాడు నష్టపోవడం నాకు కావాలి. ఇదే రోజురోజుకీ నాలో పెరిగిపోయింది.
ఆ యేడాది దీపావళి వచ్చింది. నేనూ, మా అన్నయ్యా సిసింద్రీలు, మతాబులూ, చిచ్చుబుడ్లూ ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. మాకు సాయంగా నాగులు గారు వచ్చేవారు. సూరేకారం, గంధకం, బొగ్గూ ఎన్ని పాళ్ళలో వెయ్యాలో అన్నీ ఆయనే చెప్పేవారు. నేనూ, మా అన్నయ్యా నూరడం, వస్త్రకాళితం చెయ్యడం లాంటి మిగతా పన్లు చేసేవాళ్ళం. సిసింద్రీలు కూరడం మాత్రం నా పని. జువ్వలూ, చిచ్చుబుడ్లూ అన్నయ్యా, ఆయనా కలిపి చేసేవారు. దీపావళి దగ్గరకొచ్చాక అమ్మ కొన్ని మతాబులూ, జువ్వలూ నాగులు గారికని కొన్ని పక్కన బెట్టింది. నేను మాత్రం ఒక్క సిసింద్రీ కూడా ఇవ్వలేదు. కావాలంటే మతాబులు ఇచ్చుకోమనీ, నా సిసింద్రీలూ, జువ్వలూ ఇవ్వడానికి వీల్లేదనీ నానా గొడవా చేశాను. ఎందుకంటే శీనుగాడు అవి కాలుస్తాడు. వాడికి ఇవ్వడం నాకస్సలు ఇష్టం లేదు. నా గొడవ భరించలేక అమ్మ మతాబులిచ్చింది. నాకు మళ్ళీ తిట్లు మామూలే. నేనవేమీ పట్టించుకో లేదు.
దీపావళి సాయంత్రం నాన్న లక్ష్మీ పూజ చేసేవాడు. నాన్న స్నేహితులు కొంతమంది పూజ చూడ్డానికని వచ్చేవారు. ఆ ఏడాది పూజయ్యాక ఇంటికెళ్ళొస్తానని నాగులు గారు నాన్నతో చెప్పడం విన్నాను. నాకు జువ్వలు వేయడానికి నాగులు గారు పక్కనుండాలని నాన్నతో తెగ గొడవ చేశాను. “అన్నయ్య ఉన్నాడు కదురా?” అని నాన్న అన్నా నేను వినిపించుకోలేదు. ఆయనే ఉండాలని పట్టు బట్టాను. ఆ రకంగా ఆయన తన ఇంటికి వెళ్ళరు. ఆయన వెళ్ళకపోతే శీనుగాడి ఇంట్లో దీపావళి చేసుకోరు. ఇదీ నా ప్లాను.
కావాలనే రాత్రి పదకొండు వరకూ బాణాసంచా కాలుస్తూ ఆయన్ని ఉంచేశాను. నాన్న మాట కాదనలేక ఆయన ఉండిపోయారు. ఆలస్యంగా రాత్రి ఆయన ఇంటికి వెళ్ళడం చూశాక నాకు ఎంత ఆనందం కలిగిందో చెప్పలేను. శీనుగాడి దీపావళి మటాష్! ఆ మర్నాడు కాలేజీకి వెళ్ళినప్పుడు శీనుగాణ్ణి మా ఫ్రెండ్సందరం ఆట పట్టించాం.
“ఏరా, దీపావళికి ఏం కాల్చావురా?” అని ఒకడంటే, “వాడు ఉత్తినే కాల్చలేదురా, కాల్చుకుని తిన్నాడు, వాళ్ళ నాన్నని,” అని నేనూ హేళన చేశాను. శీనుగాడి మొహం దిగాలుగా అయిపోయింది.
ఆ రోజు క్లాసులో ఒక సంఘటన నాకు ఎందుకో కొంచెం ఇబ్బంది కలిగించింది.
ఇంగ్లీషు పొయిట్రీ క్లాసు చెప్పే ఎస్.వి.ఎల్.ఎన్ గారి క్లాసులో పాఠం కంటే హస్కే ఎక్కువ. దీపావళికి ఎవరెవరో ఏం కాల్చారూ అని అడుగుతూ ఆయన చిన్నప్పటి సొంత గోల చెప్పడం మొదలు పెట్టాడు. మిగతా స్టూడెంట్లూ ఎవరికి తోచినవి వాళ్ళు మధ్య మధ్యలో చెబుతున్నారు. శీనుగాడు మాత్రం మౌనంగా ఉన్నాడు.
“ఏవోయ్, శీను! ఏంటలా వున్నావ్? దీపావళికేం చేశావ్?” అని అడిగాడాయన.
ఏవీ చెయ్యలేదని సమాధానం చెప్పాడు. ఎందుకని మా మాస్టారు గుచ్చి గుచ్చి అడిగాడు.
“మా నాన్న లేకుండా మేం దీపావళి చేసుకోం? పని వల్ల ఆయన రాలేదు,” అని చెప్పాడు.
“పండగ పూట కూడా శలవివ్వని కర్కోటకులెవర్రా? కనీసం నీ పెళ్ళికయినా శలవు దొరుకుతుందా?” అన్నాడు. అందరూ గొల్లుమని నవ్వారు. ఆ క్షణం శీనుగాడి కళ్ళల్లో తడి చూసి కలుక్కుమంది నాకు. అనవసరంగా నాన్న మీద మాట పడిందే అనిపించింది. ప్రతీ సారీ శీనుగాణ్ణి ఆటపట్టించే నాకు అందరూ వాణ్ణి చూసి నవ్వడం అంతగా నచ్చలేదు. కానీ నేనేమీ పైకి అనలేదు.