టి. జి. కమలాదేవి


టి. జి. కమలాదేవి 1929 – 2012.

ఆగస్టు నెలలో తెలుగుదేశం పలువురు ప్రముఖుల్ని కోల్పోయింది. అందరి గురించి తెలుగు పత్రికలు నిడివైన వార్తలనే అందించాయి, వారి వారి అభిమానులు, శిష్యులు ఘనంగా నివాళులర్పిస్తూ వివరంగానే వ్యాసాలు రాశారు, ఒక్క కమలా చంద్రబాబు గారి విషయంలో తప్ప. నిడివిలోను, విషయ పరిపూర్ణతలోను ప్రముఖ తెలుగు దినపత్రికల కంటే ఆంగ్ల పత్రికైన ది హిందూ చాలా మెరుగనిపించింది. గతంలో నేను ఎస్. వరలక్ష్మిగారి విషయంలో చెప్పినట్లే కమలా చంద్రబాబుగారి విషయంలో కూడా ఎవ్వరూ ఆవిడ రేడియోలో పాల్గొన్న అనేకానేక నాటకాల గురించి కానీ, పాడిన గొప్ప లలిత గీతాల గురించి కానీ ప్రస్తావించ లేదు. అంతకంటే ముఖ్యంగా పలురంగాలలో ఆవిడ బహుముఖ ప్రజ్ఞతని (ఒక్క ది హిందూ పత్రిక, అదీన్ను చాలా క్లుప్తంగా, మినహాయిస్తే) గురించి చెప్పిన వారు కూడా లేరు.

ముందుగా, ఉన్నంతలో ఆవిడ గురించి రెండు మంచి పరిచయాలు: మొదటిది, ఈ వనిలో కోయిలనై అన్న టైటిల్‌తో కంపల్లె రవిచంద్రన్ రాసిన జ్ఞాపకాలు[1] అన్న పుస్తకం లోనిది. (ప్రముఖ నటీమణులు, గాయనులతో రచయిత జరిపిన సంభాషణలు, తొలిగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితం.) రెండవది, టి. జి. కమల ప్రత్యేకతలు[2] అన్న టైటిల్‌తో ఆరుద్ర తన ‘సినీమినీ కబుర్లు’లో రాసినది. ఇవి కాక, గుర్తుకొస్తున్నాయి అన్న శీర్షికన మాTVలో ప్రసారమయిన కార్యక్రమంలో ఆవిడే స్వయంగా తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ రెండు పుస్తకాలు, వీడియో తేలికగానే లభ్యమవుతున్నాయి కాబట్టి ఆ విషయాలన్నీ, ముఖ్యంగా సినీ రంగానికి చెందినవి మళ్ళీ చెప్పనవసరంలేదు అనుకుంటున్నాను.


టి. జి. కమలాదేవి

మొదటిగా సినీ రంగంలో ప్రవేశించినా ఆవిడ ఎక్కువ ఆసక్తి చూపెట్టినది, ప్రతిభాశక్తులు గొప్పగా కనపరచింది క్రీడా, నాటక రంగాలలోనే. జాతీయ స్థాయి బిలియర్డ్స్ ఆటల పోటీలలో మహిళా విభాగంలో తొలి విజేత (1994) కమలాదేవే అన్న విషయం అందరూ చెప్తారు. కానీ 1951 నాటికే ఆవిడ ప్రతిభని గుర్తించిన టామ్ క్లేరీ (Tom Cleary) అనే ఆస్ట్రేలియన్ ఆటగాడు తన జ్ఞాపకాలలో సరయిన శిక్షణ ఉంటే బాగా రాణించి ఉండేదని అన్నాడు. తరువాత, ఈ టామ్ క్లేరీతో తరచు పోటీ పడి, నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ గెలుచుకున్న బాబ్ మార్షల్‌ (Bob Marshal) అనే ప్రఖ్యాత ఆటగాడితో 1956లో, బెంగుళూరులో ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడినట్లు తెలుస్తుంది.

అలాగే ఆవిడ చెన్నపురి ఆంధ్ర మహాసభ తరపున ఆడిన నాటకాల గురించి, ఆ సభతో ఉన్న దీర్ఘకాల అనుబంధం గురించి ప్రస్తావించారు కానీ 50 ఏళ్ళకు పైన ఆ సభకు కార్యదర్శిగాను, అధ్యక్షురాలిగాను ఎంతో దక్షతతో నడిపిన విషయాన్ని గురించి వివరంగా చెప్పినవారు లేరు. ఒక సంస్థని స్థాపించడం తేలికైన విషయమే కానీ దానిని నిర్వహించడం, అంతకంటే దానిని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మన తెలుగువాళ్ళకి! ఆ సభే తన జీవితంగా భావించారని ఆవిడ సన్నిహితులు చెప్తారు. రెండేళ్ళ క్రితం మద్రాసు కార్పొరేషన్ సభ ప్రస్తుతం ఉన్న స్థలంలో కొనసాగించ వీలులేదని ఉత్తర్వులు జారీ చేయడంతో మానసికంగా క్రుంగి పోయారని విన్నాను.

అందాలపాపా చిన్నారి పాపా మొలకెత్తెనేలకో పొన్నపూవుల మాల

ఆవిడ అసలు పేరు తోట గోవిందమ్మ. తొలినాటి రికార్డుల పైన ఆ పేరే ఉన్నట్లు ఆరుద్ర పైన పేర్కున్న వ్యాసంలో అంటున్నారు. మద్రాసు వచ్చిన తరువాత కమలా (దేవి) అన్న పేరు స్థిరపడింది. చూడామణి (1941) చిత్రంలో కమలగాను, దక్షయజ్ఞం (1941), పార్వతీకల్యాణం (1941) సినిమాల్లో కమలాదేవిగాను ఆవిడ పేరు కనపడుతుంది. 1946లో ఆవుల చంద్రబాబునాయుడితో వివాహమైన తరువాత కమలా చంద్రబాబు, A. కమలాదేవి అన్న పేర్లు కూడా తరచుగా కనిపిస్తాయి, ముఖ్యంగా సినిమాల్లోనూ, రికార్డులపైనా.

ఆవిడే చెప్పుకున్నట్లు “నాటకరంగం తర్వాత బాగా పేరు తెచ్చిన రంగం రేడియో.” ప్రయాగ నరసింహశాస్త్రిగారి ప్రేరణతో రేడియోలోకి ప్రవేశించినట్లు, రజనీకాంతరావు, మల్లిక్‌గార్ల వద్ద ఎన్నో పాటలు నేర్చుకుని పాడినట్లు అన్నారు కానీ, మన దురదృష్టవశాత్తు ఆనాటి రేడియో కార్యక్రమాలేవీ మనకీనాడు అందుబాటులో లేవు. గాయనిగా కమలాదేవి ప్రతిభను ప్రశంసిస్తూ ఆవిడ పాల్గొన్న రేడియో కార్యక్రమాల వివరాలెన్నో తెల్పుతున్న ఒక మంచి వ్యాసం సుమారు అరవయ్యేళ్ళ క్రితం తెలుగు స్వతంత్ర పత్రికలో ప్రచురించబడింది.


ప్రముఖ గాయకులతో కమలాదేవి

‘సారంగదేవ’ అన్న మారుపేరుతో ఈ వ్యాసాలు రాసింది బాలాంత్రపు రజనీకాంతరావు (రజని)! ఆరుద్ర తమ పై వ్యాసంలో అనుకొన్నట్లు కొడవటిగంటి కుటుంబరావు కాదు. రజని 1953 జులై, ఆగస్టు నెలల్లో మన మధుర గాయకులు అన్న శీర్షికతో మరి కొంతమంది ప్రముఖ గాయక, గాయనుల గురించి కూడా రాశారు. (చివరిగా ఆయనపైనే ఆయన రాసుకోవడం ఒక చమక్కు!) ఆనాడు ప్రసారమైన రేడియో కార్యక్రమాల వివరాలు తెలుసుకోవడానికి ఇలాంటి వ్యాసాలే నేడు మనకు ఆధారం. డిజిటైజ్ చేసి చాలా కాలమయినా ఒక సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ వారు అలనాటి ప్రముఖ పత్రికలు కొన్నింటిని ఇంటర్నెట్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. ఆసక్తి ఉన్నవారు తెలుగు స్వతంత్ర సంచికలని అక్కడ చదువుకొనవచ్చు.

రజనిగారి వ్యాసం చదివి, దానిలో పేర్కున్న ప్రతి పాట, రూపకం వినాలన్న కోర్కె బలంగా వున్నా ఏమి చేయలేని ఒక నిస్సహాయ పరిస్థితి బాధని కలిగిస్తుంది. నా దగ్గరున్న ఆయన పేర్కున్న, పేర్కొనని కొన్ని లలిత గీతాల్ని అందరితో పంచుకోవడమే నేనిక్కడ చేస్తున్న పని. ఇదే ఒక గాయనికి, బహుముఖ ప్రజ్ఞాశాలికి నా నివాళి! ఆవిడ ఖచ్చితంగా ఎన్ని ప్రైవేటు రికార్డులిచ్చారో నాకు తెలియదు కానీ నా దగ్గరున్న రెండింటిలో ఒకటి గీతగాంధేయము అనే మంచి దేశభక్తి గీతం. రచన ఎవరిదో తెలియదు. రికార్డుపైన కూడా ఆ సమాచారం లేదు. సంగీతం S.B. దినకరరావు (గొల్లభామ-1947, టింగురంగా-1951 ఫేమ్.) కమలా చంద్రబాబు పాడిన కొన్ని సినిమా పాటలు ఓల్డ్ తెలుగు సాంగ్స్ వెబ్‌సైట్లో, మరికొన్ని యూట్యూబులో వినవచ్చు.

గీతగాంధేయము ఓ భ్రమరా కలగన్నానే తీయని ఈవనిలో కోయిలనై

ఆవిడ పాడిన రెండు సినిమా పాటలు నాకెంతో యిష్టమైనవి. మొదటిది ‘ ఝుంఝుంఝుం తుమ్మెదా‘ మల్లీశ్వరి చిత్రంలో కీరవాణి రాగంలో సాలూరి సృష్టి. దేవులపల్లి రచన. ఇక రెండవది ‘ఈవనిలో కోయిలనై,’ తెలుగు చలన చిత్ర సంగీత చరిత్రలోనే అపురూపమైన పాటగా పరిగణించబడేది. స్వయంగా సంగీతం గురించి ఎంతో తెలిసి, కొన్ని వేల పాటలు విని ఎంతో విమర్శనాత్మకంగా చూడగలవాళ్ళు కూడా ఈ పాటకు దాసోహమై పోయారు. వి.ఎ.కె. రంగారావయితే ఈ పాటని మించినది తెలుగు సంగీత చరిత్రలోనే రాలేదన్నారు. అలానే రజనీకాంతరావు కూడా “ఇటువంటి రక్తిగల రచన తెలుగు చిత్రాల్లోనే కాదు, చిత్రాల్లోకి రాని బయటి రచనల్లో కూడా లేదు” అన్నారు. కొంతవరకు మధ్య ప్రాచ్య సంగీత ఫణితిలో సాగుతూ, కమలాదేవి గాత్రంలోని ప్రత్యేకమైన వంపుల్లో తయారయిన ఈ అపరసృష్టికి రచయిత పింగళి, సంగీతం ఓగిరాల రామచంద్రరావు.

ఇంతవరకు వచ్చిన కొద్దిపాటు వ్యాసాలు, నివాళులు కమలా చంద్రబాబును కేవలం సినీనటిగానో, లేక గాయకురాలిగానో పరిగణించినవే. ఆమె గురించి సరయిన, సాధికారమైన సమాచారం, విశ్లేషణ ఇంకా రావలసి ఉంది.


  1. జ్ఞాపకాలు: తెలుగు సినీ నట గాయకీగాయకుల అనుభవాల పుటలు, అంతరంగ మజిలీలు – కంపల్లె రవిచంద్రన్. Creative Links Publications, హైదరాబాద్. 2005.
  2. సినీ మినీ కబుర్లు (ఆంధ్రప్రభ వారపత్రికలో 1993 ఏప్రిల్‌నుండి 1994 జూన్‌దాకా వెలువడిన వ్యాసాల సంకలనం, పే. 179), – ఆరుద్ర. Creative Links Publications, హైదరాబాద్. 2008.