తెలుగు వ్యాకరణాల పరిచయం

“మానవ మేధస్సు సృష్టించిన మహాద్భుతాలలో ఒకటి (one of the greatest monuments of human intelligence — Bloomfield)” అని ఆధునిక భాషవేత్తల చేత కొనియాడబడిన వ్యాకరణ గ్రంథం పాణిని రాసిన అష్టాధ్యాయి. ప్రపంచ వ్యాకరణాలన్నింటిలో ఇది తలమానికమైనది. అయితే, సంస్కృతంలో పాణిని కన్నా పూర్వం కూడా వ్యాకరణ సంప్రదాయాలుండేవని మనకు లభ్యమౌతున్న ఆధారాల ద్వారా మనకు తెలుసు. యాస్కాచార్యులు రచించిన నిరుక్తి గ్రంథం ద్వారా, పాణిని ప్రస్తావించిన వ్యాకరణాల ద్వారా ఐంద్ర, శకటాయన, శాకల్య, గార్గ్య మొదలైన ఇతర వ్యాకరణ సంప్రదాయాలుండేవని మనకు తెలుస్తుంది.

దక్షిణ భారతీయ భాషలలో తమిళంలో రాసిన తొల్కాప్పియం (=తొలి+కావ్యం) దేశభాషలలో వెలువడిన అతి ప్రాచీనమైన వ్యాకరణ గ్రంథంగా చెప్పుకోవచ్చు. తొల్కాప్పియంలో తమిళ భాషా వ్యాకరణాన్ని వర్ణించిన పద్ధతి సంస్కృతంలోని ఐంద్ర వ్యాకరణ సంప్రదాయానికి దగ్గరిగా ఉందని ఆధునిక భాషావేత్తల అభిప్రాయం. తొల్కాప్పియం రచనా కాలం క్రీ. శ. రెండవ శతాబ్దం నుండి క్రీ. శ. అయిదవ శతాబ్దం దాకా ఉండవచ్చని ఈ భాషావేత్తల ఊహ. కన్నడ భాషలో నృపతుంగ (అమోఘవర్ష ~ క్రీ. శ. 850) అనే రాష్ట్రకూట రాజు రాసిన ‘కవిరాజమార్గ’ అన్న కావ్యం మొట్టమొదటి లాక్షణిక గ్రంథంగా వారు భావిస్తారు.

మరి తెలుగులో వ్యాకరణాల మాటేమిటి? వ్యాకరణం అనగానే మనకు చిన్నయసూరి బాలవ్యాకరణం గుర్తుకు వస్తుంది. చిన్నయసూరి బాలవ్యాకరణం 1858లో ప్రచురితమయ్యింది. అయితే, బాలవ్యాకరణం కన్నా ముందు వచ్చిన తెలుగు వ్యాకరణ గ్రంథాల గురించి చాలామందికి తెలియదు. పాణిని తనకన్నా ముందు వచ్చిన వ్యాకరణాల గురించి ప్రస్తావించినట్టుగా, చిన్నయసూరి ఎందుకో తనకంటే పూర్వం వెలువడిన వ్యాకరణాలను ప్రస్తావించలేదు. కానీ, తెలుగులో కూడా వ్యాకరణ గ్రంథాలు కవిత్రయ కాలం నుండీ వెలువడుతూ ఉన్నాయి. చిన్నయసూరి కన్నా పూర్వం వెలువడిన ప్రాచీన తెలుగు వ్యాకరణ గ్రంథాలలో ముఖ్యమైన కొన్నింటిని స్థూలంగా పరిచయం చెయ్యడం ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం.

1. ఆంధ్రశబ్దచింతామణి –- నన్నయ్య(?)

ఎనభైయారు శ్లోకాలతో సంస్కృతంలో రాసిన ఈ వ్యాకరణ గ్రంథం మొట్టమొదటి తెలుగు వ్యాకరణమని చిన్నయసూరితో సహా చాలామంది పండితులు పేర్కొన్నారు. నన్నయ్య మహాభారత రచనకు పూనుకొని, ముందుగా తెలుగు వ్యాకరణాన్ని సంస్కృతంలో రచించి ఆ తరువాత భారతరచన కొనసాగించాడని వీరు చెబుతారు. అప్పకవి కాలానికి ఇందులో ఎనభైరెండు శ్లోకాలు మాత్రమే దొరికాయట. ఇందులో సంజ్ఞ, సంధి, అజంతాలు, హలంతాలు, క్రియ అని అయిదు విభాగాలు ఉన్నాయి. అయితే, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, 17వ శతాబ్దానికి చెందిన బాలసరస్వతి ఈ గ్రంథంపై వ్యాఖ్యానం రాసేంతవరకూ పూర్వ కవులు, లాక్షణికులెవరూ ఈ వ్యాకరణ గ్రంథం గురించి ప్రస్తావించలేదు. ఇది నన్నయ్య భట్టారకుడు రాసింది కాదని బాలసరస్వతే వ్యాకరణ గ్రంథము, టీకా రాసి దానికి ప్రాచీనత ఆపాదించడానికని నన్నయ్యకు కర్తృత్వం అంటగట్టాడని వాదిస్తూ 1917లో వీరేశలింగం ఒక వివాదం లేవనెత్తాడు. 13వ శతాబ్దానికి చెందిన కేతన తన ఆంధ్రభాషాభూషణము అన్న వ్యాకరణగ్రంథంలో అంతవరకూ తెలుగు భాషా లక్షణాలు వివరించే వ్యాకరణ పుస్తకాలు లేవని పేర్కొడడం వీరేశలింగం వాదానికి ఊతమిస్తుంది. ఆంధ్రభాషాభూషణము లోని 5వ పద్యం చూడండి:

మున్ను తెనుఁగునకు లక్షణ
మెన్నఁడు నెవ్వరును జెప్ప రేఁ జెప్పెద వి
ద్వన్నికరము మది మెచ్చఁగ
నన్నయభట్టాది కవిజనంబుల కరుణన్

ఎవ్వరూ ఇంతకు ముందు తెలుగునకు లక్షణం చెప్పలేదు. పండితవర్గము మెచ్చుకొనునట్లు నేను తెలుగుభాషా లక్షణాన్ని వివరిస్తాను, నన్నయభట్టు వంటి కవిజనంబుల కరుణతో.

అంటే నన్నయ్య ఒకవేళ ఆంధ్రశబ్దచింతామణి రాసి ఉంటే ఆ విషయం కేతనకు తెలియదన్నమాట. అంతేకాక, 16వ శతాబ్దంలో రాఘవపాండవీయ కావ్యానికి ముద్దరాజు పెద్దరామన రాసిన వ్యాఖ్యానంలో అప్పటివరకూ వచ్చిన తెలుగు భాషా లక్షణ గ్రంథాలన్నింటినీ పేర్కొన్నాడు. అయితే, ఈ జాబితాలో ఆంధ్రశబ్దచింతామణి లేదు.

అలాగే, ఆంధ్రశబ్దచింతామణిలో ఉన్న కొన్ని సూత్రాలకు మహాభారతంలో నన్నయ్య వాడుకకు మధ్య వైరుద్ధ్యం కనిపిస్తుంది. ఉదాహరణకు, ఆంధ్రశబ్దచింతామణిలో సంధి విభాగంలో ‘ఇ-కారాంత అనుత్తమ పురుష క్రియారూపాలకు సంధి నిత్యం’ (నిత్యం అనుత్తమపురుషక్రియాస్వితః) అని నాలుగో శ్లోకం చెబుతుంది. అయితే, మనకు మహాభారతంలోని అరణ్యకాండలో “అంతఁ గొందరధిక హాస్యంబు చేసిరి యడవిన్ (2.103)” అన్న పద్యంలో ‘చేసిరడవిన్’ అనకుండా ‘చేసిరి యడవిన్’ అన్న విసంధి కనిపిస్తుంది. అలాగే, అర్వాచీనమైన -ఉన్న, -కల అన్న ప్రత్యయాల గురించి ఆంధ్రశబ్దచింతామణిలో ఉంటే వాటి వాడుక మహాభారతంలో దాదాపు మృగ్యం. అలాగే, మహాభారతంలో తరచుగా కనిపించే -అయ్యెడున్, -అయ్యెడిన్ అన్న ప్రత్యయాల ప్రస్తావన ఆంధ్రశబ్దచింతామణిలో ఎక్కడా కనబడదు. ఈ ఆధారాలను బట్టి చూస్తే, ఈ గ్రంథం వీరేశలింగం పంతులు చెప్పినట్లుగా నన్నయ్య రాయలేదని, తరువాతి కాలంలో ఎవరో రాసి దీని గ్రంథకర్తృత్వం నన్నయ్యకు కట్టబెట్టారన్న వాదనే సబబనిపిస్తుంది. అయితే, ఇందులో కొన్ని శ్లోకాలు మాత్రం అతి ప్రాచీనమైనవిగా కనిపిస్తాయని ప్రముఖ భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి గారి అభిప్రాయం.

2. కవిజనాశ్రయము –- మల్లియ రేచన (11వ శతాబ్దం)

పదకొండవ శతాబ్దానికి చెందిన మల్లియ రేచన రాసిన కవిజనాశ్రయము మనకు లభ్యమౌతున్న తెలుగు లాక్షణిక గ్రంథాలలో అతి ప్రాచీనమైనది. ఇది నిజానికి తెలుగు ఛందస్సులను వివరించే పుస్తకమే గానీ తెలుగు భాషా లక్షణాలను వివరించే వ్యాకరణ గ్రంథం కాదు. ఈ గ్రంథాన్ని వేములవాడ భీమకవి రచించాడని కొందరి అభిప్రాయం. గత శతాబ్దంలో ఈ గ్రంథాన్ని పరిష్కరించిన జయంతి రామయ్య పంతులు దీన్ని వేములవాడ భీమకవి పేరుతోనే ప్రచురించాడు.

3. అథర్వణకారికావళి –- అథర్వణుఁడు(?)

సంస్కృతంలో రాసిన ఈ వ్యాకరణ గ్రంథాన్ని 13వ శతాబ్దానికి చెందిన అథర్వణుఁడు రాసాడని అంటారు. ఆంధ్రశబ్దచింతామణిలాగే దీన్ని కూడా తరువాతి కాలంలో రాసి ప్రాచీనత కోసం అథర్వణుఁడికి అంటగట్టారని వీరేశలింగం వాదించాడు. 17వ శతాబ్దానికి చెందిన అహోబలుఁడు రచించిన అహోబలపండితీయములోనే ఈ వ్యాకరణంలోని శ్లోకాల ప్రస్తావన మొదటి సారి కనిపిస్తుంది. ఇందులోని సూత్రాల ఆధారంగా ఈ వ్యాకర్తకు పరిచయమున్న తెలుగు లిపి 15వ శతాబ్దానికి చెందిందని చెప్పవచ్చు. అలాగే, శ్లేష వాడుతున్నప్పుడు ప్రాసస్థానంలో అరసున్నాల ఒప్పుదల లేకపోయినా పరవాలేదని చెప్పడం రాఘవపాండవీయం వంటి ద్వ్యర్థి కావ్యాలను దృష్టిలో పెట్టుకొని రాసినట్టు కనిపిస్తుంది. మరికొన్ని వ్యాకరణసూత్రాలు కృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాల్యదను సమర్థించడానికి రాసినట్టు అనిపిస్తాయి. అయితే, ఈ వ్యాకరణం లోని సూత్రాలను కొన్నింటిని అహోబలుడు విమర్శించిన తీరు చూస్తే, ఈ గ్రంథాన్ని అహోబలుడే రాసి ఉండకపోవచ్చని, అప్పకవికి, అహోబలుడికి మధ్య కాలంలో ఎవరైనా రాసి ఉండవచ్చని అనిపిస్తుంది.