“వొక ప్రేమ కథ రాయక్కా” అని వాడ్రేవు వీరలక్ష్మి గారిని చాలా కాలంగా అడుగుతున్నాను. ప్రేమకథ చదవాలని వుందక్కా అంటూ తరచుగా అనటం ఆమె నవ్వటం ప్రేమగా. వో రోజు రాత్రి ఆమె కాకినాడ నుంచి ఫోన్ చేసి తమ్మినేని యదుకులభూషణ్ కథలు చదివావా అని అడిగారు. లేదన్నాను. “ఆ కథలు చదువు ప్రేమకథలు చదవాలని వుందన్నావుగా” అన్నారు.
“సముద్రం”ని చూసాను. సముద్ర తీరంలో కూర్చుని దిగంతాల్లోకి చూస్తున్న యువకుని ఫోటో. వెనక అట్ట మీద జలపాయ పక్కనుంచి నడుస్తున్న భూషణ్.
62 పేజీలున్న యీ కథల సంపుటిలో ఒంటరి, ప్రయాణం, యాత్ర, సముద్రం, మార్పు, పొలి, భిక్షువు .. .. కథలున్నాయి.
యీ కథలని తిరిగి తిరిగి చదువుతూ వొక్కసారి కనురెప్పలు మూసుకొని వెనక్కి వాలితే ఆల్ప్స్ పర్వతాల పైనుంచి సాగే మేఘపయనం … వెలుగుతోన్న కృష్ణమ్మ … తుంగభద్రానది హోరు … శ్రావణపూర్ణిమ దినాల్లోని చందన్వారి .. ఆకుపచ్చ సముద్రం … చావా నది పైనుంచి వీచే చల్లని శాంతిగాలి … ఘుమ్మనే ధనియాల గుబాళింపు … అరుణాచల ప్రదేశ్ పూలదారులలోంచి స్థిరనిశ్చలంగా గుంభనంగా తడితడిగా వోదార్పుగా నిశ్చింతగా కలవరపరుస్తూ మైమరపిస్తూ సందిగ్ధంగా మాయంకాని జ్ఞాపకాల ప్రవాహం.
వుదయం వెంట వుదయాలు సాగుతోంటే ఏదో వొక క్షణాన ఆగి చుట్టూ చూస్తే హడావడి జీవితచిత్రాల ధ్వనులు వినిపిస్తున్న సమయమిది. మన జీవితాలని జీవనాన్ని ఎవరికి అవసరమయ్యే వారివారి పదాలతో అర్థాలతో నింపెయ్టానికి తీవ్రప్రయత్నాలు సాగుతోన్న కాలమిది. సమస్త జీవన పార్శ్వాలన్నింటిని నియంత్రించే కాలంలో మన ఎసెన్శ్హియల్ బీయింగ్ని వెతుక్కుంటున్నామా .. ప్రయాణం చేస్తున్నామా .. తనని గుర్తించే స్థితిలో వున్నామా ..
యీ “సముద్రం”లో అన్వేషణ వుంది. గుర్తు పట్టే చూపుంది. చుట్టూ పరిగెత్తమనే పరిస్థితులున్నా తమలోకి తాము చూసుకొనే మనుష్యులు మనకి స్నేహితులవుతారీ “సముద్రం”లో.
మన అంతరంగాన్ని సుసంపన్నం చేసే పదాల అర్థాలన్నీ మారిపోయి కిలోల లెక్కన దుమ్ము పేరుకుపోయిన వాతావరణంలో కొండలని అరణ్యాలని నదులని మబ్బులని నేలని సహజత్వం నుంచి ధ్వంసం చేసుకొంటున్న యీ అభివృద్ధికాలంలో తామున్న పరిసరాలనుంచి సౌందర్య పరిమళాలని శ్వాసించే మనసులు మనలని పలకరిస్తాయి యీ “సముద్రం”లో. మైమరపించే పరిచయాలు మెరిసే సన్నాహాలు హత్తుకుపోయే దుఃఖపు చూపులు అకారణ ఆకర్షణా సమయాలు అన్నో యిన్నో మన జీవన ప్రయాణంలో. నిర్వచనకి వొదగని ఆయా అనుబంధపు మెరుపుల జ్ఞాపకాలెన్నో అలలలలుగా మనతో ముచ్చటిస్తాయి యీ “సముద్రం”లో.
సమూహంలో ప్రయాణిస్తున్నా అంతరాంతరాలలో పేరుకొన్న వొంటరితనంలోని స్థితప్రజ్ఞత చుట్టూ ప్రపంచపు మానవ సంబంధాలలో వో సంయమనం. ప్రపంచం నుంచి దూరంగా పారిపోకుండా తమకి దూరమవుతోన్న కళ్ళల్లో దిగులుని తమకి దగ్గరవ్వాలనుకొన్న చూపుల్లోని వెలుగుని గుర్తించ గలిగే వొంటరితనపు నిఖార్సయిన ప్రేమ నిండిన మనసులు మనలోకి వస్తాయి యీ “సముద్రం”లో.
సెలెబ్రేషన్, ఆనందం, వుత్సాహం, వుద్వేగం, వుద్రిక్తత, వినోదం పదాల చుట్టూ పేరుకున్న కృత్రిమత్వానికి భిన్నంగా తమ చుట్టూ ప్రపంచంలో ఆయా పదాలకి దగ్గరగా వున్న అనుభూతి ఆనవాళ్ళని తమ అనుభవంలో నింపుకున్న వాళ్ళు మనకి ఎదురవుతారీ సముద్రంలో.
చుట్టూ వున్న జీవితాలపై పెద్దగా కంప్లైంట్స్ లేకుండా బాధ్యతగా జీవనసారాన్ని నలువైపులకి ప్రసరించే అనుబంధాలు మనతో పెనవేసుకుంటాయి యీ “సముద్రం”లో.
అనేకానేక వ్యాపకాలతో క్షణంఖాళీ లేని జీవిత విధానాలలో వచ్చే ఆలోచనలు మనలో పోగుపడుతోన్న మనదికాని మన ప్రపంచంలో తీరిక అంటే ఏమిటి? ఆ తీరిక సమయాలలో మనం యేం చేస్తాం. ఎలా జీవిస్తాం. రారమ్మని పిలిచే ప్రకటనలని తప్పించుకొని మనం మన లీజర్ని ఎలా సుసంపన్నం చేసుకొంటాం. కాసేపు మనతో మనం గడపాలనుకొంటే మనకి యిష్టమైన పాటలు వినటం. మన ఆప్తులతో గడపటం. మనకిష్టమైన ఆరు బయట వెల్లికిలా పడుకొని ఆకాశాన్ని చూడటం. జ్ఞాపకాలతో ముచ్చటించటం. యిష్టమైన చదవటం చూడటం నడవటం … యీదటం … యిలా ఏదో వొక సమయంలో మనతో మనం గడపాలనుకొంటే ఏకాంతంగా మనతో మనం సంభాషించా లనుకున్నప్పుడు యీ “సముద్రాన్ని” ఎంచుకోవచ్చు. పరిసరాలు వ్యక్తుల పేర్లు వాతావరణం వేరు కావొచ్చు. కాని యీ “సముద్రం”లోని సారం మన అనుభవాలకి చేరువగా మన అంతరంగానికి సమీపంగా కాగితపు పుటల నడుమ దాచుకొన్న నెమలి యీకలా మనం భద్రంగా దాచివుంచుకొన్న రహస్యపు పసి జ్ఞాపకాలని ఏ దుమ్ము ధూళి సోకని అమాయకత్వపు అన్వేషణని మృదువుగా స్పర్శిస్తుంది.
[యదుకులభూషణ్ గారి కవితల సంకలనం “నిశ్శబ్దంలో నీ నవ్వులు” ఈమాట సాహితీ గ్రంథాలయంలో చదవగలరు –సంపాదకులు]