మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం వల్ల వాటిల్లే వినాశనాల గురించి శాస్త్రపరమైన అవగాహన ప్రజల్లో కలగజేయటం ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్న ప్రాజెక్ట్ నిషేధ్ సంస్థ ద్వారా శ్రీదేవి మురళీధర్ రచించి ప్రచురించిన ఈ పుస్తకం అందరూ చదవదగింది, చదివించదగింది. త్రాగుడుకి బానిసలైన వారి ఇండ్లలో వాతావరణం ఎలా వుంటుంది, అది వారి పిల్లలపై ఏ విధమైన దుష్ప్రభావాన్ని కలగజేస్తుంది, ఈ వ్యసనాన్ని ఎలా గుర్తించడం, ఎలా చికిత్స చేయడం, ఆ బానిసత్వం నుండి బయటకు రప్పించడానికి ఎలా సహాయపడగలం – ఇలా ఎన్నో విషయాలను చాలా సరళమైన భాషలో ఎంతో చక్కగా రచయిత్రి వివరించారు. ప్రత్యేకించి ఈ పుస్తకంలో మద్యపాన వ్యసనం నీలినీడలో ఉన్న కుటుంబాల్లో పిల్లలు ఎలాంటి వ్యక్తిత్వపు ముసుగుల మాటులో పెరుగుతారో వివరించే అంశం చిన్నారి బందీలు(పే. 27-33) తప్పకుండా చదవదగింది. చిత్రకారుడు బాలి గీసిన బొమ్మలు ఈ వ్యాసాంశాలను మరింత తేటతెల్లం చేస్తాయి. అంతే కాక, ఆంధ్రప్రదేశ్‌లో చికిత్సా కేంద్రాల వివరాలు కూడా ఈ పుస్తకంలో లభిస్తాయి. ఈ పుస్తకం ఆన్లైన్లో ఉచితంగా చదవవచ్చును.
ఆవిష్కరణ-ఆల్కహాలిక్ ల పిల్లలు, ఒక అవగాహన
ఈ పుస్తకం ప్రింట్ కాపీ కావలసిన వారు ప్రాజెక్ట్ నిషేధ్ కి ఈ-మెయిల్ (projectnishedh@gmail.com) పంపి ఉచితంగా పొందవచ్చును.
ఉదాత్త సేవ
(పుస్తకం ముందుమాట నుండి…)
ఒకప్పుడు త్రాగుడును చెడు అలవాటు అనేవారు. మనిషిని నైతికంగా పతనం కావిస్తుందని సమాజం ఈసడించుకొనేది. త్రాగేవాడిని పెద్దమనిషి చిన్నచూపు చూసేవాడు. శరీరకష్టాన్ని మరచిపోవడానికి శ్రమజీవులు ఊరికి దూరంగా ఏ కల్లుపాకల వద్దకో వెళ్ళి త్రాగేవారు. పరిస్థితులు మారిపోయాయి. ధనికా-పేద, ఆడామగ చిన్నాపెద్దా భేదం ఏమి లేకుండా చాలామంది ఎవరికి ఎంత స్థాయిలో అవకాశం ఉంటే అంత స్థాయిలో మద్యపానం చేస్తున్నారు. గొప్పవాళ్ళూ, పెద్దమనుషులూ యధాశక్తి త్రాగుతున్నప్పుడు ఎవరిని ఎవరూ చిన్నచూపు చూసే ప్రసక్తే లేదు. ఆబ్కారీ పద్దు కావలసినంత ఆదాయం తెచ్చిపెడుతున్నది గనుక ప్రభుత్వం కొరత రాకుండా, లేకుండా పుష్కలంగా సరకు అందిస్తున్నది.
గణాంకవివరాలను పరిశీలిస్తే మద్యం మత్తులో ముందుండి తూగుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. వ్యక్తిని మానసికంగానూ, శారిరకంగానూ కూడా క్రుంగదీస్తూ, కుటుంబాలను అనేక అనర్థాలకు గురిచేస్తూ, సమాజానికి బహువిధాలుగా కష్టనష్టాలు కలిగిస్తున్న త్రాగుడు దురభ్యాసం ఊబిలో చిక్కుకున్న వారి సంఖ్య నిరంతరం పెరుగుతున్నది. ఇది సమాజసేవ చేస్తున్న సంస్థలకు, వ్యక్తులకు ఆందోళన కలిగిస్తున్న పరిణామం. ప్రభుత్వ యంత్రాంగం మీద ఆధారపడితే పరిస్థితి ఇంకా చెయి దాటి పోతుందని భావిస్తున్న సమాజసేవకులు త్రాగుబోతులను మంచి దోవలోకి తీసుకురావటానికి బృహత్ ప్రయత్నాన్ని సాగిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు శ్రీమతి శ్రీదేవి మురళీధర్.
సామాజిక రుగ్మతలను గురించీ, ప్రత్యేకించి వాటిలో ఒకటైన మద్యపానం గురించీ స్వయంగా అధ్యయనం చేసి, ఈ దురభ్యాసానికి బలైన వ్యక్తులను, కుటుంబాలను ఆదుకోవాలని ఆమె కృషిచేస్తున్నది. వి. బి. రాజు సోషల్ హెల్త్ ఫౌండేషన్ స్థాపించి సొంత వనరులతో మద్యపాన, ఇతర మాదకద్రవ్య బాధితుల ప్రవర్తనలో మార్పు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నది. ఫౌండేషన్ ద్వారా ఆమె చేపట్టిన ప్రాజెక్ట్ నిషేధ్ గణనీయమైన సత్ఫలితాలను సాధించింది. ప్రభుత్వం వల్లగానీ, స్వచ్ఛంద సంస్థల వల్లగానీ ఇంతవరకు సాధించినది చాలదనీ, చేయవలసింది చాలా వున్నదనీ భావించి ఆమె ఇప్పుడు ప్రచార సాహిత్యం ప్రచురణకు పూనుకున్నారు. అందులోని భాగమే ఇప్పుడు మీ చేతిలో ఉన్న ‘ఆవిష్కరణ’ (ఆల్కహాలిక్ల పిల్లలు – ఒక అవగాహన) గ్రంధం.
“ఆల్కహాలిజం కాన్సర్, ఎయిడ్స్ వలె ఒక మృత్యుకారిణి, ఆల్కహాలిజం ఒక వ్యాధి” అంటారామె. ‘ఈ పుస్తకం ఎందుకు?’ అనే శీర్షిక క్రింద శ్రీమతి శ్రీదేవి వ్రాసిన ఎనిమిది అంశాలు సమాజ సంక్షేమం, కుటుంబ శ్రేయస్సు, వ్యక్తిని కాపాడటం అనే ఉదాత్తమైన ఆశయాలకు అద్దం పడుతున్నాయి. పుస్తకం చదివితే ‘త్రాగుబోతు అంటే ఎవరు’ అనే ప్రశ్నకు సమాధానం మొదలు సమాజ సేవలో ఆసక్తి కలిగిన వ్యక్తులైనా, సంస్థలైనా ఏ విధంగా సేవ చేయడానికి అవకాశం ఉన్నదో తెలియజేసే సమాచారం వరకు విషయ పరిజ్ఞానం లభిస్తుంది. ఇంతేగాక త్రాగుడు దురభ్యాసం మాన్పించడానికి కృషిచేస్తున్న, చికిత్స అందిస్తున్న సంస్థల చిరునామాలు లభిస్తాయి. సేవాభిలాష కలిగి, తెలుగు చదవకలిగిన ఎవరిచేతనైనా మొదటి నుంచి చివరిదాకా ఒక్క బిగిన చదివించే శైలిలో ఈ గ్రంథరచన సాగింది.
సుప్రసిద్ధ చిత్రకారుడు శ్రీ బాలివేసిన బొమ్మలు పుస్తకాన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి. హితబోధలూ, పుస్తక రచనలూ మనుషులలో మార్పు తెస్తాయా అని ఎవరూ సందేహించవలసిన పని లేదు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు చేసిన కర్తవ్య బోధ అర్జునుడిని విజయం వైపు నడిపించింది. 1908లో తోల్స్టాయ్ రచించిన `హిందువుకి ఒక లేఖ’ (A Letter to a Hindu) వ్యాసం గాంధీజీని అహింసాయుత ఉద్యమం సాగించడానికి ప్రోత్సాహం కలిగించింది. అలాగే ఈ పుస్తకం కూడా కొందరిలోనైనా పరివర్తన తీసుకొని రాగలిగే, కొన్ని కుటుంబాలనైనా కష్టాలనుంచి గట్టెంకించగలిగితే రచయిత్రి ఆశయం నెరవేరినట్లే.
సమాజ శ్రేయోభిలాషులూ, మానవతావాదులూ హర్షించే కృషిచేసిన శ్రీమతి శ్రీదేవీ మురళీధర్‌కు శుభాశీస్సులు, ఇగ్నో (ఇందిరాగాంధి నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ) సంస్థకు అభినందనలు.
-డా. పొత్తూరి వెంకటేశ్వరరావు