నిర్ణయం

ఏరా! ఇపుడేం చేయమంటావ్? అని వాడు అడుగుతాడు
నీకింతకుముందు జరిగిందేదో చెప్తావ్
వాడు వినీ విననట్టు వింటాడు
నీకు తోచిందేదో నువ్ చెప్తుంటావ్
వాడేదో ఆలోచిస్తూ వింటూంటాడు
నీకేదో తెల్సినట్టు నువ్వనుకుంటావ్
వాడికేదో తెలియనట్టు వాడనుకుంటాడు
నేను చెప్పింది వింటాడా అని నువ్వనుకుంటావ్
వీడు చెప్తోంది చెయ్యాలా అని వాడనుకుంటాడు
ఇలాంటివన్నీ చెయ్ అని నువ్ సందేశాలిస్తావ్
అలాంటివన్నీ నేను చేయగలనా అని వాడు సందేహిస్తాడు
నువ్ చెప్పేది నీకు అక్షరాలా సరైనదనిపిస్తుంది
నాక్కూడా అది నప్పుతుందా అని వాడనుకుంటాడు
ఆట్టే సమయం లేదని నువ్ హెచ్చరిస్తావ్
ఇంకాస్త ఆలోచిద్దామని వాడు కాలక్షేపం చేస్తాడు
నువ్ నిస్సహాయంగా నిట్టూర్చుతావు
వాడు ఎదురీతకి సిద్ధమౌతాడు
అడగడం వాడి ధర్మమని వాడనుకుంటాడు
చెప్పడం నీ బాధ్యతగా నువ్ భావిస్తావు
నువ్ నువ్వే వాడు వాడే
ఇది చేస్తే బావుంటుందని నువ్ చివరిమాటగా చెప్పేస్తావ్
నువ్వేం చెప్పినా ఆఖరికి వాడు చెయ్యాలనుకున్నదే చేస్తాడు.