సీ. ఆంధ్రులభావనాట్యస్థానములలోన,
నాడు నీకావ్యకన్యకలఁ గాంచి
అనిఁ గన్నుమాయ కింకను దోఁచు నీసమి,
త్కంఖాణఖురళికాంకములఁ జూచి
కలితశౌర్యజ్వాలఁ గరఁగించి పోసిన,
జయశాసనస్థిరాక్షరము లరసి
పెద్దనార్యునిమనోవీధి కందక దాటి,
దిశలఁ దాండవమాడు తేజమొంచి
శ్రీకృష్ణదేవరాయలు – జాషువా
భారతి, మార్చి 1929.
గీ. చిరము నీరాజ్యలక్ష్మి వర్షించు బాష్ప,
పూర మదె తుంగభద్రాఖ్యఁ బూని పారు
చుండు నెపుడు బళ్ళారిమండలమున
ఆంధ్రకవిచంద్ర! కృష్ణరాయక్షితీంద్ర!!
సీ. మహితాంధ్రభోజనామకరత్నము వహించి
క్రాలు విశాలవక్షస్‌స్థలంబు
పరభీకరప్రభావమ్ము బయ ల్చిమ్ము,
సరిలేని కోరమీసములజంట
చతురభ్దివలయితక్ష్మాభారమునకుఁ బెం
పున నిక్కి కనుచుండు భుజయుగంబు
దురమున నిప్పుక ల్గురిసి దీనులయందు
దయలు వర్షించు నేత్రద్వయంబు
గీ. అష్టదిగ్గజవాగమౄతార్ద్ర మగుచుఁ
బావనంబైన నీసభాభవనవిభవ
మక్కటా! జీర్ణ నగర కుడ్యాంతరములఁ
బండి నిద్రించెనే కృష్ణపార్థివేంద్ర!
సీ. భాషాసముద్రకుంభజుఁడ వీవయ్యును
విద్వవత్కవుల గారవించినావు
ప్రతిపక్షరాజభార్గవనాఁడవ యయ్యు
వెన్నిచ్చుచో విడిపించినావు
వైరికిరీటశుంభత్పదాబ్జుఁడ వయ్యు
బెద్దనపదము సేవించినావు
అర్థార్థిజనకల్పకానోకహుఁడవయ్యు
సత్కృతులకుఁ జేయి సాచినావు
గీ. ఔర! శ్రీకృష్ణరాయ నీయంతవాని
దివికి నర్పించుకొన్న మాదేశజనుల
భాగ్యహీనత నొక్కి చెప్పంగలేక
చిలువరాయఁడు వేయినాల్కలు వహించె
ఉ. ఆయతవర్ణనావిభవ మచ్చుపడం బనిఁబూని విష్ణుచి
త్తీయము వ్రాసినావు కవిధీరుల గుండెలు తత్తరిల్ల నేఁ
డీ? యొకడేని మీసముపయిం జెయివైచి రచించు సత్కవి
ధ్యేయుడు? క్లిష్టకావ్యమనకేమి? యశక్తులు కృష్ణభూపతీ!
శ్రీకృష్ణదేవరాయలు – జాషువా
భారతి, మార్చి 1929.
సీ. కవిసింహములు నీకుగా సృష్టిగావించు
కృతిపుత్రికలను దుఃఖితలఁజేసి
ఆవాడసింధురాజాగ్రణు ల్పుత్తెంచు
కానుకబండ్లు వెన్కకు మరల్చి
ముదురువెన్నెలఁజిందు ముత్యాలగద్దియు
పరరాజధూర్తుల పాలుసేసి
నిరతంబు పగర నెత్తురుటేరుల మునుంగు
కత్తి కాఁకటిచిచ్చుఁ గలుగఁజేసి
గీ. కుడియెడమలను నీతోడఁ గూడు తిరుగు
సుకవికులకోకిలమ్ముల శోకజలధి
ముంచి యలబృహస్పతివ్రాఁత మంచి దగుట
దివికిఁ బోయితె శ్రీకృష్ణదేవరాయ!
సీ. ఆశీర్వదించినారా వ్యాసవాల్మీకి
బృందారకమునీంద్రు లెదురువచ్చి?
కన్నావె కవిభయంకరుఁగాళిదాసు భో
జుండన్నవాడె విశ్రుతగుణుండు?
రంభ నీతోడఁ గేరడ మాడునే దానఁ
గోపించునే నలకూబరుండు?
బలభేది వేయుఁ గన్నుల జూచి నిను గౌర
వించుచున్నాఁడె కోవిదులలోన?
గీ. తిరిగి నీనెయ్యపుం గవీశ్వరుల గోష్టి
జరుగుచున్నదె దేవేంద్రపురమునందు?
యెచటనుండిననేమి శ్రీకృష్ణరాయ!
భరతపుత్రుల నొకకంట నరయుమయ్య!
[క్రోధన నామ సంవత్సర ఫాల్గుణ మాసము, 1929 మార్చి భారతి పత్రిక, సంపుటము 3, సంఖ్య 3 న ప్రచురింపబడిన ఈ పద్యాలను ఈమాటకు అందించిన జెజ్జాల కృష్ణ మోహనరావు గారికి కృతజ్ఞతలు – సం.]