రిహార్సల్స్‌

“ఔరా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని కురుసార్వభౌముడనైన నా మానసమును

సైతమాకర్షించు చున్నదే!”

శుభ్రమైన తెలుగు మాట్లాడటం అలవాటు తప్పిన నోటిని తిప్పటానికి తనూ అష్టావక్రుడిగా మారుతూ

మొత్తానికి పలకగలిగాడు గోపీ. (ఆపేరు విని అమెరికాలో అందరూ వింతగా తనవంక చూస్తుంటే

వెంటనే “గోపాల్‌” ని కాస్తా “పాల్‌” గా కత్తిరించేసుకున్న సూక్ష్మగ్రాహి మరి!)

ఐతే, అతని చిన్ననాటి మిత్రుడు సుబ్బారావు తలబాదుకున్నాడు అది విని.

“ఇట్లా ఐతే నేను ఇప్పుటికిప్పుడే ఇక్కణ్ణుంచి పారిపోతానంతే!” బెదిరించాడతను లేచి వాకిలివంక

నడుస్తూ. “ఇరవై ఏళ్ళు అమెరికాలో వుండి నీ బుర్ర తుప్పుపట్టిపోయింది. అప్పుడెప్పుడో యన్‌టి

ఆర్‌ కాలంలో లాగా మాట్టాడితే ఆ భాస ఇప్పుడు ఎవడికి అర్దవై ఏడుస్తుది?” అన్నాడు నడుస్తూనే.

వెంకట్రావు వెళ్ళి అతనికి అడ్డు పడ్డాడు.

“ఆగ్గురూ, మరీ ప్రతిదానికీ అలా విసురైతే ఎట్లా, నువ్వేదో సిన్మా డైరక్టరు వైనట్టు?” అన్నాడు

కొంత మందలింపూ, కొంత హాస్యమూ మేళవిస్తూ.

ఎందుకంటే, సుబ్బారావు ప్రస్తుతానికి టీవీ సీరియల్స్‌ని డైరెక్ట్‌ చేస్తూ తొందర్లో సిన్మాల్లోకి వెళ్ళాలని

విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.

అంతలోనే తమాయించుకుని, మరీ అపార్థాలు జరిగిపోయే ప్రమాదం వుందని గుర్తించి, “ఐనా, ఎలా

పలకాలో నువ్వు నేర్పిచ్చొచ్చుగా! మనోడు కాదంటాడా?” అని చిన్న కొస కూడ తగిలించాడు.

తను కూడ కొంత వంత పాడకపోతే పని జరిగేట్లు లేదని వెంటనే గ్రహించాడు గోపీ. “అదికాదు

సుబ్స్‌! మరీ హడావుడైతే ఎలా? లోపలికి రా, ఎలా చెప్పాలో చెప్పు. నేను బుద్ధిగా ఫాలో ఐపోతా”

అన్నాడు తనూ అడ్డంగా నిలబడుతూ.

ఇక తప్పదన్నట్టు లోపలికి కదిలాడు సుబ్బారావు చాలామెల్లగా.

“ఐతే విను. ఇలా అనాలి” యన్‌ టి ఆర్‌ ను అనుకరించే విధంగా గొంతు మార్చి చెప్పాడు

“అవురా! హహ్హహ్హ! ఈ రచన ఛమత కుర్తి ఏమిటో గాని ఖురు సారవ బౌముఢనైన నా మా

నషమును షయితము ఆకరిచుంచు ఛున్నదే!”

జోక్‌ చేస్తున్నాడని నవ్వుమొహంతో అతని వంక చూసాడు గోపీ. ఐతే, సుబ్బారావు దగ్గర్నుంచి గాని

మిగిలిన వాళ్ళ దగ్గర్నుంచి గాని అలాటి స్పందన ఏమీ రాకపోవటంతో కొంచెం ఖంగుతిని ఎలా

రియాక్టవాలా అని బుర్ర గోక్కున్నాడు.

సుబ్బారావు యమ సీరియస్‌గా మొహం పెట్టాడు. “ఇట్లా మాట్టాడకపోతే ఇప్పుడిక్కడ ఎవ్వడికీ

అర్దం కాదు. తెలుగు సిన్మాలు చూట్టం గూడా మానేశావా ఏంది? మన తెరవేలుపుల్ని చూసైనా బుద్ధి

తెచ్చుకో, చెంపలేసుకుని గుంజీలు తీసి నీ భాసని మార్చు (ఆ తెరవేలుపులనే పదం ఈమధ్యనే

విన్నాడు సుబ్బారావు; దాని అర్థమేమిటో స్పష్టంగా తెలీకపోతే ఓ రిటైరైన తెలుగు టీచరు దగ్గర

కనుక్కున్నాడు; ఎంతగానో నచ్చేసి ఎలాగైనా దాన్ని వాడాలని ఉబలాటపడుతూ వుంటే ఇప్పటికి ఆ

అవకాశం దొరికింది!). ఒత్తులు పలికావా, నువ్వో చెత్తగాడి వన్నమాట. అంతగా ఒత్తులు

పలకాలనే వుంటే వాటిని ఉండాల్సిన చోట కాకుండా ఇంకెడన్నా పెట్టు, ఫరవాలేదు. బుద్దిగా

నేంజెప్పినట్టు చెప్పు” గీతోపదేశం చేశాడు సుబ్బారావు.

గోపీకి ముందు కొంచెం భయం వేసినా అతను చెప్పిన దాన్ని రెండు మూడు సార్లు లోపల్లోపల

మననం చేసుకునే సరికి దాని “ఫార్మ్యులా” అతనికి పట్టుబడి పోయింది.

అదే ఒరవడిలో మిగిలిన భాగాల్ని కూడా పలుకుతుంటే అదో గమ్మత్తుగా అనిపించింది. “ఇదీ బాగానే

వుందే!” అనుకున్నాడు.

“ఈ పద్దతి కూఢా భాగానే వుంధే!” అన్నాడు వాళ్ళతో.

“నువ్వా ఫార్మ్యులాని వాడాల్సింది డయలాగులు చెప్పటానికి. మరీ అంత ముచ్చటగా వుంటే మా

దగ్గర అప్పుడప్పుడూ వాడు చాలు” అన్నాడు సుబ్బారావు పగలబడి నవ్వుతూ.

అందరూ గొంతు కలిపారతనితో.

పదిహేనేళ్ళ తర్వాత ఇండియా ప్రయాణం పెట్టుకున్న గోపీకి తీరా వచ్చాక హఠాత్తుగా ఎక్కడ లేని

దేశభక్తి పుట్టుకొచ్చింది. ఇంటినుంచి మూడు మైళ్ళ దూరంలో వున్న గుడికి ఒక్కసారైనా వెళ్ళని

వాడు అవకాశం కలిగితే చాలు గుంటూర్లో వున్న గుళ్ళన్నీ చుట్టివస్తున్నాడు. పిల్లల

భరతనాట్యాలు, పెద్దల హాస్యనాటికలూ తలనొప్పని అసోసియేషన్‌ ఫంక్షన్లని తప్పించుకు తిరిగేవాడు

కాస్తా సంస్కృతిని గురించి ఉపన్యాసాలు దంచుతున్నాడు. ఈ గాల్లో ఏముందో మరి.

వచ్చిన మర్నాడే ఏ. సీ. కాలేజ్‌ వైపుకి వెళ్ళాడు తనకి తెలిసిన వాళ్ళెవరైనా కనపడతారేమోనని.

ఐతే, తెలిసిన వాళ్ళ మాట దేవుడెరుగు, కనీసం కాలేజ్‌ కూడ కనిపించలేదతనికి!

ఎదురుగ్గా ఎన్నో చిన్న చిన్న దుకాణాలు కనిపిస్తున్నాయి. దుప్పట్ల దగ్గర్నుంచి యంపిత్రీ ప్లేయర్ల

దాకా అన్నీ దొరుకుతున్నాయి. అంత పెద్ద కాలేజ్‌ మాత్రం దొరక్కుండా పోయింది.

చాలాసేపు కాలేజ్‌ ఎలా మాయమైపోతుందో అర్థం కాక ఆలోచిస్తూ నిలబడ్డాడు. ఒక దుప్పట్ల

దుకాణం వంక చూస్తూ, “ఇక్కడ ఎంట్రెన్స్‌ గేట్‌ వుండాలే!” అని ఆశ్చర్యపోతూ.

ఎవరో ఆ పక్కన నడుస్తున్న వ్యక్తి జాలిపడి, “ఏమిటండీ వెదుకుతున్నారు?” అనడిగాడు తనూ

ఫుట్‌పాత్‌ని నిశితంగా పరిశీలిస్తూ.

గోపీకి సిగ్గేసింది ఏం చెప్పాలో తోచక. కాని ఇలా ఎంతసేపు నిలబడ్డా చిక్కు విడిపోయేట్టు కనిపించటం

లేదు.

చివరికి ఎలాగో మనసు చిక్కబట్టుకుని, “ఇక్కడ ఓ కాలేజ్‌ ఉండాలండీ, ఇప్పుడు కనిపించడం లేదు”

అన్నాడు.

భళ్ళున నవ్వాడతను.

“కాలేజ్‌ ఎక్కడికీ పోలేదండీ! ఇదివరకు ఎక్కడుందో అక్కడే వుంది. ఐతే పిల్లలే ఎవరూ వెళ్ళటం

లేదు. ఇప్పుడందరూ వెళ్ళేది ప్రైవేట్‌ కాలేజ్‌ లకే కదా” అన్నాడతను.

“మరి ఇక్కడే వుంటే కనిపించదేం?” అనడిగాడు గోపీ ఇంకా ఆశ్చర్యపోతూ, అతను తనని ఆట

పట్టిస్తున్నాడా అని అనుమానిస్తూ.

“అదా మీ అనుమానం? ముందు ఈ దుప్పట్ల దుకాణం వెనక్కి వెళ్ళండి. అక్కడో పెద్ద గొయ్యి

వుంటుంది. జాగ్రత్తగా దాన్ని గెంతండి. ఓ తుప్పుపట్టిన గేటు వుంటుంది. అది తెరుచుకోదు గాని

దాని కంతల్లోంచి మీరు తేలిగ్గానే దూరిపోవచ్చు. దాని వెనకే కాలేజ్‌ వుంటుంది. కనీసం రెండేళ్ళ క్రితం

వరకు వుండేది. వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది అది ఇంకా ఉందో లేదో. ఐతే ఎవర్నన్నా చూడాలని

వస్తే మాత్రం ఎవరూ దొరక్కపోవచ్చు”

“పిల్లలు రావటం లేదని కాలేజ్‌ని కూడా మూసేశారా ఏమిటి?”

“లేదు లేదు ఇంకా అక్కడిదాకా రాలేదు. ప్రైవేట్‌ కాలేజ్‌ల్లో ఉద్యోగాలు సంపాయించుకో గలిగిన

లెక్చెరర్లు అంతా వెళ్ళిపోయారు. ఆ ఛాన్సు ఎక్కడా దొరకనివాళ్ళు ఇక్కడే వుండిపోయారు

ఈగలు తోలుకుంటూ” నవ్వుతూ వెళ్ళిపోయాడతను.

చివరికి ధైర్యం చేసి అడ్డుపడుతున్న దుకాణాల్ని ఛేదించుకుంటూ వాటి వెనక్కు వెళ్ళి చూశాడతను.

అతను చెప్పిన గొయ్యి ఇప్పుడో చిన్న బావిలా తయారై వుంది. హనుమంతుడిలా దాన్ని

లంఘించాడు. ఆ ఊపులో గేటుకి గుద్దుకోబోయి వెంట్రుక వాసిలో తప్పించుకుని దాన్లో వున్న అనేక

కన్నాల్లో ఒకదాన్లోంచి దూరి అవతలికి చేరుకున్నాడు.

నిజంగానే అక్కడ కొన్ని బిల్డింగులు కనిపించాయి. శిథిలావస్థలో వున్నా అవి తనకు పరిచయం

ఐనవేనని గుర్తించాడు. తన డిపార్ట్‌మెంట్‌ వైపుకు వెళ్ళాడు. అక్కడ తనకు తెలిసిన లెక్చెరర్లు కొందరు

ఉండితీరతానికి అతనికి గట్టి నమ్మకంగా వుంది!

అనుకున్నట్టే కనకరాజు కనిపించాడు. తనెవరో గుర్తుపట్టలేదు గాని తను అమెరికాలో వుంటున్నానని

చెప్తే ఉత్సాహంగా అక్కడే ఉంటున్న తన తమ్ముళ్ళ గురించి, కూతురూ అల్లుడూ గురించి, వాళ్ళ

ఫ్రెండ్స్‌ గురించి, బాబాయి కొడుకుల గురించి, పక్కింటి వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళకి తెలిసిన

వాళ్ళ గురించి … ఇలా చెప్పుకుపోతుంటే, ఉన్న ఉత్సాహం అంతా చచ్చి, అసలక్కడికి ఎందుకు

వచ్చానా అని నీరసం వచ్చిందతనికి. అర్జంటుగా ఓ ఫ్రెండ్‌తో కలవాల్సిన పనుందని చెప్పి

తప్పించుకోబోతుంటే, “ఎవరూ, సుబ్బారావేనా?” అనడిగాడు కనకరాజు.

ఎందుకైనా మంచిదని ఔనూ కాదన్నట్టు తలూపాడు గోపీ.

“ఈమధ్య టీవీ సీరియల్స్‌ తీస్తూ పెద్దవాడయ్యాడులే! అప్పుట్లో ఎలా వుండేవాడు నీకు గుర్తుండే

వుంటది అతను ఒక నాటకంలో వేషం వేసి స్టేజి మీద నోట మాటరాక చెవటలు కక్కితే, ఇంకోడు ఆ

చెవట మడుగులో జారి స్టేజీని దాటుకుని ఎదురుగా కూర్చోనున్న జడ్జిగారి ఒళ్ళో పడటం! అది

జరిగి పాతికేళ్ళయినా ఇంకా దాన్ని తల్చుకుని నవ్వుకుంటానే వున్నావనుకో!” హఠాత్తుగా

జ్ఞాపకాల్లోకి జారిపోయాడు కనకరాజు.

ఆ నాటకంలో తనూ ఉన్నానని, జారిపడిన తన మిత్రుడు వెంకట్రావుని పట్టుకోబోయి తనూ పడ్డానని

(ఎవరి ఒళ్ళోనూ కాదు, స్టేజి మీదనే!) గుర్తుకొచ్చాయి గాని ఆ విషయం బయటపెట్టలేదు గోపీ.

“ఐతే మీకు సుబ్బారావు అడ్రసు గానీ ఫోన్‌ నంబర్‌ గాని తెలుసా?”

“ఈ మధ్యనే ఓ సారి షాపింగ్‌ సెంటర్లో కనపడి కార్డిచ్చాడు. చూస్తా వుండు” అని వెళ్ళి ఓ కార్డ్‌

పట్టుకొచ్చాడు.

“ఎం. సుబ్బారావు, ఎం. ఎస్‌. సి., ఫిల్మ్‌ అండ్‌ టీవీ డైరెక్టర్‌, సెల్‌ నంబర్‌ ….”

ఆ సెల్‌ నంబర్‌ రాసుకున్నాడు గోపీ.

“కాల్‌ చేస్తావా?” అంటూ తన సెల్‌ తీసి ఇచ్చాడు కనకరాజు.

“నాకూ సెల్‌ వుంది” అనబోయాడు గాని అంతలోనే అది ఇక్కడ పనిచెయ్యదని గుర్తొచ్చి కనకరాజు

దగ్గర్నుంచి తీసుకున్నాడు గోపీ.

సుబ్బారావుకి ఫోన్‌ చేసి తన గురించి గుర్తు చేశాడు.

“ఎక్కడున్నావో చెప్పు, మా డ్రైవర్‌ వచ్చి నిన్ను ఎక్కించుకొస్తాడు” అన్నాడు సుబ్బారావు

హడావుడిగా.

అలా సుబ్బారావుని కలిశాక, అతని ద్వారా వెంకట్రావు, అజీజ్‌ కూడ కలిశారు. అందరూ ఆ

చుట్టుపక్కలే వుంటున్నారుట. అందరూ రకరకాల వ్యాపారాల్లో విపరీతంగా సంపాయించారు.

రెండేసి ఫారెన్‌ కార్లు, కలర్‌ టీవీలు, పొలాలు, స్థలాలు, ఇళ్ళు అన్నీ సమకూర్చుకుని

వున్నారు. వాళ్ళ ముందు తన పరిస్థితే కాస్త తక్కువగా అనిపించింది గాని ఆ విషయం వాళ్ళకి తెలీదు

గనక బింకంగా తనూ పోజు కొట్టాడు గోపీ.

కాలేజ్‌ కబుర్లు చాలాసేపు చెప్పుకున్నాక అందరూ కలిసి వేసిన వేషాలూ నాటకాలూ

గుర్తుకుతెచ్చుకున్నారు. నిజానికి ఫైనలియర్లో వాళ్ళ నాటకానికి సెకండ్‌ ప్రైజ్‌ వచ్చింది కూడ.

గోపీకి బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌ గా, సుబ్బారావుకి బెస్ట్‌ డైరెక్టర్‌గా కూడ ఎవార్డులు వచ్చాయి.

అవి తల్చుకుంటుంటే గోపీకి తటాల్న తట్టింది మళ్ళీ ఓ నాటకం వేస్తే ఎలా వుంటుందా అని. మిగిలిన

వాళ్ళు ఎవరూ ముందు ఇష్టపడలేదు “అవన్నీ కుర్రతనం చేష్టలు. నీ సంగతేమో గాని మేం మాత్రం

తాతలం కాబోతున్నాం. ఈ వయసులో ఈ వేషాలేమిటి?” అన్నాడు వెంకట్రావు. కాని సుబ్బారావు

ఎలాగూ అదే ఫీల్డ్‌లో వున్నాడు గనక ఉత్సాహపడ్డాడు. “మందగ్గర బోలెడు మంది హీరోయిన్‌

కేండిడేట్లు వున్నారు. మాంఛి రొమాంటిక్‌ నాటకం వేద్దాం గురూ!” అని ఆవేశపడ్డాడు. ఐతే

హీరోగా ఎవరు వెయ్యాలన్న సమస్య వచ్చిపడింది. అజీజ్‌ చూడ్డానికి అందగాడే. ఇప్పటికీ పెద్దగా

మారలేదు. కాకపోతే ఈ మధ్య రాజకీయాల్లో తిరుగుతూ తెలుగు మాట్లాడటం చాలావరకు

మర్చిపోయాడు. అసలే అంతంత మాత్రం, ఇక ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది.

వెంకట్రావుకి చిరంజీవి సైజు పొట్ట వస్తే సుబ్బారావు జూనియర్‌ యన్‌.టి. ఆర్‌ తో పోటీ

పెట్టుకున్నట్టున్నాడు.

గోపీయే మిగిలిన వాళ్ళతో పోలిస్తే కొంత “ఫిట్‌”గా వున్నాడని చెప్పుకోవచ్చు. కాని

మొహమాటపడి, “ఇదంతా ఎందుకు, అసలు స్త్రీపాత్ర లేనిది ఏదన్నా వేద్దాం” అన్నాడు.

ఠక్కుమని ఒప్పేసుకున్నారు అందరూ.

ఎలాటి నాటకం వెయ్యాలనే ప్రశ్న వచ్చింది. తన దగ్గర కట్టలు కట్టల నాటకాలు పడివున్నాయని

సుబ్బారావంటే, ఆ టీవీ సరుకు పేరు చెప్తేనే జనం పారిపోతారని ససేమిరా వద్దన్నాడు అజీజ్‌.

దుర్యోధనుడి వేషం వెయ్యాలని తన చిరకాలపు కోరికని బయట పెట్టాడు గోపీ. పద్యాలు తీసేసి

పవర్‌ఫుల్‌ డయలాగుల్తో పడకసీను ఎవరో రాసి తెచ్చారని బయటపెట్టాడు సుబ్బారావు. ఆ ఐడియా

బాగున్నదన్నారు అందరూ. అలా ఐతే పాత్రలు మూడే కనుక అజీజ్‌ కి ఏం ఇవ్వాలన్న సమస్య

కూడ ఉండదని ఒప్పేసుకున్నారు. అజీజ్‌ నాటకం ప్రదర్శనకి సంబంధించిన పన్లు తను

చూస్తానన్నాడు. గోపీ మాత్రం దుర్యోధనుడి ఒరిజినల్‌ డయలాగులే నేర్చుకుంటానని పట్టుపట్టాడు.

నచ్చ చెప్పటానికి ప్రయత్నంచి లాభం లేదని “నీ ఖర్మ!” అని వదిలేశారు.

గోపీ ఆరు వారాల సెలవులో వచ్చాడు. వచ్చే నెలలో ఏ. సీ. కాలేజ్‌ యానివర్సరీ జరుగుతుంది

కాబట్టి అప్పుడు ఈ నాటకం వేస్తే అన్నీ కలిసొస్తయ్యన్నాడు వెంకట్రావు. కాలేజ్‌లో ఇలాటి

నాటకాలు వేస్తే రాళ్ళేస్తారేమో అని భయం పట్టుకుంది గోపీకి. “నో ప్రాబ్లెమో! సిన్మా డైరెక్టర్‌

సుబ్రావ్‌ టాలెంట్‌ సెర్చ్‌ లో ఈ నాట్కం వక ఇంపార్టెంట్‌ పార్ట్‌ అనీ చూట్టానికి వొచ్చిన వాళ్ళల్లో

నించి హీరో హీరోయిన్లని సెలెక్ట్‌ చేద్దామని ప్రాపగాండా చేద్దాం. జనం వస్తారు” క్లుప్తంగానైనా

స్పష్టంగా అన్నాడు అజీజ్‌, తన పాత్రకి అనుగుణంగా.

వెంటనే మొదలయ్యాయి నాటకం రిహార్సల్స్‌.

ఎటూ ఖాళీగానే వున్నాయి కదాని కాలేజ్‌లోనే ఓ పెద్ద రూమ్‌ చూసుకుని అక్కడే వేస్తున్నారు.

మిత్రులందరూ మళ్ళీ కలిసి కాలేజ్‌కి వెళ్తున్న ఫీలింగ్‌తో గడుస్తున్నాయి రోజులు.

సుబ్బారావు కృష్ణుడు, వెంకట్రావు అర్జునుడు.

భాషను చిత్రవిచిత్ర వధలు చేస్తూ డయలాగులు రోజుకో రకంగా చెప్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

పదిరోజులు గడిచాక రిహార్సల్‌ మాంఛి రసవత్తరంగా వున్న సమయంలో సుబ్బారావుకి ఓ ఫోన్‌ కాల్‌

వచ్చింది.

కాలర్‌ ఐడి చూట్టం తోనే చిరాకు పడ్డాడు సుబ్బారావు. తియ్యాలా వద్దా అని కాసేపు

గిజగిజలాడాడు.

చివరికి తీసుకున్నాడు.

అవతలి నుంచి ఆడగొంతుక వినిపిస్తోంది. సుబ్బారావు గొంతులో విసుగు చూపించకుండా

వుండటానికి విఫలప్రయత్నం చేస్తూ ఊ కొడుతున్నాడు. చివరికి “అలాగే, అవకాశం వస్తే

తప్పకుండా చెప్తాను” అని పెట్టేశాడు.

“ఎవర్రా, మాజీ హీరోయినేనా?” అన్నాడు వెంకట్రావు ఆవలిస్తూ.

“అవున్రా, సమాధానం చెప్పలేక చస్తున్నా. ఒకరా, ఇద్దరా? మాజీలందరికీ టీవీ మీద మళ్ళీ

వెలగాలనే! చూస్తే జాలేస్తుంది గాని ఏం చేస్తాం?”

గోపీకి కుతూహలం కలిగింది. “ఎవర్రా ఆ మాజీ హీరోయిన్‌?” అనడిగాడు.

“సుమతి” నిరాసక్తంగా చెప్పారు వాళ్ళు.

“అంటే, జీవితబంధం సిన్మాలో యాక్ట్‌ చేసిన ఆవిడేనా?”

అతని సిన్మా పరిజ్ఞానానికి విస్తుపోయారందరూ.

“ఔను. కాని, అదెప్పుడో డెబ్భైల్లో వచ్చిన సిన్మా!” అన్నాడు సుబ్బారావు అతని వంక

అనుమానంగా చూస్తూ.

“ఔను, డెబ్భై నాలుగులో వచ్చింది. నాజ్‌ లో సరిగ్గా నాలుగు రోజులు ఆడింది….” ఆ నాలుగు

రోజుల్లోనూ దాన్ని ఐదు సార్లు చూశానని వాళ్ళతో చెప్పలేదు గోపీ.

ఆవేశంగా చెప్పుకుపోతున్న గోపీని ఆపి,

“నీ జ్ఞాపకశక్తికి జోహారు గాని మన రిహార్సల్‌ కానిద్దాం పట్టు” అన్నాడు వెంకట్రావు.

“ఐతే ఆ హీరోయిన్‌ సుమతి ఎక్కడ వుంటున్నారు రా?” అనడిగాడు గోపీ వదలకుండా.

“ఇక్కడే నాయనా, ఈ వూళ్ళోనే! ఏం, వెళ్ళి పలకరిస్తావా?” అన్నాడు సుబ్బారావు

వెటకారంగా.

“అవున్రా. ఆ అడ్రస్‌ తెలుసా? వెళ్ళి పలకరించొద్దాం పదండి” అన్నాడు హడావుడిగా లేచి

నిలబడుతూ.

“నాయనా, మాకు వేరే పన్లున్నాయి కాని, నువ్వే వెళ్ళిరా” అని అడ్రస్‌ ఇచ్చి ఎటువాళ్ళు అటు

వెళ్ళిపోయారు.

ఆకాశంలో తేలిపోతూ టాక్సీలో ఆ అడ్రసుకి వెళ్ళాడు గోపీ.

ఊరు చాలా మారిపోయింది. అసలు తనెక్కడ ఉన్నాడో ఎటు వెళ్తున్నాడో ఏమీ అంతుపట్టలేదు

గోపీకి.

ఎటు చూసినా కొత్త భవనాలు. కొత్త ధనలక్ష్మి ప్రసన్నలాస్యం మనోహరంగా వుంది.

కొన్ని వీధులు దాటాక అక్కడక్కడ మాత్రం పెద్ద ఇళ్ళు కనిపించసాగాయి. ఎక్కువగా మిద్దెలు.

కొన్ని పూరిగుడిసెలు.

చివరికి ఒక తాటాకుల పాక ముందు ఆగింది టాక్సీ.

దిగమన్నట్టు గోపీ వంక చూశాడు డ్రైవర్‌.

అర్థం కాక బిక్కమొహం వేసి అతని వంక చూశాడు గోపీ.

“ఇదే మీరిచ్చిన అడ్రసు” అన్నాడతను విలాసంగా చూస్తూ.

కంగారుగా దిగి అతనికి డబ్బిస్తూ, “ఓ పది నిమిషాలు వైట్‌ చేస్తారా? నేను ఇప్పుడే వస్తాను?” అని

గబగబా ఆ ఇంటి వైపు నడిచాడు గోపీ.

మురుగుకాలవని ఒక్క గెంతులో దాటాడు.

అందులో పడుకుని ఉన్న ఓ పంది కోపంగా చూసిందతని వైపు.

కంటిని ముద్దెట్టుకో బోతున్న ఓ తాటాకుని కౌశలంతో తప్పించుకుని వాకిలి వైపుకి వెళ్ళాడు.

బెల్‌ కోసం అటూయిటూ చూసి అంతలోనే పరిస్థితి గుర్తొచ్చి నాలిక్కరుచుకున్నాడు.

“ఎవరండీ?” ఓ గొంతుక వినిపించింది లోపల్నుంచి.

అతని గొంతు పెగల్లేదు. గుండె వేగంగా పరిగెత్తిపోతున్నది.

ఆవిడ బయటకు వచ్చింది. “ఎవరండీ?” అన్నది మళ్ళీ.

“నా పేరు గోపీ..” ఆగి ఆమె ముఖంలోకి చూశాడు. తనని గుర్తించిన ఛాయలు ఏమీ కనిపించలేదు.

“ముప్ఫై ఐదేళ్ళ క్రితం మీరు మా ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు, అరండల్‌ పేటలో!” అన్నాడతను

ఆయాసపడుతూ, ఉద్వేగంతో చెమటలు కక్కుతూ.

ఏమీ మాట్లాడలేదామె.

“అనుకోకుండా మీకు సిన్మాల్లో ఛాన్స్‌ వచ్చింది. మీరందరూ మద్రాసు వెళ్ళిపోయారు…”

హడావుడిగా చెప్పుకుపోతున్నాడు.

ఒక్కసారిగా పక్కనే వున్న ఓ నులకమంచం మీద చతికిల పడిందామె. పైట కొంగు బుజాల చుట్టూ

కప్పుకుంది.

ఆమె వంక చూసిన గోపీకి ఆ పైటలో చిరుగులు కనిపించాయి. ఆమె కళ్ళలో నీటిపొరలు

కనిపించాయి. ఆమె ముఖంలో ముడతలు కనిపించాయి.

ఐతే అతని మనసులో ముప్ఫై ఐదేళ్ళ నాటి సుమతి కనిపించింది. తెలిసీ తెలియని వయసులో తన

మనసుని ఆమెకి ఇచ్చేసిన వింత తలపులు తళుక్కుమన్నాయి.

“ఏం కావాలి మీకు?” అన్నదామె హఠాత్తుగా.

బిత్తరపోయాడతను. అతనికి ఆ ఆలోచనే రాలేదు.

“ఏమో, తెలీదు. చూడాలనిపించింది.” గొణుక్కున్నాడు.

“మీరిలా రావలసింది కాదు. అలా చేసుంటే అప్పటి సుమతిగానే నేను ఎప్పటికీ మీకు గుర్తుండిపోయే

దాన్ని. ఇప్పుడు చూడండి అందమంతా పోయింది. డబ్బు అంతకు ముందే పోయింది. నాన్న

గారు దిగుల్తో పోయారు. అమ్మ కూడ ఆర్నెల్ల తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. తమ్ముడు

ఎక్కడున్నాడో తెలీదు… ఐనా, నా సంగతి వదలండి. మీరెలా వున్నారు? మంచి పొజిషన్లో

వున్నట్టున్నారు! పిల్లలెంత మంది?..” ప్రశ్నలు కురుస్తున్నాయి. గోపీ గుండెలో వర్షం

కురుస్తోంది.

“ఇలా ఎలా జరిగింది? ఎందుకు జరిగింది?” తనలో తను అనుకుంటున్నట్టు అన్నాడు.

“మామూలే. నేను హీరోయిన్‌ గా వెలిగిన రెండేళ్ళలో గట్టిగానే సంపాయించాను. ఐతే అంతకు

మించే ఖర్చులు కూడా చేశాను. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోగానే వరసగా మూడు సిన్మాలు

ఆడలేదు, ఇంకా కొత్త అమ్మాయిలు వచ్చేశారు, ఛాన్సులు తగ్గిపోయినయ్‌. పరిస్థితి తెలుసుకుని

చిన్న వేషాలకి సిద్ధం కావటానికి టైం పట్టింది. సిద్ధం అయ్యేసరికి అవీ దొరక్కుండా పోయాయి.

ఆదాయం లేని పరాయి చోట వుండి ఏం చేస్తాం? ఇక్కడికి తిరిగొచ్చేశాం. పట్టుకున్న కొత్త అలవాట్లు

మాత్రం అంత తేలిగ్గా వదల్లేదు, డబ్బు పూర్తిగా వదిలినా కూడా. చివరికి ఇలా ఒక్క దాన్నే ఎలాగో

బతుకుని ఈడుస్తున్నా. టీవీ షోలలో ఎప్పుడన్నా ఓ వేషం దొరికితే ఓ నెల పాటు ఇల్లు గడుస్తుంది.”

ఆమె గొంతులోని నిశ్చలతకి ఆశ్చర్యపోయాడతను.

హఠాత్తుగా ఓ నిర్ణయానికి వచ్చాడు.

“నేనిప్పుడు అమెరికాలో వుంటున్నా. బోలెడంత సంపాయిస్తున్నా. మీకు అభ్యంతరం లేకపోతే

నెలకో పదివేలు మీకు పంపుతాను. సరేనా?” అనడిగాడు, ఆమె వంక దీనంగా చూస్తూ.

“నేను మీకు ఏమౌతాను? ఎందుకు నాకు అంత డబ్బు ఇవ్వాలనుకుంటున్నారు? నా పరిస్థితి మరీ

అంత దీనంగా కనిపిస్తున్నదా?”

తడబడ్డాడు గోపీ. “కాదు, కాదు. అదికాదు నా ఉద్దేశ్యం. మిమ్మల్ని ఇలా చూడలేను నేను. మీరు

సుఖంగా ఉండాలి. డబ్బు గురించి ఆలోచించాల్సిన పని లేకుండా వుండాలి. అదే నాకు

కావల్సింది.”

“అందుకు ప్రతిఫలంగా నేను ఏమివ్వాలి మీకు?”

ఏమి కావాలన్నా ఇస్తాననా లేక ఏమీ ఇవ్వననా దాని అర్థం?

అనుకోకుండానే అతని మెదడు ఆలోచనల్లోకి వెళ్ళింది.

“నాకేమీ వద్దు. మీరు హాయిగా ఉన్నారనే ఆలోచన చాలు.”

“ఐతే డబ్బుంటేనే సుఖం వుంటుందని మీ ఉద్దేశ్యమా? లేకపోతే మీ దగ్గర డబ్బు ఉంది గనక అన్ని

సమస్యలూ డబ్బుతో తీర్చెయ్యొచ్చని అనుకుంటున్నారా?”

ఈ సుమతి చిన్నప్పటి సుమతి కాదు. ఎంతో ఎదిగింది. స్థైర్యానికి మారుపేరులా వుంది. కల్లోల

కడలిలో నిశ్చల ద్వీపంలా వుంది.

అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి. గద్గద స్వరంతో అన్నాడు “నన్ను నమ్మండి. నేను ఈ పని

చెయ్యాలనుకుంటున్నది మీకోసం కాదు, మీ దగ్గర్నుంచి ఏదో ఆశించీ కాదు. చివరికి మీ కృతజ్ఞతలు

కూడా నాకు అవసరం లేదు. కేవలం నా మనశ్శాంతి కోసం, నేను రాత్రులు నిద్ర మేలుకుని జీవిత

కాలమంతా మీ కోసం ఏమీ చెయ్యలేక పోయానే అని బాధ పడకుండా ఉండాటం కోసం నాకీ మేలు

చెయ్యండి. కాదనకుండా డబ్బు తీసుకోండి”

“నేను నమ్ముతాను. ఐతే, ఒక పని చెయ్యండి. మీ దగ్గర డబ్బు వుంటే ఒక పదివేలు ఇప్పుడు

ఇవ్వండి. తరవాత సంగతి తరవాత చూద్దాం.”

జేబులోంచి డబ్బు కట్టలు తీశాడు గోపీ. “నలభై వేలున్నాయి, తీసుకోండి” ఇచ్చాడు.

“పది చాలు”

“ఫరవాలేదు. ఇవి నాకో లెక్క కాదు. మీకు ఉపయోగపడితే అంతే చాలు, తీసుకోండి” అర్థించాడు.

తీసుకుందామె.

ఒక్కసారిగా చేతులెత్తి అతనికి నమస్కారం చేసి పరుగున లోపలికి వెళ్ళిపోయింది.

కొంచెం సేపు చూసి మెల్లగా టాక్సీ దగ్గరకు వెళ్ళాడు. ఎక్కి కూర్చుని ఇంకొంచెం సేపు ఆ ఇంటి వంక

చూశాడు.

చివరకు డ్రైవర్‌ ని కదలమన్నాడు.

మర్నాడు మళ్ళీ అదే వేళకు వెళ్ళాడు గోపీ.

ఎవరూ లేరు అక్కడ.

వాకిలికి ఓ కాగితం అంటించి వుంది. అది తనకేనేమో అనిపించిందతనికి. తీసి చూశాడు.

“ప్రియమైన గోపీ! నా మీద నాకు మళ్ళీ విశ్వాసం కలిగించావు. తేంక్‌ యూ!”

లోపలికి తొంగి చూశాడు. అలికిడి లేదు.

పక్కన గుడిసెలోంచి ఎవరో కేకేశారు. “ఆయమ్మ ఎళ్ళిపోయిందయ్యా. మళ్ళీ ఈ ఊరు రానని

చెప్పిపోయింది”

“ఎక్కడికి వెళ్ళిందో తెలుసా?” అరిచాడతను.

“చెప్పలేదయ్యా!”

ఆ తర్వాత ఇంక రిహార్సల్సూ నాటకాలూ అతనికి రుచించలేదు. అనుకున్నకన్నా ముందే

అమెరికాకి తిరిగొచ్చేశాడు.

సుమతి అప్పుడప్పుడు గుర్తొస్తూనే వుంది. ఐతే ఎక్కడుందో ఏంచేస్తుందో మాత్రం తెలియలేదతనికి.

ముందు ముందు తెలిసినా అప్పుడు ఏం చెయ్యాలో అతనికి అర్థం కావటం లేదు.

అదే సమయంలో, సుమతి గురించిన ఆలోచనలు అతని జీవితానికో కొత్త అర్థాన్ని

స్ఫురింపజేస్తున్నాయి.