నాయినమ్మ యిల్లు

అలికిన పొయ్యిపై
చెరగని చేతిగురుతులు,

తరాలుగా
తడి పీతాంబరాలు మోసి
వొరిగిన దండెం,

తనకిక పనిలేదని
తాపీగా పడుకున్న వ్యాసపీఠం,

వానప్రస్థం స్వీకరించి
ధ్యానంలో మునిగిన వసారాలు.

ఎపుడో హంపీ శిథిలాల్లో
పాడుకున్న విషాదగీతం
పెదవులమీదకి వచ్చింది.