గత పన్నెండు నెలల్లో ఈమాటలో వెలువడ్డ కవితలన్నీ, ఈ మధ్యన ఒకచోట చేర్చాను. ఒకటొకటిగా వాటిని చదువుతున్నప్పుడు, ఏప్రిల్ 2017 సంచికలో, బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ అనే శీర్షిక చూశాను. ఆ శీర్షిక క్రింద ఉన్న దామెర్ల రామారావుగారి చిత్రరాజంపై వేలూరి వేంకటేశ్వరరావుగారి కవితని, వ్యాఖ్యలని చదివాను. కవితల పరిచయవాక్యాల్లో ఎక్‌ఫ్రాసిస్ (Ekphrasis) అనే పదానికి క్లుప్తంగా వివరణ ఉంది. ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్, ఎక్‌ఫ్ర్రాసిస్ — ఈ రెండూ ఇంతకుముందు నాకు తటస్థించని పదాలు. వీటి గురించి ఇంకాస్త తెలుసుకుందామనే ఆసక్తి కలిగింది. ఇంటర్‌నెట్‌లోకి వెళ్ళి, వెతికితే వీటి మీద, చాలా విలువైన సమాచారం దొరికింది. ఆ సమాచారాన్ని ఇలా తెలుగులోకి అనువదించుకున్నాను.
ఒక ప్రక్రియని ఉపయోగించి సృష్టించిన కళారూపం ఇచ్చిన ప్రేరణతో మరో ప్రక్రియలో ఇంకొక కళారూపాన్ని సృజించటాన్ని ఎక్‌ఫ్రాసిస్ అంటారు. ఈ రీతిలో ఒక కళారూపాన్ని చూసి, అది కలిగించిన స్ఫూర్తితో ఒక కవిత రాస్తే అది ఎక్‌ఫ్రాస్టిక్ పోయమ్ అవుతుంది. అలా కవిత రాయటానికి కొన్ని మార్గదర్శకసూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలని, బావి దగ్గర కవితకి, దాంతో పాటు ఉన్న బొమ్మలకి అన్వయించి చూశాను. నా అన్వయప్రయత్నం ఇచ్చిన ఫలితాలివి.
1. నువ్వు ఎంచుకున్న బొమ్మలో దృశ్యాన్ని గురించి కానీ, వస్తువు గురించి కానీ రాయాలి. 2. బొమ్మలో కనపడుతున్న వ్యక్తి/వస్తువు దృక్కోణంనుంచి కవితని రాయాలి. 3. బొమ్మను చూడటంలో, నీకు కలిగిన అనుభవం గురించి రాయాలి. 4. బొమ్మను చూసేటప్పుడు, నీకు గుర్తొచ్చిన మరో విషయం గురించి వ్రాయాలి.5. బొమ్మని గీసేటప్పుడు, చిత్రకారుడి మదిలో ఏం మెదులుతోందో ఊహించాలి. 6. కవితని చిత్రకారుడి గొంతుకతో వినిపించాలి. 7. బొమ్మలో కనపడుతున్న పాత్రలు ఏం మాట్లాడుకుంటున్నాయో రాయాలి. 8. బొమ్మని గీసిన చిత్రకారుడి అంతరంగతరంగాల్ని గ్రహించగలిగితే కవిత రాయటం మరింత సులభమవుతుంది, కవిత మరింత సమగ్రమవుతుంది. అందుకని, బొమ్మని గీసిన చిత్రకారుడితో కవి, నేరుగా మాట్లాడేందుకు ప్రయత్నించాలి. 9. బొమ్మలో వస్తువు/వ్యక్తి గొంతుకతో కవితని వ్రాయాలి.10. బొమ్మలో చూసిందాన్ని దృష్టిలో పెట్టుకుని, దాని నేపథ్యంలో ఏం జరిగిందో ఊహించడానికి కవి కృషి చేయాలి. తన కృషి ఫలితాన్ని కవితలో ప్రతిబింబించాలి. 11. చిత్రకారుడు, బొమ్మని ఎందుకు గీశాడో ఊహించటానికి కవి ప్రయత్నించాలి.
1. నువ్వు ఎంచుకున్న బొమ్మలో దృశ్యాన్ని గురించి కానీ, వస్తువు గురించి కానీ రాయాలి.
– బొమ్మలో దృశ్యమానమవుతోంది ఒక నీళ్ళ బావి. దాని చుట్టూ కనపడుతున్నది, ఆ బావిలో నీళ్ళు పట్టుకోవటానికి వచ్చిన గ్రామప్రజలు. ఊళ్ళో స్త్రీలు నీళ్ళు పట్టుకోటానికి రావటం, పట్టుకున్న నీళ్ళతో ఇంటికి మళ్ళటం, ఇదీ బొమ్మలో వస్తువు. కవిత ఈ రెండు అంశాలని విస్తృతంగా వివరించింది.
– బొమ్మలో కనపడుతున్న వ్యక్తుల గురించి కవితలో ప్రస్తావన ఉంది. ప్రస్తావించకుండా వదిలేయబడిన వ్యక్తులు అతి కొద్దిమంది.
– బొమ్మ మొదటి భాగంలో- ఐదుగురు వ్యక్తులుంటే, సంభాషణ ముగ్గురి పరంగానే నడిచినట్లనిపించింది. రెండో భాగంలో- నలుగురు స్త్రీలుంటే కవితాభాగంలో ముగ్గురి ప్రస్తావన మాత్రమే ఉంది. మూడో భాగంలో- నీలం రంగు చీర కట్టుకుని, బిందె పట్టుకుని, చప్టా మీద కూర్చున్న అమ్మ పేరమ్మ వెనుక నిలబడి ఉన్న స్త్రీ గురించి కవిత ఏమీ మాట్లాడలేదు.
మరికొన్ని పంక్తుల్ని రాసి, మిగిలిన స్త్రీలని కూడా కవిత పరిధిలోకి తెద్దామని ప్రయత్నించాను. అవగాహనాసౌలభ్యం కోసం మూలకవితలో ఉన్న సంబంధిత భాగాన్ని ఎరుపు రంగు అక్షరాల్తో ఉంచాను. నేను జతపర్చిన పంక్తుల్ని నీలం రంగుతో సూచించాను.
మొదటి భాగం:
మరి, రెండు బిందెలు తెచ్చావు, మొయ్యగలవుటే?
అడిగింది చేదని బావిలోంచి బయటకి లాగుతూ భారతమ్మచోద్దెం చూస్తావేంట్రా నారిగా? పిల్లమ్మ నెత్తిన బిందెలెత్తి పెట్టు.
తడిసిన తలవెంట్రుకల్ని చేతుల్తో పిండుకుంటూ
అతడి వంకే చూస్తున్న చూడామణి గదమాయిస్తోందిరెండో భాగం:
కబుర్లాడుతోంది కామాక్షి,
చీర కుచ్చెళ్ళు ఎత్తిపెట్టి
ఏమీ పట్టించుకోకండా.
ఇవేవీ తనకు పట్టనట్టు బావిలోకి తొంగి చూస్తూ
నిలబడింది నీలవేణిమూడో భాగం:
తొందర తొందరగా
పోతున్నారు, ఇవ్వాళ.
ప్రకృతి పిలిచిందేమో చెట్ల చాటుకు వెళ్తోంది
వెనక్కి తిరిగి చూడకుండా వెంకటమ్మ
బొమ్మలో బావి చుట్టూ చెట్లు ఉన్నాయి. ‘నూతి చుట్టూరా చెట్లు’ అనే చరణం ద్వారా బొమ్మలో కనిపించే చెట్ల వర్ణన జరిగింది. ‘శైతల్యాన్ని తెస్తాయి చెట్టూ, బావీ’ అనటం ద్వారా బొమ్మలో చెట్టు అస్తిత్వాన్ని బావితో కలిపి కవి మరోసారి స్పృశించినట్లయింది. అయితే, బొమ్మలో కనపడి కవితలో అసలు వర్ణించబడకుండా వదిలేయబడింది నీలాకాశం, దాని మీద మేఘాలు మాత్రమే. వాటిని కూడా ఈ రకంగా వర్ణించినట్లయితే, కవిత మరింత సమగ్రమయేది.
ఒంటిని అంటిపెట్టుకున్న ఆ కొద్ది మబ్బుల గుడ్డ పేలికల్ని
విప్పి దూరంగా విసిరేసింది నీలాకాశం.
ఆచ్ఛాదన లేని తన దేహప్రతిబింబాన్ని
నీళ్ళలో కళ్ళారా చూసుకుని మురిసిపోదామని దాని ఉద్దేశం.
2. బొమ్మలో కనపడుతున్న వ్యక్తి/వస్తువు దృక్కోణంనుంచి కవితని రాయాలి.
– కవితలో ఉన్న సంభాషణల్తో పాటు, ఈ పంక్తులు ముఖ్యంగా ఆ దృక్పథంతో రాసినవే.
మంచి కుర్రాడు, నారిగాడు. అందరికీ తలలో నాలిక.
నీళ్ళు తోడి పెడతాడు. నిండిన బిందెలెత్తి నెత్తిమీద పెడతాడు.
3. బొమ్మను చూడటంలో, నీకు కలిగిన అనుభవం గురించి రాయాలి.
– అనుభవం అంటే అనుభూతి. ఆ అనుభూతి ఫలితమే ఈ రీతిలో రూపు దిద్దుకున్న గీతి.
4. బొమ్మను చూసేటప్పుడు, నీకు గుర్తొచ్చిన మరో విషయం గురించి వ్రాయాలి.
బొమ్మను చూసింది ఇప్పుడనుకుంటే, గుర్తొచ్చిన విషయాలు ఇవేగా!
బావులన్నీ ఎండిపోయాయి
ఊళ్ళల్లో కొళాయిలు
ఉన్నాయి కోకొల్లలు;
కొళాయిలన్నీ నాయుళ్ళకి
రాయుళ్ళకి కాకుల లెక్కకోసం.
5. బొమ్మని గీసేటప్పుడు, చిత్రకారుడి మదిలో ఏం మెదులుతోందో ఊహించాలి.
కవితలోని ఈ క్రింది పంక్తులు చేసిన పని అదే!
నూతి చుట్టూరా చెట్లు.
పాతవానల రహస్యనిద్రల్ని తట్టి
పాతస్మృతుల సుడిగుండాల్ని గాలించి
ఆ తపించే వర్తమానం కోసం
శైతల్యాన్ని తెస్తాయి, చెట్టూ, బావీ.
6. కవితని చిత్రకారుడి గొంతుకతో వినిపించాలి.
కవి, చిత్రకారుడి మానసప్రవేశం చేసి రాసినవే, కవితలోని ఈ క్రింది పంక్తులు.
చంద్రమ్మ గారి చిన్న కోడలు
ఊరికి కొత్త కోడలు, బిందెడు
నీళ్ళూ వలక పోసుకుంది
ఇంకా అలవాటు పడలేదు
నీళ్ళ బిందె నిండుగా నింపి ఎత్తడం
చంటి పిల్లని చంకనెత్తడం
చేతకాదుగా!
పెద్ద కోడలు చూస్తున్నది
లేదు. ఏదో చెపుతూన్నది
ఖాళీ బిందె పట్టుకొని.
నీలం చీరలో నిలబడి
కబుర్లాడుతోంది కామాక్షి,
చీర కుచ్చెళ్ళు ఎత్తిపెట్టి
ఏమీ పట్టించుకోకండా.
7. బొమ్మలో కనపడుతున్న పాత్రలు ఏం మాట్లాడుకుంటున్నాయో రాయాలి.
కవితలోని ఈ క్రింది పంక్తులు బొమ్మలో వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణకి ప్రతిరూపాలు.
అమ్మ రాలేదేమే పిల్లమ్మా?
జరం.
మరి పెద్దక్క రావచ్చుగా?
పెద్దక్క బయటికి రాకూడదు.
చేదలో నీళ్ళు బిందెలోకి పోస్తూ,
నువ్వు ఇకనించీ ఓణీలు వేసుకోవాలి.
మరి, రెండు బిందెలు తెచ్చావు,
మొయ్యగలవుటే?
ఆహా. ఇంచక్కా ఎత్తుకొపోతా.
చోద్దెం చూస్తావేంట్రా నారిగా?
పిల్లమ్మ నెత్తిన బిందెలెత్తి పెట్టు.
8. బొమ్మని గీసిన చిత్రకారుడి అంతరంగతరంగాల్ని గ్రహించగలిగితే కవిత రాయటం మరింత సులభమవుతుంది, కవిత మరింత సమగ్రమవుతుంది. అందుకని, బొమ్మని గీసిన చిత్రకారుడితో కవి, నేరుగా మాట్లాడేందుకు ప్రయత్నించాలి.
బొమ్మ గీసి చాలా కాలమయింది. దానికి కవిత్వం రాయదల్చుకుంది కొన్ని దశాబ్దాల తర్వాత. కనుక, కవికి చిత్రకారుడితో భౌతికంగా మాట్లాడేందుకు అవకాశం లేదు. అందుకని తన బొమ్మద్వారా చిత్రకారుడు వ్యక్తీకరించిన భావసంచయంతో, కవి తన అవగాహనాశక్తి ద్వారా సంభాషించి, ఆ సారాంశాన్ని అక్షరరూపంలో మనకు అందచేశాడు.
9. బొమ్మలో వస్తువు/వ్యక్తి గొంతుకతో కవితని వ్రాయాలి.
కవితలో చోటు చేసుకున్న ఈ క్రింది సంభాషణలు, వ్యక్తమయిన ఆలోచనలు; బొమ్మలో వస్తువు/వ్యక్తుల గొంతుకలోంచి మనకు వినపడినవే.
అమ్మ రాలేదేమే పిల్లమ్మా?
జరం.
మరి పెద్దక్క రావచ్చుగా?
పెద్దక్క బయటికి రాకూడదు.
చేదలో నీళ్ళు బిందెలోకి పోస్తూ,
నువ్వు ఇకనించీ ఓణీలు వేసుకోవాలి.
మరి, రెండు బిందెలు తెచ్చావు, మొయ్యగలవుటే?
‘ఆహా. ఇంచక్కా ఎత్తుకొపోతా.’
చోద్దెం చూస్తావేంట్రా నారిగా? పిల్లమ్మ నెత్తిన బిందెలెత్తి పెట్టు.’
మంచి కుర్రాడు, నారిగాడు. అందరికీ తలలో నాలిక.
నీళ్ళు తోడి పెడతాడు. నిండిన బిందెలెత్తి నెత్తిమీద పెడతాడు.
10. బొమ్మలో చూసిందాన్ని దృష్టిలో పెట్టుకుని, దాని నేపథ్యంలో ఏం జరిగిందో ఊహించడానికి కవి కృషి చేయాలి. తన కృషి ఫలితాన్ని కవితలో ప్రతిబింబించాలి.
ఆ ఊహలోంచి జనించినవే ఈ పదచిత్రాలు.
రెండు బిందెలూ నిండుగా నింపుకొని
ఇంటికి పోతున్న ఇద్దరు మగువలు.
చుట్టాలొచ్చారు గాబోలు
తొందర తొందరగా
పోతున్నారు, ఇవ్వాళ.
11. చిత్రకారుడు, బొమ్మని ఎందుకు గీశాడో ఊహించటానికి కవి ప్రయత్నించాలి.
ఆ ప్రయత్నానికి అక్షరరూపాలే ఈ పదసమూహాలు.
పొద్దు ‘పొడిచేవేళ’ కడవలనిండా చీకట్లతో బిలబిలమంటూ
అమ్మలక్కలు చేరేవాళ్ళు. పిచ్చాపాటీ మాట్లాడుకునేవాళ్ళు.
అది ఆనవాయితీ.
ఏ రోజన్నా ఎవళ్ళన్నా బావినీళ్ళకోసం రాకపోతే అందరికీ ఆదుర్దా.
వాళ్ళు వెళ్ళేటప్పుడు హాయిగా చీకట్లని ఒంపేసి తిరిగి పోయేవారు.
అవి చెరగని స్మృతులు.
కవితలని కూర్చటానికి వీలుగా, వేలూరి వేంకటేశ్వర రావు 1925లో దామెర్ల రామారావు గీసిన బొమ్మని మూడు భాగాలుగా విభజించుకున్నారు. ఒక్కో భాగంలో ఉన్న దృశ్యాన్ని చూసి, ఒక్కో కవితా ఖండిక సృజించారు. ఇలా ఒక బొమ్మని భాగాలుగా చేసి, కవిత వినిపించడమనేది ఎక్‌ఫ్రాస్టిక్ కవిత వినిపించే పద్ధతిలో ఉన్నట్లుగా లేదు. కవితలకి ముందు మాటలో ‘అయితే నా ప్రయోగం కోసం ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్‌కి ఇంతకు ముందున్న నిర్వచనాన్ని నా అవసరం కొద్దీ నాకు నచ్చినట్టుగా మార్పు చేసుకున్నాను.’ అని వేలూరి వేంకటేశ్వరరావు అన్నారు. ఆయన చేసుకున్న మార్పుల్లో ఇదొకటేమో!
బొమ్మలో కనపడిన దృశ్యం, కాలక్రమేణా ఏ మార్పుకు గురైంది, అక్కడ ఇప్పటి దృశ్యం ఏమిటి అనేది చెప్పటానికి భవిష్యత్ దర్శనం చేయడం, ఎక్‌ఫ్రాస్టిక్ కవితారీతిలో ఒక భాగం అనిపించదు. అయితే, ఇక్కడ కొంత స్వేచ్ఛ తీసుకుని, వేలూరి వేంకటేశ్వరరావు బొమ్మలో వస్తువు, పరిణామక్రమంలో పొందిన ప్రస్తుత స్థితిని సైతం వ్యక్తీకరించారు. ఇది ఆయన చేసుకున్న మరో మార్పు అనుకుంటాను. అదే నిజమయితే, ఆ మార్పుకి ప్రతిబింబమే కవిత చివర్లోని ఈ పాదాలు.
బావులన్నీ ఎండిపోయాయి
ఊళ్ళల్లో కొళాయిలు
ఉన్నాయి కోకొల్లలు;
కొళాయిలన్నీ నాయుళ్ళకి
రాయుళ్ళకి కాకుల లెక్కకోసం.
ఒక అమ్మడు బిందె
అర ఇంచీ ముందుకు
జరిపితే మరొక అమ్మడు
అరుపులూ, సొరుపులూ
జుట్టూ జుట్టూ పట్టుకొని
కొట్లాటలు ఇప్పుడు.
పడిగాపులు పడగా పడగా
ఎప్పుడో ఒకప్పుడు
లారీలో నీళ్ళొస్తాయి
బిందెల్లో నీళ్ళు పడతాయి,
ఇప్పుడు.
నూతిలో తాబేలుందంటే
పరిగెత్తరు పిల్లలెవరూ!
పాడుబడిన బావి
తడి ఆరిన నేల
అడుగున తాబేలు లేదు
విడిపించటానికి.
And voices singing
out of empty cisterns
and exhausted wells అంటాడు ఎలియట్.
అది పాడుపడిన బావి
ఆ నూతిలో గొంతుకలు
అరిచి చచ్చినా వినిపించవు.
పై కవితాభాగాలని ఆధారం చేసుకుని ఏ చిత్రకారుడైనా ఇప్పుడొక బొమ్మ గీస్తే, అది ఎక్ఫ్రాసిస్ ప్రక్రియకి మరో ఉదాహరణగా నిలుస్తుందని నా ఆలోచన.
బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ని పరిచయం చేస్తూ ఎక్‌ఫ్రాసిస్ అనే ప్రక్రియ తెలుగు పద్యసాహిత్యానికి క్రొత్తది అని అన్నారు. ఈ ప్రక్రియ గురించి అంతర్జాలంలో ఉన్న సమాచారం ఏమిటో నేను నా సౌలభ్యం కోసం చేసుకున్న తెలుగు అనువాదంలో చూద్దాం.
ఒక కళారూపాన్ని తీసుకుని, దాన్ని మరొక కళారూపంలో వర్ణించడాన్ని ఎక్‌ఫ్రాసిస్ (Ekphrasis లేదా Ecphrasis) అని పిలుస్తారు. ఈ పదానికి వేరే పర్యాయపదాలు లేవు. ఒక కళారూపాన్ని, మరొక కళారూపంలో వర్ణించటం అని మాక్‌మిలన్ నిఘంటువు ఈ పదానికి అర్థం ఇచ్చింది. వీటిని సమన్వయిస్తే మూలంగా నిలిచింది కృతి అయితే, అందులోంచి పుట్టుకొచ్చింది అనుకృతి. అనుకృతి జననమే ఎక్‌ఫ్రాసిస్ ప్రక్రియ. ఒకప్పుడు ఒక వ్యక్తిని కానీ ఒక అనుభవాన్ని కానీ మరి దేన్నైనా కానీ వివరించడానికే ఈ ప్రక్రియని ఉపయోగించేవారు. ఈ ప్రక్రియ విస్తృతి కాలక్రమేణా పెరిగింది. ఈ ప్రక్రియలో కృతిలో అంతర్లీనభావాన్ని, రూపాన్ని అనుకృతి ద్వారా పునర్నిర్వచిస్తారు. లేదంటే వర్ణిస్తారు. అనుకృతి తోడ్పాటుతో, చూపరికి/చదువరికి కృతి మరింత దగ్గరవుతుంది. మూలకృతిని అర్థం చేసుకోవటం ఇంకాస్త సులభమవుతుంది.
వచనం, కవనం, చలనచిత్రం, ఛాయాచిత్రం, శిల్పానికి ప్రతిరూపమయిన చిత్రం, చిత్రానికి లేదా నవల్లో కథానాయికకి ప్రతిబింబంగా చెక్కిన శిల్పం- అనుకృతి ఏ కళారూపంలో అయినా ఉండొచ్చు. ఒక నాటిక, నాటకం లేదా నవల కూడా అనుకృతి కావచ్చును. వెబ్‌స్టర్ నిఘంటువు ఇచ్చిన అర్థంలో, ఒక కళారూపంలో మనకు కనపడే కృతికి, అనుకృతి- వర్ణన లేదా వ్యాఖ్యానం కూడా అవొచ్చు. కృతీ, అనుకృతీ ఏ కళాప్రక్రియలో ఉన్నా పరస్పరాధారితాలుగా ఉండాలి. శిల్పాన్ని చూసి, గీసిన చిత్రం; ఆ శిల్పకథని వినిపించటానికి కథకుడుగా మారొచ్చు. చిత్రమే ఒక కథగా అనిపించవచ్చు. అనుకృతి ద్వారా వర్ణించబడే కృతి నిజం కావచ్చు, ఊహాజనితమూ అవచ్చు. అయితే, అనుకృతి ద్వారా వర్ణించబడటానికి, కృతి ప్రేరణగా నిలవాలి. కృతిని సృష్టించిన కళాకారుడి మనోభావాలకు, అనుకృతి అద్దం పట్టాలి. అనుకృతి అన్నివేళలా సాధికారికంగా, కచ్చితంగా కృతిని పూర్తిగా వివరించలేకపోవచ్చు. అయితే, కృతి ఏ భావసంచయాన్ని ప్రతిఫలించదలుచుకుందో, దానిని అనుకృతి అందించగలగాలి. అనుకృతి తోడవటంతో, కృతి ఇచ్చే అనుభూతి సాంద్రత/స్థాయి పెరగాలి. తద్వారా, కృతి స్థాయి ఇంతకు ముందుకన్నా పెరగొచ్చు. స్థాయీవృద్ధికి కారణమైన అనుకృతి, స్రష్ట చూపెట్టిన ప్రతిభాపాటవాలతో ఒక్కోసారి తనకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని తెచ్చుకోవచ్చు. కృతిని మరపించేలా ఉండి, తనదే అసలు రూపం అన్న అభిప్రాయం కలిగించొచ్చు.
పై సమాచారం ద్వారా నేను గమనించిన విషయాలు ఇవి:
ఎక్‌ఫ్రాసిస్ ఒక కృతినీ, దాని అనుకృతుల స్వరూపస్వభావాల్ని మాత్రమే నిర్వచించింది. కృతి ఆధారంగా అనుకృతి ఎంతమంది ద్వారా ఒకసారి రూపు దిద్దుకోవచ్చు, ఎన్నిసార్లు సృష్టించబడొచ్చు, ఎన్ని ప్రక్రియల్లో జరగొచ్చు? అనే దాని మీద ఎలాంటి సూచనలూ కనపడలేదు. ‘బావి దగ్గిర’లో ఉన్న మూడు బొమ్మలకు మూలాలు మనుషుల నిత్యజీవితం లోవి. అవి దామెర్ల రామారావు కృతులు. వాటికి, వేలూరి వేంకటేశ్వరరావు కూర్చినవి కృతులను చూసిన వ్యక్తుల్లో కలిగిన ఆలోచనలకు అక్షరరూపాలు. అందువల్ల అవి అనుకృతులు.
ఇక్కడ ఒక అనుమానం వచ్చింది. వేలూరి వేంకటేశ్వరరావు అభిప్రాయపడినట్టుగా, ఎక్‌ఫ్రాసిస్ నిజంగా తెలుగువారికి తెలియని ప్రక్రియేనా? తెలుగు పద్యసాహిత్యం అంటే కవిత్వం అనుకుంటే, తెలుగు కవిత కృతి అయితే, వాటికి మరే ఇతర కళారూపంలోనూ అనుకృతులు సృజించబడలేదా? లేదంటే, ఇతర కళారూపాల్లో ఉన్న తెలుగు కృతులకి, తెలుగు కవిత్వం రూపంలో అనుకృతులు సృష్టించబడలేదా?
ఈమాట సెప్టెంబర్ 2015 సంచికలో, కందుకూరి రుద్రకవి జనార్దనాష్టకం, బాపు బొమ్మలతో ప్రచురించబడ్డ విషయం ప్రస్తావించబడింది. ఈ కావ్యంలో ఉన్న విభిన్న కవితలు కృతులు కనుక బాపు బొమ్మలు నిశ్చితంగా అనుకృతులు. అలాంటిది మరొకటి; బాపు చేతివ్రాతతో ఆయన గీసిన బొమ్మలతో ప్రచురించబడ్డ శ్రీశ్రీ గారి మహాప్రస్థానం. అలాగే, కొన్ని దశాబ్దాల క్రితం, ప్రముఖ తెలుగు వారపత్రికలని క్రమం తప్పక అనుసరించిన వారికి టి. సాయికృష్ణ పేరు గుర్తుండే ఉంటుంది. క్షేత్రయ్య పదాలు, కిన్నెరసాని పాటలు, అన్నమయ్య కీర్తనలు, దాశరథి దక్షిణ వేదం–వీటికి ఆయన గీసిన చిత్రాలు ఆంధ్రజ్యోతి వారపత్రిక కవర్ పేజీల్లో నెలల తరబడి వచ్చాయి. మను చరిత్ర, పారిజాతాపహరణంలోని పద్యాలకు ఆయన గీసిన బొమ్మలు ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురించబడ్డాయి. ఆయన బొమ్మలకు ఆలంబనగా నిలిచిన పుస్తకాలన్నీ తెలుగు కవిత్వంలో భాగమే. ఆ కవిత్వంలో వ్యక్తీకరించబడిన వివిధ భావాలు కృతులయితే, వాటికి టి. సాయికృష్ణ గీసిన బొమ్మలు అనుకృతులే. తెలుగు కవిత్వానికి చెందినది కాకపోయినా, టి. సాయికృష్ణ గారు చిత్రకళపై జరిపిన కృషి గురించి మరొక విషయం చెప్పాల్సి ఉంది. భక్త జయదేవుడు రచించిన గీత గోవిందంలోని సంస్కృత శ్లోకాల్లో ఉన్న చరణాలు ఆధారంగా ఆయన గీసిన రెండు వందలకు పైగా చిత్రాలని ఆంధ్రజ్యోతి వారపత్రిక ఏకంగా, మూడు సంవత్సరాలపాటు ధారావాహికంగా ప్రచురించింది. తెలుగు, సంస్కృతం, హిందీ కవిత్వాన్ని ఆధారం చేసుకుని ఆయన గీసిన బొమ్మలు వెయ్యికి పైనే. ఇవన్నీ అనుకృతులే.
కొందరు చిత్రకారులు/కవులు వారి కవిత్వానికి వారే బొమ్మ గీసుకుంటారు/ఒక ఛాయాచిత్రం తీస్తారు. లేదూ వారి చిత్రానికి/ఛాయాచిత్రానికి వారే కవిత్వం రాసుకుంటారు. ముందుగా కనపడేది చిత్రం లేదా ఛాయాచిత్రం, తర్వాత కనపడేది దానితో అనుసంధానించిన కవిత. స్రష్ట చెపితే తప్ప, అతడి మనసులో ఏది ముందుగా రూపు దిద్దుకుంది అనేది చెప్పలేని విధంగా ఇవి ఉంటాయి. దీనికి మూడు పార్శ్వాలు. మొదటిదాంట్లో, కవితలో భావాన్ని/పాఠకుడు పట్టుకోలేడని కవి అనుకున్న భావాలని చిత్రం/ఛాయాచిత్రం వివరిస్తుంది. రెండోదాంట్లో, చిత్రం/ఛాయాచిత్రంలో ఉన్న అర్థాన్ని/సంక్లిష్టతని కవిత వర్ణిస్తుంది. మూడో దాంట్లో, ఈ రెండూ కలిసి రూపకర్త తమలో నిక్షిప్తం చేసిన ఆలోచనలని, చూపరికి/చదువరికి సంయుక్తంగా చేరవేస్తాయి. భావవ్యక్తీకరణ పరంగా ఒకదానికి మరొకటి ప్రేరణ/ ప్రేరేపణ. అవగాహన కలిగించే విషయంలో రెండిటిదీ నిశ్చితంగా సమైక్యకృషి. ఈ ధోరణిని ఉపయోగించుకున్న వారిలో అలిశెట్టి ప్రభాకర్ ఒకరు. ఆయన గీసిన 51 చిత్రాలని/ఛాయాచిత్రాలని, కవితల్తో సహా అక్షరనక్షత్రమ్మీద… అనే సంకలనంలో చూడొచ్చు. జనవరి 2014లో దీన్ని ప్రచురించి, అందుబాటులోకి తెచ్చింది అలిశెట్టి మిత్రులు. మచ్చుకి, అశ్రు కావ్యం, నాగరికతా సౌధం నువ్వే…, వేశ్య అనే శీర్షికలతో అలిశెట్టి ప్రభాకర్ గీసిన బొమ్మలనీ రాసిన కవితలనీ చవి చూడండి. (వీటిని ఈ వ్యాసంతో అందించటానికి సహకరించినవారు పై సంకలనం వెలుగులోకి రావటానికి కారకుల్లో ఒకరయిన బి. నర్సన్.)
ఈ వ్యాసరచయిత రాసిన/గీసిన తన కవితలకు/బొమ్మలకు తానే గీసిన/రాసిన; బొమ్మలూ/కవితలూ, కొన్ని తెలుగు మాసపత్రికల్లో/వారపత్రికల్లో/దినపత్రికల్లో ప్రచురణకి నోచుకున్నాయి. ఇవి కాక, మానస చామర్తి గారి ఆట, వర్ణచిత్రం కవితలకి, ఈ వ్యాసరచయిత గీసిన బొమ్మలు అక్టోబర్ 2016 వాకిలిలో, 6.10.2016 సారంగలో-వెలువడ్డాయి. కొందరు కవుల/కథయితల రచనలకు, గీసిన చిత్రాలు; వారికి నేరుగా పంపబడ్డాయి. ఉదాహరణగా ఈ బొమ్మా, కవితా చూడండి.
ఎక్‌ఫ్రాసిస్ ప్రక్రియ గురించి నేను సేకరించిన సమాచారంలో కృతీ, అనుకృతీ ఒకరిదే అయి ఉండకూడదు అన్న నిబంధన కనపడలేదు. అందువల్ల 3.5, 3.6, 3.7 పేరాల్లో నేను ఉదహరించిన కవితలూ/చిత్రాలూ/ఛాయాచిత్రాలూ ఈ ప్రక్రియలో భాగాలే అని నా భావన. ఈ వాస్తవాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే ‘ఎక్‌ఫ్రాసిస్ అనే ప్రక్రియ తెలుగు పద్యసాహిత్యానికి కొత్తది’ అనే వాక్యం పునరాలోచనకి అర్హమయినదని అనిపించక మానదు.
రాజా రవివర్మ కళాఖండాలకు, సెట్టి లక్ష్మీనరసింహంగారు రచించిన చిత్రమాలికలు ఇంకొక ఉదాహరణ. చిత్రమాలికలు శీర్షికగా ఆ గ్రంథంలో ఉన్న నాలుగు చిత్రమాలికలని పరిచయం చేస్తూ ఆంధ్ర సాహిత్యపరిషత్పత్రికలో రాజేశ్వరి వ్యాసం, సారంగ ఏప్రిల్ 8, 2015 సంచికలో పి. మోహన్ గారి వ్యాసం- రంగుల భోజనం… గొంతులో వీణలు! చదవదగినవి. రాజా రవివర్మకృతమయిన చిత్రపటాల్లో ఒక్కొక్క చిత్రాన్ని చూస్తున్నప్పుడు, ఒక్కొక్క విధమయిన భావావేశం కలిగిందనీ, ఆ భావపరంపరల సమీకరణమే తన చిత్రమాలికలని సెట్టి లక్ష్మీనరసింహంగారు తన గ్రంథానికి పీఠికలో చెప్తారు. రాజేశ్వరి తమ వ్యాస ప్రారంభంలో చెప్పిందాని ప్రకారం రాజా రవివర్మ చిత్రాలకు ప్రేరణ మన కావ్యాల్లో/పురాణాల్లో/ఇతిహాసాల్లో చిత్రీకరించబడిన కొన్ని సన్నివేశాలు; వాటి వలన చిత్రకారుడికి దృశ్యమానమయిన పాత్రల రూపురేఖల, పరిసరాల వర్ణనలు. ఈ కారణం వలన, ఆ కవనభాగాలు కృతులు, వాటి ఆధారంగా గీసిన రాజా రవివర్మ చిత్రాలు వాటికి అనుకృతులు అవుతాయి. అందుకనేమో, పి. మోహన్ తమ వ్యాసంలో సెట్టి లక్ష్మీనరసింహంగారి చిత్రమాలికలు రాజా రవివర్మగారి చిత్రాలకి అనువాదాలు అని అన్నది.
తెలుగు పత్రికల్లో ఇప్పుడు వస్తున్న కొన్ని కవితలు వాటికి గీసిన బొమ్మలతో వెలుగులోకి వస్తున్నాయి. వీటిలో, కవితలో ఉన్న భావాన్ని వివరించే వాటిని మాత్రమే అనుకృతులుగా అంగీకరించాలి. మిగిలినవాటిని అలంకారాలుగానే భావించాలి. కొన్ని అంతర్జాల పత్రికలు భావసారూప్యం ఉన్న చిత్రాలనీ, ఛాయాచిత్రాలనీ అంతర్జాలంలో అన్వేషించి, వాటిని తమ పత్రికల్లో కవితలకి అనుసంధానిస్తున్నాయి. ఈ చిత్రాలని గీసినవారూ, ఛాయాచిత్రాలని తీసినవారూ కృతిని చదివి, దానితో ప్రేరణ పొందినవారు అయి ఉంటే తప్ప, భావసామ్యత ఉన్నదనే ఒక్క కారణం వల్ల, ఎక్‌ఫ్రాసిస్ నిర్వచనంలో వీటిని అనుకృతులనలేము.