రవికి చిన్నప్పటినుంచి తెలివైనవాడని పేరుంది. అతనికి లొంగని ప్రశ్న లేదు, అతను గెలవని పరీక్ష లేదు. అతనికి తీరని కోరిక లేదు. తన జీవితమంతా ఒక దిగ్విజయ యాత్రగా సాగిపోతుందనుకున్న రవికి అనుకోని అడ్డంకి ఎదురయింది. కొడుకు అనూప్‌ని బళ్ళో వెయ్యడంతో వచ్చింది చిక్కంతా. (‘బళ్ళో వెయ్యడం’ అనేది వాళ్ళమ్మ నుడికారం. ఎంత ఏరి కోరి చేసుకున్నా, ఆమె అచ్చ తెలుగుతనం రవికి అప్పుడప్పుడు బాధాకరంగానే ఉంటుంది.)
మూడేళ్ళు రాగానే వాడి చదువు సమరం మొదలవతుందనుకున్న రవి అమెరికాలో ‘ఎల్కేజీ’, ‘యుకేజీ’ అనే పదాలకు అర్ధం లేదని తెలుసుకుని షాకయిపోయాడు.
“కిండర్ గార్డెన్ లో జేరడానికి అయిదేళ్ళు నిండేవరకు కూర్చోవాలా? ఎంత టైం వేస్టు!” అని తిట్టుకున్నా, ఆ తిట్లు ఎవరికి చెందాలో తెలియక ఏమీ ప్రభావం చూపించలేకపోయాయి. ఒకటి రెండు ‘ప్రీస్కూల్స్’ అనబడే వాటిని చూసినా, వాటిలో ఆటలకున్న ప్రాముఖ్యత చదువుకి లేదని తెలుసుకుని కృంగిపోయాడు. రవి అభిప్రాయంలో చదువంటే ఒక నిరంతర కృషి. అందులో పడితే ఇక మిగతా ప్రపంచాన్ని మరిచిపోవాలి. దృష్టి ఇంకే విషయాలమీదకీ ప్రసరించకూడదు.
అయితే, కిండర్ గార్డెన్ కోసం నిరీక్షించే సమయం వృధా అవకుండా, ఇంట్లోనే అనూప్‌కి ఏబీసీడీలు చదవడం , రాయడం నేర్పమని తన భార్య రాజ్యలక్ష్మికి ఆదేశించాడు. కానీ, ఆమె ఒక రోజు వాణ్ణి కూర్చోబెట్టుకుని బాపూగారి అఆఇఈల పుస్తకం చూపిస్తూ పట్టుబడడంతో రవికి రాజ్యం మీద కూడా నమ్మకం సన్నగిల్లి పోయింది. ఇక తానే పూనుకుని రోజూ కొడుకుకి నర్సరీ రైమ్స్ బట్టీ పెట్టించడంలోనూ, ఎక్కాలు వల్లె వేయించడంలోనూ నిమగ్నమయ్యాడు. అయిదేళ్ళు నిండేసరికి ఇంత చదువూ ఇంట్లోనే చదివేస్తే, ఇక కిండర్ గార్డెనేమిటి, ఏకంగా ఒకటో క్లాసులోనో, ఆ మాటకొస్తే రెండో క్లాసులోనో చేర్చుకుంటారని రవికి గాఢనమ్మకం కలిగింది.
ఇంతలో ఎదురు చూస్తున్న ఆ శుభ దినం రానే వచ్చింది. స్కూలు రెజిస్ట్రేషన్ కాగితాల్లో మిగతా ప్రశ్నలతో బాటు, ఇంట్లో ముఖ్యంగా ఏ భాష మాట్లాడతారన్న ప్రశ్నకి రాజ్యం తెలుగని రాసేసింది. దాంతో మీ పిల్లవాడికి ఇంగ్లీషు పరిఙ్ఞానమెంతో ముందుగానే పరీక్షించాలంటూ స్కూలునుంచి వచ్చిన ఉత్తరువు చూసి మండిపడ్డాడు రవి.
“అసలు నువ్వా ఫారంలో ఇంగ్లీషు అని రాయకుండా తెలుగనెందుకు రాశావు?” అని రాజ్యం మీద ఇంతెత్తున లేచాడు.
“మీరేకదండీ మన ఇంట్లో మన భాషా, మన సంస్కృతీ నిలబెట్టేందుకే ముఖ్యంగా నన్ను పెళ్ళి చేసుకున్నానని చెప్తూంటారు?” అన్నది రాజ్యం అమాయకంగా.
“నేనేమంటే మాత్రమేం? అవన్నీ ఆ స్కూలువాళ్ళకి చెప్పాలా?” అని విసుక్కున్నాడు రవి. ఈ అసందర్భపు నిందారోపణకి ఓర్చుకుని రాజ్యం, “పోనీలెండి, ఇప్పుడేమయింది? వాడికి ఇంగ్లీషుకూడా వచ్చు కదా?” అని సర్దబోయింది.
“మనమంటే సరా? మళ్ళీ వాడికి అనవసరమయిన పరీక్ష!” అని అప్పటినుంచీ, స్కూలు వాళ్ళు అడగబోయే ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలో, తన ఇంగ్లీషు ఙ్ఞానాన్నంతా ఎలా ప్రదర్శించాలో అనూప్‌కి నూరిపొయ్యడం మొదలుపెట్టాడు రవి. తన విద్యారణరంగానుభవమంతా కాచి వడబోసిన కిటుకులూ, చేయాల్సిన కసరత్తులూ బోధించాడు. ఈ కఠినమైన preparationతో ఏ చీకూ చింతా లేకుండా ఆడుతూ పాడుతూ తిరిగే అనూప్ కాస్తా బెదురుగొడ్డులా తయారయ్యాడు.
పరీక్ష రోజున కుర్చీలో ముడుకుపోయి కూర్చున్న అనూప్ మూర్తీభవించిన tensionలా ఉన్నాడు. పరీక్షించే టీచర్ అనూప్‌ని నెమ్మదిగా బుజ్జగించి, సంభాషణ లోకి దింపింది. కానీ ఎంత సేపూ, పార్కుకి వెళతావా, ఏమి ఆటలాడతావు లాంటి పోచికోలు కబుర్లూ, కథలు చెప్పటం, బొమ్మలు చూడడం లాంటి పనికిమాలిన ప్రక్రియలూ తప్ప, తను ఆశించిన ప్రశ్నలేమీ రాకపోవడంతో, ఇక రవి కల్పించుకోక తప్పలేదు.
“మా వాడికి పెద్ద పెద్ద మాటలన్నిటికీ స్పెల్లింగులు తెలుసు. వింటారా?” అని అనూప్ కేసి తిరిగి, “ఒరేయ్! అంబ్రెల్లాకి స్పెల్లింగ్ చెప్పరా,” అని ఆదేశించాడు.
“ఆ అంబ్రెల్లా, యు ఎం బి ఆర్ ఇ ఎల్ ఎల్ ఏ,” అని ఠక్కున చెప్పేశాడు అనూప్.
రవి మొహం ఆనందంతో వెలిగి పోయింది. “ఆఁ. ఇక కాటర్ పిల్లర్ స్పెల్లింగ్ చెప్పరా,” అన్నాడు.
“కాటార్ పిల్లర్. సీ, ఏ, టీ, ఈ, ఆర్… పీ… ఐ, ఎల్, ఎల్… ఏ… ఆర్,” కొంచెం నట్టుతూనే పూర్తి చేశాడు అనూప్.
రవికి కొంచెం చిరాకు వేసింది. “సరే. వీడికి multiplication tablesకూడా తెలుసు. వినండి,” అని చెప్పి, “ఆరో ఎక్కం చెప్పరా,” అన్నాడు అనూప్‌తో.
అనూప్ ధైర్యంగానే మొదలుపెట్టాడు. “సిక్స్ టైంస్ వన్ ఇస్ సిక్స్, సిక్స్ టైంస్ టూ ఇస్ ట్వెల్వ్, సిక్స్ టైంస్ త్రీ ఇస్… ఐటీన్, సిక్స్ టైంస్ ఫోర్ ఇస్… ట్వంటీ ఫోర్, సిక్స్ టైంస్ ఫైవ్…”
“ఇంక ఆగు,” అని రవి ఆదేశించి, “పదమూడో ఎక్కం చెప్పు,” అన్నాడు. అనూప్ కొంచెం బిత్తరపోయి చూసి, మొదలుపెట్టబోయేంతలో, టీచర్ కలుగ జేసుకుంది. “ముఫ్ఫై అంటే అర్ధం ఏమిటి?” అనడిగింది. గుడ్లప్పగించి చూస్తూండిపోయాడు ఆనూప్. రవికి కొంచెం చిరాకు వేసింది. “ముఫ్ఫైకి అర్ధం ఏమిటి? అదొక మాట. అంతే,” అన్నాడు.
“మీరు ఊరుకోండి,” టీచర్ రవికి వార్నింగిచ్చి, మళ్ళీ అనూప్ వైపు తిరిగింది. “సిక్స్ టైమ్స్ ఫోర్ ట్వంటీ ఫోరయితే సిక్స్ టైమ్స్ ఫైవ్ థర్టీ ఎందుకయింది?” అనడిగింది. అనూప్ ఉలుకూ పలుకూ లేకుండా చూస్తూ ఉండిపోయాడు.
“కాటర్ పిలర్ని ఎప్పుడైనా చూశావా?” మళ్ళీ అనూప్‌ని అడిగింది టీచర్. అనూప్ తండ్రి వేపొకసారీ, టీచర్ వైపొకసారీ అయోమయంగా చూసి, బెల్లం కొట్టిన రాయిలా ఊరుకుండిపోయాడు.
“పోనీ అంబ్రెలాని ఎప్పుడయినా వాడావా నువ్వు?” అనడిగిందావిడ. మళ్ళీ అనూప్ నుంచి సమాధానమేదీ రాకపోయేసరికి, రవి అసహనం పట్టలేకపోయాడు.
“మీరు అసలు సంగతి వదిలేసి వేరే చొప్పదంటు పశ్నలన్నీ అడుగుతున్నారేమిటి?” అని అడిగాడు కినుక ధ్వనించే స్వరంతో.
టీచర్ సూటిగా రవి వైపు చూస్తూ, “మీరు మాటలకి స్పెలింగులు నేర్పించారు గానీ, ఆ మాటలకి అర్ధాలేమిటో మీ అబ్బాయికి నేర్పించలేదు. అర్ధాలు తెలీని పదాలు నేర్చుకొని ఏమిటి ప్రయోజనం? అలాగే ఎక్కాలు బట్టీ పట్టించారుగానీ, గుణింతంలో ఒక అంకెకీ రెండో అంకెకీ పరస్పర సంబంధమేమిటో మీరు నేర్పించలేదు. కాబట్టి మీ అబ్బాయి ఎక్కాలు వల్లించగలడే తప్ప, గుణింతం గురించి అవగాహనేం లేదు,” అని చెప్పింది.
రవికి మండుకొచ్చింది. ‘అవగాహనేమిటి? నా బొంద!’ అని లోలోపల గొణుక్కుని, “ఎక్కాలు వల్లె వేస్తూంటే అవగాహన దానంతటదే వస్తుంది,” అన్నాడు.
“వస్తే రావచ్చు, రాక పోనూ పోవచ్చు. కేవలం వల్లె వేసినంతమాత్రాన అర్ధం అయిందని చాలా మంది తల్లితండ్రులు పొరబడుతూంటారు. ఇక్కడ మా పద్ధతిలో ముందు అవగాహన ఏర్పడేందుకు కృషి చేస్తాం. అదొస్తే ఆ తర్వాత మిగతా పరిఙ్ఞానమంతా దానంతటదే వస్తుంది,” అని వివరించింది టీచర్. వస్తున్న కోపాన్నణుచుకుంటూ రవి, “సరే, ఈ సిద్ధాంతాలన్నిటినీ వదిలేయండి. ఇప్పుడు వీడి స్టాండర్డు చూశారు కదా? రెండో క్లాసులో వేసుకుంటారా?” అనడిగాడు.
“లేదు. కిండర్ గార్డెన్ లోనే చేర్పిస్తాం,” అన్నది టీచర్ తడుముకోకుండా. “ఏమిటీ?” అంటూ రెచ్చిపోయాడు రవి. “వాడి స్టాండర్డ్కీ ఆ కిండర్ గార్డెన్ పిల్లల స్టాండర్డుకీ ఎంత తేడానో చూడలేదా మీరు? వాళ్ళతో కూర్చోబెట్టి వీడిక్కూడా ఏబీసీడీలు నేర్పించడం మొదలుపెడ్తే, వీడి మేధస్సు దెబ్బతిని, చదువులో ఉన్న చురుకుదనమంతా చప్పబడిపోయి, వాడి తెలివంతా గోవిందా అవుతుంది.”
“మీరు భయపడుతున్న వేవీ జరగవు. చదువుకోవడం అంటే, కేవలం పుస్తకాలు బట్టీ పెట్టడం కాదు. ప్రపంచ ఙ్ఞానం కూడా సంపాదించి, సాటివాళ్ళతో కలిసి మెలిసి ఉండడం కూడా నేర్చుకోవాలి. అలా అయితేనే పెద్దయ్యాక సంఘంలో ఒక productive memberగా తయారవుతాడు మీ అబ్బాయి,” ఓర్పుగా వివరించింది టీచర్.
“అవన్నీ మేము ఇంట్లో నేర్పుకోవచ్చు. వాటికోసం స్కూలెందుకు? స్కూలు కర్తవ్యం పాఠ్యపుస్తకాలు పిల్లలకి బోధించడమే,” అన్నాడు రవి.
టీచరు కూడా సహనాన్ని కోల్పోతున్నట్టు కనిపించింది. “మిస్టర్ రవీ! మీ అబ్బాయిచేత మీరు ఎక్కాలూ, స్పెల్లింగులూ వల్లె వేయించినా, అతని మానసిక పెరుగుదల మాత్రం అయిదేళ్ళ కుర్రాడిది లాగే ఉంది. కాబట్టి తన వయసు పిల్లలతో కలిసి మెలిసి చదువుకోవడమే అతని భవిస్యత్తుకూ, మానసిక వికాసానికీ మంచిది. కిండర్ గార్డెన్ లోనే చేర్పించండి,” అని ఆ మీటింగుని ముగించింది టీచర్.