రవికి చిన్నప్పటినుంచి తెలివైనవాడని పేరుంది. అతనికి లొంగని ప్రశ్న లేదు, అతను గెలవని పరీక్ష లేదు. అతనికి తీరని కోరిక లేదు. తన జీవితమంతా ఒక దిగ్విజయ యాత్రగా సాగిపోతుందనుకున్న రవికి అనుకోని అడ్డంకి ఎదురయింది. కొడుకు అనూప్‌ని బళ్ళో వెయ్యడంతో వచ్చింది చిక్కంతా. (‘బళ్ళో వెయ్యడం’ అనేది వాళ్ళమ్మ నుడికారం. ఎంత ఏరి కోరి చేసుకున్నా, ఆమె అచ్చ తెలుగుతనం రవికి అప్పుడప్పుడు బాధాకరంగానే ఉంటుంది.)
మూడేళ్ళు రాగానే వాడి చదువు సమరం మొదలవతుందనుకున్న రవి అమెరికాలో ‘ఎల్కేజీ’, ‘యుకేజీ’ అనే పదాలకు అర్ధం లేదని తెలుసుకుని షాకయిపోయాడు.
“కిండర్ గార్డెన్ లో జేరడానికి అయిదేళ్ళు నిండేవరకు కూర్చోవాలా? ఎంత టైం వేస్టు!” అని తిట్టుకున్నా, ఆ తిట్లు ఎవరికి చెందాలో తెలియక ఏమీ ప్రభావం చూపించలేకపోయాయి. ఒకటి రెండు ‘ప్రీస్కూల్స్’ అనబడే వాటిని చూసినా, వాటిలో ఆటలకున్న ప్రాముఖ్యత చదువుకి లేదని తెలుసుకుని కృంగిపోయాడు. రవి అభిప్రాయంలో చదువంటే ఒక నిరంతర కృషి. అందులో పడితే ఇక మిగతా ప్రపంచాన్ని మరిచిపోవాలి. దృష్టి ఇంకే విషయాలమీదకీ ప్రసరించకూడదు.
అయితే, కిండర్ గార్డెన్ కోసం నిరీక్షించే సమయం వృధా అవకుండా, ఇంట్లోనే అనూప్‌కి ఏబీసీడీలు చదవడం , రాయడం నేర్పమని తన భార్య రాజ్యలక్ష్మికి ఆదేశించాడు. కానీ, ఆమె ఒక రోజు వాణ్ణి కూర్చోబెట్టుకుని బాపూగారి అఆఇఈల పుస్తకం చూపిస్తూ పట్టుబడడంతో రవికి రాజ్యం మీద కూడా నమ్మకం సన్నగిల్లి పోయింది. ఇక తానే పూనుకుని రోజూ కొడుకుకి నర్సరీ రైమ్స్ బట్టీ పెట్టించడంలోనూ, ఎక్కాలు వల్లె వేయించడంలోనూ నిమగ్నమయ్యాడు. అయిదేళ్ళు నిండేసరికి ఇంత చదువూ ఇంట్లోనే చదివేస్తే, ఇక కిండర్ గార్డెనేమిటి, ఏకంగా ఒకటో క్లాసులోనో, ఆ మాటకొస్తే రెండో క్లాసులోనో చేర్చుకుంటారని రవికి గాఢనమ్మకం కలిగింది.
ఇంతలో ఎదురు చూస్తున్న ఆ శుభ దినం రానే వచ్చింది. స్కూలు రెజిస్ట్రేషన్ కాగితాల్లో మిగతా ప్రశ్నలతో బాటు, ఇంట్లో ముఖ్యంగా ఏ భాష మాట్లాడతారన్న ప్రశ్నకి రాజ్యం తెలుగని రాసేసింది. దాంతో మీ పిల్లవాడికి ఇంగ్లీషు పరిఙ్ఞానమెంతో ముందుగానే పరీక్షించాలంటూ స్కూలునుంచి వచ్చిన ఉత్తరువు చూసి మండిపడ్డాడు రవి.
“అసలు నువ్వా ఫారంలో ఇంగ్లీషు అని రాయకుండా తెలుగనెందుకు రాశావు?” అని రాజ్యం మీద ఇంతెత్తున లేచాడు.
“మీరేకదండీ మన ఇంట్లో మన భాషా, మన సంస్కృతీ నిలబెట్టేందుకే ముఖ్యంగా నన్ను పెళ్ళి చేసుకున్నానని చెప్తూంటారు?” అన్నది రాజ్యం అమాయకంగా.
“నేనేమంటే మాత్రమేం? అవన్నీ ఆ స్కూలువాళ్ళకి చెప్పాలా?” అని విసుక్కున్నాడు రవి. ఈ అసందర్భపు నిందారోపణకి ఓర్చుకుని రాజ్యం, “పోనీలెండి, ఇప్పుడేమయింది? వాడికి ఇంగ్లీషుకూడా వచ్చు కదా?” అని సర్దబోయింది.
“మనమంటే సరా? మళ్ళీ వాడికి అనవసరమయిన పరీక్ష!” అని అప్పటినుంచీ, స్కూలు వాళ్ళు అడగబోయే ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలో, తన ఇంగ్లీషు ఙ్ఞానాన్నంతా ఎలా ప్రదర్శించాలో అనూప్‌కి నూరిపొయ్యడం మొదలుపెట్టాడు రవి. తన విద్యారణరంగానుభవమంతా కాచి వడబోసిన కిటుకులూ, చేయాల్సిన కసరత్తులూ బోధించాడు. ఈ కఠినమైన preparationతో ఏ చీకూ చింతా లేకుండా ఆడుతూ పాడుతూ తిరిగే అనూప్ కాస్తా బెదురుగొడ్డులా తయారయ్యాడు.
పరీక్ష రోజున కుర్చీలో ముడుకుపోయి కూర్చున్న అనూప్ మూర్తీభవించిన tensionలా ఉన్నాడు. పరీక్షించే టీచర్ అనూప్‌ని నెమ్మదిగా బుజ్జగించి, సంభాషణ లోకి దింపింది. కానీ ఎంత సేపూ, పార్కుకి వెళతావా, ఏమి ఆటలాడతావు లాంటి పోచికోలు కబుర్లూ, కథలు చెప్పటం, బొమ్మలు చూడడం లాంటి పనికిమాలిన ప్రక్రియలూ తప్ప, తను ఆశించిన ప్రశ్నలేమీ రాకపోవడంతో, ఇక రవి కల్పించుకోక తప్పలేదు.
“మా వాడికి పెద్ద పెద్ద మాటలన్నిటికీ స్పెల్లింగులు తెలుసు. వింటారా?” అని అనూప్ కేసి తిరిగి, “ఒరేయ్! అంబ్రెల్లాకి స్పెల్లింగ్ చెప్పరా,” అని ఆదేశించాడు.
“ఆ అంబ్రెల్లా, యు ఎం బి ఆర్ ఇ ఎల్ ఎల్ ఏ,” అని ఠక్కున చెప్పేశాడు అనూప్.
రవి మొహం ఆనందంతో వెలిగి పోయింది. “ఆఁ. ఇక కాటర్ పిల్లర్ స్పెల్లింగ్ చెప్పరా,” అన్నాడు.
“కాటార్ పిల్లర్. సీ, ఏ, టీ, ఈ, ఆర్… పీ… ఐ, ఎల్, ఎల్… ఏ… ఆర్,” కొంచెం నట్టుతూనే పూర్తి చేశాడు అనూప్.
రవికి కొంచెం చిరాకు వేసింది. “సరే. వీడికి multiplication tablesకూడా తెలుసు. వినండి,” అని చెప్పి, “ఆరో ఎక్కం చెప్పరా,” అన్నాడు అనూప్‌తో.
అనూప్ ధైర్యంగానే మొదలుపెట్టాడు. “సిక్స్ టైంస్ వన్ ఇస్ సిక్స్, సిక్స్ టైంస్ టూ ఇస్ ట్వెల్వ్, సిక్స్ టైంస్ త్రీ ఇస్… ఐటీన్, సిక్స్ టైంస్ ఫోర్ ఇస్… ట్వంటీ ఫోర్, సిక్స్ టైంస్ ఫైవ్…”
“ఇంక ఆగు,” అని రవి ఆదేశించి, “పదమూడో ఎక్కం చెప్పు,” అన్నాడు. అనూప్ కొంచెం బిత్తరపోయి చూసి, మొదలుపెట్టబోయేంతలో, టీచర్ కలుగ జేసుకుంది. “ముఫ్ఫై అంటే అర్ధం ఏమిటి?” అనడిగింది. గుడ్లప్పగించి చూస్తూండిపోయాడు ఆనూప్. రవికి కొంచెం చిరాకు వేసింది. “ముఫ్ఫైకి అర్ధం ఏమిటి? అదొక మాట. అంతే,” అన్నాడు.
“మీరు ఊరుకోండి,” టీచర్ రవికి వార్నింగిచ్చి, మళ్ళీ అనూప్ వైపు తిరిగింది. “సిక్స్ టైమ్స్ ఫోర్ ట్వంటీ ఫోరయితే సిక్స్ టైమ్స్ ఫైవ్ థర్టీ ఎందుకయింది?” అనడిగింది. అనూప్ ఉలుకూ పలుకూ లేకుండా చూస్తూ ఉండిపోయాడు.
“కాటర్ పిలర్ని ఎప్పుడైనా చూశావా?” మళ్ళీ అనూప్‌ని అడిగింది టీచర్. అనూప్ తండ్రి వేపొకసారీ, టీచర్ వైపొకసారీ అయోమయంగా చూసి, బెల్లం కొట్టిన రాయిలా ఊరుకుండిపోయాడు.
“పోనీ అంబ్రెలాని ఎప్పుడయినా వాడావా నువ్వు?” అనడిగిందావిడ. మళ్ళీ అనూప్ నుంచి సమాధానమేదీ రాకపోయేసరికి, రవి అసహనం పట్టలేకపోయాడు.
“మీరు అసలు సంగతి వదిలేసి వేరే చొప్పదంటు పశ్నలన్నీ అడుగుతున్నారేమిటి?” అని అడిగాడు కినుక ధ్వనించే స్వరంతో.
టీచర్ సూటిగా రవి వైపు చూస్తూ, “మీరు మాటలకి స్పెలింగులు నేర్పించారు గానీ, ఆ మాటలకి అర్ధాలేమిటో మీ అబ్బాయికి నేర్పించలేదు. అర్ధాలు తెలీని పదాలు నేర్చుకొని ఏమిటి ప్రయోజనం? అలాగే ఎక్కాలు బట్టీ పట్టించారుగానీ, గుణింతంలో ఒక అంకెకీ రెండో అంకెకీ పరస్పర సంబంధమేమిటో మీరు నేర్పించలేదు. కాబట్టి మీ అబ్బాయి ఎక్కాలు వల్లించగలడే తప్ప, గుణింతం గురించి అవగాహనేం లేదు,” అని చెప్పింది.
రవికి మండుకొచ్చింది. ‘అవగాహనేమిటి? నా బొంద!’ అని లోలోపల గొణుక్కుని, “ఎక్కాలు వల్లె వేస్తూంటే అవగాహన దానంతటదే వస్తుంది,” అన్నాడు.
“వస్తే రావచ్చు, రాక పోనూ పోవచ్చు. కేవలం వల్లె వేసినంతమాత్రాన అర్ధం అయిందని చాలా మంది తల్లితండ్రులు పొరబడుతూంటారు. ఇక్కడ మా పద్ధతిలో ముందు అవగాహన ఏర్పడేందుకు కృషి చేస్తాం. అదొస్తే ఆ తర్వాత మిగతా పరిఙ్ఞానమంతా దానంతటదే వస్తుంది,” అని వివరించింది టీచర్. వస్తున్న కోపాన్నణుచుకుంటూ రవి, “సరే, ఈ సిద్ధాంతాలన్నిటినీ వదిలేయండి. ఇప్పుడు వీడి స్టాండర్డు చూశారు కదా? రెండో క్లాసులో వేసుకుంటారా?” అనడిగాడు.
“లేదు. కిండర్ గార్డెన్ లోనే చేర్పిస్తాం,” అన్నది టీచర్ తడుముకోకుండా. “ఏమిటీ?” అంటూ రెచ్చిపోయాడు రవి. “వాడి స్టాండర్డ్‌కీ ఆ కిండర్ గార్డెన్ పిల్లల స్టాండర్డుకీ ఎంత తేడానో చూడలేదా మీరు? వాళ్ళతో కూర్చోబెట్టి వీడిక్కూడా ఏబీసీడీలు నేర్పించడం మొదలుపెడ్తే, వీడి మేధస్సు దెబ్బతిని, చదువులో ఉన్న చురుకుదనమంతా చప్పబడిపోయి, వాడి తెలివంతా గోవిందా అవుతుంది.”
“మీరు భయపడుతున్న వేవీ జరగవు. చదువుకోవడం అంటే, కేవలం పుస్తకాలు బట్టీ పెట్టడం కాదు. ప్రపంచ ఙ్ఞానం కూడా సంపాదించి, సాటివాళ్ళతో కలిసి మెలిసి ఉండడం కూడా నేర్చుకోవాలి. అలా అయితేనే పెద్దయ్యాక సంఘంలో ఒక productive memberగా తయారవుతాడు మీ అబ్బాయి,” ఓర్పుగా వివరించింది టీచర్.
“అవన్నీ మేము ఇంట్లో నేర్పుకోవచ్చు. వాటికోసం స్కూలెందుకు? స్కూలు కర్తవ్యం పాఠ్యపుస్తకాలు పిల్లలకి బోధించడమే,” అన్నాడు రవి.
టీచరు కూడా సహనాన్ని కోల్పోతున్నట్టు కనిపించింది. “మిస్టర్ రవీ! మీ అబ్బాయిచేత మీరు ఎక్కాలూ, స్పెల్లింగులూ వల్లె వేయించినా, అతని మానసిక పెరుగుదల మాత్రం అయిదేళ్ళ కుర్రాడిది లాగే ఉంది. కాబట్టి తన వయసు పిల్లలతో కలిసి మెలిసి చదువుకోవడమే అతని భవిస్యత్తుకూ, మానసిక వికాసానికీ మంచిది. కిండర్ గార్డెన్ లోనే చేర్పించండి,” అని ఆ మీటింగుని ముగించింది టీచర్.
పట్టువదలని రవి, కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో గూడా విచారిద్దామనుకున్నాడు గానీ, అప్పటికే వాటిలో చాలా వాటికి admissions పూర్తయిపోవడం మూలానా, వాళ్ళు కూడా అనూప్‌ని కిండర్ గార్డెన్ లోనే చేర్చుకుంటామనడంతోనూ, అతను ఓటమినంగీకరించక తప్పలేదు. అయిష్టంగానే అనూప్‌ని కిండర్ గార్డెన్ లో చేర్పించాడు.
“ఇక్కడ వీడేం నేర్చుకుంటాడు? ఉన్న చదువంతా మర్చిపోయి, అమెరికన్ బడుధ్ధాయిల్లాగా తయారవుతాడు,” అని రాజ్యం దగ్గిర విసుక్కున్నాడు.
“అమెరికన్లందరూ బడుధ్ధాయిలెందుకయ్యారు? వాళ్ళలో మాత్రం తెలివిగల వాళ్ళూ, బాగా చదువుకున్న వాళ్ళూ లేరా ఏమిటి?” అని అనునయించబోయింది రాజ్యం.
కానీ రవి చప్పరించేశాడు. “ఆఁ, నా మొహం. అంత తెలివి గల వాళ్ళయితే మన లాంటి వాళ్ళనెందుకు అరువు తెచ్చుకుంటారు?”
రవి ధోరణి చూస్తే రాజ్యానికి కూడా కొంచెం ఆందోళన కలిగింది. “అయితే వీడిని తీసుకుని నేను ఇండియా వెళ్ళిపోనా? చక్కగా అక్కడి బళ్ళోనే వాడిని వేయచ్చు.”
గతుక్కుమన్నాడు రవి. కొడుకు భవిష్యత్తు కోసం భార్యను వదులుకునేందుకు సిద్ధంగా లేడు మరి. “ఆఁ ఎందుకులే, లేనిపోని ఖర్చు. అసలు అక్కడ స్కూళ్ళల్లో వీడిని చేర్చుకుంటారో లేదో కూడా అనుమానమే. మనం ఇప్పటికే చాలా అశ్రధ్ధ చేశాం. ఇక్కడికొచ్చినందుకు ఇక్కడి పధ్ధతి పాటించకతప్పదు. ఇదీ కొన్నాళ్ళు చూద్దాంలే.” అన్నాడు.
భర్త మాటలు రాజ్యానికేమీ ఊరట కలిగించలేదు. అనూప్ చదువు ఎలా సాగుతుందో, తమ స్వార్ధానికి వాడి భవిష్యత్తు బలి అవుతుందా అని దిగులుపడింది. కానీ, స్కూల్లో చేరిన వారంరోజుల లోపునే ఆనూప్ లో మళ్ళీ హుషారూ, చురుకుదనం తిరిగి రావడం, రోజూ ఇంటికి రాగానే స్కూల్లో జరిగినదల్లా ఉత్సాహంగా తలితండ్రులతో చెప్పడం చూసేసరికి, రాజ్యలక్ష్మి మనసు కొంచెం కుదుటపడ్డది.
రవి ఆఫీసు గొడవల్తో చిరాకుగా ఉన్నాడు.
“Innovative thinking కావాలిట వీడికి. ఆసలు thinking ఏమిటో తెలిస్తేగా అది innovative అవునో కాదో తెలిసేందుకు!” అంటూ విరుచుకుపడ్డాడొక రోజు.
“ఎవరి మాట?” అనడిగింది రాజ్యం.
“వాడే. మా మానేజర్ గాడే.”
“అదేమిటండీ. మానేజరన్నాక కొంచెం గౌరవమిచ్చి మాట్లాడాలికదా?” మానేజర్ ని పట్టుకుని ‘వాడు’ అనడం నచ్చలేదు రాజ్యానికి.
ఇంకా రెచ్చిపోయాడు రవి. “ఏం చూసివ్వాలి గౌరవం? నాకంటే ఎక్కువ చదివాడా? ఎక్కువ అనుభవమున్నదా? కేవలం వాడి american accent కోసం వాడిని మానెజర్ని చేశారు.” ఇది పాత పాటే కాబట్టి ఆ విషయాన్నిక వదిలేసింది రాజ్యం.
“ఇంతకీ ఏం జరిగింది?” రవి కూడా కొంచెం సర్దుకున్నాడు. “ఏముందీ? ఏదో మాకు market share పడిపోతోందట. అందుకని కొత్త productని కనిపెట్టాలిట. దానికి ఇప్పుడు మేము చేస్తున్న పనేమీ పనికిరాదట. అసలు మా ఆలోచన క్రమమే సరిగ్గా లేదట. అందుకని ఏదో innovativeగా ఆలోచిస్తే తప్ప లాభం లేదంటూ పెద్ద లెక్చరిచ్చాడు ఇవ్వాళ.”
“ఇన్నొవేటివ్ అంటే?” సందేహంగా అడిగింది రాజ్యం.
“నా బొంద. వాడికి తెలిసేడిస్తేగదా! ఇక్కడిదంతా ఒక ఫాషనైపోయింది. ఇన్నేళ్ళుగా పనికొచ్చిన పధ్ధతులేవీ ఇప్పుడు నచ్చవుట. ఇప్పుడు కొత్తగా ఏదో పొడిచెయ్యాలని వీడి ఉద్దేశం. మనం అనూప్ స్కూల్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళన్నారు కదా, మేం పిల్లలచేత బట్టీ పెట్టించం, వాళ్ళ creativityని పెంపొందిస్తామని? ఇదీ అల్లాంటిదే,” అన్నాడు విసుగ్గా.
ఇంతలో అనూప్ అక్కడకొచ్చాడు. “ఇవ్వాళ ఒక కొత్త riddle నేర్చుకున్నాను,” అన్నాడు వాళ్ళ అమ్మ ఒళ్ళోకి గెంతుతూ.
“రిడిల్ అంటే?” రాజ్యం అడిగింది.
“Riddle అంటేనా?” అంటూ ఎల్లా చెప్పాలో తెలియక అనూప్, ఇదిగో!” అని, “what’s full of holes but still holds water?” అనడిగాడు.
“వాట్స్ ఫుల్ ఆఫ్ హోల్స్ బట్ స్టిల్ హోల్డ్స్ వాటర్?” అని మళ్ళీ మననం చేసుకుంది రాజ్యం. “ఏమిటబ్బా? నాకేం తట్టటం లేదు,” అని రవి వేపు చూసి, “మీకు తెలుసా?” అనడిగింది. రవి ఇంకా చిరాగ్గా ఉన్నాడు. “ఏమిటి తెలిసేది? ఏదో పిచ్చి ప్రశ్న!” అని విసుక్కున్నాడు.
“ఫుల్ అఫ్ హోల్స్ అంటే చిల్లులు చిల్లులుగా ఉండటం కదా? దాంట్లో నీళ్ళెలా ఉంటాయి?” అని రాజ్యం పైకే తర్కిస్తూంటే, ఉత్సాహంగా గంతులు వాశాడు అనూప్, “నీకు తెలియదూ! నీకు తెలియదూ!” అని అరుస్తూ.
“అవును, నిజమే. నాకు తెలియదు,” ఒప్పేసుకుంది రాజ్యం. “ఏమిటి మరి నువ్వు చెప్పు” అనడిగింది.
“A sponge!” అంటూ పడీ పడీ నవ్వాడు అనూప్.
“స్పాంజా? కానీ స్పాంజిలో చిల్లులేవీ?” అన్నది రాజ్యం. వెంటనే వంటింట్లోకి వెళ్ళి సింకు దగ్గర స్పంజిని తెచ్చి ఆమె కళ్ళ ముందర ఆడించాడు ఆనూప్.
“ఇవన్నీ చిల్లులేకదా? కానీ నువ్వేమైనా తుడవాలంటే దీన్నే వాడతావు. అప్పుడా నీళ్ళన్నీ దీంట్లోకే వెళతాయి,” అంటూ మళ్ళీ పక పకా నవ్వాడు.
రాజ్యానిక్కూడా ముచ్చటవేసి “భలే బావుందే ఇది! రిడిల్ అంటే పొడుపు కథన్నమాట. నా చిన్నప్పుడు నేనూ బోలెడు నేర్చుకున్నాను.” అని చెప్పింది. అమ్మకి కూడా రిడిల్స్ వచ్చనేటప్పటికి అనూప్‌కి కుతూహలం పుట్టుకొచ్చింది.
“ఏం riddles నేర్చుకున్నావు నువ్వు?” అనడిగాడు. “ఉండు, ఒక్క క్షణం ఉండు,” అంటూ ఆలోచనలో పడ్డది రాజ్యం. రెండు నిముషాల తర్వాత, “ఆఁ, ఇదొక మంచిది,” అంటూ చదివింది.
“తండ్రి గర గర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు మనవలు బొమ్మరాళ్ళు ఏమిటదీ?”
తెల్ల మొహం వేసేశాడు అనూప్. “ఏమో నాకు తెలియదు.”
రవి వేపు తిరిగింది రాజ్యం. “మీకు తెలుసా? మీరు చెప్పగలరా?”
“ఏమిటీ?” వింతగా చూశాడు రవి. “తండ్రి గర గరా? అదేమిటి? తల్లి పీచు పీ… ఏమిటిదీ? అసలు దీనికి అర్ధం పర్ధం లేదే!”
“అయ్యో అది చాలా ప్రసిధ్ధి చెందిన పొడుపు కథండీ. మీకు తెలియదా? మీరు విప్పలేరా?”
“సరే, ఏమిటో చెప్పు,” అన్నాడు రవి, తనకు తెలియదని ఒప్పుకోకుండానే.
“పనసపండూ!” విజయగర్వంతో అంది రాజ్యం.
“పనసపండా? పనసపండుకీ, నువ్విప్పుడు చెప్పిందానికీ ఏమిటి సంబంధం?”
“ఎందుకు సంబంధం లేదూ? పనసపండు పైన గరగరగా ఉంటుంది, లోపల చూస్తే పీచు పీచుగా ఉంటుంది. కాబట్టి అవి రెండూ తల్లి తండ్రులు. కానీ అవన్నీ తీసేస్తే, లోపల మంచి పనస తొనలుంటాయు. అవి బిడ్డలన్నమాట”
“మరి మనవలు బొమ్మరాళ్ళేమిటి? “ అన్నాడు రవి అడ్డొస్తూ.
“తొనల లోపల గింజలుంటాయి కదా? వాటిని బొమ్మ రాళ్ళన్నారు. బిడ్డల లోపలున్నాయి కాబట్టి వాటిని మనవలన్నారు,” అని వివరించింది రాజ్యం.
“సరేలే. ఇదంతా ఏదో గందరగోళంగా ఉన్నది. ఇంత కష్టమైనవి చిన్నవాడికేం తెలుస్తాయి?” అన్నాడు రవి. “అయినా పనసపళ్ళ గురించి అమెరికాలో పుట్టిపెరిగిన పిల్లాడికేం తెలుస్తాయి? అందుకే వాడు చెప్పలేక పోయాడు,” అని దబాయించాడు.
“నిజమే,” ఒప్పుకుంది రాజ్యం. రెండు మూడు క్షణాలు ఆలోచించి చెప్పింది “సరే. ఇప్పుడు నేనొక పొడుపు కథ చెప్తాను. అది అందరికీ తెలుస్తుంది. అనూప్‌కి కూడా తెలుస్తుంది – “కిట కిట తలుపులు కిటారు తలుపులు వేసిన మూసిన చప్పుడు కావు.”
“ఏ తలుపులు వేసినా, మూసినా చప్పుడు కావు. ఇక్కడ అన్నిటికీ బాగా oil వేస్తారు,” అని లేచి వెళ్ళి గది తలుపు వేసీ, మూసీ చూపించాడు రవి. కొంచెం ఉడుక్కుంది రాజ్యం.
“అదికాదు. పొడుపుకథ అంటే దాంట్లో ఏదో గూడార్థం ఉందన్నమాట. నీకు తెలుసా, అనూప్?” అంటూ కొడుకువైపు తిరిగింది. తెలియదంటూ తల అడ్డంగా ఆడించాడు అనూప్.
“లేదు, తెలుస్తుంది, మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించు,” అని మళ్ళీ చదివింది రాజ్యం, “కిట కిట తలుపులు, ఏం? కిటారు తలుపులు, అర్ధం అయిందా?” అనడిగింది, కొడుకు మొహంలోకి చూస్తూ. అనూప్ మళ్ళీ అయోమయంగా చూశాడు.
“వేసిన, మూసిన చప్పుడు కావు.”
కనురెప్పలు అల్లల్లాడించాడు అనూప్. “ఏమో తెలియదు.”
పక పకా నవ్వేసింది రాజ్యం. “ఇప్పుడు నువ్వు చేశావే, అదే!”
“ఏమిటది?” అనడిగాడు రవి కుతూహలంగా.
“నేను వీడిని నీకు తెలుసా అనడిగితే వాడేం చేశాడూ?”
“ఏం చేశాడు?” అనడిగాడు రవి.
“ అలా కళ్ళ రెప్పలు ఆడించాడా లేదా?”
“ఆఁ, ఆడిస్తే?”
“అవే మరి తలుపులు. కిటకిట తలుపులు, కిటారు తలుపులు – కళ్ళకు రెప్పలు తలుపుల్లాంటివే కదా? కాని, అవెన్ని సార్లు వేసి మూసినా, ఏమీ చప్పుడు చెయ్యవు. కాబట్టి కనురెప్పలు అని దీనర్ధం.”
“హే! భలే బావుంది!” అంటూ చప్పట్లు కొట్టాడు అనూప్.
అమ్మ ప్రోత్సాహం మూలానేమో, అనూప్ స్కూల్లో కొత్త రిడిల్స్ నేర్చుకున్నప్పుడల్లా వాటిని ఇంట్లో వెంటనే చెప్పడం అలవాటు చేసుకున్నాడు. ఆ రోజు రవి ఇంటికి రాగానే, “Daddy, what has four legs, a head, and leaves?” అనడిగాడు.
“ఏమిటో నువ్వే చెప్పు,” అన్నాడు రవి మందకొడిగా.
“A table!” అని నవ్వాడు అనూప్. ఆ విజయోత్సాహంతో, మళ్ళీ, “What has four fingers and a thumb, but is not alive?” అనడిగాడు.
“అబ్బ! ఏమిట్రా నీ గోల!” అని విసుక్కున్నాడు రవి.
చినబుచ్చుకున్న అనూప్, “a glove,” అని నెమ్మదిగా గొణిగాడు.
ఓదార్పుగా కొడుకు తల నిమిరి రాజ్యం, “ఎందుకు పాపం వాణ్ణలా కసురుకున్నారు?” అని రవినడిగింది.
“లేకపోతే ఏమిటీ nuisance?అర్ధం పర్ధం లేకుండా ఈ riddles? వాటికేమయినా logic ఉందా?”
“ఎందుకు లేదూ? జాగ్రత్తగా ఆలోచించాలంతే.”
“ఈ పిచ్చి ప్రశ్నలకు ఆలోచించడం కూడా ఒకటి!” ఎకసెక్కంగా అన్నాడు రవి.
కొంటెగా నవ్వింది రాజ్యం. “మీక్కావలింది తర్కవాదమైతే, ఇది వినండి,”
“పర్వతశ్రేష్ట పుత్రిక పతి విరోధి
యన్న పెండ్లాము అత్తను గన్నతల్లి
పేర్మిమీరిన ముద్దుల పెద్దబిడ్డ!
సున్న మించుక తేగదే సుందరాంగి!”
“Nonsense!” మండిపడ్డాడు రవి.
దాంతో రాజ్యానికి రోషమొచ్చింది. “నాన్సెన్సెందుకయింది? పర్వత శ్రేష్టపుత్రిక అంటే పార్వతి. ఆమె పతి అంటే శివుడు. అతని విరోధి అంటే మన్మధుడు. అతని అన్న అంటే బ్రహ్మ …”
“మన్మధుడి అన్న బ్రహ్మా? నేనెప్పుడూ వినలేదు,” అని అడ్డొచ్చాడు రవి.
“ఎందుక్కాదు? మన్మధుడు విష్ణుమూర్తి కొడుకు. బ్రహ్మ కూడా విష్ణుమూర్తి బొడ్డులోంచి పుట్టాడు కదా, మన్మధుడి ముందరే? అందుకే అతని అన్న.” రవి దగ్గరనుంచి సమాధానమేమీ లేకపోవటంతో మళ్ళీ తన వివరణ అందుకొంది రాజ్యం.
“సరే! బ్రహ్మ వరకూ వచ్చాము కదా? బ్రహ్మ పెళ్ళాం అంటే సరస్వతి. ఆమె అత్త అంటే లక్ష్మీదేవి. ఆమె తండ్రి సముద్రుడు. అతని పెద్ద కూతురు అంటే జ్యేష్టాదేవి. అంటే దరిద్ర దేవతన్నమాట. అంత మర్యాదగా ఆ బావగారు తన మరదలిని పిలిచి సున్నం తెమ్మని ఆడిగాడన్నమాట!”
“ఈ బావగారూ మరదలూ ఎక్కడనుంచి వచ్చారు?”
“ఓ, నేను చెప్పటం మర్చిపోయాను. ఇలా అని ఒక బావగారు తన మరదలి పిల్లతో అన్నాడుట.”
“Feminisits రాని ముందర రోజుల్లో అనుంటాడు. అందుకే బతికిపోయాడు.”
మళ్ళీ కొంటెగా నవ్వింది రాజ్యం. “ఫెమినిజమనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందనుకుంటున్నారా? ఆ మరదలు ఏం సమాధానం చెప్పిందో వినండి మరి,” అంది.
“శతపత్రంబుల మిత్రుని
సుతు జంపిన వాని బావ సూనుని మామన్
సతతము దాల్చెడు నాతని
సుతువాహన వైరివైరి! సున్నంబిదిగో”
రవి పరధ్యానంగా ఉండి ఏమీ సమాధానమీయలేదు. అది గమనించకుండానే తన ధోరణిలో చెప్పుకు పోయింది రాజ్యం.
“శత పత్రంబులంటే కలువ పువ్వులు. వాటి మిత్రుడు సూర్యుడు. అతని కొడుకు కర్ణుడు. అతనిని చంపిన వాడు అర్జునుడు. అర్జునుడి బావ కృష్ణుడు. ఆతని సూనుడు, అంటే కొడుకు, మన్మధుడు. మన్మధుడి మామ చంద్రుడు. ఆ చంద్రుణ్ణి తలలో పెట్టుకునేవాడు శివుడు. అతని కొడుకు వినాయకుడు. వినాయకుడి వాహనము ఎలుక. దానికి వైరి, అంటే శత్రువు, పిల్లి. పిల్లికి శత్రువు కుక్క. కాబట్టి, ఓ కుక్కా! ఇదిగో నీ సున్నం! అని బదులిచ్చిందావిడ. ఆవిడేం తక్కువ తినలేదు.”
నవ్వుతూ రవివైపు చూసిన రాజ్యం ఆశ్చర్యపోయింది. అతనీ లోకంలోనే ఉన్నాట్టు లేడు. “ఏం? ఆ లాజిక్కు మీకు నచ్చలేదా? చాలా పకడ్బందీగా ఉన్నది కదా?” అని రవిని చిన్నగా తట్టి అడిగింది.
అప్పటికి తెప్పరిల్లుకున్నాడు రవి. “ఎంత పకడ్బందీగా ఉంటేనేం? అయినా ఇప్పుడు నాక్కావాల్సింది logic కాదు.”
“అదేమిటి? ఇప్పుడేగా పాపం అనూప్ రిడిల్సులో లాజిక్కు లేదన్నారు?”
అసహనంగా లేచాడు రవి. “మా మానేజర్ గాడికి logic పనికిరాదట. ఏదో out of the box thinking కావాలట.”
“అంటే?” అర్ధం కాలేదు రాజ్యానికి.
“ఏమో ఎవడికి తెలుసు? మళ్ళీ ఏదో కొత్త fad.”
“బాక్సంటే పెట్టె కదా? పెట్లో ఆలోచన ఏమిటి?”
“అది తెలుస్తే ఇక చిక్కేముందీ? అయినా వాడి మాటలకి అర్ధం పర్ధం ఏముండవు.”
“ఎందుకుండవు? లేకపోతే అతను మానేజరెల్లా అవుతాడు?”
“తెల్ల తోలు మూలాన,” తీవ్రంగా అన్నాడు రవి. అతని ఆగ్రహానికి తెల్లబోయిన రాజ్యం ఇక మాటలు పెంచలేదు. కానీ రాత్రి పడుకోబోయినప్పుడన్నది.
“మీరేమీ అనుకోకపోతే ఒకటి చెప్తాను. వింటారా?”
“ఏమిటి?” నిరాసక్తంగా అడిగాడు రవి.
“అదే. ఆ అవుట్ ఆఫ్ ద బాక్సు అంటే ఏమిటనే ఆలోచిస్తున్నా. ఒకవేళ బాక్సంటే మీ ఆఫీసని అర్ధమేమో?”
“ఏమిటీ?” వింతగా చూశాడు రవి. మళ్ళీ వెంటనే, “అయినా ఆ పిచ్చివాడి మాటలు పట్టించుకోవద్దని చెప్పానుగా?” అన్నాడు.
“కాదు. మీరే అన్నారు కదా ఒకసారి, మీ ఆఫీసులో గదులుండవనీ, ఏదో అట్ట పెట్ట్టెలో కూర్చుని పనిచేసినట్టుంటుందనీ?”
“అట్ట పెట్టెలేమిటి? ఓహో, నీ ఉద్దేశం cubicles అనా?”
“ఆఁ, అవే. ఒకవేళ మీ మానేజరు ఉద్దేశం ఆఫీసు బయటకి వెళ్ళి ఆలోచించమనేమో?”
ఆమె మాటలని తేలిగ్గా తీసిపారేశాడు రవి. “మా ఆపీసులోని సరుకులూ, కాయితాలూ, చివరకి మా ఆలోచనలు కూడా కంపెనీకి చెందుతాయనీ, వాటిమీద మాకేమి హక్కులూ లేవనీ లక్షా తొంభై కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టించుకున్నవాళ్ళు, వాళ్ళ కనుసన్నలలో లేకుండా పని చెయ్యమని చెప్తారా?”
“అదికాదండీ, ఎప్పుడూ ఉండే చోట్లోంచి బయటపడి, కొత్త పరిసరాలలోకి వెళితే, ఒక్కోసారి కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి.”
నవ్వేశాడు రవి. “భలే analysis చెప్పావుగానీ, అనవసరంగా వాడి మాటల గురించి మధనపడకు. నాలుగు రోజుల తర్వాత వాడే మర్చిపోతాడిదంతా.”
ఇక ఆ ప్రసంగం అంతటితో ఆపక తప్పలేదు రాజ్యానికి. కానీ రవి మానేజర్ తన మాటలని మర్చిపోయిన సూచనలేమీ కనిపించలేదు. రోజు రోజుకీ రవిలో చిరాకు పెరిగిపోతున్నా, చేసేందుకేమీ తోచలేదు రాజ్యానికి. అనూప్ ముద్దుమాటలతోనైనా ఏదేనా మార్పొస్తుందేమోనని రవి ఎదుటగా వాడితో కబుర్లు సాగించేది. కానీ ఏమీ ఫలితం ఉన్నట్టు కనిపించలేదు.
యధాప్రకారం ఆ రోజు కూడా స్కూల్లో విన్న రిడిల్సు ఏవో చెప్పడం మొదలుపెట్టాడు అనూప్.
“How many letters are in the alphabet?” అనడిగాడు.
“Twenty six” అని ఠక్కున చెప్పేశాడు రవి.
“హా! హా! కాదు, కాదు,” అని గంతులు వేశాడు అనూప్.
“వీళ్ళు చెప్పే చదువులు ఇలా ఏడిశాయన్నమాట. ఆల్ఫబెట్లో ఎన్ని అక్షరాలున్నాయో గూడా తెలియదు,” అని వ్యాఖ్యానించాడు రవి.
“అవును, ఇంగ్లీషులో ఇరవై ఆరక్షరాలే కదా? కాదంటున్నావేం?” అనడిగింది రాజ్యం అనూప్‌ని.
“కాదు, కాదు!” అలా గెంతుతూనే అన్నాడు అనూప్.
“అయితే నువ్వు చెప్పు, How many letters are in the alphabet?”అని చాలెంజి చేశాడు రవి.
“eleven!” అంటూ పకాలుమన్నాడు అనూప్.
రాజ్యానికి కూడా ఈ సమస్య అంతుచిక్కినట్టులేదు. “పదకొండు అక్షరాలు ఎలా వచ్చాయిరా?” అని అనూప్ ని అడిగింది.
“అవును, పదొకొండే! టీ, ఎచ్, ఈ, ఏ, ఎల్, పీ, ఎచ్, ఏ, బీ, ఈ, టీ! మొత్తం పదోకొండు అక్షరాలే కదా!” అని మళ్ళీ నవ్వు లంకించుకున్నాడు అనూప్.
“ఓరినీ! భలేగా బుట్టలో వేశావే మమ్మల్నీ!” అంటూ రాజ్యం కూడా శ్రుతి కలిపింది.
రవికి మాత్రం చిరాకు ఇంకా అధికమయింది. “చాల్లే! అలాటి చెత్త స్కూల్లో వేసిందికాక, వాళ్ళ తప్పుడు తడకల పాఠాలన్నీ సమర్ధిస్తున్నావు!” అని రాజ్యం మీద విసుక్కున్నాడు.
“కాదండీ, అది చాలా చమత్కారంగా ఉంది కదా? మనం పూర్తి ఆల్ఫబెట్ అనుకుంటాం కానీ, వాడి ఉద్దేశం ఆ రెండు మాటలనే. చాలా తెలివిగా ఉంది,” అని మెచ్చుకుంది రాజ్యం.
“తెలివి కాదు, అతి తెలివి. ఇక నుంచీ ఈ riddles ఇంటికి మోసుకురాకు! వాటివల్ల అనవసరంగా బుర్ర పాడైపోతుంది!” అని హెచ్చరించాడు రవి.
కానీ రాజ్యం దీనికి ఒప్పుకోలేదు. “అదేం లేదు. ఇలాంటి పొడుపు కథల మూలాన చాలా చాలా మంచి విషయాలు కూడా తెలుసుకోవచ్చు.”
“ఏం మంచి విషయాలు? నేన్నమ్మను,” అన్నాడు రవి. “మనవాళ్ళందరూ ఇలాంటివేం లేకుండానే గొప్పవాళ్ళయ్యారు. ఇలాంటివేవీ మన ఇంటా వంటా లేవు,” అన్నాడు పైగా.
“మహాభారతంలో కూడా పొడుపు కథలున్నాయి, తెలుసా?” చిలిపిగా నవ్వింది రాజ్యం.
“ఎక్కడ? ఏమిటి?” రెట్టించాడు రవి.
“మరి యక్షప్రశ్నలంటే ఏమనుకున్నారు? అవి పొడుపు కథల్లాంటివే. వాటినుంచి ఉపయోగపడే విషయాలెన్నో తెలుసుకోవచ్చు.”
“ఏమిటా ఉపయోగపడే విషయాలు?”
“ఆఁ, వినండి మరి. నిద్రించికూడా కన్నుమూయనిదేది?”
“ఏమిటి?” బింకంగా అన్నాడు రవి.
“చేప. అవి కళ్ళు మూసుకోకుండానే నిద్రపోతాయి, తెలుసా? అలాగే ఇంకోటి. పుట్టి కూడా చేతనత్వంబు లేనిదేదీ?”
“ఊఁ, ఏమిటి?”
“గుడ్డూ!”
“ఆఁ? గుడ్డా?”
“అవును, ఎగ్గన్నమాట. అది పుట్టిన తర్వాత కూడా, కదిలిక ఉండదు కదా!”
“ఊఁ,” గొణిగాడు రవి.
“ఇంకొకటి అడుగుతాను చెప్పండి. రూపం ఉండి, హృదయం లేనిదేమిటీ?”
“ఇదిగో, కవిత్వం చెప్పకు. నాకిప్పుడు మూడ్ లేదు.”
“కవిత్వం కాదండీ. ఇది కూడా ప్రకృతిలోని విషయమే.”
“ఊఁ, ఏమిటి?”
“రాయి.”
“ఈ రాళ్ళూ, రప్పలూ గురించి ఎవడిక్కావాలి? నా project సంగతి అంతుబట్టక నేను చస్తూంటే! కాస్త స్థిమితంగా ఆలోచిద్దామంటే, ఇంటికి రాగానే ఈ వెధవ riddles గొడవొకటి! వాటికేమైనా ప్రయోజనమా, పాడా?” విసుక్కున్నాడు రవి.
“ఎందుకండీ, వాటిని ఊరికే అలా తిట్టుకుంటారూ? మీకు సమాధానం తెలియకపోవడం మూలానే కదా ఇంత కోపం?”
“అంటే? నాదంతా అహంకారం అంటావా?”
“అసలు వీటి కిటుకేమిటో తెలుసా?” అనునయంగా ఆదిగింది రాజ్యం. “వాటిల్లో పైపై అర్ధాలు కాకుండా, లోపల ఏవో గూడార్ధం పట్టుకోవాలన్నమాట. అంటే మామూలుగా అలవాటైన గాడిలో ఆలోచించకుండా, వేరే రకంగా ఆలోచిస్తే, అప్పుడు బోధపడుతాయి. చూడండి,” అని మళ్ళీ అనూప్ ని పిలిచి, “ఏదమ్మా, నీకు ఇంకొక రిడిలు వస్తే చెప్పు?” అనడిగింది బుజ్జగింపుగా.
ఆ మాటలతో అనూప్ కి మళ్ళీ కొంత ఉత్సాహం కలిగింది. “What do you get twice in a week, once in a year, but never in a day?” అని అడిగాడు.
“ఏమో తెలియదు,” అన్నాడు రవి, తొందరగా ఓటమి ఒప్పేసుకుంటే వీడి బెడద పోతుందికదా అనుకుని.
“The letter e!” నవ్వాడు అనూప్ గర్వంగా.
“హె! ఏమిట్రా నీ మొహం!”
“ఇదిగో, అదే నే వద్దనేదె,” కల్పించుకుంది రాజ్యం. “కొంచెం ఆలోచిస్తే అదే తెలుస్తుంది,” అంటూ భృకుటి ముడిచింది. ఒక నిముషంలో నవ్వేసి, “ఆఁ! తెలిసిపోయింది!” అన్నది.
“ఏం తెలిసింది?” విసుగ్గా అడిగాడు రవి.
“చూడండి,” అని ఆ పదాలను ఒక కాగితం మీద రాసింది రాజ్యం. “చూశారా? ఇ అనే అక్షరం వీక్ లో రెండు సార్లు వస్తుంది, అదే ఇయర్ అనే మాటలో ఒక్క సారే వస్తుంది. కానీ డే అనే మాటలో అసలు రానేరాదు. అదీ వాడు చెప్తోంది.”
విస్తుపోయి చూశాడు రవి. కిండర్ గార్డెన్ పిల్లలలో ఉన్నంత మేధాశాక్తి కూడా తనకు లేదనుకుంటే నమ్మశక్యం కాలేదు. సిగ్గు, అవమానం కూడా ముంచుకొచ్చాయి. కానీ ఒప్పుకోక తప్పేలా లేదు. రాజ్యం చెప్పిన మాటే నిజమేమో? తన ఆలోచనా విధం మార్చుకోవాలేమో? లేకపోతే బొత్తిగా అయిదేళ్ళ పిల్లలకి ఆటప్రాయమైన సమస్యలు కూడా తనకు లొంగబడక పోవడమేమిటీ? తికమకగా అక్కడనుంచి వెళ్ళిపోయాడు. రాత్రంతా ఈ విషయం గురించే మధనపడుతూ, చాలా ముభావంగా ఉన్నాడు. తనూ అనూప్ కలిసి అతన్ని అనుకోకుండా కించపరిచామేమోనని బాధపడసాగింది రాజ్యం. కానీ, మళ్ళీ ఆ విషయం ఎత్తడానికి ధైర్యం చిక్కలేదు.
మర్నాడు రవి ఇంటికి వచ్చీ రాగానే రాజ్యాన్ని పిలిచాడు. “నేనొక పొడుపు కథ చెప్తాను. విప్పగలవేమో చూడు.”
“మీరా? ఎక్కడ చదివారు?”
“ఎక్కడా చదవలేదు. నేనే సృష్టించాను,” అన్నాడు రవి గర్వంగా.
“మీరు సృష్టించారా?! అమ్మ బాబోయ్! అయితే తప్పకుండా వినాల్సిందే! చెప్పండి.”
మెల్లిగా చెప్పాడు రవి:
“ఆకాశంలో తిరిగే మేఘ సందేశం కాదు
నీటిలో తిరిగే హంస సందేశమూ కాదు
అంతరిక్షంలో తిరిగే అనేక చందమామల ద్వారా పంపే
ఈ సందేశం అందుకో.”
“ఆఁ?” ఏమీ అంతు పట్టలేదు రాజ్యానికి. “మళ్ళీ చెప్పండి.” చెప్పాడు రవి. ఇంకా ఏమీ తెలియలేదు రాజ్యానికి. “ఏమయ్యుంటుందబ్బా?” ఇప్పుడు విజయగర్వంతో చూడడం రవి వంతైంది. రాజ్యం దాన్ని కాగితం మీద రాసుకున్నాకూడా ఏమీ బోధ పడలేదు.
“ఓడిపోయానని ఒప్పుకుంటావా?” చిరునవ్వు చిందిస్తూ అడిగాడు రవి.
“ఉండండి. ఇంకొంచెం టైమివ్వండి,” అని అప్పటికి దాటవేసింది రాజ్యం.
రాత్రి వంటయింది. భోజనాలూ అయ్యాయి. అనూప్ ని నిద్ర పుచ్చిన తర్వాత, పదే పదే ఆ పొడుపు కథ రాసుకున్న కాయితాన్ని మననం చేసుకుంది రాజ్యం. ఏమీ ఫలితం కనిపించలా.
ఇంక ఉగ్గబట్టుకోలేక రవి, “నేను చెప్పనా?” అనడిగాడు.
“వద్దు, వద్దు,” అంటూ మళ్ళీ శోధనలో పడిపోయింది రాజ్యం.
పొడుపు కథల్లో ఇంత పాండిత్యమున్న భార్యనే పడగొట్టగలిగినందుకు రవికి ఆనందంగానూ ఉంది, ఒకవైపు భయంగాకూడా ఉంది, తానేదైనా పొరపాటు చేశానేమోనని. మళ్ళీ ఆ పొడుపు కథని తనే విప్పి, రాజ్యం నుంచి ప్రశంసలందుకోవాలని కూడా ఉంది. అందుకే, “చెప్పేస్తాను, చెప్పేస్తాను,” అంటూ వేధించడం మొదలుపెట్టాడు.
“ఉండండి,” అంటూ మళ్ళీ కాగితం వైపు చూస్తూ ఒక్కొక్క అక్షరమే కూడబలుక్కుంటూ చదివింది రాజ్యం. రవి ముళ్ళమీదున్నాట్టుగా, కాలు కాలిన పిల్లిలా, ఇలాంటి ఉపమానాలనేకం స్ఫురించేటట్టుగా, తిరుగుతున్నాడు.
ఒక నిట్టూర్పుతో కుర్చీలో వెనక్కు చేరబడింది రాజ్యం. ఆమెనే ఆత్రంగా చూస్తున్న రవి, “చెప్పేయనా?” అనడిగాడు ఉత్కంఠతో.
“సరే, చెప్పండి బాబూ, మీరే గెలిచారు,” అన్నది రాజ్యం నవ్వుతో.
ఉత్సాహం పట్టలేకపోయాడు రవి. “అయితే విను. ఆకాశంలో తిరిగే మేఘసందేశం కాదు – అర్ధమయిందా?”
“అయింది.”
“నీటిలో తిరిగే హంస సందేశమూ కాదు – ఇదీ అర్ధమయిందా?”
“ఆఁ, ఆఁ, అదేమి కాదో శుభ్రంగా అర్ధమైంది.”
“అంతరిక్షంలో తిరిగే అనేక చందమామలద్వారా -”
“అదే – ఆ అనేక చందమామలేమిటో అర్ధం అవలేదు. చందమామొక్కటే కదా!”
“ఆఁ, అదే కిటుకు. చందమామంటే ఏమిటి?”
“ఏమిటి? రాత్రి పూట ఆకాశంలో వెలుగిచ్చేది.”
“ఆ వెలుగు ఎక్కడ నుంచి వస్తోంది?”
“ఎక్కడ నుంచేమిటి? దాంట్లోంచే వస్తోంది.”
“తప్పు, తప్పు, అది సూర్యుడి నుంచి వస్తోంది.”
“సరే ఒప్పుకున్నాను.”
“సరే ఇంకా చందమామ విశేషాలేమిటి?
“ఏమున్నాయి? అది శివుడి తలలో ఉంటుంది. వినాయకుడుని చూసి నవ్వాడు. తారతో … సరే తారతో ఏదో వ్యవహారం నడిపాడు -”
“అబ్బ! ఆ పురాణాలలోకం నుంచి బయట పడతావా?” అసహనంగా అడ్దొచ్చాడు రవి. “ఈ పుక్కిటి కథలు ఆపేసి, ఖచ్చితంగా తెలిసిన నిజాలు – అంటే proven facts – మాత్రం చెప్పు.”
“అది ప్రసిధ్ధికెక్కిన పిల్లల పత్రిక,” అన్నది రాజ్యం రవిని ఉడికించాలని. కానీ అతను ఆ విసురుని పట్టించుకోలేదు. అసలు గమనించలేదు కూడా.
“చందమామ గురించిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అది భూమికి ఉపగృహం. భూమి చుట్టూ తిరుగుతూంటుంది.”
“అయితే?” అన్నది రాజ్యం ఇంకా అర్ధం కాక.
“అదొక్కటేనా భూమి చుట్టూ తిరిగేది?”
“మరి? ఇంకేమున్నాయి?”
“ఇప్పుడు ఒకే గాడిలో ఆలోచిస్తున్నదెవరో?” వెక్కిరించాడు రవి. “Come on, Think! అమెరికాలో కూర్చుని ఆంధ్రాలోని TV programs ఎలా చూస్తున్నావు?”
“డిష్ టీ వీ లో.”
“అబ్బా, ఆ Diష్ లోకి ఎక్కడ నుంచి వస్తున్నాయి?”
“ఎక్కడ్ నుంచేమిటి? శాటెల్లైట్లోంచి.”
“ఇక చెప్పమ్మడూ, satelliteని మీ అచ్చ తెలుగులో ఏమంటారు?”
“ఉపగ్రహం,” అంటూనే నోరావలించేసింది రాజ్యం.
ఛాతీ పొంగించి, నిటారుగా నిలబడి, గర్వంగా చూశాడు రవి. “ఇప్పుడర్ధమయిందా, అనేక చందమామలంటే ఏమిటో?”
“ఆంటే అంతరిక్షంలో తిరిగే అనేక చందమామలు అంటే శాటెల్లైట్సు అన్నమాటా! సరే, అది అర్ధమయింది కానీ, వాటి ద్వారా పంపే ఈసందేశమేమిటీ?”
నవ్వాడు రవి. “మళ్ళీ పప్పులో కాలేశావు. వాటి ద్వారా పంపే ఈసందేశం కాదు,” అని, పొడుపుకథ రాసి ఉన్న కాగితం తీసుకుని, ఆఖరి లైన్లలోని అక్షరాలని వేలితో చూపిస్తూ చదవడం మొదలు పెట్టాడు.
“అనేక చందమామల ద్వారా పంపే ఈ – సందేశం అందుకో. అర్ధమయిందా? ఈసందేశం అని ఒక్క మాటలా చదవకూడదు. ఈ – సందేశం అని రెండు మాటలుగా విరగ్గొట్టి చదవాలి.”
“ఈ మెయిలా?!” సంభ్రమంగా అరచింది రాజ్యం.
“correct, e-mail,” విలాసంగా చూస్తూ నవ్వాడు రవి. “మొత్తానికి సాధించావు.”
కానీ రాజ్యం ఒప్పుకోలేదు. “నేను సాధించిందేముంది లెండి. ఆంతా మీరే విడమర్చి చెప్పాల్సొచ్చింది,” అంది మెప్పుదలగా చూస్తూ. “మొదటిసారే భలే మంచి ఫొడుపు కథని సృష్టించారే! పాపం చాలా కష్టపడ్డారనుకుంటాను.”
“ఏం లేదు.”
“మరి? ఎలా సాధించారబ్బా?”
నవ్వుతూ రాజ్యాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు రవి. “నువ్వు చెప్పినట్టే. పాత గాడిలో పడి ఆలో చించకుండా, కొత్త ధృక్పధం నుంచి నరుక్కొచ్చాను.”
“అలాగా? మంచి ఫలితమే వచ్చిందే!”
“దీన్నేమంటారో తెలుసా?”
“దేన్ని?”
“ఇలా ఆలోచించడాన్ని.”
“ఊఁ హూఁ.”
“దీన్నే out of the box థింకింగంటారు,” చిరునవ్వుతో అన్నాడు రవి. మనసులో రేపు తన మానేజర్ కి తన తడాఖా ఎలా చూపిస్తాడో ఊహించుకుంటూ.