ప్రచురణకి వచ్చే రచనల గురించి

From: The Chief Editor

Subject: ప్రచురణకి వచ్చే రచనలని పరిష్కరించడానికి సూత్రాలు

మైడియర్ మామూలు సంపాదకులూ:

మిగతా మీరంతా కష్టపడి పనిచేస్తారనీ, ముఖ్యునిగా ఖ్యాతి మాత్రం నాకనీ నేను పబ్లిక్‌లో అప్పుడప్పుడూ అనే మాట పూర్తిగా నిజం కాదని మీకు తెలుసు. ఈ మధ్య మీకు పనితో పాటూ చీవాట్లు కూడా ఎక్కువ అవుతున్నాయని నాకెందుకో అనిపిస్తున్నది. నా బాధ్యతగా, మీ పని సులువు చేయడం కోసంగా కొన్ని సూత్రాలను ఈ మెమోతో జత చేస్తున్నాను. వీటిని అమలు చేస్తే చీవాట్ల మాటెలావున్నా శ్రమ ఖచ్చితంగా తగ్గుతుందని నా స్వానుభవం. ఈ మెయిల్‌ మీకోసం మాత్రమే. నా అనుమతి లేకండా దీనిని ఎవరికీ చూపించవద్దు, మీ స్పౌసులకూ కూడా! ఇది మీ కళ్ళకు మాత్రమే. ఎస్సెమ్మెస్సులో చెప్పాలంటే FYEO.

-ము. సం.


అయాచిత రచయితలు

మనకి అయాచితంగా (unsolicited) రచనలు పంపే వారు చాలామంది ఉన్నారు. ఈ రచయితలు తెలుగు భాషలో మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు. ఒక్క మాటలో చెప్పవలసిన విషయాన్ని మూడు వాక్యాల నిడివికి పెంచగల సమర్థులు. ఇటువంటి రచనలని పరిష్కరించడానికి సులువైన చిట్కాలు ఏమీ లేవు (అప్పుడప్పుడూ పూర్తిగా మనమే తిరిగిరాయడం కాకండా) కొన్నినియమాలు తప్ప.

  1. ఈ అయాచిత రచయితలు కొంతమంది “ఆమె చెప్పింది,” అన్న వాక్యం సూటిగా చెప్ప డానికి బదులు, “ఆమె ఉదాసీనంగా, ప్రబలంగా, వాగ్విభవంగా, కర్కశంగా చెప్పింది,” అని అనవసరమైన క్రియావిశేషణాలని జోడించి రాస్తారు. కథలో ఒక పాత్ర, సందర్భానుసారంగా ఏమాటలు అనాలో రాయలేని వాళ్ళు రచనావ్యాసంగం వదిలిపెట్టి మరొక లాభసాటి వ్యాపారంలోకి దిగటం మంచిది. ఒక పాత్ర ఒకే సమయంలో ఇన్ని రకాల చిత్తక్షోభలు వ్యక్తపరచడం అసాధ్యం. ఒక్క యన్‌. టీ. రామారావు గారికే అది సాధ్యం; ఇప్పుడు ఆయన లేరు. అందుచేత, పరిష్కర్తలుగా మీరు ఆ వాక్యాన్ని, “ఆమె చెప్పింది”, అని మార్చడం సబబు.
  2. కొన్ని కథలలో పాత్రల సంభాషణలు క్లిషేలుగా స్టీరియోటిపికల్ గా ఉండటం కద్దు. అటువంటి వాటిని సవరించడానికి నియమం సున్న. మీమనసుకి క్లిషేగా, స్టీరియోటిపికల్ గా కనిపిస్తే, వెంటనే సదరు సంభాషణలని కత్తిరించండి.
  3. కొందరు రచయితలు, చాలా వాక్యాలు, కానీ, మరియూ అనే మాటలతో ప్రారంభిస్తారు; ఇలా మొదలుపెట్టడంలో ఏదో గొప్ప సాహితీ ప్రయోజనం ఉన్నదన్న భ్రమతో! మరియూ, కానీతో వాక్యాన్ని మొదలుపెట్టడం అప్పుడప్పుడు పరవాలేదు. కానీ, ఎల్లవేళలా పనికి రాదు. అటువంటి వాక్యాలని కత్తిరించి పరిష్కరించడం విధిగా చెయ్యాలి.
  4. ఉత్తమ పురుషలో చెప్పిన కథలు పాఠకులకి చిరాకు కలిగిస్తాయి. ముఖ్యంగా, కథ చెప్పేవాడి పేరు, రచయితపేరూ ఒకటే కాకపోతే! అటువంటి కథలు పరిష్కరించేటప్పుడు రచయిత పేరన్నా మార్చండి; లేదా, కథ చెప్పేవాడి పేరు రచయిత పేరుగా మార్చండి.
  5. కొందరు రచయితలు, ముఖ్యంగా వ్యాస రచయితలు, చెప్పిందే చెప్పుతారు. పదేపదే చెప్పుతారు. ‘ఇంతకుముందు చెప్పినట్టుగా’ అని మనకి గుర్తుచేస్తూ వెనకపేజీలో రాసింది మళ్ళీ రాస్తారు. వీళ్ళకి పాఠకుల జ్ఞాపకశక్తి మీద నమ్మకం తక్కువ. నిజం చెప్పాలంటే ఈ రచయితల ఉద్దేశంలో పునరుక్తి రచనకి పుష్ఠి కలిగిస్తుందనే నమ్మకం ఎక్కువ. విమానంలో ఫ్లైట్ అటెండెంట్ సీట్ నిలువుగా పెట్టుకోమని, ట్రే టేబుల్ మడవమనీ, సీట్ బెల్ట్ పెట్టుకోమనీ పదేపదే చెప్పడం ఎంతమంది వింటారు గనక! అలాగే ఉంటాయి వ్యాసాల్లో కొన్ని పునరుక్తులు. అందుకనే పునరుక్తి చాలా హీనమైన దోషం అంటాను. Snip repetitions mercilessly. Period. ముఖ్యంగా కవితలలో పునరుక్తి పనికిరాదు. కత్తిరించేయండి. పునరుక్తి పనికిరాదు. కత్తిరించేయండి.
  6. ఒక్కొక్కసారి కొద్దిమంది రచయితలు ఒక పాత్ర సంభాషణలో వాక్యాన్ని మధ్యలో విరిచి – insertion చేర్చి – ఆ వాక్యాన్ని పూర్తి చేస్తారు. ఉదాహరణకి ఈ వాక్యం చూడండి: “నాకు”, ఆమె అన్నది, ” ఆవకాయ తినాలని ఉన్నది”, అని. ఇటువంటి విరుపుడులు అప్పుడప్పుడు ఇంగ్లీషు వాక్యాలతో చేస్తే బాగానే ఉంటుందికానీ, తెలుగులో ఎబ్బెట్టుగా ఉంటాయి. ఇటువంటి పనులకి అసలు కారణం: ఈ రచయితలు ఇంగ్లీషులో చవకరకం రొమాన్సులు చదవడం. “నాకు ఆవకాయ తినాలని ఉన్నది”, అని ఆ వాక్యాన్ని మార్చడం సంపాదకులుగా మన కర్తవ్యం.
  7. కొన్ని కథలలో సంభాషణలు స్క్రీన్‌ ప్లే ఫక్కీలో ఉంటాయి. నాటక రచయిత నటీనటుల కోసం రాసినట్టు ఉంటాయి. ఉదాహరణకి, ఈ మధ్య ప్రచురణకి వచ్చిన కథలో ఒక భాగం చూడండి, కథావస్తువు సంగతి సరేసరి!

    “నేను బయటికి పోతున్నాను, కూరలేమైనా కావాలా?” అని అతను ఆడిగాడు.
    “ఫ్రిజ్‌ నిండా కూరలున్నాయి, ఏమీ అక్కరలే!” అని ఆవిడ సమాధానం ఇచ్చింది.
    అతను వెంటనే అన్నాడు, “మరయితే నే వెళ్ళొస్తా” అని.
    ఆవిడ వెనక్కి తిరగకండా, “మీరు గనక ఆ కొరియన్‌ కొట్టువేపుకెడితే కొత్తిమిరి కట్టలు కొనండి, అక్కడ చవక” అని అన్నది.
    “సరే” అన్నాడు అతను, చెప్పులు వేసుకుంటూ.
    “వాడిపోని కొత్తిమిరి చూసి మరీ తెండి” అని ఆవిడ అంది.
    “సరే అల్లాగేలే ” అని అన్నాడు అతను కాస్త విసుగ్గా.
    “అన్నట్టు మరిచిపోయాను. చవగ్గా ఉంటే బాగా నీళ్ళున్న ఎండుకొబ్బరికాయొకటి పట్టుకోరండి. రేపు శనివారం, దేవుడికి కొట్టాలి” అని ఆవిడ అంది.

    కొటేషనులకి అటు, ఇటూ “ఆమె అన్నది, అతను చెప్పాడు,”- ఇవి అనవసరం. వెంటనే కత్తిరించడం అవసరం.

  8. అందుకని, ఈ విధంగా, కాబట్టి, అసలు విషయం ఏమిటంటే, ఉదాహరణకి, ఇకపోతే, ఇటువంటి మాటలని అతిగా వాడడం, ముఖ్యంగా కథలలో వాడడం రచయిత అపరిపక్వతకి ఉదాహరణలు. ఇటువంటి అనవసరపు మాటలు, సందర్భానుసారంగా కత్తిరించడం ఆవశ్యకం. ఇందుకు రచయిత అనుమతి పొందడం అనవసరం.
  9. కొందరు కథారచయితలు కథని అర్థంతరంగా ఒక cryptiక్లుప్తంగా వాక్యం రాసి ముగిస్తారు. ఉదాహరణకి: “ఆమె గోడకేసి తీక్షణంగా చూస్తూ నిలబడిపోయింది”, “కళ్ళల్లో నీళ్ళు నిండి, ఆమెకి సముద్రఘోష వినపడలేదు”, “ఆమె సిగరెట్టు కాలుస్తూ నిలబడి పోయింది, వెనక్కి తిరగకండా వెళ్ళిపోతున్న అతని నీడకేసి చూస్తూ”. ఇటువంటి రచయితలు ఈ మధ్యనే ఓ. హెన్రీ కథలు చదివి బాగా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయారని ఎవరికైనా తెలిసిపోతుంది. అటువంటి ముగింపులని పరిష్కరించేటప్పుడు చాలా సటిల్‌ గా రచయితతో సంభాషించాలి. ఓ. హెన్రీ కథల్లో ముగింపులని కాపీ కొడుతున్నారని మీరు డైరెక్టుగా చెప్పకూడదు.
  10. మాటల గారడీ, అంటే ‘పన్‌’, కథల్లో ఉండకూడదు. అటువంటి చీప్ కథలని తిరస్కరించడం ఉత్తమం.
  11. అయాచిత రచయితలకి మీరు చేసే ప్రతి సవరింపూ, కత్తిరింపూ నిర్మొహమాటంగా చెప్పండి. కాకపోతే నచ్చచెప్పండి. వారు కూడా ఏమీ అనుకోరు. పైగా చెప్తే మెచ్చుకుంటారు కూడా. ఐతే, అలా ఒకటీ రెండు కథలు మనం ప్రచురించిన తర్వాత వారితో మనం ప్రవర్తించే తీరు మార్చుకోవాల్సి వుంటుంది (క్రింది పాయింట్లు చూడండి).

మనం కథలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటల్లేదనే అపోహ (ఇది అపోహ మాత్రమే) చాలామంది పాఠకులకి ఉన్నది. అందుకని, ఇక ముందునుంచీ ప్రతి సంచికలో మనం ప్రచురణకి తిరస్కరించిన రచనల సంఖ్య చెప్పడం మంచిదనే అభిప్రాయం కొంతమంది సీనియర్లు నాతో వెలిబుచ్చారు. అది అంత మంచిపని కాదు. అసలు మంచిపని కాదు. అంతే కాదు, మనం తిరస్కరించిన రచనలు ఆంధ్రాలో అచ్చు పత్రికలలోను , అమెరికాలో ఇతర వెబ్ పత్రికలలోనూ ప్రచురించబడిన వైనం మనకి తెలిసినా మనం పబ్లిగ్గా ఎవరికీ చెప్పకూడదు.


యాచిత రచయితలు

యాచిత (Solicited) రచయితలు చాలామంది ప్రిమా డొనాలు అని అనుకోవడంలో తప్పేమీ లేదు. వాళ్ళందరూ సీనియర్ రచయితలు. ఒక రచయిత సీనియర్ రచయిత ఎప్పుడవుతాడు అన్నది చాలా వివాదగ్రస్తమైన విషయం. కొందరి ఉద్దేశంలో ఒకటో రెండోకథలు, అరో పరకో కవితలూ అచ్చవంగానే, వాళ్ళు సీనియర్ రచయితలం అనే భ్రమలో ఉండటం మనకి తెలుసు. అటువంటి వాళ్ళ రచనలని పరిష్కరించడం, పంక్చుయేషన్ మార్పు చెయ్యడంతో సహా, అతి జాగ్రత్తగా చెయ్యాలి.

  1. యాచిత/సీనియర్ రచయితల్లో చాలామందికి సహనం కన్నా అహం ఎక్కువ. అందుచేత, వారితో ఉత్తరప్రత్యుత్తరాలు చేసేటప్పుడు మెలుకువ అవసరం. “మీరు రాసిన సదరు వాక్యాలు పెద్దపెద్ద పండితులకి అర్థం అవవచ్చు. సాధారణ పాఠకుడికి అవి బోధపడవు. మీ వ్యాసం/కథ/కవిత ఎక్కువమంది చదివి ఆనందించాలంటే, ఈ చిన్ని సవరణలు అవసరమేమో అని మాకనిపిస్తున్నది” అని ఆ రచయిత అహాన్ని దువ్వడం (దీనినే ఇంగ్లీషులో స్ట్రోకింగ్ అంటారు) అవసరం. మీరు చేసిన సవరణలు, ఎంత కటువైనవయినా సరే! ఈ స్ట్రోకింగ్‌కి కావలసిన అణుకువలు, మెళుకువలూ మీకు తెలియకపోతే కొన్ని బ్లాగులు చదవి (ఏ బ్లాగులు చదవాలో మీకు వేరే మెయిల్‌ లో పంపుతాను) నేర్చుకోవడం అవసరం. యాచిత రచయితలందరూ గాల్‌బ్రయిత్, నాట్ హెంటాఫ్, కె.బి, యెన్‌.వి, కె.జె., అప్ డైక్, స్టీవెన్‌ కింగ్ లలా సంపాదకులుచేసే మార్పులన్నింటినీ సహృదయతతో ఆహ్వానించరు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. Fred Allen అనీ టీవీ కమెడియన్, ఎడిటర్లు తన స్క్రిప్టు మారిస్తే ఏమన్నాడో తెలుసునా? He said, “Where were they when the damn paper was blank?”
  2. కొద్దిమంది సీనియర్ రచయితలు సంపాదకుల పనిని ససేమిరా సహించరు; హర్షించరు.


    ప్లాట్నిక్ ముఖప్రీతి పద్ధతి

    అటువంటి సమయలో ప్లాట్నిక్ ముఖప్రీతి పద్ధతి అనుసరించడం శ్రేయస్కరం. ఉదాహరణగా, ఆర్థర్ ప్లాట్నిక్ రాసిన ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎడిటింగ్ పుస్తకం (32పే.) నుంచి తీసుకున్న ఈ బొమ్మ చూడండి. పుస్తకం మీదగ్గర లేకపోతే (నన్ను పంపించమని అడగకుండా) మీరు తెప్పించుకోండి.

  3. యాచిత రచయితలు, అయాచిత రచయితలలో కొద్దిమంది, రచన మధ్యలో పరదేశీయ పదాలు, జాతీయాలు గుప్పిస్తారు. ముఖ్యంగా, ఫ్రెంచ్, లాటిన్‌, సంస్కృత పదాలు. సాధ్యమైనంతవరకూ వాటిని తెలుగులోకి తర్జుమా చేయడం మంచిది. అందుకు ఆ రచయిత ససేమిరా ఒప్పుకోక పోవచ్చు. అప్పుడే ఎడిటర్లుగా మీ రాజకీయ కౌశలం ఉపయోగించాలి.
  4. ప్రిమా డొనాలు కొంతమంది కథలో, కాకరకాయలో పంపించేటప్పుడు ప్రతీసారీ వాళ్ళ బయోడాటా మీకు గుర్తు చేస్తారు వారి ఎకడెమిక్ డిగ్రీలతో సహా; రెండువందల కథలు, పధ్నాలుగు నవలలు, ఐదు కవితా సంకలనాలు, ఆరు వ్యాస సంపుటాలు, ఒక విమర్శనా గ్రంథం వగైరా వగైరా అని. అటువంటి అహంభావ రచయితల దగ్గిరనుంచి రచనలు యాచించే బాధ్యత నాకు వదిలిపెట్టండి. వాళ్ళు తెగడినా పొగడినా భరించడం నా బాధ్యత. అయినా, మాకూ పెహడిగ్రీలున్నై, వాళ్ళ తిట్లు మేమూ భరించగలం, మా చర్మం మందం అని మీరు అనుకుంటే, అది మీ ఖర్మ.
  5. ప్రిమా డొనాలతో ఇంకొక చిక్కు కూడా ఉన్నది. వాళ్ళు సాధారణంగా కర్త్రర్థక వాక్యాలు రాయరు. ఉదాహరణకి, “వలలుడు వంటలు వండెను”, అని రాయరు. దానికి బదులుగా కర్మర్థక వాక్యాలు రాస్తారు. అంటే, “వలలునిచేత వంటలు వండబడెను”, అని రాస్తారు. అటువంటి వాక్యాలని మార్చండి. రచయితకి సవరించిన ప్రతి పంపేటప్పుడు, మీ సవరణలు కాపీలో మరో రంగులో చూపించకండి. నల్ల సిరాలోనే మార్పులన్నీ చేసి రచయితకి పంపిస్తే తన రచనలో మార్పులేమీ చెయ్యలేనే భ్రమ కలుగుతుంది. ఇది చిన్నతరహా మోసం. తప్పేమీలేదు. ఆనర్‌ కోడ్ ఉల్లంఘించామని భయపడటానికి, ఇవేమీ అమెరికా స్కూళ్ళలో పరీక్షలు కావు.
  6. కొందరు యాచిత రచయితలు పబ్లిగ్గాను, పరోక్షంగాను మనమీద అపవాదులు, నీలాపనిందలూ వేశారు, వేస్తారు; మనకి కొందరు అభిమాన రచయితలని, మరికొందరంటే చిరాకనీ. అది నిజం. అయితే కొందరిపై అభిమానానానికి కారణం, వారి వయసు, లింగబేధమూ/సామ్యమూ, సహజీవనంలో స్వ/పర లింగాల ప్రత్యేక యెంపిక కానీ కారణం కాదు. ఈ అపవాదులకి కారణం మీరు వారి అహం దెబ్బతీయడం. ఈ ఉత్తరంలో సూత్రాలే కాక, వేరేగా ఈ ఒక్క విషయం మీదే ఇంకో మెమో మీకు పంపుతాను త్వరలో.

[ఈ మధ్య కాలంలో మన పత్రికలో అశ్లీలత పెరిగిందనే అభాండం ప్రచారంలోకి వచ్చింది. కథలలోను, కవితల్లోనూ అశ్లీల పదాలు వున్నాయన్న సందేహం వస్తే, ఆకథ చివరో, కవిత చివర్లో ‘మా పత్రిక అశ్లీలతని సహించదు. ప్రోత్సహించదు.’ అని డిస్‌క్లైమర్ రాయడం మంచిది. అశ్లీల పదాలు పరాయి భాషలో ఉంటే పరవాలేదు. (సాహిత్యంలో అశ్లీలత పై నేను ఒక బృహత్‌వ్యాసం మొదలు పెట్టాను. త్వరలో దానిని ప్రచురిద్దాం)]

కవితలు

మనకి కవితలు పుట్టగొడుగుల్లా వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కసారి Andy Rooney అన్న మాటలు నిజమే సుమా అనిపిస్తాయి.

“We need more plumbers and electricians than we need poets – but we need poets too. There are more bad poets than bad electricians and plumbers. May be, poets ought to be licensed”

– Andy Rooney (in Common (non)sense, 2002, BBS Public Affairs, New York).

  1. పైమాటలు ఉమ్మడిగా కవులందరికీ చెప్పవద్దు. కవులలో చాలామంది సాత్వికులు. వాళ్ళ మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు.
  2. కొద్దిమంది కవులకి ఈ విషయం ఘంటాపథంగా చెప్పవలసిన అవసరం ఉన్నది. అటువంటి కవులు ఎవరో మీకు తెలుసు. “నా కవితలో మార్పు చెయ్యగల సమర్థులు ఈ భూప్రపంచకంలో లేరు”, అని మెయిల్ కొట్టే కవులెవరో నాకు తెలుసు, మీకు తెలుసు. అది అందరికీ బాకా ఊది చెప్పడం అనవసరం.

మనకి వచ్చే ఉత్తరాలు

  1. కొందరు ప్రైవేట్గా ప్రేమలేఖలు రాస్తారు. ఉదాహరణకి, నాకు వచ్చిన ఒక ప్రైవేట్ ఉత్తరం, ” నీకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, సంస్కృతం అసలే రాదు; ఈ సంపాదకపదవి నీకు కట్టబెట్టిన వాళ్ళు ఉత్త చవటలు”, అని. ఇటువంటి ఉత్తరాలకి సమాధానం ఇవ్వనవసరం లేదు. ఒక వేళ సమాధానం ఇద్దామనే కుతూహలం కలిగితే, ఇదిగో ఫార్ములా సమాధానం: మీ ఉత్తరం. చాలా సంతోషం. అభినందనలతో – అని రాయండి. (అతను/ఆమె మీకు ఈ జన్మలో మళ్ళీ ఉత్తరం రాయడు/రాయదు అని హామీ ఇస్తున్నాను)
  2. ప్రాకృతంలోనో, దేశ్యంలోనో, లహండ లోనో కొందరికి పెద్ద పెద్ద ఉత్తరాలు రాయడం గొప్ప సరదా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అన్నట్టుగా, అప్పుడప్పుడు అలాంటి ఉత్తరాలు చదవడానికి సరదాగానే ఉంటాయి కానీ, అదే వరసలో తండోపతండాలుగా, ప్రతి కథ మీద, ప్రతి వ్యాసం మీద, ప్రతి కవిత మీదా, ప్రతి సంపాదకీయం మీదా రాస్తే విసుగొస్తుంది, మీకూ నాకే కాదు; పాఠకులకి కూడా. నా సలహా, Cut them out.
  3. ఎడిటర్లని మందలిస్తూ, తూలనాడుతూ వచ్చే ఉత్తరాలు ప్రచురించడం అవసరం. వాటికి ఎడిటర్లు సమాధానం ఇవ్వడం అనవసరం.
  4. ఫలానా వాడి కథని, ఫలానా రచయిత్రి వ్యాసాన్ని, నేను మొదటినుంచీ చివరిదాకా సవరించి పరిష్కరించాను అని ప్రైవేటుగా కాని పబ్లిగ్గా బ్లాగుల్లో కాని ఏ ఎడిటరూ/ మాజీ ఎడిటరూ చెప్పకూడదు. ఆ రహస్యం రచయితకి, ఎడిటరుకీ మధ్యనే ఉండిపోవాలి. అది Editorial etiquette; editorial code & protocol.

[ఇది రాయాలనే ఊహ ఇచ్చిన ‘ఉత్తర’ కుమారులందరికీ ధన్యవాదాలు]