రాగవాసిష్ఠం- నాటక వైశిష్ట్యం


ప్రస్తావన

పురాణ ప్రసిద్ధమైన అరుంధతీ – వసిష్ఠుల ప్రణయగాథను ఆధారంగా చేసుకొని వచ్చిన నాటకమే రాగవాసిష్ఠం దీన్ని బోయి భీమన్న గారు 1959లో రాశారు. 12 రంగాలు గల ఈ నాటకం రావడం వెనుక కుల సమస్యను, దళితుల సంస్కృతీ పరమైన విషయాలను చర్చించాలనే లక్ష్యం కనిపిస్తుంది. భారతదేశంలో ఆర్య- ద్రావిడ జాతుల పుట్టుకకు సంబంధించిన చారిత్రక లోతులెన్నో ఈ నాటకంలో ఉన్నాయి. పౌరాణిక ఇతివృత్తాన్ని తీసుకొని సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల సమస్యను లోతుగా చర్చించి, “భారతీయులంతా ఒక్కటే” అనే జాతీయతా వాదాన్ని స్థాపించే నాటకంగా దీన్ని అభివర్ణించవచ్చు.

రాగవాసిష్ఠం నాటకం – రచనా నేపథ్యం

రాగవాసిష్ఠం
రాగవాసిష్ఠం

నెల్లూరులో1957లో రాష్ట్ర హరిజన సేవా సంఘం మహాసభలు జరిగాయి. ఆ సంఘం ఆధ్వర్యంలోనే హరిజన కవులకు సన్మానాలు కూడా చేయాలనుకున్నారు. ఆ సన్మాన సభలో బోయి భీమన్న గారు పాల్గొన్నప్పుడు, ఆ సభలో అధ్యక్షుడు మాట్లాడిన మాటలకు సమాధానంగా ఈ నాటకం రూపొందిందని హైమావతి గారు పేర్కొన్నారు [పాలేరు నుంచి పద్మశ్రీ వరకు ,బోయి భీమన్న, 1982: 324]అయితే, రచయిత జీవితం, సాహిత్య విషయాల గురించి కథనాత్మక శైలిలో సాగిన హైమావతి గారి రచన పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయి భీమన్నలో ఈ నాటకానికి భీమన్నగారు రాసిన ముందుమాట గురించిన ప్రస్తావన గురించి కూడా కనిపిస్తుంది “హరిజనులు ఆదిమ వాసులైనా, ఆర్యులు వారిని జయించిన తర్వాత బానిసలుగా మారారనీ, అలాగే చచ్చిన గొడ్లను తినడం వల్ల వెలికి గురికాబడ్డారనే” ప్రచారం జరుగుతుండటాన్ని భీమన్నగారు అంగీకరించలేదు [పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయి భీమన్న, 1982: 327]. దానికి తనదైన వాదాన్ని వినిపించాలనుకున్నారు.

దాని కోసం వేదాలు, మనుస్మృతి, అమరకోశం, రామాయణ మహాభారతాలు, ప్రాచీన సాహిత్యం లోతుగా అధ్యయనం చేశానని కవి చెప్పుకున్నారు. డా॥బి.ఆర్. అంబేద్కర్ రచనలను చదివారు. మంగిపూడి వేంకటశర్మగారు రాసిన నిరుద్ధ భారతం భీమన్న గారి “హరిజనులు ఆర్యులే” అనే సిద్ధాంతానికి గొప్ప ప్రేరణనిచ్చిందని రచయితే చెప్పుకున్నారు. నిరుద్ధ భారతం “భారత జాతి సమైక్యాన్ని నిజంగా కాంక్షించే ప్రతి వ్యక్తికీ పారాయణ గ్రంథం”గా కూడా భీమన్న గారు ఆ కావ్యాన్ని వ్యాఖ్యానించారు. ఆ కావ్యాన్ని భీమన్నగారు విద్యార్థి దశలోనే చదువుకున్నారు. ఆ కావ్యమే ఈ నాటకాన్ని రాయడానికి పురికొల్పిందని నాటక రచనా నేపథ్యాన్నిదాని ముందుమాటలో చెప్పుకున్నారు.

పై అంశాలను బట్టి ఈ నాటకం ఒక సామాజిక సమస్యకు పరిష్కారాన్ని లేదా ఒక సమన్వయాన్ని అందించే గురుతర బాధ్యతతో రాయబడిందని తెలుస్తుంది

వస్తు వైవిధ్యం

అరుంధతీదేవి కథ పురాణ ప్రసిద్ధమైనదని ముందే చెప్పుకున్నాం. అయితే, పురాణాల్లో ముఖ్యంగా శ్రీదేవీ భాగవతం, శివపురాణం, భాగవతం, భారతం తదితర పురాణేతిహాసాల్లో వసిష్ఠుని గురించి చెప్పే కథా సందర్భంలో ఆయన ధర్మపత్నిగా అరుంధతీదేవి ప్రస్తావన వస్తుంది.

అరుంధతీదేవి గురించి ప్రచారంలో ఉన్న కథల్లో పాఠకులకు రకరకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతుంటాయి. ఆ పద్ధతిలోనే అరుంధతీదేవికి సంబంధించిన కథలు పుస్తక రూపంలో కనిపిస్తున్నాయి. ఆమె పుట్టు పూర్వోత్తరాల గురించి స్పష్టంగా వివరించకపోయినా, ఆమె ఒక చండాల వంశానికి చెందిన స్త్రీగానూ, గొప్ప సత్యవంతురాలు, పతివ్రతా ధర్మం గల స్త్రీ అని ఎంతో మంది వర్ణించారు. అరుంధతీదేవి చరిత్రము పేరుతో నములకంటి జగన్నాథం గారు 1968లో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అలాగే 1992లో డా॥ బి.వి.ఎస్.మూర్తి దళిత కథామంజరి పేరుతో రాసిన అస్పృశ్య జాతుల్లో పురాణ పురుషుల కథల్లో ‘అరుంధతీదేవి’ కథ ఒకటి ఉంది. ఎండ్లూరి సుధాకర్ గారు ఆరంజ్యోతి పేరుతో ఒక కథ రాశారు. ఇంకా మరికొన్ని పుస్తకాల్లో ఆల్వాల్ మల్లేష్ రాసిన అరుంధతీయ చరిత్రము కూడా పేర్కొనదగినదే! అయితే, వీటన్నింటిలోనూ అరుంధతీదేవి – వసిష్ఠుల కథను పవిత్రంగా వర్ణించడమే తప్ప, ఆ కథను ఒక ప్రత్యేకమైన సైద్ధాంతిక భూమికతో రాసినట్లు కనబడదు.

బోయి భీమన్న గారు మాత్రం అరుంధతీదేవి కథను ఆర్య – అనార్య భేదాలను చర్చించి, శూద్రులు, చండాలురు, మాల, మాదిగల వంటి పేర్లతో పిలిచే వారంతా ఈ దేశ మూల వాసులే కాకుండా, అసలైన ఆర్య జాతీయులవుతారని వాదించే దిశగా ఈ నాటకాన్ని పౌరాణిక – సాంఘిక నాటకంగా తీర్చిదిద్దారు. ఆ విధంగా రచయిత నాటకేతివృత్తంలో వస్తు వైవిధ్యాన్ని సాధించారు.

ఈ రాగవాసిష్ఠం నాటకంలో మరో ప్రత్యేకత ఏమిటంటే పాత్రల పేర్లను కూడా ఎంతో ఔచిత్యంతో పెట్టారు. అరుంధతీదేవి – వసిష్ఠులు పౌరాణిక పాత్రలు. పరమ శివుడు దైవీయమైన పాత్ర.. ఇక, ప్రాచీనుడు, కులగిరి, సంధ్య , శివోహం, కుంభోదరం, గోష్పాదం వంటి పాత్రలన్నీ ప్రతీకాత్మకాలు. అవి ప్రకృతికీ, మానవుని స్థితిగతులకూ, వర్ణాహంకారానికి ప్రతీకలుగా రచయిత అభివర్ణించారు. కనుక, పౌరాణిక – సాంఘిక ఇతివృత్తంతో నాటకాన్ని వల్ల వస్తు వైవిధ్యం దీనిలో స్పష్టంగా కనిపిస్తుంది.