ప్రస్తావన
పురాణ ప్రసిద్ధమైన అరుంధతీ – వసిష్ఠుల ప్రణయగాథను ఆధారంగా చేసుకొని వచ్చిన నాటకమే రాగవాసిష్ఠం దీన్ని బోయి భీమన్న గారు 1959లో రాశారు. 12 రంగాలు గల ఈ నాటకం రావడం వెనుక కుల సమస్యను, దళితుల సంస్కృతీ పరమైన విషయాలను చర్చించాలనే లక్ష్యం కనిపిస్తుంది. భారతదేశంలో ఆర్య- ద్రావిడ జాతుల పుట్టుకకు సంబంధించిన చారిత్రక లోతులెన్నో ఈ నాటకంలో ఉన్నాయి. పౌరాణిక ఇతివృత్తాన్ని తీసుకొని సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల సమస్యను లోతుగా చర్చించి, “భారతీయులంతా ఒక్కటే” అనే జాతీయతా వాదాన్ని స్థాపించే నాటకంగా దీన్ని అభివర్ణించవచ్చు.
రాగవాసిష్ఠం నాటకం – రచనా నేపథ్యం
రాగవాసిష్ఠం
నెల్లూరులో1957లో రాష్ట్ర హరిజన సేవా సంఘం మహాసభలు జరిగాయి. ఆ సంఘం ఆధ్వర్యంలోనే హరిజన కవులకు సన్మానాలు కూడా చేయాలనుకున్నారు. ఆ సన్మాన సభలో బోయి భీమన్న గారు పాల్గొన్నప్పుడు, ఆ సభలో అధ్యక్షుడు మాట్లాడిన మాటలకు సమాధానంగా ఈ నాటకం రూపొందిందని హైమావతి గారు పేర్కొన్నారు [పాలేరు నుంచి పద్మశ్రీ వరకు ,బోయి భీమన్న, 1982: 324]అయితే, రచయిత జీవితం, సాహిత్య విషయాల గురించి కథనాత్మక శైలిలో సాగిన హైమావతి గారి రచన పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయి భీమన్నలో ఈ నాటకానికి భీమన్నగారు రాసిన ముందుమాట గురించిన ప్రస్తావన గురించి కూడా కనిపిస్తుంది “హరిజనులు ఆదిమ వాసులైనా, ఆర్యులు వారిని జయించిన తర్వాత బానిసలుగా మారారనీ, అలాగే చచ్చిన గొడ్లను తినడం వల్ల వెలికి గురికాబడ్డారనే” ప్రచారం జరుగుతుండటాన్ని భీమన్నగారు అంగీకరించలేదు [పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయి భీమన్న, 1982: 327]. దానికి తనదైన వాదాన్ని వినిపించాలనుకున్నారు.
దాని కోసం వేదాలు, మనుస్మృతి, అమరకోశం, రామాయణ మహాభారతాలు, ప్రాచీన సాహిత్యం లోతుగా అధ్యయనం చేశానని కవి చెప్పుకున్నారు. డా॥బి.ఆర్. అంబేద్కర్ రచనలను చదివారు. మంగిపూడి వేంకటశర్మగారు రాసిన నిరుద్ధ భారతం భీమన్న గారి “హరిజనులు ఆర్యులే” అనే సిద్ధాంతానికి గొప్ప ప్రేరణనిచ్చిందని రచయితే చెప్పుకున్నారు. నిరుద్ధ భారతం “భారత జాతి సమైక్యాన్ని నిజంగా కాంక్షించే ప్రతి వ్యక్తికీ పారాయణ గ్రంథం”గా కూడా భీమన్న గారు ఆ కావ్యాన్ని వ్యాఖ్యానించారు. ఆ కావ్యాన్ని భీమన్నగారు విద్యార్థి దశలోనే చదువుకున్నారు. ఆ కావ్యమే ఈ నాటకాన్ని రాయడానికి పురికొల్పిందని నాటక రచనా నేపథ్యాన్నిదాని ముందుమాటలో చెప్పుకున్నారు.
పై అంశాలను బట్టి ఈ నాటకం ఒక సామాజిక సమస్యకు పరిష్కారాన్ని లేదా ఒక సమన్వయాన్ని అందించే గురుతర బాధ్యతతో రాయబడిందని తెలుస్తుంది
వస్తు వైవిధ్యం
అరుంధతీదేవి కథ పురాణ ప్రసిద్ధమైనదని ముందే చెప్పుకున్నాం. అయితే, పురాణాల్లో ముఖ్యంగా శ్రీదేవీ భాగవతం, శివపురాణం, భాగవతం, భారతం తదితర పురాణేతిహాసాల్లో వసిష్ఠుని గురించి చెప్పే కథా సందర్భంలో ఆయన ధర్మపత్నిగా అరుంధతీదేవి ప్రస్తావన వస్తుంది.
అరుంధతీదేవి గురించి ప్రచారంలో ఉన్న కథల్లో పాఠకులకు రకరకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతుంటాయి. ఆ పద్ధతిలోనే అరుంధతీదేవికి సంబంధించిన కథలు పుస్తక రూపంలో కనిపిస్తున్నాయి. ఆమె పుట్టు పూర్వోత్తరాల గురించి స్పష్టంగా వివరించకపోయినా, ఆమె ఒక చండాల వంశానికి చెందిన స్త్రీగానూ, గొప్ప సత్యవంతురాలు, పతివ్రతా ధర్మం గల స్త్రీ అని ఎంతో మంది వర్ణించారు. అరుంధతీదేవి చరిత్రము పేరుతో నములకంటి జగన్నాథం గారు 1968లో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అలాగే 1992లో డా॥ బి.వి.ఎస్.మూర్తి దళిత కథామంజరి పేరుతో రాసిన అస్పృశ్య జాతుల్లో పురాణ పురుషుల కథల్లో ‘అరుంధతీదేవి’ కథ ఒకటి ఉంది. ఎండ్లూరి సుధాకర్ గారు ఆరంజ్యోతి పేరుతో ఒక కథ రాశారు. ఇంకా మరికొన్ని పుస్తకాల్లో ఆల్వాల్ మల్లేష్ రాసిన అరుంధతీయ చరిత్రము కూడా పేర్కొనదగినదే! అయితే, వీటన్నింటిలోనూ అరుంధతీదేవి – వసిష్ఠుల కథను పవిత్రంగా వర్ణించడమే తప్ప, ఆ కథను ఒక ప్రత్యేకమైన సైద్ధాంతిక భూమికతో రాసినట్లు కనబడదు.
బోయి భీమన్న గారు మాత్రం అరుంధతీదేవి కథను ఆర్య – అనార్య భేదాలను చర్చించి, శూద్రులు, చండాలురు, మాల, మాదిగల వంటి పేర్లతో పిలిచే వారంతా ఈ దేశ మూల వాసులే కాకుండా, అసలైన ఆర్య జాతీయులవుతారని వాదించే దిశగా ఈ నాటకాన్ని పౌరాణిక – సాంఘిక నాటకంగా తీర్చిదిద్దారు. ఆ విధంగా రచయిత నాటకేతివృత్తంలో వస్తు వైవిధ్యాన్ని సాధించారు.
ఈ రాగవాసిష్ఠం నాటకంలో మరో ప్రత్యేకత ఏమిటంటే పాత్రల పేర్లను కూడా ఎంతో ఔచిత్యంతో పెట్టారు. అరుంధతీదేవి – వసిష్ఠులు పౌరాణిక పాత్రలు. పరమ శివుడు దైవీయమైన పాత్ర.. ఇక, ప్రాచీనుడు, కులగిరి, సంధ్య , శివోహం, కుంభోదరం, గోష్పాదం వంటి పాత్రలన్నీ ప్రతీకాత్మకాలు. అవి ప్రకృతికీ, మానవుని స్థితిగతులకూ, వర్ణాహంకారానికి ప్రతీకలుగా రచయిత అభివర్ణించారు. కనుక, పౌరాణిక – సాంఘిక ఇతివృత్తంతో నాటకాన్ని వల్ల వస్తు వైవిధ్యం దీనిలో స్పష్టంగా కనిపిస్తుంది.
నాటక కథా సారాంశం
అరుంధతీదేవి ఒక అనార్య యువతి. వసిష్ఠుడు ఆర్య జాతీయుడు. వేదవనంలో తపస్సు చేసుకొంటున్న వసిష్ఠుడికి ఒకనాడు మధురమైన గీతం వినిపిస్తుంది. ఆ గీతం అతని మనసుని ఆకర్షిస్తుంది. పాడిందెవరని చుట్టూ పరికించి చూస్తాడు. సంధ్య అనే అమ్మాయి పాడిందా పాట. ఆమె అరుంధతీదేవికి సోదరి. ఆ పాట ద్వారా సంధ్యని, ఆమె ద్వారా అరుంధతీదేవినీ వసిష్ఠుడు కలుసుకొని, అప్రయత్నంగా సరస్సులో పడిపోయిన అరుంధతీదేవిని రక్షించడం ద్వారా అరుంధతీదేవి నివాసం ఉండే ఆశ్రమానికి చేరతాడు. ఇద్దరి మనసులు ఏకమవుతాయి.
అరుంధతీదేవి – వసిష్ఠుల ప్రణయం విషయం వసిష్ఠుడిని చిన్ననాటి నుండీ పెంచి పోషించిన ప్రాచీనుడికి తెలుస్తుంది. మొదట ప్రాచీనుడు ఆ ఇద్దరినీ చూసి పార్వతీ పరమేశ్వరులేమో అని భావిస్తాడు. తాము వసిష్ఠుడు – అరుంధతులమని వసిష్ఠుడు ప్రాచీనుడికి వివరిస్తాడు. అరుంధతీదేవి గురించి చెప్తాడు. ఆమె ఒక తాపస కన్య అనీ, ఈ పరిసర ఆశ్రమంలోనే ఉంటుందనీ వసిష్ఠుడు చెప్తాడు. ఆమె పేరు “అరుంధతీదేవి” అని చెప్పగానే, ప్రాచీనుడు “హరి హరీ! అంటరాని, చూడరాని, చెప్పరాని చండాల కన్య!” అనుకొంటూ తిరిగి వెళ్ళిపోతాడు.
ఆమె చండాల కన్యా? అని వసిష్ఠుడు ఆశ్చర్యపోతాడు. ఆ మాట వినగానే సాలభంజికలా కదలకుండా అయిపోతుంది అరుంధతీదేవి.
అక్కా! అక్కా! అంటూ సంధ్య పరుగెట్టుకొంటూ వచ్చిఆ దృశ్యాన్ని చూసి సజల నేత్రాలతో నిలబడి పోతుంది.
ఆమెను అలాగే వదిలేసి వసిష్ఠుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. తనలో తాను తర్కించుకుంటాడు. అరుంధతీదేవి చండాలకన్యేనా? ఎంతటి దివ్య సౌందర్యమది? ఆమె ఉన్న ప్రతిచోటూ ఎంత ఆనందదాయకంగా ఉంది! ఎంత పవిత్రంగా ఉంది? ఎంత ప్రశాతంగా ఉందో కదా… అనుకొంటూ మళ్ళీ అరుంధతీదేవి ఆశ్రమానికి వెళ్ళాలని బయలుదేరతాడు.
వసిష్ఠుడికి ఎదురుగా కులగిరి అడ్డు నిలబడతాడు. వసిష్ఠుడిని ఆశ్రమాన్నివిడిచి వెళ్ళనివ్వవద్దని ప్రాచీనుడు తనతో చెప్పాడని అంటాడు.
అంతలో ప్రాచీనుడు వస్తాడు.
వసిష్ఠ- ప్రాచీనుల వాదనలు
మాల మాదిగలను వారి జన్మను చులకనగా మాట్లాడతాడు ప్రాచీనుడు. నత్తితో మాట్లాడే కులగిరి “బ్రహ్మజ్ఞానం” గురించి మాట్లాడుతుంటాడు. నత్తి నత్తిగా ఉచ్ఛారణా దోషాలతో మాట్లాడుతుంటాడు. యజ్ఞోపవీత ధారణ చేసినంత మాత్రం చేత అందరూ బ్రాహ్మణులవ్వరనీ, నిజానికి అటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞానం అనే మాటను ఉచ్ఛరించడానికే అర్హులు కారనీ వాదిస్తాడు వసిష్ఠుడు.
ఇరువురూ జాతి భేదాల గురించి వాదించుకుంటారు.
ఆర్యజాతి సంరక్షులమైన మనం, సమష్ఠి క్షేమం కోసం వ్యక్తిగత ప్రయోజనాలను తృణప్రాయంగా త్యజించాలని, అందువల్ల నీచ జాతితో పవిత్రమైన ఆర్యజాతిని సంకరం చేసి సర్వ నాశనం చెయ్యవద్దని ప్రాచీనుడు వసిష్ఠుడికి బోధిస్తాడు.
దీనితో వసిష్ఠుడు సంఘర్షణకు లోనవుతాడు.
ఈలోగా సంధ్య వసిష్ఠుడిని వెతుక్కొంటూ కులగిరి దగ్గరకు వస్తుంది. వసిష్ఠుడు ఆ ప్రాంతాన్ని వదిలి వచ్చేసినప్పటి నుండీ అరుంధతీదేవికి స్మృతి రాలేదని ఆమెను అతడొక్కడే రక్షించగలడని అనుకొంటుంది. వసిష్ఠుడు గురించి వివరాలు అడుగుతుంది. అప్పటికే ఆ ఆశ్రమం వదిలి అరుంధతీదేవి ఆశ్రమం వైపుకే వసిష్ఠుడు వెళ్ళిపోయాడని కులగిరి చెప్తాడు.
తనకు వర్ణభేదం లేదనీ తన హృదయపు తలపులు మూసుకోలేదనీ అరుంధతీదేవి తన హృదయంలో ఉండి సర్వత్రా ఆమె ప్రతిబింబమే కనిపిస్తుందని తనలో తాను సమాధానం చెప్పుకుంటాడు వసిష్ఠుడు. అంతలో వసిష్ఠుని దగ్గరకొచ్చిన సంధ్యతో తాను క్షణంలో వచ్చేస్తాననీ, ఆమెను అరుంధతీదేవి దగ్గరకు వెళ్ళమని చెప్తాడు. “ఆర్య, అనార్య భేద భావాల్ని తునాతునకలు చేసి, ప్రాచీనుడి నోరు మూయించి, ఈ పారతంత్ర్య వాతావరణం నుంచి బైటికి దూకి వచ్చేస్తానని, తాను పొరపాటు చేసి, ఆమెను వదిలి వచ్చేశాననీ” పశ్చాత్తాప పడుతుంటాడు.
అంతలో మళ్ళీ ప్రాచీనుడు వస్తాడు.
అతడు వసిష్ఠుడిది స్త్రీ వాంఛ అని నిందిస్తాడు.
తనది స్త్రీ వాంఛ కాదనీ, తన జీవితం ప్రేమ యజ్ఞంలో బలయిపోయిందంటాడు.
ఇక, తపస్సు మానేసి గృహస్థాశ్రమానికి చేరమనీ, అప్పుడు గానీ కామం చల్లారందంటాడు ప్రాచీనుడు.
తనది కామం కాదంటాడు వసిష్ఠుడు. తపస్సు మానవలసిన పనిలేదనీ అంటాడు.
అయినా ఇప్పటికే మహా తపస్వివి. యౌవనస్థుడవు. కనుక ఇప్పటికైనా గృహస్థుడివి కమ్మంటాడు ప్రాచీనుడు. తగిన తేజోవతిని వివాహమాడి రాజయోగినిగా మారమని చెప్తాడు ప్రాచీనుడు.
అరుంధతీదేవి కంటే ప్రపంచంలో తేజోవతి లేదంటాడు వసిష్ఠుడు.
మసి బొగ్గుకి రత్నకాంతులు ఉంటాయా? అలాగే చండాల కన్యకు తేజస్సెక్కడదని, ఆమెను తారామాత్రంగా చేయగల ప్రచండ రవి తేజస్వినులెందరో ఉన్నారంటాడు. అలా అనేసి గుప్పిటతో కొంత ఇసుకను పైకి తీసి “దీన్ని అన్నంగా వండి పెట్టగల కన్య నీకు అర్థాంగి కాగలదు. ఇక నీవు స్వేచ్ఛగా పోవచ్చని” వసిష్ఠుణ్ణి వదిలేసి ప్రాచీనుడు వెళ్ళిపోతాడు.
వసిష్ఠుడి ప్రణయవేదన – శివుని దర్శనం
ప్రాచీన ధర్మం కంటే ఇసుకే కొంత మెత్తగా కనిపిస్తుందనుకొంటూ, ఇసుకను అరుంధతీదేవి వండక పోతే తాను మరో స్త్రీని పెండ్లాడడం జరుగుతుందా? అయినా ప్రేమకు పరీక్ష పెట్టడమేమిటని తనకి కావాలసింది అరుంధతీదేవి. అంతే తప్ప ఓ స్త్రీ మాత్రమే కాదనీ అనుకుంటాడు. ఇసుకను పారబోసేస్తాడు.
అక్కడ అరుంధతీదేవి తపస్సులో నిమగ్నమై పోతుంది.
వసిష్ఠుడు అరుంధతీదేవినే తలచుకొంటూ, మానసిక సంఘర్షణకు గురవుతుంటాడు.
ఆనాటి నుండీ అరుంధతీదేవి ఉండే వేదవనంలోని ఆశ్రమం తప్ప, మిగిలిన ఆశ్రమాలన్నీ కరువు కాటకాల పాలవుతాయి. ప్రజలు ఆకలికి తట్టుకోలేక మునులు కుక్కలను కూడా వదలరు. వాటితోనే తమ ఆకలి తీర్చుకుంటుంటారు.
ఈ పరిస్థితిని గమనించిన ప్రాచీనుడు తన శిష్యుడు కులగిరిని పంపి త్రిమూర్తుల దగ్గరకెళ్ళి సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోమంటాడు. బ్రహ్మ, విష్ణువు తమ చేతుల్లో లేదనీ పరమేశ్వరుడి దగ్గరకెళ్ళమంటారు. అప్పటికే ఈశ్వరుడు అరుంధతీదేవి ఆశ్రమానికి బయలుదేరతాడు.
అరుంధతీదేవినే తలచుకుంటూ వసిష్ఠుడు తాను తప్పు చేశాననీ, ఇక శాశ్వతంగా అరుంధతీదేవికి దూరమవ్వాలని అనుకుంటుంటాడు. తన తపస్సు వ్యర్థమనుకుంటాడు. అది ఇసుక తుఫానులో చేసిన తపస్సులాంటిదని అనుకుంటాడు. తనకి మరణమే శరణ్యమనుకుంటాడు.
ఆ సమయంలోనే సాధారణ మానవుడిలాగే ఈశ్వరుడు అతడికి ప్రత్యక్షమవుతాడు.
ఆ స్థితిలో వసిష్ఠుడు ఈశ్వరుడిని గుర్తించలేడు. తన ప్రేమ సఫలం కానందుకు మరణించాలనుకుంటున్న వసిష్ఠుడిని శివుడే పలకరిస్తాడు. చైతన్యంతో జీవించడంలోనే నిజమైన పురోగతి దాగి ఉందని ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోవాలనుకున్న వసిష్ఠుణ్ణి తన చేతితో స్పర్శిస్తాడు శివుడు. ఆ స్పర్శతో అతడు నూతన చైతన్యం పొందుతాడు. అయినా తన దారిని తనని పోనిమ్మంటాడు. అయితే అతనిదేదో భగ్న హృదయంలా ఉందనుకుంటాడు శివుడు. ఆ పూర్వాపరాలను అడగకుండానే, అతణ్ణి అంత కఠినంగా హింసించిన ఆ ప్రియురాలెవరని మాత్రం అడుగుతాడు. ఆమె మృదు స్వభావురాలేననీ, తానే కఠినాత్ముడిననీ వసిష్ఠుడు వివరిస్తాడు. తనది ఆర్యజాతి అనీ అనార్య జాతి కన్యను ప్రేమించాననీ చెప్తాడు వసిష్ఠుడు.
దానితో శివుడు అసలు భారతదేశంలో అలాంటి భేద భావమే లేదనీ ద్రావిడులు ఆర్యులు ఒకే జాతివారనీ స్పష్టం చేస్తాడు. భారతీయులదంతా దితి, అదితుల సంతానమే కదా అనీ చెప్తాడు. వెంటనే మళ్ళీ అది కూడా కేవలం “పెరుగుదలలో పరిసరాల ప్రాబల్యం మినహాహిస్తే, మానవ జాతి అంతా ఒక్కటే కదా?” అంటాడు.
దీనితో తన అజ్ఞానం క్షమార్హం కాదని తపిస్తుంటాడు వసిష్ఠుడు. పొరపాటు చెయ్యడం మానవ లక్షణమనీ దాన్ని సరిదిద్దుకోవడానికి పశ్చాత్తాపమే సరైన మార్గమని వివరిస్తాడు శివుడు. తన తప్పుని సరిదిద్దుకుంటానని వసిష్ఠుడు శివుడికి చెప్పి వెంటనే శివుణ్ణి వదిలేసి అరుంధతీదేవి దగ్గరకు వెళ్ళిపోతాడు. ధన్యుడవయ్యావంటూ శివుడు వసిష్ఠుణ్ణి దీవిస్తూ నిలబడతాడు.
ఇంతలో సంధ్య శివుడి దగ్గరకొచ్చి లోకాలన్నీ తమరినే వెతుకుతున్నాయని అంటుంది. శివుడిని సంధ్య తన అక్క అరుంధతీదేవి తపస్సు చేసుకుంటున్న ఆశ్రమానికి తీసుకొని వెళుతుంది.
మార్గ మధ్యలో ప్రజలు, గోష్పాదం, కుంభోదరం, మునులు కనిపిస్తారు. తాము ఆకలితో అల్లాడుతున్నామనీ కరువుని తీర్చమనీ అంటారు. శివుడితో వస్తున్న సంధ్యను వాళ్ళు మొదట పార్వతీదేవి అనుకుంటారు. తర్వాత కులగిరి గుర్తిస్తాడు. మాదిగ పిల్లను శివుడు ముట్టుకుంటున్నాడంటాడు. శివుడు మైల పడిపోతున్నాడని గోష్పాదం, కుంభోదరం అతని మాటకు జత కలుపుతారు. చావనైనా చస్తాంగానీ మైలపడిన చేత్తో తమకేమిచ్చినా తీసుకోమంటారు.
మరొక వైపు ప్రజలు ఆకలీ… ఆకలీ అని అరుస్తుంటారు.
“ప్రజలారా! మీరెంతకాలం కుల మత వర్గ విభేదాలతో అజ్ఞానులై ప్రవర్తిస్తారో అంతకాలం మీకీ అరిష్టాలు తప్పవు. ఇక ప్రస్తుతానికి మిమ్మల్ని ఈ విపత్తునుంచి రక్షించగలవారు ఒక్క పతివ్రతలు మాత్రమే. మీరు పోయి పతివ్రతలను ఆశ్రయించండి. మీకింత భిక్ష పెట్టగలర”ని అంటాడు శివుడు.
అక్కడే దూరంగా ఉన్న ప్రాచీనుడు వర్ణాధిక్యతతో ఈశ్వరుడిని కూడా గుర్తించలేని స్థితిలో ఉంటాడు. “మాదిగ పిల్ల తపస్సు చేయడం! ఉత్పాతాలు సంభవించడం! ఎంత విపరీతంగా వుంది. ఇక ఆర్య జాతి అడుక్కు తిన్నట్టే!” అనుకుంటుంటాడు.
కొంచెం దూరం వెళ్ళిన తరువాత సంధ్యా పరమశివులను చూస్తాడు. కానీ వాళ్ళిద్దరినీ అరుంధతీదేవి వసిష్ఠులనుకుంటాడు. తన మాట వినకుండా వశిష్ఠుడు మాదిగ పిల్లనే చేరాడనుకుంటాడు. అందువల్లనే ధర్మ గ్లాని ఏర్పడిందనుకుంటాడు. ఈ ఘోరకలిని చూడలేననుకుని ముఖం తిప్పుకుంటాడు. ఈ స్థితిలో వస్తున్న పరమశివుడే ప్రాచీనుడికి అభివాదం చేస్తాడు. ప్రాచీనుడు పరీక్షగా చూసి తమర్ని గుర్తుపట్టలేదంటాడు. తనని పరిచయం చేసుకుంటాడు. ప్రాచీనుడు అప్పుడు పరమ శివుడికి నమస్కరించి ఆ పక్కనున్న సంధ్యను పార్వతీదేవేనా అని అడుగుతాడు. తాను పార్వతీదేవిని కాదనీ, అరుంధతీదేవి తన అక్క అనీ శివుడు తనకు తాత అవుతాడని సంధ్య ప్రాచీనుడికి వివరిస్తుంది.
ఆ సంభాషణకీ, సంబంధానికీ ఆశ్చర్యపోయి వాటి పూర్వాపరాలను అడుగుతాడు ప్రాచీనుడు.
తమది ఆద్యార్య సంబంధమనీ, అరుంధతీదేవి మాతంగ కన్య అయినట్లే, కాటికాపరి అయిన పరమేశ్వరుడు కూడ మాతంగుడేననీ చెబుతుంది.
తమతో వేళాకోళమాడుతున్నారేమోననే సందేహాన్ని వ్యక్తం చేస్తాడు ప్రాచీనుడు.
ఇది వేళాకోళం కాదనీ సత్యమేననీ చెప్తాడు శివుడు. “అధికారం కోసం ఆర్య ద్రావిడుల మధ్య జరిగిన అనేక యుద్ధాల పర్యవసానంగా సమాజంలో హెచ్చుతగ్గులేర్పడ్డాయి. గుణాలను అనుసరించి వృత్తులు పుట్టాయి. వృత్తులను అనుసరించి వర్ణాలేర్పడ్డాయి. అవే కులాలైనాయి. మతంగ మహర్షి సంతానం మాల మాదిగలు. మతంగుడు ఆర్య ద్రావిడ సమైక్యతా మూర్తి. ఆర్య ద్రావిడులు మూలార్య జాతి శాఖలు. అన్నదమ్ములు. ఈ భేదాలు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం సంఘ సముద్రంలో పుడుతూ పోతూ వుండే అలల వంటివని తెలిసికూడా, మీ వంటి పెద్దలు వీటిని పాటించబూనడం కడుం గడు శోచనీయం” అని స్పష్టంగా వివరిస్తాడు.
ఈ భేద భావాలు స్వార్థం కోసం మానవులు సృష్టించుకున్నవనే కనీస జ్ఞానం తనకు కలగనందుకు సిగ్గుపడుతూ మౌనంగా ఉండిపోతాడు ప్రాచీనుడు.
ఆకాశం తెల్లని మేఘాలతో పొగలు వ్యాపించి ఉంటుంది. అదంతా అరుంధతీదేవి తపస్సు వల్ల కలిగిన పొగలుగానే ప్రజలు భావిస్తుంటారు.
అరుంధతీదేవి – వసిష్ఠుల పునఃసంయోగం
అరుంధతీదేవి తపస్సు తీవ్రమై, ఆ తపోవహ్నిలో భగ్నమవుతుందేమోనని, ఆమె తమ్ముడు శివోహం ఒక పాత్రతో నీళ్ళు పట్టుకొని ఆమె చుట్టూ తిరుగుతుంటాడు.
వసిష్ఠుడు ఆకాశంలో కనిపిస్తున్న దివ్యజ్యోతిని చూసి ఆశ్చర్యపోతూ ఆందోళన పడుతుంటాడు. “తపోవహ్నిలో భస్మమైపోతున్నావా అరుంధతీదేవీ” అంటూ విలపిస్తూ తానూ యోగవహ్నిలో చితాభస్మమైపోతానని అతడు యోగ ముద్ర ధరిస్తాడు. శరీరంలో నుండి మంటలు బయలుదేరతాయి. భస్మం వాసన గుప్పుమంటుంది.
పరమశివుడు ప్రవేశించి ఈ మహా చరిత్ర విషాదాంతం కారాదని, తన దగ్గరున్న కమండలంలోని తీర్థం తీసి ఇద్దరి మీదా చల్లుతాడు.
తపోవహ్ని చల్లారిపోతుంది.
కన్నులు తెరచిన అరుంధతీదేవి, పక్కనే ఉన్న వసిష్ఠుణ్ణి చూసి పాదాభివందనం చేస్తుంది.
ఆ తరువాత పరమశివుణ్ణి చూసి భక్తి భావంతో నమస్కరిస్తుంది. తానెంత అదృష్టవంతుణ్ణో కదా అని వసిష్ఠుడు మురిసిపోతాడు.
“కల్యాణ మస్తు” అని ఇరువురినీ పరమశివుడు దీవిస్తాడు. అరుంధతీదేవి తన పక్కనే ఉన్న ప్రాచీనుడికి నమస్కరించి, ఆశీర్వాదాలు కోరుతుంది.
అతడూ ఆమెను దీవిస్తాడు.
నమస్కరించిన వసిష్ఠుడినీ ప్రాచీనుడు దీవిస్తాడు.
పరమశివుని అనుగ్రహంతో జ్ఞానినైయ్యానని చెప్పి వెళ్ళిపోతాడు.
అప్పుడు వసిష్ఠుడు పరమశివుని పాదాలపై పడతాడు. ఏదైనా వరం కోరుకోమన్న శివుడితో తనకు అరుంధతీదేవిని అగ్ని సాక్షిగా వివాహం చేయమంటాడు వసిష్ఠుడు.
ఇద్దరినీ దగ్గరకు చేరదీసి ఒకటి చేస్తాడు శివుడు.
ఇంతలో ప్రజలు, మునులు, ముని శిష్యులు కొన ఊపిరితో వస్తారు. “ఆకలి తీర్చే వాళ్ళే దొరకలేదా” అని పరమశివుడు అడుగుతాడు. దానితో వాళ్ళు ఆకలి తీర్చేవాళ్ళే దొరకలేదని, ఈ పాపాత్ములకు అన్నపూర్ణ ఎక్కడ కనపడుతుందని పశ్చాత్తాప్పడతారు.
అరుంధతీదేవి “ఈ ప్రజలింత దీనావస్థలో ఉండటానికి కారణం ఏమిట” ని పరమశివుణ్ణి అడుగుతుంది.
అదంతా అరుంధతీదేవికి జరిగిన పరాభవ ఫలితమేననీ, ప్రజల్ని రక్షించమని పరమశివుడు అరుంధతీదేవికి చెప్తాడు.
ప్రజలంతా మాదిగల అన్నం తింటారా? అని సంధ్య అడిగితే, “తింటాం తింటాం” అంటారు.
“దేవీ! నీవే ఈ ప్రజల్ని రక్షించగలవ”ని వసిష్ఠుడు కూడా చెప్తాడు.
అప్పుడు వసిష్ఠుడి పాదధూళిని తీసుకొని తాను పతిభక్తి గలదాన్నయితే, అన్నపూర్ణమ్మకు నా పట్ల దయ ఉంటే కొండ రాళ్ళన్నీ పిండి వంటలుగా మారాలనీ, చెట్లన్నీ ఫలించాలనీ, చెరువులన్నీ మంచినీళ్ళతో నిండాలని కోరుకుంటుంది.
అలాగే జరుగుతుంది
ప్రజలంతా ఆనందిస్తారు
“ఇంత గొప్ప మహాత్కార్యాన్ని సాధించినందుకుగానూ ద్యోమ మండలంలో నీ నాథుని దగ్గరే ఒక శాశ్వత స్థానం లభించేటట్లు వరం ప్రసాదిస్తున్నాను. లోకంలోని ప్రతి నూతన దంపతులు ముందుగా నీకే నమస్కరించి, నీ ఆశీస్సులు పొందుతారు, వైదిక భారతీయులకూ, భారత వంశానికీ మాతవు కాగలవనీ” అరుంధతీదేవిని దీవిస్తాడు శివుడు.
ఆ విధంగా నాటకం సుఖాంతమవుతుంది.
ప్రజలందరికీ శ్రేయస్సుని కలిగించి సుఖాంతమూ అవుతుంది. భగవంతుడే ప్రత్యక్షమైనా, భర్తనే ముందుగా పూజించడం, తర్వాత భగవంతుణ్ణి, ఆ తర్వాత పెద్దల్ని గౌరవించడంలో అరుంధతీదేవి సనాతన సంప్రదాయాన్ని చక్కగా పాటించినట్లు రచయిత వర్ణించారు.
నాటక రచనా విధానం
నాందీ, ప్రస్తావనల కంటే, నాటకాన్ని 12 రంగాలుగా విభజించి, మొదటి రంగంలోనే జరగబోయే కథను చక్కగా సూచించగలిగారు. నాటక ప్రదర్శనలో పంచ సంధులను ఉపయోగించుకున్నారు..
“మేలుకో మేలుకో” పాటతో వసిష్ఠుడు తపస్సు నుండి మేల్కొనడం, మూఢత్వాన్ని వదిలి జ్ఞానం వైపు పయనించడం జరిగింది. సంధ్య ద్వారా పరిచయమై, అరుంధతీదేవిని చేరి, జలగండం నుండి రక్షించినట్లు మొదటి రంగాన్ని బట్టి తెలుస్తుంది. జలగండాలేమైనా సంభవించినప్పుడు వాటి నుండి రక్షించుకోవడానికి యోగ ముద్రను దాల్చవచ్చనీ అలా అరుంధతీదేవి చేసిందన్నట్లు రంగాన్ని వర్ణించారు.
తరువాత కథలో కూడా ఇదే రకంగా జరుగుతుంది. వసిష్ఠుడిని ప్రేమించడం, ఆ విషయం ప్రాచీనుడికి తెలియడం. ఆమె చండాల కన్య అని వసిష్ఠుడికి , ప్రాచీనుడికీ తెలిసినా, ఆమెకు ఆ విషయం తెలియకుండానే సాలభంజికగా మారిపోవడం, మళ్ళీ సమస్య పరిష్కరింపబడిన తర్వాత ఆమె యోగ ముద్రను దాల్చడం, దాన్ని వీడటం వంటివన్నీ ఒక దాని తర్వాత మరొకటి జరిగిపోతాయి.
ఇది గొప్ప సంవిధానం. గొప్ప నాటక శిల్పం. నాందీ, ప్రస్తావనలు లేకుండానే పంచ సంధులు, కార్యావస్థలతో కథా కథనాన్ని ముందుకి నడిపించడంలో ఉన్న శిల్ప ప్రత్యేకత. ఈ పరిశోధన పత్రంలో శిల్పానుశీలన కంటే విషయానుశీలనకే ప్రాధాన్యతనిస్తున్నాను.
గేయాలు – పద్యాలు
ప్రతి రంగంలోనూ సందర్భానుగుణంగా చక్కని భావాలతో గేయాలు, పద్యాలు వర్ణించారు. ఆ గేయాలు, పద్యాలు గొప్ప భావుకతతో పాటు, చైతన్యవంతమైన సందేశాలతో కూడి ఉన్నాయి. వీటన్నింటితో దీన్ని దృశ్య నాటకంగా ప్రదర్శిస్తే ఆధునిక సినిమాకి ఏ మాత్రమూ తీసిపోనట్లే ఉంది. సినిమా స్క్రిప్టులో ఉండే ఎన్నో రకాల పద్ధతులు దీనిలోనూ ఉన్నాయి.
పాత్రలు – సంఘర్షణ
ఈ నాటకంలో అరుంధతీదేవి, వసిష్ఠుడు, ప్రాచీనుడు, సంధ్య పాత్రలు ప్రధానమైనవి. వసిష్ఠుడు – ప్రాచీనుడు సంఘర్షణాత్మక పాత్రలు. సంప్రదాయాన్ని చెక్కు చెదరనీయకుండా కాపాడేందుకు ప్రాచీన ధర్మాలన్నింటినీ పాటించమని వాదించేవాడు ప్రాచీనుడు. స్నేహం, పరస్పర అవగాహన, మానవీయతా గుణాలే ప్రధానమని నమ్మి, వాటి ముందు జాతి భేదాలు నిలబడవని వాదించే స్వభావం వసిష్ఠుడిది. అర్ష సంప్రదాయానికీ, మార్పుని కోరుకొనే అభ్యుదయ వర్గానికీ మధ్య పాత్రోచితంగా గొప్ప సంఘర్షణ జరిగేటట్లు ఈ పాత్రలను తీర్చిదిద్దారు రచయిత.
కులగిరి ప్రాచీనుడి శిష్యుడు. సదాచారాన్నే నమ్ముకునేవాడు. నత్తి నత్తిగా మాట్లాడుతూ, వచ్చీ రాని శ్లోకాలతో పురాణేతిహాసాలను ప్రామాణిక వాక్యాలుగా చెప్తుంటాడు. అయినా, సందర్భాన్ని బట్టి గురువు దగ్గర కూడా అబద్దమాడడానికి వెనుకాడడు. మాదిగ లేదా కింది వర్ణాల వారిని వ్యతిరేకిస్తూనే, అందగత్తె అయితే, ఆమె మాదిగమ్మాయి అయినా, ఆమె వల్ల ఆనందం కలుగుతుందంటే దాన్ని పొందడానికి వెనుకాడని వాడు. అగ్రవర్ణమని చెప్పుకుంటూనే, కింది వర్ణాలనబడేవారిని అవసరానికి అనుగుణంగా ఎలా వాడుకుంటూ ఉంటారో కులగిరి పాత్ర ద్వారా రచయిత సూచించే ప్రయత్నం చేశారు.
సంధ్య పాత్ర ప్రకృతి చైతన్యానికి ప్రతీకాత్మకంగా ఎన్నుకున్నారు రచయిత. అలాగే కుంభోదరం, గోష్పాధం పాత్రలు కూడా సనాతన సంప్రదాయంలో కొనసాగే అవకాశవాద పెద్ద మనుషులకు ప్రతీకగానే తీర్చిదిద్దారు. అరుంధతీదేవి పాత్ర ఒక స్వచ్ఛమైన ప్రేమ మూర్తిగా, ఆదర్శనారిగా, వర్ణభేదాలేమీ తెలియని నిష్కల్మషమూర్తిగా, అందరి సుఖసంతోషాలను కాంక్షించే వరప్రదాయినిగా ఈ పాత్రను గొప్ప ఔచిత్యంతో తీర్చిదిద్దారు.
నాటకతత్త్వం
నిష్కల్మషమైన జీవనానికి మానవుల మధ్య వర్ణ భేదాలు అవసరం లేదు. అవన్నీ కొంతమంది స్వార్థంకోసం, తమ ఆధిక్యం కోసం సృష్టించుకొన్నవి, వాటిని ఎంత త్వరగా విస్మరించి నిర్మూలించగలిగితే, అంత త్వరగా భారతీయత సమైక్యంగా బలపడుతుందనేది ఈ నాటకం ఇచ్చే సందేశం.
నాటకంలో వసిష్ఠుడు, ప్రాచీనుడు, శివుడు పాత్రలగతంగా పలికించిన సంభాషణల్లో ఆర్య – అనార్య భేదాలు భారతదేశంలో నెలకొన్నాయనీ, అవి మానవ జీవనాన్ని హెచ్చు తగ్గుల సమాజంగా విభజించి, మానసిక, భౌతిక సంఘర్షణలకు కారణమవుతున్నాయనీ, వాటిలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలని చెప్పించగలిగారు.
పరమశివుడు పాత్ర ద్వారా మానవులంతా ఒకే జాతి వారనీ, స్థల, కుల భేదాలను బట్టి, తాత్కాలిక అవసరాలను బట్టి అలా రూపొందించుకున్నారు తప్ప, భేదాలేమీ లేవని చెప్పడం ద్వారా ఈ నాటకం ద్వారా రచయిత విశ్వజనీన మానవుడి లక్షణాలను ప్రతిపాదించినట్లయ్యింది. దీనికి డా.బి.ఆర్.అంబేద్కర్ చెప్పిన ‘ఆర్య జాతి సిద్ధాంతాన్ని’ చాలా వరకూ ఈ నాటకంలో అనువర్తించిన విధానం ప్రశంసనీయం.
సిద్ధాంతం కోసం నాటకం రాసినట్లుగా కాకుండా, నాటకంలోనే అప్రయత్నంగా ఆ సిద్ధాంతం వచ్చి చేరినట్లుగా రచన కొనసాగింది.
అయితే ఈ సిద్ధాంతం పట్ల ఇప్పటికీ వాదవివాదాలు జరుగుతునే ఉన్నాయి.చరిత్రకారుల్లోఈ సిద్ధాంతం పట్ల భిన్నాబిప్రాయాలు వ్యక్తమవుతునే ఉన్నాయి. అయినప్పటికీ ఒక నాటకంలో ఏదైనా ఒక సిద్ధాంతం ఎలా సమన్వయించే ప్రయత్నం జరుగుతుందో విశ్లేషిస్తూ, ఆ నాటకాన్ని పరిచయం చేయాలనే లక్ష్యమే ఈ వ్యాసాన్ని రాయించింది.
ఆర్య – అనార్య సిద్ధాంతం
శూద్రులు, ఆ తర్వాత ‘పంచములు’ పుట్టుక గురించి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఆర్యులు ఇతర దేశాల నుండి వచ్చి, ఈ దేశవాసులైన వారిని జయించి, వీరిని దాసులుగా చేసుకొని, దస్యులు, బానిసలుగా పిలిచారని చరిత్ర కారులు చెప్తున్నారు. దీన్ని డా॥బి.ఆర్. అంబేద్కర్ రచనలు – ప్రసంగాలు 7వ సంపుటిలో సోదాహరణంగా విశ్లేషించారు.డా॥బి.ఆర్. అంబేద్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం
- శూద్రులు సూర్యవంశానికి చెందిన ఆర్యా కులాల్లో ఒకరు;
- ఆర్యుల సమాజం మూడే వర్ణాలను అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల్ని మాత్రమే గుర్తించిన కాలం ఒకటే ఉంది;
- శూద్రులు ఒక ప్రత్యేక వర్ణంగా ఏర్పడలేదు. ఇండో ఆర్యన్ సమాజంలో శూద్రులు క్షత్రియ వర్ణంలో ఒక భాగం;
- శూద్ర రాజులకు బ్రాహ్మణులకు మధ్య ఎడతెగకుండా సాగుతూ వచ్చిన పోరాటంలో బ్రాహ్మణులు అనేక అవమానాలకు హింసలకు గురయ్యారు;
- ఆ హింసా ఫలితంగా బ్రాహ్మణులకు శూద్రులంటే ఏర్పడిన ద్వేషం కారణంగా బ్రాహ్మణులు శూద్రులకు ఉపనయనం చేయడానికి నిరాకరించారు;
- ఉపనయన కర్మకు తిరస్కృతులైన కారణంగా ఆత్మీయులైన శూద్రులు సాంఘికంగా అధఃపతనమై వైశ్యులకన్నా తక్కువ స్థాయికి దిగజారి నాలుగో వర్ణం అయ్యారు;
అరుంధతీదేవి చండాలకన్యా? అనార్య జాతి స్త్రీయా?
అరుంధతీదేవిని ‘ఆరంజ్యోతి’ అని కూడా వ్యవహరిస్తుంటారు. మహా పతివ్రత. కర్ధమ ప్రజాపతి కుమార్తె. వసిష్ఠుని భార్య. కర్ధముడు బ్రహ్మచ్ఛాయలో పుట్టినవాడు. ఆతని భార్య దేవహూతి. కపిలుడు కూడా కర్ధముని కుమారుడే మన పురాణాలు తెలుపుతున్నాయి.
బ్రహ్మ పుత్రిక అయిన సంధ్యా దేవి మేధాతిధి యజ్ఞంలో ప్రాతస్సంధ్య, అరుంధతీదేవి, సాయం సంధ్య అనే ముగ్గురు మూర్తులుగా పుట్టినట్లు ఒక కథ ఉంది. కర్ధమ ప్రజాపతి తొమ్మండుగురు కుమార్తెలు. అందులో అరుంధతీదేవి ఒకటి. అనీ ఒక కథ ఉంది.
కర్ధముడు ప్రజాపతి అయితే, సృష్టికి కారకులైన ఆది పురుషులలో అతడొకడవుతాడు. ప్రజాప్రతుల కాలంలో వర్ణభేదమే లేదు. అలా కాకుండా కర్ధముడు ఆ తరువాత వాడైతే అతడు మతంగుడే కావచ్చు. అప్పుడు అరుంధతీదేవి అక్క చెల్లెండ్రు అనసూయ మొదలైన వాళ్ళంతా మతంగ వంశీయులే కావచ్చు. అరుంధతీదేవి తమ్ముడు కపిలమహర్షి కూడా మతంగుడే అవుతాడు కదా! (రాగవాసిష్ఠం ముందుమాట 10-11) అనేది రచయిత వాదన.
పురాణాల్లో కూడా అరుంధతీదేవి పుట్టుక గురించి స్పష్టమైన వివరణలు కనిపిచడం లేదు. అయినా, పురాణనామ చంద్రిక వంటి ఆధారాలను అనుసరించి దొరికినంత వరుకు ఇలా వివరించుకొనే వీలుంది.
అరుంధతీదేవి, వసిష్ఠులకు పుట్టినవాడు శక్తిమహర్షి. శక్తిమహర్షికీ మాతంగ కన్యకు పుట్టినవాడు పరాశరుడు. పరాశరుడికీ, సత్యవతికి పుట్టినవాడు వ్యాసుడు. ఇలా ఈ పుట్టుక పరిణామాన్ని పరిశీలిస్తే వ్యాసుడు ఆర్యుడా? అనార్యుడా? మహాభారతంలో అంతర్గతమైన భగవద్గీతలో ఇలాంటి భావాలు కొన్ని కనిపిస్తున్నాయి. ‘భగవద్గీత’ నాల్గవ అధ్యాయం 13వ శ్లోకంలో చాతుర్వర్ణాలను గుణ కర్మలను బట్టి సృష్టించినట్లు ఒక శ్లోకం కనిపిస్తుంది.
“చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ:
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమం.” (భగవద్గీత,4-13)
ఆర్యోక్తి గా ప్రచారంలో ఉన్న ఒక శ్లోకాన్ని నాటకం ముందుమాటలో బోయిభీమన్న గారు ఉదహరించారు.
”జన్మనా జాయతే శూద్ర:
కర్మణా జాయతే ద్విజ:
వేద పాఠంతు విప్రాణాం
బ్రహ్మజ్ఞానే బ్రాహ్మణ:”
దీని భావజాలమే సమాజంలో స్థిరపడిందనేది రచయిత బోయిభీమన్న గారి అభిప్రాయం. ఒకే వ్యక్తి జన్మతో శూద్రుడైతే, కర్మతో ద్విజుడుగా మారితే, ద్విజులంతా ఆర్యులైతే, శూద్రుడు అనార్యుడెలా అవుతాడు? అంతా ఆర్యులే కదా! ఆ విధంగా ”అరుంధతీదేవి” కూడా ఆర్యురాలే అవుతుందనేది బోయి భీమన్న గారి ఆభిప్రాయం.
ఈ శ్లోకం ఎక్కడుందని భగవద్గీత, మనుస్మృతులను పరిశీలించాను.నేను చూసిన ప్రతుల్లో కనిపించలేదు. బహుశా అదేమైనా స్మృతులలో గాని ఉండే అవకాశం ఉందేమో. డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ [9] కులం-అస్పృశ్యత గురించి చర్చిస్తూ ఈ శ్లోకాన్ని పాదసూచికలో కొంత భాగాన్ని ఇచ్చారు. అయినా వర్ణ వ్యవస్థ భారతదేశంలో ఉందనీ, అది గుణ కర్మలను అనుసరించి ఏర్పడిందని చెప్పేవాదనలు ప్రసిద్ధమే. కనుక అది ఎందులో ఉందనేది అవసరమే అయినా, అది దొరకకపోతే ఈ వ్యాసంలో ప్రతిపాదించే సిద్ధాంత సమన్వయానికి భంగం వాటిల్లు తుందని భావించనవసరం లేదనుకుంటాను.
చాతుర్వర్ణాలు గుణ, కర్మలను బట్టి ఏర్పడ్డాయనేది భగవద్గీత, మనుస్మృతులు మాత్రం చాటి చెప్తున్నాయి.
మనుస్మృతి ద్వాదశ అధ్యాయంలో చాతుర్వర్ణాల వారు ఆచరించవలసిన ధర్మాలను ఇలా వివరించడం కనిపిస్తుంది.
“చాతుర్వర్ణ్యస్య కృత్స్నోఽయముక్తో ధర్మస్త్వయానఘ,
కర్మణాం ఫలనిర్వృత్తిం శంస నస్తత్త్వతః పరామ్
స తాను వాచ ధర్మాత్మా మహర్షీన్మానవోభృగుః
అస్య సర్వస్య శృణుత కర్మ యోగస్య నిర్ణయమ్” (మనుస్మృతి, 12-1,2)
మహానుభావా! మాకింత వరకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనుష్ఠించాల్సిన ధర్మాలన్ననీ చెప్పినారు. ఇక ఇప్పుడు ఈ జన్మలో చేసిన కర్మలకు తరువాతి జన్మలలో కలుగు ఫలం ఏవిధంగా ఉంటుందో దానినంతా వివరించండి అని మహర్షులు భృగుమహర్షిని అడిగినారు. అప్పుడా మహర్షులతో మనుపుత్రుడైన భృగుమహర్షి సమస్త కర్మల యొక్క ఫలితాన్ని ఇట్లు చెప్పసాగెను.
“శుభాశుభఫలం కర్మ మనోవాగ్దేహ సంభవమ్,
కర్మజా గతయో నౄణాముత్తమాధమ మధ్యమాః
“తస్యేహ త్రివిధస్యాపి త్ర్యధిష్ఠానస్య దేహినః,
దశ లక్షణ యుక్తస్య మనో విద్యాత్ర్పవర్తకమ్.” (మనుస్మృతి, 12-3,4)
మనస్సు, వాక్కు దేహం ఇవి చేసే కర్మ శుభాశుభ ఫలములను కలిగిస్తున్నది. ఈ కర్మవల్లనే జీవులకు ఉత్తమ, మధ్యమ అధమగతులేర్పడుతున్నాయి. ఈ విధంగా జీవికి మనోవక్కాయములచే ఉత్తమాది త్రివిధగతులేర్పడుతున్నా దశవిధ లక్షణాలుగల కర్మకు కారణమని చెప్పాల్సి ఉంది. అని మనుస్మృతి కర్మలను అనుసరించి జన్మ ఏర్పడుతుందనే వివరణను ఇస్తుంది. (చూడు: మనుస్మృతి, తెలుగు తాత్పర్య సహితం, డా॥ యన్. యల్. నరసింహాచార్య 2000: 334)
బ్రాహ్మణ స్త్రీకి – శూద్ర పురుషునికి పుట్టినవాడు ‘చండాలుడు’ అని మనుస్మృతి చెప్తుంది. శూద్రుని వలన వైశ్య స్త్రీకి పుట్టిన వాడు అయోగుడు. క్షత్రియ స్త్రీకి పుట్టిన వాడు క్షత. వీరంతా వర్ణ సంకరులు. వీరే అవర్ణులు. అంటే, ఏ వర్ణానికీ చెందనివారు. వారే ‘పంచమ వర్ణం’ వాళ్ళు!
వర్ణానికీ, జాతికీ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.
“జాతి అంటే కొన్ని ఆనువంశిక ప్రత్యేక లక్షణాలు కలిగిన ఒక జన సమూహం అని నిర్వచించవచ్చు.”(శూద్రులెవరు? అంబేద్కర్ రచనలు ప్రసంగాలు 7 వ సంపుటి,1992 : 59.) అని డా.బి.ఆర్. డా॥బి.ఆర్. అంబేద్కర్ నిర్వచించారు.
జాతిని రూపొందించేటప్పుడు చూడవలసి ఉంటుందని కొన్నిలక్షణాలను పేర్కొన్నారు. అవి: 1.శిరస్సు ఆకృతి, 2. జుట్టు, 3. శరీరచ్ఛాయ, 4. మనుషుల పొడవు.
దీనిలో రంగు, పొడవు అనేవి శీతోష్ణ స్థితిని బట్టి ఆవాసాన్ని బట్టి మారుతూ ఉండే లక్షణాలు. కనుక, వాటిని జాతి నిర్ణయ లక్షణాలుగా పేర్కొనవలసిన అవసరం లేదనే అభిప్రాయం నేడు ప్రబలి ఉంది.” ( శూద్రులెవరు? అంబేద్కర్ రచనలు ప్రసంగాలు 7 వ సంపుటి,1992 : 59.) అని డా.బి.ఆర్. అంబేద్కర్ వివరించారు.
కేవలం శరీర వర్ణమే ప్రధానమైతే యూరోపియన్ జాతులలో అన్ని వర్ణాల వారూ ఉన్నారని, అయినా వారి మధ్య వర్ణ భేదాలు లేవని డా॥బి.ఆర్. అంబేద్కర్ విశ్లేషించారు.
“ఆర్యజాతి వారు, అనార్య జాతులైన దాసులను, దస్యులను యుద్ధంలో జయించారని చెప్పే సిద్ధాంతానికి తావు లేదని ఋగ్వేదంలోని అనేక ఋక్కుల్లో పేర్కొన్న “ఆర్య” శబ్దాన్ని ఆధారం చేసుకొని డా॥బి.ఆర్. అంబేద్కర్ సోదాహరణంగా నిరూపించారు.
“ఆర్యులు భారతదేశంపై దాడి చేసి జయించారనేది అభూత కల్పన.” అని డా॥బి.ఆర్. అంబేద్కర్ వాదన (శూద్రులెవరు? అంబేద్కర్ రచనలు ప్రసంగాలు 7 వ సంపుటి,1992 : 73) అంతేకాదు “దాసులు, దస్యులు భారత దేశానికి చెందిన ఆదిమ తెగల వారు అనడం ఖచ్చితంగా తప్పు” [3 పే. 73] అని కూడా డా॥బి.ఆర్. అంబేద్కర్ ఆర్యజాతి సిద్ధాంతాన్ని పూర్వ పక్షం చేసే ప్రయత్నం చేశారు.
ఈ పై సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొనే ‘రాగవాసిష్ఠం’ నాటక రచయిత బోయి భీమన్న గారు భారతీయులందరూ ఆర్యులే అనే సిద్ధాంతాన్ని ఈ నాటకంలో అన్వయించే ప్రయత్నం చేశారు.
పైగా ఈ నాటకం గురించి హైమవతి గారు భీమన్న గారి ఆత్మకథలో రాస్తూ “ఆర్యులు ద్రావుడులు ఒకే జాతికి చెందిన వారు, రక్త సంబంధీకులు”అనే సిద్ధాంతం కూడా నార్ల వారికి నచ్చలేదా కాలంలో. రావవాస్ఠం నాటకం ఈ సిద్ధాంతం మీద వ్రాయబడి నట్టిదే”( పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయి భీమన్న, 1982 : 277) అని మరింతగా స్పష్టం చేయడాన్ని గమనించవలసి ఉంది.
ఈ నాటకం గురించే వ్యాఖానిస్తూ హైమవతి గారు “నిండాచాదస్తం గల సనాతన పండితులు సైతం కాదనలేని సిద్ధాంతాలు భీమన్నవి”( పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయి భీమన్న, 1982 : 634) అన్నారు.
ఏది ఏమైనా డా॥బి.ఆర్. అంబేద్కర్ భావజాలం బోయి భీమన్న గారిలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పడానికి ఈ నాటకం గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు.
అంతేకాకుండా ఆర్య, అనార్య భేద భావాలు స్థల కాలాలను అనుసరించి ఏర్పడినవని చెప్పడం ద్వారా కూడా ఒక విశ్వజనీనమైన మానవుణ్ణి రచయిత ఈ నాటకంలో ప్రతిష్టించే ప్రయత్నం చేసినట్లు చెప్పే వీలుంది.
నాటక నామౌచిత్యం
ఈ నాటకానికి రచయిత రాగవాసిష్ఠం అని పేరు పెట్టారు. దీన్ని హైమవతి గారు పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయి భీమన్నలో రాగవాశిష్టం అనే చాలా సార్లు రాశారు. ఈ వ్యాసంలో మాత్రం నాటకం ముఖ చిత్రంపై ఉన్న రాగవాసిష్ఠం అనే ప్రయోగించడానికి ప్రయత్నించాను.యోగవాశిష్ఠం, జ్ఞానవాసిష్ఠం ఉన్నట్లే ఈ పవిత్ర కల్యాణ గాథకు ‘రాగవాసిష్ఠం’ అనే పేరు పెట్టానని రచయిత రాసుకున్న ముందుమాటలోనే చెప్పుకున్నారు. ‘రాగం’ అంటే అనుబంధం, ప్రేమ, అనురాగం వంటి అర్థాలు ఉన్నాయి. వసిష్ఠుని ప్రేమ, వసిష్ఠుని అనురాగం, వసిష్ఠునిపై అనురాగం వంటి అర్థాలను ఆశించి ఈ నాటకానికి ఈ పేరు పెట్టారని తెలుస్తుంది. నాటకం చివరి వరకూ రాగబంధమే. అంటే ప్రేమ బంధమే కొనసాగింది. ఈ విధంగా చూసినప్పుడు ఇది గొప్ప ఔచిత్యంతో పెట్టిన పేరే.
ఈ విధంగా పరిశీలించినప్పుడు రాగవాసిష్ఠం నాటకంలో కొన్ని చర్చనీయాంశాలు ఉన్నాయనీ, సృజనాత్మక సాహిత్యం కేవలం ఆనందం కోసమే కాకుండా ఆలోచనాత్మకంగా కూడా మలచి సాహిత్య ప్రయోజనాన్ని తెలియగుర్తించేలా చేయవచ్చని నిరూపించిన రచనగా దీన్ని చెప్పవచ్చు.
ఆధార గ్రంథాలు
- జ్ఞానానందకవి యస్.టి ,1997, షెడ్యూలు కులాలు అంటరానివా! కాకినాడ: సురగాలి ప్రచురణలు
- జగన్నాధం నములకంటి .1968, ఆరుంథతీదేవి చరిత్రము. హైదరాబాద్ : వైదిక గ్రంథప్రచారమండలి ప్రచురణలు
- నారాయణరెడ్డి, సి.(ప్రధాన సంపాదకుడు ) 1992, బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు – ప్రసంగాలు 7వ సంపుటి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలు
- భీమన్న బోయి. 1959, రాగ వాశిష్ఠం .హైదరాబాదు : సుఖేలానికేతన్ ప్రచురణలు
- మూర్తి .బి .బి.యస్ ,1992, దళిత కధామంజరి .రాజమండ్రి : త్రివేణి ప్రింటర్స్ ప్రచురణలు
- నరసింహాచార్య యన్. యల్. (వ్యాఖ్యాత ), 2000, మనుస్మృతి, (తెలుగు తాత్పర్యం సహితం) హైదరాబాదు: గాయత్రీ ప్రచురణలు
- వేదవ్యాస, 2000, ప్రాచీన భగవద్గీత (పరిష్కృతమైన మూలము), యోగమిత్రమండలి ప్రచురణ, హైదరాబాదు, ప్రధమ ముద్రణ .
- హైమవతి , 1982, ద్వితీయ ముద్రణ, పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయి భీమన్న, ( ప్రథమ ముద్రణ ,1978), హైదరాబాదు : సుఖేలానికేతన్ ప్రచురణలు
- Religion and Society By S. Radhakrishnan p. 129