రాగవాసిష్ఠం- నాటక వైశిష్ట్యం

నాటక రచనా విధానం

నాందీ, ప్రస్తావనల కంటే, నాటకాన్ని 12 రంగాలుగా విభజించి, మొదటి రంగంలోనే జరగబోయే కథను చక్కగా సూచించగలిగారు. నాటక ప్రదర్శనలో పంచ సంధులను ఉపయోగించుకున్నారు..

“మేలుకో మేలుకో” పాటతో వసిష్ఠుడు తపస్సు నుండి మేల్కొనడం, మూఢత్వాన్ని వదిలి జ్ఞానం వైపు పయనించడం జరిగింది. సంధ్య ద్వారా పరిచయమై, అరుంధతీదేవిని చేరి, జలగండం నుండి రక్షించినట్లు మొదటి రంగాన్ని బట్టి తెలుస్తుంది. జలగండాలేమైనా సంభవించినప్పుడు వాటి నుండి రక్షించుకోవడానికి యోగ ముద్రను దాల్చవచ్చనీ అలా అరుంధతీదేవి చేసిందన్నట్లు రంగాన్ని వర్ణించారు.

తరువాత కథలో కూడా ఇదే రకంగా జరుగుతుంది. వసిష్ఠుడిని ప్రేమించడం, ఆ విషయం ప్రాచీనుడికి తెలియడం. ఆమె చండాల కన్య అని వసిష్ఠుడికి , ప్రాచీనుడికీ తెలిసినా, ఆమెకు ఆ విషయం తెలియకుండానే సాలభంజికగా మారిపోవడం, మళ్ళీ సమస్య పరిష్కరింపబడిన తర్వాత ఆమె యోగ ముద్రను దాల్చడం, దాన్ని వీడటం వంటివన్నీ ఒక దాని తర్వాత మరొకటి జరిగిపోతాయి.

ఇది గొప్ప సంవిధానం. గొప్ప నాటక శిల్పం. నాందీ, ప్రస్తావనలు లేకుండానే పంచ సంధులు, కార్యావస్థలతో కథా కథనాన్ని ముందుకి నడిపించడంలో ఉన్న శిల్ప ప్రత్యేకత. ఈ పరిశోధన పత్రంలో శిల్పానుశీలన కంటే విషయానుశీలనకే ప్రాధాన్యతనిస్తున్నాను.

గేయాలు – పద్యాలు

ప్రతి రంగంలోనూ సందర్భానుగుణంగా చక్కని భావాలతో గేయాలు, పద్యాలు వర్ణించారు. ఆ గేయాలు, పద్యాలు గొప్ప భావుకతతో పాటు, చైతన్యవంతమైన సందేశాలతో కూడి ఉన్నాయి. వీటన్నింటితో దీన్ని దృశ్య నాటకంగా ప్రదర్శిస్తే ఆధునిక సినిమాకి ఏ మాత్రమూ తీసిపోనట్లే ఉంది. సినిమా స్క్రిప్టులో ఉండే ఎన్నో రకాల పద్ధతులు దీనిలోనూ ఉన్నాయి.

పాత్రలు – సంఘర్షణ

ఈ నాటకంలో అరుంధతీదేవి, వసిష్ఠుడు, ప్రాచీనుడు, సంధ్య పాత్రలు ప్రధానమైనవి. వసిష్ఠుడు – ప్రాచీనుడు సంఘర్షణాత్మక పాత్రలు. సంప్రదాయాన్ని చెక్కు చెదరనీయకుండా కాపాడేందుకు ప్రాచీన ధర్మాలన్నింటినీ పాటించమని వాదించేవాడు ప్రాచీనుడు. స్నేహం, పరస్పర అవగాహన, మానవీయతా గుణాలే ప్రధానమని నమ్మి, వాటి ముందు జాతి భేదాలు నిలబడవని వాదించే స్వభావం వసిష్ఠుడిది. అర్ష సంప్రదాయానికీ, మార్పుని కోరుకొనే అభ్యుదయ వర్గానికీ మధ్య పాత్రోచితంగా గొప్ప సంఘర్షణ జరిగేటట్లు ఈ పాత్రలను తీర్చిదిద్దారు రచయిత.

కులగిరి ప్రాచీనుడి శిష్యుడు. సదాచారాన్నే నమ్ముకునేవాడు. నత్తి నత్తిగా మాట్లాడుతూ, వచ్చీ రాని శ్లోకాలతో పురాణేతిహాసాలను ప్రామాణిక వాక్యాలుగా చెప్తుంటాడు. అయినా, సందర్భాన్ని బట్టి గురువు దగ్గర కూడా అబద్దమాడడానికి వెనుకాడడు. మాదిగ లేదా కింది వర్ణాల వారిని వ్యతిరేకిస్తూనే, అందగత్తె అయితే, ఆమె మాదిగమ్మాయి అయినా, ఆమె వల్ల ఆనందం కలుగుతుందంటే దాన్ని పొందడానికి వెనుకాడని వాడు. అగ్రవర్ణమని చెప్పుకుంటూనే, కింది వర్ణాలనబడేవారిని అవసరానికి అనుగుణంగా ఎలా వాడుకుంటూ ఉంటారో కులగిరి పాత్ర ద్వారా రచయిత సూచించే ప్రయత్నం చేశారు.

సంధ్య పాత్ర ప్రకృతి చైతన్యానికి ప్రతీకాత్మకంగా ఎన్నుకున్నారు రచయిత. అలాగే కుంభోదరం, గోష్పాధం పాత్రలు కూడా సనాతన సంప్రదాయంలో కొనసాగే అవకాశవాద పెద్ద మనుషులకు ప్రతీకగానే తీర్చిదిద్దారు. అరుంధతీదేవి పాత్ర ఒక స్వచ్ఛమైన ప్రేమ మూర్తిగా, ఆదర్శనారిగా, వర్ణభేదాలేమీ తెలియని నిష్కల్మషమూర్తిగా, అందరి సుఖసంతోషాలను కాంక్షించే వరప్రదాయినిగా ఈ పాత్రను గొప్ప ఔచిత్యంతో తీర్చిదిద్దారు.

నాటకతత్త్వం

నిష్కల్మషమైన జీవనానికి మానవుల మధ్య వర్ణ భేదాలు అవసరం లేదు. అవన్నీ కొంతమంది స్వార్థంకోసం, తమ ఆధిక్యం కోసం సృష్టించుకొన్నవి, వాటిని ఎంత త్వరగా విస్మరించి నిర్మూలించగలిగితే, అంత త్వరగా భారతీయత సమైక్యంగా బలపడుతుందనేది ఈ నాటకం ఇచ్చే సందేశం.

నాటకంలో వసిష్ఠుడు, ప్రాచీనుడు, శివుడు పాత్రలగతంగా పలికించిన సంభాషణల్లో ఆర్య – అనార్య భేదాలు భారతదేశంలో నెలకొన్నాయనీ, అవి మానవ జీవనాన్ని హెచ్చు తగ్గుల సమాజంగా విభజించి, మానసిక, భౌతిక సంఘర్షణలకు కారణమవుతున్నాయనీ, వాటిలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలని చెప్పించగలిగారు.

పరమశివుడు పాత్ర ద్వారా మానవులంతా ఒకే జాతి వారనీ, స్థల, కుల భేదాలను బట్టి, తాత్కాలిక అవసరాలను బట్టి అలా రూపొందించుకున్నారు తప్ప, భేదాలేమీ లేవని చెప్పడం ద్వారా ఈ నాటకం ద్వారా రచయిత విశ్వజనీన మానవుడి లక్షణాలను ప్రతిపాదించినట్లయ్యింది. దీనికి డా.బి.ఆర్.అంబేద్కర్ చెప్పిన ‘ఆర్య జాతి సిద్ధాంతాన్ని’ చాలా వరకూ ఈ నాటకంలో అనువర్తించిన విధానం ప్రశంసనీయం.

సిద్ధాంతం కోసం నాటకం రాసినట్లుగా కాకుండా, నాటకంలోనే అప్రయత్నంగా ఆ సిద్ధాంతం వచ్చి చేరినట్లుగా రచన కొనసాగింది.

అయితే ఈ సిద్ధాంతం పట్ల ఇప్పటికీ వాదవివాదాలు జరుగుతునే ఉన్నాయి.చరిత్రకారుల్లోఈ సిద్ధాంతం పట్ల భిన్నాబిప్రాయాలు వ్యక్తమవుతునే ఉన్నాయి. అయినప్పటికీ ఒక నాటకంలో ఏదైనా ఒక సిద్ధాంతం ఎలా సమన్వయించే ప్రయత్నం జరుగుతుందో విశ్లేషిస్తూ, ఆ నాటకాన్ని పరిచయం చేయాలనే లక్ష్యమే ఈ వ్యాసాన్ని రాయించింది.

ఆర్య – అనార్య సిద్ధాంతం

శూద్రులు, ఆ తర్వాత ‘పంచములు’ పుట్టుక గురించి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఆర్యులు ఇతర దేశాల నుండి వచ్చి, ఈ దేశవాసులైన వారిని జయించి, వీరిని దాసులుగా చేసుకొని, దస్యులు, బానిసలుగా పిలిచారని చరిత్ర కారులు చెప్తున్నారు. దీన్ని డా॥బి.ఆర్. అంబేద్కర్ రచనలు – ప్రసంగాలు 7వ సంపుటిలో సోదాహరణంగా విశ్లేషించారు.డా॥బి.ఆర్. అంబేద్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం

  1. శూద్రులు సూర్యవంశానికి చెందిన ఆర్యా కులాల్లో ఒకరు;
  2. ఆర్యుల సమాజం మూడే వర్ణాలను అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల్ని మాత్రమే గుర్తించిన కాలం ఒకటే ఉంది;
  3. శూద్రులు ఒక ప్రత్యేక వర్ణంగా ఏర్పడలేదు. ఇండో ఆర్యన్ సమాజంలో శూద్రులు క్షత్రియ వర్ణంలో ఒక భాగం;
  4. శూద్ర రాజులకు బ్రాహ్మణులకు మధ్య ఎడతెగకుండా సాగుతూ వచ్చిన పోరాటంలో బ్రాహ్మణులు అనేక అవమానాలకు హింసలకు గురయ్యారు;
  5. ఆ హింసా ఫలితంగా బ్రాహ్మణులకు శూద్రులంటే ఏర్పడిన ద్వేషం కారణంగా బ్రాహ్మణులు శూద్రులకు ఉపనయనం చేయడానికి నిరాకరించారు;
  6. ఉపనయన కర్మకు తిరస్కృతులైన కారణంగా ఆత్మీయులైన శూద్రులు సాంఘికంగా అధఃపతనమై వైశ్యులకన్నా తక్కువ స్థాయికి దిగజారి నాలుగో వర్ణం అయ్యారు;

అరుంధతీదేవి చండాలకన్యా? అనార్య జాతి స్త్రీయా?

అరుంధతీదేవిని ‘ఆరంజ్యోతి’ అని కూడా వ్యవహరిస్తుంటారు. మహా పతివ్రత. కర్ధమ ప్రజాపతి కుమార్తె. వసిష్ఠుని భార్య. కర్ధముడు బ్రహ్మచ్ఛాయలో పుట్టినవాడు. ఆతని భార్య దేవహూతి. కపిలుడు కూడా కర్ధముని కుమారుడే మన పురాణాలు తెలుపుతున్నాయి.

బ్రహ్మ పుత్రిక అయిన సంధ్యా దేవి మేధాతిధి యజ్ఞంలో ప్రాతస్సంధ్య, అరుంధతీదేవి, సాయం సంధ్య అనే ముగ్గురు మూర్తులుగా పుట్టినట్లు ఒక కథ ఉంది. కర్ధమ ప్రజాపతి తొమ్మండుగురు కుమార్తెలు. అందులో అరుంధతీదేవి ఒకటి. అనీ ఒక కథ ఉంది.

కర్ధముడు ప్రజాపతి అయితే, సృష్టికి కారకులైన ఆది పురుషులలో అతడొకడవుతాడు. ప్రజాప్రతుల కాలంలో వర్ణభేదమే లేదు. అలా కాకుండా కర్ధముడు ఆ తరువాత వాడైతే అతడు మతంగుడే కావచ్చు. అప్పుడు అరుంధతీదేవి అక్క చెల్లెండ్రు అనసూయ మొదలైన వాళ్ళంతా మతంగ వంశీయులే కావచ్చు. అరుంధతీదేవి తమ్ముడు కపిలమహర్షి కూడా మతంగుడే అవుతాడు కదా! (రాగవాసిష్ఠం ముందుమాట 10-11) అనేది రచయిత వాదన.

పురాణాల్లో కూడా అరుంధతీదేవి పుట్టుక గురించి స్పష్టమైన వివరణలు కనిపిచడం లేదు. అయినా, పురాణనామ చంద్రిక వంటి ఆధారాలను అనుసరించి దొరికినంత వరుకు ఇలా వివరించుకొనే వీలుంది.

అరుంధతీదేవి, వసిష్ఠులకు పుట్టినవాడు శక్తిమహర్షి. శక్తిమహర్షికీ మాతంగ కన్యకు పుట్టినవాడు పరాశరుడు. పరాశరుడికీ, సత్యవతికి పుట్టినవాడు వ్యాసుడు. ఇలా ఈ పుట్టుక పరిణామాన్ని పరిశీలిస్తే వ్యాసుడు ఆర్యుడా? అనార్యుడా? మహాభారతంలో అంతర్గతమైన భగవద్గీతలో ఇలాంటి భావాలు కొన్ని కనిపిస్తున్నాయి. ‘భగవద్గీత’ నాల్గవ అధ్యాయం 13వ శ్లోకంలో చాతుర్వర్ణాలను గుణ కర్మలను బట్టి సృష్టించినట్లు ఒక శ్లోకం కనిపిస్తుంది.

“చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ:
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమం.” (భగవద్గీత,4-13)

ఆర్యోక్తి గా ప్రచారంలో ఉన్న ఒక శ్లోకాన్ని నాటకం ముందుమాటలో బోయిభీమన్న గారు ఉదహరించారు.

”జన్మనా జాయతే శూద్ర:
కర్మణా జాయతే ద్విజ:
వేద పాఠంతు విప్రాణాం
బ్రహ్మజ్ఞానే బ్రాహ్మణ:”

దీని భావజాలమే సమాజంలో స్థిరపడిందనేది రచయిత బోయిభీమన్న గారి అభిప్రాయం. ఒకే వ్యక్తి జన్మతో శూద్రుడైతే, కర్మతో ద్విజుడుగా మారితే, ద్విజులంతా ఆర్యులైతే, శూద్రుడు అనార్యుడెలా అవుతాడు? అంతా ఆర్యులే కదా! ఆ విధంగా ”అరుంధతీదేవి” కూడా ఆర్యురాలే అవుతుందనేది బోయి భీమన్న గారి ఆభిప్రాయం.

ఈ శ్లోకం ఎక్కడుందని భగవద్గీత, మనుస్మృతులను పరిశీలించాను.నేను చూసిన ప్రతుల్లో కనిపించలేదు. బహుశా అదేమైనా స్మృతులలో గాని ఉండే అవకాశం ఉందేమో. డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ [9] కులం-అస్పృశ్యత గురించి చర్చిస్తూ ఈ శ్లోకాన్ని పాదసూచికలో కొంత భాగాన్ని ఇచ్చారు. అయినా వర్ణ వ్యవస్థ భారతదేశంలో ఉందనీ, అది గుణ కర్మలను అనుసరించి ఏర్పడిందని చెప్పేవాదనలు ప్రసిద్ధమే. కనుక అది ఎందులో ఉందనేది అవసరమే అయినా, అది దొరకకపోతే ఈ వ్యాసంలో ప్రతిపాదించే సిద్ధాంత సమన్వయానికి భంగం వాటిల్లు తుందని భావించనవసరం లేదనుకుంటాను.

చాతుర్వర్ణాలు గుణ, కర్మలను బట్టి ఏర్పడ్డాయనేది భగవద్గీత, మనుస్మృతులు మాత్రం చాటి చెప్తున్నాయి.

మనుస్మృతి ద్వాదశ అధ్యాయంలో చాతుర్వర్ణాల వారు ఆచరించవలసిన ధర్మాలను ఇలా వివరించడం కనిపిస్తుంది.

“చాతుర్వర్ణ్యస్య కృత్స్నోఽయముక్తో ధర్మస్త్వయానఘ,
కర్మణాం ఫలనిర్వృత్తిం శంస నస్తత్త్వతః పరామ్
స తాను వాచ ధర్మాత్మా మహర్షీన్మానవోభృగుః
అస్య సర్వస్య శృణుత కర్మ యోగస్య నిర్ణయమ్‌” (మనుస్మృతి, 12-1,2)

మహానుభావా! మాకింత వరకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనుష్ఠించాల్సిన ధర్మాలన్ననీ చెప్పినారు. ఇక ఇప్పుడు ఈ జన్మలో చేసిన కర్మలకు తరువాతి జన్మలలో కలుగు ఫలం ఏవిధంగా ఉంటుందో దానినంతా వివరించండి అని మహర్షులు భృగుమహర్షిని అడిగినారు. అప్పుడా మహర్షులతో మనుపుత్రుడైన భృగుమహర్షి సమస్త కర్మల యొక్క ఫలితాన్ని ఇట్లు చెప్పసాగెను.

“శుభాశుభఫలం కర్మ మనోవాగ్దేహ సంభవమ్,
కర్మజా గతయో నౄణాముత్తమాధమ మధ్యమాః
“తస్యేహ త్రివిధస్యాపి త్ర్యధిష్ఠానస్య దేహినః,
దశ లక్షణ యుక్తస్య మనో విద్యాత్ర్పవర్తకమ్.” (మనుస్మృతి, 12-3,4)

మనస్సు, వాక్కు దేహం ఇవి చేసే కర్మ శుభాశుభ ఫలములను కలిగిస్తున్నది. ఈ కర్మవల్లనే జీవులకు ఉత్తమ, మధ్యమ అధమగతులేర్పడుతున్నాయి. ఈ విధంగా జీవికి మనోవక్కాయములచే ఉత్తమాది త్రివిధగతులేర్పడుతున్నా దశవిధ లక్షణాలుగల కర్మకు కారణమని చెప్పాల్సి ఉంది. అని మనుస్మృతి కర్మలను అనుసరించి జన్మ ఏర్పడుతుందనే వివరణను ఇస్తుంది. (చూడు: మనుస్మృతి, తెలుగు తాత్పర్య సహితం, డా॥ యన్. యల్. నరసింహాచార్య 2000: 334)

బ్రాహ్మణ స్త్రీకి – శూద్ర పురుషునికి పుట్టినవాడు ‘చండాలుడు’ అని మనుస్మృతి చెప్తుంది. శూద్రుని వలన వైశ్య స్త్రీకి పుట్టిన వాడు అయోగుడు. క్షత్రియ స్త్రీకి పుట్టిన వాడు క్షత. వీరంతా వర్ణ సంకరులు. వీరే అవర్ణులు. అంటే, ఏ వర్ణానికీ చెందనివారు. వారే ‘పంచమ వర్ణం’ వాళ్ళు!

వర్ణానికీ, జాతికీ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.

“జాతి అంటే కొన్ని ఆనువంశిక ప్రత్యేక లక్షణాలు కలిగిన ఒక జన సమూహం అని నిర్వచించవచ్చు.”(శూద్రులెవరు? అంబేద్కర్ రచనలు ప్రసంగాలు 7 వ సంపుటి,1992 : 59.) అని డా.బి.ఆర్. డా॥బి.ఆర్. అంబేద్కర్ నిర్వచించారు.

జాతిని రూపొందించేటప్పుడు చూడవలసి ఉంటుందని కొన్నిలక్షణాలను పేర్కొన్నారు. అవి: 1.శిరస్సు ఆకృతి, 2. జుట్టు, 3. శరీరచ్ఛాయ, 4. మనుషుల పొడవు.

దీనిలో రంగు, పొడవు అనేవి శీతోష్ణ స్థితిని బట్టి ఆవాసాన్ని బట్టి మారుతూ ఉండే లక్షణాలు. కనుక, వాటిని జాతి నిర్ణయ లక్షణాలుగా పేర్కొనవలసిన అవసరం లేదనే అభిప్రాయం నేడు ప్రబలి ఉంది.” ( శూద్రులెవరు? అంబేద్కర్ రచనలు ప్రసంగాలు 7 వ సంపుటి,1992 : 59.) అని డా.బి.ఆర్. అంబేద్కర్ వివరించారు.

కేవలం శరీర వర్ణమే ప్రధానమైతే యూరోపియన్ జాతులలో అన్ని వర్ణాల వారూ ఉన్నారని, అయినా వారి మధ్య వర్ణ భేదాలు లేవని డా॥బి.ఆర్. అంబేద్కర్ విశ్లేషించారు.

“ఆర్యజాతి వారు, అనార్య జాతులైన దాసులను, దస్యులను యుద్ధంలో జయించారని చెప్పే సిద్ధాంతానికి తావు లేదని ఋగ్వేదంలోని అనేక ఋక్కుల్లో పేర్కొన్న “ఆర్య” శబ్దాన్ని ఆధారం చేసుకొని డా॥బి.ఆర్. అంబేద్కర్ సోదాహరణంగా నిరూపించారు.

“ఆర్యులు భారతదేశంపై దాడి చేసి జయించారనేది అభూత కల్పన.” అని డా॥బి.ఆర్. అంబేద్కర్ వాదన (శూద్రులెవరు? అంబేద్కర్ రచనలు ప్రసంగాలు 7 వ సంపుటి,1992 : 73) అంతేకాదు “దాసులు, దస్యులు భారత దేశానికి చెందిన ఆదిమ తెగల వారు అనడం ఖచ్చితంగా తప్పు” [3 పే. 73] అని కూడా డా॥బి.ఆర్. అంబేద్కర్ ఆర్యజాతి సిద్ధాంతాన్ని పూర్వ పక్షం చేసే ప్రయత్నం చేశారు.

ఈ పై సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొనే ‘రాగవాసిష్ఠం’ నాటక రచయిత బోయి భీమన్న గారు భారతీయులందరూ ఆర్యులే అనే సిద్ధాంతాన్ని ఈ నాటకంలో అన్వయించే ప్రయత్నం చేశారు.

పైగా ఈ నాటకం గురించి హైమవతి గారు భీమన్న గారి ఆత్మకథలో రాస్తూ “ఆర్యులు ద్రావుడులు ఒకే జాతికి చెందిన వారు, రక్త సంబంధీకులు”అనే సిద్ధాంతం కూడా నార్ల వారికి నచ్చలేదా కాలంలో. రావవాస్ఠం నాటకం ఈ సిద్ధాంతం మీద వ్రాయబడి నట్టిదే”( పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయి భీమన్న, 1982 : 277) అని మరింతగా స్పష్టం చేయడాన్ని గమనించవలసి ఉంది.

ఈ నాటకం గురించే వ్యాఖానిస్తూ హైమవతి గారు “నిండాచాదస్తం గల సనాతన పండితులు సైతం కాదనలేని సిద్ధాంతాలు భీమన్నవి”( పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయి భీమన్న, 1982 : 634) అన్నారు.

ఏది ఏమైనా డా॥బి.ఆర్. అంబేద్కర్ భావజాలం బోయి భీమన్న గారిలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పడానికి ఈ నాటకం గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు.

అంతేకాకుండా ఆర్య, అనార్య భేద భావాలు స్థల కాలాలను అనుసరించి ఏర్పడినవని చెప్పడం ద్వారా కూడా ఒక విశ్వజనీనమైన మానవుణ్ణి రచయిత ఈ నాటకంలో ప్రతిష్టించే ప్రయత్నం చేసినట్లు చెప్పే వీలుంది.

నాటక నామౌచిత్యం

ఈ నాటకానికి రచయిత రాగవాసిష్ఠం అని పేరు పెట్టారు. దీన్ని హైమవతి గారు పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయి భీమన్నలో రాగవాశిష్టం అనే చాలా సార్లు రాశారు. ఈ వ్యాసంలో మాత్రం నాటకం ముఖ చిత్రంపై ఉన్న రాగవాసిష్ఠం అనే ప్రయోగించడానికి ప్రయత్నించాను.యోగవాశిష్ఠం, జ్ఞానవాసిష్ఠం ఉన్నట్లే ఈ పవిత్ర కల్యాణ గాథకు ‘రాగవాసిష్ఠం’ అనే పేరు పెట్టానని రచయిత రాసుకున్న ముందుమాటలోనే చెప్పుకున్నారు. ‘రాగం’ అంటే అనుబంధం, ప్రేమ, అనురాగం వంటి అర్థాలు ఉన్నాయి. వసిష్ఠుని ప్రేమ, వసిష్ఠుని అనురాగం, వసిష్ఠునిపై అనురాగం వంటి అర్థాలను ఆశించి ఈ నాటకానికి ఈ పేరు పెట్టారని తెలుస్తుంది. నాటకం చివరి వరకూ రాగబంధమే. అంటే ప్రేమ బంధమే కొనసాగింది. ఈ విధంగా చూసినప్పుడు ఇది గొప్ప ఔచిత్యంతో పెట్టిన పేరే.

ఈ విధంగా పరిశీలించినప్పుడు రాగవాసిష్ఠం నాటకంలో కొన్ని చర్చనీయాంశాలు ఉన్నాయనీ, సృజనాత్మక సాహిత్యం కేవలం ఆనందం కోసమే కాకుండా ఆలోచనాత్మకంగా కూడా మలచి సాహిత్య ప్రయోజనాన్ని తెలియగుర్తించేలా చేయవచ్చని నిరూపించిన రచనగా దీన్ని చెప్పవచ్చు.

ఆధార గ్రంథాలు

  1. జ్ఞానానందకవి యస్.టి ,1997, షెడ్యూలు కులాలు అంటరానివా! కాకినాడ: సురగాలి ప్రచురణలు
  2. జగన్నాధం నములకంటి .1968, ఆరుంథతీదేవి చరిత్రము. హైదరాబాద్ : వైదిక గ్రంథప్రచారమండలి ప్రచురణలు
  3. నారాయణరెడ్డి, సి.(ప్రధాన సంపాదకుడు ) 1992, బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు – ప్రసంగాలు 7వ సంపుటి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలు
  4. భీమన్న బోయి. 1959, రాగ వాశిష్ఠం .హైదరాబాదు : సుఖేలానికేతన్ ప్రచురణలు
  5. మూర్తి .బి .బి.యస్ ,1992, దళిత కధామంజరి .రాజమండ్రి : త్రివేణి ప్రింటర్స్ ప్రచురణలు
  6. నరసింహాచార్య యన్. యల్. (వ్యాఖ్యాత ), 2000, మనుస్మృతి, (తెలుగు తాత్పర్యం సహితం) హైదరాబాదు: గాయత్రీ ప్రచురణలు
  7. వేదవ్యాస, 2000, ప్రాచీన భగవద్గీత (పరిష్కృతమైన మూలము), యోగమిత్రమండలి ప్రచురణ, హైదరాబాదు, ప్రధమ ముద్రణ .
  8. హైమవతి , 1982, ద్వితీయ ముద్రణ, పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయి భీమన్న, ( ప్రథమ ముద్రణ ,1978), హైదరాబాదు : సుఖేలానికేతన్ ప్రచురణలు
  9. Religion and Society By S. Radhakrishnan p. 129