బిల్హణీయము – గేయ(నృత్య)నాటిక

నేను గతసంవత్సరము ఈమాటలో వాణి నారాణి, బిల్హణీయము అను పద్యనాటికలను ప్రచురించి యుంటిని. అవి తర్వాత కొలది మార్పులతో ఎమెస్కో సంస్థచే పుస్తకముగా ప్రచురింపబడెను. ఇందులో గల బిల్హణీయమును నృత్యనాటికగా వేసిన బాగుండునని, అందుచేత దీనిని నృత్యనాటికగా పునారచన చేయుమని కొందఱు కోరిరి. ఇట్లు పునారచితమైన బిల్హణీయ నృత్యనాటికారూపమిది. దీనిలో గల పద్యములు వాని వాని పేర్లతో సంకేతింపబడినవి. గేయములు ప్రధానముగా ఖండ, చతురశ్ర, మిశ్రగతులలో వ్రాయబడినవి. ఒకచో మాత్రము త్ర్యస్రగతి వాడబడినది. రెండుచోట్ల దప్ప గేయములకు గాని, పద్యము లకుగాని రాగనిర్దేశము చేయబడలేదు. నాకు గల సంగీతజ్ఞానము పరిమితమగుటచేతను, నాట్యమున కనుకూలముగా సంగీతపరికల్పన చేయువారికి పరిపూర్ణ స్వేచ్ఛ నొసగుటకును ఇట్లు చేసితిని. సంగీత, నాట్యపరికల్పన చేయువారికి నేను వ్రాసినది పరిపూర్ణముగా నర్థ మగుట అత్యంతావశ్యకము గనుక, అంతటను అర్థవివరణ నిచ్చితిని. ఈ రచన నాట్యయోగ్యముగా నున్నచో ఇతర సంస్థలును దీనిని ప్రదర్శించవచ్చునను తలంపుతో దీని నిక్కడ ప్రచురించుచున్నాను.

పాత్రలు

బిల్హణుఁడు: కథానాయకుఁడు, కాశ్మీరదేశకవి
మదనాభిరాముఁడు: పాంచాలదేశప్రభువు
విద్యాపతి: మదనాభిరాముని మంత్రి
వీరసేనుఁడు: కారాగారాధిపతి
యామినీపూర్ణతిలక: మదనాభిరాముని కూతురు, కథానాయిక
మందారమాల: పట్టపురాణి, యామినీపూర్ణతిలక తల్లి
మయూరిక: మదనాభిరాముని ఆస్థాననర్తకి, యామినీపూర్ణతిలకకు నాట్యగురువు
మధురిక, చంద్రిక: యామినీపూర్ణతిలక స్నేహితురాండ్రు
ఇంకను ప్రతీహారి, ఇద్దఱు రాజభటులు.

ప్రథమదృశ్యము – దేవతావందనము

పల్లవి:
నవరసంబులఁ గూడు నర్తనంబులతోడ
సరసులం 1దనుపంగఁ జనుదెంచినాము
చరణం1:
సకలలోకములందు 2జనపాళి కెల్లను
సంగీతసాహిత్య సంతర్పణము సేయు
భారతీ దేవిని భక్తితో ప్రణమించి ॥నవరసంబుల॥
చరణం2:
3రజతాద్రిపై శైలరాజసుతతోడ
నర్తనం బొనరించు నటరాజమూర్తిని
భద్రంబు లిమ్మంచు భక్తితో పూజించి ॥నవరసంబుల॥
చరణం3:
4శ్రీరంగశాయియై శ్రీచిత్తశాయియై
శోభిల్లు విష్ణునిన్ సుందరాకారునిన్
దీవింపుమని భక్తి దైవాఱ సేవించి ॥నవరసంబుల॥
చరణం4:
5గఱికతో పూజింప కరుణాలు డగుచు
వరములం గురిసెడు (గురిసేటి?) కరిరాజ ముఖుని
విఘ్నంబు దొలగింప వేమాఱు వినుతించి ॥నవరసంబుల॥
చరణం5:
6అతిరమ్యముగ నిప్పు డాడఁబోవుచునున్న
బిల్హణీయంబనఁగ విఖ్యాతమై యున్న
నృత్యనాటకమందు నిరవొందుచున్న ॥నవరసంబుల॥


  1. తనుపంగ చనుదెంచినాము= తృప్తిపరచుటకు, సంతోషపరచుటకు వచ్చినాము.
  2. జనపాళి కెల్లను=జనముల వరుసకంతయు (సమూహమునకంతయు)
  3. శైలరాజసుత= హిమవంతుని కూతురు(పార్వతి); భద్రంబులు=శుభములు, మంగళములు
  4. శ్రీచిత్తశాయి= లక్ష్మికి ప్రియుడైనందున ఆమెహృదయములో నెలకొనియుండువాడు, భక్తి దైవాఱ=భక్తి అతిశయింపగ
  5. కరుణాలుడు=దయగలవాడు,కరిరాజముఖుడు=గజాననుడు
  6. బిల్హణీయంబనఁగ=బిల్హణీయమను పేరుతో, విఖ్యాతమై యున్న= ప్రసిద్ధమై యున్న, ఇరవొందుచున్న=నెలకొనియున్న

ద్వితీయదృశ్యము – మయూరిక రంగప్రవేశం, అభినయం

పల్లవి:
నేనె మయూరికనూ
7నిస్తుల నాట్య మయూరకనూ
చరణం1:
నానావిధముల నాట్యంబులలో
నన్నెదురింపరు 8నాకాంగనలును
వీణావాదనవిదుషీత్వంబున
కారు సమంబుగ గంధర్వులును
చరణం2:
9మదనధరాధిపు మంజుల సభకు
మండనమై తగు మగువను నేను
సరసుల మనములు సంతోషంబున
నాట్యము సేయగ నాట్యము సేతును.
చరణం3:
10రాజకుమారియు రాజీవాక్షియు
యౌవనవతియగు యామినికిత్తరి
భరతుని నాట్యపు సురుచిరరీతులఁ
గఱపెడు జాణను, కాంతామణిని

నేపథ్యంలో: మయూరిక తన శిష్యురాలైన రాజకుమారి యామినీపూర్ణతిలకయొక్క నృత్యకౌశల్యమును పాంచాలరాజపట్టమహిషి యైన మందారమాల ముందు ప్రదర్శించు చందం బెట్టిదనిన …


  1. నిస్తుల=సరిలేని, మయూరక=మగనెమిలి. మగనెమలి మాత్రమే నాట్యముచేయుటచే నిట్లు చెప్పబడినది.
  2. నాకాంగనలు=దేవతాస్త్రీలు; వీణావాదనవిదుషీత్వంబున= వీణను వాయించుటయందుగల పాండిత్యములో
  3. మంజులసభ=ఇంపైన సభ, మండనమై తగు=అలంకారమై ఒప్పారు. (మయూరిక పాంచాలరాజైన మదనాభిరాముని ఆస్థాననర్తకి, అతని కూతురు యామినీపూర్ణకు నాట్యగురువు)
  4. రాజీవాక్షి=పద్మములవంటి కన్నులుగలది; సురుచిరరీతులు=అందమైన, రసవత్తరమైన గతులు, పద్ధతులు, భంగిమలు; కఱపెడు =నేర్పునట్టి.

తృతీయదృశ్యము – యామిని నాట్యకౌశల్యప్రదర్శనము

రాణి ప్రశ్న

ఉ.
11యామినికి న్మయూరిక! మదర్థితరీతి విపంచి మీటఁగన్,
మోమున హావభావములు పొంగిపొసంగఁగఁ జూపుచున్ మనో
జ్ఞామృతసింధువట్లు సకలాంగము రమ్యరసప్లుతంబు గాన్
గోముగ నాట్యమాడఁగను గొంచక నేర్పితె నేర్పుమీఱఁగన్.


  1. మదర్థితరీతిన్=నేను కోరినట్లుగా;విపంచి=వీణ; మనోజ్ఞ+అమృత+సింధువట్లు= మనోహరమైన అమృతంనదివలె, రమ్యరసప్లుతంబుగాన్= రమ్యమైన శృంగారాది రసములలో వెల్లువెత్తుచుండగా.

తాత్పర్యము

‘ఓ మయూరికా! నేను కోరినట్లుగా యామినికి వీణను వాయించుటకు, ముఖమునందు హావభావములు ఉప్పొంగునట్లుగా ప్రదర్శించుచు, మనోహరమైన అమృతప్రవాహమో అనునట్లు శరీరము సాంతముగ శృంగారాదిరసములలో వెల్లువెత్తుచుండగా, గోముగ (సుందరముగా) నాట్యము చేయుటకు కొంచక=కొదువలేకుండ నీచాతుర్యముతో (నేర్పుమీర) నేర్పితివా?’ – అని రాణి మయూరిక నడుగుచున్నది.


మయూరిక జవాబు

కం.
12సందేహమేల? యామిని
సుందరముగ మీయెదుటనె చూపును గాదే!
చందురుఁడు యామినికిఁ గల
బంధంబును దెల్పు నాట్యభంగిమ లిపుడే.


  1. తా॥ అందులో సందేహమెందుకు? యామిని మీముందే యామినికి — అనగా రాత్రికి — చంద్రునికి గల (ప్రేమ)బంధాన్ని ప్రదర్శించే నాట్యభంగిమలను ప్రదర్శిస్తుంది గదా!

యామిని నాట్యం (మోహనరాగం)

పల్లవి:
13నిండుపున్నమవేళ నెనరార ద్విజరాజ!
రారమ్ము యామినిం జేరంగ ద్విజరాజ!
చరణం1:
14కన్నుల నీజిగి కాంచిన యంతనె
కుసుమించు నెవో కూరిమితలపులు
నీకరములు నను దాఁకినయంతనె
ఉదయించు నెవో మదిలో వలపులు ॥నిండు పున్నమ॥
చరణం2:
సురుచిరమగు నీకరములు సాచుచు
లోఁగొనుమోయీ తీగె విధంబున
సుందరయౌవనసుమశోభితమౌ
నాదగు మేనును నీదేహంబున ॥నిండు పున్నమ॥
చరణం3:
15పాండిత్యంబే వరపాండిమమై
రాసిక్యంబే రమ్యామృతమై
పరగిన విబుధ ప్రవరుడ వీవే
యామిని వలచిన స్వామివి నీవే ॥నిండు పున్నమ॥


  1. యామిని అను పదమునకు రాత్రి, యామిని అనే స్త్రీ అని అర్థములు. ద్విజరాజు అను పదమునకు బ్రాహ్మణశ్రేష్ఠుడు, చంద్రుడు అని అర్థములు. అందుచేత ఈగీతం యామిని అను నాయికకు, బ్రాహ్మణ శ్రేష్ఠునికి (బిల్హణునికి), మఱియు రాత్రికి, చంద్రునికి సమానంగా వర్తించునట్లుగా వ్రాయబడింది.
  2. కరములు అను పదమునకు చంద్రపరంగా కిరణములని, బ్రాహ్మణపరంగా చేతులు అని అర్థము. జిగి=వెలుగు (చంద్రపరంగా), వర్చస్సు(బ్రాహ్మణపరంగా)
  3. రాసిక్యంబే=రసికత్వమే, రమ్యామృతమై= రమ్యమైన అమృతమై, పాండిత్యంబే, వరపాండిమమై=స్వచ్ఛమైన తెల్లదనమై. విబుధుడనగా చంద్రపరంగా దేవత అనియు, బ్రాహ్మణపరంగా పండితుడు అని అర్థములు. అనగా పండితుడైన బ్రాహ్మణుని పాండిత్యం తెల్లగా ఉందని (పాండితికి తెల్లదనము చెప్పుట కవిసంప్రదాయము), అతని రసికత అమృతంలాగ ఉందని అర్థం. చంద్రునికి అమృతవర్షుడు అని పేరుంది గనుకఅతడు కిరణాలద్వారా వర్షించే అమృతం రసికత్వంలాగను,అతని తెలుపు (పాండిమము) పాండిత్యంలాగ ఉందని చంద్రునిపరంగా అర్థం.

యామినికి రాణి ఉపదేశము

చ.
17భళిభళి! ఆడి పాడితివి బాగుగఁ గాని త్వదీయగీతమం
దలరెడు శబ్దజాలముల యర్థము లన్ని యెఱుంగుదే? కరం
బులనఁగ హస్తముల్ కిరణముల్ స్ఫురియించును, విప్రవర్యునిం
గలువలఱేనిఁ దెల్పెడు నిఁకం ద్విజరాజను శబ్ద మారయన్.
కం.
18సంగీతంబును నాట్యపు
భంగిమలును నేర్చి భవ్యపాండితితోడన్
రంగారు నీవు సాహి
త్యాంగణమునఁ గూడ విదుషి వగుటయె హితమౌ.
కం.
19కావున నర్థించెద భూ
మీవిభుని న్నీ జనకుని మేలగు గురువున్
శ్రీవాణీవిభునిభునిన్
వేవేగను గూర్పు మనుచు విధుసమవదనా!


  1. పైన చెప్పినట్లుగా, విదుషీమణియైన రాణి, కరంబులు అనే పదానికి చేతులు, కిరణాలు అనే అర్థములున్నవని, ద్విజరాజనే శబ్దానికి బ్రాహ్మణశ్రేష్ఠుడు, కలువలఱేడు (అంటే చంద్రుడు) అనే అర్థములున్నవని చెపుతున్నది.
  2. భవ్యపాండితితోడన్ రంగారు=చక్కని పాండిత్యముతో అతిశయించు; సాహిత్యాంగణమున= సాహిత్యముయొక్క ముంగిలి, లేక ఆవరణలో; విదుషివగుటయె హితమౌ=పండితురాలవగుటయే తగును.
  3. మేలగు గురువున్=శ్రేష్ఠుడైన (సాహిత్యమును నేర్పు) గురువును; శ్రీవాణీవిభునిభునిన్=మంగళకరుడైన బ్రహ్మవంటివానిని; విధుసమవదనా=చంద్రముఖీ!