కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 2: లైబ్‌నిట్జ్ స్వప్నం

గత వెయ్యేళ్ళలో మానవుడు కనుగొన్న వాటిల్లో అతి ముఖ్యమైనది కలన గణితమేనంటే (calculus) అతిశయోక్తి కాదు. దానిని న్యూటన్, లైబ్‌నిట్జ్ స్వతంత్రంగా పదేళ్ళు అటూ ఇటుగా ఒకే కాలంలో కనుక్కున్నారు. ఎవరు ముందు కనుక్కున్నారు అన్నదానిమీద చాలా స్పర్ధలొచ్చాయి. తెలుగు వాళ్ళలో పెద్దగా చదువుకోని వాళ్ళలో కూడా న్యూటన్ పేరు వినని వాళ్ళుండరు. కాని బాగా చదువుకున్న వాళ్ళలో కూడా ఎంతో మందికి లైబ్‌నిట్జ్ ఎవరో తెలియదు. నడిచే విజ్ఞాన సర్వస్వంగా, అపర అరిస్టాటిల్‌గా పేరు తెచ్చుకున్న లైబ్‌నిట్జ్ జీవితాన్నీ, బహుముఖ ప్రతిభనీ, కంప్యూటర్ సైన్సుకి మూలాధారమైన అతని విప్లవాత్మక ఆలోచనలనీ ఈ వ్యాసం ద్వారా రేఖామాత్రంగానయినా పరిచయం చెయ్యాలని నా ఉద్దేశం.


జీవిత సంగ్రహం


గాట్‌ఫ్రీడ్ విల్‌హెం లైబ్‌నిట్జ్ (1646-1716)

గాట్‌ఫ్రీడ్ విల్‌హెం లైబ్‌నిట్జ్ 1646లో జర్మనీలోని ప్రొటెస్టెంట్ నగరం, లీప్జిగ్‌లో పుట్టాడు. తండ్రి యూనివర్సిటీ ప్రొఫెసరు. తల్లిగూడా బాగా చదువుకున్నది. పుట్టిన మూడే రోజే బాప్‌టైజ్ చేసే సమయాన, పూజారి చల్లిన పవిత్ర జలాన్ని తలెత్తి స్వీకరించడం చూసి, తండ్రి కొడుకు గొప్పవాడవుతాడని కలలుగన్నాడు. చిన్నప్పుడే చరిత్ర పుస్తకాలు చదివించాడు. అయితే కొడుకు ఆరేళ్ళలోపు వయసులో ఉన్నప్పుడే ఆయన చనిపోయాడు. లైబ్‌నిట్జ్ చిన్నతనంలో ఆటలన్నా పాటలన్నా అంత ఇష్టం చూపకుండా చదువులో నిమగ్నమయుండే వాడు. బళ్ళో పైక్లాసు వాళ్ళ పుస్తకాలు చదవడం చూసి, మాష్టారు వాళ్ళమ్మతో ఫిర్యాదు చేసి వయసుకి మించిన పుస్తకాలని అందుబాటులో ఉంచొద్దని హెచ్చరించాడు!

లైబ్‌నిట్జ్ బంధువొకాయన విషయం తెలుసుకొని, పిల్లవాడితో మాట్లాడి, అసామాన్య ప్రతిభావంతుడని గుర్తించి, వాళ్ళమ్మతోచెప్పి వాళ్ళ నాన్న లైబ్రరీ గదికి తాళం తీసి అబ్బాయి వెళ్ళేటట్లు చూశాడు. అప్పుడు లైబ్‌నిట్జ్ వయసు ఎనిమిదేళ్ళు! లాటిన్, గ్రీక్ పుస్తకాలు విపరీతంగా చదివాడు. పన్నేండెళ్ళొచ్చేటప్పటికి లాటిన్ క్షుణ్ణంగా వచ్చేసింది. కవిత్వం రాయగలిగేటంత! అంతటి పాండిత్యం గ్రీకులో గూడా సాధించడానికి తయారయ్యాడు.

అప్పట్లో జర్మనీలో గణితశాస్త్రం అంతగా అభివృద్ధి చెందలేదు కాని, బళ్ళో అరిస్టాటిల్ తర్కం నేర్పేవాళ్ళు. అది లైబ్‌నిట్జ్‌లోని జీనియస్‌ని మేల్కొల్పింది. అరిస్టాటిల్ రెండు వేల సంవత్సరాల క్రితం విజ్ఞాన సర్వస్వాన్ని క్రోడికరించ ప్రయత్నించాడు. లైబ్‌నిట్జ్‌కి ఓ మనోహరమైన ఊహ కలిగింది: మనం మాట్లాడే భాషలో అక్షరాలు, వాటితో కూడి మాటలు, మాటలతో కూడి వాక్యాలు ఉన్నాయి. అలాగే భావాలని (concepts) అక్షరాలుగా, వాటిని వ్యాకరణ సూత్రాలవంటి వివేచన సూత్రాలనాధారంగా ఓ విజ్ఞాన భాషని తయారుచేస్తే, మనం మాట్లాడినంత సులభంగా, అన్ని విషయాలను గురించీ విచారణ చెయ్యొచ్చని ఊహించాడు. ఈ భావన జీవితాంతమూ లైబ్‌నిట్జ్ ఆలోచనలలో ప్రకాశిస్తూనే ఉంది.

పదిహేడేళ్ళకే బ్యాచలర్ డిగ్రీ సంపాదించాడు. అపుడే తల్లినికూడా కోల్పోయాడు. ఇరవై ఏళ్ళకే న్యాయ శాస్త్రంలో డాక్టరేట్ కోసం థీసిస్ రాశాడు. లీప్జిగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు మరీ చిన్నవాడు అనే సాకుతో, తమకంటె ఎక్కువ తెలుసుననే ఈర్ష్యతో డిగ్రీ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. వాళ్ళ మీద అసహ్యం వేసి, సొంత ఊరుని వదిలి, న్యూరెంబెర్గ్ వెళ్ళాడు. వెళ్ళే త్రోవలోనే న్యాయశాస్త్రం బోధించడానికి కావలసిన కొత్తమార్గాలపై ఓ వ్యాసం రాశాడు. దానికి ఆల్ట్డార్ఫ్ యూనివర్సిటీ వాళ్ళు ముగ్ధులై డాక్టరేట్ ఇవ్వడమే కాక, ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చి, చేరమని ప్రాధేయపడ్డారు. యూనివర్సిటీ ప్రొఫెసర్ జీవితం సంకుచితమైనదని భావించి ఆ ఉద్యోగాన్ని నిరాకరించాడు.

మరి జీవనోపాధికి మార్గమేమిటి? డాక్టరేట్ కోసం రాసిన వ్యాసం బోయింబెర్గ్ అని ఓ సంపన్నుడైన వ్యవహారవేత్త కంటబడింది. దానిని మెయింజ్ ఆర్చిబిషప్‌కి అంకితం చెయ్యమని చెప్పాడు బోయింబెర్గ్. అది చూసి లైబ్‌నిట్జ్‌కి ఓ న్యాయపదవి ఇచ్చారు. దౌత్యవ్యవహారాల మీద దేశదేశాలు పర్యటించాడు. యుద్ధ వ్యూహాలు కూడా పన్నాడు.

అప్పట్లో జర్మనీ కొన్ని వందల రాజ్యాలుగా విడిపోయి ఉంది. ఫ్రాన్సు యూరప్‌లో “అగ్రరాజ్యం” స్థాయిలో ఉంది. ఆ దేశపు రాజయిన 14వ లూయీ తన అధీనంలో లేని రాజ్యాలపై దండయాత్ర చేసి వశం చేసుకుంటున్నాడు. మెయింజ్ రోమన్ సామ్రాజ్యం క్రింద రావడంతో ఫ్రాన్స్ చేతిలో ముప్పు దాపురింఛి ఉందని గ్రహించిన లైబ్‌నిట్జ్ ఓ పథకం వేశాడు. యూరపియన్‌లు యూరప్‌లో వాళ్ళమీద దండయాత్ర చేస్తే ఒరిగేదేమిటి, ఈజిప్టు మీద యుద్ధం చేస్తే ఆర్థికంగా లాభం ఉందని ఓ ప్రతిపాదన చేశాడు. దానిని 14వ లూయూకి సమర్పించడానికని 1672లో పారిస్ వెళ్ళాడు.

పారిస్‌లో రాజదర్శనం దొరకలేదు. పారిస్ ఆకాలంలో యూరప్‌లోకెల్లా పెద్ద వికాస కేంద్రం; విజ్ఞానవేత్తలెందరికో కూడలి. వాళ్ళ సాంగత్యం కోసం లైబ్‌నిట్జ్ అక్కడే ఉండాలని అభిలాషపడ్డాడు. పారిస్ వెళ్ళిందాకా అతనికి ఆధునిక గణితశాస్త్రంలో సరయిన శిక్షణా అవగాహనా లేవు. అక్కడ హాలండ్ దేశస్థుడైన క్రిస్టొఫెర్ హైగెన్‌స్‌ని (Christopher Huygens) కలుసుకున్నాడు. ఆయన లెక్కల్లో ఓ చిన్న పరీక్ష పెట్టాడు. దానికి లైబ్‌నిట్జ్ సరిగ్గా సమాధానం చెప్పాడు. స్వతహాగా తెలివయిన వాడని గ్రహించి, మెచ్చుకొని, లెక్కల్లో పాఠాలు చెప్పాడు. చదవమని చాలా పుస్తకాలిచ్చి ప్రోత్సహించాడు. అంటే లైబ్‌నిట్జ్ ఇరవై ఆరేళ్ళ వయసొచ్చిందాకా గణితంలో క్రమమైన శిక్షణ పొందలేదన్నమాట!

అక్కడ నుండి లైబ్‌నిట్జ్ వ్యాపార వ్యవహారాల మీద లండన్ వెళ్ళాల్సిన పనిబడింది. లండన్‌లో రాయల్ సొసైటీ సభ్యులని కలిశాడు. విజ్ఞానశాస్త్రాల్లో అభిరుచికలవాళ్ళు తమతమ ఆలోచనలనీ పరిశోధన వివరాలనీ పంచుకోడానికి పెట్టుకున్న సంస్థ అది. వాళ్ళకి తన కాల్కులేటింగ్ యంత్రాన్ని చూపాడు. దానిని చూసి వాళ్ళు అతన్ని మొదటి విదేశ ఫెలో గా తీసుకున్నారు. అక్కడి వాళ్ళతో పోలిస్తే తనకి గణితంలో తగినంత పరిజ్ఞానం లేదని గ్రహించాడు. పారిస్ తిరిగొచ్చి అధ్యయనం పెంచాడు.

జీవితం అంతా ఇంతే. ప్రభువుల పని మీద ఏ దేశం వెళ్ళినా, ఆ పనితో పాటు అక్కడ జరిగే అనేక వ్యవహారాల్లో తలదూర్చడం, పండితులతో సంబంధాలు పెంచుకోవడం, విజ్ఞానానికి సంబంధించి అన్ని శాఖల్లోకీ ప్రవేశించి మౌలికమైన ఆలోచనలు చెయ్యడం! బండిలో గానీ నావలో గానీ, తన దేశంలో ఉన్నా పరాయి దేశంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లోనూ ఎడతెరిపిలేని ఆలోచనలే. చదవడానికీ రాయడానికీ ఆటంకం లేదు. “నేను ప్రచురించిన వాటిని మాత్రమే చూసి నన్ను అంచనా వేసే వాళ్ళకి నా శక్తిసామర్థ్యాలు తెలియవు,” అన్న మాటల్లో అతిశయోక్తి లేదు. కొన్ని వందలమందితో జీవితాంతం ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. పదిహేను వేలకి పైగా జాబులురాశాడు. తాను స్పృశించని సమకాలిక అంశం లేదు.

పారిస్ నచ్చింది. కాని పోషిస్తున్న బోయింబెర్గ్ చనిపోయాడు. జీవనభృతికి ఆటంకం కలిగింది. పారిస్‌లో ఏదన్నా ఉద్యోగం ఇస్తారని చూశాడు. ఏమీ దొరకలేదు. సైన్సు అకాడెమీలో అప్పటికే విదేశీయులు ఎక్కువయ్యారని తీసుకోలేదు. జర్మనీలోని ఓ రాజు (Duke of Hanover) దివాణంలో ఉద్యోగం దొరికింది. అయినా పారిస్ వదలి వెళ్ళ బుద్ధి కాలేదు. ఆ సాకూ ఈ సాకూ చెప్పి పొడిగించాడు. సాగినంతకాలం పారిస్‌లోనే గడిపాడు. ఇక ప్రభువుకి చిరాకు కలగడంతో, హానోవర్ వచ్చి ఉద్యోగంలో చేరతాననీ, మానవశ్రేయస్సుకోసం విజ్ఞానశాస్త్రాల్లో కృషి చెయ్యడానికి అనుమతి ఇవ్వమనీ కోరుకున్నాడు. 1676లో పారిస్ వదిలాడు. మళ్ళీ పారిస్ సందర్శించలేదు. చనిపోయిందాకా హానోవర్ రాజవంశం సేవలో గడిపాడు.

లైబ్రరీ నిర్వహణ, పాలనా యంత్రం, వ్యవసాయం, వైద్యం, ఇలా అన్నిటినీ అభివృద్ధిచెయ్యడానికి కృషిచేశాడు. కొత్తకొత్త మార్గాలని కనిపెట్టాడు. అయితే చేరిన నాలుగేళ్ళకే ప్రభువు చనిపోయాడు. కొత్త ప్రభువు, Ernst August కి మేధో విషయాలపైన అంత ఆసక్తి లేదు. లైబ్‌నిట్జ్ జీవనోపాధికి మళ్ళీ ఆటంకం కలిగేలా ఉంది. అందుకని, ఆ రాజవంశం చరిత్ర రాస్తానన్నాడు. అది ప్రభువుకి నచ్చింది. దానికి కొంత జీతం, ఓ సెక్రటరీని ఇచ్చారు.

లైబ్‌నిట్జ్ పిసినిగొట్టు అని చెప్తూ, బర్ట్రాండ్ రస్సెల్, “అంతఃపురం లోని ఆడవాళ్ళకి పెళ్ళి కానుకగా, నగా నట్రా ఏమీ ఇవ్వకుండా, ఓ చిన్న కవిత – అదీ, పెళ్ళయింది గదా అని పని చెయ్యడం మానవద్దని హితోపదేశం చేస్తూ – రాసి ఇచ్చేవాడు,” అన్నాడు! ఆ పెళ్ళికానుకల వల్ల వచ్చిన ఖ్యాతి మూలంగానేమో, చాలా కాలమయినా పెళ్ళి కాలేదు. యాభై ఏళ్ళ వయసొచ్చింతర్వాత ఒకావిడంటే ఇష్టపడి, పెళ్ళి చేసుకోమని అడిగాడు. ఆవిడ “ఆలోచిస్తాను,” అంది. హతాశుడైన మేధావి ఇక పెళ్ళి ప్రసక్తి తేలేదు.

అలాగని లైబ్‌నిట్జ్‌కి ఆడవాళ్ళంటే చిన్నచూపు అనుకోడానికి ఆస్కారం లేదు. రాణి Duchess Sophie తోటీ యువరాణి Sophie Charlotte తోటీ తాత్విక విషయాల గురించి ఎక్కువగా సంభాషించేవాడు. తన జీవితకాలంలో ప్రచురించిన ఒకే ఒక పుస్తకం, థియోడసీ (Theodicy), ఆ సంభాషణల సారాంశమే అన్నాడు! బెర్లిన్ సైన్సు అకాడెమీని స్థాపించడానికి రాణి సాయం కోరాడు. ఆడవాళ్ళని సభ్యులుగా నియమించాలన్నాడు. అప్పట్లో అది చెప్పుకోదగ్గ విషయం.

వంశ చరిత్ర రాయడానికి చెయ్యాల్సిన పరిశోధన సాకుగా దేశదేశాలు తిరిగాడు. ఆ పర్యటనలని తన మేధోగత విషయాలకై వాడుకున్నాడు. కాని ఆ వంశ చరిత్ర రాయడమన్నది ఒక గుదిబండగానే తయారయ్యింది. రాజు లండన్ వెళ్ళినా లైబ్‌నిట్జ్‌ని హానోవర్ లోనే ఉండి తమ వంశచరిత్ర పూర్తి చెయ్యాలని ఆదేశించాడు. రాణి మరణం తర్వాత ఆదరణా తగ్గింది. చివరకి చనిపోయినపుడు సెక్రటరీ కి మించి అంత్యక్రియలకి హాజరైన వాళ్ళు లేరు! తను స్థాపించిన అకాడెమీల నుండి ఎవరూ రాలేదు. చనిపోయిన యాభై ఏళ్ళ దాకా సమాధిని ఎవరూ అలంకరించిన పాపాన పోలేదు. “దేశానికే ఆభరణం లాంటివాడు, ఒక అనామకుడిగా మరణించాడు.”