In Defence of Freedom

కొంతమంది నన్ను శ్రమజీవుల నేస్తమంటారు. కొందరు నన్ను అసభ్యమైనవాడంటారు. అంటే వల్గరుగా రోత పుట్టించే కథలు రాస్తానని. కొంతమందేమో అభ్యుదయవాది, ప్రొగ్రెసివ్ అంటూ ఉంటారు. ఇదేం వెర్రితనం! మంటో ఒక మనిషి. మనిషన్న ప్రతీవాడూ ప్రొగ్రెసివ్ కావల్సిందే.

స్త్రీపురుషుల అక్రమసంబంధాల గురించి రాస్తానని, వేశ్యల గురించీ లంజల గురించీ రాస్తానని, నా మీద పెద్ద ఆరోపణ. మన ముందున్న ప్రతీ విషయం గురించీ రాయాలన్నది నా అభిమతం. మతిస్థిమితం ఉన్న మనుషులెవ్వరూ నా కథలు చదివి వెకిలి ఉద్రేకంతో చొంగ కార్చుకోరు. మీకు నా కథలు నచ్చాయా లేదా – అది మీరు తేల్చుకోండి. నా కథ మరొక కథ స్థాయిని అందుకుందా లేదా – ఆ చర్చ సాహిత్య విమర్శకులను చెయ్యనీయండి. కానీ సారస్వతం, అంటే లిటరేచర్, ఎప్పటికీ ఎప్పటికీ అసభ్యం కాబోదు.

ఇప్పటిదాకా నా మీద చాలా కేసులు నడిచాయి. ఇలాంటి కథలు ఎందుకు రాస్తారని తరుచుగా నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు. ఎందుకు రాయకూడదు? ఎందుకు రాయకూడదు నేను వేశ్యల గురించి? వాళ్ళు మన సమాజంలో ఒక భాగం కారా? మగాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేది నమాజో ప్రార్థనలో చెయ్యడానికి కాదు కదా! వీళ్ళక్కడికి వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కాని మనం దాని గురించి రాయడానికి వీలు లేదు! ఎందుకని? ఒక విషయాన్ని ఉన్నదున్నట్టుగా చూపెట్టడం ఎందుకు తప్పు?

(ఒక పెద్దమనిషి: “ఏం వాగుతున్నాడీయన? ఎక్కణ్ణుంచి పట్టుకొచ్చారీయన్ని?”)

జనపనారని పట్టుకొని జలతారు అనడం ఎందుకు?

“ఏది నోటికొస్తే అదే మాట్లాడుతున్నావే!” (ఆ పెద్దమనిషి క్లాసురూము నుంచి వెళ్ళిపోయాడు.)

చూడండి, ఈయనకి కోపం పొడుచుకొచ్చింది!

(వెళ్ళిపోతున్న అతనిని చూస్తూ పెద్దగా) నిజాన్ని కాదనడం మనల్ని గొప్ప మనుషుల్ని చేస్తుందా?

నా కేసుల్లో ప్రాసిక్యూటరుగారు చాలాసార్లు ఒక విషయాన్ని ఎత్తిచూపిస్తూ ఉంటారు. నా కథల్లో కొన్ని పాత్రల భాష బూతులతో నిండిపోయి వుందని ఆయన అభ్యంతరం. కానీ నేను వాళ్ళ నోట పలికించిన మాటలు వేలమంది తమ రోజువారీ బతుకుల్లో వాడుతున్నవే. ఉదాహరణకి, మిమ్మల్ని ఒకటి అనేదా?

(“నన్నా?”)

అవును మిమ్మల్నే, ‘అరే, మీరు బలే చుతియాగాడండీ!’ (క్లాస్‌రూంలో నవ్వులు. విద్యార్థి అటూ ఇటూ చూస్తాడు).

నేనిక్కడుంటే మీరు నన్ను అటెటో వెతుకుతున్నారు. నేను మిమ్మల్ని తిడుతున్నాననా?

“కాదు…”

ఇలాంటి మాటలు మనకి రోడ్ల మీద వినిపించడం లేదూ?

సమాజం మలుపు తిరిగిన ప్రతీసారి దానితో పాటుగా సాహిత్యం కూడా మలుపు తిరగడం చాలా చాలా అవసరం. ప్రసిద్ధ ఫ్రెంచి రచయిత గుస్తావ్ ఫ్లుబేర్, మదామ్ బొవారీ అనే కథ రాసినందుకు బూతు రచయిత అనిపించుకున్నాడు. ఐరిష్ రచయిత జేమ్స్ జాయిస్ రాసిన యులిసిస్ కూడా అలాంటి ఆరోపణే ఎదుర్కొంది. గమనిస్తే, వలీ నుంచి గాలిబ్ వరకూ ప్రతీవాళ్ళ మీద ఎప్పుడో అప్పుడు ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఇదేం కొత్త విషయం…

(ఒక విద్యార్థి చేయెత్తాడు.) “సార్, నా పేరు అన్సార్ సుఖ్‌నమ్‌దిల్.

ముందు మీ పేరు మార్చుకోండి. ఆ తర్వాత మాట్లాడొచ్చు. అంచేత నే చెప్పేదేంటంటే…

“ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి. మీ కథలు చాలావరకూ నిరాశనిస్పృహలతో నిండి ఉంటాయి. అవి చదివి ఎవరైనా ఆత్మహత్య చేసుకొంటే?”

అవును, అతని పేరు అన్సార్ అయ్యి, ఆపైన ఇంటి పేరు అదేదో ఉందే… అదయితే, ఆత్మహత్య చేసుకొనే అవకాశం ఉంది.

చూడు శ్రీమంతా, వేరే వాళ్ళు ఎవరేమనుకుంటారో మీకు ఎంత మాత్రమూ తెలియదు. కాబట్టి ఇకనుంచీ మీరు మీ గురించి మాత్రమే మాట్లాడండి.

నకిలీ నగిషీలు దిద్దడం నాకు చేతకాదు. ఒకరి వంకరలను ఇస్త్రీ చెయ్యడం నాకు తెలీని పని. వేపాకులు చేదు, అయినా రక్తాన్ని శుభ్రపరుస్తాయి కదా. నాకు తెలిసింది ఒకటే – నా కథ ఒక అద్దం. అందులో సమాజం తనని తాను చూసుకొంటుంది. ఒక అందవిహీనుడికి అద్దం పైనే ఫిర్యాదుంటే, అందులో నా తప్పేముంది? మీరు నా కథలని సహించలేక పోతున్నారంటే దానర్థం – ఈ ప్రపంచమే సహించలేనంత అసహ్యమైనదన్న మాట. (చప్పట్లు.)

నాకు హంగామా ఇష్టం లేదు, నేను సెన్సేషనలిస్టునీ కాను. మొదలే దిసమొలతో ఉన్న సమాజం బట్టలు నేను ఇంకేం ఊడదియ్యగలను! దానికి బట్టలు తొడగడం నా పని కాదు. నేను నల్లబోర్డు మీద తెల్లటి సుద్దముక్క వాడతాను (బ్లాక్‌బోర్డ్ మీద ఒక నిలువు గీత గీస్తాడు) ఎందుకంటే ఆ బోర్డు నల్లదనం మరింత స్పష్టంగా తెలియాలని.

(స్వగతం) నా కళ్ళని మూసేసుకోగలను… కాని నా అంతరాత్మను ఏం చేయను?