స్త్రీల సామాజిక దుస్థితి గురించి, వారి స్వేచ్ఛా స్వాతంత్రాల గురించి తన ఆందోళనని జీవితాంతమూ కొనసాగించిన రచయిత గుడిపాటి వెంకటాచలం. చలం సాహిత్య ప్రభావం బలమైనది. తెలుగు సాహిత్యంలొ చలం అంతటి వివాదాస్పద రచయిత లేడు. స్త్రీ పురుష సంబంధాల మధ్య ఏ అంశాలనయితే ముట్టుకోవడానికి కూడా మిగతా రచయితలు వేల ఏళ్ళుగా సాహసించలేదో, ఆ సాహసాన్ని స్త్రీ కోసం మనసారా చేసిన తొలి రచయిత చలం. పురుషుల నిరంకుశ ధోరణి కింద స్త్రీలు అనుభవించే హింస తాలూకు బహుముఖాలనీ తన సాహిత్యంలో నిజాయితీగా బొమ్మ కట్టి చూపినవాడు చలం. పురుషాధిక్య సమాజపు వికృత నీతిని తన రచనల్లో ఏ ముసుగులూ వెయ్యకుండా భాషించ గలిగినవాడు చలం. సాహిత్యంలో శశిరేఖ, అరుణ, లాలన వంటి వ్యక్తిత్వం ఉన్న స్త్రీ లను చిరస్థాయిగా ఉంచినవాడు చలం.
అయితే చలం రచనల్లో ఎక్కువ సంచలనాన్ని సృష్టించిన నవల మాత్రం “మైదానం”. 1925లో చలం మైదానం రాశారు. మైదానం నవల చాలా చర్చలను రేపింది. ప్రతికూల విమర్శలనెదుర్కొన్నది. స్త్రీ స్వేచ్ఛ మీద, స్త్రీ పురుషుల సంబంధాల మీదా కొత్త సిధ్ధాంతాలు చేసింది.
ఈ నవల వివాదాస్పదంగా మారిన కారణాలేమిటి? ఒక సంప్రదాయ బ్రాహ్మణ గృహిణి ఒక ముస్లిం తో కలిసి వెళ్ళిపోవటం మాత్రమేనా? కాదు. తనకి నచ్చిన మనిషితో వెళ్ళిపోయి మైదానం కథానాయిక రాజేశ్వరి ఎలా బతికి ఉన్నా ఇంత గొడవ జరిగేది కాదు. ఆమె తన చర్యతో పాటు అభేద్యమైనదని సంప్రదాయవర్గాలు అనుకుంటూ ఉన్న వివాహ వ్యవస్థ ఎంత లొసుగులతో ఉందో వివరంగా మాట్లాడుతుంది. పవిత్రమైనవంటూ ప్రచారం చేసే దాంపత్య సంబంధాలలోని బోలుతనాన్ని నిగ్గదీసి అడుగుతుంది – ఇందుకూ, ఈ పుస్తకం సమాజాన్ని ఎక్కువ కలవర పరచింది.
ఎన్ని విప్లవాలు నడిచినా ఫరవాలేదు కానీ, కుటుంబ వ్యవస్థ కూలిపోతుంటే మాత్రం – దాన్ని ఆధారంగా చేసుకుని అధికారం చెలాయిస్తున్న పురుష ప్రభుత్వాలకు విపరీతమైన భయం పుడుతుంది. అందువల్ల తమ మధ్య ఉండే సైధ్ధాంతిక విభేదాలన్నీ కూడా వదిలేసి ఈ విషయంలో అన్ని వర్గాలకు చెందినవారూ ఏకమై ముక్తకంఠంతో ఇటువంటి రచనల పట్ల వ్యతిరేకతను కనపరుస్తారు. సంప్రదాయానికి ఉనికిపట్టులైన యూనివర్సిటీ వాళ్ళు మైదానం పుస్తకానికి బహుమతి ప్రకటించడానికి భయపడటం.. మైదానం నవల లాంటి ఇతివృత్తాలను తీసుకొని, వివాహేతర సంబంధాలను కల్పించి, అటువంటి వారి జీవితాలు ఎలా భ్రష్టు పట్టి పోయిందీ చెప్పడం కోసమే అటు తర్వాతికాలంలో సంప్రదాయ సాహిత్య బధ్ధుడైన విశ్వనాథ వంటి రచయితా, హేతువాది, సౌమ్యవాదిగా పేరుపడ్డ గోపీచంద్ వంటి రచయితా కూడా నవలలు రాయటం ఈ విషయాన్నే చెపుతాయి.
చలం మైదానానికి సమాధానంగా 1933 లో విశ్వనాథ సత్యనారాయణ “చెలియలికట్ట” అనే నవల రాశారు. 60లలో గోపీచంద్ కూడా చలం భావజాలం మీదనే స్పందించి “గడియపడని తలుపులు” “మెరుపల మరకలు” “గతించని గతం” వంటి పుస్తకాలు రాశారు. రచయిత్రి లత ఇంకా మందుకుపోయి చలం భావజాలం మీదనే కాకుండా చలం కుటుంబాన్నే వక్రంగా చిత్రిస్తూ “కాలం కరచిన కడపట” అనే చవకబారు నవల రాశారు.
ఈ నవలలన్నింటిలోనూ చలం సిధ్ధాంతం చివరిలో ఓడిపోయినట్టుగా చూపించిన ఒక ఉక్రోష బుద్ధి ప్రధానంగా ఉంటుంది. చెలియలికట్టలో నాయిక రత్నావళీ, ఆమె మరిది (చలం భావాలకు ప్రేరేపితుడై జీవించిన) రంగారావూ నవల చివరిలో ఆత్మహత్య చేసుకునేందుకు సముద్రంలోకి కలిసికట్టుగా పోతారు. గోపీచంద్ రాసిన గడియపడని తలుపులు నవలలో కూడా ఆధునిక వేషంతో స్వేచ్ఛగా సంచరించినట్టు రచయిత చిత్రించిన నాయిక కోటేశ్వరమ్మ నవల చివరిలో పశ్చాత్తాపంతోనే సనాతన ధర్మంవైపు మళ్ళి కృశించి చచ్చిపోతుంది. మెరుపుల మరకల్లోని నాయిక ఉషారాణి మాత్రం నవల చివర్లో హిమాలయలలో గుహల్లో చొరబడి ప్రాచీన ఋషుల మాదిరే తపస్సు చేసుకుంటుంది. మొత్తానికి వీళ్ళందరూ వాళ్ళు చేసిన “పాపాలకి” (రచయిత దృష్టిలో) ఇలా శిక్షననుభవించి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు.
పైన నేను పేర్కొన్న నవలల్లో లత నవలకు విమర్శార్హత కూడా లేదు. ఇక గోపీచంద్ నవలలు అటు రచనాపరంగానూ, ఇటు సిద్ధాంతపరంగానూ కూడా బలహీనంగా రాయబడినవి. “వెంకటచలం పాత్ర ” అంటూ గోపీచంద్ చేసిన మరొక గల్పిక లాంటిది మరీ కురచబారిన రచన.
మైదానంలో చలం కథానాయిక రాజేశ్వరి విసిరిన సవాళ్ళకు బదులుగా ఒక రత్నావళిని తయారుచేసిన బహు దిట్టమైన రచన విశ్వనాథ రాసిన “చెలియలికట్ట” మాత్రమే. అందుచేత చలం మైదానాన్నీ, విశ్వనాథ చెలియలికట్టనీ రెండింటినీ తీసుకుని, అవి రెండూ స్త్రీ స్వేచ్ఛ కోసం చూపిన మార్గాల బలాబలాలను ఇక్కడ చర్చిస్తున్నాను.
మధ్య తరగతి వర్గం అతి ముఖ్యమైనవిగా స్త్రీలకు నూరిపోసిన “పరువు – ప్రతిష్ట” ఈ రెంటినీ గంగలో కలిపి బ్రాహ్మణ గృహిణి రాజేశ్వరి – సంసారంలో తనకు అన్ని హంగులూ అమర్చగలిగిన లాయరు భర్తనీ, తన కుటుంబాన్నీ, తాను జీవించే సమాజాన్నీ వదిలిపెట్టి, సమాజంలో గౌరవించగలిగే అర్హతలేవీ లేని అమీర్ అనే డబ్బులేని తక్కువ రకం తురకవాడితో పురుష సమాజ పరిభాషలో “లేచిపోతుంది”. సరిగ్గా ఈ వాక్యంతోనే మైదానం నవల మొదలవుతుంది. అలా తాను కలిసి వచ్చేసిన అమీర్ తననెంత గాఢంగా ప్రేమిస్తాడో .. తామిద్దరూ కలిసి మైదానంలో ఏ మిధ్యాగౌరవాలకూ ప్రాధాన్యత లేని చిన్ని గుడిసెలో.. దాని పక్క నదీ తీరంలో స్వేచ్ఛగా అనుభవించిన శృంగారానుభవాలన్నీ నవల ఆసాంతం రాజేశ్వరి తన స్నేహితురాలితో కథగా చెపుతుంది. అంతే కాకుండా స్త్రీ మనసులో కూడా ఏకకాలంలో ఒకరికన్నా ఎక్కువమంది మీద ఇష్టం కలిగే అవకాశం ఉందంటూ తాను అమీర్ తో పాటు మీరా అనే మరొక ముస్లిం కుర్రాడిని అభిమానించిన విషయం, దానితో తన జీవితంలో ఎదురైన కల్లోలమూ.. దాని పర్యవసానమూ కథలో వివరిస్తుంది. ఇదీ మైదానం నవల.
ఇహ చెలియలికట్టలో సీతారామయ్య రెండవ భార్య రత్నావళి. ముందు భార్య రత్నమ్మ చనిపోతే రత్నావళితో అతడికి మళ్ళీ పెళ్ళి జరుగుతుంది. సీతారామయ్య తమ్ముడు రంగారావు(రంగడు) ను అతికష్టం మీద డబ్బులు పంపి లక్నో లో చదివిస్తూఉంటాడు. ఈ రంగారావు ఆధునిక భావాలను పెంచుకుంటూ అటు పాశ్చాత్య రచయితలనీ ఇటు పాశ్చాత్య భావాలు పలికే (చలం వంటి) తెలుగు రచయితలనీ చదివి ఆ స్త్రీ స్వేచ్హా భావాలనన్నీ తలకెక్కించుకుని సనాతన ధర్మాలకు దూరం కావటమే కాకుండా, తన అన్న భార్య అయిన రత్నావళికి కూడా తాను చదివే పుస్తకాలిచ్చి, తన భావాలన్నీ నూరిపోసి ఆమెలో విప్లవ భావాలను నాటతాడు. వీటన్నిటి మూలంగానే ఆమె సీతారామయ్య ఎడల విముఖురాలై రంగడితో మదరాసు “లేచి” వచ్చేస్తుంది. ఇహ ఇక్కణ్ణించి రత్నావళి రంగడి సిధ్ధాంతాలు ఎలా తప్పుల తడకలో నిరూపించడం కోసం పేజీ పేజీ లోనూ వాదనలను పెంచుకుంటూ పోతుంది. చివరికి ఆమెకు చదువు చెప్పడానికి సాక్షాత్తూ విశ్వనాథ సత్యనారాయణ గారే ముకుందరావనే పాత్రగా ప్రవేశించి రత్నావళిలో రంగడి సిధ్ధాంతాల పట్ల ఏర్పడిన చులకన భావాలకు నీరు పోసి మరింతగా పెంచి, తన వాదనా పటిమతో , బోధనా గరిమతో రత్నావళిని తిరిగి సనాతన ధర్మం వైపు మళ్ళించి తనంతదానిగా తయారు చేయిస్తారు. రత్నావళి నవల చివర్లో మాట్లాడినవన్నీ ఈ ముకుందరావు మాటలే. చేసిన నిర్ణయాలన్నీ ముకుందరావు చూపిన మార్గానికి నడవడం కోసం చేసినవే. ఒకసారి వివాహ వ్యవస్థ కాదని కాలు బయట పెట్టిన ఆడదానికి మరణం లో తప్ప నిష్కృతి లేదు కనక, రత్నావళి నవల చివర్లో ఈ సంగతి మిగతా పాత్రలతోనూ(పాఠకులతోనూ) చెప్పి మరీ చనిపోతుంది. చనిపోయేముందు ఆమె తాను విడిచివచ్చిన సీతారామయ్య కాళ్ళ మీద పడుతుంది. మదరాసులో విదుషీమణి (అంటే తెలుగు టీచరన్న మాట) తాను సంపాదించిన డబ్బును తన భర్త మూడవ భార్య (రత్నావళి వెళ్ళిపోయాక ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు) రాజ్యలక్ష్మికి పుట్టిన కొడుకుపేర రాసి వాడు తన కి తద్దినాలు పెట్టేటట్టుగా వాగ్దానం చేయించుకొని అప్పుడు చచ్చిపోవటానికి వెళ్ళిపోతుంది. చివరికి ఆమెతో పాటు రంగారావు (చలం భావజాలాన్ని నమ్మిన వాడు) కూడా తన తప్పులన్నీ ఒప్పుకుని రత్నావళితో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు ఉప్పెన ముంచుకొస్తున్న సముద్ర తీరానికి కలిసి వెళ్ళిపోతాడు. క్లుప్తంగా ఇదీ కథ. ఇంకా ఈ నవలలో సీతారామయ్య అప్ప చెల్లెలు సరస్వతీ (విధవరాలు) ఆమె కొడుకు నీలాంబరుడూ కూడా ముకుందరావు మాట్లాడే మాటలన్నీ మాట్లాడతారు.
మైదానం నవలలో రాజేశ్వరి తన శృంగారానుభవాన్నీ, అందులోని ఔన్నత్యాన్నీ అనేక సార్లు ప్రస్తావిస్తుంది. పురుష సమాజంలో ఆడది తన శృంగారానుభవాన్ని చెబితే అది ఘోర తప్పిదం కింద లెక్క. “బరి” తెగించిన దాని కింద లెక్క. శృంగారానుభవపు విశిష్టితను మాట్లాడిన స్త్రీలు సాహిత్యంలో లేకపోలేదు. శరీర సుఖాన్ని ఆనంద బ్రహ్మంగా కీర్తించిన వరూధిని మానవకాంత కాదు కనక నాయికగా చెలామణీ అయింది. పైగా ఆవిడ గంధర్వ కన్య కనక మానవ సమాజపు విలువలు పట్టవు. ఇంక రంగాజమ్మా, ముద్దు పళనీ తమ కవిత్వాల్లో శృంగారాన్ని రాసినా వాళ్ళు వివాహ వ్యవస్థకు బయటి వర్గం లోని స్త్రీలే కావటం వల్ల “మగ” సమాజానికి అభ్యంతరం కాలేదు సరి కదా ఆనందాన్ని కూడా కలిగించాయి వారి రచనలు.
కానీ శృంగారానుభవాన్ని మానవులు ఏర్పరచుకోవలసిన ఉత్తమ విలువలన్నింటికీ తలమానికంగా గుర్తించి రాజేశ్వరి మాట్లాడిన మాటలే సమాజంలోనూ, సాహిత్యంలోనూ అలజడికి కారణాలయ్యాయి. కారణం – రాజేశ్వరి పదహారణాల “కులకాంత”. వివాహ బంధం ద్వారా ఒకరి ఇల్లాలు గా కొన్నాళ్ళయినా గృహస్థ ధర్మాన్ని ఆచరించిన స్త్రీ. ఇలాంటి రాజేశ్వరి తాను అనుసరించిన పాతివ్రత్యాలన్నింటికీ తిలోదకాలిచ్చి వరూధిని దారి పట్టటమే ఈ “పవిత్ర” వర్గాల కన్నెర్ర కు కారణమయ్యింది. స్త్రీలు శృంగార ప్రస్తావన చేయకుండా కట్టడి చేసిన పురుష సమాజంలో రాజేశ్వరి తాను అనుభవించిన శరీర సుఖాన్ని గురించి ఏ ఇబ్బందీ పడకుండా మాట్లాడటమే వీరికి చాలా ఇబ్బందినీ, కలవరాన్నీ కలిగించింది. ఎందుకంటే అప్పటివరకూ వేశ్య మినహాయించి సంసార స్త్రీ శరీర సుఖాన్ని గురించి తెగేసి మాట్లాడరాదు. స్త్రీ పురుషుల కలయిక ఒక చీకటి తప్పు. సంసారంలో అది అసహ్యించుకోవలసిన విషయం. కేవలం వంశోద్ధారణ కోసమే తప్ప వివాహ వ్యవస్థలో శృంగారం ముఖ్యం కాకూడదు. ఒక పక్క తాను దక్షిణ నాయకుడనిపించుకోవడం కోసం వట్టి గొప్పలు మాట్లాడడానికీ, రాయడానికీ అలవాటుపడిన పురుషలోకానికి స్త్రీ తన శృంగారానుభవాన్ని గొప్పచేసి చెప్పటం మొదలుపెట్టగానే సహజంగానే బెదురు కలుగుతుంది. తన శరీర సుఖం కోసం వేశ్యా వర్గాన్ని తయారు చేసిన పురుషుడికి అదే సమయంలో తన ఇంట్లో ఉండే స్త్రీ మరింత పతివ్రత కావటం అవసరం. అందుకే హంసవింశతిలో అయ్యలరాజు నారాయణామాత్యుడు రాసినట్టుగా కులస్త్రీ ఎప్పుడూ
“కేరగరాదు నవ్వి గిలిగింతలు పెట్టరాదు చెక్కులం
జీరగరాదు గుబ్బల కసిక్కున గ్రుమ్మగరాదు కేళిలో
మీరగరాదు పైకొని రమింపగ రాదు గళారవంబు లిం
పొరగ సల్పరాదు మదిరాక్షులు భర్తల గూడు వేళలన్”
– ఇదీ సంసారంలో భార్య పరిస్థితి.
మరి మైదానం కథానాయికా, బ్రాహ్మణగృహిణీ రాజేశ్వరి ఈ పనులన్నీ చేయటమే కాకుండా జీవితానందాన్ని అనుభవించడానికి స్త్రీలంతా పురుషులు ఒప్పినా, మానినా ఎదిరించి ఆ ఇరుకు జీవితాలని వదిలిపెట్టి రమ్మని ఎలుగెత్తి చాటింది. అందుకూ మైదానం నవల పురుష సమాజంలో మరింత కోపాన్ని పెంచింది. ఆ పుస్తకం చదివితే రాజేశ్వరి మాదిరిగానే తమ ఇళ్ళల్లోని భార్యలూ, అప్పచెల్లెళ్ళూ ఎక్కడ “లేచిపోతారో” ననే బెదురు కలిగించింది. అందుకనే సాహిత్యంలో విశ్వనాథ వంటి రచయిత అత్యవసరంగా సనాతన ధర్మ ప్రతిష్ఠాపనార్థం ఒక రత్నావళిని సృష్టించవలసి వచ్చింది.
****
అమీర్ బలమైన మోహంలో తాను దేవత్వాన్నీ, అమరత్వాన్నీ పొందానంటుంది. ఆమె అమీర్ ను ప్రేమిస్తుంది, పూజిస్తుంది. అతనితో కలిపి కుండలోని ఆ ఎంగిలికూడునే “ప్రేమదేవికి నైవేద్యం పెట్టి భక్తితో కళ్ళకద్దుకుని మధ్య మధ్య అమీర్ ముద్దులతో ఆరగించి” అమృతం అనుకుంటుంది.
రాజేశ్వరికి “ప్రేమ” అనుభవం సంసారంలో కలగనే లేదు. తనకేర్పడిన ఈ ప్రేమబంధంతో రాజేశ్వరికి అప్పటివరకు ఆధ్యాత్మ ప్రేమగా తనకి తన కులపెద్దలు చెప్పిన, చూపించిన విలువలపట్ల ఎగతాళి ఏర్పడుతుంది. సంసారంలో స్త్రీ పురుషుల సంబంధాలు ఎంత అస్తవ్యస్తంగా నడుస్తాయో చెప్పడానికి రాజేశ్వరి నవలలో చెప్పిన మాటలే ఉదాహరణ.
తలంటుకుని కొత్త సిల్కు చీర కట్టుకుని తల్లో మరువం జాజిపువ్వులూ పెట్టుకుని భర్త దగ్గరకెడితే నవ్వుతో “మొన్న తెప్పించిన శీకాయి అంతా కర్సు పెట్టేశావా?” అని హాస్యమాడాడు. మోహపడి రాత్రి కావలించుకుంటే లేపి “ఏదన్నా పీడ కలొచ్చిందా?” అని అడుగుతాడు. ఇలాంటి వాళ్ళు తన భర్తలు అంటుంది రాజేశ్వరి తన స్నేహితురాలితో. చారులో పోపు మాడిందనీ, పచ్చడిలో ఇసక పడ్దదనీ, అన్నం చిమిడందనీ, పులుసు ఉడకలేదనీ తిట్లూ..లేచిపోడాలూ.. విస్తరి మొహాన కొట్టడాలూ.. వుప్పెక్కువయిందనీ. కారమెక్కువయిందనీ తగాదాలూ ఇవన్నీ “ఆదర్శ సంసార లక్షణాలు” వంట చేయటం, మడి బట్టలందియ్యటం,తలంటిపోస్తో వీపు రుద్దటం ఇవన్నీ ఆధ్యాత్మికమైన “నిర్మల ప్రేమ” లక్షణాలు. పొరుగుంటి పార్వతమ్మ కట్టుకున్న చీరెని పొగిడి అట్లాంటిది కొనిపెట్టమని ప్రాణాలు తియ్యటమూ, పులుసులో ఇంగువ వాసన తగినంత లేనందుకు మొగుడు తిట్టటమూ ఇవన్నీ “మానసిక” ప్రేమ తత్వాలు.
గత జీవితంలో తన లాయరు భర్తకి అతని లాయరు హంగులో భేషజంలో తానుకూడా ఒక హంగు, ఒక భేషజమూ అంతే! అతని పుస్తకాల బీరువాలు, గుర్రపు బగ్గీ మాదిరిగా ఎవరన్నా వొచ్చినప్పుడు వొంటినిండా నగలు వేసి తననీ చూపించవచ్చు. ఎప్పుడన్నా దేహంలో “అక్రమంగా” కలిగే ఆ “కామరోగాన్ని” తన ద్వారా కళ్ళు మూసుకుని నయం చేసుకోవచ్చు. ఇదీ తనకి వివాహం ద్వారా సంక్రమించిన పవిత్ర బంధం.
అలాంటి రాజేశ్వరి – కోరి అమీర్ తో స్వేచ్ఛగా బతకడానికని ఇల్లు దాటి వచ్చేసింది. అలా వచ్చినందుకు అటు తర్వాత ఏ పరిస్థితిలోనూ భయపడదు. పశ్చాత్తాపపడదు. ఆమెకు ఆ మైదానంలో తాను కోరుకున్న పురుషుడితో దొరికిన జీవితం ఎలాంటిదైనా శిరోధార్యమే!
మరి రత్నావళికి ప్రేమ అన్న భావం మీద స్పష్టత లేదు. నమ్మకమూ లేదు. రత్నావళి నిర్వచనం ప్రకారం సనాతన ధర్మానికి భంగం కలగని ఇష్టం మాత్రమే “ప్రేమ”. తన జాతి కొరకు, తన ధర్మం కొరకు, తన సాంప్రదాయం కొరకు తాను ఆహుతి అయిపోవటమే రత్నావళి నిర్ణయం. “శరీరం అన్నది కేవలం ధర్మాన్ని ఆచరించడం కోసమే! అలాంటి ధర్మాన్ని విడనాడాక ఆ శరీరం ఉండీ లాభం లేదు. స్త్రీకి ధర్మం అన్నది పురాణాలు చదువుకుంటే తెలుస్తుంది. చదువుకోకపోయినా సంప్రదాయాన్ని తు.చ. తప్పకుండా అనుసరించినా చాలు (మను) ధర్మం పరిరక్షించబడుతుంది. అలా కాకుండా ధర్మాన్ని తెలుసుకోలేక సంప్రదాయాన్ని వదిలిపెట్టి కుక్కల కన్నా కనాకష్టంగా శరీరాన్ని అధర్మ మార్గాల్లో పెట్టి ఆ పాపంతో చివికి జీర్ణించిన శరీరాన్ని చంపుకోవడమే ఉత్తమం” ఇదీ రత్నావళి అభిప్రాయం. అందువల్ల ఆమె భర్త కాళ్ళ మీదపడి ముందుగా తన పాపాలన్నీ కడిగేసుకుని, ఇంక పోగొట్టుకోవలసింది శరీరాన్నే కనక చనిపోవడానికి వెళ్ళిపోతుంది.
చివరగా రత్నావళి తన సవతి రాజ్యలక్ష్మికి ఇలా బోధిస్తుంది.
“తల్లీ! శరీరాన్ని చూడకు. ఆత్మని చూడు. ప్రేమని చూడకు. ధర్మాన్ని చూడు. సుఖాన్ని చూడకు. సంప్రదాయాన్ని చూడు. నిన్నూ నీ భర్తనూ చూసుకోకు. నీ సంతానాన్ని చూసుకో. నీ నెత్తురు చెడిపోకుండా చూసుకో. అదే వర్ణం. దానిలో గుణాలు ఉంటవి. గుణాలలో కల్తీ వస్తే వర్ణం పోతుంది. ధర్మం నశిస్తుంది. ” ఇది సరిగ్గా రాజేశ్వరికి సమాధానం.
మనువు చెప్పిన కారణం తన భర్తని విడిచిపెట్టటంలో ఒక్కటీ లేదు కనక తాను తప్పు చేశాననీ, తను విడిచిపెట్టిన భర్త నపుంసకుడు, వృద్ధుడూ, కుష్టువ్యాధిగ్రస్తుడూ కాడు అని రత్నావళి తన పాపపు పనిని ఏవగించుకుంటుంది. ఏవగించుకుని, అలంకరణలన్నీ మానేసి కాషాయ వస్త్రధారణ చేసి “తపస్విని” అయిపోతుంది. (అంటే శరీరసుఖాన్ని కూడా పూర్తిగా త్యజించి) రత్నావళి దృష్టిలో ప్రేమ అన్నదేమీ “బ్రహ్మ పదార్థము కాదు” “దివ్యమైన వస్తువు కాదు” “కామ విషయకమైన తృప్తిలో వైరాగ్యము లేదు కనక అది మోక్షసాధనము కాలేదు”
సరిగ్గా ఇవన్నీ రాజేశ్వరి అనుభవాన్ని ఖండిస్తూ రత్నావళి చేత చెప్పించిన విశ్వనాథ మాటలు. ఇలా ఆడవాళ్ళంతా తమకు నచ్చిన వాళ్ళతో వెళ్ళిపోతే మరి మగవాళ్ళకు ఆడవాళ్ళు దొరకటం ఎలా? అన్న ప్రశ్న లేవదీసి, ప్రతి మగవాడికీ స్త్రీ సుఖం ఉండి తీరాలి. అది రాజ్యాంగ విషయంలో ప్రజాస్వామ్యపు హక్కు వంటిది – అని ఒక సిద్ధాంతం చేస్తూ విశ్వనాథ ఇలా అంటారు.
“పాపమో .. పుణ్యమో ఒకనితో ఉండడం మేలు. అందరునూ పడుచువాళ్ళు కారు. అందరునూ వృద్ధులు కారు. అందరూ కురూపులు కారు. లోకములో నున్న స్త్రీలందరూ తమకు వయసులోని వాండ్రే కావలయును, విద్యావంతులే కావలయును, అందగాండ్రే కావలయును అన్నచో తక్కిన పురుషులందరు నేమగుదురు? వివాహమను సంస్థ స్త్రీ పురుష సుఖ వ్యవహారములందు రాజ్యాంగ విషయములలో ప్రజాస్వామికమెట్ట్దో అట్టిది. అందరు ప్రజలకు ఓటునందు హక్కున్నట్లే అందరు పురుషులకును స్త్రీ సుఖమునందు హక్కున్నది ”
చాలా ఆసక్తికరమైన వాదన చేసిన విశ్వనాథ సత్యనారాయణ తన ఈ సిద్ధాంతాన్ని పొడిగించి “అందరు స్త్రీ లకును పురుష సుఖమునందు హక్కున్నది” అన్న మాట మాత్రం చెప్పించలేకపోయారు. అలా చెప్పిస్తే – ముందు తమ ఇళ్ళలో ఉండే బాలవితంతువులకి పురుష సుఖం పూర్తిగా లేదు కదా అనిన్నీ, మరి అది ఆయనే చెప్పిన ప్రజాస్వామ్యం ఓటు హక్కు వంటి సూత్రానికి వ్యతిరేకం కదా అనిన్నీ ప్రశ్న వస్తుంది.
ఈ ప్రశ్నలు “ధర్మ సమ్మతములు కావని” చెప్పేసి ఇంతటి ప్రజాస్వామ్యవాదీ తటాలున గొంతు మార్చి ఒక్కసారిగా నియంతృత్వ ధోరణిలోకి దూకెయ్యగలరు. సరిగ్గా ఈ ద్వంద్వ నీతిని బట్టబయలు చేయడానికే, ఇలా రెండు నాలుకలతో మాట్లాడే మనునీతిపరుల గుట్టురట్టు చేయడానికే, వీరు సృష్టించిన ఛాందస ఆచారాలు స్త్రీల అభివృద్ధికీ, ఆత్మానందానికీ, సౌఖ్యానికీ ఎంతగా అవరోధాలయ్యాయో చూపించడానికే ఒక హరివిల్లుల మైదానాన్ని సృష్టించి అందులో రాజేశ్వరిని ప్రతిష్టించారు చలం.
అయితే ఆ మైదానంలో రాజేశ్వరికి స్వేచ్ఛ దొరికిందా? తాను ఈసడించుకున్న పతివ్రతలకన్న రాజేశ్వరి హెచ్చుగా బతికిందా? అన్న విషయాన్ని చూడాలి. కేవలం సనాతన ధర్మాన్నీ, అందులోని స్త్రీల అస్వతంత్ర జీవనాన్నీ విశ్లేషించడానికి మాత్రమే చలం మైదానం రాయలేదు. చలానికి మైదానం ఒక ఆదర్శం. ఇరుకుగదుల అధమ శృంగారాలలో అసమ సంబంధాలమధ్య స్త్రీ పురుషులలో మృగ్యమైపోతున్న ప్రేమబంధాన్ని బలపరచడానికనే చలం మైదానాన్ని రాశారు. మనిషికి ప్రకృతితో ఉండవలసిన సాన్నిహిత్యాన్ని సూచించారు.
“మధ్యాహ్నం గాలం యేట్లో వేసుకుని గానుగ చెట్టు నీడలో కూచుని కునికిపాట్లు పడటం ఎంత హాయిగా ఉంటుందని! ఎండ మచ్చలతో పోట్లాడే నీటికెరటాలనీ, తొరగా కొట్టుకు వచ్చే చెత్తనీ, నురుగునీ అవతలవేపు నీళ్ళలో వొంగుతూ లేస్తున్న తుంగనీ, దూరపు కొండల మారే రంగుల్నీ, అట్లా సోమరిగా చూస్తో, కళ్ళు సగం మూసుకుని నాజుట్టు అమీర్ మెడ మీద ఎగురుతో ఉంటే, అట్లానే యేమీ అలోచనలన్నా లేకుండా, యింకా కావాలనే కోరిక, ఆదుర్దాలూ ఏమీ లేకుండా పడుకోటం సుఖాలు వొదిలి పరమాత్మలో యేకమయ్యే ఆనందమంటారే – అలాంటిదే గావుననిపిస్తుంది” అంటుంది రాజేశ్వరి.
రాజేశ్వరి శరీరంలో అమీర్ కీ ప్రకృతే ద్యోతకమవుతుంది. రాజేశ్వరి భుజాలవెనక చూస్తే నల్లని మబ్బుల్లోని నీటి భారం తోస్తుందట. నడుం వొంపుల్ని చూస్తే యేరు చప్పున వొంగి తిరిగిన చోట కలవరపడే ప్రవాహపు నునుపు తోస్తుందట. మెడ మీద రేఖలు చూస్తే సోమరి అలలమీద మెత్తటి ఎండ ప్రతిఫలించి, మెల్లిగా పైకిపాకే కాంతిగీతలు కనపడతాయట.
డబ్బూ, హోదా- ఆడంబరాలు వీటితో మనిషి ప్రకృతికి దూరమై కృతక జీవితంలోకి వెళ్ళిపోయాడన్నది చలం బాధ.
అయితే విశ్వనాథ రత్నావళికి ఇలాంటి (రంగడి) సిద్ధాంతాలన్నీ ధనతృష్ణతో కూడినవిగా కనిపిస్తాయి. రంగడి వంటి వాళ్ళు “తమ మనో భావాలకు పెద్ద పెద్ద పేర్లు పెట్టి భౌమములను దివ్యములుగా భాసింపచేసి దుశ్శీలతార్థ కల్పనము చేసి తమ సిద్ధాంతములతో భూమిని కుద్దలిస్తున్నారు. అనిపిస్తుంది.
విశ్వనాథ సత్యనారాయణ రాజేశ్వరికి బుద్ధి చెప్పడానికి ఒక మనుసూక్తి రత్నావళిని సృష్టించడంలో వింతలేదుకానీ, ముందుగా శశిరేఖ వంటి వ్యక్తిత్వం ఉన్న స్త్రీ ని సృష్టించి అటు తర్వాత రాజేశ్వరి వంటి స్త్రీని రూపొందించటం ద్వారా చలం సంప్రదాయ వర్గాలను రెచ్చగొట్టగలిగారేమో కానీ స్త్రీ స్వేచ్ఛ పట్ల మాత్రం ఒకలాటి అస్పష్టతలో పడిపోయారు.
వివాహ వ్యవస్థను దాటివచ్చి నచ్చినవాడితో బతకటం కోసం స్వేచ్ఛ వైపుగా తొలి అడుగు వేసిన రాజేశ్వరికి నిజానికి స్వేచ్ఛ దొరికిందా? లేదు. రాజేశ్వరికి స్వేచ్ఛ లేదు.
పతివ్రతలనీ, వాళ్ళను సృష్టించిన హిందూ పురాణ కర్తలను తన కలంతో చీల్చి చెండాడడానికి ఉద్యమించిన చలం తన నవలలో తాను చేసిన పనేమిటి? సతీ సుమతి కన్నా అధికురాలిని కావాలన్నంత ప్రేమ పాతివ్రత్యంతో రాజేశ్వరి ఎటువైపు నడిచింది? ఎలాంటి మనిషికోసం రాజేశ్వరి అన్నోటి త్యాగాలను చేసింది? “ప్రేమ ఉన్నపుడు త్యాగం చెయ్యటం ఎంత సులభమనుకున్నావ్? ఊరికే త్యాగానికై పతివ్రతల్ని పొగుడుతారు కానీ, ప్రతి నిమిషం సౌఖ్యాల్నీ, ఆనందాల్నీ అవసరంగానైనా వొదిలేసుకుని ప్రేమబలం స్థిరపరచాలని ఉంటుంది” అంటుంది రాజేశ్వరి.
కానీ ఇలాంటి రాజేశ్వరికి చలం జత కూర్చిన ఆ అమీర్ మాత్రం అహంభావి, మతద్వేషి. కాఫిర్లంటూ రాజేశ్వరి తరఫు వాళ్ళను దుయ్యబట్టినవాడు. తన మాట ప్రకారం అబార్షన్ చేయించుకోనని అన్నందుకు రాజేశ్వరిని కర్ర తీసుకుని కసిగా బాదగలిగినవాడు. ముందూ వెనకా చూడకుండా కడుపుతో ఉన్న రాజేశ్వరి డొక్కలో తన్నకలిగిన వాడు. ఎక్కడికి వెడుతున్నది కూడా చెప్పకుండా వానలో చీకట్లో అర్థరాత్రివేళ రాజేశ్వరిని ఆమె ఖర్మకి వదిలిపెట్టి వెళ్ళిపోగలిగినవాడు.
ఇలాంటి మనిషి కోసం రాజేశ్వరి “ప్రేమ” పేరుతో చేసిన త్యాగాలు ఇన్నీ అన్నీ కాదు. అమీర్ మోజుపడిన ఆడదాన్ని సమకూర్చడానికి రాయబరం నెరిపి వాళ్ళిద్ద్దరి మీద ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తనూ వాళ్ళతోనే ఆ గదిలోనే గడిపి తనతో సాగించిన సరస సంభాషణలన్నీ ఆ మరొక ముస్లిం స్త్రీతో పలుకుతూ ఉంటే సహించి, ఒక పది రోజులపాటు ఓర్పుగా వాళ్ళిద్దరి శృంగారానికి సంధానకర్త అయింది. కానీ అమీర్ మాత్రం రాజేశ్వరి మీరాతో చనువుగా కూర్చున్నా సహించలేనంతటి అనుమానపు మనిషి.
ఇలాంటి అమీర్ రాజేశ్వరి దృష్టిలో గొప్ప పురుషుడు. ” బెదురులేనివాడు”. తన స్త్రీ మీద మరొకరెవరన్నా కన్ను వేసారంటే వాళ్ళని దిమ్మ తిరిగేట్లు కొట్టగల బలశాలి. “తన స్త్రీ వేపు మరొకడెవడన్నా కన్నెత్తి చూస్తే వాడి కళ్ళు పెరికి పాతెయ్యగలవాదు.” సీతని అడివికి పంపుతూ నిశ్చలంగా ఉండగలిగిన రాముడి మాదిరిగా, కడుపుతో ఉన్న తనని వదిలేసి వెళ్ళిపోగల “ధీరోదాత్తుడు”. ఆ రాముడినిఆనాడు సీత కన్నీళ్ళెలా కరిగించలేకపోయాయో ఈనాడు అమీర్ ను తన కన్నీళ్ళూ అలానే కరిగించలేకపోయాయి. ఇవీ రాజేశ్వరి భావనలు. – ఇలాంటి ఆలోచనలు చేసింది అచ్చంగా చలం కథానయికే! రాజేశ్వరే!!
తను ఏ స్వేచ్ఛనైతే పొందినట్టుగా రాజేశ్వరి అనుకుంటుందో నిజానికి అది స్వేచ్ఛ కాదు. రాజేశ్వరికి మైదానం ఒక తాత్కాలికమైన అనుభవం మాత్రమే కాగలదు. ఆ అనుభవానికి అందమైన ముగింపు ఉండదు. ఎందుకంటే అమీర్ కూడా రాజేశ్వరి భర్త లాంటి వాడే. అమీర్ ఏ కోశానా ఆధునికుడు గాని, స్త్రీ స్వేచ్ఛా సమానత్వాల పట్ల విశ్వాసాలు కలవాడు గానీ కాదు. ఒక ఫ్యూడల్ భావాలున్న పురుషుడితో “ప్రేమ సంబంధం” అనుకుని రాజేశ్వరి చేసిన ప్రయాణపు దిశ, గమ్యం ఆమెని తరచు అయోమయంలోకి తోసి, త్యాగాల బరువు కింద నలిగిపోయేలా చేశాయి.
స్త్రీ పురుష సంబంధాల మధ్య స్వేచ్ఛ, సమానత్వం రాజేశ్వరి ఆలోచనల్లోనే ఉన్నాయి గానీ, ఆమెతో కలిసి బతికిన ఏ పురుషుడికీ అవి ఆమోదయోగ్యం కాలేదు. వాళ్ళు వారిలోని పురుషాధిక్యతా భావాలను గాని, అహంకారాలను గాని వదులుకోవడానికి ఎక్కడా సంసిద్ధులు కాలేదు. రాజేశ్వరి మీద అధికారాన్ని చూపించడంలో వాళ్ళు ఎవరికెవరూ తీసిపోలేదు. రాజేశ్వరిని తీసుకెళ్ళిపోయిన అమీర్కి గాని, రాజేశ్వరి భర్తకు గాని ఆమె పట్ల వారి మనస్తత్వంలో, దృక్పథంలో ఎలాంటి భేదమూ లేదు. అక్కడ వైవాహిక జీవితంలో భర్త తన హోదానూ, భేషజాన్నీ చూపించుకునేందుకు రాజేశ్వరి ఒక ఉపకరణమైతే, ఇక్కడ అమీర్కి మైదానంలో ఆమె ఒక కామోపకరణం అయింది. అందుకే రెండు చోట్లా రాజేశ్వరి సొంత ఇష్టాలు చెల్లవు. రాజేశ్వరిజీవితంలో కేవలం అధికార మార్పిడి మాత్రమే జరిగింది.
అందుకనే మైదానంలోనూ రాజేశ్వరి పాతివ్రత్యాన్నే పాటించింది. ప్రేమ ముసుగు తొడిగి అందమైన భావాల చాటున తనను తాను మోసగించుకుంటూ స్వాభిమానాన్ని పోగొట్టుకుంది.
తన కిష్టం లేకపోయినా అమీర్ కోసం గర్భ విచ్ఛిత్తికి పాల్పడి నానా నరకయాతనా అనుభవించింది. అమీర్ సంతోషం కోసం తానేం చెయ్యగలదో అన్నీ చేసింది. ఇలాంటి “ప్రేమ” తాలూకు స్వరూపాన్ని మనం స్పష్టంగా గమనించవలసి ఉంటుంది. రాజేశ్వరిలో ప్రేమ గురించిన అస్పష్టతలు అనేకం కనిపిస్తాయి. తనను డొక్కలో తన్నిన అమీర్ కాలును ముద్దు పెట్టుకోవాలనిపించే “ప్రేమ” ఎప్పటికీ రాజేశ్వరికి స్వాతంత్ర్యాన్నిచ్చేది కాదు. మనిషిగా ఆమెను బలహీనపరిచేదే అవుతుంది. రాజేశ్వరిలో “ప్రేమ” పేరుతో ఉన్నది బలం కాదు. బలహీనత. దానిని అమీర్ పూర్తిగా ఉపయోగించుకున్నాడు. ప్రతి నిర్ణయంలోనూ అమీర్ తన పంతాన్నే నెగ్గించుకున్నాడు. తనంత తాను తిరిగి రాజేశ్వరి దగ్గరకు తిరిగి రాలేదు. రాజేశ్వరి కడుపు తీయించేసుకున్నదని, రమ్మని మీరా కబురు పెడితే అప్పుడు వచ్చాడు. ఇలాంటి అమీర్ కత్తితో పొడుచుకుని చచ్చిపోయేంతటి “ధీరుడైనా” ప్రేమకు అర్హుడు కాడు.
పాతివ్రత్యమూ, ప్రేమా అంటూ వట్టి మాటలుగా రాసేస్తే చాలదు. వాటి వెనుక అల్లిన కల్పనల ద్వారానే అవి తమ స్వరూపాన్ని చాటతాయి. పాతివ్రత్యం ఎంతటి బానిసత్వమో, మైదానంలో చలం రాజేశ్వరికి ఆపాదించిన “ప్రేమా” అంతే బానిసత్వం. రాజేశ్వరి మునుపటి పతివ్రతలకన్నా ఏమీ తీసిపోలేదు. శశిరేఖకీ, అరుణకీ, పద్మావతికీ, లాలనకీ చలం కల్పించిన స్వాభిమానం, వ్యక్తిత్వం అందుకనే రాజేశ్వరిలో లేకపోయాయి. మైదానం నవలలో చలం “ప్రేమ”, “స్త్రీ స్వేచ్ఛ” వీటి పట్ల ఇంత గందరగోళాన్ని ఎందుకు సృష్టించుకున్నారని ఆశ్చర్యం వేస్తుంది.
రాజేశ్వరి నిజానికి స్వేచ్ఛ కోసం బయటికి రాలేదు. అమీర్ కోసం వచ్చింది. అమీర్ తన్ని వదిలేస్తే తన గతి ఏం కాను అన్న భయం రాజేశ్వరికీ ఉంది. కనకనే రాజేశ్వరి అమీర్ ఇష్టాలన్నీ తీర్చింది. ఒక పక్క పాతివ్రత్యాన్ని విమర్శిస్తూనే ప్రేమ పాతివ్రత్యాన్ని పాటించి తాను ఆ పతివ్రతలతోనే పోటీ పడుతుంది.
తన లాయర్ భర్తనీ, బ్రాహ్మణ వర్గాలనీ తిడుతూ మాటిమాటికీ అమీర్ని పొగుడుతుంది రాజేశ్వరి. రంగడినీ, అతడి “సిద్ధాంతానుయాయులను” దుమ్మెతిపోసి భర్తనీ, సనాతన ధర్మాన్నీ, పాతివ్రత్య మహిమనీ కీర్తిస్తుంది రత్నావళి. ఈ ఇద్దరు స్త్రీలూ ఆయా రచయితల చేతుల్లోని కీలు బొమ్మలే. చలం తన భావాలనే రాజేశ్వరికి ఆపాదించినా నవలలో పాత్రగా ప్రవేశం చెయ్యలేదు. విశ్వనాథ ముకుందరావుగా అవతరించి రత్నావళికి స్వయంగా గురుత్వం నెరుపుతారు. రత్నావళి చేత “కొత్త సంసారంలో కొంత సుఖం కనిపించినప్పటికీ అందులో సంప్రదాయంలో ఉన్నంత భద్రత లేదని” అనిపిస్తారు. ఇలాంటి రత్నావళి , భార్య ఒకవేళ పశ్చాత్తాపపడి వెనక్కి వచ్చినప్పటికీ ఆ భర్త ఆమెని క్షమించి చేరదియ్యడానికి వీలులేదని, తానే ఘంటాపథంగా చెప్పేస్తుంది.
రాజేశ్వరిలో తాను చేసిన ఏ పని పట్లా పశ్చాత్తాపమన్నదే లేదు కనక ఆవిడలో తప్పొప్పుల విచికిత్స లేనేలేదు.
రత్నావళి సంప్రదాయంలో స్త్రీకి ఉంటుంది అని చెప్పిన “భద్రత” యజమాని బానిసకు కల్పించే భద్రత వంటిది. యజమాని తన ఆస్తిని కాపాడుకోవటంలో భాగంగానే తన బానిసనీ భద్రంగా చూసుకుంటాడు. మనుధర్మశాస్త్రం కొద్దిగానో, గొప్పగానో అమలు అవుతున్న తావులలోనే సనాతన ధర్మం, సంప్రదాయం, కుటుంబం అన్నవి చెక్కుచెదరకుండా కొనసాగుతున్నట్లు బయటికి కనిపిస్తాయి. కానీ వాటిల్లో స్త్రీకి స్వేచ్ఛ ఉండటం అన్నది ఎండమావిలో నీరుండటం లాంటి నిజం.
ఇంక చలం మైదానంలో రాసిన “ప్రేమ” స్త్రీకి ఉపయోగపడే అనుభవం కాదు. స్త్రీని బలహీనపరిచి, త్యాగాలకి పురికొలిపిఅదనపు బాధ్యతలని కల్పించేదిగానే మిగులుతుంది. ఎక్కడయినా సరే అసమ సంబంధాలలో ప్రేమకి స్థానం లేదసలు. అందుకే చలం మైదానం సంప్రదాయ వర్గాల ధర్మాలను తలదన్నిన రచన అయితే కావచ్చు గానీ, స్త్రీల శృంగారానుభవంలోనూ, వారి సామాజిక, వైయక్తిక జీవనంలోనూ తిరిగి పురుషాధిక్యానికే పట్టం కట్టి స్త్రీకి అక్షరాలా అన్యాయం చేసిన రచన. ఎంతగా సంచలనకారి అయినా, చలం ఆశయాల ప్రకారం చూస్తే స్త్రీ స్వేచ్ఛకు తిలోదకాలిచ్చి దారులు మూసేసిన రచన. స్త్రీ పట్ల సాంప్రదాయ వాదుల దౌష్ట్యాల మీద తనకున్న ఆగ్రహానికే ప్రాధాన్యమిచ్చి చలం తాను కలగన్న ఆదర్శ స్త్రీని చేతులారా జారవిడిచారు.
ఎందుకంటే స్త్రీలకు జీవిత వికాసానికి ఉపయోగపడే చదువు, శ్రమలో సమాన వేతనం, పునరుత్పత్తిలో నిర్ణయాధికారం, ఆస్థి హక్కూ స్థిరపడకుండా సమబాంధవ్యం అన్నది పురుషుడితో ఎప్పటికీ సిద్ధించలేదు. అటువంటి సామాజిక స్థితిలో తప్ప, చలం కన్న అపురూపమైన “మైదానం కల” యదార్థం కాగల అవకాశంలేదు.