జులై 2005

ఈ సంచికలో తానా కథల పోటీలో బహుమతులొచ్చిన కథలు ప్రచురించటానికి తానా సాహితీ శాఖ వారు అనుమతించారు. అందుకు వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. ప్రత్యేకంగా, శ్రీ జంపాల చౌదరి గారికి మా అభివాదాలు. ఆనవాయితీగా, ఆటా వారిపోటీ బహుమతి కథలు, తానా వారి కథలూ ఈ-మాట లో ముందుగా ప్రచురితమవడం మాకు ఎంతో ఆనందదాయకం.

ఇవి కాక, ఈ మాట చదువరులకి పరిచయస్తుల కథలు, కవితలూ ఈ సంచికలో పొందుపరుస్తున్నాము. ఈ కథలపై పాఠకుల అభిప్రాయాలు, విమర్శలు, సహృదయ సమీక్షలూ వస్తాయని తలుస్తున్నాం. ఇది ఈ-పత్రిక. మీ విమర్శలు,అభిప్రాయాలూ కుదించి రాయవలసిన అవసరం లేదు. మాకు కాగితపు కొరత లేదని మీకు తెలుసు. అందుచేత మీ అభిప్రాయాలు సుదీర్ఘంగా వుంటే బాగుంటుంది. ఏదో రకమైన రాజకీయావశ్యకత వుంటే తప్ప, విమర్శకులు తమ పూర్తి పేరు రాస్తే బాగుంటుంది. ఈ విమర్శలు వ్యాసాల్లా రాస్తే, వాటిని రాబోయే సంచికలలో ప్రచురిద్దామని అనుకుంటున్నాము.

కాత్యాయనీ విద్మహే చాలా చక్కని విమర్శకురాలు. సాంప్రదాయ సాహిత్యం ఆధునిక సాహిత్యం చక్కగా చదువుకున్న రచయిత్రి. కాకతీయవిశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌. చాలా సాహితీ వ్యాస సంపుటాలు ప్రచురించారు. సాంప్రదాయ సాహిత్యంలో స్త్రీవాద దృక్పథం మీద ఆవిడ వ్యాస సంపుటి అందరూ చదవ వలసిన పుస్తకం. ఈ సారి తానా సభలకి ఆమెని ఆహ్వానించారు. ఆమెని పరిచయం చేస్తూ, మరొ ప్రసిద్ధ స్త్రీవాద రచయిత రెంటాల కల్పన ఒక చిన్న వ్యాసం రాసారు. కాత్యాయని గారి రచనమీద మరో పెద్ద వ్యాసం (?) రాస్తానన్న హామీ కూడా ఇచ్చారు. కల్పన గారికి నా కృతజ్ఞతలు.

ఈ సంచికను యూనీకోడ్ లో ప్రచురించడానికి ఎంతగానో ఉపయోగపడ్డ సాప్ట్ వేర్ కు సృష్టికర్త నాగార్జున వెన్న. ఈమాట తరఫున నాగార్జునకు నా కృతజ్ఞతలు.

కొత్త రచయితలనీ, కొత్త విమర్శకులనీ, ముఖ్యంగా Telugu diaspora సాహిత్యాన్నీ ప్రచురిద్దామనే ఉద్దేశ్యంతో ఈ-మాట మొదలయ్యింది. ఇందుకు మీ సహకారం ఎంతో అవసరం.